సభాకవిత్వం
సాహితీమిత్రులారా!
శ్రీనాథుడు ప్రౌఢదేవరాయల ఆస్థానానికి వెళ్ళి వాదంలో డిండిమభట్టుని ఓడించి అతని కంచుఢక్కని పగలగొట్టించిన సందర్భంలో ప్రౌఢదేవరాయల గురించి ఓ పద్యం చెప్పాడు “జోటీ భారతి! ఆర్భటిన్ మెరయుమీ! చోద్యంబుగా నేను కర్ణాటాధీశ్వరు ప్రౌఢదేవ నృపతిన్ నాసీర ధాటీ చమూకోటీ ఘోటక ధట్టికా ఖురపుటీ కుట్టాక సంఘట్టన స్ఫోటీ ధూత ధరారజశ్చుళికితాంభోధిన్ ప్రశంసించెదన్” అని!
కృష్ణదేవరాయలు ఒకనాడు విలాసంగా తన అష్టదిగ్గజాల్తో కవితాగోష్టి జరుపుతూ వుండగా పెద్దన గారు ఆయన్ని పొగుడుతూ ఒక పద్యం ఆశువుగా చెప్పారు “శరసంధాన బల క్ష మాది వివిధైశ్వర్యంబులం గల్గి దుర్భర షండత్వ బిలప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్ మానినన్ నర సింహ క్షితిమండ లేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా నరసింహ క్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!” అని. అందరూ “ఆహా! ఓహో!” అంటూంటే తెనాలి రామలింగడు మాత్రం, “తోక ముడిచి బిలప్రవేశం చేసే సింహం ప్రభువులకు సాటి రాదంటూనే పెద్దనగారు రాజకంఠీరవా అని సంబోధించటం వింతగా వుంది” అని ఆక్షేపించాట్ట! అలాగే మరో రోజు ఏదో సందర్భంలో పెద్దన గారే, “కలనాటి ధనము లక్కరకల నాటికి దాచ కమలగర్భుని వశమా? నెలనడిమి నాటి వెన్నెల అలవడునే గాదెబోయ అమవస నిశికిన్!” అని చెప్తే వెంటనే రామలింగడు “ఎమితిని సెపితివి కపితము? బ్రమపడి వెరిపుచ్చకాయ వడితిని సెపితో? ఉమెతఃపువు దిని సెపితో? అమవసనిశి అన్నమాట అలసని పెదనా!” అని విరుచుకు పడ్డాట్ట!
ఇంకొకరోజు కృష్ణదేవరాయలు సంస్కృతాంధ్రాల్లో సమానంగా కవిత్వం చెప్పగలిగిన వాళ్ళకి ఇస్తానని ఒక గండపెండేరం చూపించి తన అష్టదిగ్గజాల వంక చూశాట్ట. పెద్దన వెంతనే “పూత మెరుంగులుం పసపు పూత బెడంగులు చూపునట్టివా కైతలు?” అంటూ మొదలుపెట్టి ఓ యాభై పాదాల ఉత్పలమాలికని ఆశువుగా చెప్తే ముగ్ధుడై రాయలు ఆ గండపెండేరాన్ని స్వయంగా పెద్దన పాదానికి తొడిగాడుట.
ఇవి కథలు. బహుశ నిజంగా జరిగిన సంఘటనలు కావని, కృష్ణదేవరాయల ద్వారా సొంతానికి కీర్తిని ఆపాదించుకోవటానికి ప్రయత్నించిన రాజుల ప్రోత్సాహంతో తర్వాత తర్వాత (నాయకరాజుల కాలం, అంటే పదిహేడవ శతాబ్దంలో) కల్పించినవని పరిశోధకుల అభిప్రాయం (1, 2). నిజంగా కృష్ణదేవరాయలు తన చుట్టూ కవుల్ని కూర్చోబెట్టుకొని కవితాగోష్టులు చేశాడనటానికి ఆధారాలు లేవు. కాని పదిహేడవ శతాబ్దం నాటికి “సభాకవిత్వం” అనే భావన స్పష్టమైన రూపాన్ని ధరించిందని ఈ కథల నుంచి గట్టిగా చెప్పొచ్చు. ఈ భావన ప్రకారం కవులు తమ తమ రచనల్ని ఓ రాజుగారి ఎదుట చదివి వినిపించటం, ఆ సమయంలో అక్కడ ఇతర కవులు కూడ ఉండటం, ఒక కవి చెప్పిన దాన్లో ఉన్న గుణావగుణాల్ని వాళ్ళు నిష్కర్షగా అక్కడికక్కడే చర్చించటం జరుగుతాయన్న మాట! అలాగే, రాజులు కవుల్ని ఏవో కావ్యాలు రాసి తమకు అంకితం ఇవ్వమని అలాటి సభల్లో అడిగేవారు (మనుచరిత్ర పీఠిక నుంచి ఇది స్పష్టం). అలాటి సభల్లోనే కవులు తమ కావ్యాల్ని అంకితం ఇచ్చేవారనటానికి సూచాయగా ఆధారాలున్నాయి (కావ్యం రాయమని అడిగే సమయంలో కర్పూర తాంబూలం ఇవ్వటం, కావ్యాన్ని తీసుకునే సమయంలో ఇంకా పెద్ద పెద్ద దానాలు అంటే అగ్రహార, గో, హిరణ్య దానాల్లాటివి ఇవ్వటం జరిగినట్లు నమ్మవచ్చు. కాని అలాటి కృతిసమర్పణ సమయంలో జరిగే కార్యక్రమాలు ఏవో మనకు తెలీదు. కవి తన కావ్యాన్ని చదివి వినిపించేవాడా? ఇంకెవరన్నా ఆ పని చెయ్యటానికి ఉండేవారా? కావ్యాన్ని గురించిన చర్చలు జరిగేవా? మనకు తెలియదు.)
కాని, “సభాకవిత్వం” అంటే సభల్లో కవిత్వం చెప్పటం అనే సంప్రదాయం, కనీసం పదిహేడవ శతాబ్దం నుంచి ఉన్నదని చెప్పుకోవచ్చు, సందర్భాలు ఏవో స్పష్టంగా తెలియకపోయినా. అదివరకే రాసిన (తను చెప్తుంటే మరొకరు రాసిన) రచనల్ని బిగ్గరగా చదివి వినిపించటం జరిగిందో లేదో తెలియదు కాని అప్పుడప్పుడు ఆశువుగా పద్యాలు చెప్పటం జరిగేదని చెప్పుకోవచ్చు (కనీసం పందొమ్మిదో శతాబ్దంలో అవి జరిగాయని స్పష్టమైన ఆధారాలున్నాయి). ఆ పద్యాలకు శ్రోతలు ముఖ్యంగా కవిపండితులు, బహుశ రాజుగారు, కొందరు మంత్రులు అయివుండొచ్చు. మొత్తం మీద అప్పటి సభాకవిత్వం విద్వాంసులకు ఉద్దేశించబడింది, సామాన్యులకు కాదు.
బహుశ సామాన్యులు కూడ శ్రోతల్లో ఉండే సందర్భాలు ఆలయకవుల విషయంలో జరిగివుండటానికి అవకాశం వుంది (కొంత నేపథ్యం బహుశ అవసరం ఇక్కడ రాజాస్థానాలు కవుల్ని పోషించే కాలాల్లో వాటికి సమాంతరంగా దేవాలయాలు కూడ కవిపోషణ కేంద్రాలుగా తయారయ్యాయని, కొందరు కవులు రాజుల్ని ఆశ్రయిస్తే మరికొందరు ఆలయాల్ని ఆశ్రయించారని వెల్చేరు నారాయణరావు గారు సిద్ధాంతీకరించారు (3). అలా ఆలయాల్ని ఆశ్రయించిన కవుల్ని ఆలయకవులని పిలుద్దాం). తాళ్ళపాక కవులందరూ ఆలయకవులే. శివకవులు చాలా మంది, తరువాతి వాగ్గేయకారులు చాలామంది ఆలయకవులే. బహుశ పోతనగారు కూడ ఆలయకవి అయివుండొచ్చు. ఈ కవుల రచనల్ని పరిశీలిస్తే, వీళ్ళు ఉద్దేశించిన శ్రోతలు, రాజాస్థానకవుల శ్రోతలు ఒకరు కారని చెప్పవచ్చు. ఆలయకవులు వాడిన భాష వాడుకభాషకి దగ్గరది. పైగా వాళ్ళు ఎక్కువమంది చెప్పినవి పాడుకోగలిగే పాటలు కనుక వాళ్ళు పాడి వినిపించి వుండటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా జరిగితే, వాళ్ళ శ్రోతలు పండితులు కారు. బహుశ ఆ ఆలయాల్ని దర్శించే భక్తులు, ఆలయాన్ని ఆశ్రయించుకుని వుండే పూజారులు, వారి కుటుంబాల వారు అయుండవచ్చు.
మొత్తం మీద ఇరవై శతాబ్దం మొదలయే వరకు సభాకవిత్వం ఏ ధనవంతుడి చావడి లోనో ఆలయం ప్రాంగణం లోనో వినిపిస్తూ వుండేదని చెప్పుకోవచ్చు. అలా కాకుండా సభాకవిత్వాన్ని బహిరంగంగా జనం మధ్యలోకి తీసుకు వచ్చినవారు తిరుపతి వెంకటకవులు. వారూ రాజాస్థానాలు తిరిగి అక్కడ ఆశుకవితలు, అవధానాలు చేసిన వారే. ఐతే, ఆ తరవాత మెల్లమెల్లగా తెలిసిన వారి ఇండ్లలో, ఇంకా తరవాత బహిరంగ సభల్లో అవధానాలు చెయ్యటం, తమ రచనల్ని చదివి వినిపించటం (వారి “గీరతం”, “గుంటూరు సీమ”ల్లో ఇలాటి సంఘటనలు చాలా కనిపిస్తాయి)ప్రారంభించారు వారు. అలా సభాకవిత్వం ఒక ఇంటి లోనో లేదా గుళ్ళోనో వుండటంతో పాటుగా బజార్లలోకి కూడ పాకటం జరిగింది. బహుశ అప్పట్లో స్వాతంత్య్రోద్యమ కారణంగా బహుళ విస్తృతి పొందుతున్న రాజకీయ సభలు, సమావేశాలు ఇందుకు ప్రేరణ కలిగించి వుంటాయి.
ఆ తరవాత పత్రికలు, ఆకాశవాణి, ఇంకా ఇటీవల టీవీ, సామూహిక సభాకవిత్వానికి మార్గాలయ్యాయి. ఐతే, సాహితీవేత్తలకు ఉద్దేశించిన పత్రికలు అప్పుడప్పుడు వచ్చినా, అవి ఎక్కువ కాలం నిలబడలేక పోయాయి. ఉన్నంత కాలం భారతి లాటి కొన్ని పత్రికలు లోతైన కవిత్వాన్నే ప్రచురించ గలిగాయి కాని వాటి మాటకీ విలువ లేకపోవటంతో వాటి పాఠకులు క్రమక్రమంగా తగ్గిపోయారు. ఆ తర్వాత మామూలు పత్రికలు కవిత్వాన్ని ప్రచురిస్తున్నాయి కాని వాటి లక్ష్యం వేరు. అవి రాను రాను రాజకీయ, సైద్ధాంతిక వాదాలకి ప్రాధాన్యత ఇచ్చాయి తప్ప కవితాగుణానికి కాదు.
ఏ రచనైనా ఒకానొక రకం శ్రోతల్ని లేదా పాఠకుల్ని ఉద్దేశించినది ఐవుంటుంది. అందుకే పాఠకులకు కూడ ఒక రచనలో కర్తృత్వం ఉందంటారు పరిశోధకులు. నారాయణరావు గారు “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం” అనే గ్రంథంలో తెలుగు కవిత్వ పరిణామాల్ని వివరించే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాని ప్రకారం శ్రోతలు మారినప్పుడు కవిత్వంలో విప్లవం వస్తుంది. అంటే ఒక కొత్తరకమైన కవిత్వం వస్తుంది. ఉదాహరణకు, భావకవిత్వం వచ్చేనాటికి అచ్చుయంత్రం ప్రభావం వల్ల, విద్యాబోధనా పద్ధతుల్లో మార్పుల వల్ల, సమాజంలో కలిగిన భావపరిణామాల వల్ల, ఒంటరిగా కూర్చుని సొంతంగా సాహిత్యాన్ని చదువుకుని అర్థం చేసుకోగల పాఠకులు ఏర్పడ్డారు. వారికి అనుగుణమైన కవిత్వం భావకవిత్వం.
ఐతే, భావకవిత్వ ప్రచారం కోసం భావకవులు కూడ సభలు చేసి అక్కడ తమ కవిత్వాల్ని చదివి, వివరించి, వినిపించారు. ఐనా ఈ సభలు చాలా వరకు “విద్వత్”సభలే, సామాన్యుల కోసం కాదు.
స్వాతంత్రం వచ్చాక, సాహిత్యపోషణ భారాన్ని ప్రభుత్వం ప్రముఖంగా తీసుకున్నాక, సభాకవిత్వం చాలావరకు ప్రజాస్వామ్య రూపాన్ని ధరించింది. కేవలం పండితులకు, కవులకు మాత్రమే అర్థమయ్యే సభాకవిత్వం పనికిరానిదయ్యింది; ఈ పండితులు, కవుల మన్ననల వల్ల జరిగే ఉపయోగం ఏమీ లేకపోగా, వాళ్లకే నచ్చే కవిత్వం ప్రభుత్వానికి నచ్చే అవకాశాలు సన్నగిల్లాయి ప్రభుత్వాధికారులు, మంత్రిపుంగవులు సాధారణంగా సాహితీవేత్తలు కారు కనుక. అలా, సభాకవిత్వం అంటే సామాన్యులకు నచ్చేది, వాళ్ళ మెప్పు పొందగలిగేది అయ్యింది. అంతే కాకుండా, విద్వాంసులకు నచ్చే సాహిత్యానికి, ఈ సభాకవిత్వానికి దూరం బాగా పెరిగింది.
రాను రాను పండితుల మెప్పుదలతో కవిత్వానికి అవసరం తీరిపోయింది. సాహిత్యసృష్టికి గమ్యం ప్రభుత్వ పురస్కారాకర్షణ గా తయారయ్యింది. పదవుల్లో వున్న వారిని మెప్పించగలిగితే చాలు, అదే గొప్ప కవిత్వం అయింది.
ఇలా, కవిత్వం అంటే సభాకవిత్వమేనని, సభాకవిత్వం అంటే శాసనసభికుల్ని అలరించేదే అనీ నిర్వచనాలు ఏర్పడ్డాయి.
దీనివల్ల కలిగిన ఒక విపరీత పరిణామం లోతైన కవిత్వం రాకపోవటం. సభాకవిత్వం అంటేనే ఆపాతమధురంగా వుండాల్సింది ఒకటి రెండు సార్లు వినటం తోనే శ్రోతకి దాన్లో వున్న చమత్కారాలన్నీ, విశేషాలన్నీ తెలిసిపోవాలన్న మాట! పాతరోజుల్లో అది విద్వత్సభాకవిత్వం కనుక చెప్పే కవి లోతుగా వుండేది చెప్పినా శ్రోతలకు త్వరగానే అర్థమయ్యేది. కాని ఇప్పుడు శ్రోతలు సామాన్యులు కావటంతో వారికి వెంటనే అర్థం కావాల్సిన కవిత్వం అవసరమయ్యింది. పై పై చమత్కారాలు తప్ప లోతైన భావాలు చొప్పించ వలసిన అవసరం కవులకు లేదు. దీనివల్ల ఏ మాత్రం ప్రతిభ లేని వాళ్ళు, భాషా చమత్కారాలో లేకపోతే హాస్యోక్తులో వెదజల్లి పెద్దకవులుగా చలామణీ కావటం సాధ్యమయ్యింది. వారి ప్రతిభకు ప్రభుత్వం వారి పురస్కారాలే కొలబద్ద లయ్యాయి.
ఈ రోజు మనకు కనిపిస్తున్న తెలుగు కవిత్వం దాదాపు అంతా సభాకవిత్వమే! అంటే, దాన్ని సభల్లో చదివినా చదవక పోయినా ఈ కవిత్వానికి లక్ష్యమైన శ్రోతలు, పాఠకులు సభల్లో కనిపించే వారే, అంటే సామాన్యులే. ఎక్కడో విశ్వనాధ, అజంతా వంటి వారిది తప్ప గత యాభై ఏళ్ళలో వచ్చిన కవిత్వంలో మథించి రసగ్రహణం చెయ్యవలసింది కనిపించదు. దీనివల్ల, కొత్తతరం కవులకు అసలు లోతైన కవిత్వం రాయటం అనేదే తెలిసే అవకాశం లేకుండా పోతున్నది రాజకీయ నిబద్ధతల దృష్య్టా వీరు సంప్రదాయ సాహిత్యాన్ని చదవరు. మహా అయితే వారికి ముందు తరంలో వచ్చిన సాహిత్యాన్ని చదువుతారు; దాన్లో ఎలాగూ లోతు వుండదు కనుక వారు రాసేదీ ఆ పరిధుల్ని మించటానికి అవకాశం లేదు.
సభాకవిత్వం అంటే లోతులేని కవిత్వం అని అర్థం చెప్పుకోగలిగిన పరిస్థితుల్లో వున్నాం ఇప్పుడు మనం. దీన్నుంచి వేరుగా, ఆలోచనామృతమైన కవిత్వాన్ని “ఆలోచనా కవిత్వం” అని పిలుద్దాం ఇప్పటికి.
ఒక విచిత్రమైన విషయం ఏమంటే, ఆలోచనాకవిత్వ స్రష్టలుగా బాగా పేరు తెచ్చుకున్న వారు ఒకసారి సభాకవిత్వం లోకి ప్రవేశించాక మళ్ళీ ఆలోచనాకవిత్వం చెప్పలేక పోయారు, నాకు తెలిసినంత వరకు. అదే విధంగా, సభాకవిత్వంతో మొదలైన వారు ఆలోచనాకవిత్వం రాయలేకపోయారు. ఉదాహరణకు, అవధానకేసరులుగా పేరు పొంది ఎంతో పండితసభా కవిత్వం చెప్పిన తిరుపతి వెంకటకవులు నిలబడగలిగే కావ్యం ఒక్కటి రాయలేకపోయారు (వారి నాటకాలు ఖచ్చితంగా పండితసభాకవిత్వాలే)!
శతావధానిగా ప్రఖ్యాతి పొందిన వేలూరి శివరామ శాస్త్రి మిగిలింది కథకుడిగా, కవిగా కాదు. మహాప్రస్థానం తో ఓ కొత్త కవిత్వ మార్గాన్ని ప్రవేశపెట్టిన శ్రీశ్రీ సినిమా కవయ్యాక సభాకవిత్వమే రాశాడు (గుణాత్మకంగానే కాదు, నిజంగా జరిగింది కూడ అదే; ఉదాహరణకు, ఖడ్గసృష్టి లో వున్న కొన్ని ఖండికలు అంతకు ముందు ఆకాశవాణి ఉగాది కవిసమ్మేళనాల్లో చదివినవే!). దేవులపల్లి కూడ ఆలోచనాకవిత్వం నుంచి విరమించాకే సినిమాల్లోకి రావటం జరిగింది (మళ్ళీ తిరిగి వెళ్లలేదు). దాశరథి కూడ అంతే. ఇక సినారె మొదటి నుంచి సభాకవే కావ్యాలని పేరు పెట్టి ఏడాదికొకటి చొప్పున పుస్తకాలు అచ్చేసి జనం మీదికి వదిలినా, వాటిలో ఒకదానికి జ్ఞానపీఠ్ ఎవార్డు వచ్చినా, వాటిలో ఉన్నది మాత్రం సభాకవిత్వమే (దీని అర్థం సినారె కవిత్వం రాశాడని కాదు)! అలాగే, నాకు తెలిసినంత వరకు, పేరున్న ప్రతి అవధానీ తనూ ఆలోచనాకవిత్వం రాయగలనని చూపటానికి చెయ్యిచేసుకోవటమూ, ఒకటో రెండో కావ్యాలు గిలకటమూ అవి సోదిలోకి కూడ రాకుండా పోవటమూ జరిగాయి. వారిదారిలోనే నడుస్తూ ముందు సినీకవులుగా బలపడ్డ కొందరు తరవాత కావ్యాలు (అని వాళ్ళు చెప్పుకున్నవి) రాశారు. అవి ఎవరైనా చదివారేమో తెలీదు. ఇటీవల సీతారామ శాస్త్రి కూడ ఇలాటి ప్రయత్నాలు చేస్తున్నారని విన్నాను. కాని చరిత్ర వారికి అనుకూలంగా లేదు.
సభాకవిత్వం ఇలా విస్తరిస్తూ అదే కవిత్వము, మరేదీ కవిత్వం కాదు అన్న భావన బలీయంగా పాతుకుపోతున్నందు వల్ల జరుగుతున్నదేమంటే, ఆలోచనాకవిత్వాన్ని ఆనందించగలిగే వాళ్ళు సంప్రదాయ సాహిత్యాన్ని చదువుకోవటమో లేక చుట్టూ విస్తరిస్తున్న సభాకవిత్వ సముద్రంలో ఎక్కడన్నా ఆలోచనాకవిత్వ ద్వీపాలు కనిపిస్తాయని వెదుక్కోవటమో చెయ్యవలసి వస్తున్నది.ఇది ఆనందించదగ్గ పరిణామం కాదు. కవిత్వం ఒకసారి చదివి అవతల పారేసేది కాకూడదు.
References:
1. Narayana Rao, V. & Shulman, D. “A poem at the right moment” University of California Press, 1998
2. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, బాలాంత్రపు నళినీకాంతరావు, “ఆంధ్రుల అంతరంగ కారువు తెలుగు చాటువు”, కళ్యాణీ ప్రచురణలు, మద్రాసు5.
3. Narayana Rao, V. and Hank Heifetz, “For the Lord of the animals – Poems from the Telugu, The Kalahastisvara Satakamu of Dhurjati; Berkeley, The University of California Press, 1987.
4. నారాయణ రావు, వెల్చేరు, “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం”, విజయవాడ, విశాలాంధ్ర ప్రచురణాలయం, 1978.
-------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment