Friday, September 21, 2018

వాడుక భాషలో పద్యాలు


వాడుక భాషలో పద్యాలు

సాహితీమిత్రులారా!

వాడుక భాషలో పద్యాలు అనే వ్యాసం
చదవండి .............
పరిచయము
ఇరవైయవ శతాబ్దంలో వాడుక భాషలో తెలుగు కవిత్వం ఎలా వికసించిందో అనే విషయాన్నిగురించి ముందటి వ్యాసంలో [మో-1] తెలిపాను. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశం వాడుక భాషలో ఛందోబద్ధమైన పద్యాలు రాయడాన్ని గురించి వివరించడమే. ఇలా రాయడంలో మనం ఎదురుకొనే సమస్యలను తెలుపుతాను. ప్రసిద్ధులు కొందరు రాసిన పద్యాలను మీ గమనికకు తేవడం మాత్రమే కాక చివర నేను రాసిన కొన్ని ఉదాహరణలను కూడ జత చేస్తున్నాను. కవిత్వభాష తీరుతెన్నులను గురించి, వాడుక భాషలో పద్యాలను గురించి ఇంతకు ముందే భైరవభట్ల కామేశ్వరరావుగారు ఈమాటలో ప్రచురించిన వ్యాసాలలో [కా-1][కా-2]) కొన్ని విషయాలు చర్చించబడ్డాయి.

గేయకవిత్వం రాసేటప్పుడు కొద్దిగా స్వేచ్ఛను తీసికొనవచ్చు. కొన్ని చోటులలో అక్షరాలను పొడిగించుకొనవచ్చు, కొన్ని చోటులలో తగ్గించుకోవచ్చు. హ్రస్వాన్ని దీర్ఘం చేసికోవచ్చు, దీర్ఘాన్ని హ్రస్వం చేసికోవచ్చు. గేయాలలో ప్రాధాన్యత లయకు, సంగీతానికి ఎక్కువ. వచనకవిత్వంలో రచయితకు స్వాతంత్ర్యం ఇంకా ఎక్కువ. అన్ని పంక్తుల నిడివి ఒకటిగా నుండనక్కరలేదు. ఇందులో ప్రాధాన్యత భావాలకు మాత్రమే. ఇట్టి కవితలలో పాదాంతములోని విరామాలవల్ల, పాదంలోని అనుప్రాసలవల్ల లయను కల్పించవచ్చు. అందుకే ఈ యుగంలో కవులు గేయ కవితల, వచన కవితల మాధ్యమాన్ని ఎన్నుకొన్నారు. నియమాలు వాళ్ల భావాలకు అడ్డురావు.

నియమ కతిపయములు
పద్యాలకు ఎన్నో నియమాలుంటయి [తి-1]. అందులో కొన్ని:

ప్రతి పద్యంలో పాదముల సంఖ్య నియమించబడి ఉంటుంది. వృత్తాలలో సామాన్యంగా ఇది నాలుగు. ద్విపదలో రెండు, త్రిపదలో మూడు, షట్పదలో ఆరు, సీసంలో నాలుగు, పిదప వచ్చే ఆటవెలది లేక తేటగీతిలో ఇంకా నాలుగు.
ప్రతి పాదములో ఒక నిర్దిష్టమైన అక్షరసమూహాలు ఉంటాయి. ఈ అక్షర సమూహాలను గణములు అంటారు. ఈ గణాలు మూడు విధాలు – అక్షర గణాలు (మ, భ, జ, స, న, య, ర, త, లగ, గల, లల, గగ, ల, గ), మాత్రాగణాలు (రెండు, మూడు, నాలుగు, ఐదు మాత్రలు), ఉప లేక అంశ గణాలు (సూర్య గణాలు, ఇంద్ర గణాలు, చంద్ర గణాలు). వృత్తాలైన చంపక, ఉత్పలమాలలలో, శార్దూల, మత్తేభవిక్రీడితాలలో అక్షర గణాలు ఉంటాయి. జాతులైన కందము, ఉత్సాహ, రగడ లాటి పద్యాలను మాత్రాగణాలతో రాస్తారు. ఉపజాతులైన సీసము, ఆటవెలది, తేటగీతి లాటి పద్యాలను అంశగణాలతో రాయాలి. ద్విపద, అక్కరలవంటి జాతి పద్యాలను అంశ గణాలతో రాస్తారు.
పాదములోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. వృత్తాలకు, జాతులకు ప్రాస తప్పక ఉండాలి. ఉపజాతులకు ఈ ప్రాస ఐచ్ఛికము. అన్ని ద్రావిడ భాషలలో ఇట్టి ప్రాస నియమము ఉన్నది. కన్నడ, మలయాళ భాషలలో యతి నియమముకన్న ప్రాస నియమము అతి ముఖ్యము.
తెలుగు పద్యాల విశేషతలలో వడి లేక యతి చాలా ముఖ్యమైనది. సంస్కృత ఛందస్సులో యతి అనేది ఒక విరామము మాత్రమే. అంటే పాఠకునకు యతిస్థానమువద్ద ఊపిరి పీల్చుకోడానికి అవకాశం ఉంటుంది. పాదాంతములో కూడా ఇట్టి విరామము ఉంది. కాని తెలుగులో యతి అక్షరబాంధవ్యాన్ని సూచిస్తుంది. ప్రతి పాదములో మొదటి అక్షరానికి, పాదం మధ్యలో ఉన్న అక్షరానికి లేక అక్షరాలకు చుట్టరికం ఉండాలి. అంటే ఆ అక్షరాలలోని అచ్చులు, హల్లులు ధ్వని సామీప్యాన్ని పొంది ఉండాలి.
ఉదాహరణకు మొదటి అక్షరము క అయితే యత్యక్షరము క, గా, ఖై, ఘౌ, క్ష లాటివిగా ఉండాలి. ఉపజాతులలో యతికి బదులు ప్రాసయతిని కూడా వాడుతారు. అంటే రోసి అనే పదానికి మూస అనే పదానికి రెండవ అక్షరమైన స-కారము ద్వారా ప్రాస యతి చెల్లుతుంది. కాని యతిప్రాసలు లేకుండా కూడా రాయప్రోలు సుబ్బారావుగారివంటి మహాకవులు కావ్యాలను రాశారు. వారు రాసిన కాళిదాసుని మేఘదూతమునకు అనువాదమైన దూతమత్తేభమునుండి [సు-1] ఒక పద్యాన్ని కింద ఉదహరిస్తున్నాను. కాళిదాసు మేఘదూతాన్ని మందాక్రాంతవృత్తములో రాయగా, రాయప్రోలువారు దానిని యతిలేని, ప్రాసలేని మత్తేభవిక్రీడితములో తెలుగులో అనువదించారు.

అధికారంబున నేమరిల్లి – ప్రభుశాపగ్రస్తుడై – యక్షు డొ-
క్కడు, కాంతావిరహార్తితో, జనకకన్యాస్నానపుణ్యోదకం-
బుల ఛాయాతరువీథులన్, నవయుచుండెన్ రామగిర్యాశ్రమం-
బులలో, ప్రజ్ఞలు గ్రుంక, భోగ్యమగు వర్షాంతంబు నీక్షించుచున్

ఛందస్సు రీత్యా పైన చెప్పిన అన్ని లక్షణాలు ఉంటేనే అవి పద్యాలౌతాయి. మహాకవుల పద్యాలలో తప్ప సామాన్యుల రచనలలో యతికై, ప్రాసకై ఊత పదాలు, అనవసరమైన పదాలు, అంతగా సరిపోని పర్యాయ పదాలు అప్పుడప్పుడూ దొర్లుతూ ఉంటాయి.

వాడుక భాష
వాడుక భాష అంటే ప్రజలు వారి దైనందిన కార్యక్రమాలలో (మాట్లాడడం, చదవడం, రాయడం) వాడే భాష. తెలుగు సాహిత్యంతో కొంతైనా పరిచయమున్నవారికి తప్ప సామాన్య ప్రజానీకానికి ఏవో ఒక కొన్నిటికి తప్ప, చాలా సంస్కృత పదాలకు గాని, అచ్చ తెలుగు పదాలకు గాని అర్థం తెలియదు. అంటే వారి భాష పరిమితమైనది. ఇట్టి భాష ప్రాచీనమైన వ్యాకరణములకు, నిఘంటువులకు లోబడి ఉండదు. అంటే ఈ భాష నన్నయ భట్టు శబ్ద చింతామణి, చిన్నయసూరి బాలవ్యాకరణాదుల సూత్రానుసారంగా ఉండదు. ఆథునిక ప్రయోగాలకనుగుణంగా నిఘంటువులోని పదాలకు మార్పులు, కూర్పులు, చేర్పులు ఉంటాయి. కొన్ని ఒత్తులను తొలగిస్తారు. కొన్నిటిని తారుమారు చేస్తారు. కొన్ని దీర్ఘాలు హ్రస్వాలుగా, కొన్ని హ్రస్వాలు దీర్ఘాలుగా మారుతాయి ఇందులో. అంతమాత్రాన, ఆ భాషలో సౌందర్యం లేదని చెప్పలేము. అది కూడా అందమైనదే. అది ఒక జీవనది లాటిది. ఈ వాడుక భాషలోని కొన్ని ముఖ్యాంశాలు కింద ఇస్తున్నాను.

పద్యాలలో ద్రుతప్రకృతికమును (పొల్లు న-కారము) కూడా కవులు వాడుతారు. వచ్చెదను అనే పదానికి బదులు వచ్చెదన్ అనే వాడుక సర్వసాధారణం పద్యాలలో. కాని వాడుక భాషలో మనం ద్రుతాన్ని ఉపయోగించము. నేను మీ యింటికి రేపు వచ్చెదన్ అని ఎవరైనా మాట్లాడితే మనం తప్పక నవ్వుకొంటాము.
అదే విధంగా మ-కారానికి బదులు బిందుపూర్వక బ-కారము, ఒత్తుతోటి మ-కారము పద్యాలలో ఉంటాయి. పద్మము అనే పదానికి బదులు పద్మమ్ము, పద్మంబు అని కూడా పద్యాలలో ఉపయోగిస్తాము.
మరొక విషయం – వాడుక భాషలో ప్రథమావిభక్తిలోని ము-కారానికి బదులు అనుస్వారాన్ని వాడుతాం మాటల్లో. అన్నము తిన్నాను అనే దానికి బదులు అన్నం తిన్నాను అంటాము కదా? కానీ పద్యాలలో అలా కాదు.
ఇది మాత్రమే కాక క్రియల ఉపయోగం కూడా గ్రాంథిక భాషలో, వాడుక భాషలో వేరువేరు విధంగా ఉంటుంది. తెచ్చెదను, వచ్చెదను లాటి ప్రయోగాలకు బదులు తెస్తాను, వస్తాను లాటి పదాలను వాడుక భాషలో ఉపయోగిస్తాము.
ఒత్తు ర-కారాన్ని మాట్లాడేటప్పుడు ఉపయోగించము. వ్రాత, క్రింద, ఇత్యాదులను రాత, కింద అనే పలుకుతాము కదా?
మాట్లాడేటప్పుడు సంధులను, సమాసాలను ఎక్కువగా ఉపయోగించము. సమాసాలుంటే అందులో రెండు మూడు పదాలకంటే ఎక్కువ ఉండవు. సంధులు లేకుండా పదాలను విడదీసి మాట్లాడుతాం. (ఇక్కడ నాకు నవ్వు పుట్టించే ఒక విషయాన్ని తప్పక చెప్పాలి. అదేమంటే, కవులు, పండితులు, వైయాకరణికులు దుస్సంధిని అంగీకరిస్తారు కాని విసంధిని చూస్తే మండిపడతారు.)
ఇప్పుడు మనం రాసే భాషలో అరసున్నను ఉపయోగించడం లేదు. కానీ కావ్య భాషలో వ్యాకరణరీత్యా దీని ఉపయోగం ఎంతో అవసరం. అరసున్న తెలిపే కొన్ని ముఖ్య విషయాలు – అరసున్న హ్రస్వాక్షరానికి తరువాత ఉంటే, అక్కడ నిండు సున్నను కూడా ఉపయోగించవచ్చు (పసిఁడి – పసిండి, వెలుఁగు – వెలుంగు ఇత్యాదులు). ఒకప్పుడు (ఇప్పుడు కూడా తమిళనాడులో) దీర్ఘాక్షరానికి తరువాతి అరసున్నను అనుస్వారముగా వాడారు (కోఁతి – కోంతి, మూఁతి – మూంతి, ఇత్యాదులు). న-కారానికి తరువాత పరుషము సరళమైనప్పుడు దానికి ముందు అరసున్న ఉంచుట వాడుక (పూచెన్ గలువలు, పూచెఁ గలువలు, ఇత్యాదులు). డు-కారాంత నామవాచకాలలో డు-కారానికి ముందు అరసున్న ఉంటుంది, దీనిని కూడా నిండు సున్నగా ఉచ్చరించవచ్చును (రాముఁడు, రాముండు). కొన్ని విభక్తి ప్రత్యయాల లోపాన్ని కూడా ఇది సూచిస్తుంది (రాముఁ గని, రాముని గని).
మనం వాడుక భాషలో పద్యం రాయాలంటే పైన చెప్పిన విషయాలను గుర్తులో పెట్టుకొని చెవులకు ఇంపుగా కృత్రిమత, పరుషత లేకుండా రాయాలి. పద్యములలోని లయకు, గతికి ఎట్టి అడ్డంకి రారాదు. కావ్యభాషయొక్క కష్టాలను, వ్యావహారిక భాషయొక్క ఆవశ్యకతను గురించి గిడుగు సీతాపతిగారు భారతీశతకములో [గో-1] ఇలా చెప్పారు.

మహిమన్ శిష్టుల నోట బుట్టి, కవి సమ్మానంబునన్ దేవవా-
క్సహవాసంబును బొంది, వ్యాకరణ రక్షాబంధ సూత్రాలచే
మహనీయస్థితి గాంచి, పండితులకే మాన్యంబుగా నిల్చు నీ
బహు కావ్యోద్ధృత భాష సాధ్యమగునే భాషింపగా భారతీ!

సులభంగా అర్థమయ్యే కొన్ని పద్యాలు
వాడుక భాషలో తెలుగు పద్యాలు లేవా అని ప్రశ్నిస్తే, దానికి జవాబు కచ్చితంగా ఉన్నాయి. పోతన భాగవతములో పొడుపు కొండ మీదఁ బొడిచింది మొదలుగా, శరణంబులు నీ పదాబ్జ శావానిరతుల్ అనే చోటులలో వ్యావహారికాన్ని ఉపయోగించారు [భా-1. ఇట్టి పద్యాలను మనం కొన్ని శతకాలలో, అవధానాలలో, హాస్యరసమయ సన్నివేశాలలో, చాటువులలో చదువగలము. కింద కొన్ని ఉదాహరణలను ఇస్తున్నాను.

శతకములలో: కవి చౌడప్పా, గువ్వల చెన్నా, సంపగిమన్నా అనే మకుటాలతో ఉండే కందపద్య శతకాలను [వీ-1] చాలవరకు వాడుక భాషలోనే రాశారు ఆ కవులు. వేమన పద్యాలలో [వే-1] కూడా ఇట్టివి కొల్లలు. జనార్దనాష్టకములోని పద్యాలు కూడా వ్యావహారికాన్ని జ్ఞప్తికి తెచ్చేవే [రు-1].

గుడిసెయు మంచముఁ గుంపటి
విడియమును బొగాకుఁ దన్ను విడనొల్లని మే
ల్బడఁతియుఁ గల్గిన జలి యె-
క్కడిదప్పా కుందవరపు కవి చౌడప్పా

వెల్లుల్లిఁ బెట్టి పొగిచిన
పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా
మొల్లముగ నూని వేసుక
కొల్లగ భుజియింపవలయు గువ్వల చెన్నా

గాడిదవలె బూడిదఁ బొ-
ర్లాడుచుఁ గొక్కెరయుఁ బోలె ధ్యానము సేసే
బేడిదపుఁ గపటయోగుల
జాడలు ఘను లెంచరన్న సంపఁగిమన్నా

అజ్ఞానమె శూద్రత్వము
సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినవా
యజ్ఞాన ముడిగి వాల్మికి
సుజ్ఞానపు బ్రహ్మ మొందె జూడర వేమా

అలుకలన్నియు దీరగా, నా అండ కెప్పుడు వస్తివీ
పిలిచి నవరత్నాల సొమ్ములు ప్రేమతో నెపుడిస్తివీ
వలచి వలపించియును గూరిమి వదలకెప్పుడు వస్తివీ
కలసి వేడుక, దనుజమర్దన, కందుకూరి జనార్దనా!

సినిమాలలో: శ్రీశ్రీగారు ఏదో ఒక సినిమాకు రాసిందనుకొంటాను కింది సీసపద్యము [శ్రీ-1]. ఇందులో మనం ప్రతినిత్యం మాట్లాడే విధంగా భరిస్తాడు, చెప్పడం, వదలడం, ఆంగ్ల పదమైన సిల్కు వాడబడినవి.

ఇంత పాతివ్రత్య మెవడు భరిస్తాడు
  ఇంతి కాదిది దంతి యినుప బంతి
పతిభక్తి యనరాదు హత విధీ దీనిని
   పతిహింస యనుచు చెప్పడమె లెస్స
ఈయమతో బ్రతు కిహలోక నరకమే
   ఈ యిల్లు వదలడం హాయి హాయి
సతి వద్దు సంసార సంకటమే వద్దు
   సన్యాసి యొక్కడే ధన్యజీవి

కనుక మతి చెడిపోవక మునుపె ముద్దు
లొల్కు సిల్కు కాషాయము లొగి ధరించి
పరుగు తీసెద కాశికి వడి వడి వడి
శపథ మిది సత్యమిది సునిశ్చయము నిదియె

సినిమా పాటలు కూడా ఛందోబద్ధమైనవే. వాటిని రాసేటప్పుడు సినీకవులు మాత్రాఛందస్సును, అంత్యప్రాసలను ఎక్కువగా వాడుతారు. కింద అమరశిల్పి జక్కన చిత్రంనుండి దేశి ఛందస్సైన ద్విపదలో (అక్కడా ఇక్కడ ఇంద్రగణాలకు బదులు పంచమాత్రలు, ప్రాసయతులు ఉన్నాయి ఇందులో) సముద్రాల రాఘవాచార్యులు రాసిన పాట [తె-1] –


మురిసేవు విరిసేవు
అమరశిల్పి జక్కన సినిమా, ఘంటసాల

మురిసేవు విరిసేవు ముకురమ్ము జూచి
మరచేవు తిలకమ్ము ధరియించ నుదుట
నీ రూపు గన నీకె పారవశ్యాల
మా రాజు మనసేలు మరుని తంత్రాల

ఏ కాంతు దరి జేర ఏకాంత వేళ
ఈ కబురు పంపేవె ఓ కీరపాణి
చిలకమ్మ కనబోవు చెలుని పేరేమె
చెలియరో నీ స్వామి చెన్న కేశవుడ

గోపికలు సేవించు గోపాల దేవు
రూపుని మురళిని మోపి కెమ్మోవి
సరసానురాగాల స్వామి దరిజేరి
సారూప్య మోక్షమ్ము సాధింతువేమొ

విలు చేత బూనేవు వీరాల బాల
పలికిరా ఎవరైన పరిహాస లీల
నవయౌవనము దోచి నమ్మించిరా నీ
ధవునిపై పగలూని దాడి జేసేవ

ఆటలను పాటలను హావ భావముల
నీటులో నీసాటి నెఱజాణ నీవె
అలరింపగా నిన్ను ఆనంద లీల
చెలు వెరుగు కేశవుడు చేరు నీ వేళ

కౌశికుని మది గొనిన కలికి మేనకవొ
శ్రీశుకుని దరి కులుకు చెలి రంభ వేమొ
సరసలయ గతి చూడ స్వామి రాడమ్మ
పరమాత్ము గను దారి భక్తి జేరమ్మ

పేరడీలు, మణిప్రవాళాలు, ఆంగ్లంలో పద్యాలు: రెండు భాషల పదప్రయోగాలను, వాక్య నిర్మాణాలను ఉపయోగించి రాసిన వాటిని మణిప్రవాళాలు అంటారు, అంటే ఇందులో వేటికి అవి మనలను మణులలా, పగడాలలా ఆకర్షిస్తాయి. ఒకప్పుడు తమిళ, సంస్కృత పదాలతో మలయాళములో (లీలాతిలకం, ఉణ్ణియచ్చి చరితం, ఇత్యాదులు) ఈ మణిప్రవాళాలు ఎక్కువగా ఉండినవి [వా-1]. దీక్షితులు కూడా కొన్ని మణిప్రవాళాలను రాశారు [పా-1], (వేంకటాచలపతే నిను నమ్మితి అనే పాటలో శ్రీనివాస శేషాచలమునుంచి శీఘ్రమే వందు…, వాసుదేవనే వాంఛితార్థ ఫల మిచ్చు వరదనే…). గిడుగు సీతాపతివారు [సీ-1] కూడా ఒక స్వాగత వృత్తాన్ని ఇట్టి భాషలో ఉదహరించారు.

తండులాలు గృహమందు న సంతి
తిండికైతె పదిమంది వసంతి
కుండలన్ని గృహమందు లుఠంతి
ముండనాకొడుకు లెల్ల హసంతి

ఈ నాడు పద్యాలలో ఆంగ్ల పదాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అవి కొన్ని చోటులలో నామవాచకాలు, మరి కొన్ని వేళలలో క్రియలు. ఇవి నేటికాలపు మణిప్రవాళాలు కాబోలు!

శ్రీశ్రీగారు వేమనను పేరడీ చేస్తూ రాసిన కింది పద్యం [రా-1] కూడా ఆసక్తికరమైనదే. ఈ ఆటవెలదిలోని మొదటి పాదములో కాకికి, సైకోకు ప్రాసయతిని గమనించాలి.

కాకికేమి తెలుసు సైకోఅనాలిసిస్
ఆటవెలది ద్విపద కత్తగారు
ఐదు, మూడు, రెండు ఆముక్త మాల్యద
విశ్వదాభిరామ వినుర వేమ

స్నేహితులైన చేకూరి రామారావు గారిని సన్మానిస్తూ కోవెల సంపత్కుమారాచార్యులు చేరా అనే మకుటంతో ఒక శతకాన్నే [స-1] రాశారు. అందులోని భాషాశైలి వ్యావహారికమే. అందులోనుండి మచ్చుకు ఒక రెండు కందాలు కింద ఉదహరిస్తున్నాను –

వీరప్పన్, ఏన్గుల సం-
హారప్పన్, కుంభిదంత హరిగంధ వ్యా-
పారప్పన్, కిడ్నాపుల
ధీరప్పన్ ప్రభుత తాడు తెంచెను చేరా

ఇస్మాయిల్ స్మైలిస్తే
ఆస్మాన్‌లో పిట్ట వాలునా చెట్టుపయిన్
జాస్మిన్ ఖుష్బూ లొలికే
అస్మితలే క్రొంబ్రతీక లౌనటె చేరా

పై పేరడీలలో వలెనే కింది కరుణశ్రీ పద్యం [మ-1] కూడా ఒక మణిప్రవాళమే.

పాకెట్లో రాకెట్లిడి
బ్రాకెట్లాడకుము ప్రజల భవితవ్యముతో
బ్రోకర్లను స్వార్థానికి
జోకర్ల నొనర్పకోయి భుట్టో భాయీ

ఆంగ్లంలో తెలుగు ఛందస్సులో పద్యాలను రాయడంలో ప్రతిభ నార్జించినవారు సుప్రభగారు. వారు రాసిన ఒక పద్యం కింద ఇస్తున్నాను. ఇది పాదమునకు నాలుగు య-గణములతో ఉండే భుజంగప్రయాతము [శా-1] (ఈ వృత్తాన్ని గురించి నేను ఒకప్పుడు శంకరాచార్యులను గురించి రాస్తూ ప్రస్తావించాను [మో-2]).

భు. four bacchii (IUU) in one line
Demanding, Demanding, denying the request!
Demanding to get love, demanding to get heart
Demanding to worship, demanding to follow
Demanding he always, repeating the same words

అవధానాలలో, ఆశువులలో: ఆ కాలంలో చిలకమర్తి లక్ష్మీనరసింహారావుగారు టంగుటూరు ప్రకాశంగారి కోరికను మన్నించి పకోడిపై ఆశువుగా కంద పద్యాలను చెప్పారట [ప్ర-1]. అందులో ఒకటి –

ఆ కమ్మదనము, ఆ రుచి,
ఆ కరకర, ఆ ఘుమఘుమ, ఆ పొంకము లా
రాకలు పోకలు పడుపులు
నీకే తగు, ఎందు లేవు, నిజము పకోడీ

పానుగంటి లక్ష్మీనరసింహరావుగారు తాను రాసిన కంఠాభరణము అనే నాటకంలో రామలక్ష్మణులను ఆశుకవులు బేడ ఇచ్చిన ఒక లుబ్ధాగ్రేసరునితో చెప్పిన పద్యం కిందిది [ప్ర-1].

తోడా లివ లేవో, గుడి
ఘోడాయే నివ్వలేవొ కొమరుగ దలపన్
బోడెమ్మ చాకలివలె
బేడా యిచ్చెదవు దూడ పేడా అరయన్

బులుసు వేంకట రామమూర్తిగారు ఒక అవధానంలో పూరించిన దుష్కరప్రాస పద్యం ఒకటి [ప్ర-1] కింద ఇస్తున్నాను.

పిట్మను షార్టుహేండు టయిపింగును ప్యాసయి వెస్టుకోస్టు యె-
స్టేట్మినరల్సు లోన పని సేయు స్టెనో యొకనాడు బీచిలో
ఖాట్మను నా బరంగు దొరగారి కుమార్తెను జూచి యిట్లనెన్
కుట్మలదంతి నీ పయిన కోరిక లీరిక లెత్తె నీతరిన్

నా ప్రయత్నాలు
కామేశ్వరరావుగారు తమ వ్యాసంలో ఒక విషయం చెప్పారు. అదేమంటే వాడుక భాషలో కవితలు ఎక్కువగా లేవని. లేవంటే, ఎలా? ఎవరైనా రాయాలి. రాస్తే వాటికి ఆదరణ ఉండాలి. అది లేక ఎవ్వరూ రాయరు గదా! నేను ఉదహరించిన పద్యాలు కూడా పేరడీలు లేక తమాషాకై హాస్యరసప్రధానమైన పద్యాలు. అన్ని రసాలకు అనువయ్యేటట్లు వాడుక భాషలో పద్యాలు రాయడానికి వీలవుతుంది. కాని ఛందస్సు నెరిగినవారు తమ ఉన్నతాశ్వమునుండి దిగి ప్రయత్నం చేయాలి. ఇలా రాసిన పద్యాలను కవులు, పండితులు, విమర్శకులు ఆదరించాలి, అభినందించాలి, ఆనందించాలి. వ్యావహారిక భాషలో పద్యాలను రాయడంవల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. భాషపైన, వ్యాకరణంపైన అంతగా అధికారం లేకున్నవారు కూడా పరిశ్రమించవచ్చు. దీనివల్ల ఛందస్సు ప్రక్రియ ఏ కొందరికో మాత్రమే కాక అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ కళకు మళ్లీ ఒక నవజీవనం కలుగుతుంది, నవ చైతన్యం పుడుతుంది. కింద వ్యావహారిక భాషలో సామాన్యముగా మనం తెలుగులో వాడే వృత్తాలలో, జాత్యుపజాతులలో వ్రాసినవాటిని మీముందు పెట్టి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ఇందులోని వస్తువు ఏ ఒక్క ప్రత్యేకమైన విషయంపైన కాక అన్ని విషయాలపైన రాసినవి.

వృత్తాలు
వ్యావహారిక భాషలో వృత్తాలను వ్రాసేటప్పుడు కొన్ని విషయాలను మనం గుర్తులో ఉంచుకోవాలి. తెలుగులో సర్వసాధారణంగా ఉపయోగించే వృత్తాలు నాలుగు. అవి శార్దూలవిక్రీడితము, మత్తేభవిక్రీడితము, చంపకమాల, ఉత్పలమాల. వీటికి ప్రతి పాదాంతములో గురువు ఉన్నది. గురువుతో అంతమయ్యే పదాలు తక్కువ, అదీ కాక ప్రాస కుదరాలి. ఈ రెండు కారణాలవల్ల ఏ పాదం ఆ పాదంతో అంతం కాదు తెలుగు పద్యాలలో. తెలుగులో ప్రాసాక్షరమైన పాదపు రెండవ అక్షరం సరిగా కుదరకపోతే పదాన్ని ముందు పాదాంతములో ఆరంభించుట వాడుక.

సంస్కృతంలా కాక, తెలుగులో (కన్నడంలో కూడా) పాదాంతములో విరామం లేదు. అందుకే ఒక పాదం మరొక పాదములో చొచ్చుకుపోతుంది. ఒక విధముగా చూస్తే ఈ వృత్తాలన్నీ నియమబద్ధమైన వచనాలే. ఒక్కొక్క పాదంలో పదాలు ఒక్కొక్క విధంగా అమర్చబడిఉంటాయి కనుక ఒక ప్రత్యేకమైన లయ ఉండదు వీటిని పాడేటప్పుడు. ము-కారాంత పదాలు అనుస్వారంతో అంతమవుతాయి కాబట్టి వీటిని చివరి గురువుగా ఎన్నుకోవచ్చు వాడుక భాషలో. విక్రీడితాలను గురించి (మో-3), మాలావృత్తాలను గురించి (మో-4) నేను ఇంతకు ముందు రాసిన వ్యాసాలను ఇక్కడ ఉదహరించడం అవసరమే.

1) శార్దూలవిక్రీడితము: ఈ వృత్తాన్ని వ్యావహారిక భాషలో రాసేది కొద్దిగా కష్టమే, ఎందుకంటే ఇందులోని ప్రతి పాదం మూడు గురువులతో ఆరంభమవుతుంది.

నువ్వేమో ఒక పూల తోట, మరి నేనో ముళ్లు! నా మానసీ
నువ్వేమో ఒక రాజ బాట, మరి నేనో రాళ్ళు! నా రూపసీ
నువ్వేమో ఒక తేనె ఊట, మరి నేనో వేము! నా ప్రేయసీ
నువ్వేమో ఒక సంజె వెల్గు, మరి నేనో రేయి! నా ఊర్వశీ

2) మత్తేభవిక్రీడితము: శార్దూలవిక్రీడితములోని మొదటి గురువును రెండు లఘువులు చేయగా లభించినదే ఈ మత్తేభవిక్రీడితము అనే వృత్తము.

చిలకా యెందుకె,నీకు కోపములు? రా చిల్కా విలాసాలతో
చిలకా యెందుకె, నీకు మౌనములు? రా చిల్కా వినోదాలతో
చిలకా యెందుకె, నీకు యోచనలు? రా చిల్కా సరాగాలతో
చిలకా యెందుకె, యీ విచారములు? రా చిల్కా పరాగాలతో

3) చంపకమాల: వృత్తాలలో చంపకమాలనే కవులు ఎక్కువగా తమ కావ్యాలలో వాడారు. తెలుగు భాషకు బాగుగా అతికిపోయిన వృత్తము ఇది.

తిరుపతి కెళ్లుదాం పదర, దేవుడి దీవెన లందడానికై,
సరసర కొండ మెట్టులను, స్వామి హరీ, అని ఎక్కుదాం, పరా-
త్పర అని మొక్కుదాం, పదము పాడుచు, ఆడుచు, వెంకటేశ్వరా,
వరముల నీయరా, వరద, వాంఛల దీర్చర, యంచు వేడుదాం

4) ఉత్పలమాల: చంపకమాలలోని మొదటి రెండు లఘువులను ఒక గురువుగ చేస్తే దొరికిన వృత్తము ఇది.

చంద్రుని చూడు, పున్నమిది, చల్లని వెన్నెల, చూపవా ముఖం?
ఇంద్రుని చెల్లెలా, యిపుడు, యింపుగ సొంపుగ యివ్వవా సుఖం?
చంద్రిక నాకు నీకు గల సంగడి, పొంగెను ప్రేమసాగరం,
చెంద్రికమోము నవ్వులను జిమ్మగ, నువ్విట రావె వేగిరం!

జాతులు
కందమును చతుర్మాత్రలతో, ఉత్సాహను త్రిమాత్రలతో రాస్తారు. మధ్యాక్కర, ద్విపదలను సూర్యేంద్ర గణాలతో రాస్తారు. వీటన్నిటికీ ప్రాస తప్పక ఉండాలి.

1) కందము: కందపద్యాలలో సరి పాదాలలో చివరి అక్షరం ఎప్పుడూ గురువుగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు ము-కారాంత పదాలను అనుస్వారం పెట్టి ఉచ్చరిస్తాము. ఆ విధంగానే ఇందులో నాదం, మోదం అని వాడాను. కందాలలో, పాదాంతములో గురువులు గల వృత్తాలలో ఇట్టి వ్యావహారిక భాషలోని పదాలు బాగా ఉపయోగానికి వస్తాయి.

వస్తానని చెప్పాడే
యిస్తానని చెప్పినాడె యింపగు నాదం
తెస్తానని చెప్పాడే
నేస్తమ్మయి నాకు మంచి నెయ్యపు మోదం

2) ద్విపద: ద్విపద చాల అందమైన దేశి ఛందస్సు. సామాన్యముగా దేశి ఛందస్సులో ఒక పాదం మరొక పాదములోకి చొచ్చుకొని పోవు. ద్విపదలో ప్రతి పాదం తప్పకుండా స్వతంత్రంగా నిలవాలి.

న్యూయార్కు నింగిలో నూతన క్రాంతి
వేయి రంగుల వెల్గు వెల్లువ కాంతి
పోయింది, వెలవెలబోయింది నెలయు
హాయిగా వెన్నెల నడవి గాచింది

3) మధ్యాక్కర: నన్నయ, ఎఱ్ఱాప్రెగడలు భారతంలో రాసిన ఈ దేశి ఛందస్సును తరువాత విశ్వనాథ సత్యనారాయణ గారు మాత్రమే విరివిగా వాడారు. ఇది కూడ వ్యావహారిక భాషలో అందంగానే కనిపిస్తుంది.

అందాల రాశికి లాలి, ఆనంద జ్యోతికి లాలి
గంధాల బొమ్మకు లాలి, కలహంస శిశువుకు లాలి
కుందన ప్రతిమకు లాలి, గుడిలోని మూర్తికి లాలి
మందాకిని యలకు లాలి, మా యింటి పాపకు లాలి

4) ఉత్సాహ: ఉత్సాహ పద్యం ఒక చక్కని గతితో నడుస్తుంది. ఇది ఒక మార్చింగ్ చేసేటప్పుడు పాడే పాటలా ఉంటుంది.

ఆడ పిల్ల అంటె నీకు అలుసు అంత ఎందుకో?
కోడె నాగులాగ నిన్ను కొట్టి కాటు వేయునోయ్!
చీడపురుగులాటి నిన్ను చిదిమి పారవేయునోయ్!
పాడు బుద్ధి చాలు కాలు పట్టి పాహి యను బ్రదర్!

ఉపజాతులు
నిజంగా పదహారణాల దేశి ఛందస్సు ఉపజాతులు. ఇందులో ప్రాస లేదు. సామాన్య యతినో (అక్షరమైత్రి) లేక ప్రాసయతినో వాడుకోవచ్చు. సీసములాటి పద్యాలు చాలా పురాతనమైనవి.

1) ఆటవెలది: కిందిది ఒక వచన కవితలా కనిపించినా, ఇందులో ఆటవెలదికి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. కావ్యాలలో వచనములలో పద్యాలను చొప్పించడం కూడా ఒక కళ. ఇట్టి వచన పద్యాలను చిత్రకవిత్వముగా కూడా పరిగణిస్తారు.

నేను నువ్వు – నింగి, నేల – రంగుల హేల
నేను నువ్వు – గాలి, నీటి దార
నేను నువ్వు – కొండ, నీలాల మేఘాలు
నీకు నేను – అవును – నాకు నువ్వు

2) తేటగీతి: ఇందులో కావాలనే వాడుకలో ఉన్న దుష్ట సమాసాలను (సంస్కృత పదం మొదట, తెలుగు పదం తరువాత ఉండే పదాలు) ఉపయోగించాను.

ఓ వసంతగాలీ, నువ్వు ఊపవమ్మ
పంచవన్నెల పూలను పచ్చికపయి
నేడు, ఆకాశపందిరి నీడలోన
నా ప్రియుడు వచ్చి చూస్తాడు నన్ను మెచ్చి

3) సీసము: తెలుగు ఛందస్సు ప్రత్యేకత సీసపద్యము. సీసమునకు సీసపు నాలుగు పాదాలతోబాటు చివర ఆటవెలదినో, తేటగీతినో రాయాలి. అప్పుడే అది సీస మవుతుంది.

ఎంతగా పిలిచినా ఎందుకే పలుకవు
   చింత నీదే గదా సిరుల రాణి
ఆకసం జూచినా హరివిల్లు జూచినా
   చెలియ నీ రంగులే నిలిచినాయి
తరగలో నువ్వెగా నురుగులో నువ్వెగా
   ముంగురుల నలుపు యుంగరాలొ
గాలి ఊగించగా పూలు తూగాడ నీ
   నవ్వులే దలచాను నన్ను మరచి

ఆటలాడుదాం యిప్పుడే ఆరుబయట
పాట పాడుదాం యిప్పుడే పరవశించి
మాట లాడుదాం యిప్పుడే మనసు విప్పి
ఆలసించకు యిక్కడ అలసినాను

4) ముత్యాలసరము: గురజాడ అప్పారావు గారి ద్వారా బహుళ ప్రచారములో వచ్చినది ముత్యాలసరం. దేశమంటే మట్టి కాదోయ్ లాటి ప్రబోధగేయాలు ఈ ఛందస్సులోనిదే. అప్పారావుగారు ఇందులో ప్రాసను ఎక్కువగా వాడ లేదు. వారు లయకు మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చారు.

నవ్వు చిత్రం నువ్వె నా చెలి
దివ్వె కాంతులు నువ్వె నా సఖి
గువ్వ పాటలు నువ్వె ప్రేయసి
మువ్వలా రావే

ముగింపు
మొన్ననుండి నిన్న పుట్టింది, నిన్ననుండి ఈరోజు పుట్టింది, ఈరోజునుండి రేపు పుడుతుంది. మొన్న ఉన్నవాళ్లు నిన్న లేరు, నిన్నటివాళ్లు నేడు లేరు, నేటివారు రేపు ఉండరు. కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. భాసుడి తరువాత కాళిదాసు, కాళిదాసు పిదప నన్నయ, నన్నయ తరువాత పోతన, పోతన తరువాత శ్రీశ్రీ, శ్రీశ్రీ పిదప ఇంకా ఎందరో. నన్నయనాటి భాష వేరు, నేటి భాష వేరు. అవే పదాలతో, అలాగే పద్యాలు రాయనవసరం లేదు ఈ రోజు. అంటే ఆకాలపు పద్యాలు బాగులేవని కాదు. కొత్త గాలి వీచింది, కొత్త శైలి వచ్చింది. అవే నియమాలు కూడా పాటించ నవసరం లేదు. ఒక వృత్తపు లయను పాడు చేయకుండా, ఒక గురువును రెండు లఘువులు చేస్తూ, రెండు లఘువులను ఒక గురువుగా చేస్తూ రాస్తే ఛాందసులు ఒప్పుకోకపోయినా అది ఒక వృత్తము కాకపోదు. ఛందస్సులో కూడా దానికి విషమవృత్తమని ఒక పేరు ఉంది. గణాలు తప్పినా, గమనం తప్పలేదని అంగీకరిస్తారనుకొంటాను చంపకమాలను బోలిన కింది పద్యంలో.

తలుపుల తీయరా, పసిడి తలుపుల తీయర కొత్త మేడలో
పలుకుల నాడరా, తెలుగు పలుకుల నాడర కొత్త పాటలో
నిలువక సాగరా ముందు, నిలువక సాగర కొత్త ఊహతో
వెలుగుల జిమ్మరా, అలల వెలుగుల జిమ్మర కొత్త దారిలో

నా ఉద్దేశంలో ఇలా గతిలయలు చెడకుండా శ్రుతుల కింపుగా రాస్తే అది తప్పు కాదు. ఇక్కడ శ్రీశ్రీగారు చెప్పిన కింది వాక్యాలతో [రా-2] ఈ వ్యాసాన్ని ముగిస్తాను –
“నేను ఏవో యతిప్రాసలు లేని పద్యాలు వ్రాస్తూండడం చూచి మా నాన్నగారు నాకు సులక్షణసారం [తి-1] కొనిపెట్టారు. ఛందస్సు ప్రథమపాఠం చెప్పారు. అప్పటికి నాకు ఏడెనిమిది సంవత్సరాలకు మించి ఉండదు. ఆ రోజు నుండి ఎన్ని పద్యాలు వ్రాశానో చెప్పను, అన్నీ తప్పులే! కాని ఒకసారి చేసిన తప్పు మళ్లీ చెయ్యలేదు. అందరూ నా తప్పులు దిద్దేవారే! కొన్ని తప్పులు నాకు తప్పుగా తోచలేదు. అవి చెయ్యడానికి నాకేదో హక్కు ఉందనిపించింది. అందువల్ల నా వ్యక్తి చైతన్యం ప్రగాఢతరం అవుతున్నట్లు, నా బలం హెచ్చినట్లు నాకు స్పష్టంగా తోచింది!”
-----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో 

No comments: