Thursday, January 18, 2018

ముక్కుమూసి చదువగల పద్యం


ముక్కుమూసి చదువగల పద్యం




సాహితీమిత్రులారా!

ముక్కుమూసి చదువగల పద్యం అంటే
ముక్కుతో పలికే అక్షరాలను వాడకుండా
పద్యాన్ని కూర్చడం దీన్ని నిరనునాసిక
పద్యం అని చెప్పవచ్చు. పోకూరి
కాశీపత్యవధానులనే కవీంద్రుడు
కూర్చిన "శ్రీశౌరిశైశవలీల" అనే
రెండాశ్వాశాల ప్రబంధములోనిదీ పద్యం
ఇందులో కూర్చిన పద్యాలన్నీ నిరనునాశికా
పద్యాలే. ఇందులో శ్రీకృష్ణుని బాల్యక్రీడలు
వర్ణితములు. ఈ పద్యం గోపికలు విరహకారకులైన
మదనాదులను దూషించుట -
చూడండి-

వల యరుసా శరాలివి వేయవేల యీ
                    సారీవు హరువల్ల సావవలయు
శర్వరీశా యేల యోర్వలేవుర రాహు
                    వారయు లేర యీవాఱవలయు
వాయివా సెవలీవ పైరివాసువె యీ
                   వల శేషు వాయులోసొలయ వలయు
సారసశర వయస్యా యీర్షయేల యీ
                  వఱువయి హోరలై యవయ వలయు
లావు వలరావు వెల్లువలార యీర
లొరుల యుసులులరయలేరె యురుల వలల
వాలరే సోలరే సావవలయులేరె
హాళియే లాసి యేల యీలీలరొల్ల
                                                             (శ్రీశౌరీశైశవలీల - 2- 23)


వల యరుసా శరాలివి వేయవేల యీ
                    సారీవు హరువల్ల సావవలయు
ఓయి వలరాజా బాణాలను భూమిపై వేయవెందుకు
ఈ తడవ శివుని వలన పూర్తిగా చచ్చిపోవాల.

శర్వరీశా యేల యోర్వలేవుర రాహు
                    వారయు లేర యీవాఱవలయు
రాత్రికి వల్లభుడవైన ఓ చంద్రుడా మమ్మెందుకు ఓర్చలేవు
నిన్ను రాహువు చూస్తాడులే చచ్చిపోయేలా

వాయివా సెవలీవ పైరివాసువె యీ
                   వల శేషు వాయులోసొలయ వలయు
ఓ వాయుదేవుడా వేడిగా వీచటాని శత్రువువా
నీవు ఆశేషును నోటిలో అలసిపోనూ

సారసశర వయస్యా యీర్షయేల యీ
                  వఱువయి హోరలై యవయ వలయు
మన్మధుని స్నేహితుడవైన ఓ వసంతా
అసహనమెందుకు నీవు 60 దినాలవుతూనే నశించి పోతావు

లావు వలరావు వెల్లువలార యీర
మన్మథుని సైన్యాలైన పక్షులారా మీరు
ఇతరుల సౌఖ్యాన్ని చూడలేడరా

లొరుల యుసులులరయలేరె యురుల వలల
వాలరే సోలరే సావవలయులేరె
హాళియే లాసి యేల యీలీలరొల్ల
ఉచ్చుల్లో వల్లో పడి చచ్చిపోదురుగాక
పరిహాసమా ఉద్రేకించి ఈ విధంగా కేకలేయడమెందుకు

(అంటే మదన చంద్ర వాయు వసంత విహంగాదులను
విరహిణీస్త్రీలకు విరోధులు కావున గోపికలు దూషించసాగిరని అర్థం.)

No comments: