Thursday, September 5, 2019

ఎన్నో రాగాలు పంచిన ఏకాంత కోకిల


ఎన్నో రాగాలు పంచిన ఏకాంత కోకిల




సాహితీమిత్రులారా!


సమకాలీన తెలుగు సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞాపాటవాలు కలిగిన అరుదైన కవులలో శ్రీకాంత శర్మగారు ముఖ్యులు. దాదాపు అన్ని సాహితీ ప్రక్రియలలోనూ ఆయన రచనలు చేశారు. వివిధ ప్రక్రియలలో రచనలు చేసే సమయంలో ఆయన ప్రదర్శించిన దృష్టివైవిధ్యం ఆయా రచనలను ప్రత్యేకంగా నిలబెడుతుంది. కవిత్వంలో సౌందర్య దృష్టి, లలిత గీతాలు, నృత్య రూపకాలవంటి వాటిలో లయాత్మక దృష్టి, వ్యాఖ్యానాలలో పండిత దృష్టి, విమర్శలో సునిశిత దృష్టి, కథలు నవలలు వంటివాటిలో ఆయన ప్రాపంచిక పరిశీలనా దృష్టి వ్యక్తమౌతాయి. అయితే, అన్నిటిలోనూ అంతస్సూత్రంగా ఒక చారిత్రిక దృష్టి ఆయన మౌలిక లక్షణంగా నాకు తోస్తుంది. తన ముందు వఛ్చిన కవులు, సంస్కృతాంధ్ర సాహిత్యాలలో వచ్చిన పరిణామాలు, సాహిత్య ఉద్యమాలు–ఇలా వేటి గురించి రాసినా, ఆఖరికి ఆయన ఆత్మకథను రాసుకున్నా అన్నిటిలోనూ ఒక చారిత్రక దృక్పథం పట్ల, ఏ విషయాన్నైనా కచ్చితం గాను, ఒక సరైన క్రమంలోనూ చెప్పటం పట్ల ఆయనకున్న మక్కువ మనకు తెలుస్తూ ఉంటుంది. ఆయన ఆత్మ కథ ఇంటిపేరు ఇంద్రగంటి చదివినప్పుడు, అందులో పోనుపోను కొన్ని సంఘటనలను, తన జీవితంలోనే కాకుండా అదే కాలంలో దేశంలో జరిగిన సంఘటనలను తేదీలతో సహా పేర్కొనటం అనవసరమేమో అని నేను రాస్తే, దానికి జవాబుగా ఆయన చెప్పిన మాట: తేదీల వల్ల రచనకు ఒక ప్రామాణికత ఏర్పడుతుంది. ఎవరైనా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోదలిచినా సమాచారం పక్కాగా ఉండటం వల్ల నిలబడుతుంది. ఈ మాటలు ముందు చెప్పిన చారిత్రక దృక్పథమన్న అభిప్రాయాన్ని బలపరుస్తాయి.

శర్మగారి కవితలలో, పాటలలో ప్రధానంగా కనిపించే అంశం పదలాలిత్యం. భాషా సంపద విలువైనది. సంస్కృత విద్య పునాదిగా ఏర్పడిన సంపద మరింత విలువైనది. దానినుండి తగిన పదాలను ఎన్నుకోవటం లోనే కవి ప్రతిభ దాగి ఉంటుంది. ఎంత బంగారంతో చేసినవైనా, నగల బరువుతో వంగిన లతాంగి కంటే పూల బరువుతో వంగిన లత అందంగా ఉంటుంది. శర్మగారి కవితలలో అనుభవమయ్యేది ఈ పూల బరువే. అనుభూతి గీతాలులో అనేక కవితలలో ఈ పదలాలిత్యం ఒక స్వచ్ఛమైన, శుభ్రమైన అనుభవంలోకి మనల్ని తీసుకొనిపోతుంది. పదానికున్న శక్తినే కాదు, దాని పరిమితిని అర్థం చేసుకోవటం, అదే సమయంలో నిశ్శబ్దం అవసరాన్ని గుర్తించటం కూడా కవి చెయ్యవలసిన పనే. ఒక కవితలో ‘ఇక శబ్దంలో అపశృతిని నిశ్శబ్దంతో సరిచేసుకోవాలి’ అనటం దానికి తార్కాణంగా భావించవచ్చు.

అలాగే, పద్యంగా రూపుదిద్దుకుంటున్న ఒక భావం శబ్దంగా, భాషలో పదంగా మారే ప్రక్రియను సూచించే ఒక పోలికలో ‘పల్లెటూరి రేల్వే స్టేషను ఇంకా వాక్యంలోకి ఒదగని పద్యంలా ఉంది’ అనటం ఆ ప్రక్రియ విషయంలో ఆయనకున్న అవగాహనను స్ఫురింపజేస్తుంది.


పదాల ఎంపికలో లాలిత్యంతోబాటు ఊహలో, పదచిత్రాల కల్పనలో ఒక కొత్తదనం, సున్నితత్వంతో కూడిన గాఢత మనం గమనించవచ్చు. ఊహ గురించి రాసిన ఒక కవితలో ఊహ ‘ప్రాణోత్క్రమణ వేళ గాజు కాంతిలో కాంచన దీపం వెలిగిస్తుంది’ అని రాస్తారు. అలాగే, బాల్యం ‘తెల్లవారు జామున మసక వెన్నెల వేళ కాలవ నీళ్లలో ఊగే మబ్బు నీడ’ అని, వార్ధక్యం ‘అట్టలూడినా ఆత్మీయంగా తోచే పాత పుస్తకం’ అని చెప్పటంలో ఎంతో ఔచిత్యంతోబాటు కొత్తదనమూ ఉంది. అలవాటైన పాత కవిసమయాల్ని ఆయన కొత్తగా దర్శించి చెప్పిన సందర్భాలనేకం ఉన్నాయి. సముద్రాన్ని ‘మిడి ఎండ వేళా మిలమిల మెరిసే పొరల పొరల అభ్రకం బిళ్ళ!’ అనటంతోబాటు, సెంటిమెంటు ఉట్టిపడే విధంగా ‘తల మీద పైటకొంగు పరచి కూకలేస్తూ ఒళ్ళంతా తుడిచే ఎంచక్కని తల్లి’ అని చెప్పటం ఎంతో హృద్యంగా ఉంటుంది.

రాజమండ్రి మీద ఆరుద్ర రాసిన పాట దాని చారిత్రిక వైభవాన్ని వర్ణిస్తే, శ్రీకాంత శర్మగారు రాసిన కవిత దాని నిత్య జీవన సౌందర్యాన్ని రూపుకడుతుంది. రాజమండ్రి ‘కనిపించని తోరణంలా గాలిలో ఊగిసలాడే తెలుగు పద్య’మని, ‘అప్పుడే గడి విప్పిన ఉప్పాడ చీర’ అని రకరకాల పోలికలు చెప్పిన ఆ కవిత చివర ‘ఇహపరాల నీరెండ వేళ కైవల్య శ్రేణిక నిర్మిస్తుంది మా రాజమండ్రి’ అని ముగుస్తుంది.

ఈ సందర్భంలో ఆయన స్వరం గురించి కూడా ఒక మాట ప్రస్తావించాలి. ఆకాశవాణిలో పని చేసేవారి ముఖపరిచయం కంటే స్వరపరిచయం ముందు జరగటం సహజమే. శర్మగారి రచనలేవీ చదవక ముందు నుంచీ రేడియోలో ఆయన స్వరం ఇష్టపడటం నాకు గుర్తు. ఆయన పదాలలో లాలిత్యంలాగే, ఆయన రేడియో స్వరంలో ఒక రకమైన స్వచ్ఛత, ఆకర్షణ ఉండేవి. విజయవాడ స్టేషన్ నుంచి అప్పుడప్పుడు వచ్చే సాహిత్య సంచికా కార్యక్రమాన్ని ఆయన స్వరం కోసమే వింటూ ఉండేవాడిని.

కవిత్వం నుండి కథ పూర్తిగా వేరుపడి, ఒక ప్రత్యేక ప్రక్రియగా స్థిరపడిపోయాక, కవిత్వం చాలావరకు కవి అంతరంగం, అనుభవాలు, అనుభూతుల ఆవిష్కరణగానే ఉంటూ వస్తోంది. ఇటీవల వఛ్చిన దీర్ఘకావ్యాల వంటివాటిని పరిశీలించినా అవి భూమి గురించో, నీటి గురించో, మానవ వికాసం గురించో–ఇలా పాంచభౌతిక అంశాలను గాని, పరిణామాలను గాని వర్ణిస్తూ వచ్చినవే. వీటికి భిన్నంగా శర్మగారు రాసిన కథా కావ్యాలు శిలామురళి, సుపర్ణ వంటివాటిలో మంచి కథనం కనిపిస్తుంది. నృత్య రూపకాలు, యక్షగానాలు వంటివైతే పూర్తిగా కథ మీదే ఆధారపడినవి.


శర్మగారి వచన రచనల్లో చాలా వైవిధ్యం నిండి ఉంటుంది. విమర్శనా వ్యాసాలు, విశ్లేషణలు వంటివాటిని పక్కనపెట్టి, కేవలం సృజనాత్మక రచనలను మాత్రమే పరిశీలించినా, వాటిలోనే ఎంతో విస్తృతి ఉంటుంది. కథలు, నవలలు, నాటకాలు, నాటికలు–ఇలా అన్నిటిలోనూ వస్తుపరంగా, పాత్ర చిత్రణపరంగా భిన్నత్వం కనిపిస్తుంది. ఆయన సంస్కృత కళాశాలలో చదివిన రోజుల గురించి రాసిన ‘తూర్పున వాలిన సూర్యుడు’ స్వీయానుభవాలతో కూడిన కాల్పనిక రచన. అప్పటి కళాశాలలో పద్ధతులు, వాటిపై విద్యార్థులుగా తాము చేసిన చిన్నచిన్న తిరుగుబాట్ల గురించి చదువుతుంటే, ఒకప్పటి సాంఘిక చరిత్ర చదువుతున్నట్టుగా ఉంటుంది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి అనుభవాలు-జ్ఞాపకాలూనూలో చొక్కా వేసుకోవటానికి చేసిన తిరుగుబాటు వంటివి గుర్తుకువస్తాయి. సత్యం శంకరమంచి ‘హరహర మహాదేవ’ నాటకంలో యువ అర్చకుడు క్రాఫు పెట్టుకోవటానికి ఇటువంటి తిరుగుబాటే చేస్తాడని గుర్తు. ఒకప్పటి సాంఘిక పరిస్థితులను రికార్డు చేస్తాయి కాబట్టి ఇటువంటి రచనలను సాంఘిక చారిత్రక రచనలని అనవచ్చునేమో.

పూర్తి సాంఘిక నవల క్షణికం ఎంతో ఉద్వేగభరితంగా సాగుతుంది. ఇందులో నిర్మల, షర్మిల, వకుళ మొదలైన స్త్రీపాత్రలన్నీ గుర్తుండిపోతాయి. మరీ ముఖ్యంగా చిన్న వయస్సులోనే వితంతువుగా మారిన వకుళ జీవితంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణని, ఆమె పొందిన మానసిక వైక్లబ్యాన్ని ఎంతో ప్రతిభావంతంగా శర్మగారు చిత్రించారు. మనస్తత్వశాస్త్రం మీద శర్మగారికున్న ఆసక్తి ‘స్మృతి’ నాటకంలో కూడా ప్రధానంగా తెలుస్తుంది. తంత్రశాస్త్రంలో ఆయనకున్న లోతైన పరిజ్ఞానం ‘ఉపాసన’ నవలను నడిపిస్తుంది.

ఆయన రాసిన నాటకాలు వివిధ ఆసక్తికరమైన వస్తువులతో సాగుతాయి. ‘ఆకుపచ్చని కోరికలు’ నాటకానికి పర్యావరణ పరిరక్షణ ప్రధానాంశం. దేవీ భాగవతం, కవిత్రయ భారతం కథనాల ఆధారంగా మహాభారత నిర్మాత కృష్ణ ద్వైపాయనుడు (వ్యాసుడు) భారత కథలో తానే పాత్రగా వచ్ఛే అనేక సంఘటనలు కూర్చి తయారుచేసిన నాటకం ‘మహర్షి ప్రస్థానం.’ తాను రాసిన నాటకాలలో తనకు బాగా నచ్చిన వాటిలో ఈ నాటకాన్ని కూడా శర్మగారు పేర్కొన్నారు.

శర్మగారితో కొంచెంసేపు మాట్లాడిన ఎవరికైనా ఆయన సహజ లక్షణంగా తోచేది ఆయన హాస్య ప్రవృత్తి. ‘హాస్య జీవన రక్తి ఉపాస్యమయ్యె’ అని ఒకచోట చెప్పుకున్నారు గానీ చిత్రంగా ఆయన రచనల్లో హాస్య ధోరణి తక్కువగానే కనిపిస్తుంది. అనుభూతి గీతాలను పరిశీలిస్తే ‘ఫెమినిస్టులకు – భ…భ…భయభక్తులతో’ అని రాసిన ఒక గీతం మాత్రం పూర్తిగా వ్యంగ్య ధోరణితో నిండి ఉంటుంది.

ఒక యతడుండును
అతని కామె యుండును
ఉండునా? ఉండును, ఉండదును
ఇరువురిని కలుపునదొక పులి.

ఇలా సాగే ఈ కవిత విశ్వనాథవారి శైలికి పేరడీగా రాసినట్టుగా అనిపిస్తుంది. నివేదనము, స్వస్త్రీ అభిశంస, పరస్త్రీ రిరంస మొదలైన పద్య ఖండికల్లోనూ హాస్యం తొంగి చూస్తుంది. నిత్యావసర కవిత్వం, ఇచ్ఛాగ్ని సంవర్ధినీ వంటి ప్రయోగాలు ఆయన హాస్య ప్రసంగాలలో సర్వసాధారణాలు. క్షణికం నవలలో రమాకాంత్ పాత్ర పరిచయమైన కొత్తలో హాస్యం పండిస్తుంది. ‘జడ పదార్థాలు, ముడి పదార్థాలు’ అంటూ అతను చెప్పే కేటగిరీలు ఆయన ట్రేడ్ మార్క్ హాస్యానికి ఉదాహరణలు. ఆకాశవాణి కోసం ‘ఇరుగు-పొరుగు’ అనే ధారావాహిక కార్యక్రమంలో భాగంగా రాసిన నాటికలు హాస్యరస గుళికల వంటివి. ఆ నాటికలు నలభై వారాలపాటు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయ్యాయి. వాటిలో ఆవకాయ, పుష్కరాలు, గోదానం వంటి శీర్హికలతో ఉన్న భాగాలు చాలా వినోదాత్మకంగా ఉండి మెప్పిస్తాయి.


ఐతే ఒక విషయం మాత్రం తప్పక చెప్పుకోవాలి. ఆయన నాటక సంభాషణల్లో కంటే వ్యక్తిగత సంభాషణల్లోనే ఆయన హాస్య, వ్యంగ్య వైభవం పూర్తిగా పండుతుంది. సంస్కృతాంధ్ర సాహిత్యం, వాటి పరిణామం, ఉపనిషత్తులు, బౌద్ధమతం, తంత్రశాస్త్రం–ఇలా ఏ విషయం గురించి అడిగినా వెంటనే వాటి గురించి అనర్గళంగా మాట్లాడగలిగే విద్వత్తు, ధారణాశక్తి ఆయన సొంతం. నిజానికి నావంటి మితభాషికి ఆయనతో జరిపినది సంభాషణ అనటం అతిశయోక్తే అవుతుంది. ఆయన ఎన్ని గంటలు మాట్లాడినా, తన మాటల్లో హాస్యం, వ్యంగ్యం మేళవించి, దానికి సంబంధించిన పలు సంఘటనల్ని వివరిస్తూ ఆయన చెప్పే తీరువల్ల మనం నవ్వకుండా ఉన్న క్షణాలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఆయనకున్న విశేషమైన అనుభవం వల్ల, రేడియోలోను, పత్రికలలోనూ పనిచెయ్యటంతో ఏర్పడిన పరిపరి పరిచయాల వల్ల ఆయన గుర్తు చేసుకుని చెప్పే ఉదంతాలు ఎన్నో ఉంటాయి. అవెలా ఉంటాయో చూపించటానికి ఉదాహరణగా ఆత్మకథలో పేర్కొన్న ఒక సంఘటన గురించి ప్రస్తావిస్తాను. ఆయన మాటల్లో ఇటువంటివి కోకొల్లలుగా ఉంటాయి.

అవి ఆయన ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న రోజులు. ఒకసారి విరసం సభల నిమిత్తం కుటుంబరావుగారు విజయవాడకు వస్తే, ఆయనను కలవటానికి ఎడిటర్ పురాణంగారితో కలిసి శర్మగారు కూడా వెళతారు. కానీ, అక్కడున్న కార్యకర్త, లోపల కార్యవర్గ సమావేశం జరుగుతోందని, అందువల్ల లోనికి వెళ్ళటానికి వీల్లేదంటూ, వీళ్ళెంత నచ్చజెప్పినా వినకుండా వెనక్కి పంపిస్తాడు. దానితో కోపం వఛ్చిన పురాణంగారు ఒక వ్యంగ్య కథను ప్రచారంలో పెడతారు. ఇలాగే విరసం కార్యవర్గ సమావేశం జరుగుతుండగా గెడ్డం ఉన్న ఒక ముసలాయన వస్తాడు. లోపలి వాళ్ళతో వెంటనే మాట్లాడాలని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆ కార్యకర్త సాయంకాలం రమ్మని పంపించేస్తాడు. నిరాశతో వెనుదిరిగిన ఆయన్ని, ‘ఇంతకీ మీ పేరేంటి సార్?’ అని అడుగుతాడు. దానికాయన ‘నన్ను కార్ల్ మార్క్స్ అంటారు బాబూ!’ అని చెప్పి వెళ్ళిపోతాడు.

హాస్య సంభాషణ, ప్రసంగమే కాదు, అటువంటి మోనోలాగ్ ఒకటి ఆయన నుండి వినే అవకాశం ఒకసారి కలిగింది. 2001 తానా సభల సందర్భంగా అమెరికా వచ్చినప్పుడు, ఆయన, జానకీబాలగారు మా ఊరు కూడా వచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఒకచిన్న సమావేశంలో ‘సాహిత్యంలో హాస్యం’ అన్న అంశం మీద ప్రసంగించిన తరువాత, తూర్పుగోదావరి జిల్లా యాసతో ఒక మోనోలాగ్ చెప్పారు. అందులో అక్కడివాళ్ల మాటతీరుని, వెటకారాన్ని అనుకరిస్తూ చెప్పే మాటలు ఎంతో వినోదాత్మకంగా ఉంటాయి.

అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆయన హాస్య ధోరణిలో మార్పు లేదు. రెండు సంవత్సరాల క్రితం కలిసినపుడు, ‘బండి బోరుకొచ్చింది’ లాంటిదేదో అని చిన్నగా నవ్వారు. అది ఆటో గరాజ్ వాళ్ళ పరిభాషలో కారు సర్వీసు ముగిసి, ఇంక పర్మనెంటుగా గరాజుకి తిరిగివచ్చేసినప్పుడు వాడే మాట.

ఎపుడూ ప్రచార మాధ్యమాలతో ముడిపడిన ఉద్యోగమే చేస్తూ, ఇతర సాహిత్యకారులతో, స్నేహితులతో సందడిగా ఉండే జీవితం గడిపిన ఆయన, ఛందో బద్ధమైన పద్య ఖండికలతో కూర్చిన తన కావ్యానికి ‘ఏకాంత కోకిల’ అని పేరు పెట్టటమే ఒక చమత్కారం. అది చూస్తే బహుశ ఆయన తనలో తానొక ఏకాంతాన్ని నిర్మించుకున్నారేమో అనిపిస్తుంది. ఆయన కవితలలో అంతర్లీనంగా అటువంటి తలపోత మనకు కనిపిస్తుంది. ఇంతటి అనుభవ సంపదని, అనుబంధాల్ని, ఇన్ని జ్ఞాపకాలను వదిలిపెట్టి ఆ కోకిల ఇప్పుడెక్కడికో ఎలా ఎగిరిపోయింది అని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ‘ఏమయ్యా!’ అంటూ బుజం మీద చేయి వేసి పిలిచే పలకరింపేదో మళ్ళీ వినిపించిందా? ఏది ఏమైనా ఈ కోకిల నిష్క్రమణ తెలుగు సాహితీవనంలో ముగిసిన ఒక ఋతువుకి సంకేతంగా నిలిచిపోతుందనటంలో సందేహం లేదు.
---------------------------------------------------
రచన: విన్నకోట రవిశంకర్, 
ఈమాట సౌజన్యంతో

No comments: