మూడు “ప్రార్థన” పద్యాలు
సాహితీమిత్రులారా!
ప్రార్థన పద్యాలు అనంగానే, సాధారణంగా మనకు గుర్తుకొచ్చేవి మనం చిన్నప్పుడు బట్టీ పట్టిన పద్యాలు. “ తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్,” అన్న పద్యమో, “సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ,” అన్న శ్లోకమో, లేకపోతే, “తుండము నేకదంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్” లాంటి పద్యమో చటుక్కున స్ఫురిస్తుంది.
నేను ప్రస్తావించబోయే ప్రార్థన పద్యాలు, మనం చిన్నప్పుడు నేర్చిన పద్యాల వంటివి కావు. అంతేకాదు. మనం పెద్దైన తరువాత, ఏ కావ్యాలనుంచో, ప్రబంధాలనుంచో, నేర్చుకున్న పద్యాలూ కావు. అంటే, “శ్రీరామా కుచమండలీ మృగమద శ్రీగంధ సంవాసిత స్ఫారోదార భుజాంతరుండు,” లేదా, “అంకము జేరి శైలతనయాస్తనదుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అవ్వలి చన్ కబళించబోయి,” లాంటి శృంగారరస భూయిష్టమైన ప్రార్థన పద్యాలు అసలే కాదు.
చిన్నప్పటి ప్రార్థన పద్యాల్లో, నాకు మంచి జరగాలనో, లేకపోతే నేను ప్రారంభించిన పని సవ్యంగా నిర్విఘ్నంగా జరగాలనో, అనే స్వార్థఫలాపేక్షత ఉంటుంది. కావ్యప్రబంధ ప్రార్ధన పద్యాల్లోకూడా ప్రభువుకి, తనకీ శుభం జరగాలనే వాంఛ ఉంటుంది.
ప్రార్థన అంటే, అడగటం, యాచించడం అని అర్థం. తనకి నప్పిన దేవుడినో దేవతనో తన మంచి కోసం యాచించటం ప్రార్థన ముఖ్య లక్ష్యం. ఆలోచించి చూస్తే, ప్రభువుకి శుభం కోరుకుంటూ, దేవుణ్ణి యాచించడం కూడా స్వార్థమే. ప్రభువు బాగుంటే, కవికీ సుఖమే.
ప్రార్థన పద్యంలో, సాధారణంగా మనం కవి ఏమి కోరుతున్నాడో అన్నదానికి ప్రాధాన్యత నిస్తాము. కవిని వ్యక్తిగా చూడం. కవి ఏ విషయాలకు, ఎందుకని ప్రాథాన్యతనిస్తున్నాడో పట్టించుకోము. నేను వ్యాఖ్యానించబోయే ప్రార్థన పద్యాలలో కవి నమ్మిన విలువలు తన కోరికలకన్నా ముఖ్యం.
నేను ప్రస్తావించబోయే మొదటి “ప్రార్థన” పద్యం యాచన పద్యమే కాని, స్వార్థం కోసం అడుక్కునే పద్యం కాదు.
దేవరకొండ బాలగంగాధర తిలక్ 1963 లో రాసిన పద్యం “ ప్రార్ధన.”
దేవుడా
రక్షించు నాదేశాన్ని
పవిత్రులనుండి పతివ్రతలనుండి
పెద్దమనుషులనుండి పెద్దపులులనుండి
నీతుల రెండునాల్కలు సాచి బుసలు కొట్టే
నిర్హేతుక కృపాసర్పాలనుండి
లక్షలాది దేవుళ్ళనుండి వారిపూజారులనుండి
వారి వారి ప్రతినిధులనుండి
సిద్ధాంత కేసరులనుండి సిద్ధులనుండి
శ్రీ మన్మద్గురుపరంపరనుండి
దేవుడా
నలభై కోట్ల మనుష్యుల నిజమైన ప్రాణం వున్న
మనుష్యులతో నిండిన దేశం నాది
ఆకలీ బాధలూ ఆందోళనలూ సమస్యలూ
విరివిగా వున్న విచిత్ర సౌధం మాది
కడుపునిండుగా ఆహారం గుండెనిండుగా ఆశ్లేషం
బ్రతుకుపొడుగునా స్వతంత్రం
కొంచెం పుణ్యం కించిత్ పాపం
కాస్త కన్నీరు మరికాస్త సంతోషపు తేనీరూ
చాలు మాకు తండ్రీ
సరదాగా నిజాయితీగా జాలి జాలిగా
హాయిహాయిగా బ్రతుకుతాం
మాకు నటనలు వద్దు మాచుట్టూ కటకటాలు వద్దు
గొప్పలూ గోసాయి చిట్కాలు వద్దు
దేవుడా
కత్తి వాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా
ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు
మానవ చరిత్ర పుటలలో నెత్తురొలికి
మాసిపోయిన అక్షరాల్ని వివరించు
రహస్యసృష్టి సానువులనుండి జారిపడే
కాంతి జలపాతాన్ని చూపించు
మమ్మల్ని కనికరించు
చావు పుట్టుకలమధ్య సందేహం లాంటి
జీవితంలో నలువైపులా అంధకారం
మంచిగంధంలాగ పరిమళించే మానవత్వం
మాకున్న ఒకే ఒక అలంకారం
మజిలీ మజిలీ కి అలిసిపోతున్నాం
మలుపుమలుపికీ రాలిపోతున్నాం
ఆశల వెచ్చని పాంపుమీద స్వప్నాల పుష్పాలు జల్లుకొని
ఆదమరిచి కాసేపు విశ్రమించడానికనుమతించు తండ్రీ.
ఈ పద్యాన్ని మూడు భాగాలు చేసి చూస్తే వ్యాఖ్యానం తేలిక. మొదటి భాగంలో, కవి ఫలానా ఫలానా వాళ్ళబారినుంచి నా దేశాన్ని రక్షించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. యాచిస్తున్నాడు అన్నా తప్పు లేదు. దేశప్రజలని ముఖ్యంగా రాజకీయ దురంధరులనుంచి రక్షించమంటున్నాడు. పెద్దపులులనీ, పెద్దమనుషులనీ (వీళ్ళు కవి ఉద్దేశంలో రాజకీయ నాయకులే) ఒకే ఊపులో కలిపాడు. అది చక్కని విశేషం. నిజమో కాదో నాకు తెలీదు కానీ, పెద్దపులి తను కన్నపిల్లలని, తనే తింటుందని నానుడి.. అంతే కాదు. ఈ పెద్దపులి జాతివాళ్ళు, “నీతుల రెండునాల్కలు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపాసర్పాలు,” కూడాను. వాళ్ళబారినుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాడు, తిలక్. ఈ భాగంలో తిలక్ గొప్ప అభ్యుదయవాదిగా (progressive) కనిపిస్తాడు. అంతేకాదు, ఇంతకు పూర్వం ప్రజలలో “దేవుడి” గురించి స్థిరపడ్డ అభిప్రాయాలని ఖండించిన వాడిగా కనిపిస్తాడు.
రెండవ భాగంలో తన దేశప్రజల ఆశలు, ఆవేదనలు, వాళ్ళ చిరు కోరికలు ఆ దేవుడికి చెప్పుతున్నాడు. “కడుపునిండుగా ఆహారం గుండెనిండుగా ఆశ్లేషం, బ్రతుకుపొడుగునా స్వతంత్రం, కాస్త కన్నీరు మరికాస్త సంతోషపు తేనీరూ చాలు మాకు తండ్రీ,” అని చెపుతూ, “సరదాగా నిజాయితీగా జాలి జాలిగా హాయిహాయిగా బ్రతుకుతాం,” అని హామీ ఇస్తున్నాడు. మొదటి భాగంలో దేవుడు చెయ్యవలసిన పని పూర్తి చేసినతరువాతే ఈ హామీ అని మనం ఊహించుకోవాలి. రెండవ భాగానికొచ్చేటప్పటికి, తిలక్ మానవతావాదం, humanism ని మనం చూస్తాం.
మూడవ భాగం మొదటి నాలుగు చరణాలూ చదవంగానే తిలక్ మనకి ఆరోజులనాటి (60 ల్లో అని నా భావం) వీర అభ్యుదయవాది (ultra progressive) గా ముందుకొస్తాడు. తరువాతి పాదాలలో కవిగా తిలక్ నిజస్వరూపం కనిపిస్తుంది. తిలక్, కృష్ణశాస్త్రి గారి romanticism కి, అభ్యుదయవాదం అందంగా పెనవేసి, ఆనాటి కవిత్వాన్ని, ఒక రెండుమెట్లు పైకి తీసికెళ్ళిన గొప్ప కవి. కాకుంటే “రహస్యసృష్టి సానువులనుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు, మమ్మల్ని కనికరించు,” అని రాయలేడు. “మంచిగంధంలాగ పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం,” అని ఇంకేకవి రాయగలడు? ఆఖరి పాదాల్లో వెంటనే తన నిసృహ, disappointment కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది.
తను ప్రార్థిస్తున్న దేవుడు, ఆ దేవుడు ఎవరైతేనేం, తన కోరికలు తీర్చలేడని తిలక్ కి తెలుసు. నాకు చందమామలో జింక కావాలంటే, ఏ దేవుడు ఇవ్వగలడు? తిలక్ ప్రగతి శీలుడైన మానవతావాది. అంటే, ఎప్పటికైనా తన కోరికలు ఏదోరకంగా నెరవేరుతాయని నమ్మిన కవి. మనిషిలో మంచిని నమ్మిన కవి. అందుకనే ఈ పద్యం ఈ శతాబ్దానికి మప్పే చక్కని ప్రార్థన పద్యం అంటాను.
నే చెప్పబోయే రెందవ ప్రార్థన పద్యం, చెరబండరాజు (బద్దం భాస్కర రెడ్డి) రాసిన “వందేమాతరం.” ఇది సెప్టెంబర్ 1968 లో వచ్చిన పద్యం. దిగంబరకవుల మూడవ సంపుటి, “నేటి కుష్ఠు వ్యవస్థపై దిగంబరకవులు,” లో మొదటి పద్యం.
ఓ నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నించున్న “భారతి” వమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
వందేమాతరం వందేమాతరం
ఒంటొమీద గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యం నీది
అప్పుతెచ్చి వేసిన మిద్దెల్లో
కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది
ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో
వీధిన బడ్డసింగారం నీది
అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
వందేమాతరం వందేమాతరం.
చెరబండరాజుకి భారతదేశం, భారతమాత, దేవతా మాత. ఏమీ చేతకాని, ఏమీ చెయ్యలేని కన్న తల్లి. దేవత. భారతమాతకి “దైవత్వం” ఆపాదించి, ఆ దైవత్వం ఒక ప్రతీకగా వాడాడు చెరబండరాజు. ఆ దేవత అందం, యవ్వనం, ముఖ్యంగా శీలం గురించి జుగుప్స కలిగించే మాటలు వాడుతాడు. మాతృదేశం పై విపరీతమైన ప్రేమ అనురాగం ఉన్న వ్యక్తే ఇటువంటి పోలికలు ధైర్యంగా చెప్పగలడు. చరణం చరణం లోనూ తన బాధ, కోపం వ్యక్తం అవుతుంది. “నోటికందని సస్యశ్యామల సీమ,” తన భారత మాత.
తన మాతృదేశదేవత ధైర్యం, దీనత్వం, శోకం, తనని నిలువెత్తునా సిగ్గుతో ముంచేస్తాయి. ఆ దేవత గమ్యం అగమ్యం అయ్యిందని అని వాపోతాడు. అంతకు ముందు ఏ కవీ వాడని ఉపమానాలు, ప్రతీకలూ, అప్పటిలో నవ కవిత్వానికి shock treatment ఇచ్చాయని ఒప్పుకోక తప్పదు. “సమాజం అంతగా పతనమైందా?” అన్న మకుటంతో రాచమల్లు రామచంద్రా రెడ్డి సంవేదన లో ఈ సంకలనాన్నీ సమీక్షిస్తూ దుమ్మెత్తి పోశాడు. ఆ రోజుల్లో దిగంబరకవులు కవిత్వానికి ఇచ్చిన shock treatment గుర్తించలేకపోయాడు. ఇప్పుడు, మూడున్నర దశాబ్దాల తరువాత, భారతమాతలో, అంటే సామాన్య ప్రజల జీవితంలో వచ్చిన మార్పు పరంగా ఈ పద్యాన్ని పరిశీలిస్తే, చెరబండరాజుకి ఆరోజుల్లో వచ్చిన కోపం సబబేనని అనిపించక మానదు. అంతేకాదు. ప్రపంచీకరణకు వ్యతిరేకత ప్రతిధ్వనించే ఈ పద్యం, సమయోచితమైన పద్యం.
చెరబండరాజు నాస్తికుడు. ఇది ప్రార్థన పద్యం అన్నందుకు నేను సంజాయిషీ చెప్పు కోవాలి. తిలక్, చెరబండరాజు, ఇద్దరూ, భారతదేశ శ్రేయస్సు కోరుకుంటూ బాధ పడ్డవాళ్ళే. తిలక్, తనకు తెలియని దేవుణ్ణి మార్పు కోసం ప్రార్థించాడు, ఆ దేవుడు ఏమీ చెయ్యలేడని తెలిసికూడా. చెరబండరాజు తను చిత్రించిన దేవత, తన భారతదేశం, గమ్యం తెలియక కొట్టుమిట్టాడుతున్న దేవత. మార్పు కోసం తపించే కవికి దేవత. మార్పు తప్పకుండా రావాలనే కోరిక, మార్పు తప్పకుండా వస్తుందనే గాఢ నమ్మకం ఉండబట్టే ఇంత విసురుగా రాయగలిగాడు. ఆ నమ్మకం అతనికి ఉందని నేను నమ్మబట్టే, ఇదికూడా ప్రార్థన పద్యం అన్నాను.
మూడవ ప్రార్థన పద్యం, జి. యస్. రామ్మోహన్, ఏప్రిల్ 2003 న ఆంధ్రజ్యోతి లో ప్రచురించిన, “యుద్ధప్రభు స్తోత్రము.” ముందుగా పద్యాన్ని చదవండి. ఒకటి కి రెండుసార్లు చదవండి. అప్పుడు దీనిని ప్రార్థన పద్యం అని ఎందుకు అన్నానో బోధ పడచ్చు.
పెద్ద శబ్దముతోనూ, మిరుమిట్లు గొలుపు కాంతులతోనూ నీ రాకడ ప్రకటించుచున్న ప్రభువా
పూమొగ్గలకు కరవాలము బదులొసగిన కరుణామయుడా
పసిబుగ్గలను లోహవిహంగాలతో గిల్లిన క్షిపణాగా
ముల్లోకములకు శక్తిమంతుడవైన అయ్యా
నిన్నేమని పిలిచెదము తండ్రీ.
లక్షలాది ఆదిమవాసుల బలిపీఠమును ఆసనముగా
మార్చుకున్న రారాజా
ఏడుజాములలో మెసపొటేమియా చంద్రుణ్ణి ఎర్రబార్చిన వాడా
ఆదియు అంతమూ మూలమూ లేక అంతటా నీవై
కంచరగాడిదలా సంచరించు సర్వేశ్వరా
అణువు పరమాణువు అన్నీ తానైన వాడా
నిన్నెన్నని అనమురా నాయనా
రంగునీళ్ళిచ్చి రక్తాన్ని కొలుచుకు పోగలిగిన బుద్ధిశాలీ
సమాచారమే జ్ఞానమని, బలమే సత్యమని మా చక్షువులు తెరిపించిన దివ్యమూర్తీ
నీ రక్తముతో పాప పరిహారము చేసుకొనుటకు లోకము వేచియున్నది నాయనా
నీఘనతను బలపరుచుటకు
ఒక శిలువను తయారుచేయుచున్నారము తండ్రీ.
ఆమెన్
గ్రీకు పురాణాలలో ఆరెజ్ (Ares) అనబడేవాడు యుద్ధ దేవుడు. మన దేవుళ్ళలో కేవలం యుద్ధం యుద్ధంకోసమే కోరే దేవుడెవడూ ఉన్నట్టూ కనిపించడు. ఈ ఆరెజ్ గురించి కొంత వివరణ అవసరం. ఆరెజ్, గ్రీకు పురాణాలలో జూస్ అనే వాడి కొడుకు. గిల్లి కజ్జాలు పెట్టుకోవడం ఆరెజ్ కి సరదా. వీడికి, యుద్ధంలో గెలుపు, ఓటమీ ముఖ్యం కాదు, కేవలం రక్తపాతమే ముఖ్యం. పరమ దుర్మార్గులు వీడి సహాధ్యాయులు. ఎల్లప్పుడూ వీళ్ళవెన్నంటి కరువుకాటకాలు, బాధ, సంక్షోభం ఉంటాయి. ఆరెజ్ అన్నా, వాడి పనులన్నా, వాడినాన్న జూస్ కి కూడ అసహ్యమే! యుద్ధప్రభు స్తోత్రాన్ని, ఈ నేపథ్యంలో చదవాలి.
అయితే, ఈ పద్యం రామ్మోహన్ ఎవరిని ఉద్దేశించి రాసాడో చెప్పడం అనవసరం అనుకుంటాను. ఈ పద్యంలో వ్యాజ స్తుతి లేదు, వ్యాజ నిందే ఉన్నది. ప్రతి ఒక్క పాదమూ, ఒక వ్యంగ్య సూక్తి. పాదపాదనికీ కొట్టొచ్చినట్టు కనుపించేది ప్రస్తుత ప్రపంచ రాజకీయాలపై వ్యంగ్యం. మతానికి సంబంధించిన పూర్వకథలన్నీ కవి వ్యంగ్యానికి చక్కని ప్రతీకలు. అనవసరమైన అరుపులు, అర్థంలేని నినాదాలు ఏమీ లేకుండా, ఈ క్రొత్త “యుద్ధదేవుని” పై సహజమైన అసహ్యతను, చక్కని చిన్న చిన్న మాటలలో పేర్చి, ఈ “దేవుడి” నిజ స్వరూపాన్ని బట్టబయలు పెట్టిన పద్యం ఇది. ఈ మధ్య కాలంలో ఇంత చక్కని వ్యంగ్య పద్యం రాలేదు.
ఆరెజ్ తో నే పోల్చిన ఈ యుద్ధదేవుడి లక్షణాలు చాల విచిత్రంగా కనుపిస్తాయి. ఇది ప్రస్తుతం జరుగుతున్న చరిత్ర. “లక్షలాది ఆదిమవాసులను బలిపీఠమును ఆసనంగా చేసుకొని, అణువు పరమాణువు తానేఅయి, రంగునీళ్ళిచ్చి రక్తం కొలుచుకోపోగలిగిన బుద్ధి శాలి, ఈ “దేవుడు.” వీడి రక్తముతో పాపపరిహారం చేసుకోటానికి లోకం వేచియున్నది అన్న పాదం చదవగానే, ఒక్క క్షణం క్రీస్తు ప్రభువు స్పృహకి రాక మానడు. కానీ ఆ పాదంలో క్రీస్తు ప్రసక్తి ఏమాత్రమూ లేదు. క్రీస్తు కి పూర్తిగా వ్యతిరిక్త ప్రతీక, ఇది. క్రీస్తు ప్రభువుకి శిలువ వేయడం మూలంగా ప్రపంచ ప్రజల బాధలు మరుగున పడలేదు కానీ, ఈ యుద్ధ ప్రభువుని శిలువపైకెక్కించితే, ప్రపంచ ప్రజలు కాస్తన్నా సుఖపడతారన్న నమ్మిక ఈ పద్యం వెనుక ఉంది.
ఇంతకు ముందు చెప్పిన రెండు పద్యాలనీ ప్రార్థన పద్యాలు అన్నందుకు నామీద కోపాం రాక పోవచ్చు. కానీ, ఇది ప్రార్థన పద్యం అన్నందుకు, చాలమందికి కోపం రావచ్చు. నా ఉద్దేశం లో ఈ పద్యం, పై రెండు పద్యాలకన్నా గొప్ప పద్యం. విలువ కట్టలేని, విలువ కట్టకూడని పద్యం. రక్తం కోరే “ప్రభువు” ల బలాధిక్యతని ఈసడించుకునే పద్యం. ఇది ఏ విధంగానూ యాచన పద్యం కాదు. ఇది మనమందరం అహర్నిశలూ గుర్తుంచుకోవలసిన మంచి పద్యం. అందుకనే ఇది ప్రార్థన పద్యం.
ఆఖరిగా ఒక మాట.
ఋగ్వేదంలో పదవ మండలంలో నూటముప్ఫై ఒకటవ సూక్తం, నాసదీయ సూక్తం అంటారు. ఏదు శ్లోకాలలో సృష్టి క్రమాన్ని సూచిస్తూ చెప్పిన సూక్తం, నాసదీయ సూక్తం. ఆఖరి శ్లోకం సృష్టికర్త (?) అస్తిత్వాన్ని, ఎరుకనీ, శంకింస్తుంది. ఈ సృష్టికర్త (?) పరమ అమాయకుడా??
ఋగ్వేదంలో దేవతలపై ప్రార్థనలన్నీ ఒక ఎత్తు. ఈ ఒక్క సూక్తం ఒక ఎత్తు. ఈ సూక్తాన్ని అనేకమంది అనువదించారు, వ్యాఖ్యానించరు. దీనిపై బోలెడు రాశారు. ఈ సూక్తంలో ఏదవ శ్లోకంఇది.
ఇయం విసృష్టిర్యత అ బభూవ
యది వా దధే యది వా న
యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్ త్సో
అంగవేద యది వా న వేద
Whence all creation had its origin,
he, whether he fashioned it, or whether he did not,
he who surveys it all from highest heaven,
he knows – or may be even he does not know.
– A. L. Basham’s translation.
నేను చెప్పిన మూడు ప్రార్థన పద్యాలలో, ముఖ్యంగా చివరి రెండు పద్యాలనీ కాస్త లోతుగా తరిచి చూస్తే, పైన చెప్పిన ఋగ్వేద సూక్తం ఆఖరి శ్లోకం ఆఖరి పాదం స్పర్శ కనిపించక మానదు. ఆలోచించండి.
-----------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు,
ఈమాట సౌజన్యంతో
1 comment:
ఆ సత్యవస్తువేదో ఒక్కటిగా పడుండకుండా తామరతంపర గా సృష్టి చేసి అందరినీ అనునిత్యం కుళ్ళబొడుస్తూ మళ్ళా ఉన్నది ఒక్కటే తెలుసుకోండి రా అని వేధించడం ఏమిటి. ఏమి సాడిజం ఇది.
Post a Comment