Saturday, September 7, 2019

థాయ్‌లాండ్ యాత్రాగాథ-2


థాయ్‌లాండ్ యాత్రాగాథ-2





సాహితీమిత్రులారా!

రైల్వే మార్కెట్టూ – జలవిపణీ

ఖేహా స్టేషన్లో దిగీదిగగానే కుడివేపున దక్షిణంగా సాగిపోతోన్న సుఖమ్‌విట్ రాజమార్గం, ఎడమవేపున పచ్చరంగు నీళ్ళతో నలభై అడుగుల వెడల్పు ఉన్న కాలువ. రోడ్డుకూ కాలువకూ మధ్యన అతిచక్కని కాలిబాట, కాలిబాటకూ కాలువకూ మధ్య గుల్‌మొహర్ పూలచెట్లూ… భలే! నా నడకకు అనువయిన వాతావరణం అమిరిందే అని గొప్ప సంతోషం కలిగింది.


ఆశ్చర్యంగా ఆ కాలువ మీద అడుగడుగునా వంతెనలు కనిపించాయి. కొన్ని పక్కా కాంక్రీటు వంతెనలు, ఎక్కువగా చెక్క వంతెనలు. అందులో కొన్ని నలుగురు మనుషులు ఒకేసారి నడిస్తే ఓపలేవు అనిపించే అల్ప వారధులు. విచిత్రమనిపించింది. మెల్లగా పరిశీలించాను. కుడివేపున ఉన్న సుఖమ్‌విట్ హైవే ఆధునిక నగరానికి ప్రతీక అయితే వంతెనలు అవతల ఉన్న జనావాసాలకూ ఆ నగరపు నీడకూ ప్రతినిధులు అని బోధపడింది. ఆ అల్పవారధుల అవతల సన్నకారు చిన్నకారు మనుషుల ఇళ్లున్నాయి. పదిళ్లకో వంతెనలా కట్టుకున్నారు. మళ్లా అందులో కాస్త గట్టిపాటి ఇళ్లకు దిట్టమైన వంతెనలు, మరీ బడుగుజీవుల ఇళ్లకు ఈసురోమంటున్న వంతెనలు…


అటువేపుకు వెళ్లి ఆ ఇళ్లనూ ఆ వంతెనలనూ చూడాలనిపించింది. మనుషుల్ని పలకరించాలనిపించింది. కాలిబాట పక్కన ఏదో పనిచేసుకొంటోన్న ఓ అరవై ఏళ్ల పెద్దాయన్ని పలకరించాను. అదృష్టవశాత్తూ తడిపొడి ఇంగ్లీషు మాటలు మాట్లాడగలిగాడతను. “ఆ వంతెన అవతల ఉన్నది మా ఇల్లే!” అన్నాడు. “రావచ్చా…” అని అడిగితే ముసిముసి నవ్వుల సంకోచంతో రమ్మని పిలిచాడు. వెళ్లాను.


ఇంట్లో అతని భార్యా కొడుకూ వాళ్ల చక్రాల బండి ఫలహారశాలను సిద్ధపరుస్తున్నారు. లంచ్ సమయానికల్లా ఆ దగ్గర్లోని ఆఫీసు భవనాల దగ్గరకి చేరుకోవాలట, అందుకని కాస్త హడావుడి. వాళ్ళు మరీ నిరుపేదలు కాదు కాని, బీదవాళ్లకిందే లెక్క… బీదతనమేగానీ బేలతనం కనిపించలేదా కుటుంబంలో. ఆ పక్కనే ఉన్న ఎనిమిదీ పదీ ఇళ్లల్లో కూడా ఇదే రకపు సందోహం. అన్నట్టు ఆ చక్రాల బళ్లు మనుషులు తోసుకుని తీసుకువెళ్లేవిగాదు, మోటారు బిగించినవి. ఇళ్లమధ్య సన్నపాటి సందులు… ఓ వారన నాణెం వేస్తే మంచినీళ్లు వచ్చే మిషను… ఆ హడావుడిలోనే తమ ఆటపాటల్లో ఆరేడేళ్ల పిల్లలు… స్కూళ్లకు వెళుతున్నారా? చదువుకొంటున్నారా? ఆ వివరాలలోకి వెళ్లడానికి భాష రాదు, సమయమూ లేదు. బడుగు జీవుల జీవనసరళిని కొద్దిసేపైనా చూడగలిగానన్న భావన కలిగింది.


ఆ కొత్త స్నేహితుల ఇంటిలోంచి బయటపడి, కిర్రు శబ్దాల వంతెనను దాటుకొని మళ్లా రహదారీ, కాలువల మధ్యగా సాగే కాలిబాట చేరాను. కాలువలోకి తొంగి చూసి తమ తమ ప్రతిబింబాలకు మురుస్తోన్న గుల్మొహర్లు, రేలపూలు. అవతలి ఒడ్డున స్ఫుటంగా కనిపిస్తోన్న బౌద్ధమందిరం, మధ్యలో ఆకులూ పూలతో కాలిబాట మీద ఆర్చీలు… అక్కడక్కడా బస్సు స్టాపులు… అడపాదడపా పక్కనుంచి దూసుకుపోతున్న సెవన్ సీటర్లు… ఎక్కడైనా ఆగి ఆ ఏన్షియెంట్ సిటీదాకా ఏదైనా బస్సో సెవన్ సీటరో ఎక్కుదామా అనిపించినా అది నా యాత్రాస్ఫూర్తికి విరుద్ధం అనిపించి నడుస్తూనే ముందుకు సాగాను.


దూరంనుంచి ఏదో కావడి మోసుకుంటూ ఓ నీలిరంగు దుస్తుల వ్యక్తి. దగ్గరకొచ్చేసరికి ఆ వ్యక్తి ఓ పాతికేళ్ల యువతి అనీ, ఆ కావడిలో ఉన్నవి తన చిరువ్యాపార సామగ్రి అనీ అర్థమయింది. మనిషి చూస్తే ఏదో సరదాగా కావడి మోస్తోన్న కాలేజీ విద్యార్థినిలా ఉంది. ఆ కాలువ, ఆ గుల్మొహర్ పుష్పాలు, ఈ నీలిరంగు మనిషి… నాలోని ఫోటోగ్రాఫర్ ఆశపడ్డాడు. కాస్తంత సందేహిస్తూనే సైగలతో, హావభావాలతో “ఓ ఫోటో తీసుకోనా?” అని అడిగాను. “నన్నా! ఫోటోనా!” అంటూ ఆమె గొప్పగా సంబరపడిపోయి, కావిడి దించి తనను తాను సరిదిద్దుకొని ఫోటోకు పోజిచ్చింది. తీసిన ఫోటో చూపిస్తే గొప్ప సంతోషం పడిపోయింది. మా ఇద్దరి సంతోషాలూ కలగలసి మూడురెట్లయినంత సంబరం!


గూగుల్ మ్యాప్‌ను అడిగితే మూడూ మూడున్నర కిలోమీటర్లు వచ్చేశానని చెప్పింది. రహదారి దాటి కుడిపక్కకు వెళ్లే దారులు పట్టుకొంటే జలధి దర్శనమవుతుందనీ చెప్పింది. ఒక ఫుట్‌ఓవర్ బ్రిడ్జి సాయంతో రోడ్డు దాటాను. పక్కనే మయామీ బజార్ అన్న సువిశాల ప్రాంగణం. ఆ పక్కనే ఏదో మోటారు కంపెనీ అనుకొంటాను, ఆ హడావుడి. మధ్యలో ఓ సన్నపాటి దారి. ఆ దారి చివరన, జలతీరాన సీఫుడ్ రెస్టారెంట్ ఉందని మ్యాప్ చెపుతోన్న వివరాలు… ఆ పేరు ఆకర్షించింది.

కాస్త సందేహిస్తూనే ఆ సన్నదారిని పట్టుకొన్నాను. దిగువ మధ్యతరగతి కాలనీ ఏదో అటూ ఇటూ విస్తరించి కనిపించింది. చిన్న చిన్న దుకాణాలు. హేమక్స్‌లో ఊగుతోన్న యువకులు… మోటారు సైకిళ్ల మీద ఆగి కబుర్లు చెప్పుకొంటొన్న కుర్రకారు… మరీ సందేహంగా కాదు కానీ కాస్తంత కుతూహలంగా నావేపు చూపుల సారింపులు. ఆ సందేహాలకూ కుతూహలాలకూ సమాధానంగా నా చిరునవ్వులు.

రెస్టారెంటు చేరాను. మరికాస్త ముందుకెళితే మూడడుగుల ఎత్తు–వందల మీటర్ల పొడుగున్న–గోడ. ఆ గోడను ఆనుకొని చక్కని రోడ్డు… ఏవిటీ, సముద్రానికి చెలియలికట్ట కట్టారా అనుకొంటూ గోడదాకా వెళితే చిన్న నిరాశ!


చక్కగా కెరటాలతో, ఇసుక నిండిన తీరంతో కనిపిస్తుందనుకొన్న సముద్రం మహా నిశ్చలంగా, ఒడ్డున నల్లటి బండరాళ్లతో కనిపించింది. పోనీ కనుచూపు మేరదాకా అందని జలరాశి ఉందా అంటే అదీ గాదు. ఎదురుగా నీరే గానీ కుడి ఎడమల–దూరంగానే అయినా–భూభాగాలు. ఏమిటిదీ అని గూగుల్‌ని ప్రశ్నిస్తే, నువ్వు ఇపుడు నిలుచున్నది అచ్చమైన సాగరతీరం కాదు. నువు బ్యాంకాక్ నగరంలో గమనించిన ఛోప్రయా నది తన నడక సాగించి సాగరంతో సంగమిస్తోన్న ప్రదేశం ఇది. నిఝంగా బీచులు కావాలంటే మరో రెండుమూడు కిలోమీటర్లు ఎడమగా నడవాలి అని బోధపరచింది!

ఆ జలతీరపు రెస్టారెంటూ, అక్కడి వాతావరణమూ, స్పీకర్లలో వినిపిస్తోన్న థాయ్ సంగీతమూ నన్ను ఆకట్టుకొన్నాయి. అప్పటికే గంటా రెండుగంటలుగా ఎండంతా నాదే! కాస్సేపు నీడపట్టున ఆగుదామనీ, ఇలాంటి సమయాల్లో నాకు బాగా ఇష్టమైన పెప్సీ తాగుదామనీ అనిపించింది. లోపలికి నడిచాను. వేళగాని వేళ దేశంగాని దేశం నుంచి అలా ఓ మనిషి నడచి రావడం వాళ్లను ఆశ్చర్యపరిచింది… వాళ్ల దగ్గర ఉన్న ఫ్రిజ్‌లో కనిపిస్తోన్న పెప్సీని చూపించి కావాలన్నాను. ఎంత? అని అడిగితే కౌంటరు మనిషి కాలుక్యులేటర్లో పదిహేను అంకె వేసి చూపించాడు. సరే అంటే సరే అనుకొని, కాస్తంత ఐసుముక్కలు కూడా అడిగి తీసుకొని ఓ పక్క చేరగిలబడ్డాను.


ఏభైమంది పట్టే ఆ గోడలు లేని రెస్టారెంట్లో అంతా కలసి పదిమందైనా కస్టమర్లు లేరు. రెస్టారెంటు చిన్నపాటి తోటలో విస్తరించి ఉంది. చిరు పొదలు, లతలు, కాలిబాటలు, పంజరాల్లో లవ్‌బర్డ్స్- రామచిలుకలు… చక్కని వాతావరణం. అరగంట.

తిరుగు ప్రయాణంలో అక్కడి సెవెన్ సీటర్ అనుభవమూ పొందుదామనిపించింది. రోడ్డువారగా నిలబడి అవి ఎక్కడ ఆగుతున్నాయో గమనించి, ఆగిన ఓ డ్రైవర్ని ఇది ఖేహా స్టేషను వెళుతుందా అని అడిగాను. అతనికి నా ప్రశ్న అర్థం కాలేదు కానీ దాంట్లోంచి దిగుతోన్న ఓ మనిషికి అర్థమయింది. వెళుతుందని నాకు చెప్పి, ఎక్కడ నన్ను దింపాలో డ్రైవరుకు వివరించిందావిడ. పేరుకు అవి సెవెన్‌సీటర్లేగానీ మన మినీ వ్యాన్లంత హుందాగా ఉన్నాయి. ఎక్కువెక్కువమంది ఎక్కితొక్కడాలు లేవు. ఎక్కడబడితే అక్కడ ఆగడాలు అసలే లేవు… క్షణాల్లో రైలుస్టేషను… ఛార్జీ ఏడు బాథ్‌లు.

ఇంటికి చేరేసరికి దాదాపు రెండయింది.

“మీ సాయంత్రం ప్రోగ్రామ్ నేనూ సత్యజిత్తూ ఫైనల్ చేశాం. మా ఊరి నది ఒడ్డున ఇక్కడికి గంట దూరంలో ఏషియాటిక్ రివర్ ఫ్రంట్ అన్న చక్కని నైట్ మార్కెట్ ఉంది. రెండు రైళ్లూ ఓ పడవా ఎక్కారంటే మీరక్కడకు చేరతారు. నేనూ ఓసారి వెళ్లాను, బావుంటుంది.” సంబరంగా చెప్పారు కల్యాణి.

అప్పటిదాకా ఇహ ఈ సాయంత్రమంతా ఇంటిపట్టున ఉండి సేద తీరుదాం అంటోన్న మనసు ఈ కబురు వినగానే బాణీ మార్చి పదపదలెమ్మంది. కనీసం ఓ రెండుగంటలు రెస్టు తీసుకొని అయిదింటికి బయల్దేరదాంలే అని దాన్ని బుజ్జగించాను.

ఆ ఏషియాటిక్ రివర్ ఫ్రంట్‌కు వెళ్లాలంటే ముందు అశోక్ స్టేషన్లో రైలు పట్టుకోవాలి. ఉత్తర దిశలో సాగి సయాం అన్న స్టేషన్లో దిగి మరో రైలు పట్టుకోవాలి. దాంట్లో సఫన్‌టాక్సిన్ అన్న స్టేషన్ దాకా వెళ్లాలి. అక్కడ దిగి నాలుగడుగులు వేస్తే సథార్న్ పీర్ అన్న పడవల రేవు వస్తుంది…

భాష పుణ్యమా అని ఒకటి రెండు పొరపాట్లు చేసినా పెద్దగా కష్టపడకుండానే సఫన్‌టాక్సిన్ స్టేషను చేరాను. కౌంటర్లో ఆవిడను మీ మెట్రో మ్యాపుంటే కాపీ ఇస్తారా అని అడిగాను. హార్డ్ కాపీలు లేవు అంటూనే కౌంటరులో ఉన్న పెద్దపాటి మ్యాపు బోర్డు చూపించింది. దాన్ని ఫోటో తీసుకొనే ప్రయత్నం చేస్తోంటే మ్యాపుకు అడ్డంగా ఉన్న చిన్నా పెద్దా పుస్తకాలను పక్కకు తీసి సహకరించింది. ఇక్కడ రెస్టురూమ్ ఉందా అని అడిగితే, ఉంది అంటూ పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డును పిలచి నాకు దారి చూపించమంది. అతను మరో గార్డుకూ, ఆ గార్డు మరో పారిశుద్ధ్య కార్మికకూ నన్ను అప్పగించగా చివరకు గమ్యం చేరాను. నిజానికది పబ్లిక్ సదుపాయం గాదు. అక్కడి ఉద్యోగుల కోసం ఉన్న సౌకర్యమది. అయినా ఆ విచికిత్స లేకుండా ఎంతో మర్యాదగా, శ్రద్ధగా నన్ను గమ్యం చేర్చిన ఆ బృందపు బాణీ చాలా ముచ్చట కలిగించింది. ‘అతిథి దేవోభవ’, ‘కస్టమర్లే మా దైవాలు’ లాంటి మహాసూక్తులన్నీ కాగితాలలోంచీ ప్రకటనలలోంచీ నడచి వచ్చి కార్యరూపం దాల్చిన గొప్ప సందర్భమది!


పడవరేవు దాకా చెకచెకా సాగిన నా ప్రయాణం రేవు దగ్గర గుంటపూలు పూసింది. రేవు నుంచి ఏషియాటిక్‌కు పడవలో అరగంట ప్రయాణమట. పడవకు ఛార్జీలేం లేవు. శుక్రవారం సాయంత్రం అవడం వల్ల కాబోలు, విపరీతమైన జనం… పొడవాటి క్యూ. కనీసం అరగంట పడుతుందనుకొన్నది పడవ ఎక్కేసరికి గంట పట్టేసింది. ఈలోగా ఆకాశపు కాన్వాసు మీద సూర్యుడు విరజిమ్ముతోన్న వర్ణచిత్రాలు… అటూ ఇటూ అత్యాధునిక భవనాలు… ‘గంటసేపు’ అన్న విసుగు ఏమాత్రం చూపించని సహయాత్రికులు… వాళ్లెవరికీ లేని విసుగు నాకెందుకూ?!

విసుగు కాదు గానీ ఆందోళన మొదలయింది.


అతి చక్కని పడవ ప్రయాణం ముగించి ఆ ఏషియాటిక్ రివర్‌ఫ్రంట్‌లో అడుగుపెట్టేసరికి ఏడున్నర! ‘అక్కడి సీఫుడ్ చాలా బావుంటుంది, రుచి చూడు’ అని సత్యజిత్ చెప్పారుగానీ అందుకు సమయం చాలదన్న స్పృహ. తిరుగు ప్రయాణం కూడా రెండూ రెండున్నర గంటలు పట్టేస్తే ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అవుతుందనీ, మళ్లా మర్నాటి ఉదయం ఆరింటికే మా తదుపరి కార్యక్రమం ఉందనీ, అదో వత్తిడి… ఓ అరగంటా ముప్పావు గంట అక్కడ గడిపి వెంఠనే తిరిగి వెళదామని నిర్ణయం.


పొందికైన ప్రాంగణంలో రకరకాల దుకాణాలు, రెస్టారెంట్లు… వాటిల్లో అనేకానేక స్థాయిలు… స్థోమతులు… సీఫుడ్ ప్రదర్శనలు… ఎన్నెన్నో రకాల వస్తువుల డిస్‌ప్లే… శుభ్రంగా తీర్చిదిద్దినట్టున్న షాపుల బారులు… ధగధగ మెరిసే విద్యుద్దీప కాంతులు… నదీజలాల్లో వాటి చెల్లాచెదురు ప్రతిబింబాలు… పగటివేడి ఉపశమించి చల్లగా వీస్తోన్న పిల్లగాలులు… వీక్షకుల కేరింతలు, కబుర్లు–అదో ఊహకు అందని ఉత్తేజం. అరగంటా గంటా కాదు, కుటుంబసమేతంగా వచ్చి ఓ సాయంత్రమల్లా ఉల్లాసంగా గడపదగ్గ ప్రదేశమది!

మర్నాటి ఉదయం ఆరింటికల్లా నేనూ కల్యాణిగారూ ఇల్లు వదిలాం. రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి చేరిన సత్యజిత్ పాపం మళ్లా అంత ఉదయాన్నే మాకు వీడ్కోలు పలికారు.

ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో మా ప్రయాణం మొదలయ్యే టూరిస్టు ఏజెన్సీవాళ్ల ఆఫీసు. ‘ఆరుంబావుకల్లా వచ్చెయ్యాలి’ అని వాళ్లు పదే పదే చెప్పారు. మేవు చెప్పిన టైముకు చేరిపోయాం. అప్పటికే ఒకరిద్దరు సహయాత్రికులు అక్కడికి చేరారు. హలో హలోలు… కరచాలనాలు… తడిపొడి పరిచయాలు… ఆరున్నరకు బయల్దేరే టూరు కోసం ఆ ఆఫీసులో నిరీక్షణ… అచ్చంగా ఢిల్లీలో సదరన్ ట్రావెల్సూ పణిక్కర్ ట్రావెల్సూ వాళ్ల ఆఫీసులా అనిపించింది. అదే ఫర్నిచరు… అదే అలంకరణ… అవే మ్యాపులు… అదే వాతావరణం.

ఉన్న ఆ పావుగంటా ఇరవై నిముషాల్లో ఓ ఇటలీ యువ జంటతో స్నేహం కుదిరింది. వాళ్లూ హలోల దగ్గర కట్టిపెట్టకుండా సంభాషణ కొనసాగించారు. ఆగ్నేయాసియాలో నాలుగయిదు దేశాలు నెలరోజులపాటు తిరగాలన్నది వారి ప్రణాళిక. మా తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు తెలుసా అని అడిగి, అలా ఎందుకంటారో మన రెండు భాషలూ అజంతాలవడంవల్ల పోలికలు ఎలా కుదురుతాయో సోదాహరణంగా వివరించాను. పాపం ఓపిగ్గా విన్నారు. ఏదో మ్యాప్‌లో ఓ కట్టడాన్ని చూపించి ‘చాంగమ్ వాట్… అంటే ఏమిటిదీ?’ అని ఇటలీ ఆవిడ ప్రశ్న. వెంటనే కల్యాణి అందుకొని ‘వాట్’ అంటే గుడి అని అర్థం. ఉదాహరణకు అంకోర్‌వాట్ అని వివరించారు. నిజానికి అది నాకూ కొత్త విషయమే!


ఈ లోగా మా మినీ వ్యాను వచ్చింది. గయుడు వచ్చాడు. అంతా వ్యాను ఎక్కాం… పిల్లల దగ్గర్నించి పెద్దాళ్లదాకా, అమెరికన్ల దగ్గర్నించి స్థానికులదాకా, అంతా కలసి పదీ పన్నెండుమందిమి. మాకు తోడు తన వృత్తిపరమైన మాటకారితనాన్ని పుష్కలంగా ప్రదర్శిస్తోన్న గైడు మహానుభావుడు… “మిగిలిన టూరిస్టు ఏజెన్సీలన్నీ టూరిస్టుల్ని తిన్నగా మెయిక్‌లాంగ్ రైల్వే మార్కెట్ దగ్గరకు తీసుకుపోతాయి. మేము అలా కాదు. ముందుగా ఆ రైలుబండి బయల్దేరే బన్‌కలాంగ్ అన్న స్టేషనుకు తీసుకువెళతాం. అక్కడ రైలు ఎక్కి, ఓ గంట సేపు మా గ్రామసీమల మీదగా సాగి మీరంతా ఆ ట్రైనుతోపాటూ రైల్వే మార్కెట్లో ప్రవేశిస్తారు. ఆ ప్రవేశం- అదో అద్భుతమైన అనుభవం!” వివరించాడు గైడు.

నిజమేగదా అనిపించింది. ఆ రైల్వే మార్కెట్టూ, రైలు పట్టాలకు హత్తుకుని అటూ ఇటూ దుకాణాలు ఉండటం, రైలు వస్తున్నపుడు చకచకా దుకాణాలవాళ్లంతా తమ తమ సామాన్లను పక్కకు సర్దేసి రైలు ఏ ఇబ్బందీ లేకుండా సాగిపోయేలా చూసుకోవడం… ఈ ప్రక్రియకు చెందిన వీడియోలు ఇంతకుముందు ఫేస్‌బుక్, యూట్యూబుల్లో చూశాను. ఆ మార్కెట్ థాయ్‌లాండ్‌లో ఉందనీ, బ్యాంకాక్‌కు అంత దగ్గరనీ ఆ స్పృహ ఇప్పటిదాకా లేదు. ఆ మార్కెట్‌కు చేరే సమయం దగ్గరపడే కొద్దీ నాకు ఉత్సుకత పెరగసాగింది.


ఓ అరగంట తూర్పుదిశగా సిటీలో పరుగెట్టాక మా వ్యాను హైవే వదిలిపెట్టి పల్లెదారులు పట్టింది. చిన్న చిన్న ఊళ్లు… కొబ్బరి చెట్లు… అరటి తోటలు… పంట కాలవలు… అక్కడక్కడా చిన్నపాటి చెరువులు–అంతా సుపరిచితమైన ప్రదేశంలా అనిపించింది. గ్రామాలు కాస్తంత ఆధునికతనూ, సొగసునూ సంతరించుకొని చూడ్డానికి అందంగా, ఆరోగ్యవంతంగా కనిపించాయి. రోడ్లు బావున్నాయి. ట్రాఫిక్ చాలా తక్కువ. ప్రయాణం వేగంగా సాగింది.


ఇంకాస్త దూరం వెళ్లగానే సముద్రపు జాడను గాలి మోసుకువచ్చింది. అక్కడక్కడా కనిపిస్తోన్న ఉప్పుమళ్లు. ఈ లోగా మా వ్యానులో పరిచయాల దశ దాటుకొని పరాచికాల స్థాయిని అందుకొన్న సహయాత్రికులు. ఓ మెక్సికన్ పెద్దవయసు జంట, వాళ్లబ్బాయి, మరో అమెరికన్ సీనియర్ సిటిజన్ జంట, ఒక బ్రిటిష్ నడివయసు పెద్దమనిషి, ఇద్దరు స్థానిక థాయ్‌లాండ్ యువతులు–అందరిలోనూ కలుపుగోరుతనం సామాన్య లక్షణంగా కనిపించి సంతోషం కలిగించింది. అసలు ఇలాంటి ఆటవిడుపు ప్రయాణాల్లో ఎంత అంతర్ముఖులైనా ఎంతోకొంత మనసు విప్పుతారనుకొంటాను.

బయలుదేరిన గంటన్నరకు బన్‌కలాంగ్ స్టేషను చేరుకున్నాం.

స్టేషనని పేరేగానీ దానికో ఇల్లూ వాకిలీ లేవు. ఒక మామూలు బస్టాపు ఎలా ఉంటుందో ఆ బాణీలోనే ఉంది. అక్కడికి అరగంట దూరం నుంచి రైలు బయలుదేరుతుందట. మా స్టాపుకు ఎనిమిదీ అయిదుకు చేరుతుందట. “ఇంకా మీకు పదిహేను నిమిషాలు టైముంది. కాస్త అటూ ఇటూ తిరిగిరండి… అదిగో ఎదురుగా ఉప్పుమళ్లున్నాయి. ఫోటోలు తీసుకోండి. కానీ రైలు రాక మీద ఒక కన్నేసి ఉంచండి. ఎక్కువసేపు ఆగదు. బండి తప్పిందా ఇక మీ ప్రోగ్రాం కొండెక్కినట్టే. ఇక్కడ్నించి బ్యాంకాక్ చేరడం కూడా భాష సమస్య వల్ల మీకు ఏమంత సులభం కాదు.” తిరిగి రమ్మని ఉత్సాహపరుస్తూనే తగు జాగ్రత్తలూ చెప్పాడు మా గైడు. ఆహ్లాదకరమైన వాతావరణం, ఫోటోలకు పనికొచ్చే పరిసరాలు, అవసరాలు తీర్చే రెస్టురూములు… అక్కడో పావుగంట.

సరిగ్గా ఎనిమిదీపదికి వచ్చింది మా రైలుబండి. మీటరుగేజి ట్రైను. దేశమంతా మీటరుగేజేనట. పెద్దగా ప్రయాణికులు లేరు… కంపార్టుమెంటుకో పదిమంది. ఎక్కువగా స్థానికులు. వాళ్లు కూడా పలకరిస్తే శుభ్రంగా కబుర్లాడుతున్నారు. మళ్లా ఓ గంట ప్రయాణం, తోడుగా అవే అరటీ కొబ్బరీ తోటలు. ఉప్పుమళ్లు సరేసరి.


మేవు చేరుకోవలసిన మెయిక్‌లాంగ్ స్టేషను ఇంకా మూడువందల మీటర్ల దూరాన ఉందనగా ఆ రైల్వే మార్కెట్టు మొదలయింది. దుకాణాల యజమానులు రైలు రాకకు అనుగుణంగా తమతమ సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రైలునూ రైల్లోని ప్రయాణీకుల్నీ ఆహ్వానిస్తూ అటూ ఇటూ సర్దుకొని కేరింతలు కొడుతోన్న దేశదేశాల టూరిస్టులు. ఫోటోలు, వీడియోలు. కంపార్టుమెంటుల్లో ఉన్న మేవూ, దిగువన స్వాగతాలు పలుకుతోన్న ఆ టూరిస్టులూ క్షణకాలపు కరచాలనాలూ, హైఫైవ్‌లూ… ఒక పొంగిపొరలే ఉత్సాహంతో అంతా స్టేషను చేరాం.

ఉదయం తొమ్మిది.


“ఇక్కడ ఈ రైలు అరగంట ఆగుతుంది. ఆగి మళ్లా బయల్దేరిన చోటుకు తిరుగు ప్రయాణం ఆరంభిస్తుంది. ఈ అరగంటా మీరు మార్కెట్లో గడపండి. దాని తిరుగు ప్రయాణాన్ని చూడండి. కానీ పొరపాటున కూడా ఆ తిరిగివెళ్లే రైలు ఎక్కకండి. మనం మన తదుపరి మజిలీకి పొద్దున వచ్చిన వ్యానులో వెళతాం. మళ్లా చెపుతున్నా! పొరపాటునో ఏమరుపాటునో రైలు ఎక్కకండి! అన్నట్టు, జేబుదొంగలున్నారు జాగ్రత్త!” మా గైడు చాలా విపులంగా సలహాలిచ్చి జాగ్రత్తలు చెప్పాడు.


ఆ రంగురంగుల రైలుబండి అక్కడే ఆగి ఉంది. ముందుగా అందరం దాని ముందు నిలబడి ఫోటోలు… మరికాస్త ఉత్సాహవంతులు గార్డుపెట్టె పైకి ఎగబాకి విభిన్న భంగిమల్లో సరదా ఫోటోలు… మేమూ వయస్సునో పాతికేళ్లు వెనక్కి నెట్టి రైలు పెట్టె పైకి ఎక్కాం.

తర్వాత అందరమూ సహజంగా చేసిన పని ఆ పట్టాలవెంబడే మూడువందల మీటర్లూ నడచివెళ్లి మార్కెట్‌ను తనివితీరా చూడటం… పిన్నూ పెన్నూ దగ్గర్నించి, చికెనూ చేపా దగ్గర్నించి, జీన్సూ మాక్సీల దగ్గర్నించి, కొబ్బర్నీళ్లూ కోకోకోలా దగ్గర్నించి, నూడిల్సూ మొమోలూ దగ్గర్నించి, అక్కడ దొరకని వస్తువు లేదు. అన్నీ చిన్న చిన్న దుకాణాలు… స్నేహంగా పలకరించే దుకాణదార్లు. మాటల్లో పెడితే సంబరంగా కబుర్లాడే చిన్నారి సేల్స్ గర్ల్స్. అడపాదడపా ఇంగ్లీషు పరిమళాలు… దప్పికగొన్న మా గొంతుల్లో థాయ్‌లాండ్ కొబ్బరినీళ్లు–బ్రహ్మాండమైన పరిమాణం ఆ కొబ్బరికాయలది!


చూస్తూ చూస్తూనే ఇరవై నిమిషాలు గడచిపోయాయి. మే నెల ఎండ చుర్రనిపిస్తున్న మాట నిజమే అయినా అందరి మనసూ తిరుగు ప్రయాణం ఆరంభించబోయే రైలు మీదనే నిలచి ఉంది. దాని రాకను ఆహ్వానించాలనీ, ఆ జ్ఞాపకాన్ని గుండెల్లో నింపుకోవాలనీ తహతహ! గుండెల సంగతి ఎలా ఉన్నా అందరం కెమేరాలూ ఎక్కుపెట్టి నిలబడ్డాం. షాపులవాళ్లు సామాన్లు సర్దే సందడిని క్లిక్కు క్లిక్కుమనిపించాం. గజగమనంతో వస్తోన్న రైలుబండిని వీడియోగా చిత్రించాం. అది మమ్మల్ని దాటివెళ్లగానే సంతృప్తి నిండిన సామూహిక నిట్టూర్పు విడిచాం. ఎంత గొప్ప దృశ్యమన్నదిగాదు అసలు విషయం. ఆ దృశ్యాన్ని ఎంత మనసుపెట్టి చూశాం, ఆస్వాదించాం అన్న విషయం అతి ముఖ్యం. ఆ విషయం మీదే మన సంతోషమూ సంతృప్తీ ఆధారపడివుంటాయి అనిపించింది.


రైలు మార్గాన్ని వదిలి అందరమూ మా వ్యానుకేసి వెళుతోంటే ఫోటోల కోసమే నిలబెట్టారా అన్నట్టున్న మెయిక్‌లాంగ్ స్టేషన్ సైన్‌బోర్డ్ కనిపించింది. గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో అని హడావుడి చేశాను. పెద్ద కష్టం లేకుండానే పన్నెండుమందీ సైన్‌బోర్డ్ ముందు చేరాం. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ల యుగంలో ఫోటో తియ్యడమన్నది ఒక్క క్లిక్కుతో ఆగదు గదా… నా ఫోన్‌తో అంటే నా ఫోన్‌తో అంటూ ఆరేడు క్లిక్కులు. అక్కడో పది నిమిషాలు. మరుసటి మజిలీకేసి ప్రయాణం. అరగంటసేపు వ్యానులో వెళ్లాక ఒక పడవల రేవు చేరాం. రేవేగానీ అక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ అన్న పదార్థపు ఛాయలే లేవు. ‘ఆత్రపడక. ఇక్కడ్నించి పడవెక్కించి మనల్ని అసలు చోటికి తీసుకువెళతారు.’ హితవు చెప్పారు కల్యాణి. అంత చిన్న విషయం తోచనందుకు సిగ్గనిపించింది.


ఆ పెద్ద కాలువలో మేవు ఎక్కిన చిన్న పడవ మరో చిన్న కాలువ లోకి, మరింకో చిన్న కాలువ లోకీ ప్రవేశించి, ప్రయాణం చేసి చేసి ‘డామ్‌నోయిన్ సాడుక్ ఫ్లోటింగ్ మార్కెట్’ అన్న చోటికి మమ్మల్ని చేర్చింది. దారి పొడవునా కాలువలకు అటూ ఇటూ నీళ్లమీదకు చొచ్చుకు వచ్చిన గృహాలు. అందులోనే ఇళ్లూ వాకిళ్లూ, కిరాణా షాపులూ, పార్క్ చేసిన కార్లూ మోటారు సైకిళ్లు, గింజలేరుకొంటొన్న కోళ్లు, వాటి వెంటబడే పిల్లగాళ్లు–భలే ఉందే ఈ వాతావరణం అనిపించింది. చివరికి అందరం ఓ ఇరవై పాతిక అడుగుల వెడల్పున్న కాలువ చేరి మహా ఆత్రంగా మా పడవ దిగాం. గంట పది కొట్టింది.

“ఇక్కడ మనం గంటన్నర ఉంటాం. ఈ మార్కెట్టు అటూ ఇటూ వందా నూట ఏభై అడుగుల పొడవుంది. ఇదిగో మనం ఇపుడు ఉన్నది ఈ ఫ్లోటింగ్ మార్కెట్టులోని మీటింగ్ పాయింటు. మిమ్మల్నందర్నీ ఒకసారి మార్కెట్టంతా తిప్పుతాను. మంచి మంచి షాపులు చూపిస్తాను. అలాగే ఓ పడవ ఎక్కి ఈ మార్కెట్లో భాగమైపోయి తిరిగేలా మీకు ఫెర్రీ పాయింట్ చూపిస్తాను. ఆ పడవ మిమ్మల్ని అరగంట తిప్పుతుంది. దానికి ఛార్జీ అదనం. మీరే కట్టుకోవాలి. కరెక్టుగా పదకొండున్నరకు మీరు మీ పడవ విహారాలూ, కొనుగోళ్లూ, షికార్లూ ముగించుకొని ఈ మీటింగ్ పాయింట్‌కు వచ్చేయాలి. ముందుగా ఫాలో మీ! షాపుల పరిచయం చేస్తాను…” మహా హుషారుగా దారితీశాడు మా గైడు.

చెకచెకచెకా అన్ని షాపులూ చూపించాడు. తన సేల్స్ ప్రమోటర్ రూపం ప్రదర్శించాడు. ఫెర్రీ పాయింట్ దగ్గర అందరికీ టికెట్లు ఇప్పించాడు. నేనూ కల్యాణిగారూ ఒకరికొకరు మౌనభాషలో చెప్పుకున్నాం: మనకీ నౌకావిహారాలూ వద్దు. షాపుల్లో కొనుగోళ్లు అసలే వద్దు. మనకు ఏ మాత్రమూ పరిచయం లేని ఈ తేలియాడే విపణివీధినీ, ఇక్కడి గాలిలో తేలివస్తోన్న ఉత్సవ సౌరభాన్నీ నింపాదిగా తిరుగుతూ మనసులో ఇంకించుకొందాం…

“ఏవిటీ, మీరు పడవ ఎక్కరా? అయ్యో! ఇక్కడిదాకా వచ్చి ఎక్కనివాళ్లు ఉండనే ఉండరు. మంచి అవకాశం కోల్పోతున్నారు.” గైడు వాపోయాడు. నవ్వేసి ఊరుకున్నాం.


కాలువ రెండు ఒడ్డులా దుకాణాలు. కాలువలో నిరంతరంగా సాగిపోతోన్న వ్యాపారాల పడవలు. ఆ పడవల్లో కూరగాయలు, అలంకరణ సామగ్రి, టీ షర్టులు, గౌన్లు, హ్యాండ్ బ్యాగ్‌లు, బ్యాగీ నిక్కర్లు, అల్పాహారాలు, ఐస్‌క్రీములు, కొబ్బరిబోండాలు, బేరసారాలు… భలే ఉందనిపించింది. నింపాదిగా కాలువ రెండు ఒడ్డులూ తిరిగాం. చివరికి ఆవిడ ఒక కొబ్బరిబోండాం, నేనొక పెప్సీ బాటిలు పట్టుకొని, అక్కడ వేసిన బెంచీలను ఒద్దనుకొని, కాలువ గట్టుమీద సిమెంటు మెట్ల మీద కూర్చున్నాం.


అక్కడో పావుగంట.

సాగిపోతున్న పడవలు. అడపాదడపా మరపడవలు సృష్టించే శబ్దకాలుష్యం. హఠాత్తుగా నిశ్శబ్దం. ఎదురుగా ఉన్న పడవలో తన ఫలహార విక్రయ కేంద్రాన్ని సమాయత్తం చేస్తోన్న ఓ స్థానిక యువతి, ఆమెకు సాయం చేస్తోన్న ఓ ఏభైఏళ్ల మనిషి.

“మీ నాన్నగారా?” నా భారతీయ కుతూహలం.

“కాదు, స్నేహితుడు…” కాస్త అల్లరి, కాస్త గర్వం ఆమె గొంతులో.

వాళ్లిద్దరం – మేమిద్దరం… చిన్నపాటి కబుర్లు.

“నలుగురం ఫోటో దిగుదాం…” నా ప్రతిపాదన.


సంతోషంగా ఆమె, కొంచం గుంభనగా అతను. భంగిమలు పెట్టడంలో మాత్రం ఏ గుంభనా లేదు.

“మాతో ఫోటో దిగినందుకు మీరు తలా వంద బాథ్‌లు మాకు ఇవ్వాలి.” అతని కవ్వింపు.

“వందేముందీ రెండు వందలు తీసుకో…” మా స్పందన.

ఏదో తెలియని సంతోషం!

వెనక్కి నడిచేటపుడు కాసేపు ఒడ్డున ఉన్న దుకాణాల్ని పరామర్శించాం. కొన్నా కొనకపోయినా ఆశగా ఆత్మీయంగా పలకరించే దుకాణదారులు. వాళ్ల ఆశలకోసమైనా ఏమన్నా కొనాలనిపించి చిన్న చిన్న కొనుగోళ్లు… పదకొండున్నర.

తిరుగు ప్రయాణానికి గంటన్నర పట్టేసింది.

“మీరు పొద్దున్న మా టూరిస్టు ఆఫీసుకు టాక్సీలో వచ్చివుంటారు. ఇపుడా పని చెయ్యకండి. మీరు ఎక్కడికి వెళ్లాలో చెపితే అక్కడికి దగ్గర్లో ఉండే స్కైట్రైన్ స్టేషన్లో దింపుతాను.” మా గైడు ప్రతిపాదన.

అలాగే దించాడు.

రెండు రైళ్లు మారి, అశోక్ స్టేషన్‌నుంచి ఎండలో పావుగంట నడచి ఇంటికి చేరేసరికి దాదాపు రెండయిపోయింది.

భోజనాలు చెయ్యడానికి కూడా ఓపిక లేని పరిస్థితి.

“రైళ్లూ నడకా ఏమిటీ? టాక్సీలో రాకుండా…” సత్యజిత్ సహజంగానే కోప్పడ్డారు.

‘తనివి తీరలేదే, నా మనసు నిండలేదే’ అన్న చక్కని నలభై ఐదు ఏళ్లనాటి పాట ఒకటి ఉంది. ఎన్నిసార్లు విన్నా తనివితీరని పాట.

ఆ సాయంత్రం నాకా పాట పదే పదే గుర్తుకొచ్చింది.

రోజంతా ప్రయాణాలు చేసి డస్సిపోయి వచ్చినా గంటా రెండుగంటల విశ్రాంతి తర్వాత కాళ్లు ఇంక ఈ విశ్రాంతి చాల్లే, తిరుగుదాం పదా అన్నాయి.

సాయంత్రం బాల్కనీలో కూర్చుని అందరం నేను చేసిన కాఫీ తాగుతోంటే దిగువన ఉన్న దీర్ఘ చతురస్రాకారపు చెరువు మీదకు నా మనసు మళ్లింది. చుట్టూ కనిపిస్తోన్న నడకరాయుళ్లు నన్ను ఆకర్షించారు.


“ఒకప్పుడా ప్రాంతంలో ఓ పొగాకు ఫ్యాక్టరీ ఉండేది. ఆ పనులకోసం కట్టుకొన్న నీళ్ల గుంటల సముదాయమది. ఇపుడా పొగాకు ఫాక్టరీ మూసేశాక ఆ ప్రాంతాన్ని అందంగా మలచి, గుంటల్ని కలిపి చక్కని చెరువుగా చేసి, చుట్టూ బోర్డ్‌వాక్ కట్టారు. అపుడపుడు మేవంతా వెళుతూ ఉంటాం…” వివరించారు కల్యాణి.

“ఓ సారి వెళ్లొద్దామా?” సందేహిస్తూనే అడిగాను.

“పదండి.” పాపం వెంటనే సిద్ధమయ్యారావిడ.

పైనుంచి చూసినపుడు బాగా దగ్గరే అనిపించినా దాదాపు కిలోమీటరు దూరం. చుట్టూ రెండు కిలోమీటర్ల చుట్టుకొలతతో చెక్కతో చేసిన చక్కని నడకమార్గం… ఇంకా ఎండ వాడి తగ్గకపోయినా ఎంతో శ్రద్ధగా నడిచేస్తోన్న స్థానికులు… చెరువుకు ఎడమ పక్కన చక్కని పచ్చికబయళ్లు… ఆహ్లాదకరమైన సాయంత్రమది.
(సశేషం)
---------------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

1 comment:

ranivani said...

థాయ్లాండ్ లో మీప్రతీ అడుగూ మీఅక్షరాల్లో కకన్పిస్తుందండీ! చాలా బాగా వ్రాసారండీ, ఫోటోల అవసరం లేనట్లు కళ్ళకు కట్టేసారు🙏