Thursday, December 12, 2019

తెరచాటు-వులు: 1. ఆదిన


తెరచాటు-వులు: 1. ఆదిన




సాహితీమిత్రులారా!

మనవాళ్ళుట్టి వెధవలోయ్!
గిరీశంగారే పూనుకుని ఓ డెబ్భై యేళ్ళ తరువాత ప్రఖ్యాత హాలీవుడ్ స్క్రీన్‌రైటర్ విలియమ్ గోల్డ్‌మన్‌లా (William Goldman) పుట్టి ఇంచుమించుగా అదే భావాన్ని ఆంగ్లంలో ఉవచించారు – Nobody knows anything అని. ‘నాకు సంగీతం అస్సలు తెలియదు ‘ అంటూ వయోభారం కంటే అణుకువ వల్లనే ఒకింత క్రుంగి నడిచే బాలుగారి వ్యాఖ్యలాగా, ఈ పై వాక్యంలో సూక్ష్మం గ్రహించాలి తప్పితే, యథాతథంగా నిజమే ఎవడికీ ఏమీ తెలియదుట అని అనుకోవడం పొరపాటే. ముఖ్యంగా సినిమాల విషయానికి వస్తే – హాలివుడ్‌లోనే ఎవడికీ ఏమీ తెలియదంటే (ఆ వాక్యాన్ని ఫ్రీమేక్ చేసుకుని) మనకు అస్సలు ఏమీ తెలిసే అవకాశం లేదనుకోవడం కూడ పొరపాటే. గోల్డ్‌మన్‌గారి బహు ప్రాచుర్యం పొందిన ఆ వ్యాఖ్య విజయవంతమైన సినిమాని తీయడం ఎలాగో ఎవడికీ తెలియదు అన్న సందర్భంలో అన్వయించుకోవాలి తప్ప, అసలు సినిమా అంటేనే ఎలాగూ ఎవడికీ ఏమీ తెలియదు కాబట్టి, ఒక రాయి వేస్తే పోలా, అందితే పుష్పం లేకుంటే శష్పం అనుకోవడం ప్రమాదకరమే. సరే, మన గొడవకొద్దాం. కొన్ని సినిమాలను చూస్తే, అసలు ఇలాంటి కళాఖండాలు ఎలా తీశారు/ తీస్తారు అన్న సందేహం కంటే, అసలు వీటిని ముందు ఏమనుకుని మొదలు పెట్టారు అన్న అనుమానం రాకపోదు. వెండితెర వెలుగులో ఏదో విధంగా తమ పేరుని మెరుపులో (ఇప్పుడు డిజిటల్‌గా ఆ సౌలభ్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి) చూసుకుని మురిసిపోవాలనే తపన తీవ్రతమమై కథ, నటన వంటి పనికిమాలిన వాటిని పక్కన పెట్టి, కేవలం నిడివికే ప్రాధాన్యం ఇచ్చి (కనీసం గంటన్నర లేకపోతే సెన్సార్ వాళ్ళు, అటుపైన ఇంటర్వల్లో పుణుకులు, పాప్కార్న్ అమ్ముకునే థియేటర్ వాళ్ళూ ఒప్పుకోరు కాబట్టి) రీళ్ళను కళామతల్లికి కసికొద్దీ చుట్టేసి, నేను కూడా ఈ సాంస్కృతిక యజ్ఞానికి రీలునొక్కటి తగలవేశాను (అదే, ఆహుతిచ్చాను) అని తన వీపును కాస్త ఇబ్బంది పడైనా చరుచుకోవడమే — ఈ కళాకృతుల ప్రాథమికోద్దేశంలాగా కనపడుతుంది. తీసేవాడికి ఇంతకంటే గొప్పగా ఎవరు తీయలేరు అన్న స్వకుచ మర్దన, చూసేవాడికి ఎందుకు చూశామురా అనుకుని ఆనక స్వకపోల మర్దన రెండూ తప్పని ప్రక్రియలే. ఇంతకీ తగులాటం తీతతోనా, దృష్టిలోనా? గుడ్డు, కోడిపిల్ల కంటే జటిలమైన సమస్య ఇది.

పాత కథే…
స్క్రిప్టు ఇంకా పూర్తిగా రాయబడలేదు. క్లయిమాక్సుని ఎలా ముగించాలో తెలియక సినేరిస్టులు (అంటే స్క్రీన్‌రైటర్లే. సినేరియోలు రాస్తారని అలా అనేవారు లెండి ఒకప్పుడు) తలలు పట్టుకున్నారు. అప్పటికే ముగ్గురి తలలు ఎగిరి పడ్డాయి కూడా. ఈ లోపల హీరోగారికి అసహనం పెరిగిపోతోంది. సొంత సినిమానే కాబట్టి, ఏం పర్లేదు ముందు సినిమా మొదలుపెట్టేద్దాం, అక్కడికి వచ్చాక చూసుకుందాం అన్నారు. హీరోనే సై అనే సరికి తక్కిన గణాలన్నీ హైహై అన్నై. డబ్బు వాషర్ పోయిన వీధి కొళాయిలో నీళ్ళలాగా పారింది. సగం దూరం వచ్చాక సమస్య క్లయిమాక్సుతో కాదు, అసలు మొత్తం సెకండ్ హాఫ్‌దే అని నిర్ణయించారు దర్శకుడుగారు. కోట్లు పెట్టి మొదలు పెట్టిన ఆ జగన్నాథ రథాన్ని ఒక్క సారి ఆపే ప్రయత్నం చేశారు. ఫలితంగా చక్రాల కింద నలిగి కొంత మంది సినేరిస్టులు, ఒకరిద్దరు దర్శకులు వీరగతిని పొందారు. హీరోగారు కల్పించుకుని ఈ మధ్యనే రిలీజ్ అయి తుప్పు లేపుతున్న లేటెస్ట్ సినిమా గ్రేటెస్టు రైటరుని పట్టుకొచ్చి కాళ్ళు పట్టుకున్నంత పని చేసి, అన్యధా శరణం నాస్తి అన్నారు. ఒక వైపు డబ్బు, మరొక వైపు సమయం, ఇంకోవైపు డేట్లు కలిసి చేసిన ముప్పేట దాడిలో హీరోగారు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఎట్టకేలకు రచయిత తన పని ముగించి అందరి చేతా అవుననిపించాడు. రథం మళ్ళీ కదిలింది. ఎంతో గొప్పగా భారీ యెత్తున చరిత్రలో నిలబడిపోయే క్లయిమాక్సు అనుకున్నది సూక్ష్మంలో మోక్షం అనిపించారు. సినిమా అయిపోయిందే గానీ ఎవరికి తృప్తిగా లేదు. అయ్యవారిని చేయబోయిన చందంలో చివరికి ఫైనల్ కాపీ వచ్చింది. రిలీజు డేటు ప్రకటించారు. భయం, బాధ, సందేహం, అనుమానం. హీరోగారు పెదవి విరిచారు. దర్శకులవారు చేతులు కడిగేసుకున్నారు. రచయితలు అది నాది కాదంటే నాది కాదన్నారు. అనుకున్న ఘడియ రానే వచ్చింది…

ఈ కథని ఇక్కడ ఆపి బేతాళుడు రాజుని అడిగాడు. రాజా తప్పెవరిది అని అడగను, ఎలా చేసి ఉండాల్సింది అని అంతకంటే అడగను, ఇంత తెలిసిన వాళ్ళు కూడా ఇలా ఎలా చేస్తారు అని అడగను కాక అడగను. ఒక్క ప్రశ్న మాత్రం వేస్తాను. ఇంతకీ ఆ బొమ్మ బాక్సాఫీసు దగ్గర ఏమయ్యింది – చతికిల పడిందా? చరిత్ర సృష్టించిందా? తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో…

ఈ పై ఉదాహరణలో కల్పన, అతిశయోక్తి లవలేశమైనా లేదు. ఇదొక యదార్థ(వ్యధార్థ) గాథ. సినిమా కొన్ని యేళ్ళ క్రితం వచ్చిన World War Z. విడుదలై బాక్సాఫీసు దగ్గర బోల్తా పడుతుంది అని ఖరాఖండీగా నమ్మినవాళ్ళనే బురిడీ కొట్టించి వసూళ్ళతో కుప్పిగంతులు వేసింది. సైన్సు లాబ్‌లో ప్రయోగాలు చేసే ముందు ప్రయోజనం, పద్ధతి, ఫలితం అనేవి రాయడం తప్పనిసరి. ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏమి చూస్తున్నాం అని. బహుశా సినిమా విషయంలో మాత్రమే ఫలితం అనేది ప్రయోజనం, పద్ధతులతో ఏమాత్రం సంబంధం లేకుండా తన దారి తను చూసుకుంటుంది. కఠోర శ్రమ, పకడ్బందీ సబ్జెక్టుల మిశ్రమం గురి తప్పని విజయమా? కావచ్చు కాకపోవచ్చు. నచ్చచ్చు, ఛీకొట్టించుకోవచ్చు. Nobody knows anything అని గోల్డ్‌మన్‌గారు శలవిచ్చింది ఇందుకే. నమ్మలేని, నమ్మరాని, నమ్మశక్యం కాని నిజం. ఎవ్వడికీ ఏమీ తెలియదు. ఆ చిత్ర విజయం తరువాత వేనిటీ ఫెయిర్ పత్రిక (Vanity Fair) వారు ఓ పది పేజీల శవపరీక్ష జరిపి, అసలు ఈ సినిమా ఎలా బతికి బట్టకట్టిందో తేల్చడం వీలు కాదంటూ పెదవి విరిచారు. అసలే క్రమశిక్షణకి మారుపేరు అని చెప్పుకునే హాలీవుడ్ పరిశ్రమ. స్క్రిప్టు లేనిదే నయాపైసన్నా రాలదన్న ప్రశస్తి. అందులోనూ స్టుడియోలు, వాటి అధిపతులు, ఒక సినిమా గడప దాటే ముందు దాటాల్సిన లక్ష్మణ రేఖలు, ప్రకరణాలు, చేయాల్సిన ప్రదక్షిణాలు, అనుమతులు, అంగీకారాలు, ఇవన్నీ తోసిరాజని ఈ సినిమా అసలు ఎలా బయట పడింది? అందునా 200 మిలియన్ డాలర్ల ఖర్చు ఎలా మించి పోయింది, ఈ మధ్యలోనే హీరోగారికీ దర్శకుడికీ పేచీలు, పోట్లాటలు, ఫైరింగులు, హైరింగులు, లిటరల్‌గా అంతే తెలియని ప్రయాణాలూ…

సరే, ఈ మోస్తారు కన్నీటి గాధలు కోకొల్లలు. కాని పురిటిసంధి కొట్టుకుని పోవాల్సిన ప్రాణం గుక్కతిప్పుకుని కేర్ కేర్ మని ఎలా అన్నది అన్న లోగుట్టు ఆ కళామతల్లికే ఎరుక. ఇది అసలు చిక్కు. ఇటువంటి అష్టకష్టాలు పడి కష్టనష్టాలు ఓర్చి బయటపడిన సినిమాలన్నీ విజయకేతనాలు ఎగరవేశాయా? సక్సెస్‍కి సూత్రం సవాలక్ష సమస్యలేనా? కష్టే ఫలా బలా? సినిమా ఎలా తియ్యకూడదో సోదాహరణంగా చెప్పిన సినిమా ఇది. పేపర్ మీద లేకుండా సెట్ మీదకి వెళ్ళి చూసుకుందాం అన్న అజ్ఞానంతో మిళితమైన మూర్ఖత్వం ససేమిరా కూడదన్న సూత్రాన్ని బుట్టదాఖలు చేసిన సినిమా ఇది. అహంకారానికి అధోపాతాళమే దారన్న వారింపును తలబిరుసుతో తలదన్నిన సినిమా ఇది. ఇది విశ్లేషకులకూ విమర్శకులకూ (ఆ మాటకొస్తే, వైజ్ఞానికులకు కూడా) అంతుపట్టని అంతుచిక్కని శేష ప్రశ్న.

మరో వైపు…
ఈ మధ్య మన తెలుగులో ఓ దర్శకులవారు (ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు, కృష్ణవంశీ), సెట్ మీదే నటుల ముఖాలను చూసి ప్రేరణ పొంది నేను అక్కడికక్కడ స్క్రిప్టు రాస్తాను అని ప్రకటించారు. అది ఎలా సాధ్యం అని అడిగేలోపే, నా హిట్ సినిమాలన్నీ ఆవిధంగా రాసినవే అని ఒక సినీఅణుబాంబు పేల్చారు. ఆలోచించడానికి తగిన సమయం, తప్పొప్పులు తీరిక మీద బయటపడేందుకు వలసిన వ్యవధి, ఇవేవీ అవసరం లేకుండా ఆశువుగా స్క్రిప్టులను ఎడంచేత్తో రాసి పారేస్తున్న ఆ దర్శకుని ప్రజ్ఞను అభినందించాలో, ఎలా రాసి పారేస్తున్నా తీసి పారేస్తున్నా అక్కున చేర్చుకుంటున్న ప్రేక్షకుల ఉదారతను మెచ్చుకోవాలో తెలియని పరిస్థితి. సరే చట్టం తన పని తను చేసుకు పోతుందన్న నలిగిన సినిమా డైలాగులా దర్శకులు తప్పో ఒప్పో తనకి తెలిసిన పద్ధతిలో తీసి ప్రేక్షకుల ముందు పడేశారు.

అందరూ శుంఠలే…
తీసిన వాడి తెలివి తెల్లారిందే అనుకుందాం, మరి చూసే వాడి బుద్ధి ఏమైపోయింది? సినిమా ఆడాలంటే ప్రేక్షకుడి (కర)తాళం తప్పనిసరి. కానీ ఆ ప్రేక్షకుడు దేనిని చూసి, ఎందు చేత చప్పట్లు కొడతాడూ? ఇదొక బ్రహ్మ పదార్థం. గీతా శ్లోకమల్లే, అణువు కంటే అణువు, అభేద్యమైనది, అర్థం కానిది, అంతు పట్టనిది. మంచికి ఎప్పుడూ పట్టం కడతాడా? చెప్పడం కష్టం. పోనీ చెడును ఎప్పుడు చిమ్మివేస్తాడా? చెప్పడం ఇంకా కష్టం. ఇష్టం అనేది ఎందుకు కలుగుతుంది అన్న మనోవైజ్ఞానికమైన ప్రశ్న ఈ ప్రేక్షకుడి అభిరుచి. అభిరుచికి భావసందర్భం రాయడం రెండు చేతులతోనూ ఒకే సారి రెండు వైపుల నించీ రాసే ప్రక్రియలాంటిది. కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయో తెలియనట్టే, ఎందుకు కొన్ని సినిమాలు ఆడలేదో తెలియడం కూడా. కొన్నాళ్ళ క్రితం బాలకృష్ణగారి సమరసింహారెడ్డి సినిమా ఒక దుమ్ము దులిపింది. మరికొన్నాళ్ళ తరువాత మళ్ళీ అదే కథాంశంతో (ఏమాత్రం తేడా లేకుండా) తయారయిన నరసింహ నాయుడు సినిమా మళ్ళీ దుమారం సృష్టించింది. ఈ రెండో చిత్ర విజయం నిజంగానే ఒక సినీ చారిత్రక అద్భుతం. వెరైటీ వెరైటీ అంటూ వెంపర్లాడే తెర వెనక భాగోతులూ తెర ముందరి రసజ్ఞులూ పాత చింతకాయనే వారు వేడిగా వేడిగా వడ్డించడం, వీరు అంతే ఆబగా లాగించడం అద్భుతంగాక మరేమిటి? అది గోల్డ్‌మన్‌గారి వేష్ట – Nobody knows anything.

ఎవడికీ ఏమీ తెలియదు అని మొదలు పెట్టుకుంటే ఎక్కడినించో, ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం మొదలవుతుంది కాబట్టి వచ్చే భాగాలనుంచి తమసోమా జ్యోతిర్గమయ!
(సశేషం)
-------------------------------------------------
రచన: శ్రీనివాస్ కంచిభొట్ల, 
ఈమాట సౌజన్యంతో

No comments: