Saturday, September 15, 2018

తెలుగు సాహిత్య విమర్శ: సాహిత్యేతర శాస్త్రాల ప్రమేయం


తెలుగు సాహిత్య విమర్శ: సాహిత్యేతర శాస్త్రాల ప్రమేయం





సాహితీమిత్రులారా!


తెలుగు సాహిత్య విమర్శను వస్తు, శిల్ప, నేపథ్య విమర్శలుగా విభజించవచ్చు. వస్తు విమర్శలో రచయిత ఏమి చెప్పాడన్నది ప్రధానం. శిల్పంలో రచయిత విషయాన్ని ఎలా చెప్పాడన్నది ముఖ్యం. నేపథ్య విమర్శలో విషయం ఏయే అభివ్యక్తీకరణలతో, ఏ రూపం (ప్రక్రియ)లో వ్యక్తమయ్యిందో, అందులో ఏ విధమైన శైలి ఉందో, వీటిని నిర్వహించడంలో కవి జీవిత నేపథ్యం, జీవించిన కాలపు పరిస్థితులు, వైయక్తిక, రాజకీయ, సాంఫిుక, సామాజిక పరిస్థితులు ఎట్లా ప్రభావం చూపాయన్నది సాహిత్య విమర్శకు పరిశీలనాంశాలు. అయితే ఈ వస్తు, శిల్ప, నేపథ్య విమర్శలు ఆయా సాహిత్య రచనలను బట్టి, విమర్శకుడు అనుసరించాలనుకున్న విధానాన్ని బట్టి ఉంటాయి. ఈ స్థితిలో సాహిత్యాన్ని సాహిత్య శాస్త్రంతోనూ, దీనికి దగ్గరగా ఉన్న ఛందో, వ్యాకరణ, భాషాశైలుల భూమికతోనే విమర్శించాలా లేక సాహిత్యేతర శాస్త్రాలైన రాజకీయ, సామాజిక, సాంఫిుకాది శాస్త్రాల సహాయంతోనూ విమర్శించవచ్చా అన్న సమస్య ఉత్పన్నమవుతుంది. ఒక్కొక్కసారి రచనలోని విషయం, విమర్శకుడి దృక్పథం వల్ల ఇది పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు.

సాహిత్య విమర్శతత్త్వం వస్తుతత్త్వ వివేచన. విషయాన్ని కవి తన రచనా సంవిధానంతో ఆవిష్కరించినప్పుడు అది వస్తువుగా పరిణమిస్తుంది. విషయం వస్తువుగా మారడమన్న ప్రక్రియ వల్ల అది కళాత్మక రూపంతో సాహిత్యంగా పాఠకుడిని చేరుతుంది. సాహిత్యంలోని వస్తువు ఆకాశం నుండి ఊడిపడదు. కవి దర్శనం నుండి పుడుతుంది. రచనలోని బింబాలు, ప్రతీకలు, అలంకారాలు అతడి జీవితపు అనుభవం, దార్శనికపు అనుభూతి నుండి వెలువడుతాయి. అందువల్ల పురాణేతిహాసాలు, కావ్యాలు కూడా ఏదో ఒక రీతిగా మానవ జీవితాన్ని ఆవిష్కరించేవిగా ఉంటున్నాయి. వీటిలో ఎంతో కొంత రచయిత/కవి కాలం నాటి రాజకీయమో/చరిత్రో/సమాజమో నిక్షిప్తమై ఉంటుంది. వీటితోబాటు కవి వైయక్తికానుభవంలోని తాత్త్వికత ఉంటుంది. దీన్ని ఆవిష్కరించడానికి కవికి ప్రతిభా వ్యుత్పత్తులు కావాలి. ప్రతిభ స్వతహాగా కవికి ఉన్నా వ్యుత్పత్తి కొరకు లోకం, శాస్త్రం చూడాలి. ఈ లోకం, శాస్త్రం చూసిన కవి వీటిని వదిలి రచన చేయడు. కాబట్టి అందులో అంతో ఇంతో సమాజం, అతడు దర్శించిన తత్త్వమూ ఉంటాయి.

సాళ్వ కృష్ణమూర్తి అన్న విమర్శకుడికి తెలుగు మహాభారతంలో నన్నయ వేదాంత తాత్త్విక సత్యాలను, యాజ్ఞిక రహస్యాలను అంతర్గతసూత్రంగా నిక్షిప్తం చేసి రచించాడని చెప్పడానికి, వేదాంతశాస్త్ర ప్రభావమే కారణం.1 తిక్కన యుద్ధనీతిని, రాజనీతిని ఆవిష్కరించాలంటే ఆయా శాస్త్రాల జ్ఞానం విమర్శకుడికి అవసరం. ప్రాచీన కవులలో కొందరు వేదాంత శాస్త్ర ప్రభావంతో శైవ, వైష్ణవ, అచలతత్త్వ సిద్ధాంతాల జ్ఞానంతో సాహిత్య సృజన చేసినట్లు ప్రబోధ చంద్రోదయము, నాసికేతోపాఖ్యానము, కవికర్ణ రసాయనము, సీతారామాంజనేయ సంవాదము, నవనాథ చరిత్ర వంటి రచనల వలన తెలుస్తున్నది. వీటిని విశ్లేషించడానికి ఆయా సిద్ధాంతాల జ్ఞానం అవసరం. కవి నిక్షిప్తం చేసిన తాంత్రికార్థాన్ని, తాత్త్వికార్థాన్ని వెలికితీయడానికి సాహిత్యశాస్త్ర జ్ఞానం దారి చూపుతుంది. కానీ అందులోని ఆ సిద్ధాంతతత్త్వాన్ని చెప్పాలంటే విమర్శకుడికి కవి సృజన భూమికగా ఉపయోగించుకున్న శాస్త్రంతో పరిచయం తప్పనిసరిగా కావలసిందే.

సాహిత్య విమర్శకుడికి సాహిత్యశాస్త్ర పరిజ్ఞానం పరిపూర్ణంగా లభించాలన్నా సాహిత్యేతర శాస్త్రాలైన వేదాంత, మీమాంస, తర్క, న్యాయ, వైశేషికాది శాస్త్రాల జ్ఞానం అవసరం. రసనిష్ఠలో పాలుపంచుకొన్న భట్టలోల్లటుడిలో మీమాంస, శ్రీశంకుకుడిలో న్యాయం, భట్ట నాయకుడిలో సాంఖ్యం, అభినవగుప్తుడిలో వేదాంతశాస్త్రాల ప్రభావం కనిపిస్తుంది.2 అభినవగుప్తుడి శాంతరస ప్రతిపాదనకు వేదాంతశాస్త్రమే మూలం.3 ఔచిత్య సిద్ధాంతంలో క్షేమేంద్రుడు చెప్పిన ఔచిత్యాలలో కొన్ని వేదాంత శాస్త్రాలకు, మరికొన్ని (దేశ, కుల, వ్రతములు) లోక న్యాయాదులకు సంబంధించినవి.4 అలంకారాల వర్గీకరణలో ఆలంకారికులు లోకన్యాయ మూలకాలను చెప్పారు.5 అలంకార శాస్త్రం మీద ఇతర శాస్త్రాల ప్రభావాన్ని గుర్తించి వివరించిన వారున్నారు.6 దీన్నిబట్టి సాహిత్యశాస్త్ర పరిజ్ఞానం సాహిత్యేతర శాస్త్రాలతో పరిపూర్ణతను పొందుతుందని తెలుస్తుంది. ప్రతిభను నిర్వచించే సందర్భంలో అపూర్వ వస్తునిర్మాణక్షమ అనడం ‘వస్తువు’ విశిష్టతను చెప్పడమే. దీన్ని ఆవిష్కరించాలంటే కవి దర్శనంలోని ‘వస్తువు’ను విమర్శకులు అవగాహన చేసుకోవాలి. ఆ వస్తువు సాహిత్యేతర శాస్త్రపరిధిలోనిదైనప్పుడు, ఆ వ్యక్తమౌతున్న విషయతత్త్వం సామాజిక, ఆర్థిక, రాజకీయ, మనోవైజ్ఞానిక భూమిక కలదైనపుడు సాహిత్య విమర్శలో వీటి ప్రభావం కనిపిస్తుంది.

మహాభారతంలోని మానవ సంబంధాలు, రాజనీతి, యుద్ధనీతి, చరిత్ర, జాతులు, నాగరికతల తత్త్వాన్ని ఆవిష్కరించడానికి విమర్శకుడికి సామాజిక శాస్త్రాల అవగాహన ఉండాలి. తెలుగు ప్రబంధాల పరమార్థమంతా గృహస్థాశ్రమ ధర్మాన్ని చెబుతాయని, అటువంటి రచనను కవి చేయడానికి కారణం నాటి కాలపు పరిస్థితులన్న నిర్ణయానికి విమర్శకులు రావాలంటే నాటి పరిస్థితుల అవగాహన తప్పనిసరి. కవి/రచయిత దర్శనంలోని సమాజం సాహిత్యంలో ఏదో ఒక సందర్బంలో ప్రతిఫలిస్తుంది. ఆ ప్రతిఫలన రీతిని, రచయిత ఉద్దేశాన్ని వ్యక్తం చేయాలంటే విమర్శకులకు రచనాకాలం నాటి సామాజిక పరిస్థితుల అవగాహన కావాలి. ప్రాచీన సాహిత్యంలో కవి అందించిన నీతిని, ధార్మికతను, సాహిత్యశాస్త్రం వ్యక్తం చేయదు. దీనికి నీతిశాస్త్రమో/న్యాయశాస్త్రమో తెలియాల్సిందే. ఆధునిక సాహిత్యంలోని వర్గీకరణీయం, ఏకీకరణీయం, పుట్టుమచ్చవంటి దీర్ఘకవితల విశ్లేషణ రాజకీయ, సాంఫిుకాది విషయాల నేపథ్యం లేకుండా చేయలేము. చారిత్రక రచనల విమర్శలో చరిత్రపై స్పష్టత వుండాలి.

వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలే నాచన సోమన ఉత్తర హరివంశంలో ఉన్నాయన్న నిర్ణయానికి రావడానికి కథాసూత్రం కారణమైనా, దాన్ని నిరూపించడానికి పాంచరాత్రగమశాస్త్రం తుమ్మపూడి కోటేశ్వరరావుకు తోడ్పడింది.7 ఆయా తాత్త్విక రహస్యాలను సాహిత్యరూపంలో కథాత్మకంగా సృజన భూమికతో కవులు/రచయితలు మనకు అందించారు. ఆ అందించిన ఫలితాన్ని విమర్శ రూపంలో చెప్పాలంటే దానికి తగిన అవగాహన అవసరమవుతుంది.

పాత్ర చిత్రణ రీతిని, కవి/రచయిత ప్రతిభలో అది నిర్వహింపబడిన రీతిని అధ్యయనం చేయడానికి సాహిత్యశాస్త్రం చెప్పిన నాయక, నాయిక లక్షణాలు, భేదాల అవగాహన పునాదిగా పనికివస్తాయి. కానీ పాత్ర అంతరంగాన్ని, పాత్ర ప్రవర్తనకు కారణమైన మనస్తత్వాన్ని అవగాహన చేసుకోడానికి, విశ్లేషించడానికి ఇతిహాస పురాణాల్లో, కావ్యప్రబంధాల్లో మానవ స్వభావ చిత్రణను పరిశీలించడానికి మనోవిజ్ఞాన శాస్త్రం విమర్శకులకు తోడ్పడుతుంది. రస సిద్ధాంతాన్ని మనోవైజ్ఞానిక శాస్త్రంతో సమన్వయం చేసుకొన్నప్పుడు వచ్చే ఫలితం వేరు. ఉదాహరణకు ‘కవితా ఓ కవితా’ అన్న శ్రీశ్రీ కవితను సాహిత్య ప్రమాణాలతో మాత్రమే పరిపూర్ణంగా విశ్లేషించలేము. అక్కడ సాహిత్యేతర శాస్త్రమయిన మనోవిజ్ఞానశాస్త్రం ఆ వస్తుతత్త్వాన్ని గ్రహించడానికి అవసరమౌతుంది.

రచయిత ఏ అంశాన్ని ఎన్నుకున్నా, దానిని ‘సాహిత్యరూపం’ (literary form) లో మనకందిస్తాడు. అతడు విషయాన్ని అందించే విలేకరి, శీలపరీక్ష చేసి పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ఇచ్చే వైద్యుడు కాడు. కవి/రచయిత విషయాన్ని కళాత్మకంగా అభివ్యక్తం చేస్తాడు. అందులో ఆత్మానుభవాన్ని, జ్ఞానానుభవాన్ని నిక్షిప్తం చేస్తాడు. లోకంలోని వస్తువుతో తానెంత తాదాత్మ్యాన్ని పొందాడన్నది ఆ సాహిత్య రచనలో కనిపించేటట్లు చేస్తాడు. తన దార్శనికత ద్వారా సత్యాన్ని ఆవిష్కరిస్తాడు. ఎయిడ్స్, సరోగసి (అద్దె గర్భం), పర్యావరణ స్పృహ, రైతుల ఆత్మహత్యల వంటి అంశాలేవైనా డాక్యుమెంటరీగా చెప్పడు. అందువల్ల ఎంతటి సంక్లిష్ట తాత్త్విక సత్యాన్నైనా కవి/రచయిత ఎలా ఆవిష్కరించాడు అన్నది సాహిత్య విమర్శకు ప్రధానం అవుతుంది.

సాహిత్య విమర్శను సమాజ కేంద్రిత విమర్శ, రచయిత కేంద్రిత విమర్శ, కృతి కేంద్రిత విమర్శ, పాఠక కేంద్రిత విమర్శ అని విభజిస్తుంటారు.8 సమాజ కేంద్రిత విమర్శలో ఒక రచనను నాటి/నేటి సమాజ దృక్కోణం నుండి చర్చించినపుడు, కృతి కేంద్రిత విమర్శలో కృతి, సామాజిక, చారిత్రక, రాజకీయ, వైజ్ఞానిక, వేదాంతపరమైనదైనప్పుడు దాని ప్రభావం సాహిత్య విమర్శలో కనిపిస్తుంది.

తెలుగులో ఆధునిక సాహిత్యానికి సంబంధించిన విమర్శ ప్రారంభమయ్యేంతవరకు సాహిత్య విమర్శకు సాహిత్యశాస్త్రమే పునాది అని భావించారు. ప్రాచీన సాహిత్య విమర్శలో ఆధునిక శాస్త్రాల ప్రమేయం ప్రారంభమయ్యాక, సాహిత్య విమర్శలో సాహిత్యేతర శాస్త్రాల ప్రభావం ఎక్కువ కావడంతో సాహిత్య విమర్శకు ఈ రాజకీయాది శాస్త్రాల అవసరం ఉందా? అన్న ప్రశ్న ఉదయించింది. సాహిత్యాన్ని వీడి సాహిత్య విమర్శ చలామణీ అయినప్పుడు ఇటువంటి ప్రశ్నలు పుడతాయి.

తెలుగు సాహిత్య విమర్శ అంతా ఎప్పుడూ సాహిత్యశాస్త్ర పరిజ్ఞానంతో మాత్రమే వికసించలేదు. ప్రాచీన సాహిత్య విశ్లేషణలో వేదాంత, ఆగమాది శాస్త్రాల సహాయం, ఆధునిక యుగంలో సామాజిక, రాజకీయాది శాస్త్రాల పరిజ్ఞానం అవసరమైంది. అయితే కవి/రచయిత చెప్పిన తాత్త్వికార్థం, కథాసూత్రం/భావన/వస్తువులో వ్యక్తమైన తీరు సాహిత్య విమర్శకులకు విమర్శ పరికరం కావాలి. దాన్ని కవి/రచయిత ఆవిష్కరించిన తీరు సాహిత్య విమర్శకు ప్రధానం. ఈ ఆవిష్కరణలో కవి/రచయిత ఉద్దేశించినది సామాజికాదిశాస్త్రాలు, వేదాంతాది తత్త్వాలైనపుడు దాని ప్రభావం రచనాతత్త్వం ఆవిష్కరించడానికి తోడ్పడాలి. అంతేగానీ రచనా విషయమంతటినీ ఆయా సాహిత్యేతర శాస్త్రాల నేపథ్యం నుంచి విమర్శించడం సరికాదు. వడలి మందేశ్వరరావు అన్నట్లు కవి కాలం, కవి దేశం, కవి జీవించిన కాలం, పాఠకుడి కాలం, వీటి సమన్వయం సాహిత్య విమర్శలో ఉండాలి.9 వీటి సమన్వయం విమర్శకుడి తెలివిడికి సంబంధించింది. ఈ తెలివిడి రచనా కేంద్రంగా ఉండాలన్న స్పృహ సాహిత్య విమర్శకుడికి ఉన్నపుడు సాహిత్యేతర శాస్త్రాల ప్రమేయం స్థూలంగా ఉంటుంది.

చేకూరి రామారావు సాహిత్య విమర్శ, సాహిత్య నేపథ్యాల విషయాలను చర్చిస్తున్న సందర్భాల్లో మూడు అభిప్రాయాలు చెప్పారు.

కృతికర్త ప్రవృత్తిని బట్టి కృతితత్త్వం నిర్ణయించడం.
శబ్దాలకు, శబ్ద సంయోజనకూ ఉన్న కవితాంశ (Poeticity) వాక్య నిర్మాణపుటెత్తుగడల విశిష్టత వగైరా గురించి చెప్పడం, మార్క్సిజానికి తలకు మించిన పని.10
సాహిత్యానికి సామాజిక పునాదిని చూపించడంలో మార్క్సిజం విజయం సాధించింది. అయితే ఆ పని స్థూల పరిధి (Macro Level)లో చేయగలిగినట్లు సూక్ష్మ పరిధి (Micro Level)లో చేయలేదు.11
మొదటి అభిప్రాయం రచన తత్త్వ అవగాహనను, రెండు మూడు అభిప్రాయాలు ఆయా సాహిత్యేతర శాస్త్రాల పరిమితిని చెపుతున్నాయి. అయినా ‘రచన’లోని తత్త్వమే సాహిత్య విమర్శకు ప్రధానం అన్న విషయంలో అభిప్రాయభేదాలుండవు. రచనాతత్త్వం సాహిత్య విమర్శలో ఆవిష్కరించబడిన తీరునుబట్టి సాహిత్యేతర శాస్త్రాల ప్రభావం ఉండవచ్చు. కారణం సాహిత్య రచన సమస్త విషయాల భాండాగారం. భాండాగారం నుండి వెలుగులోకి వచ్చిన విషయం విమర్శకుల దృక్పథాన్ని బట్టి ఉంటుంది. సాహిత్య సృష్టికి సామాజిక జీవితం, కళాస్వరూప శాస్త్రం రెండూ అవసరమే. ఈ రెండు అంశాల సంయోగమే సాహిత్యం అనీ, సామాజిక అంశాలూ, కళాస్వరూప శాస్త్రం రెండూ కలిసి ఉన్న విమర్శే సామాజిక కళావిమర్శ12 అని నిర్వచించుకొని జి. లక్ష్మీనరసయ్య ఆ కోణం నుంచీ సాహిత్య విమర్శ చేశారు. విమర్శకుడి దృక్పథం సాహిత్య, సాహిత్యేతర ప్రమాణాలలో ఏదైనాసరే వస్తు, శిల్ప, రూప, నేపథ్యాల సమన్వయం తప్పనిసరి. దీనికి కొంత వరకు సాహిత్యేతర శాస్త్రాలను విమర్శకుడు ఉపయోగించుకోవచ్చు. అయితే ఆయా శాస్త్రాలు ఆ సాహిత్య రచనలో ఎట్లా సంలీనమయ్యాయి, రచనాతత్త్వాన్ని ఎట్లా పరిపుష్టం చేశాయన్నదే సాహిత్య విమర్శకు ప్రధానం.
----------------------------------------------------------
రచన: లక్ష్మణ చకవ్రర్తి, 
ఈమాట సౌజన్యంతో

No comments: