Saturday, September 21, 2019

తెలుగు సినిమాలు స్త్రీ


తెలుగు సినిమాలు స్త్రీ

సాహితీమిత్రులారా!

తెలుగు సినిమాకు సంబంధించిన వరకు స్త్రీ పాత్రల చిత్రీకరణలో పెద్దగా వైవిధ్యమేమీ కనపడదు. అన్నీ మూసపోసిన పాత్రలే. ప్రతి స్త్రీ పాత్ర కూడ స్త్రీల మీద మరింత బురద చల్లేందుకు, మరింత హాని చేసేందుకు ఉద్దేశింపబడినట్లే కనిపిస్తుంది. అడపా, దడపా కొద్దిగా వైవిధ్యం కనిపించినా అది చెప్పుకోదగినది కాదు. స్త్రీలందరూ ఒక్కటే కాదు అంటూ ఉద్యమాలు, వాదాలు గొంతెత్తి అరుస్తున్నా, తెలుగు సినిమా చెవికి అవి చేరడం లేదు. సాంఘికంగా, రాజకీయంగా అణగదొక్కబడిన వర్గాల స్త్రీలను ఎలా చూపిస్తున్నారన్న విషయాన్ని కాసేపు పక్కనపెట్టి (దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది) “స్టాండర్డ్‌” స్త్రీపాత్రలు అంటే అగ్రకుల, మధ్యతరగతి స్త్రీపాత్రల వైపు ఒక్కసారి చూద్దాం.

గృహహింస / సాంసారిక హింసను మగవాడి పౌరుషంగా, ఆడదాని సహనంగా చిత్రీకరించి ఆకాశానికెత్తేయడం తెలుగు సినిమాకు మొదట్నుంచీ ఉన్న గుణమే. నాటి “లక్ష్మమ్మ కథ” నుండి ఈనాడు విడుదలవుతున్న సినిమాల వరకు అన్నీ ఒకే విషయాన్ని రకరకాలుగా చెబుతున్నాయి, చూపిస్తున్నాయి. కాకపోతే ఈ మధ్య విడుదలవుతున్న సినిమాలు ఈ విషయాన్ని చెప్పడంలో కొత్తపుంతలు తొక్కుతున్నాయి. దీనికి ఓ ఉదాహరణ 2000 సంవత్సరంలో విడుదలయిన ఓ శతదినోత్సవ సినిమా. ఇప్పటిదాకా కేవలం కన్నీళ్ళు, త్యాగాలు, పశ్చాత్తాపాలతో నిండిపోయిన గృహహింస ఈ సినిమాలో “జనరంజకమైన” హాస్యంగా మారిపోయింది. ఇంత గొప్ప భావవిప్లవం బహుశా ఏ ఉద్యమమూ సాధించలేదేమో! తాగుబోతు భర్త భార్యని మాటిమాటికీ చెంప ఛెల్లుమనిపిస్తోంటే అది హాస్యం! విసిగి పోయిన భార్య ఎదురుతిరిగి కసాయిభర్తను చావబాదితే అదీహాస్యమే! తరతరాలుగా శిరోధార్యంగా భావిస్తూ ఊరేగిస్తున్న దిక్కుమాలిన బానిసత్వాన్నే ఇక్కడ వినూత్నరీతిలో ప్రదర్శించారు / బోధించారు.

తోటి మనిషిని చితకబాదడాన్ని కూడా నవ్వు పుట్టించేలా చిత్రీకరించిన సినిమా మేకర్స్‌ది సెన్సాఫ్‌ హ్యూమరా? సినిసిజమా? సినిమాను చాలా శక్తివంతమైన ఆయుధంగా వాడుకోవచ్చని, ప్రేక్షకుల దృష్టికోణంలో విపరీతమైన మార్పును తీసుకురావడానికి ఉపయోగించుకోవచ్చని ఈ సినిమా మరోసారి ఋజువు చేస్తుంది. ఇంతకాలం కన్నీళ్ళు తెప్పించి, కాసులవర్షం కురిపించడానికి ఉపయోగపడిన హింస ఈ సినిమాలో నవ్వులు పుట్టించి, విజయం సాధించడానికి దోహదపడింది. నాలుగు కుటుంబాల కథలో మూడు కుటుంబాలు దాదాపు ఒకేలాగా ఉంటాయి. దిగువ మధ్యతరగతి, చాలీ చాలని జీతాలు, మగవారి వ్యసనాలు, అహంభావాలు, భార్యాభర్తల మధ్య పోట్లాటలు, చివరకు భార్య నోరు మూసుకోవడం / మూయించడం. నాలుగో కుటుంబంలో మాత్రమే ఉద్యోగం చేసే భార్య, భర్త, సహజీవనం, పొదుపు వగైరా, వగైరా. కానీ, కాస్త జాగ్రత్తగా చూస్తే ఆ మూడు కుటుంబాలకూ, ఈ నాలుగో కుటుంబానికీ పెద్దగా తేడా ఏమీ కనిపించదు.

ఈ మూడు కుటుంబాల్లో ఏ భర్తకూ భార్య పట్ల గౌరవం లేదు, ఆపేక్షా లేదు. కాకపోతే వాళ్ళు ఆ “లేనితనాన్ని” వెలిబుచ్చే విధానం లోనే తేడా అంతా. తాగుబోతు పాత్ర భార్యను బూతులు తిడుతూ, కొడుతుంది. మరో పాత్ర భార్యను ఏమేవ్‌, ఒసేవ్‌, అది, ఇది అని సంబోధిస్తూ వుంటుంది. ఇంకో పాత్రేమో భార్యను తిట్టకుండా, కొట్టకుండానే మానసిక హింసకు గురిచేస్తుంది. స్త్రీ ఉద్యోగం చేయడం నేరమో, ఘోరమో అన్నట్లు సాగుతుందీ సినిమా అంతా. ఆ అభిప్రాయం సమాజంలో లేదని కాదు కానీ అలాటి అభిప్రాయాలున్న వాళ్ళు ప్రధానపాత్రలయితే, వాళ్ళ అభిప్రాయాలను ఖండించే ప్రయత్నం సినిమాలో లేకపోతే, ఆ అభిప్రాయాలను బలపరిచినట్లే. భార్యను పురుగు కంటే హీనంగా చీదరించుకుని, తానో సింహంలా పొంగిపోయేవాళ్ళు, తనను ప్రేమించి గౌరవించే భార్యను చితకబాది మోర విరుచుకుని తిరిగే వాళ్ళు ఈ సినిమాలో హీరోలు. పోనీ చివర్లో వీళ్ళలో మార్పేదయినా వచ్చిందా అంటే అదీ లేదు. రెండున్నర గంటలు నానా తిట్లు తిట్టి, దౌర్జన్యం చేసి, కించపరిచి, సినిమా చివర్లో లాంఛనప్రాయంగా భార్యలతో సర్దుకుపోయే పాత్రలు, అప్పుడు కూడా తప్పు ఆడవాళ్ళ మీదే తోసేసి హాస్యాన్ని రేకెత్తిస్తే అది ఎంత ప్రమాదకరమైన ధోరణి! “లక్ష్మమ్మ కథ” లాంటి సినిమాలు ఎన్ని ప్రాణాలు బలితీసుకున్నాయో విన్నాము. అయితే అలాంటి సినిమాల కంటే కూడా ప్రమాదకరమైనది ఈ ధోరణి. ఇలాంటి సినిమాలు నేరుగా స్త్రీల హత్యలకు, ఆత్మహత్యలకు దారితీయక పోవచ్చు కానీ ఆలోచనాధోరణిలో, ప్రవర్తనలో చాపకింద నీరులా మార్పులు తీసుకువచ్చి స్త్రీల పట్ల హింసను పెంచగలవిలాటి సినిమాలు. హాస్యం ముసుగులో హింసని అందంగా జీవితంలో భాగంగా చేయగల సినిమా. చిట్టచివరకు స్త్రీ కూడా ఉద్యోగం చెయ్యాలనుకోవడం తప్పేనని, ఇంట్లోనే స్వర్గం ఉందని, ఉద్యోగం చేయడం ్‌ చేయాలనుకోవడం భర్తను కించపరచడమేనని, అతని శక్తిసామర్య్థాలను శంకించడమేనని అర్థం చేసుకుని భార్య అనే పాత్రలో అందంగా ఇమిడిపోయి ఆనందంగా బానిసత్వం నెరపమనే సందేశం ఇవ్వడమే ఇలాటి సినిమాల పరమార్థం.

మగవాళ్ళను ఉత్సాహపరచి, వాళ్ళ ప్రతిచర్యనూ ప్రోత్సహించి, ఆడవాళ్ళం సర్దుకుపోదాం రమ్మని హితబోధ చేస్తుంది మరో చిత్రరాజం. ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకునే(?) భార్యాభర్తలు, పిల్లలు పుట్టాక భార్య పట్ల భర్త అనాసక్తత, మరో అమ్మాయి ప్రవేశం, ప్రియురాలికి గుణపాఠం, భార్యకు మందలింపు, భర్తకు బుజ్జగింపు ఇదీ ఈ సినిమా వ్యవహారం!

భార్య ఎప్పుడూ చక్కగా అలంకరించుకొని, భర్తకు సకలసేవలు అందిస్తూ, అతని చుట్టూ తిరుగుతూ, అతనికి తన పట్ల ఆకర్షణ తగ్గిపోకుండా జాగ్రత్తపడాలని ఈ సినిమా సందేశం. ఇవన్నీ చేయని భార్య బ్రతుకు అన్యాయమైపోతుందని, భర్త చేజారిపోతాడని నొక్కి వక్కాణిస్తుందీ సినిమా. పెళ్ళయిన తర్వాత, వయసు మీద పడ్డాక, మగవాడిలో కూడ మార్పులొస్తాయని, పెరుగుతున్న బాధ్యతలు, తరుగుతున్న ఆరోగ్యం కారణంగా జీవనశైలిలో మార్పులు జరుగుతాయని మచ్చుకైనా ఆలోచించని సినిమా ఇది. ఏ పరిస్థితిలో భర్త మరో స్త్రీ వైపు ఆకర్షింపబడినా స్త్రీలదే (భార్య, ప్రియురాలు) తప్పని నిరూపించే ప్రయత్నమే ఈ సినిమా. మగవాడిది పసివాడి మనస్తత్వమని ప్రతిపాదిస్తూ, అతని పట్ల ఎంత శ్రద్ధ వహించాలో, ఎంత జాగ్రత్తగా అతన్ని కాపాడుకోవాలో భార్యలకు తెలియజెప్పే వింత ఆలోచనే ఈ సినిమా. ఈ సంఘటనల్లో మగవాడి తప్పేమీ లేదా అంటే లేదనే అంటుందీ సినిమా. నిర్లక్ష్యం చేయడం భార్య తప్పు; ప్రలోభపెట్టి దగ్గరవడం మరోస్త్రీ తప్పు. అక్కడక్కడా భార్యకూ, “నేనూ మీలాగా చేస్తే!” లాటి డైలాగులున్నా, మొత్తం మీద తప్పులన్నీ ఆడవాళ్లమీద వేసేసి కాలరెత్తుకు తిరిగే కథానాయకుడిని నెత్తికెక్కించుకునే సినిమా ఇది. హీరోయిన్‌ మరోస్త్రీ దగ్గరకు వెళ్ళి బ్రతిమాలటాలు, భర్తను సంస్కరించుకునే ప్రయత్నాలు ఇంతకు ముందు సినిమాల్లో కూడ ఎన్నో కనిపించాయి. అయితే ఈ సినిమాలో మరో మలుపు కనిపిస్తుంది.

భాషను ఎంతగా గాయపరిచేలా వాడుకోవచ్చో కూడ నిరూపిస్తుందీ సినిమా. మరోస్త్రీకి బుద్ధి చెప్పే ప్రయత్నంలో ముగ్గురు మగవాళ్ళు ఒకరి తరవాత ఒకరు ఆమె భర్తలుగా ప్రవేశిస్తారు. ఇదంతా భార్య సుగుణాలను ఋజువు చేసి, మరోస్త్రీని దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో భాగం. స్త్రీపురుష సంబంధాలలో, ఆ సంబంధాలకు సంబంధించిన అభిప్రాయాలలో ఎన్నో వాదాలు, వివాదాలు చోటు చేసుకుంటున్న రోజుల్లో కూడ ఒక స్త్రీని ఆమె పూర్వసంబంధాల ఆధారంగా కించపరచడం ఎంత అన్యాయం! అందుకు వాడబడ్డ భాష కుంచించుకుపోయేలా చేసే పదాలు. “ఒకటో మొగుడు, రెండో మొగుడు, మాజీ మొగుడు, కాబోయే నాలుగో మొగుడు” అంటూ ఒక స్త్రీ మనసును, జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కుళ్ళబొడిచేలా అవహేళనగా వాడబడిన ఆ పదాలు కేవలం పదాలు కాదు, మనస్తత్వాలకు అద్దాలు.

ఈ సినిమాలో కూడ హాస్యం పేరిట జుగుప్సాకరమైన సంభాషణలే. “సెవెన్‌ ఇయర్‌ ఇచ్‌”ను దురదగా అనువాదం చేసి దానికి కారణాలు, ఫలితాలు అన్నీ ఎగతాళిగా వివరించే ప్రయత్నం చేస్తుందీ సినిమా. తెలుగు సినిమా చరిత్రలో ఇలాటి సినిమాలేమీ కొత్త కాదు, అరుదూ కాదు. అయితే సమాజంలో లోతుగా పాతుకుపోయిన దురభిప్రాయాలను రూపుమాపే ఉత్సాహం, ఉద్దేశ్యం లేకపోగా వాటిని మళ్ళీ మళ్ళీ మనసుకు హత్తుకునేలా ఉపయోగించడం దారుణం.

వివాహవ్యవస్థను ఆకాశానికెత్తే ప్రయత్నం ఒక ఎత్తయితే, అనుక్షణం స్త్రీ ఆ బంధాన్ని వెయ్యికళ్ళతో ఎలా కాపాడుకోవాలో హెచ్చరించే ప్రయత్నం మరో ఎత్తు. వివాహబంధంలో అభద్రత ఉందన్న విషయాన్ని నిర్వ్దంద్వంగా చెప్పే ప్రయత్నం లేకపోగా ఆ అభద్రతకు స్త్రీనే బాధ్యురాలిగా చెయ్యటమే ఇలాటి సినిమాలను తీర్చిదిద్దుతోంది. సమాజం స్త్రీపై రుద్దిన బాధ్యతలను ఇంకా ఇంకా బలవత్తరం చేసి, స్త్రీని మానసికంగా బంధిస్తాయి ఇలాటి సినిమాలు. సమాజాన్ని ప్రతిబింబిస్తున్నాం అని గప్పాలు కొట్టే దర్శకనిర్మాతలు ప్రతిబింబించేది ఏ సమాజమో అర్థం కాదు.

తెలుగులో చూడదగిన సినిమాలు వస్తున్నాయా, వాటి గురించి ఇంత చర్చ అవసరమా అని కొట్టిపారెయ్యవచ్చు. స్పష్టమయిన ఆలోచనలు, స్థిరమయిన అభిప్రాయాలు, బలమయిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఇలాంటి సినిమాల ప్రభావం నుండి తప్పించుకోవచ్చు. అయితే సినిమాయే ప్రధాన కాలక్షేపంగా, సినిమా వలన ఎంతో ప్రభావితమయ్యే వాళ్ళే మన సమాజంలో ఎక్కువ. ఇలాంటి సినిమాలు అలాంటి ప్రేక్షకులలో తమ అభిప్రాయాలను నాటుతున్నాయి, బలంగా వేళ్ళూనుకునేలా చేస్తున్నాయి. ఇదీ రాజకీయమే. ప్రేక్షకులే ఓటర్లయిన ఈ ఎన్నికలలో సినిమా విజయమే నిర్మాత, దర్శక, రచయితలకు అధికారాన్నిచ్చి అలాంటివో, ఇంకాస్త “ప్రగతి” సాధించినవో సినిమాలు మళ్ళీ మళ్ళీ తీసేలా చేస్తుంది.

***
ఇలాంటి సినిమాలు ఓ వైపుంటే, భరించలేనంత సెంటిమెంటలిజమ్‌ను రుద్దుతున్న సినిమాలు మరోవైపు. అశ్లీలత, హింస కంటె ఈ సెంటిమెంటలిజమ్‌ మరీ భయంకరమైనది. మంగళసూత్రం, మట్టెలు, నల్లపూసలు, పసుపు, కుంకుమ లాంటి సింబల్స్‌ను ఎంతవరకు వాడుకోవచ్చో అంతవరకూ వాడుకుంటున్నారు. ఈ సింబల్స్‌ వివాహబంధానికి మారుపేరన్న ప్రచారం తెలుగుసినిమాల్లో ఎప్పటినుంచో జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్య వస్తున్న సినిమాలలో ఈ ధోరణి మరింత ముందుకు వెళ్ళిందనే చెప్పాలి. భర్తను, వివాహబంధాన్ని పోగొట్టుకోవడమో లేదా కాపాడుకోవడమో ఇతివృత్తంగా ఎన్నో సినిమాలను తీసిన ఓ దర్శకుడు ఈ విషయంలో కొత్తపుంతలు తొక్కాడు. స్త్రీ అంటే తనకు ఎంతో గౌరవమని, స్త్రీని చులకనగా చూపించలేనని చెప్పే ఈ దర్శకుడు ఇంతకు ముందు చర్చించిన సినిమాలోని “మరోస్త్రీ” పాత్రను అంత అవహేళనగా ఎలా సృజించాడో అర్థం కాదు. ఈయనే దర్శకత్వం వహించిన మరో సినిమాలో కథానాయిక విడాకుల తంతు కూడ వివాహం లాగానే జరగాలంటుంది, ఆహ్వానపత్రాలతో సహా. ఇందులో ఉచితానుచితాల విషయం ఎలా వున్నా, ఆమె మెడలోని మంగళసూత్రం తీసేయాలని బయలుదేరిన హీరోకు ఆమెలో దైవత్వం కనిపించడం సెంటిమెంటలిజమ్‌కు పరాకాష్ట. డబ్బు పట్ల దురాశతో భార్యను, మరోస్త్రీని మోసగించడానికి, ముంచేయడానికి కూడ వెనుకాడని వ్యక్తిని మంగళసూత్రం మార్చేస్తుందా? వ్యక్తుల కంటె, బంధాల కంటె చిహ్నాలకే విలువనిస్తూ గ్లోరిఫై చేస్తున్న పద్ధతి ఖచ్చితంగా మారాలి. ఒకవేళ పైన చెప్పిన సంఘటనను ఒప్పుకున్నా, తన మీద ప్రేమతో కాదు తన మెడ లోని నగ మీద భయంతోనో గౌరవం తోనో వివాహబంధాన్ని తెంచుకోలేదన్న నిజం ఏ స్త్రీకైనా ఎంత బాధాకరం!

ఇలాంటి సినిమాలన్నీ కూడ స్త్రీలకు ఒకటే ఉద్బోధిస్తాయి అణగదొక్కే సంప్రదాయానికి కట్టుబడమని, అణగదొక్కబడమని. వ్యక్తిత్వం గురించి, స్వాతంత్య్రం గురించి మాట్లాడే స్త్రీపాత్రలను నెగెటివ్‌గా చూపించడం సమకాలీనతను, సమాజాన్ని ప్రతిబింబించడమా? స్త్రీ జీవితంలో వస్తున్న మార్పులు, ఆమె ఎదుర్కొంటున్న సమస్యలు, మారుతున్న జీవనశైలి వీటన్నిటినీ ఏ మాత్రం చూపిస్తున్నాయి? పెరుగుతున్న బాధ్యతలతో సతమతమవుతూ ఓ వైపు, నింగినందుకోవాలన్న ఆశయాలతో ఉప్పొంగిపోతూ మరోవైపు వెలిగిపోతున్న 21వ శతాబ్దపు స్త్రీమనోభావాలకు అద్దం పట్టే ప్రయత్నం నిజంగా జరుగుతోందా?

మహిళాసంఘాలను కించపరచడం, స్వేచ్ఛ అన్న పేరెత్తితే విచ్చలవిడితనం అన్న ముద్ర వేయడం, వ్రతాలు నోములను భారతీయస్త్రీ ప్రథమకర్తవ్యంగా మనముందు నిలపడం ఇవీ తెలుగుసినిమా సాధించిన విజయాలు. సమాజం నుండి పాత్రలను తీసుకోవడం కన్నా సమాజానికి ప్రమాదకరమైన సిద్ధాంతాలను సరఫరా చేస్తోంది తెలుగుసినిమా.
----------------------------------------------------
రచన: సునీతారాణి, 
ఈమాట సౌజన్యంతో

No comments: