Thursday, February 6, 2020

అనులోమప్రతిలోమ చిత్రం


అనులోమప్రతిలోమ చిత్రం




సాహితీమిత్రులారా!


ఒకశ్లోకం మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు చదివితే ఒక అర్థం వస్తుంది.
ఆ శ్లోకాన్నే చివర నుండి మొదటికి చదివిన మరో శ్లోకం వచ్చి మరోఅర్థం వస్తుంది.
దీన్నే అనులోమ ప్రతిలోమ శ్లోకం అంటారు.  ఇది గతిచిత్రంలో ఒక భాగం.


నసమాశనవాగారం నమేమత్వామజేయతం
తరసారమ్యనవ్యాభమరామాదయమా విభో
                                          (అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం - 34)

(ఆశలు కోరికలు లేని నిష్కాముల యొక్క యజ్ఞాలు
నిలయంగా కలవాడవు, జయింప వీలుకానివాడవు,
నిత్యనూతన తేజస్సుకలవాడవు, శీఘ్రంగా ఫలాలను
ఇచ్చేదయగలవాడవు. అయిన
లక్ష్మీ వల్లభా! రంగనాధా! నమస్కారం)

ఇదే శ్లోకాన్ని చివరినుండి మొదటికి రాయగా


భోవిమాయదమారామ భర్యా నమ్య రసారత
తం యజేమత్వామమేన రంగావాన శమాసన
                                   

(మాయా రహితులైన ఇంద్రియ మనోనిగ్రహాల
చేత క్రీడించు పుణ్యాత్ముల చేత నమస్కరింప
దగిన శ్రీరంగపుణ్యభూమి యందు
ఆసక్తి కలవాడా! ఆనందంగా ఉండేవాడా!
శ్రీరంగనిలయుడవాన నిన్ను
సన్నిధిలో సేవిస్తాను.)

లక్ష్మిసహస్రకావ్యంలోని ఈ
పద్యం చూడండి.
ఇది విద్యున్మాలికా వృత్తంలో
కూర్చబడింది.

అనులోమ పద్యం -
సామాధామాసారాభీమా
కామారామాకామాభూమా
రామాధామారారాభామా
భామాకామాభామాభూమా

భావం -
సామవేదానికి పూర్ణ నివాసులగు పండితులకు నివాసమైనదానా
శ్రేష్ఠురాలా భయముగొలుపనిదానా కేవలము ఇహలోకమునందలి
కోరికలుగల వారియందు అనురాగం లేనిదానా భూదేవిరూపం
నొందిన లక్ష్మీ స్త్రీల యొక్క తేజస్సునకు స్థానమైనదానా
సత్యభామ అనే పేరుగలదానా రమ్ము రమ్ము స్త్రీలయొక్క
కోర్కెలయందు ఉండుదానా కాంతి సంపదయొక్క ఆధిక్యమునకు
స్థానమైనదానా రమ్ము రమ్ము


ప్రతిలోమ పద్యం -
పై పద్యాన్ని క్రిందినుండి పైకి వ్రాసిన వచ్చు పద్యం

మాభూమాభామాకామాభా
మాభారారామాధామారా
మాభూమాకామారామాకా
మాభీరాసామాధామాసా

భావం -
భూమియొక్కయు, పార్వతిఅను స్త్రీ యొక్కయు, కోర్కెలయొక్క
విశేష ప్రకాశముగలదానా, (భూదేవి, పార్వతి లక్ష్మివలన సకల
సంపదలు పొందుతారని తెలుపుట), మాకు కష్టములైన
పనులందు ధైర్యము నిచ్చుదానా, రమ్ము మాతేజస్వరూపమైన
దానా రమ్ము, మాసంపదకు స్థానమైనదానా, మన్మథునియందు
పూరణమైన సంతోషంకలదానా విష్ణుపత్నీ, భయముగలవారికి
సుహృద్బలమైనదానా లక్ష్మీ ప్రదముకాని చోట తేజస్సు
ఉండనిదానా  రమ్ము రమ్ము

అనులోమ శ్లోకం-
రామ రామ మహాబాహో మాయా తే సుదురాసదా
వాదసాదద కబ లోకే పాదావేవ తవాసజేత్
                                                                        (యమక భారతం - 71)
భావం -
ఓ రామా! నీవు ఆజానుబాహునివి. ఈ జగత్తులో కేవలం
బ్రహ్మపాదమే సరిపోలుతుంది నీ పాదంతో. నీ మాయను
అనుసరించటం చాల కష్టం. నీవు జ్ఞానప్రదాతవు.

ప్రతిలోమ శ్లోకం -
జేత్సవాతవ వేదాపాకేలోకోదద సాదవా
దాసరాదుసుతేయామాహేబాహా మమ రామ రా(రాః)
                                                                                       (యమక భారతం - 72)

(ముందు చెప్పబడిన  అనులోమ శ్లోకాన్ని క్రిందినుండి
చదివిన ఈ ప్రతిలోమ శ్లోకం వస్తుంది గమనించండి.)

భావం -
ఓరామ! నీవు గాలితో సహా ఈ విశ్వానికి బోధకుడవు.
నీవు జ్ఞానప్రదాతవు మరియు ప్రపంచానికి క్రియవు.
నీవు నీ భక్తులలో భయాన్ని పోగొట్టి సంతోషాన్ని
చ్చేవాడివి. నీవు ఈశ్వరుని, స్కందుని, గణపతిని,
లక్ష్మిని నీ అధీనములో ఉంచుకొన్నవాడివి. నీవు
నరసింహ స్వామిగా రుద్రుని ఉవాహన చేసినవాడివి.
నీవే నా సంపద.

చూశారుకదా !
అనులోమ ప్రతిలోమ శ్లోకం
ఎంత గమ్మత్తుగా ఉందో

No comments: