Tuesday, September 10, 2019

చెంఘిజ్ ఖాన్ నవలలో యుద్ధనిర్వహణ కళ


చెంఘిజ్ ఖాన్ నవలలో యుద్ధనిర్వహణ కళ





సాహితీమిత్రులారా!

యుద్ధనిర్వహణ ఓ కళ. అది ఓ నైపుణ్యం. అన్ని కళల్లో లాగానే దాని రహస్యం అందరికీ పట్టుబడదు. యుద్ధాలు నిర్వహించినవారు, యుద్ధాల్లో గెలుపోటములు చవిచూసిన వారు అందరూ ఆ కళలో నిష్ణాతులేమోనని భావించడం, కుంచె పట్టి బొమ్మలు వేసే ప్రతివాడూ పికాసోనో, రవివర్మనో అయినట్టు భావించడం లాంటిదే. కొందరే యుద్ధ నిర్వహణలో నిపుణులవుతారు, మిగిలినవారంతా హృదయం లేని కళాకారుడిలా దాన్ని తమకు తెలిసిన పద్ధతిలో చేసుకుంటూ పోతూంటారు. కాకుంటే ఆ కళల తారతమ్యాలు కూడా గుర్తించగల తాహతు చాలామందికి వుండదు.


యుద్ధాల గురించి సాహిత్యంలో సాధారణంగా ప్రస్తావనలు — అయితే వీరత్వాలు, పౌరుషాలు, భుజబలాల ప్రస్తావనల కేసి సాగిపోతాయి, లేదంటే దాని వల్ల కలిగే రక్తపాతం గురించి వుంటాయి. యుద్ధాల గురించి వల్లె వేసిన ధర్మాలు, ప్రాణాలు ఒడ్డి పోరాడేవారి పట్ల వీరారాధనలు వంటివి తప్ప దాని పట్ల అవగాహన, యుద్ధం యొక్క అత్యంత వాస్తవికమైన స్థితి, యుద్ధనిర్వహణలో హృదయం పెట్టి పని చేయగల నాయకుల ఆలోచనలు తూనిక వేసే అలవాటు మన సాహిత్యకారులకు చాలా అరుదు. అటువంటి అత్యంత అరుదైన పనిని తెన్నేటి సూరి సమర్థంగా చేసి చూపాడు. ఆయన నిపుణులైన వ్యూహకర్తల ఎత్తులు, మానసిక స్థితిగతులు ముందుగా అవగాహన చేసుకుని వాటిని ప్రతిఫలిస్తూ తన చెంఘిజ్ ఖాన్ నవలను రచించాడు. చెంఘిజ్ ఖాన్ చరిత్రను మరో కోణంలో చూపేందుకంటూ ప్రారంభించిన ఈ నవల ఓ యుద్ధనాయకుడు ఎలా వుంటాడో, సైనిక వ్యూహకర్త ఆలోచనలు ఎలాంటిదో స్పష్టంగా పట్టి చూపి ఓ విభిన్నమైన నవలగా తెలుగు సాహిత్యంలో నిలిచింది. చరిత్రలో రాక్షసునిగా చిత్రీకరింపబడ్డ టెమూజిన్ అనే నాయకుడు తన గోబీ బంజారా తెగలన్నీ ఏకం చేసి ప్రపంచాన్ని జయించే చెంఘిజ్ ఖాన్ (జగజ్జేత) కావడం నవల ఇతివృత్తం. ఆ క్రమంలో రచయిత చరిత్రను వీలున్నంత వరకూ అనుసరించడమే కాక యుద్ధాల నేపథ్యాలు, వాటి కర్తల వ్యూహశైలి, ఆ వ్యూహకర్తలందరిలోనూ అత్యుత్తముడైన చెంఘిజ్ ఖాన్ వ్యవహారశైలి, ఆయనకూ సైన్యానికీ వుండే సంబంధాలు, నాయకత్వ లక్షణాలు, వీటిలో మతాల ఉపయోగం, పరిమితులు వంటివెన్నో అంతర్వాహినిలా నవలంతా సాగిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ ప్రఖ్యాత వ్యూహవేత్తలైన కౌటిల్యుడు, ది ఆర్ట్ ఆఫ్ వార్ రచించిన సున్ ౙూ (Sun Tzu), వంటివారి రచనల్లో ఉన్నంత స్పష్టమైన అవగాహన కనబరుస్తూ దాన్ని చరిత్రకు ముడిపెట్టి కాల్పనిక రచన చేయడం తెన్నేటి సూరి చేసి చూపిన ఒక గొప్ప అద్భుతం.

13వ శతాబ్దంలో గోబీ ఎడారి ప్రాంతంలో 123 డేరాల యెక్కామంగోలు తండాకు నాయకునిగా ప్రారంభించి క్రమంగా తన తర్వాతి తరాలు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సామ్రాజ్యం స్థాపించగల స్తోమతు కలిగేందుకు పునాది వేసిన రాజకీయ యోధుడు, చెంఘిజ్ ఖాన్‌గా ప్రాచుర్యం పొందిన టెమూజిన్. అతని ఎదుగుదల అంతా రక్తప్రవాహాలు పారించే యుద్ధాల మయం. ఈ యుద్ధాల స్థితిగతులు, వ్యూహాల లోతులు అర్థం చేసుకోలేని ‘నాటురకం’ చరిత్రకారులు చెంఘిజ్ ఖాన్‌ను, అతని క్రమశిక్షణను తప్పుగా అర్థంచేసుకుని అలా అతని చరిత్రను వక్రీకరించటం వల్లనే ఆ మొండి బాణీ పట్టుకుని హిట్లర్ తాను నాశనమై తన జాతిని నాశనం వైపు నడిపించాడన్నది తెన్నేటి సూరి నిష్కర్ష. జర్మనీ చరిత్రకారులు మంగోల్ సైనిక శాసనాలనూ, సైనిక నిర్మాణ వివరాలను అర్థంచేసుకున్నంతగా, వాటి అవతరణకు మూలశక్తి అయిన మానవుణ్ణి- ‘చంఘిజ్ ఖాన్‌’ను అవగతం చేసుకోలేకపోయారు. — అంటూ ఆ అవగాహనను తాను కలిగించగలిగేందుకు నవలా రచనకు పూనుకున్నారు. చంఘిజ్ ఖాన్ శాసనాధికారం నిజానికి కఠోరమైనదే. కాని అలాంటి అధికారాన్ని శిరసావహించి నడుచుకున్న గోబీ ప్రజలకూ, చంఘిజ్ ఖాన్‌కూ వున్న బాంధవ్యం ఎలాంటిది? చంఘిజ్ ఖాన్ అంటే ఏమిటి? మానవుడుగా అతను ఎలాంటి స్వభావం కలవాడు? 123 డేరాల ఒక బంజారీ తండా నాయకుడు ప్రపంచంలో ముప్పాతిక వంతు వరకూ జయించి మూడు శతాబ్దాల పర్యంతం స్వర్ణయుగాన్ని అనుభవించిన మహాసామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగాడు? ఇదంతా సైనికశక్తి వల్లనే సాధ్యమైనదంటే, అలాంటి మహత్తరమైన సైనిక శక్తి అతనికి ఎలా కలిగింది? అలాంటి మహాశక్తులను కరగతం చేసుకోవడానికి మానవుడుగా అతనిలో వున్న బలీయమైన గుణసంపత్తి ఏమిటి? — ఇత్యాది ప్రశ్నలకు సమాధానంగా సూరి ఈ నవల రాశారన్నా తప్పు కాదు.

ఇతివృత్తం
12వ శతాబ్దంలో గోబీ ఎడారికి చెందిన మెర్కిట్ తండాలో పెళ్ళి వేడుకలతో నవల ప్రారంభమవుతుంది. ఇంతలో యెక్కామంగోల్ తండా నాయకుడు యాసుకై ఖాఖాన్ (ఖాన్ అంటే నాయకుడు, ఖాఖాన్ అంటే మహానాయకుడు) ఉరుము లేని పిడుగులా ఆ తండా మీద దాడిచేస్తాడు. పోరాడిన మగవాళ్ళందరినీ నరికివేసి పెళ్ళికూతురు యూలన్‌ను ఎత్తుకుపోయి ఆమెను తన పట్టపు రాణిని చేసుకుంటాడు. ఆమె గర్భవతి అయినా అతనిని భర్తగా అంగీకరించలేకపోతుంది, తండాను, ఖాఖాన్‌ను చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు దుష్టుడైన మతపెద్ద షామాన్ గుయగ్జూ ఓ యుక్తి పన్నుతాడు. గర్భంలోని బిడ్డ మహానాయకుడు కావాలని చేసే తంతును జరపాలని చెప్పి, యూలన్‌తో పాటుగా యాసుకై కూడా పాల్గోవాలంటాడు. దీనికి యూలన్ అంగీకరించదని, అవమానంతో యాసుకై ఖాఖాన్ స్వయంగా భార్యను నరికి పోగులు పెడతాడని ఈ ఎత్తు వేస్తాడు. కానీ యూలన్‌ని కనిపెట్టుకుని ఉండడం కోసం తన తెగవారిని చంపిన కక్ష కూడా మరచి యెక్కామంగోల్ తండా రక్షణలో చేరుకున్న యూలన్ అన్న, కుంటివాడైన కరాచర్ ప్రాణానికి తెగించి మరీ ఆమెను భర్తకు సుమఖురాలిని చేసి ఆమెను ఈ వ్యూహం నుంచి కాపాడతాడు. యూలన్‌కు కుడి చేతిలో ఎద్దుమూపురం లాంటి మాంసఖండం కలిగి, జగజ్జేత అయ్యే లక్షణాలు కలిగిన పిల్లాడు పుడతాడు. అతనికి టెమూజిన్ (ఉక్కుమనిషి) అని పేరు పెడతారు. అప్పటి నుంచీ క్రమంగా కరాచర్‌కు ఆ తండాలో పట్టు పెరుగుతుంది. చివరకు అతనిని ఖాఖాన్ మహామంత్రిగా నియమించేంతగా అతని పలుకుబడి పెరుగుతుంది.

గోబీ ఎడారిలో అనునిత్యమూ కలహించుకుంటూ ఒకరి ఆస్తుల్ని, ఆడవాళ్ళని మరొకరు ఎత్తుకుపోతూ, ప్రమాదకరమైన జీవితం గడిపే వందలాది తండాల్లో కొన్నిటిని జయించి తమలో కలుపుకుని యాసుకై ఖాఖాన్ బలపడతాడు. ఈ క్రమంలో శాంతిగా జీవించేందుకు ఆయన రక్షణలోకి మరికొన్ని తండాలు వస్తాయి. గోబీ జాతుల సమాఖ్యగా ఆయన నాయకత్వం గోబీ ఎడారిలో రూపొందుతుంది. చైనా గోడను ఆనుకుని వున్న నదీతీరంలో రాజ్యం ఏర్పరుచుకున్న అపర కుబేరుడు తుఘ్రల్ ఖాన్ యెక్కామంగోలు తండాకు వస్తాడు. కరాచర్ చాకచక్యమైన మాటవిధానంతో తుఘ్రల్ ఇప్పుడు తమ్ముడి చేతిలో పదవీచ్యుతుడై వీరి సహాయం కోరి వచ్చాడని బయట పెట్టిస్తాడు. ఇలా రాజ్యం పోయి ఏడుస్తున్న వాడికి తాను సాయం చేసేదేంటన్న యాసుకైని గోబీలో తన బలం పెరగడం వల్ల యుద్ధం ఎలా తప్పనిసరి అయిందో తెలియజెప్పి, తుఘ్రల్ ఖాన్‌తో మంగోల్ తండాకు ఆయుధసంపత్తి ఇప్పించేలా ఒత్తిడి చేసి కరాచర్ యుద్ధం చేయిస్తాడు.

మరికొన్నేళ్ళకు యాసుకైని అతని స్వంత పెదనాన్నల వంశానికి చెందిన టర్గుటాయ్ ఆప్యాయత నటించి రహస్యంగా సారాలో విషం కలిపి పోసి చంపిస్తాడు. యాసుకై పెద్ద కొడుకు టెమూజిన్‌ను కూడా రహస్యంగానే పట్టుకుని బంధించబోతాడు. తప్పించుకున్న టెమూజిన్ తిరిగి గోబీ చేరుకుంటాడు. అక్కడ మొత్తం తండాలో సమాఖ్య విచ్చినమైపోయి అత్యంత ప్రమాదకరమైన స్థితిగతులు తారసపడతాయి. అప్పటి నుంచి మొదలుకొని టెమూజిన్ తండాను తిరిగి ఎలా నిలిపాడు? శత్రువులతో ఎటువంటి యుద్ధాలు చేశాడు? చివరకు గోబీ సమాఖ్యను ప్రపంచ విజయం దిశగా ఎలా నడిపాడు? వంటివన్నీ ఆసక్తికరమైన కథనంతో నవలలో సాగుతాయి.

ఉన్నతమైన లక్ష్యం
యుద్ధనిర్వహణలో వ్యూహకర్తకు ఎదురయ్యే అతి పెద్ద సమస్య శత్రువుతో కాదు తన సైన్యంతోనే. సైన్యం అన్న ఒక్క పేరుతో సూచించే మహాసమూహంలో ప్రతివారూ ప్రత్యేక వ్యక్తులే. వారందరికీ తమకంటూ వ్యక్తిగతమైన స్వార్థాలు, స్వంత ప్రణాళికలు, ఆశయాలు వుంటాయి. ఆ వ్యక్తిగతమైన స్వార్థాలు పెచ్చరిల్లితే చివరకు తమకందరికీ ముప్పు వస్తుందనే స్పృహ వుండదు. అది ‘చెప్తే’ అర్థమయ్యేది కాదు. ఈ స్వభావాన్ని నవలలో ఒకచోట ఇలా వివరిస్తాడు రచయిత — “మానవ జాతిలో ఒక దుష్టస్వభావం వున్నట్టు కనిపించుతుంది. తాను యెందుకూ పనికిరాని పక్షి అయినప్పటికీ, యే ఆచ్ఛాదనా లేకుండా కాస్త యే గాలిలోనో ఇలా నిల్చోబెడితే రెండు సెకండ్లలో ఉఫ్ మని ఆరిపోయే గుడ్డిదీపం అయినప్పటికీ అధికారం చెలాయించాలనే యేడుపు ప్రతివాడికి వుంటుంది. అలా అధికారం చేపట్టడానికి ప్రయత్నించడంలో ప్రతి అడ్డమైన కక్కుర్తి పనులకూ దిగుతారు. యుక్తాయుక్త పరిజ్ఞానం నశించి, తమ నెత్తిమీది గొడుగును తామే చింపివేసుకోవటానికి కూడా పూనుకుంటారు.”

ఈ ప్రయత్నాలు, వాటి పర్యవసానాలు నవల నిండా పరుచుకునే వుంటాయి. టెమూజిన్ (ఛెంఘిజ్ ఖాన్) తండ్రి యాసుకై మరణించి, టెమూజిన్ తండాలో లేని అరాచక సమయం ఈ రకమైన ప్రయత్నాలకు ఊతమవుతుంది. యెక్కామంగోలు తండాకు చెందిన యాసుకై ఆధ్వర్యంలో తమ శాంతి కోసం, రక్షణ కోసం స్వయంగా వచ్చి ఆయన నాయకత్వం ఒప్పుకుని గోబీ కురుల్ టాయ్‌లో (గోబీ పెద్దల సమాఖ్య) భాగం అయ్యామన్న విషయాన్ని కూడా మరిచి ఎవరికి వారే తాము నాయకత్వాన్ని చేపట్టాలని ప్రయత్నిస్తూ ఆ సమాఖ్యను నిలువునా తూట్లు పొడిచి శత్రువులకు అవకాశం ఇస్తారు. ఐతే తండాల నాయకుల స్థాయిలోనే ఉన్న అనైక్యత ఇతరుల్లో వ్యాపించకుండా చెంఘిజ్ ఖాన్ పాత్ర వ్యవహరించే విధానం తెలుసుకోదగ్గది.

ఎవరికి వారుగా విడిపోయే మనఃస్థితిలో విస్తరణే ఏకైక సిద్ధాంతంగా, కిరాయికి తీసుకున్న సైనికులను చేర్చుకుని పోరాడేవారు విజయాన్ని సాధించేందుకున్న అవకాశాలు తక్కువ. సైన్యాన్ని సైన్యంగా నిలపగలిగే వాటిలో ముఖ్యమైనది సామూహికమైన లక్ష్యం. నవలలో టెమూజిన్‌కి మొదటి నుంచీ గోబీ జాతులను ఐక్యం చేయాలని, తమవాళ్ళ ప్రాణాలు, మానాలకు పూచికపుల్ల విలువ కూడా ఇవ్వని రాజ్యాలు, రాజులు తమవారిని వేటాడేందుకు వీలుగా అరక్షితంగా, అనైక్యంగా వదలిపెట్టకూడదన్నదే లక్ష్యం. దానిని సాధించేందుకు ఎదురయ్యే మార్గంలో ప్రాణాన్ని, అంతకన్నా ఎక్కువగా నాయకత్వాన్ని విడిచిపెట్టడానికైనా సరే సిద్ధపడతాడు.

స్వస్వరూప జ్ఞానం
తన శరీరం తాను తెలుసుకోలేని వాడు, చుట్టూ కలయజూసుకుని స్థితిని అంచనా వేసుకోలేని వాడు యుద్ధంలో అత్యంత దారుణమైన పరాజయాలు మూట కట్టుకుంటాడు. తన బలం ఏమిటో నిష్కర్షగా అంచనా వేసుకుని అవసరమైతే దాన్ని పెంచుకోవడం, లేదూ ఉన్న స్థితిలో వీలుగా వినియోగించుకోవడం, తన బలహీనతలేమిటో తెలుసుకుని దాని వల్ల జరగగల అనర్థాలు అరికట్టడం చాలా చాలా ముఖ్యమైన లక్షణాలు. ఊహాలోకాల్లో లేని గొప్పలను ఊహించుకోవడమో, ఉన్న శక్తులను తక్కువ జేసుకోవడమో మేలు చేయవు. తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడం, చుట్టూ ఉన్నవారి ప్రాణాలను నిలపడం కోసం తన పరిమితి తెలుసుకోవాల్సిందే.

గోబీలాంటి యుద్ధభూమిలో బతికేందుకు వీలు చూసుకోకుండా జీవితాన్ని ఊహాస్వర్గాల్లో పెట్టుకుని నిజాన్ని బలిపెట్టడం నవలలోని తెలివైన పాత్రలేవీ చేయవు. నవల ప్రారంభంలోనే తనను ఎత్తుకువచ్చిన యాసుకైపై అయిష్టంతో తనను తాను చంపుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న యూలన్‌ను ఈ కటిక నిజంతోనే ఆమె అన్న కరాచర్ ప్రతిఘటిస్తాడు. ఎట్టయెదుటన మాట వినకుంటే ప్రాణం తీసేందుకు సిద్ధంగా వున్న సింహం యాసుకై, అతనిని రెచ్చగొట్టి వదులుతూండే నక్కలాంటి మతగురువు షామాన్, ఉండగానే వారిని లక్ష్యపెట్టక ప్రమాదం తెచ్చుకున్న చెల్లెల్ని సరిజేసేందుకు తనను తాను బలి పెట్టుకునేందుకు కూడా వెనుకాడడు. ‘యూలన్! మన తండ్రికి మనం యిద్దరమే సంతానం. ఇద్దరం తెలివిగల వాళ్ళమేనని, ప్రపంచంలో ఏదో విధాన బ్రతకగలమని నేను ఎంతో సంతోషించుతూ వచ్చాను. కానీ నువ్వు వట్టి మూర్ఖురాలివని ఈనాడు తెలుసుకుని దురసిల్లుతున్నాను. మానవ జీవితంలో బీభత్సకరంగా ఎదురైన ప్రతి ప్రమాదాన్ని బలంగా చేతిలోకి తీసుకుని సుఖం క్రింద మార్చుకుని బ్రతకలేని పిరికిపందవని నేనెప్పుడూ అనుకోలేదు. జీవించడం చేతకాక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం కంటే నీచాతినీచమైన పిరికితనం మరొకటి లేదు. తెలివితక్కువ దద్దమ్మలా నీ భర్త ఖడ్గానికి బలి కాలేదని నన్ను అవమానించావు. అంతకంటే అవివేకం, అజ్ఞానం మరొకటి లేదు. అవకాశం వున్నంత వరకూ నేను బ్రతకటానికే ప్రయత్నించుతాను. కానీ నీవు యీవేళ నాకా అవకాశాన్ని లేకుండా చేశావు. ప్రాణం కన్నా ఎక్కువగా భావించి నిన్ను పెంచాను. నీవు నా కళ్ళ ముందు చిత్రవధ కావడం నేను చూడలేను. అందుకోసం ముందుగానే నా దారి నేను చూసుకుంటాను. యాసుకైతో పోరాడలేదని నన్ను పిరికిపందగా పరిగణించావు. ఇదుగో ఇప్పుడే పోయి అతనితో పోరాడి నీ ముచ్చట తీరుస్తాను’ — అంటూ చేసిన సాహసానికి ఆమె మారడం మిగతా కథను ముందుకు నడుపుతుంది. ఐతే అక్కడే రచయిత జీవితంలోని అత్యంత వాస్తవికతను ప్రతిపాదిస్తాడు.

ఆపైన చాలా సందర్భాల్లో టెమూజిన్ సాధారణంగా అందరూ అంగీకరించే వీరత్వాలు వంటి వాటిని నిర్ద్వంద్వంగా ఖండిస్తాడు. తాను లేనప్పుడు తండాపై పడి తన భార్యను మెర్కిట్ తండా వారు ఎత్తుకుపోయారన్న విషయం తెలిసినప్పుడు తండాను శక్తిమంతం చేయడం పైనే దృష్టిపెడతాడు. తమ్ముడు సహా అందరూ, ‘యూగిలెన్ ఎక్కీ(రాణి)ని ఎత్తుకుపోతే మనకు సిగ్గు వేయడం లేదా? దానికి వెంటనే ప్రతీకారంగా దాడి చేయొద్దా?’ అని అడిగితే మన అహంపై దెబ్బకొట్టి శత్రువు యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. అతను అన్ని విధాలుగా సిద్ధంగా వున్నప్పుడు నా ఒక్కడి భార్య కోసం యుద్ధానికి నడిచి ఇన్ని ప్రాణాలు తీయలేనంటూ తిరస్కరిస్తాడు. చివరకు ఏడాది తిరిగాక వ్యూహాత్మకంగా వారినే యుద్ధానికి లాగి ఓడించి తన భార్యను తిరిగి తెచ్చుకోవడం వేరే సంగతి. ఇలాంటి సందర్భాల్లో వీరధర్మాలు, పౌరుషాలు వంటి సాధారణమైన విషయాన్ని, మానాభిమానాలు, ప్రతీకారేఛ్ఛ వంటి అత్యంత సహజమైన మానవ లక్షణాలను — చీల్చుకుని మరీ వాస్తవాన్ని స్పష్టంగా చూస్తాడు. దాన్ని ఉన్నదున్నట్టుగా అంగీకరిస్తాడు. తన వ్యక్తిగతమైన భావోద్వేగాలను, ఊహాజనితమైన సిద్ధాంతాలను పక్కన పెట్టి ప్రయోజనానికి పెద్దపీట వేస్తాడు.

యుద్ధంలో వ్యూహకర్త ఎదుట ఒక వాస్తవం వుంటుంది. వీరత్వాలు, పౌరుషాలు, ఇతరేతర మానసికోత్పత్తులు ఆ వాస్తవాన్ని మార్చలేవు. దానిని మనం చూసే విధానం మార్చి ఏమారుస్తాయి. సామాన్యులు వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించలేరు. పొగమంచు లాంటి దట్టమైన భావాల ప్రలోభం లోంచి కూడా అత్యంత స్పష్టంగా ఎట్టయెదుట ఉన్న వాస్తవాన్ని చూడగలగడం, ఆ వాస్తవానికి అనుగుణంగా ప్రవర్తించగలగడం మాత్రమే వ్యూహకర్తలను సామాన్యుల నుంచి వేరు చేస్తుంది. వాస్తవానికి సాధ్యమైనంత దూరంగా, ఊహాలోకంలో, ఆదర్శాల ప్రభావంలో ఉండే మరో పాత్ర చమూగా, ‘నీలో యింత పిరికితనం వుందని నే నెన్నడూ అనుకోలేదు,’ అన్నప్పుడు టెమూజిన్ వీరధర్మాలూ, పిరికితనం లాంటి మాటలన్నీ అర్థంపర్థం లేని పిచ్చి మాటలు, అంటూ కొట్టిపారేస్తాడు; వాస్తవం వీటికి అతీతంగా వుంటుందని, ఈ రకమైన మాటలతో రెచ్చగొట్టడం దాన్ని మరుగు పుచ్చేందుకు కొందరు వాడే వ్యూహమేనని.

రాజకీయ చదరంగంలో యుద్ధనిర్వహణలో కృతజ్ఞత, క్రమాక్రమాలు, వీరత్వం వంటివన్నీ నూటికి ఎనభైమంది వ్యూహకర్తలకు చాలా సందర్భాల్లో కేవలం పాచికలు. నిరంతరం ఏదోక అవసరాన్ని, వీలును చూసుకుంటూ వాటికి మర్యాదకరమైన పదాల ముసుగు వేసి, అవతలివాణ్ణి తమ వీలుకు ఉపయోగించుకునేందుకు పాచికలుగా వాడుతూండడం ఆ రంగంలో కద్దు. కొన్ని సందర్భాల్లో కొందరి పట్ల కృతజ్ఞత వంటి మానవ సహజమైన భావాలు కలగవచ్చు, వాటి ద్వారా వ్యవహరించవచ్చు. ఐతే సామాన్యమైన రాజకీయ వ్యవహారంలో ఆ పదాలను వాటి యదార్థమైన అర్థంతో స్వీకరించకూడదు. పైగా తమ వరకూ తాము వాటిని పాటిస్తే ఏమో కానీ తల పండిన రాజ్యతంత్రజ్ఞుడి నుంచి ఇటువంటివి ఆశించడం భంగపాటుకే దారితీస్తుంది. పై సిద్ధాంతాన్ని నవలలో చెంఘిజ్ ఖాన్ పలుమార్లు నొక్కి చెబుతాడు. యుద్ధంలో తమకు సాయంగా తుఘ్రల్ ఖాన్ దళాలను పంపుతానంటే, ఆయుధాలు చాలు, సైన్యం వద్దు అని తిప్పికొడతాడు. టెమూజిన్ తమ్ముడు చమూగా అమాయకంగా, దళాలు ఎందుకు వద్దు? అని ప్రశ్నిస్తే, వచ్చిన దళాలు వచ్చిన పని మాత్రం చూసి మనల్ని వదిలి వెళ్తాయంటావా? అవకాశం చూసుకుని గోబీలో మనపైనా దాడి చేస్తే ఏమిటి సంగతి? అని టెమూజిన్ తన ఆలోచన వ్యక్తం చేస్తాడు. అంత అక్రమం జరుగుతుందంటావా? అంటాడు చమూగా. దానికి టెమూజిన్ చెప్పే సమాధానం పై యావత్తు విషయానికి సారాంశంగా భాసిస్తుంది. క్రమమేమిటి, అక్రమమేమిటి? ఎవడికి వీలుగా వున్నది వాడికది క్రమం. ఎవరికి వీలు తప్పింది వాడికది అక్రమం! అని ముగిస్తాడు ఆ సంభాషణ.

సైన్యసహకారాల గురించీ, రాజ్యవ్యవహారాల గురించీ దౌత్యసంభాషణల్లో కూడా మొదట కరాచర్, ఆపైన మేనల్లుడు టెమూజిన్ ఇదే విధానాన్ని అనుసరించుతారు. వ్యక్తులు మభ్యపుచ్చేందుకు ఉపయోగించే అందమైన పదాలు, దౌత్య పరిభాషలను ఒలిచి వాటి వెనుకనున్న కఠిన వాస్తవాన్ని, ఎవరు ఎవరికి ఎంతవరకూ అవసరమన్న విషయాన్ని చూస్తారు, ఆ కఠిన వాస్తవాలు తమకు తెలుసన్న విషయం తెలియజేసి బేరం మొదలుపెడతారు. ఐతే దీనిలో వాస్తవిక దృష్టిని అవలంబించేవారికి వుండే మరో ఉపయోగాన్ని కూడా వారు స్వీకరిస్తారు. అది అవతలి వారికి తమ ఉద్దేశాలు మరుగు పరచాల్సి వస్తే ఏ పరిభాష, ఏ ప్రయోజనాలు పక్కదోవ పట్టించగలవో తెలుసుకోవడం.

ఇక నవలలోని ప్రతినాయక పాత్ర అనదగ్గ తుఘ్రల్ ఖాన్ కూడా నిత్యం కృతజ్ఞత వంటివి ముసుగులుగానే వాడుతూ అవకాశం, అవసరాలను మాత్రమే నిత్యసత్యాలుగా ఎంచుతూంటాడు. ఇలా సైన్యపు స్థితిగతుల విషయంలోనూ, జీవిత విషయాల్లోనూ వాస్తవాన్ని వాస్తవంగా దర్శించడం, దానికి అనుగుణంగానే ప్రతిస్పందించడాన్ని చాలా గట్టిగా ప్రతిపాదిస్తాడు రచయిత.
తనను తాను ప్రదర్శించుకోవడం
మన రూపాన్ని మనం ఎలా ప్రదర్శించాలి, మన ఉద్దేశాల ప్రదర్శనలో ఏ క్రమం పాటించాలన్న విషయం యుద్ధనిర్వహణలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలామంది తమ బయటి రూపాన్ని తమ అహాలు, భావాలు ఎలా చూపించదలిస్తే అలాగే చూపిస్తారు. కానీ సరైన వ్యూహకర్త మాత్రం తన లక్ష్యాల సాధనకు అవసరమైన విధంగా రూపాన్ని ప్రదర్శిస్తారు.


గోబీ బంజారాలలో ఐక్యంగా వుండకపోతే మృత్యువే గతి అని తెలిసినా, ఆ ఒక్క వాస్తవమే నిరంతరం పట్టి నిలపలేని సాధారణ ప్రజల కోసం పలుమార్లు మత గురువు షామాన్‌తో టెమూజిన్ తను భగవంతుని అవతారమని, తను జగత్తులో అవినీతిని అంతంచేసి జగజ్జేత కావడానికే అవతరించాడని చెప్పిస్తూంటాడు. అత్యంత కీలకమైన సమయాలలో తోటి వారు తన సమర్థతపై సందేహం ప్రదర్శించినా, భయాందోళనల్లో మునిగినా, ‘తాను స్వయంగా భగవదవతారాన్ననీ తనను ఎవరూ ఏం చేయలేరనీ,’ ధైర్యం చెప్తూ వుంటాడు. ఆంతరంలో మాత్రం ఇది వాస్తవం కాదని తెలిసినట్టే వుంటుంది. శత్రువుల చెర నుంచి రహస్యంగా తప్పించుకుని బయటపడి అది తన మహాప్రభావ ఫలితంగా వివరిస్తాడు. ఇదంతా ఏదో ప్రజలను మోసం చేయడానికి కాక ఒక నాయకత్వంపై గురి కుదిర్చేందుకు అన్న విషయాన్ని రచయిత సూచిస్తూంటాడు. టెమూజిన్ చివర్లో గోబీ జాతులన్నిటినీ ఒకే నాయకత్వంలోకి తీసుకు వచ్చాక, ఖాఖాన్ బాధ్యతలు వదిలివేస్తున్నానని ప్రకటిస్తూ ఇలా చెప్తాడు: “నా బాల్యంలో పెద్దలూ, మతగురువులూ అంతా నా చుట్టూ జేరి జోస్యం చెబుతూ వుండేవారు. నేను గోబీ ప్రజలను ఉద్ధరించడానికి పుట్టిన మహామహుడన్నారు. ఆ మాటలేవీ నేను నమ్మలేదు. వారి మాటలలో ఒక్కటే గ్రహించాను. నా ద్వారా ఆ మహాకార్యం సాధించబడాలనే అభిలాష ఆ పెద్దలందరికీ ఉన్నట్టు నేను అర్థం చేసుకున్నాను. ఆశీర్వచనమని, ఆ పెద్దల ఆజ్ఞగా, నాటి నుంచీ ఆ బాధ్యతను నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాను.”

టెమూజిన్ బలహీనంగా వున్నప్పుడు మహా బలవంతునిగా ఉన్నట్టు ప్రదర్శించుకోవడం ద్వారా యుద్ధసన్నద్ధమయ్యేందుకు సమయాన్ని సంపాదించుకుంటూంటాడు. అలానే యుద్ధానికి సర్వసిద్ధంగా వుండి, ఒక్కోసారి బలహీనునిలా కనిపించి శత్రువులను ముగ్గులోకి లాగుతాడు. తన తండ్రి చేసిన సాయంతో గద్దె పొంది, చివరకు బలహీనంగా ఉన్నప్పుడు తననే నలిపెయ్యడానికి వచ్చే తుఘ్రల్ ఖాన్‌కు, ‘తమకు చిక్కులున్నాయి కనుక మా సహకారం కోరి వచ్చి వుంటారని, మా సమస్యలు ఇప్పటికే తీర్చుకున్నాము, కావాలంటే మీ మిత్రులుగా మీపై వచ్చిపడిన పగవారిని ఓడించిపెట్టగలమని,’ ఉత్తరం రాసి అయోమయానికి గురిచేసి తప్పించుకోవడం దీనికి మంచి ఉదాహరణ. తుఘ్రల్ ఖాన్ రాజధానికి నలుగురుగా వెళ్ళి, ఏ దిక్కూలేని స్థితిలో వున్నా ‘మాకే ఇబ్బందులూ లేవు, మీకేదైనా కావాలిస్తే తుపాకులు ఎలా తయారు చేయాలో నేర్పండి మీ శత్రువులను కొట్టిపెడతామని,’ లేని బలాన్ని చూపుతూ ఆయుధ సంపత్తీ అవకాశాలూ గెలుచుకుంటాడు. ‘నీకున్నది మాత్రమే బలం కాదు శత్రువు నీకుందని నమ్మేది కూడా నీ బలమే!’ అన్న యుద్ధసూక్తిని నవలలోని ఎన్నో సన్నివేశాల్లో, సంభాషణల్లో రచయిత ఇలా ప్రతిఫలింపజేస్తాడు. చివరకు మంగోలు వీరులందరూ టెమూజిన్‌ను వదిలివెళ్ళినట్టుగా, తుఘ్రల్ ఖాన్ పక్షాన చేరినట్టుగా, టెమూజిన్‌ మతిస్థిమితం కోల్పోయినట్టుగా భ్రమింపజేస్తారు. శత్రువు దీన్ని గొప్ప అవకాశంగా భావించినప్పుడు, వారి పక్షానికి పంపిన తమవారి సాయంతో స్వయంగా శత్రువులందరూ ఆదమరచి తాగి తందనాలాడి పడి వున్నప్పుడు రాత్రికి రాత్రి నరికివేస్తాడు. ఒక్కోసారి నరరూప రాక్షసునిగా, రక్తం తాగే క్రూరుని గానూ, మరో సారి పిచ్చివాడై గోబీ బంజర్లలోకి పారిపోయినట్టు గానూ, మరో సారి మహా బలం పుంజుకున్నవాడి లానూ రకరకాల ప్రథలు తమకు అవసరమైనప్పుడు అవసరానికి అనుగుణంగా వ్యాపింప జేసి శత్రువును తప్పుడు అంచనాలకు తీసుకు వస్తూంటాడు. ఇదంతా రక్షణాత్మక యుద్ధవ్యూహం(Defense war strategies)లో భాగమే.

ప్రతిప్రాణానికి బాధ్యత
ఛంఘిజ్ ఖాన్ పాత్ర ఎన్నోమార్లు ప్రకటించే ముఖ్యమైన యుద్ధనీతి, ‘నీ వ్యక్తిగత స్వార్థాల కోసమో, నీ బలహీనతల వల్లనో ఉద్రేకపడి నువ్వు ఎదిరించడానికి సాధ్యం కాని సమయంలో శత్రువును ఎదిరించకు,’ అన్నది. దీని వెనుక బలమైన మానవీయ కోణం ఉంది. వివేకవంతుడైన సైన్యాధ్యక్షుడు తన ఉద్రేకాలతోనో, మరే కారణాలతోనో తన సైనికులను ఘోరమైన ఊచకోతకు గురి చేయడు. వాళ్ళ ప్రాణానికి విలువ ఇవ్వడమంటే వ్యూహరహితంగా యుద్ధాల్లోకి దిగకపోవడమే. నవలలో టెమూజిన్ ఆ వివేకాన్ని మొదటి నుంచీ కనబరుస్తూనే ఉంటాడు. దానికి ఒక చక్కని ఉదాహరణ టెమూజిన్ దౌత్యవ్యవహారాల్లో తండాకు దూరంగా వెళ్ళినప్పుడు తన మొదటి భార్య బుర్టీని మెర్కిట్ తండావారు ఎత్తుకుపోయిన సందర్భంలో కనిపిస్తుంది. మెర్కిట్ తండాపై దాడి చేద్దామని టెమూజిన్ సైన్యంలోని ముఖ్యులు ఊగిపోతారు. కానీ టెమూజిన్ వద్దని వారిస్తాడు. ఆయన అండా (రక్త సోదరుడు) అయిన చమూగా, నీకు మానమర్యాదలు లేవా? అన్నప్పుడు, ‘యెక్కామంగోలు తండాలోని సైనికుల భార్యలెందరినో గతంలో యుద్ధసమయంలో ఎత్తుకుపోయారు. అప్పుడు లేని ఆవేశాలు ఇప్పుడు ఎందుకు? ఇది ఉచ్చు. మనపై దాడి చేసి అహాన్ని దెబ్బకొట్టి శత్రువు యుద్ధానికి పిలుస్తున్నాడు. మెర్కిట్ తండావాళ్ళు చాలా సన్నాహం మీదున్నారు. మనం యుద్ధానికి వెళ్తే చెండాడదామని కాచుకు కూర్చున్నారు. ఒకవేళ ఎంత దాడిచేసినా రామేమో అని బుర్టీని ఎత్తుకుపోయారు. ఇప్పుడు వాళ్ళమీదకి దాడికి వెళ్ళి వేలాదిమంది సైనికులను ఉత్తిపుణ్యానికి చంపే అధికారం నాకు లేదు!’ అని తెగేసి చెప్తాడు. ఆ సంవత్సరమంతా అవమానాన్ని దిగమింగి చివరకు అవకాశం దొరికినప్పుడు అతితక్కువ సైనిక నష్టాలతో వారిని ఓడించి బుర్టీని తెచ్చి ఏలుకుంటాడు. ఇదే విషయాన్ని చెప్తూ యుద్ధవ్యూహ నిపుణునిగా పేరు పొందిన ఫ్రెడ్రిక్ ద గ్రేట్ (Fredrick the Great, 1712-1786) నువ్వు నీ సైనికులచే ప్రేమింపబడాలని కోరుకుంటే వారి రక్తాన్ని ప్రేమించి దానికి బాధ్యత వహించు, వారిని ఎప్పుడూ ఊచకోత వైపుకు నడిపించకు అని అంటాడు.

టెమూజిన్‌తో తన శత్రువులైన నైమాన్ తండాల్ని జయింపజేసి, చివరకు అతన్ని కూడా నలిపెయ్యాలన్న వ్యూహంతో తుఘ్రల్ ఖాన్ తనకి సాయం అంటూ పెద్ద సైన్యాన్ని పంపుతాడు. ఆ సైన్యాన్ని నెత్తిన పెట్టుకున్నా లేదూ యుద్ధం చేసినా మొత్తంగా నాశనాన్ని కొనితెచ్చుకున్నట్టే. అందుకే అదను చూసుకుని ఆ సైన్యాన్ని నడిపించుకుంటూ వచ్చిన సేనానాయకునితో స్నేహం నటించి, వారం రోజుల్లో నేనూ వచ్చి చేరుకుంటాను, మీరు ముందు వెళ్లి మాటు వేయండి అని ఉత్తర ప్రాంతానికి పంపుతాడు. వారాలకు వారాలు గడిచిపోతున్నా అతను రాకపోవడం, తన సైన్యమంతా చలికి గడ్డకట్టి విషజ్వరాలతో విలవిలలాడడం చూసిన సేనానాయకునికి ఇది తన వేలితో తన కంటినే పొడిచే యుక్తి అని తెలుస్తుంది. ఈ సైన్యం పైకి శత్రు తండాలు వచ్చిపడతాయి. తుఘ్రల్ సైన్యపు తుపాకులు వారిని, వారి తెగింపు వీరిని, దారుణంగా నాశనం చేసేశాక మెరుపులా వచ్చిపడి మిగిలిన వారిని తుదముట్టిస్తారు టెమూజిన్ నాయకత్వంలో అతని సైనికులు. తనకున్న వనరుల్ని అతి తక్కువగా ఖర్చు చేసి సాధించేదే అత్యుత్తమమైన విజయం. శత్రువుతో బలహీనమైన సమయాల్లో బాహాబాహీ తలపడి, ప్రాణావశిష్టంగా మిగిలిన సైన్యాలతో సాధించే గెలుపు ఓటమి తోనే సమానం. పై వ్యూహం టెమూజిన్‌ను అత్యుత్తమ వ్యూహకర్తగా నిలుపుతుంది. ఈ విషయాన్ని వ్యాఖ్యానిస్తూ టర్గుటాయ్ భగత్తూర్ (నైమాన్ తండాల తరఫు నాయకుడు) సైన్యం హఠాత్తుగా వచ్చిపడిన మంగోలు వీరుల ధాటికి ఆగలేక ఆఖరి పోరాటం చేస్తూంటే, ఈ యుద్ధాన్ని గురించి ఎవరైనా సైనికుడి ప్రాణాలకున్న విలువ తెలియని నాటురకం చరిత్రకారుడు రాయాల్సి వస్తే టర్గుటాయ్ అతని సైనికులు వీరోచితంగా పోరాడారు, అని రాస్తారంటూ రచయిత వెక్కిరిస్తాడు.

తన సైనికుల పోరాటపటిమను తక్కువ అంచనా వేసే వ్యక్తి కాదు టెమూజిన్. అలాగని మనుషులుగా వారికీ వారి శరీరాలకు ఉన్న పరిమితులను అర్థం చేసుకోకుండా అన్యాయంగా వారిని పోరాటాల్లోకి దింపేవాడూ కాదు. తండ్రి చనిపోయాక టర్గుటాయ్ సైన్యం వచ్చి మంగోలు తండాపై రాత్రికి రాత్రి దాడి చేస్తుంది. కానీ ఖాళీ డేరాల్లో సైనికులను పెట్టి, చుట్టూ ఉన్న కొండలపై విలుకాళ్ళను మాటు వేయించి టెమూజిన్ పక్కా సైనిక వ్యూహంతో శత్రుదళాలు ఊహించని విధంగా వారిని నరికివేస్తాడు. ఆ తరువాత, చమూగా అన్నని, ‘ఈ రక్తపాతం అంతా ఎవరి కోసం జరిగినట్టు?’ అని అడుగుతాడు. ‘నన్నడుగుతావేరా వెర్రి తమ్ముడూ. ఇందాకా మన మీదకు వచ్చి పడిన మీ టర్గుటాయ్ కక్కాను అడక్కపోయావా?’ అని జవాబిస్తాడు టెమూజిన్. ఈ జవాబే సైన్యాన్ని ఓ యుద్ధం లోకి నడిపే ముందు వ్యూహకర్త ఎంత బాధ్యతతో వ్యవహరించాలో చెప్తుంది.

తమ నాయకుడు తమ ప్రాణాలపై ఇంత బాధ్యతతో వ్యవహరిస్తాడనని నమ్మిన ప్రజలు ఆయన కోసం ఏం చెయ్యకుండా వుంటారు? మంగోలు కఠిన సైనిక శాసనం వెనుక ఇంధనం ఇదేనని రచయిత ప్రతిపాదన.

పగ్గాలు పట్టదగ్గవాడు
“నీకింత అహంకారం పనికిరాదు” (రక్తసోదరుడు.)

“అహంకారమనబోకు – ఆత్మవిశ్వాసమను.”

“పేరేదైనాగానీ అదే పనికి రాదంటున్నాను; ఎప్పుడో దెబ్బ తింటావు.”

“చమూగా! మానవుడైన వాడికి అలాంటిది తప్పకుండా వుండి తీరాలి. లేదంటే దమ్మిడీకి కొరగాడు. ఇదేమిటి?”

“గుర్రం.”

“దీనికి మనకీ తేడా ఏమిటి?”

ఆ ప్రశ్న విని అంతా తెల్లబోయారు. మనిషికీ గుర్రానికీ తేడా యేవిటో యెవ్వరికీ బోధపడలేదు.

“తేడా ఏముందీ, ఏమీ లేదు. దానికి ప్రాణం వుంది; మనకి ప్రాణం వుంది. అంతా ఒక్కటే.”

“ఓరి నీ వేదాంతం ఇదయిపోనూ! కరాచర్ మామ దగ్గర పగలూ, రాత్రీ నువ్వు నేర్చుకుంటున్న చదువు ఇదేనా ఏవిట్రా?- హఁ హఁ” అంటూ భుజం తడుతూ పకపక నవ్వాడు టెమూజిన్.

చమూగాకు ఆ ప్రవర్తన కారం రాచుకున్నట్టుంది. కోపంగా ముఖం ముడిచేసుకుని గుర్రం తల మీది నుండి ఎడారి మీదికి ఏటవాలుగా చూస్తున్నాడు.

“అండా ఇటు చూడు” అన్నాడు టెమూజిన్. “ఇది జంతువు. దీనికి ఆత్మవిశ్వాసం లేదు.”

“అందుచేతనే ఇంత బలమైన జంతువై వుండి కూడా, మనిషికి లోబడి బానిసై బతుకుతోంది. ఆత్మవిశ్వాసం లేని మనుషుల గతి ఇంతే. నీకు భయంగా వుంటే ఆ గుర్రాల్ని కూడా తీసుకొని ఆ కొండల్లోకి పోయి దాక్కో. కాని, జాగ్రత్త. అక్కడ కొండల్లో కూడా నక్కలు కరుస్తాయి.”

ఇది తండ్రి మరణించక ముందు కేవలం యాసుకై ఖాఖాన్ కుమారునిగా ఉన్నప్పుడు టెమూజిన్ తన తమ్ముడు చమూగాతో చెప్పిన మాటలు. విజయం సాధించే ఏ మనిషికైనా తలుచుకోదగ్గ మాటలు. ఓ గొప్ప లక్ష్యం ఉండడం, దాన్ని సాధించగలననే గాఢమైన విశ్వాసం కలిగి వుండడం, దానికి వెళ్ళే తోవల్లో ఏది తొక్కాలో ఏది వదులుకోవాలో తెలిసి సాగడం ఇవన్నీ ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించే విజేత లక్షణాలు. (క్షమించాలి. వ్యక్తిత్వ వికాస శిక్షకుల మాటల్లా ఉన్నా, ఇలా చెప్పక తప్పలేదు.)

ఛంఘిజ్ ఖాన్‌గా ప్రఖ్యాతుడైన టెమూజిన్ పూర్తి పేరు సూటూ బోడ్గా టెంగ్రీ బట్ టెమూజిన్. టెంగ్రీ బట్ అంటే భగవంతుని కొడుకు, టెమూజిన్ అంటే ఉక్కుమనిషి. ఇదేదో సామాన్యంగా ప్రతివారూ కొడుకు గొప్పవాడవుతాడని పెట్టుకునే పేరు లాంటిది కాదు. టెమూజిన్ పుట్టుక తోనే గోబీని ఐక్యం చేసేందుకు పుట్టినవాడని నమ్మి పెట్టిన పేరు. అందుకు నిదర్శనంగా కుడి అరచేతిలో కకుద్రేకతో (ఎద్దుమూపురం లాంటి మాంసఖండం) పుడతాడు. ఆ పుట్టిననాటి నుంచి జగజ్జేత జన్మించాడని తెగలో అంతా నమ్ముతారు. నిజానికి ప్రపంచంలో ఎందరో అనామకంగా మరణించిన వారి చేతిలో కకుద్రేక వుండి వుండొచ్చు. ఇదంతా వట్టి నమ్మకమే కానూ వచ్చు. కాకుంటే విషయం అది కాదు. జగత్తును జయించేవాడు యాదృచ్ఛికంగా తయారు కాడు. తరతరాలుగా ఒక జాతిలో పాతుకు పోయిన ఆకాంక్షకు భౌతికరూపంగా నిలుస్తాడతను.

ప్రాచీన చరిత్రలో పర్షియన్ల చేతిలో గ్రీకులు ఎన్నోమార్లు ఓటమి చవి చూశారు. ఆ గ్రీకుల్లో ఓ నగరాన్ని పరిపాలిస్తూ ఇతర గ్రీకు నగరరాజ్యాలపై విజయం సాధించి వాటిని ఐక్యం చేసిన రెండవ ఫిలిప్ కుమారుడు అలెగ్జాండర్. తండ్రి మరణించాక, అలెగ్జాండర్ చెల్లాచెదురై పోయిన నగరరాజ్యాలను అనూహ్యంగా గెలిచి కూడగట్టి, ఈజిప్టును గెలుచుకుని చివరకు పర్షియాపై విజయం సాధిస్తాడు. ఇక్కడ గుర్తించాల్సిన అంశం అతను అమ్మకడుపులో ఉన్నప్పుడు ఆమెకు ‘జగజ్జేత’ అయ్యే కొడుకు పుడుతున్నట్టు కల రావడం, దాన్ని చిన్నతనం నుంచే అతనికి నూరిపోయడమూ. సరిగ్గా ఇలాగే టెమూజిన్ తండ్రి యాసుకై ఖాఖాన్ కూడా గోబీ ఎడారిలో సంచరించే బంజారీ తండాలను భుజబలంతో ఐక్యం చేసి కురుల్ టాయ్ (పెద్దల సమాఖ్య) ఏర్పరుస్తాడు. అతని మరణానంతరం అవే పరిణామాలు సాగుతాయి. చివరకు టెమూజిన్ ఛెంఘిజ్ ఖాన్‌గా మారేందుకు చిన్నతనం నుంచీ తన తల్లిదండ్రులు, చుట్టపక్కాలు నమ్మే కకుద్రేక, జగజ్జేతను కాగలననే విశ్వాసం కూడా కలిసివస్తాయి. ఇవే ఉదాహరణలు ప్రాచీన మధ్య యుగాల చరిత్రలో ఎన్నో చోట్ల చూపించవచ్చు. కాకుంటే వాటిని అవగాహన చేసుకోవడం మాత్రం నిజంగా వారికేవో అధిభౌతిక శక్తులున్నాయనో, అవతార పురుషులనో కాక అది వ్యక్తిని నడిపించే శక్తిగా అర్థం చేసుకోవాలి. మహామహులైన రాజకీయవేత్తలు, యుద్ధవ్యూహకర్తలు, నాయకుల వ్యాఖ్యలు, చేతలు, జీవితాలు ఈ నవలలోని చాలా సందర్భాలను, పరిశీలనలను సమర్థిస్తాయి. మానవుల్లో యుద్ధాన్ని సాధించగలిగే లక్షణాలు, నాయకుడైన వాడికి వుండే గుణాలు అవపోశన పట్టినట్టుగా తెన్నేటి సూరి నవలని రాశారు.
-------------------------------------------------
రచన: సూరంపూడి పవన్ సంతోష్,
ఈమాట సౌజన్యంతో

No comments: