Monday, December 16, 2019

మంచి కవి, మంచి స్నేహితుడు


మంచి కవి, మంచి స్నేహితుడు
సాహితీమిత్రులారా!


1957లో అనుకుంటాను, ఒక రోజున మా ఇంటి ముందు ఓ రిక్షా ఆగింది (అప్పట్లో అవి మనుషులు తొక్కే సైకిల్‌ రిక్షాలు). అందులోంచి సన్నని గ్లాస్గో పంచె కట్టుకుని, అంతే సన్నని తెల్ల లాల్చీ తొడుక్కుని, ఒక సుకుమారమైన మనిషి దిగి, “నారాయణరావుగారంటే మీరేనా? నాపేరు బాలగంగాధర తిలక్‌. మీతో మాట్లాడదామని వచ్చాను” అన్నాడు.

నేను నివ్వెర పోయాను. మనిషినెప్పుడూ చూడలేదు గానీ, బాలగంగాధర తిలక్‌ నాకు చాలా ఇష్టమైన కవి. నేను అతని మాటల పొందికనీ, సమాసాల కూర్పునీ, మనసు లోపల పొరల్లోకి చొచ్చుకుని వెళ్ళే అతని అందమైన ఊహల్నీ – అన్నిటికన్నా కవిత్వం మీద అతనికున్న స్పష్టమైన, ధైర్యవంతమైన నమ్మకాన్నీ తలుచుకుని తలుచుకుని ఉప్పొంగిపోతూ ఉండేవాణ్ణి. అలాంటి బాలగంగాధర తిలక్ తిన్నగా మాయింటికి వచ్చేస్తాడని నేను ఊహించలేదు.

నా ఉబ్బితబ్బిబ్బులోంచి నేనింకా తేరుకోక ముందే, అలా వచ్చిన మనిషి కుర్చీలో కూర్చుని మాట్లాడటం మొదలు పెట్టాడు. నేనూ అంతే మామూలుగా అతని కబుర్లలో కలిసిపోయాను. మేమిద్దరం అంతకు ముందునుంచీ చాలాకాలంగా ఎరిగున్న స్నేహితుల్లా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాం. గంటలు గడిచిపోతున్నాయి. కవిత్వాన్ని గురించీ, సాహిత్యాన్ని గురించీ, అప్పుడు రాస్తున్నవాళ్ళ మంచిచెడ్డల్ని గురించీ, ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క మాట, ఒక్కొక్క ఒడుపు ఎంత బాగుందో ఒకరికొకరు ఎంతో ఇష్టంతో ఊహలు కలబోసుకుంటున్నాం. అతను చాలా పెద్ద కవి అని నా గుర్తులో లేదు. నేను చాలా చిన్నవాణ్ణని ఆయన అనుకున్నట్టూ లేదు. అలా మాకు తెలియకుండా కాలం గడిచిపోతూంటే, వీధిలో ఉన్న రిక్షావాడు నాకు కనిపించాడు. అతనికి డబ్బిచ్చి పంపేయలేదే, ఏమిటా అని ఆశ్చర్యపోయాను నేను. అప్పుడు చెప్పాడు తిలక్‌, రిక్షా అక్కడే ఉండాలని, “లేకపోతే నాకు భయం, నడవాల్సొస్తుందేమోనని. ఏం ఫర్వాలేదు లెండి. ఉంటాడు.”

తిలక్‌ని తల్చుకోగానే నాకు జ్ఞాపకం వచ్చేవి రెండు – కవిత్వంలో ఆయనకున్న ధైర్యం, నిబ్బరం. జీవితంలో ఆయన నిస్సహాయత, భయం. ఈ రెండూ సమానంగా పెరుగుతూ వచ్చాయి తిలక్‌లో నేనెరిగున్నన్నాళ్ళూ. వ్యక్తులుగా తిలక్‌, నేనూ ఆయన జీవితపు చివరి దశాబ్దంలో బాగా స్నేహితులమయ్యాం. ఆయన తణుకునించీ తరుచు ఏలూరు వచ్చేవాడు. తణుకులో ఆయన తమ్ముడు, దేవరకొండ శివకుమార శాస్త్రిగారు పేరున్న లాయరు. ఆయన ఇంటికి, తిలక్‌, ఆయన భార్య ఇద్దరూ వచ్చేవారు. తిలక్‌ ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేసేవాడు కాదు. నడిచి వెళ్ళేవాడు కాదు ఆఖరికి పట్టుమని ఫర్లాంగు దూరమైనా. నేను అంత తరుచుగా కాదుగానీ అప్పుడప్పుడు తణుకు వెళ్ళేవాణ్ణి, ఆయన కోసం. ఈ మానసిక ఆందోళన, భయంలేని ఆరోగ్యవంతమైన రోజులు తిలక్‌ జీవితంలో చాలా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో తిలక్‌ని నేనెరగను.

తిలక్‌ రాయడం మొదలుపెట్టిన రోజుల్లో (ఆయన మొదటి పద్యం 1941లో రాశాడు) భావకవిత్వం వెనకబట్టి, శ్రీశ్రీ ప్రభావం బలపడుతోంది ముఖ్యంగా యువకుల్లో. కవులు లోకంలో జరిగే అన్యాయాలను పట్టించుకోవాలని, రాజకీయంగా, సామాజికంగా ఒక ప్రత్యేక తరహా న్యాయంకోసం తమ కవిత్వపు గొంతుకతో పోరాడాలని, ఒక కొత్త అభిప్రాయం బలపడడం మొదలైంది. కవిత్వం త్రికాలాబాధితమనీ, రసానందమే దాని పరమావధి అనీ అలంకారశాస్త్రంలో చెప్పిన మాటలు పాతబడి చాలా కాలమయింది. దాంతోబాటు, భావకవిత్వపు రోజుల్లో బలపడిన ఊహలు కూడా నీరసపడడం మొదలైంది. ప్రేయసీ, వెన్నెలా, మలయానిలమూ, మల్లెపువ్వులూ వేళాకోళపు మాటలయ్యాయి. భావకవి అభావకవి అయ్యాడు. విప్లవమూ, వర్గపోరాటమూ, ఎర్ర జెండా కొత్త కవితా వస్తువులయ్యాయి. యువకులందరూ ధైర్యంగా శ్రీశ్రీ కవితా, ఓ కవితా చదివి సొమ్మసిల్లి పోతున్నారు. శ్రీశ్రీ కవిత్వం అప్పటికింకా అచ్చు కాకపోయినా చాలా మంది జేబుల్లో రాతప్రతులుగా, చాలా మంది నోళ్ళల్లో గీతప్రతులుగా చలామణీ అవుతోంది. ముందుకు కుచ్చిళ్ళు వదిలేసి, బెంగాలీ కట్టు గ్లాస్గో పంచెలు, సిల్కు లాల్చీలు, గిరజాలు కవికి గుర్తులవడం తగ్గి, పంట్లాలూ చొక్కాలూ తొడుక్కున్న కవులు సభల్లో కనిపిస్తున్నారు.

అలాంటి దశలో వచ్చాడు తిలక్‌.

నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.

ఈ పద్యం చాలామందిని ఆపి, అల్లరిపెట్టింది. ఇందులో తరవాత రెండు చరణాలు ఇటు కొంచెం భావకవిత్వం వైపు, అటు కొంచెం శ్రీశ్రీ కవిత్వం వైపు మొగ్గుతున్నట్టు కనిపిస్తాయి. జాగ్రత్తగా చూస్తే నిజానికవి రెండూ కావు.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్రలోకపు మణిస్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు.

కవిత్వంలా కనిపించడానికి ప్రయత్నిస్తున్న ఈ మాటల వెనకాతల, తిలక్‌లో గాఢంగా నాటుకుని ఉండి రూపొందుతున్న ఒక తీవ్రత ఉంది. మనిషి తన జీవితంలో ప్రపంచాన్ని ఆనందించడానికి పడే తపన అక్కడితో ఆగిపోకుండా, ఈ పద్యంలో ఉన్న చివరి మూడు పంక్తులూ నన్ను కట్టి పడేశాయి.

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు

ఆఖరి చరణం దాకా మామూలుగా అప్పటి పద్యాలలో అలవాటైన మాటల కూర్పులే సున్నితంగా కనిపిస్తాయి. అయితే అందులో ఒక ఒడుపుంది, పంక్తికొక తూగుంది. మొత్తం మీద పద్యం శక్తిమంతంగా చేసే నేర్పుంది. కానీ అకస్మాత్తుగా ఆఖరి చరణం చిన్న మాటల్లో మామూలు వాడుకలోని తెలుగులో ఏ ఆర్భాటమూ లేకుండా అంతకు ముందు పద్యంలో ఉన్న ఆర్భాటాన్ని అకస్మాత్తుగా చల్లారుస్తూ మనం ఊహించని మామూలు తనంతో కనిపించే సరికి, పద్యం ఒక్కసారి అపూర్వమైన ప్రాణం పోసుకుంటుంది. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అనే మాట తిలక్‌లో అంతకు ముందు ఎవరికీ లేని, ఆ తరవాత ఎవరికీ అబ్బని ఒక అసాధారణమైన, సాధారణ శబ్దశక్తిని ప్రపంచించింది. ఆ ఒక్క పంక్తీ ఇతను నిజంగా కవి అని నాకు గుర్తుకు తెచ్చింది.

ఈ పద్యంలో తిలక్‌ తన కవిత్వాన్ని గురించే కాకుండా అసలు కవిత్వాన్ని గురించి చెప్పాడు. రాజకీయాల అలజడిలో, ఉద్యమాల ఉత్సాహంలో ఉపన్యాసానికీ కవిత్వానికీ మధ్య తేడా చెరిగిపోవడం మొదలైన రోజుల్లో వచ్చిన ఈ పద్యం చాలామందికి ప్రాణం పోసింది. ఇంకా చాలామందికి కోపం తెప్పించింది.

ఆ తరవాత తిలక్‌ రకరకాల పద్యాలు రాశాడు. అంతర్జాతీయ సమస్యలూ, యుద్ధాల కష్టాలూ, పేదవాళ్ళ బాధలూ, ప్రేమికుల అనుభవాలూ, మధ్యతరగతి మనుష్యుల అనుభవాలూ, తుఫాన్లూ, కాటకాలూ అతన్ని రకరకాలుగా అలజడి పెట్టాయి. అతని మాటలు ఎటు వెళ్ళాలో తెలియక, ఐనా అతను అంతర్గతంగా భావిస్తున్న ప్రపంచాన్ని వదులుకోలేక, దారితప్పుతున్న కవిత్వాన్ని దారిలో పెట్టడానికి, మళ్ళా బావుండదనుకుని ఆ దారిలోనే వెళ్ళడానికి ప్రయత్నిస్తూంటాయి. అప్పుడప్పుడు ధైర్యం పుంజుకుని, తన కవితా విశ్వాసాన్ని ఒక తీవ్రమైన ఉపన్యాసంలాగా, ఒక పదునైన వాగ్దానంలాగా చురుక్కుమని ప్రకటిస్తాడు. అలాంటి పద్యం 1955లో రాసిన కవివాక్కు.

1955 నించీ తిలక్‌ మళ్ళీ కవిగా పుంజుకోవడం మొదలు పెట్టాడు.

వివేకం లేని ఆవేశం విపత్కరమౌతుంది
సంయమం లేని సౌఖ్యం విషాదకారణ మౌతుంది
సమ్యక్‌ సమ్మేళనం లేని తౌర్యత్రికం కఠోరమౌతుంది
కరుణ లేని కవివాక్కు సంకుచిత మౌతుంది !

ఇందులో ఆఖరి పంక్తిలో చెప్పిన కరుణ తిలక్‌ కవిత్వానికి ప్రాణభూతమైన అంశం. అందుకే అతని మాటలు మనస్సుల్లో సహజంగా ఉండి, అవతలి వాళ్ళ సంతోషాన్నీ, బాధనీ మనదిగా అనుభవించగల ఒక సహజమైన శక్తిని ఉద్దీపింపజేస్తాయి.

నేను బాధపడుతున్నానంటే ఏడుపు, అవతలి వాళ్ళు బాధపడుతున్నారంటే జాలి.

జాలిని కన్నీళ్ళుగా మార్చకుండా, ఆర్ద్రమైన కవిత్వంగా మార్చడం కవిగా తిలక్‌ మాటలకున్న శక్తి. పంక్తి పంక్తికీ ఎంత బరువు కావాలో ఎక్కడ తేలిగ్గా ఉండాలో, ఏ మాటని ఏ మాటతో కలిపితే అతను అంతకు ముందు చెప్పిన తౌర్యత్రికం (musical ensemble) మనని భౌతికస్థాయి నించి దాని పైమెట్టుకి తీసుకెళుతుందో తిలక్‌ పట్టుకున్నాడు. అతనివల్ల తెలుగు భాష కొత్త ప్రాణం పోసుకుంది. ఆర్తగీతం అనే ఆయన 1956లో రాసిన పద్యం అలాంటిది. అందులో నా దేశాన్ని గూర్చి పాడలేను అని కఠినంగా మొదలయ్యే పద్యం –

నీ కొత్త సింగారమ్ము వలదు, ఉదాత్త సురభిళాత్త
శయ్యాసజ్జితమ్ము వలదు,
రసప్లావితము వలదు
చిత్ర శిల్ప కవితా ప్రసక్తి వాంఛింపను, తత్వసూత్ర
వాదోక్తి చలింపను
సుందర వధూ కదుష్ణ పరిరంభముల రసింపను
గత చారిత్రక యశఃకలాపమ్ము వివరింపకు, బహుళ
వీరానేక గాథాసహస్రమ్ము వినిపింపకు
ఇంక నన్ను విసిగింపకు

ఈ చరణాలు ఒక్కటొక్కటిగా మనకి అలవాటైన మొద్దుబారిన అందాల పొరలని నిర్దాక్షిణ్యంగా వొలిచేస్తాయి. ఏ తొడుగులూ, ఏ కప్పులూ లేని నిరాచ్ఛాద్యమైన మనస్సు తరవాత రాబోయే చరణాలలో ఉన్న బాధనీ, వేదననీ శారీరకంగా తెలుసుకోవడానికి సిద్ధపడుతుంది. కష్టాలు ఊహలు కావు. ఊహలు మనస్సు పడేవి, కష్టాలు శరీరానికి నాటుకునేవి. ఆ తరవాతి పద్యం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది, మన చర్మంలోకి వెళుతుంది. మనల్ని క్షోభ పెడుతుంది, హింస పెడుతుంది. ఈ పద్యం లోని ఆర్తి మన ఆర్తి అవుతుంది. అది మన నిస్సహాయతని బలంగా మారుస్తుంది.

ఈ పద్యం చదివినప్పుడల్లా ఈ మాటల్లోంచి తప్పించుకోలేను, కళ్ళముందు కనిపించే ఈ బొమ్మల్లోంచి బైట పడలేను అన్నంత భయం కలుగుతుంది. ఇది జాలి పద్యమా, లేదా నాకీ పద్యంలో ఉండడం ఇష్టంలేక ఇది నాకు ఇచ్చే ధైర్యాన్నీ, కసినీ, కోపాన్నీ భరించే శక్తిలేక నన్ను నేను తప్పించుకోడానికి నేను వేసుకున్న వ్యూహం మాత్రమేనా? ఈ పద్యం చదవడం కష్టం, చదివాక మరిచిపోవడం కష్టం.

తిలక్‌ ప్రపంచంలో సరదా కోసం రాసిన పద్యాలు – తపాలా బంట్రోతు మీద రాసిన పద్యంలో ఈ పంక్తులు తపాలానీ, బంట్రోతునీ దాటి, అతని మనస్సులోకీ విశాలమైన సముద్రంలాంటి ప్రపంచంలోకీ మనల్ని తీసుకు వెళతాయి.

ఉత్తరం యిచ్చి నిర్లిప్తుడిలాగ వెళ్ళిపోయే నిన్ను చూసినపుడు
తీరం వదిలి సముద్రంలోకి పోతూన్న ఏకాకి నౌక చప్పుడు

అందరికీ నచ్చి, అందానికి మారుపేరై అతడి పుస్తకానికి పేరై నిలబడ్డ కవిత అమృతం కురిసిన రాత్రి. జీవితం పట్ల అతనికున్న ఇష్టానికీ, జీవితంలో అతనికున్న గాఢమైన నమ్మకానికీ, బతుకు అందమైనది, బతకడమే సౌందర్యం అనే అతని సిద్ధాంతానికీ ఈ పద్యం కన్నా స్ఫుటమైన ఉదాహరణ మరొకటి లేదు. అమరత్వమంటే చచ్చిపోకుండా ఉండటం కాదు, అమరత్వమంటే బతికున్న క్షణాలు గాఢంగా బతకడం అని ఈ పద్యం పొడుగూతా మాట మాటా అలాంటి ఒక కొత్త లోకాన్ని ఆవిష్కరించి పెడుతుంది. కాంక్షా మధుర కాశ్మీరాంబరం, హసన్మందార మాల ఈ పద్య ప్రపంచాన్ని కొత్త చప్పుళ్ళతో ఆవిష్కరిస్తాయి. ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపర్చుకున్నవాడు, జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు అనే పంక్తులు, ఆ పద్యంలోనే చివర అలవాటునీ అస్వతంత్రతనీ కావిలించుకున్నారు, అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు అనే పంక్తుల్ని హాయిగా విశాలంగా ఎదుర్కొంటాయి. పద్యనిర్మాణంలో మాటల కూర్పులో తెలుగులో ఉన్న గొప్ప పద్యాల్లో ఇదొకటి.

సరదాగా రాసినా, బాధగా రాసినా, ఉత్సాహంగా రాసినా, ఊరికినే రాసినా తెలుగు మాటలకి తిలక్‌ అప్పటికి అవసరమైన కొత్త ప్రాణం పోశాడు. రాజకీయాల అలజడిలో, సిద్ధాంతాల ఘర్షణలో కవిత్వానికున్న ప్రాణశక్తి బలహీనమై పోతున్న రోజులలో వాటినన్నీ తట్టుకుని, తిలక్ కవిత్వం కోసం ధైర్యంగా నిలబడ్డాడు. అప్పుడప్పుడు కార్టూను కవిత్వం, కేలండర్‌ కవిత్వం, అంతగా అవగాహన లేని రాజకీయ కవిత్వం తిలక్‌ రాయకపోలేదు. కానీ అవి కావు తిలక్‌ని మనకి గుర్తుండేలా చేసేవి. అవి అతని గాఢమైన కవితా వ్యక్తిత్వంలోంచి వచ్చినవీ కావు.

తిలక్ తన కవితా సామర్థ్యం పరమోచ్చదశలో ఉండగా అకస్మాత్తుగా చచ్చిపోయాడు. 1966 జులైలో అతను పోయేడని టెలిఫోన్‌ కబురు తెలిసేసరికి నేను నమ్మలేకపోయేను. ఏంచెయాలో తెలియక అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ నండూరి రామమోహనరావు గారికి ఫోన్‌ చేసి చెప్పాను. కాని అదే ఆంధ్రజ్యోతిలో అతని మరణవార్త చదివిన తరవాతగాని అతను నిజంగా పోయాడన్న సంగతి నాకు మనస్సుకి పట్టలేదు.

కవిత్వాన్ని వదిలేసి, కవిత్వం పేరుతో ఉపన్యాసాలూ, వచనకవిత్వం పేరుతో చాతకాని వచనమూ విశృంఖలంగా వస్తున్న ఈ రోజుల్లో ఏది కవిత్వమో ఏది కాదో తెలుసుకోగల శక్తి నశించిపోయి, ప్రచారం చేసుకోగల వాళ్ళకి బహుమానాలు, కాకా పట్టగలవాళ్ళకి కనకాభిషేకాలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో తిలక్‌ని మనం మరొక్కసారి జాగ్రత్తగా అతని పదవిన్యాసం కోసం, అతని పద్యనిర్మాణం కోసం, అతని ఊహగాఢత్వం కోసం, అతని ప్రపంచవైశాల్యం కోసం చదవడం అవసరం.
-----------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: