తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – నాలుగవ భాగం
సాహితీమిత్రులారా!
దుర్యోధనుడు శోకంతో, విస్మయంతో, “నిజంగా అర్జునుడికి కోపం వచ్చి యుద్ధభూమిలో నిలబడితే అతన్నెదిర్చి నిలవగలిగే వాళ్లెవరూ లేరని తేలిపోయింది. ఇంకిప్పుడేమిటి చెయ్యటం?” అనుకుంటూ ద్రోణుడి దగ్గరికి వెళ్లి “అన్నదమ్ముల్తో, శిఖండితో కలిసి ఇప్పటికి మనసైన్యంలో ఏడు అక్షౌహిణుల్ని చంపాడు అర్జునుడు. ఇవాళే ఎంతోమంది గొప్పదొరలు అతని చేతిలో మరణించారు. వాళ్ల ఋణం తీర్చుకునేట్టు పాంచాల, పాండవబలగాల్ని మనం చంపామా అంటే అదీ లేదు. నీకు అనుగుశిష్యుడని అర్జునుణ్ణి నువ్వేమీ చెయ్యవ్. ఒక్క కర్ణుడు మాత్రం వీరుడై ఒళ్లు దాచుకోకుండా ప్రయత్నం చేస్తున్నాడు, ఐనా సైంధవుణ్ణి పోగొట్టుకున్నాం” అని గోడు వెళ్లబోసుకున్నాడు.
ఆ మాటలకి ఆచార్యుడు కటకట పడ్డాడు. “మనసుని తూట్లు పొడిచే మాటల్తో పని జరుగుతుందా? అర్జునుణ్ణి జయించటం ఎవరివల్లా కాదని నీకు ఎన్ని సార్లు చెప్పాను? అభిమానం కోసం పోరాడుతున్నా తప్ప భీష్ముడు పడినప్పుడే మనకి గెలుపు సాధ్యం కాదని నాకనిపించింది. గాండీవం నుంచి వచ్చే బహుపటిష్టమైన బాణాల్నుంచి నిన్ను రక్షించటానికి ఇది జూదం కాదు. అప్పుడు విదురుడు ఎంతగా వారిస్తున్నా వినక పుణ్యవతి ద్రౌపదికి మీరు చేసిన పాపానికి ఫలం అనుభవించక తప్పుతుందా? నామమాత్రమైనా కనికరం లేకుండా వాళ్లని అడవులకి పంపి ఆ తర్వాత వాళ్లు తిరిగొచ్చి అడిగిన అర్థరాజ్యం కూడ ఇవ్వకుంటే ఇలా వచ్చిన యుద్ధంలో వాళ్లతో పోరాటానికి సిద్ధమయ్యా, నేనూ ఒక బ్రాహ్మణ్ణేనా? ఒక పక్క పాంచాల, పాండవ బలాల పొగరు చూసి నాకు ఒళ్లు మండుతుంటే ఇలా సూటిపోటి మాటల్తో ఇంకా ఉడికిస్తావు, ఏం పని ఇది? సరే, ఏమన్నా కానీ, మనలో ఈ రాత్రికి యుద్ధం చేసే ఉత్సాహం ఉన్న వాళ్లని కూడగట్టు. నేను నా బాహాశక్తితో పాంచాలబలగాల్ని అంతం చెయ్యకుండా కవచం తియ్యను. నా చేతిలో చావకుండా తప్పించుకున్న వాళ్లని చంపమని అశ్వత్థామకి చెప్పు” అంటూ గాఢనిశ్చయంతో మన సైన్యాన్ని రాత్రియుద్ధానికి సమాయత్తం చేశాడు ద్రోణుడు.
దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వెళ్లి “మహాపటిష్టమైన వ్యూహాన్ని కట్టి అర్జునుణ్ణి మాత్రం లోపలికి పంపాడు, ఈ ద్రోణుణ్ణెలా నమ్మటం? అలా లోపలికి వచ్చి వాడు మనరాజుల్ని చంపి సైంధవుణ్ణి వధించాడు. తన మాట నమ్మి మనం సైంధవుణ్ణి యుద్ధభూమికి తీసుకొచ్చాం. ఇతని సంగతి ముందే అనుకుని వుంటే వాణ్ణి ఇంట్లోనే వుంచేవాళ్లం, మనసైన్యానికి ఇంత నష్టమూ జరిగేది కాదు. అసలీ ద్రోణుడు మనకవసరమా?” అన్నాడు రోషంగా. కర్ణుడతన్ని “తన ఓపిక్కొద్దీ యుద్ధం చేస్తున్నాడు, పాపం ఆ ద్రోణుణ్ణి అనటం ఎందుకు? విధి బలీయం. సైంధవుడికి చావు మూడింది, పోయాడు. యుద్ధం చెయ్యటం మన ధర్మం, అది చేద్దాం. విచారం వద్దు” అని అనునయించాడు.
రెండుసైన్యాలూ మళ్లీ తలపడ్డయ్.
సైంధవుడి చావు దుఃఖంతో విరక్తిగా రారాజు పాండవసైన్యం వైపుకి వెళ్తుంటే ద్రోణుడు, కృపుడు, కర్ణుడు అతనికి అడ్డంగా వెళ్లి అతన్ని దాటుకుని పాండవసైన్యంలోకి చొచ్చుకుని భీకరయుద్ధం ఆరంభించారు. పాండవసైన్యంలో దొరలంతా దుర్యోధనుణ్ణి చుట్టుముట్టారు. ధర్మరాజు మహాక్రోధంతో నీ కొడుకు విల్లు విరిచి అతన్ని మూర్ఛితుణ్ణి చేశాడు. “దుర్యోధనుడు చచ్చాడ”ని వాళ్ల బలాలు ఉప్పొంగినయ్. అంతలోనే దుర్యోధనుడు తెలివి తెచ్చుకుని ధర్మరాజుని ఎదిరిస్తే మన బలగాలు శాంతించినయ్, వాళ్లు తత్తరపడ్డారు. శిబి అనే రాజు ద్రోణుడి చేతిలో మరణించాడు. అదివరకు భీముడు భానుమంతుణ్ణి చంపిన కోపంతో భానుమంతుడి కొడుకు భీముణ్ణెదిరిస్తే అతను వాడి రథమ్మీదికి దూకి కాళ్లతో చేతుల్లో కుమ్మి వాణ్ణి తండ్రి దగ్గరికి పంపాడు. కర్ణుడు, అతని సోదరులు భీముడి మీదికి ఉరికారు. భీముడు ధ్రువుడి రథమ్మీదికి గెంతి పిడికిటితో వాణ్ణి చావబొడిచాడు. జయరాతుడి మీదికి వెళ్లి వాణ్ణీ వాడి సారథినీ చెరో చేత్తో పట్టి విసిరి కొట్టి చంపాడు. కర్ణుడొక శక్తిని వేస్తే భీముడు దాన్ని పట్టుకుని తిరిగి కర్ణుడి మీదికి విసిరాడు; శకుని దాన్ని మధ్యలో విరిచాడు. నీకొడుకులు దుర్మదుడు, దుష్కర్ణుడు అనేక బాణాలతని మీద ప్రయోగిస్తే దుర్మదుడి రథాన్ని పట్టి సారథిని చంపితే వాడు దుష్కర్ణుడి రథం ఎక్కాడు. ఒక్క తన్నుతో ఆ రథాన్ని పడేసి అందరూ చూస్తుండగా కాల్తో ఒకణ్ణి చేత్తో ఒకణ్ణి తన్ని చంపాడు. అలా భీకరాకారంతో భీముడు విజృంభిస్తే మనవాళ్లంతా పారిపోయారు. భీముడు తన సేన వైపుకి చూసి అక్కడ ధర్మరాజు కనిపిస్తే అతనికి నమస్కారం చేశాడు; ఆ భీకరమూర్తిని చూట్టానికి వాళ్లకీ భయం వేసింది.
ఇదంతా చూసి ద్రోణుడు భీముడితో తలపడ్డాడు. కర్ణాదులతనికి తోడయ్యారు. అది చూసి నీకొడుకులు కూడ వాళ్లని కలిశారు. అటువైపు నుంచి విరాటుడు, సాత్యకి, ఇతర రాజులు భీముడికి తోడుగా వచ్చి చేరారు. అప్పుడు సోమదత్తుడు సాత్యకికి దగ్గర్లో వుండి అతనితో, “ప్రాయోపవేశం చేసిన నాకొడుకు భూరిశ్రవుణ్ణి రాజధర్మం విడిచి చంపావ్, ఇప్పుడు నేన్నిన్ను చంపుతా చూడు” అని సింహనాదం చేసి శంఖం పూరించాడు. దానికా సాత్యకి “వాణ్ణి చంపిన పద్ధతి నీకు నచ్చకపోతే నిన్ను చంపే పద్ధతి అందరికీ నచ్చేట్టు చంపుతాలే, రా” అని తలపడ్డాడు. సోమదత్తుడికి తోడుగా దుర్యోధనుడు చేరాడు, అతనితోపాటు శకుని తన బలాల్తో వచ్చి చేరాడు. అలా వాళ్లంతా సాత్యకిని చుట్టుముడితే అతనికి సాయంగా ధృష్టద్యుమ్నుడు తన సైన్యంతో వచ్చాడు. ఇరువర్గాలకి పోరు ఘోరమైంది. సాత్యకి బాణాలకి సోమదత్తుడు మూర్ఛపోతే అతని సారథి రథాన్ని పక్కకి తోలుకుపోయాడు.
సాత్యకి గర్వం అణుస్తానని అశ్వత్థామ వెళ్తుంటే ఘటోత్కచుడతన్ని అడ్డుకున్నాడు. నీ కొడుకు, కర్ణుడు, మిగతా వాళ్లూ ఘటోత్కచుడితో తలపడ్డారు. వాడి దెబ్బకి అందరూ తప్పుకుంటే గురుపుత్రుడొక్కడే ఎదిర్చి నిలబడ్డాడు. ఆ రాక్షసుడి కొడుకు అంజనపర్వుడు అశ్వత్థామని ఎదిరిస్తే అశ్వత్థామ వాడి వింటిని విరిచి, రథాన్ని నుగ్గుచేశాడు. వాడు కత్తి తీసుకుంటే దాన్ని నరికాడు. గద వేస్తే దాన్ని ముక్కలు చేశాడు. ఆకాశానికెగిరి పాషాణవర్షం కురిపిస్తే దాన్ని నివారించాడు. ఇంకో రథాన్నెక్కి వాడొస్తే వాడి తల తెంచాడు.
కొడుకు చావుతో ఘటోత్కచుడు మహాక్రోధంతో అశ్వత్థామని తాకాడు. అశ్వత్థామ బాణాల్తో తత్తరబిత్తరైన పాండవబలగాల్ని అదే అదనుగా చంపమని దుర్యోధనుడు కృపకృతవర్మకర్ణవృషసేనుల్ని, దుశ్శాసనుణ్ణి పంపాడు. ఘటోత్కచుడు అశ్వత్థామ మీద ఒక పరిఘని విసిరితే అతను దాన్ని పట్టుకుని తిరిగి విసిరేస్తే ఘటోత్కచుడు తన రథం మీంచి దూకి ధృష్టద్యుమ్నుడి రథం ఎక్కాడు. ఆ పరిఘ అతని రథాన్ని, గుర్రాల్ని, సారథిని నుగ్గు చేసింది. ఒకే రథం నుంచి ఘటోత్కచ ధృష్టద్యుమ్నులు అశ్వత్థామతో పోరారు. ఇంతలో భీముడు వాళ్లకి తోడుగా వచ్చాడు. అశ్వత్థామ నవ్వుతూ ఆ ముగ్గురితో తలపడ్డాడు. అశ్వత్థామ బాణాలకి ఘటోత్కచుడు మూర్ఛపోతే ధృష్టద్యుమ్నుడు రథాన్ని పక్కకి తీసుకెళ్లాడు. ధర్మరాజు, భీముడు, సాత్యకి అశ్వత్థామని తాకారు. మూర్ఛ తేరుకుని ఇంకో రథమ్మీద ఘటోత్కచుడు కూడ వచ్చాడు. మనవైపునుంచి సోమదత్తుడు, బాహ్లికుడు, ఇతర రాజులు వాళ్లతో తలపడ్డారు.
సంజె చీకట్లు కమ్ముతున్నయ్. ఐనా ఆభరణాల జిలుగులు, చురకత్తుల తళతళలు కొంత వెలుగునిస్తుంటే యుద్ధం కొనసాగిస్తున్నారు. సాత్యకి, సోమదత్తుడు పట్టుదలగా పోరాడుతున్నారు. తన బావమరిదికి తోడుగా భీముడు వచ్చి ఓ ఉగ్రబాణంతో సోమదత్తుణ్ణి కొట్టాడు. అదే సమయాన ఒక భగభగమనే నారసంతో సాత్యకీ, బలమైన ముద్గరంతో ఘటోత్కచుడూ కొట్టేసరికి సోమదత్తుడు సోలిపడ్డాడు. అదిచూసి ఆగ్రహించి అతని తండ్రి బాహ్లికుడు సాత్యకితో తలపడితే అతనికి అడ్డుగా వెళ్లి భీముడు బాణాలేస్తే బాహ్లికుడు ఓ ఉగ్రశక్తిని భీముడి మీదికి విసిరాడు. దాని దెబ్బకతను తూలి, అంతలోనే నిలదొక్కుకుని ముద్గరంతో అతన్ని బాదాడు. ఆ వేటుకి బాహ్లికుడి తల వయ్యలైంది. వజ్రాయుధానికి పగిలిన కులపర్వతంలా కూలాడా కురువృద్ధుడు. మనసైన్యాలు హాహాకారాలు చేసినయ్.
నీ కొడుకులు పదిమంది భీముణ్ణి చుట్టుముడితే పది బాణాల్తో వాళ్ల ప్రాణాలు తీశాడతను. కర్ణుడి తమ్ముడు వృకరథుడు విక్రమిస్తే వాణ్ణి, పన్నెండుమంది సౌబల సోదరుల్ని కూడ మట్టుబెట్టాడు. శూరసేన, వసాతి, మాళవ, త్రిగర్త, బాహ్లిక సైన్యాలు అతని మీద దూకినయ్. ధర్మరాజు తన కుమారగణంతో సైన్యాన్ని తీసుకుని వచ్చి తలపడ్డాడు. ఇటు దుర్యోధనుడు ద్రోణుణ్ణి పురికొల్పాడు. అతను ఉత్సాహంగా ధర్మజుణ్ణి తాకి వాయవ్య, యామ్య, వారుణ, ఆగ్నేయాస్త్రాలు వరసగా వేస్తే ధర్మజుడు ప్రత్యస్తాల్తో వాటిని నిర్మూలించాడు. ఆవేశంగా ఐంద్రాస్త్రం వేస్తే ధర్మజుడు దాన్ని కూడ అలాగే ఆపాడు. ద్రోణుడు కోపించి సకలభూతభయంకరమైన బ్రహ్మాస్త్రం వేస్తే ధర్మరాజు కూడ బ్రహ్మాస్త్రంతో దాన్ని ఉపశమించాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ద్రోణుడితో తలపడ్డాడు.
ద్రోణుడు ద్రుపద సైన్యం మీదికి ఉరికాడు. ఐతే భీమార్జునులు అతన్నడ్డుకున్నారు. అదే అదునుగా మత్స్య, కేకయ సైన్యాలు మన సేనని చిందరవందర చేసినయ్. దుర్యోధనుడు కర్ణుణ్ణి వాళ్ల మీదికి పురికొల్పాడు. “అర్జునుణ్ణి, భీమాదుల్ని చంపటానికి నేనొక్కణ్ణి చాలు, చూద్దువుగా నా పోటుతనం!” అని కర్ణుడంటే ఆ పక్కనే ఉన్న కృపాచార్యుడు చిన్న నవ్వు నవ్వాడు. “ఔనౌను, నీ మగతనం తెలియందా? ఘోషయాత్రలో, గోగ్రహణంలో బాగానే బైటపడింది కదా! పాండవుల్తో నీ యుద్ధం ఎప్పుడూ చూడని వాళ్లకి చెప్పినట్టు చెప్తున్నావ్. ఇదివరకు ఒంటరిగా వచ్చిన అర్జునుడి చేతిలో ఓడిన వాళ్లమే అందరమూ! ఇప్పుడతను అన్నల్తో, ఘటోత్కచుడితో కలిసి యుద్ధం చేస్తుంటే మనం ఎలా గెలుస్తామంటావ్?” అని ఎత్తిపొడిచాడు.
కర్ణుడు కోపంతో “ఇంకొక్క మాట మాట్లాడితే నీ నాలిక కోస్తాను, బాపనవాడా ! ఎప్పుడూ అర్జునుణ్ణి, అటువైపు వాళ్లని పొగట్టమే కాని ఇటు ద్రోణుడు, అశ్వత్థామ, శల్యుడు, నేను నీకు లెక్కకి రాకపొయ్యామా?” అని తన మేనమామ కృపుణ్ణి తిడుతుంటే సహించలేక తీవ్రకోపంతో అశ్వత్థామ వాలుని తీసి కర్ణుడి మీదికి దూకితే దుర్యోధనుడతనికి అడ్డు పడ్డాడు. కృపుడు కూడ అతన్ని ఆపాడు. ఐనా అశ్వత్థామ పెనుగుతుంటే కర్ణుడు “వదులు రారాజా, వాడి సంగతి నేను చూస్తా, రానీ” అంటే కృపుడు “దుర్యోధనుడి మొహం చూసి ఊరుకుంటున్నా, ఇంక మాటలొద్దు, వెళ్లిక్కణ్ణుంచి” అని గద్దించాడు కర్ణుణ్ణి. అప్పుడు నీ కొడుకు అశ్వత్థామతో “నీ తండ్రి, నువ్వు, నీ మామ, కర్ణుడు, శల్యుడు, సౌబలుడు వీరాధివీరులు, నాకు రాజ్యం ఇప్పించేవాళ్లు. యుద్ధరంగంలో మోహరించివున్నప్పుడు మీలో మీరిలా పోట్లాడితే ఎలా? నన్ను క్షమించి శాంతించు” అంటే అప్పటికి అశ్వత్థామ శాంతించాడు. కర్ణుడూ ప్రసన్నుడై శత్రువుల మీద దృష్టి సారించి, అల్లెతాటిని మోగించాడు.
పాండవ సైన్యాలు కర్ణుణ్ణి కమ్ముకున్నయ్. అతను వేగంగా బాణాలు సారిస్తూ వాళ్లని చించి చెండాడుతుంటే అర్జునుడు వచ్చి ఎదుర్కున్నాడు. ఇద్దరికీ ఘోరసమరమైంది. అర్జునుడతని రథాన్ని విరిచి, సూతుణ్ణి చంపి, వింటిని విరిస్తే సిగ్గు లేకుండా కృపుడి రథం ఎక్కి పారిపోయాడతను.
అది చూసి మన సైన్యం పరిగెత్తుతుంటే దుర్యోధనుడు “పారిపోవద్దు, అర్జునుడి సంగతి నేను చూస్తా” అని ఉరుకుతుంటే కృపుడు మేనల్లుడితో “అగ్నిలో దూకబోయే మిడత లాగా దుర్యోధనుడు అర్జునుడితో తలపడబోతున్నాడు. ఒకసారతని చేతికి చిక్కితే ఇతన్ని రక్షించటం మన తరమా? ముందు నువ్వు దుర్యోధనుణ్ణి ఆపు, నేను అర్జునుడి సంగతి చూస్తా” అన్నాడు. అశ్వత్థామ “అర్జునుడి సంగతి నేను చూస్తాగా, నీకింత సాహసం ఎందుకు?” అని దుర్యోధనుడితో అంటే అతను “నీ తండ్రికీ నీకూ పాండవులంటే ప్రీతి, వాళ్లనేమీ చెయ్యరు. ఎందుకిదంతా, మీరు పాంచాలబలంతో యుద్ధం చెయ్యండి. పాండవుల విషయంలో మా తిప్పలేవో మేం పడతాం” అన్నాడు నిష్టూరంగా.
“గురువుకీ నాకూ పాండవులంటే ఇష్టమనేది నిజమే. ఐతే ఒకసారి యుద్ధానికి వచ్చాక అవి అడ్డువస్తాయా? మా శక్తి కొద్దీ మేం యుద్ధం చేస్తున్నాం, ఇన్ని యుద్ధాలు చూశాక కూడ నువ్వు నమ్మకపోతే ఎలా? మేం లేకుండా నువ్వొక్కడివే వెళ్లి గెలవటానికి పాండవులు అంత తక్కువ వాళ్లా? మేమూ, కృపుడు, కర్ణుడు, కృతవర్మ, శల్యుడు వున్నాం కదా, నీకు జయం తెచ్చిపెడతాం. ఇప్పుడే నేను వెళ్లి పాంచాలబలగం పనిపడతాను. పాండవులు అడ్డొస్తే వాళ్లతోనూ పోరతాను. చూస్తూండు” అని అతన్ని దాటుకుని అర్జునుడి వైపుకి వెళ్తే అటు అర్జునుడికి అడ్డంగా వచ్చి పాంచాల, కేకయ సేనలు అశ్వత్థామని చుట్టుముట్టినయ్.
అశ్వత్థామ ఆ సేనల్ని చెల్లాచెదురు చేస్తుంటే ధృష్టద్యుమ్నుడు అతనితో తలపడ్డాడు. ఐతే అశ్వత్థామ అతన్ని నానాతిప్పలు పెట్టి అతని చుట్టూ వున్న రాజుల్ని చంపి సింహనాదం చేస్తే పాంచాల బలాలు పరిగెత్తినయ్. ధర్మజ భీములు తమ బలాల్తో అతని మీద దాడి చేశారు. ఇటునుంచి దుర్యోధనుడు, ద్రోణుడు అక్కడికి చేరారు. ఇరుపక్షాలకీ పోరు ఘోరమైంది. భీముడు అంబష్ట, శిబి, వంగ దేశాల బలాల్ని నాశనం చేస్తుంటే అర్జునుడు మగధ, మద్ర, వంగ, అంబష్ట బలగాల్ని మరోవంక నుంచి తాకాడు. ద్రోణుడు కోపంతో వాయవ్యబాణంతో పాండవవ్యూహాల్ని చెల్లాచెదురు చేస్తే భీమార్జునులిద్దరూ ద్రోణుడితో తలపడ్డారు.
ఇంతలో సోమదత్తుడు సమరోత్సాహంతో పాండవసేనల్ని అదిలిస్తూ పరాక్రమిస్తే సాత్యకి అతనితో పోరుకి సిద్ధమయ్యాడు. సాత్యకి వింటిని అర్థబాణంతో నరికి ముప్ఫై ఏడమ్ములు అతనికి నాటాడు సోమదత్తుడు. ఇంకో విల్లు తీసుకుని ఐదమ్ములు అతనికి నాటి, అతని ధ్వజాన్ని కూల్చి ధనుస్సుని విరిచాడు సాత్యకి. అతను ఇంకో విల్లు తీసుకుంటే దాన్ని భీముడు విరిచాడు. ఘటోత్కచుడు పరిఘని విసిరితే దాన్ని నరికాడు సోమదత్తుడు. ఇంతలో అతని సారథిని గుర్రాల్ని చంపి అతని ప్రాణం కూడ తీశాడు సాత్యకి.
చచ్చిన సోమదత్తుణ్ణి చూసి మనవాళ్లు సాత్యకి మీదికి దూకితే ధర్మరాజు వచ్చి వాళ్లని చెల్లాచెదురు చేశాడు. ద్రోణుడొచ్చి అతని విల్లు నరికి జెండా విరిచి ఒంట్లో బాణాలు గుచ్చితే ధర్మరాజు ఇంకో విల్లు తీసుకుని పదునైన నారసాల్ని నాటితే ద్రోణుడు మూర్ఛ వచ్చి రథం మీద పడ్డాడు. త్వరలోనే తేరుకుని విజృంభించాడు ద్రోణుడు. ధర్మజుడి మీద వాయుదైవత్యం ఐన శరం వేస్తే అతనూ అదే అస్త్రంతో దాన్ని శాంతింపజేశాడు. ఈలోగా కృష్ణుడు ధర్మరాజుతో “నిన్ను బంధిస్తానని ప్రతిజ్ఞ చేసిన ద్రోణుడితో ఈ పోరాటం ఏమిటి? నువ్వు మన వ్యూహానికి వెళ్తే ఇక్కడ భీముడు యుద్ధం చేస్తాడులే. అసలు ద్రోణుణ్ణి చంపటానికే పుట్టినవాడు ధృష్టద్యుమ్నుడున్నాడు, అతను ద్రోణుడితో తలపడటం ఇంకా మంచిది,” అంటే అతను కొంచెం సేపు ఆలోచించి అటు వెళ్తే ద్రోణుడు ద్రుపద సైన్యాన్ని చెదరగొట్టసాగాడు.
ధర్మరాజు వెళ్లి భీముడికి సాయం అయాడు. భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు వాళ్లవైపు నుంచి, కృప, కర్ణ, ద్రోణులు మనవైపు నుంచి తలపడ్డారు. చీకట్లో ఎవరెవరో సరిగా తెలియకపోతే తమ తమ పేర్లు, బిరుదులు అరిచి చెప్తూ యుద్ధాలు సాగిస్తున్నారు. పాండవబలాల పోటుకి మన సైన్యం చిక్కుపడి చీకటి వల్ల కూడుకోవటం కష్టమైతే ద్రోణుడు అప్పటికప్పుడు ఒక వ్యూహాన్ని పన్ని అందర్నీ ఒకచోట చేర్చాడు. దానికి అగ్రభాగాన తను; అశ్వత్థామ, సౌబలుడు చెరోపక్క, మధ్యలో శల్యుడు, వెనక దుర్యోధనుడు.
దుర్యోధనుడు తన కాల్బలాన్ని ఆయుధాలు పక్కనపెట్టి దివిటీలు పట్టుకు నిలబడమని ఆజ్ఞాపించాడు. ఒక్కో రథానికి ఐదు, ఏనుక్కి మూడు, గుర్రానికి ఒకటి చొప్పున పెట్టించాడు. జెండాలు సరిగా కనిపించేట్టు కొన్ని పెట్టించాడు. వ్యూహానికి ముందు, పక్కల ఎత్తుగా కొన్ని దివిటీల్ని ఉంచాడు. పాండవపక్షం కూడ అలాగే చేసింది. అలా యుద్ధభూమి అంతా కాంతివంతమై పగటిని తలపించింది.
దుర్యోధనుడు తమ్ముల్తో “శల్యుడు, కృతవర్మ తోడుగా మీరు ధృష్టద్యుమ్నుడి నుంచి ద్రోణుణ్ణి కాపాడండి. అప్పుడతను పాండవసైన్యం సంగతి చూస్తాడు. కర్ణుడు అర్జునుణ్ణి, నేను భీముణ్ణి గెలుస్తాం. పదండి” అని బయల్దేరితే రెండు సైన్యాలు ఢీకొన్నయ్. రెండువైపుల నుంచి మహారథులు ఒకరొకరితో తలపడ్డారు. కృతవర్మ ధాటికి ఆగలేక ధర్మరాజు యుద్ధభూమి నుంచి బయటికెళ్తే మన బలాలు ఆర్చినయ్. భూరి, సాత్యకి పోరాడారు. ఓ భల్లంతో భూరి విల్లు తుంచాడు సాత్యకి. అతను ఇంకో వింటితో సాత్యకి విల్లు విరిచి బాణాలు నాటాడు. మండిపోయి సాత్యకి ఒక శక్తిని విసిరి భూరిని చంపాడు. అశ్వత్థామ సాత్యకి వెంటపడితే ఘటోత్కచుడతన్ని ఆపి తలపడ్డాడు. ఘటోత్కచుడు వేసిన పదిబాణాలు వేగంగా అతని వక్షాన గుచ్చుకుంటే అశ్వత్థామ విల్లు ఆధారంగా పట్టుకుని తూలాడు. తూలి, తెలివి తెచ్చుకుని ఉగ్రకోపంతో ఒక వాలికనారసాన్ని వాడి వక్షాన నాటితే వాడు మూర్ఛపోయాడు, వాడి సారథి రథాన్ని పక్కకి తోలుకుపోయాడు.
భీమదుర్యోధనులు తారసపడ్డారు. భీముడతని ధనువుని జెండాని విరిస్తే ఇంకో విల్లు తీసుకుని భీముడి విల్లు విరిచి ఒంటికి బాణాలు గుచ్చాడు నీ కొడుకు. భీముడు ఇంకో వింటితో ఏడు నారసాలు అతని శరీరంలో నాటి, విల్లు తుంచి, దుర్యోధనుడు మళ్లీ మళ్లీ విళ్లెత్తితే వాటినీ తుంచి ఒక గదతో సూతుణ్ణి గుర్రాల్ని చంపితే మహాభీతితో దుర్యోధనుడు పారిపోయాడు. భీముడు ఎలుగెత్తి అరిచాడు. దుర్యోధనుడు మరణించాడని మన సేన కలవరపడింది. ఇంతలో ఇంకొక రథం ఎక్కి వచ్చి అతను వాళ్లని శాంతింపజేశాడు.
కర్ణ సహదేవులు మరోచోట పోరుతున్నారు. కర్ణుడతని విల్లు తుంచితే అతను మరొకటి తీసుకున్నాడు. కర్ణుడు గుర్రాల్ని, సారథిని చంపితే అతను ఖడ్గం తీసుకుని బయల్దేరుతుంటే కర్ణుడు దాన్ని ముక్కలు చేశాడు. అతను గద విసిరితే దాన్ని నవ్వుతూ ఖండించాడు. శక్తి వేస్తే దాన్ని, చక్రం విసిరేస్తే దాన్నీ కూడ పొడి చేసి నిశ్చేష్టుడై చూస్తున్న సహదేవుణ్ణి కుంతిమాటల వల్ల ఇంకేమీ చెయ్యకుండా కడుపులో వింటికొనతో పొడుస్తూ “నీకన్న శక్తివంతుల్తో యుద్ధం ఎందుకు నీకు? అదుగో అర్జునుడున్నాడక్కడ, వెళ్లి అతని వెనక దాక్కో” అని తిట్టి వెళ్లిపోయాడు. సహదేవుడు బతుకు మీది రోతతో తన్ని తను తిట్టుకుంటూ వెళ్లి ఇంకో రథం ఎక్కాడు.
శల్యుడు విరాటుడి తమ్ముడు శతానీకుణ్ణి చంపి విరాటుణ్ణి మూర్ఛపుచ్చితే అతని సారథి రథాన్ని తోలుకుపోయాడు. అర్జునుడు శల్యుడితో తలపడబోతుంటే హలాయుధుడనే రాక్షసుడు అతన్ని అడ్డగించాడు. అర్జునుడు వాడి విల్లుని, కేతువుని, సారథిని, గుర్రాల్ని చంపితే వాడు కత్తిని విసిరాడు. అర్జునుడు దాన్ని విరిచి వాడి మీద నాలుగొందల బాణాలేశాడు. మహాభయంతో వాడు పుంజాలు తెంపుకు పరిగెత్తాడు.
మరోవంక కర్ణ సాత్యకులు యుద్ధం చేస్తున్నారు. కర్ణుడి కొడుకు వృషసేనుడు సాత్యకి మీద అనేక బాణాలేస్తే సాత్యకి వాలమ్ముల్తో వాణ్ణి మూర్ఛితుణ్ణి చేశాడు. కొడుకు పాటు చూసి కర్ణుడు కోపంతో సాత్యకిని శరపరంపరల్తో బాధించాడు. ఇంతలో వృషసేనుడు లేచి తండ్రిని కలిశాడు. ఐతే ఆ ఇద్దరితోనూ భీకరంగా పోరాడు సాత్యకి. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో “అర్జునుడు దూరంగా వున్నాడు, మిగిలిన పాండవులు కూడ దగ్గర్లో లేరు. వీణ్ణి అభిమన్యుడి దార్లో పంపటానికి ఇదే సరైన సమయం. పెద్ద బలగంతో వీణ్ణి చుట్టుముడదాం. ఐతే అది చూసి అర్జునుడు రాకుండా మనవాళ్లని కొంతమందిని అర్జునుడి మీదికి పంపు” అని సలహా చెప్పాడు. దుర్యోధనుడికీ అది నచ్చి శకునిని పదివేల ఏనుగులు, అన్నే రథాల్తో దుశ్శాసన, సుబాహు, దుష్ప్రధర్షణ, దుర్విషహులు తోడుగా అర్జునుడు, అతని అన్నదమ్ముల మీదికి పంపాడు. దుర్యోధన కర్ణులు పెద్ద బలగంతో సాత్యకిని చుట్టుముట్టారు. ఐతే అతను ఏమాత్రం జంకక మన సైన్యాన్ని అల్లకల్లోలం చేశాడు. ఇక పట్టలేక దుర్యోధనుడు తన రథాన్ని అతని రథం దగ్గరికి తోలించి అతనితో తలపడ్డాడు. సాత్యకి అతని గుర్రాల్ని, సూతుణ్ణి చంపాడు. దుర్యోధనుడు మరో రథం మీదికి వెళ్లాడు. సాత్యకి దెబ్బకి అతన్ని చుట్టుముట్టిన సైన్యాలు చెల్లాచెదురైనై.
ఇలా ఒకచోట సాత్యకి, మరోచోట అర్జునుడు, మూడోవంక ధృష్టద్యుమ్నుడు విజృంభించి మన బలాల్ని నాశనం చేస్తూ శంఖాలు ఊదుతూ ఉల్లాసంగా ఉంటే సహించలేక కర్ణుడు క్రోధరూపంతో పాండవబలగాల పని పట్టాడు. అతని ధాటి చూసి ధర్మరాజు భయపడ్డాడు. ఎలాగైనా అతన్ని ఆపమని అర్జునుణ్ణి అడిగాడు. కర్ణుడి మీదికి రథం పోనీమని అర్జునుడంటే కృష్ణుడు నిశాసమయాన రాక్షసులకి శౌర్యధైర్యాలు పెరుగుతాయి కనక ఘటోత్కచుడికి ఈ పని అప్పగిద్దాం అని ఘటోత్కచుణ్ణి పిలిస్తే అతను యుద్ధోల్లాసంతో వచ్చాడు. కృష్ణార్జునులు అతన్ని వెళ్లి కర్ణుణ్ణి జయించి రమ్మని చెప్తే అలాగేనని వెళ్లాడు.
ఇంతలో జటాసురుడి కొడుకు అలంబుసుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి నాకు పాండవుల్తో పాత వైరం వుంది, నేను ఘటోత్కచుడితో యుద్ధం చేస్తానని అడిగితే అతన్నభినందించి పంపాడు దుర్యోధనుడు. వాడు కర్ణుణ్ణి దాటుకుని వెళ్లి ఘటోత్కచుడితో తలపడ్డాడు. ఆ రాక్షసులిద్దరు రకరకాల మృగరూపాల్లో మాయాయుద్ధం చేశారు. చివరికి బాహా బాహీ పెనుగుతుంటే ఘటోత్కచుడు వాణ్ణి పట్టి పడేసి వాడి రొమ్ము పాదంతో చితక తొక్కి తల విరిచి నెత్తురోడుతున్న ఆ శిరసుని దుర్యోధనుడి రథం మీద పడేశాడు. “ఇలాగే కొంచెం సేపట్లో కర్ణుడి తల కూడ పడేస్తా, చూస్తుండు” అని దుర్యోధనుణ్ణి హెచ్చరించి తన రథం ఎక్కి కర్ణుడి మీదికి వెళ్లాడు.
ఇక కర్ణ ఘటోత్కచులకి భీకరసమరం జరిగింది. చండశరజాలాల్తో ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా పెనిగారు. రక్తసిక్తాలైన శరీరాల్తో ఆ రాత్రి వేళ వెలిగారు. రాధేయుడొక దివ్యాస్త్రం వేస్తే ప్రత్యస్త్రంతో ఘటోత్కచుడు విరిచి మాయాసైన్యాన్ని సృష్టించి వదిలాడు. మన సేనలు కకావికలైనై. కాని కర్ణుడు మాత్రం మడమ తిప్పకుండా నిలిచాడు. అస్త్రబలంతో ఆ మాయని మాయం చేశాడు. వాడు చక్రం వేస్తే దాన్ని తునకలు చేసి గద విసిరితే దాన్ని ముక్కలు చేసి వాడు ఆకాశానికెగిరి రాళ్లూ చెట్లూ కురిస్తే వాటిని పిండిచేసి నిలబడ్డాడు. వాడు రథం ఎక్కి వస్తే గుర్రాలు, సారథితో సహా దాన్ని నుగ్గు చేశాడు. మాయాముఖం నుంచి వాడు అమ్ములు కురిపిస్తే అన్నిటిని వమ్ము చేశాడు. అనేకశిరస్సుల మహాకారంతో వస్తే దాన్ని కూల్చాడు. ఒక్కడే ఎన్నో రూపాల్లో వస్తే వాటిని మాయం చేశాడు. పర్వతమై వస్తే దాన్ని పొడి చేశాడు. ఐనాగాని వాడు చతురంగబలాల్ని సృష్టించి నిశితశరాల్తో కర్ణుణ్ణి నొప్పించి ఆశ్చర్యకరంగా అతని వింటిని విరిచాడు.
ఈలోగా బకాసురుడి తమ్ముడు అలాయుధుడు దుర్యోధనుడి దగ్గరికి తన సైన్యంతో వచ్చి భీముడితో పాటు అతని బంధువులందర్నీ మింగుతానని చెప్పాడు. ఇక్కడ ఘటోత్కచుడి చేతిలో కర్ణుడి చావు దగ్గరపడిందని మన వాళ్లందరూ గగ్గోలు పెడుతున్నారు. దుర్యోధనుడు అలాయుధుణ్ణి తొందరగా వెళ్లి ఘటోత్కచుడితో తలపడమని పంపాడు. రూపాల్లో, వయసులో, ఆయుధాల్లో సమానులుగా వున్న ఆ రాక్షసులిద్దరూ ద్వంద్వయుద్ధానికి తలపడ్డారు. కర్ణుడు భీముడి మీదికి పోతే అతను కొడుకు అలాయుధుడి చేతిలో ఏమౌతాడోనని కర్ణుణ్ణి పట్టించుకోకుండా అలాయుధుడితో తలపడ్డాడు. వాడి సేనలు భీముణ్ణి కమ్ముకుంటే అతను చిరునవ్వుతో వాళ్లని చిందరవందర చేశాడు. అలాయుధుడు మాత్రం నిలిచి భీముడితో పోరాటం సాగిస్తూ తన బలాల్ని పాంచాలసైన్యం మీదికి పంపించాడు.
కృష్ణుడు అర్జునుడితో “నిశాయుద్ధంలో నిశాచరులు విజృంభించి పోరుతున్నారు. నకుల, సహదేవ, సాత్యకులని వాళ్లతో తలపడమను; శిఖండి ధృష్టద్యుమ్నుల్ని కర్ణుడి మీదికి పంపు; ద్రోణుడు, అతనితో ఉన్న రాజుల సంగతి నువ్వు చూడు” అని మంత్రాంగం చెప్పాడు. ఇంతలో అలాయుధుడు భీముడి విల్లు విరిచి అతనింకో విల్లు తీసుకునేలోగా సారథిని గుర్రాల్ని నొప్పిస్తే భీముడు గదతో కిందికి దూకితే వాడూ గద తీసుకుని ఎదుర్కున్నాడు. వాళ్లిద్దరూ గదలు పొడిపొడి చేసుకుని చేతికి దొరికిన రథాంగాలు, గజదంతాలు మొదలైన వాటితో పోరుతుంటే కృష్ణుడు కర్ణుడితో యుద్ధం చేస్తున్న ఘటోత్కచుణ్ణి పిలిచి అలాయుధుడి అంతు చూడమని పంపాడు.
అలాయుధుడు ఒక పరిఘతో కొడితే ఘటోత్కచుడు దిమ్మతిరిగి తూగాడు. అంతలోనే మేలుకుని గద తిప్పి వేస్తే అది అలాయుధుడి రథాన్ని నుగ్గు చేసింది. వాడు ఆకాశానికెగిరి నెత్తురువాన కురిపించాడు. ఘటోత్కచుడూ పైకెగిరి వాడి మాయకి ప్రతిమాయ చేశాడు. వాడు కిందికి దిగాడు. ఇద్దరూ వాలిసుగ్రీవుల్లా భీషణంగా పోరాడారు. వాడు కత్తిపట్టి దూకితే ఘటోత్కచుడు వాడి తలపట్టి నిలబెట్టి ఆ కత్తితో వాడి తలే నరికాడు. ఆ తలని దుర్యోధనుడి ముందు పారేశాడు. తనని తన తమ్ముల్ని గట్టెక్కిస్తాడనుకున్న ఆ అలాయుధుడిలా నీచంగా చావటంతో దుర్యోధనుడు నివ్వెరపోయాడు. మనవాళ్లు గతాశులయారు.
ఒక్క కర్ణుడు మాత్రం నిర్భయంగా నిలబడి పాండవ చమూసమూహాన్ని గడగడలాడిస్తున్నాడు. ఘటోత్కచుడు వెళ్లి అతనితో తలపడ్డాడు. కర్ణుడతని గుర్రాల్ని చంపితే రథంతో సహా మాయమయ్యాడు వాడు. ఎక్కడ ప్రత్యక్షమై ఎవర్నేం చేస్తాడో అని భయంతో మనసైన్యం గడగడ వణుకుతున్నది. వాడు మేఘంలా వచ్చి ఉరుములు మెరుపుల్తో రకరకాల ఆయుధాల్ని వర్షించాడు. వాడికి తోడుగా ఇతర రాక్షస నాయకులూ అలాగే మేఘాలై వచ్చారు. ఐతే కర్ణుడు తన దివ్యాస్త్రాల్తో ఆ మాయల్ని మటుమాయం చేశాడు. అప్పుడక్కడ కర్ణుడున్నందుకు మనసేనలు ఎంతగానో ఆనందించినయ్. అందరూ అతన్ని “ఈ రాక్షసుణ్ణి చంపి మమ్మల్ని బతికించి నువ్వూ బతుకు. నీ కవచకుండలాలు తీసుకుని నీకు ఇంద్రుడిచ్చిన మహాశక్తిని వాడి మీద ప్రయోగించు. బతికుంటే బలుసాకు తినొచ్చు” అని ప్రార్థించారు. ఇంతలో ఘటోత్కచుడు కర్ణుడి రథాన్ని విరగ్గొట్టి గదతో మోదితే ప్రాణాలు కాపాడుకోవటానికి వేరే మార్గం లేదని నిశ్చయించి ఇంద్రుడిచ్చిన మృత్యువు తోబుట్టువు లాటి ఘోరశక్తిని తీసి వింటికమర్చి దాని ఘంటారవాలు ఆకాశాన్ని తాకుతుంటే వేగంగా పారిపోబోతున్న వాడి మీద అంతకన్నా వేగంగా ప్రయోగించాడు కర్ణుడు.
ఆ శక్తి ముందుగా ఘటోత్కచుడి మాయని మింగి మరుక్షణంలో క్రూరంగా వాడి వక్షాన్ని చొచ్చి విచ్చి చీల్చి వెనగ్గా బయటికి వచ్చి ఆకాశాని కెగిసింది. ఆ శక్తి శక్తికి సోలుతూ వాడు నడుం పట్టుకుని బోర్లాపడి నాలుక బయటపెట్టి రక్తం వరదలు పారుతుండగా వికృతమైన మొహంతో ప్రాణం విడిచాడు. శంఖాలు, భేరులు, సింహనాదాలు చెలరేగినై మనసైన్యంలో. నీకొడుకు పట్టరాని ఆనందంతో కర్ణుణ్ణి కౌగిలించుకుని కొనియాడాడు. కౌంతేయులు అమితదుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ చూస్తుండిపోయారు.
ఒక్క కృష్ణుడు మాత్రం మహానందంతో సింహనాదం చేసి శంఖం పూరించి సంతోషనృత్యం చేస్తూ రథం దిగి అర్జునుణ్ణి కౌగిలించాడు.
అర్జునుడు అయోమయంగా “చెట్టంత ఘటోత్కచుణ్ణి పోగొట్టుకుని సేనంతా విచారంలో మునిగి తేలుతుంటే నీకీ ఆనందం ఏమిటి?” అని అడిగితే, “ఆ శక్తి కర్ణుడి దగ్గర ఉంటే నిన్ను బతికించుకోవటం దుష్కరం అని ఇన్నాళ్లూ నాకు నిద్రలేదు. మనిద్దరం కలిసి కూడ అతన్నేమీ చెయ్యగలిగే వాళ్లం కాదు. అసలతని సహజ కవచకుండలాలు వుండి వుంటే అతన్ని జయించటం అసాధ్యం అయేది. వాటిని తీసుకుని నీ తండ్రి ఈ శక్తినిచ్చాడు. అదీ ఇప్పుడు ఘటోత్కచుడి కోసం ఖర్చయి పోయింది. ఇక నువ్వు కర్ణుణ్ణి చంపగలవ్. నీకోసం ఇదివరకే నేను ఏకలవ్యుడు, శిశుపాలుడు, జరాసంధుల్ని చంపా. వాళ్లూ వుండి వుంటే ఇక మనం గెలవటం అసాధ్యమయేది. ఇలా నీమార్గం సుగమమైంది. పైగా ఘటోత్కచుడు ఎంతైనా రాక్షసుడు, ఎప్పుడో ఒకప్పుడు నేను వాణ్ణీ చంపాల్సొచ్చేది. ఇక ఆ అవసరం కలగదు. ఎలా చూసినా ఇది సంతోషసమయం, దుఃఖసమయం కాదు” అని వివరించాడు.
సావధానంగా వింటున్న ధృతరాష్ట్రుడికి ఒక సందేహం వచ్చింది – “మరి అంత శక్తివంతమైన శక్తిని ఇన్నాళ్లూ కర్ణుడు అర్జునుడి మీద ఎందుకు వెయ్యలేదు? అతన్ని చంపితే అప్పటితోటే యుద్ధం ఐపోయివుండేది కదా !” దానికి సంజయుడు, “అది నిజమే, తొలిరోజు నుంచి కర్ణుడికి అందరం ఆ మాట చెప్పేవాళ్లం, అతనూ ఇవాళ వేస్తాను చూడండి అని వెళ్లేవాడు. అదేం మాయో, యుద్ధం మొదలయ్యాక మాకెవరికీ ఆ విషయమే గుర్తొచ్చేది కాదు. తిరిగి శిబిరాలకి వెళ్లాక షరా మామూలే. ఐతే, ఘటోత్కచుడు చచ్చాక సాత్యకి కృష్ణుణ్ణి ఇదే ప్రశ్న అడిగితే అతను తన మాయ వల్ల అలా జరిగేదని సాత్యకికి చెప్పాడు. చెప్పి ‘అర్జునుడితో నా స్నేహానికి సమానమైనవి ఈ ప్రపంచంలో ఏవీ లేవు, ఇక ఈ రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోతా’ అన్నాడు” అని వివరించాడు. దానికి ధృతరాష్ట్రుడు “అంతటి మహాశక్తిని గడ్డిపరక ఘటోత్కచుడి మీద వ్యర్థం చేసుకున్నాం, అంతా మన ఖర్మ. తర్వాతేం జరిగిందో చెప్పు” అన్నాడు. సంజయుడు కథని కొనసాగించాడు.
ఘటోత్కచుడి చావుతో డీలాపడి ధర్మరాజు తన రథం మీద చతికిలపడ్డాడు. కృష్ణుడతన్ని అనునయించాడు. ధర్మరాజు ఘటోత్కచుడు అదివరకు కావ్యక వనంలో, గంధమాదన యాత్రలో చేసిన సహాయాలు తలుచుకుని బాధపడ్డాడు. అంతలోనే పట్టరాని కోపంతో “అసలు అన్నిటికీ కారణం కర్ణుడు. మొన్న దొంగనాటకంతో అభిమన్యుడి విల్లు విరిచి వాణ్ణి చంపించాడు. ఇప్పుడిలా నాకెంతో ప్రీతి కలిగించే కొడుకుని పొట్టనపెట్టుకున్నాడు. అలాగే అప్పుడూ ఇప్పుడూ వాడికి సాయం చేసినందుకు ద్రోణుణ్ణి కూడ వదలను. భీముడు ద్రోణుడి సంగతి చూస్తాడు, నే వెళ్లి కర్ణుడు అంతు చూస్తా” అని ఆవేశంగా లేచి శంఖం పూరించి సారథిని కర్ణుడి మీదికి రథాన్ని తోలమన్నాడు. కృష్ణుడు గబగబా తన రథం ఎక్కి అర్జునుడితో “కర్ణుడితో తలపడాలని ఆవేశంతో వెళ్తున్నాడు ధర్మరాజు. మనం అతన్ని ఆపాలి” అంటూ రథం అటు తిప్పాడు.
కర్ణుడి వైపుకి బయల్దేరిన ధర్మరాజుకి ఎదురుగా వ్యాసమహాముని ప్రత్యక్షమై దీవించి “ధర్మం ఎటు వైపో జయం కూడ ఆవైపుకే. ఇవాల్టినుంచి ఐదోరోజు నీకు సామ్రాజ్యం దొరకబోతున్నది. ప్రశాంతంగా తమ్ముళ్లు, బంధువుల్తో నీ రణధర్మం నిర్వహించు” అని అంతర్ధానమయాడు. ధర్మరాజు శాంతించాడు. ధృష్టద్యుమ్నుణ్ణి పిలిచి ద్రోణుడి మీద యుద్ధానికి పంపాడు. మళ్లీ ఘోరసమరం ఆరంభమైంది. ఐతే సైన్యాలు నిద్రతో జోగటం గమనించి అర్జునుడు అందర్నీ కేకేసి పిలిచి ఇప్పుడు నిద్రపోయి చంద్రోదయం అయాక లేచి మొదలెడదాం అని చెప్తే అందరూ అతన్ని మెచ్చుకుంటూ ఎలా వున్నవారు అలాగే నిద్రలోకి జారిపోయారు.
కొంతసేపటికి చంద్రుడు వచ్చి పండువెన్నెలలు పరచటం మొదలెట్టాడు. రెండుసైన్యాలు మేలుకుని తిరిగి యుద్ధానికి తలపడినయ్. దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వెళ్లి అతని సమరకౌశలాన్ని పొగిడి “ఇంతవాడివి నీకు పాండవులొక లెక్కా? ఐనా శిష్యులని నువ్వు ఉపేక్ష చేసి వాళ్లని చావుదెబ్బలు కొట్టటం లేదు. మామీద నీ దయ అలా ఉంటే ఇంక మేం చేసేదేముంది?” అని వాపోయాడు. ద్రోణుడికి ఒళ్లు మండిపోయింది. “అర్జునుడు శిష్యుడనే కదా అగ్ని ఖాండవ వనాన్ని ఒదులుకుంది? ఘోషయాత్ర నాడు నిన్ను బంధించిన గంధర్వులు నిన్నొదిలేసి పారిపోయింది అతను వాళ్ల శిష్యుడనే కదా? నివాతకవచులు, కాలకేయాదులు అందుకనేగా అతనికి ఓడింది? ఎందుకిలాటి మాటలు?” అని ఝాడిస్తే దుర్యోధనుడూ కోపంగా “అర్జునుడితో యుద్ధం నీ వల్ల కాదనేగా, ఐతే నీకు తగిన వాళ్లతో నువ్వు పోరాడు. నేను దుశ్శాసన, శకుని, కర్ణులతో వెళ్లి అర్జునుడి అంతు చూస్తా” అని విసవిసా అక్కణ్ణుంచి కదిలాడు. ద్రోణుడు “అలాగే, ఇంతకాలం అన్ని రకాల భోగానుభవాలు చూశావ్, ఇప్పుడు అర్జునుడితో యుద్ధం ఎలా వుంటుందో కూడ చూడు పో” అని పాంచాల బలగాల వైపుకి ఉరికితే దుర్యోధనాదులు పాండవసైన్యం మీదికి వెళ్లారు. తొలిసంజె వెలుగులు వస్తున్నయ్.
మనమొన నించి ముందుకి వెళ్లిన దుర్యోధనాదుల్ని చూసి “మనం వీళ్లని వెనక్కి తరుముదాం పద” అని కృష్ణుడంటే అలాగేనన్నాడు అర్జునుడు. భీముడూ అతనికి ఉత్సాహం కలిగించాడు. తనని చుట్టుముట్టిన కౌరవబలగాల్ని అతను అన్ని దిక్కులా తానే ఐ చిందరవందర చేశాడు.
అదే సమయంలో మిగిలిన వాళ్లందరికి దూరంగా ఉత్తర దిక్కున ఒక్కడే ఉన్న ద్రోణుణ్ణి చూసి పాండవబలాలు కంగారు పడిపోయినయ్. అక్కడ వున్న పాంచాలసైన్యాల్ని రోషంలో అతనేం చేస్తాడోనని అక్కణ్ణుంచి వచ్చెయ్యమని పాండవసైన్యంలో వారు పిలిస్తే పాంచాలసైన్యంలో దొరలు అందుకు మండిపడుతూ ఎలాటి భయమూ లేకుండా ద్రోణుడి మీదికి కవిశారు.
ఐతే అసలే రోషంగా వున్న ద్రోణుడు ద్రుపదుడి ముగ్గురు మనవల్ని చంపి పూలు కోసినట్టు దొరల తలలు కొయ్యటం మొదలెట్టాడు. అడ్డొచ్చిన ద్రుపదుణ్ణీ, విరాటుణ్ణీ కూడ యముడి దగ్గరికి పంపేశాడు. పాంచాల, మత్స్య సైన్యాలు కకావికలైనై. దుఃఖావేశంతో ధృష్టద్యుమ్నుడు “ఇవాళ ద్రోణుణ్ణి చంపకపోతే నేను కులాచార ధర్మాన్ని తప్పినవాణ్ణౌతా” అని ప్రతిజ్ఞ చేసి పాంచాలసేనల్తో ద్రోణుడి మీదికి దూకాడు. దుర్యోధనుడు, కర్ణుడు ద్రోణుడికి అడ్డం వచ్చి అతనితో పెనిగారు. అటువైపు నుంచి భీముడు, సాత్యకి వచ్చి కలిశారు. రెండుబలాలు ఘోరయుద్ధం చేసినయ్.
పదిహేనవ రోజు
ఇంతలో తెల్లవారింది. అందరూ కాలోచితకృత్యాలు ముగించుకుని తిరిగొచ్చి రణం కొనసాగించారు. ఎండ తాకిడి, నిద్రలేమి, మండుతున్న ఆకలి – వేటినీ లెక్కచెయ్యకుండా వేడి పౌరుషాల్తో తలపడ్డారు. ద్రోణార్జునులు ద్వంద్వయుద్ధంలో ఒకరికొకరు తీసిపోకుండా అన్నిటా సమానంగా పోరారు. ఒకరి దివ్యాస్త్రాల్ని మరొకరు ఉపసంహరించారు, అదొక ఆటలా ఇద్దరూ ఆడారు. ఆకాశచారులు రెప్పవెయ్యకుండా చూశారు వాళ్ల పోరాటాన్ని. ఇలా గెలుపోటములు లేకుండా కొంతసేపు సాగాక ఇద్దరూ వేరే పక్కలకి వెళ్లి అక్కడి సైన్యాల్తో తలపడ్డారు.
ద్రోణుడి చేతిలో పాంచాలబలం చావుదెబ్బలు తిన్నది. అర్జునుడు తప్ప మిగతా పాండవులు ఒకచోట చేరారు. “ధర్మపరుడై అర్జునుడు అతన్ని ఓడించడు. ద్రోణుణ్ణి నిలవరించే వాళ్లు మనలో ఇంకెవరూ లేరు. ఎలా?” అని తికమక పడుతుంటే కృష్ణుడు తమ రథాన్ని వాళ్ల దగ్గరికి తీసుకెళ్లి అర్జునుడితో “ద్రోణుణ్ణి ఆపటానికి ఒకటే దారుంది – అతని కొడుకు చనిపోయాడని చెప్తే అతను యుద్ధం మానేస్తాడు, అప్పుడతన్ని చంపొచ్చు” అంటే అర్జునుడు అందుకు ఒప్పుకోలేదు, మిగిలిన వాళ్లు సరేనన్నారు.
భీముడి చేతిలో అశ్వత్థామ అనే పేరున్న ఏనుగు చచ్చింది. అతను హడావుడిగా ద్రోణుడి దగ్గరికెళ్లి అశ్వత్థామ చనిపోయాడని చెప్తే అతను గుండెలు జల్లుమని అంతలోనే కొడుకు అస్త్రవిద్యాకౌశలాన్ని తల్చుకుని అతనికేమీ అయుండదని నిశ్చయించుకుని రణం సాగించాడు. ధృష్టద్యుమ్నుణ్ణి మూడు చెరువుల నీళ్లు తాగించి మిగిలిన పాంచాలబలగాల్ని ఊచకోత కోస్తుంటే అతనికెదురుగా సప్తర్షులు ప్రత్యక్షమయారు. “బ్రాహ్మణుడివై వుండి, వేదవేదాంగాలు తెలుసుకుని ఇలా యుద్ధం చెయ్యొచ్చునా? ఇప్పటికి చేసింది చాలు, ఇక అస్త్రాలు వదిలి ఇక్కణ్ణుంచి కదిలే కాలం వచ్చింది” అని చెప్పి అంతర్ధానమయారు.
భీముడి మాటల్ని తల్చుకుని నిజంగా అశ్వత్థామకి ఏమైనా అయిందేమో ధర్మరాజునడిగి కనుక్కుందామని చూస్తుంటే కృష్ణుడు ధర్మరాజుతో “ఇతనింకా యుద్ధం చేస్తే మనం బతకం. ప్రాణరక్షణ సమయంలో అబద్ధం తప్పు కాదు. కనక అతని కొడుకు చచ్చాడని చెప్పు” అని చెప్పి పంపాడు. భీముడు కూడ, “నేను అశ్వత్థామ అనే ఏనుగుని చంపాను, కాబట్టి అది నెపంగా నువ్వు చిన్న అబద్ధం చెప్పొచ్చు” అని ప్రోత్సహించాడతన్ని. ధర్మజుడికి ఒక వంక పాపభయం, మరో వంక యుద్ధవిజయం కనిపిస్తున్నాయి, ఎటు మొగ్గాలో తేల్చుకునే సమయం వచ్చింది. చివరికి రాజ్యకాంక్షే గెలిచి అతనికి ఓపికున్నంత పెద్ద గొంతుతో “అశ్వత్థామ మరణించాడు” అని అరిచి చెప్పి ద్రోణుడికి వినపడకుండా మెల్లగా “ఏనుగే” అని ఊరుకున్నాడు ధర్మరాజు !
ద్రోణుడికి గుండె జారిపోయింది. నోరు తడారిపోయింది. మునులు చెప్పిన మాటలు చెవుల్లో వినిపిస్తున్నయ్. అంత్యకాలం ఆసన్నమైందని తెలుస్తూంది. ఎదురుగా ధృష్టద్యుమ్నుడున్నాడు. వీరావేశంగా అతని మీద బాణాలేస్తున్నాడు. చూస్తూ చూస్తూ అతన్నలా ఉపేక్షించి ఊరుకోలేక, మంత్రాలు పనిచెయ్యక దివ్యాస్త్రాలు వెళ్లకపోయినా పట్టుదలగా ద్రోణుడతనితో యుద్ధం సాగించాడు. అతని విల్లు, రథం, గుర్రాలు, సారథిని నుగ్గు చేశాడు. గదతో వస్తే దాన్ని ముక్కలు చేశాడు. పలకా వాలూ పట్టుకుంటే వాటిని విరిచాడు. అతని ఒంటికి తీవ్రనారాసాల్ని నాటాడు. అదిచూసి దూరంగా కృప, కర్ణ, కృతవర్మల్తో పోరుతున్న సాత్యకి ఒక క్రూరమైన బాణంతో ద్రోణుణ్ణి కొట్టాడు. భీముడక్కడికి అతివేగంగా వచ్చి ధృష్టద్యుమ్నుణ్ణి పక్కకి తీసుకుపోతుంటే ద్రోణుడు “పో పొండిరా” అని విదిల్చాడు వాళ్లని.
ధృష్టద్యుమ్నుడు ఎదురుగా లేకపోయేసరికి అతని మనసు యధాపూర్వంగా ప్రశాంతమయింది.
అలా నాలుగు రోజుల ఒక రాత్రి, ఐదవరోజు ఇరవై గడియల పాటు సర్వసేనాధిపతిగా మన సైన్యాన్ని రక్షిస్తూ దేవతలక్కూడా ఆశ్చర్యం కలిగించేలా యుద్ధం చేసి తృప్తుడై మన సేన వైపుకి తిరిగి “కర్ణా, కృపా, దుర్యోధనా, నా శక్తి కొద్ది ఇన్నాళ్లు యుద్ధం చేసి ఇక నిశ్చింతగా సుగతికి వెళ్తున్నా. ఆయుధాల్ని విడుస్తున్నా. మీరు తెలివిగా జీవించండి” అని అరిచి చెప్పి ఆయుధాలు విసిరేసి రథం మీద యోగనిష్టలో కూర్చున్నాడు ద్రోణుడు.
అంతలో ఒక నిశితఖడ్గాన్ని చేతపట్టి వేగంగా పాదచారిగా ద్రోణుడి వైపుకి ధృష్టద్యుమ్నుడు వెళ్తుంటే రెండుసైన్యాలు హాహాకారాలు చేసినయ్. ద్రోణుడు తేజోరూపంలో తన శరీరాన్ని విడిచి పైకి వెళ్లాడు. ఆ దృశ్యం నాకు కళ్లార కనిపించింది. కృష్ణార్జునులు, ధర్మరాజు, కృపాచార్యుడు కూడ అది చూశారు. ఇంకెవరికీ ఆ జ్యోతి కనిపించలేదు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి రథం మీదికి ఎగిరాడు. ద్రోణుడి శవం జుట్టు గట్టిగా పట్టుకుని వద్దు వద్దు అని అర్జునుడు అరుస్తున్నా, తప్పు రా అని ధర్మరాజు బోధిస్తున్నా వినకుండా అతని తల నరికి దాన్నీ, మొండాన్నీ కిందికి తోశాడు. శతవృద్ధుడు అస్త్రాచార్యుడలా పాండవపక్షం అధర్మవర్తనతో అస్తమించాడు.
ఆచార్యుడి చావుతో మన సేనలు అలమటించినయ్. పెద్ద పెద్ద దొరలంతా ఇంక మనకి దారేదీ అని వాపోయారు. సామాన్యసైనికులు దిక్కు తెలియకుండా పరిగెత్తారు. మరోవంక యుద్ధం చేస్తున్న అశ్వత్థామ ఈ కలకలం ఏమిటా అని దుర్యోధనుడి దగ్గరికి వెళ్లాడు. ఏం జరిగిందని అతన్నడిగితే నోట మాటరాక పాలిపోయిన మొహంతో నిలబడ్డాడు దుర్యోధనుడు. చివరికి కృపాచార్యుడు ఏడుపు గొంతుతో జరిగిందంతా టూకీగా వివరించాడతనికి.
అశ్వత్థామ కళ్లు క్రోధంతో, దుఃఖంతో ఎర్రబడినయ్. కన్నీళ్లు జలజల కారినయ్. చేత్తో తుడుచుకుంటూ దుర్యోధనుడితో అన్నాడూ – “చావులు లేవా, యుద్ధాల్లో చావరా, మహానుభావుడు అస్త్రగురువుని ఒక హీనుడు ఇలా జుట్టు పట్టుకుని తలగొట్టటం ఎక్కడన్నా ఉందా? నాకీ విషయం తెలీకుండా ఉంటుందనుకున్నాడా వాడు? నన్నింతగా అవమానిస్తాడా? తండ్రిని ఇలాటి అవమానకరమైన మరణాన్నుంచి రక్షించలేని నా దివ్యాస్త్రాలెందుకు, తగలెయ్యనా? దీనికి మూల కారణం ధర్మరాజు. అతని మీద నేనెలా పగ తీర్చుకుంటానో కదా ! ఐనా నా ప్రతిజ్ఞ విను. కృష్ణుణ్ణి, పాండవుల్ని నా భుజబలంతో, దివ్యాస్త్రాల్తో ముప్పుతిప్పలు పెడతా. దేవతలొచ్చినా సరే, వాళ్ల సేనానీకాన్ని అల్లకల్లోలం చేసేస్తా. నా గురించి నేను చెప్పుకోకూడదు, ఎలా చేస్తానో నువ్వే చూద్దువు. నా తండ్రి నారాయణుణ్ణి ఆరాధించి ఒక మహిమాన్వితాస్త్రాన్ని పొందాడు, అది నాకిచ్చాడు. దాన్ని ప్రయోగిస్తా. అది విరోధులందర్నీ మట్టుపెడుతుంది.” ఆ మాటల్తో పొంగి మన యోధులు శంఖాలు పూరించారు. భేరీమృదంగ నాదాలు మిన్ను ముట్టినయ్. మన సైన్యాలు ఉత్సాహంగా శత్రువుల మీదికి బయల్దేరినయ్.
ఆ మహారవం విని ధర్మరాజు ఆశ్చర్యపడ్డాడు. ద్రోణుడు పడిన వార్త విని కూడ కౌరవసైన్యం ఎందుకంత ఉత్సాహంగా ఉరకలేస్తుందని అర్జునుణ్ణడిగితే దానికతను “తన తండ్రిని శత్రువులు అధర్మంగా చంపారని విని అశ్వత్థామ ఊరుకుంటాడనుకున్నావా? అతను మహిమాన్విత అస్త్రాలున్నవాడు. అమానుష విక్రముడు. అతని మూలానే కౌరవసైన్యాలలా ఉత్సాహంగా వున్నయ్. ఐనా నిన్ను శిష్యుడని, ధార్మికుడని, సత్యవ్రతుడని ఎంతో ఆదరంగా అడిగిన గురువుకా నువ్విలా అబద్ధం చెప్పేది? నీ మాట వినే ఆయన కొడుకు నిజంగా చనిపోయాడనుకున్నాడు. ఇంత హీనంగా ప్రవర్తించి తెచ్చుకున్న రాజ్యం వల్ల పేరొస్తుందా, వృద్ధి కలుగుతుందా? మనం లోకానికి వెలి కాలేదా? పైగా అలా అస్త్రసన్యాసం చేసిన వాణ్ణి, వద్దు వద్దని నేను గొంతు పగిలేట్టు అరుస్తూ వారిస్తున్నా వినకుండా జుట్టు పట్టి తలని నరికాడు కదా ఇతను! ఈ ధృష్టద్యుమ్నుడి అంతు చూడకుండా ఆ అశ్వత్థామ వదుల్తాడా? ఇప్పుడు మనసైన్యాన్ని నాశనం చెయ్యటానికి, ఈ ధృష్టద్యుమ్నుడి తల కొయ్యటానికి ప్రళయరుద్రుడిలా వస్తున్న అతన్ని ఎదుర్కోవటం నీకూ, వీళ్లకీ సాధ్యమైన పనా?” అని దెప్పిపొడుస్తుంటే భీముడతని మీద మండిపడ్డాడు.
“యుద్ధం చెయ్యటానికి వచ్చి ఇలా ధర్మపన్నాలు పలుకుతావేం? నిండుసభలో పాంచాలికి వాళ్లు చేసిన అన్యాయం ముందు మనం వాళ్లకి ఎన్ని చేసినా దిగదుడుపే. ఒక పక్క మన మీదికి దూకుతున్న శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలా అని మేం తలలు పట్టుకుంటుంటే పుండు మీద కారం చల్లే ఈ మాటలేమిటి?” అన్నాడతనితో.
ధృష్టద్యుమ్నుడు కూడ “మన సామాన్య సైనికుల మీద దివ్యబాణాలేసి వాళ్లని ఊచకోత కోస్తున్నాడే, ఈ ద్రోణుడు ధార్మికుడా? ఐనా అతన్ని చంపటానికే పుట్టాను నేను, మరి చంపితే దాన్లో అధర్మమేమిటి? ధర్మరాజు ఎప్పుడూ అసత్యం ఆడడు, నేను ధర్మం తప్పను. నువ్వు మాత్రం కురుపితామహుడు భీష్ముణ్ణి, నీ తండ్రికి ఆప్తమిత్రుడైన భగదత్తుణ్ణి చంపలేదా? శిష్యవంచకుడు గనక గురుడు చచ్చాడు. ఇంక చాలు, శత్రుసైన్యాన్ని గెలుద్దాం పద” అని సంభాషణని దారి మళ్లించటానికి ప్రయత్నించాడు.
అలా మాట్టాడుతున్న ధృష్టద్యుమ్నుణ్ణి ఏమీ చెయ్యలేక ఈసడించుకున్నాడు అర్జునుడు. కన్నీళ్లు కారుస్తూ, నిట్టూర్చి “ఇంకా ఎందుకీ రోత మాటలు?” అని మాత్రం అనగలిగాడు. కృష్ణుడు, ధర్మరాజు సిగ్గుతో తలలు వంచుకున్నారు.
ఒక్క సాత్యకి మాత్రం పట్టరాని కోపంతో “గురువుకి అంత పరాభవం చేసినా నీ నాలిక రాలదు, నీ తల పగలదు. ధర్మరాజు ఎదుట కాబట్టి బతికిపోయావ్, లేకపోతే నీ అంతు చూసేవాణ్ణి. ఆ శిఖండి మూలాన భీష్ముడు పడ్డాడు. దానికి అర్జునుణ్ణి నిందిస్తావా? భీష్ముడి కోరిక మీరక ఆయన మీద అర్జునుడు బాణాలేశాడు, అతనికీ నీకూ పోలికా? అసలు నువ్వూ శిఖండీ పుట్టి పాంచాలకులానికే కళంకం తెచ్చిపెట్టారు” అని ధృష్టద్యుమ్నుణ్ణి తిట్టిపోశాడు.
దానికతను పగలబడి నవ్వాడు. “మరొకరు కొడితే చెయ్యి తెగి నిష్టూరపడుతున్న భూరిశ్రవుణ్ణి బుద్దిలేకుండా చంపావే, అది వీరుడు చేసే పనేనా? అతను నిన్ను కింద పడేసి గుండెల మీద ఎక్కితే ఏమన్నా చెయ్యగలిగావా? అంత పోటుగాడివే, ద్రోణుడు మన సైన్యాల్ని చిందరవందర చేస్తుంటే అతనికి అడ్డం పడ్డావా? ఇంకా మాట్టాడావంటే నీ తల నరుకుతా. .. ఐనా ఇప్పుడిదంతా ఎందుకు, అదుగో శత్రుసైన్యం వస్తున్నది, దాని సంగతి చూద్దాం పద” అన్నాడతనితో.
ఆ మాటలు సాత్యకిని శాంతింపజెయ్యకపోగా అతని కోపాన్ని పెంచినయ్. వింటిని రథం మీద విసిరేసి గద తీసుకుని “ఒక్క వేటుతో నీ అంతు చూస్తా రా” అని ధృష్టద్యుమ్నుడి మీదికి వెళ్తుంటే కృష్ణుడు భీముణ్ణి అతన్ని పట్టుకోమని పంపితే భీముడు వెనకనుంచి అతని రెండు చేతులూ పట్టుకుని ఆపాడు. భీముడి చేతుల్లోంచి తప్పించుకోవటానికి సాత్యకి పెనుగులాడుతుంటే “వదులు వాణ్ణి, వాడి సంగతి నేను చూస్తాగా. నేనేం ఒంటిచేతి భూరిశ్రవుణ్ణి కాను” అన్నాడు ధృష్టద్యుమ్నుడు తన్నులాటకి తనూ కాలుదువ్వుతూ. చివరికి ధర్మరాజు, కృష్ణుడు అతికష్టం మీద వాళ్లని శాంతపరిచారు.
పాండవసైన్యం దాపులకి వచ్చాక అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించాడు. ఆ మహాస్త్రం భీకరాకారంతో బయల్దేరింది. దాన్నుంచి అనేక రకాల ఆయుధాలు మంటలు విరజిమ్ముతూ బయటికొచ్చి పాండవసైన్యం మీదికి అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా కమ్ముకున్నయ్. సైన్యాన్ని నాశనం చెయ్యసాగినయ్.
అర్జునుడు అదంతా చూస్తూ తనకేమీ పట్టనట్టు కదలకుండా ఊరుకున్నాడు.
ధర్మరాజు అతనికి వినపడేలా సాత్యకి, ధృష్టద్యుమ్నుల్తో “నిండు సభలో పాంచాలికి పరాభవం జరుగుతుంటే మౌనంగా చూస్తూ కూర్చున్నాడు, బాలుడైన అభిమన్యుణ్ణి పదిమందితో కలిసి చంపాడు, సైంధవుణ్ణి చంపటానికి పోయిన అర్జునుడికి సాయంగా వెళ్తున్న నిన్ను పోనీకుండా అడ్డు పడ్డాడు. అలాటి ధర్మపరుడైన ద్రోణుడికి నేనెక్కడ సమానం ఔతాను? నేనిప్పుడే నాలుకలు చాచుకుంటూ వస్తున్న ఆ అగ్నిలోకి పోతా, మీరు మీ మీ బలాల్తో ఎటన్నా పారిపోండి. అప్పుడు గాని అర్జునుడి మనసు చల్లబడదు” అని పరోక్షంగా అర్జునుణ్ణి దెప్పిపొడిచాడు.
అప్పుడు కృష్ణుడు పెద్దగా అందరికీ వినపడేట్టు “సైనికులారా, వెంటనే అందరూ గుర్రాలు, ఏనుగులు దిగి ఆయుధాల్ని కింద పెట్టి భూమ్మీద నిలబడండి. అప్పుడు ఈ అస్త్రం మిమ్మల్నేమీ చెయ్యదు. ఈ మహాస్త్రానికి ఇదే మందు” అని చెప్తే అందరూ అలాగే చేశారు. ఒక్క భీముడు మాత్రం “వీరులారా, ఒక అస్త్రానికి భయపడి ఆయుధాలు వదిలేస్తారా? నేనుండగా మీకేం భయం వద్దు. నేనీ అస్త్రం అంతం చూస్తాగా” అంటూ అశ్వత్థామతో తలపడితే కోపగించుకుని అశ్వత్థామ ఆ అస్త్రాన్ని ఇంకా ప్రజ్వలింప చేశాడు.
మిగిలిన వాళ్లంతా ఆయుధాలు వదిలెయ్యటంతో అది నేరుగా భీముడి మీదికి బయల్దేరింది. అర్జునుడు హడావుడిగా వరుణాస్త్రం వేశాడు. దాంతో నారాయణాస్త్ర ప్రభావం కొంత తగ్గింది. వెనక్కి తగ్గకుండా అశ్వత్థామ దాన్నింకా పెంచాడు. భీముడి రథాన్ని కార్చిచ్చులా కమ్ముకుందది. కృష్ణార్జునులు పాదచారులై పరిగెత్తుకెళ్లి భీముణ్ణి కిందికి దిగమన్నారు. భీముడు కదలనని భీష్మించుక్కూచున్నాడు. ఇంకిలా కాదని వాళ్లిద్దరూ భీముడి ఆయుధాల్ని లాగిపారేసి అతన్ని రథం మీంచి కిందికి తోశారు.
అలా అంతా కిందకి దిగి నిలబడటంతో నారాయణాస్త్రం శాంతించింది.
“ఆ అస్త్రాన్ని మళ్లీ వెయ్” అని అశ్వత్థామని ప్రోత్సహించాడు దుర్యోధనుడు. “అది ఒక్కసారే ప్రయోగించాలి, మళ్లీ ప్రయోగిస్తే మననే కాలుస్తుంది. కృష్ణుడు మోసంతో దాన్ని నిర్వీర్యం చేశాడు. ఓడిన వాళ్లు చచ్చిన వాళ్లతో సమానం గనక వాళ్లంతా ఆయుధాలు పారేస్తే ఆ అస్త్రం పనైపోయింది” అని నిట్టూర్చాడు అశ్వత్థామ. ఐనా నిరుత్సాహపడకుండా ధృష్టద్యుమ్నుణ్ణి తాకి వాడి సారథిని, గుర్రాల్ని, కేతువుని నేలకూల్చాడు. సాత్యకి అడ్డొస్తే ఒక్క బాణంతో అతన్ని మూర్ఛితుణ్ణి చేశాడు. అదిచూసి భీమార్జునులు అతని మీద దూకారు.
అశ్వత్థామ అమితక్రోధంతో ఆగ్నేయాస్త్రం వేశాడు. దాన్నుంచి భీకరాగ్ని జ్వాలలు వచ్చి ఒక అక్షౌహిణి పాండవసైన్యాన్ని అప్పటికప్పుడే మట్టుపెట్టినయ్. దాని దెబ్బకి భీమార్జునులు చచ్చారని మనవాళ్లు ఆనందంతో అరిచారు. వేరే దారిలేక అర్జునుడు అన్ని అస్త్రాల్ని ఉపసంహరించగలిగే బ్రహ్మాస్త్రాన్ని సమంత్రకంగా ప్రయోగిస్తే అది అశ్వత్థామ ఆగ్నేయాస్త్రాన్ని హరించింది. కృష్ణార్జునులు శంఖాలు పూరించి పాండవసైన్యానికి ఊరట కలిగించారు.
ఆగ్నేయాస్త్రం విఫలం కావటంతో అశ్వత్థామ వికలుడయ్యాడు. “పనిచెయ్యని దివ్యాస్త్రాల్తో నేను చేసే యుద్ధం ఏమిట”ని రోషంగా వింటిని విసిరి పారేసి ఒక్కడే కాలినడకన కదిలిపోయాడు.
ఐతే దార్లో అతనికి వేదవ్యాసుడు ప్రత్యక్షమయాడు. దేవతలకైనా ఆప శక్యంకాని తన ఆగ్నేయాస్త్రాన్ని నరుడెలా ఆపగలిగాడని అతన్ని అడిగాడు అశ్వత్థామ. వ్యాసుడు దయతో అతనికి నరనారాయణుల వృత్తాంతం చెప్పి వాళ్లు అవసరమైనప్పుడు అవతరించి దుష్టసంహారం చేస్తుంటారని, ఇప్పుడు కృష్ణార్జునులుగా వున్నది వాళ్లేనని విశదీకరించాడు. పైగా పూర్వజన్మలో అశ్వత్థామ మట్టితో శివుడి ప్రతిమని చేసి దాన్ని నిష్టతో పూజించాడని, వాళ్లు శివుణ్ణి లింగాకృతిగా ఆరాధించారని, అర్చలో ఆరాధించటం కంటె లింగాన్ని పూజించటం ఎన్నో రెట్లు ఉత్తమం కనక వాళ్లని తను జయించలేకపోయాడని వ్యాసుడతనికి వివరించాడు. అశ్వత్థామ శాంతించి యుద్ధభూమికి తిరిగి వచ్చి సూర్యాస్తమయం కావటంతో సేనల్ని శిబిరాలకి మళ్లించాడు.
ఇలా ద్రోణరక్షణలో కౌరవసేనల యుద్ధక్రమాన్ని ధృతరాష్ట్రుడికి వివరించి చెప్పి తిరిగి యుద్ధభూమికి వెళ్లాడు సంజయుడు.
రెండురోజుల తర్వాత మళ్లీ అంతఃపురానికి తిరిగొచ్చాడు. ధృతరాష్ట్రుడి ఆదేశంతో అతని పక్కన కూర్చున్నాడు. “పౌరుషం పందెంగా కౌరవపాండవ సైన్యాలు రెండురోజులుగా చేసిన యుద్ధం అంతా చూసివచ్చా. పాండవ చమూసమూహాన్ని చిల్లిగవ్వకి లెక్కచెయ్యకుండా భీకరరణం సాగించి చివరికి తన సహజశత్రువు అర్జునుణ్ణి ఓడించలేక అతని బాహువిక్రమానికి బలై కర్ణుడు కన్నుమూశాడు” అని చెప్పి భరించరాని దుఃఖంతో, డగ్గుత్తికతో “అంతేకాదు, భీముడు దుశ్శాసనుడి రొమ్ము చీల్చి అతని రక్తం తాగాడు. ఇంక మనసైన్యంలో విజయాశ అడుగంటిపోయింది” అని చెప్పి వలవల ఏడ్చాడు సంజయుడు.
ధృతరాష్ట్రుడికి గుండె గుభేల్ మంది. దుర్యోధనుడు కూడ మరణించాడనుకున్నాడు. ఏడ్చి సొమ్మసిల్లి మూర్ఛపోయాడు. అంతఃపుర నారీజనం కూడ శోకసంద్రంలో మునిగి మూర్ఛపోయారు. సంజయుడు, అంతకుముందే అక్కడికి వచ్చి వున్న విదురుడు చన్నీళ్లు చల్లి, వీవనల్తో విసిరి మెల్లగా వాళ్లని సేదతీర్చారు.
ధృతరాష్ట్రుడు “సంజయా, నాకు నువ్వు చెప్పింది సరిగా వినపడలేదు. మళ్లీ ఒక్కసారి మనసైన్యంలో ఎవరెవరు బతికున్నారో స్పష్టంగా చెప్పు” అనడిగితే సంజయుడు “మనసేనలో అశ్వత్థామ, కృతవర్మ, శల్యుడు, శకుని, కృపాచార్యుడు, కొందరు కురుకుమారులు, కొందరు కర్ణుడి కొడుకులు, ఇంకొంతమంది వీరయోధులు వున్నారు. వీళ్లని కూడగట్టుకుని జయాన్ని సాధించాలనే పట్టుదలతో దుర్యోధనుడు ముందుకి కదులుతున్నాడు” అని చెప్పాడు. దుర్యోధనుడు బతికే వున్నందుకు కొంత ఊరట పట్టాడు ధృతరాష్ట్రుడు. ఐనా కర్ణుడి మరణాన్ని తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ – “కృష్ణార్జునుల్ని లెక్కచెయ్యని బలశాలి, అఖిల దివ్యాస్త్ర సంపన్నుడు కర్ణుడు. అతన్ని చూసుకునే పాండవుల్ని గెలుస్తానని దుర్యోధనుడి ధైర్యం. అలాటి వాడే పడ్డాడని విన్నా నా గుండె పగలదు. ఇంతమంది బంధువులు, హితులు పోయారని వినటానికే నేనున్నా. ఇక దుర్యోధనుడు గెలవటం అసాధ్యం. మనలో మనకి యుద్ధం ఎందుకు అని బుద్ధి చెప్పాడు ధర్మరాజు. శరతల్పం మీదనుంచి గాండీవి అస్త్రవైభవాన్ని అందరికీ కళ్లారా చూపించి ఇప్పటికైనా సంధి చేసుకోమని చెప్పాడు భీష్ముడు. మీరాజు మాత్రం ఎవరిమాటా వినక ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు.” అని వాపోయాడు ధృతరాష్ట్రుడు.
ఐతే కర్ణుడు ఓడిపోవటం ఎలా సాధ్యమైందో అతనికి అర్థం కాలేదు – “పరశురాముడి దగ్గర సంపాదించిన బ్రహ్మాస్త్రం వుంది. సర్పముఖాస్త్రం వుంది. ఇంకా అనేక దివ్యాస్త్రాలున్నయ్. ఐనా కర్ణుడు అర్జునుణ్ణి గెలవలేకపోవటం ఎలా సాధ్యం? అతని రథం విరిగిందా? సారథి చచ్చాడా? అస్త్రాలు పనిచెయ్యలేదా? లేకపోతే పాండవులు భీష్మ ద్రోణుల్లాగే అతన్ని కూడ అధర్మంగా చంపారా?” అని ఆత్రంగా అడుగుతుంటే సంజయుడు “అన్నీ నీకు వివరంగా చెప్తా. సావధానంగా విను” అంటూ తన కథనాన్ని కొనసాగించాడిలా.
ద్రోణుడు పడ్డాక అశ్వత్థామ విజృంభించి దివ్యాస్త్రాల్తో పోరి సూర్యాస్తమయం కావటంతో యుద్ధం ముగించాడు. శిబిరాలకి తిరిగి వెళ్లాక తక్షణ కర్తవ్యం ఏమిటని దుర్యోధనుడు అతన్ని అడిగితే కర్ణుణ్ణి సర్వసైన్యాధిపతిగా అభిషేకించమని సలహా ఇచ్చాడతను. ముఖ్యులైన రాజుల్తో కలిసి నీకొడుకు కర్ణుడి దగ్గరికి వెళ్లి తనతో మైత్రికి చిహ్నంగా సర్వసైన్యాధ్యక్ష పట్టం కట్టుకుని తనకి రాజ్యం సంపాయించి పెట్టమని అతన్ని కోరాడు. కర్ణుడందుకు ఆనందంగా అంగీకరించి బంధు మిత్ర సహితంగా అర్జునుణ్ణి చంపి రారాజుకి రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. పవిత్ర నదీజలాలు తెప్పించి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి పుణ్యాహఘోషల మధ్య, వందిమాగధుల ఆశీస్సుల మధ్య, అతనికి పట్టం కట్టాడు దుర్యోధనుడు. కర్ణుడు విరివిగా దానాలు చేశాడు. మనవాళ్లందరూ కర్ణుడిక తమని గట్టెక్కించి విజయం చేకూర్చి పెడతాడని ఉవ్విళ్లూరుతూ రాత్రి సుఖనిద్రలు చేశారు.
నేను ఇక్కడికి వచ్చి ద్రోణ వృత్తాంతం చెప్పి తిరిగి వెళ్లేసరికి సూర్యోదయం ఔతున్నది.
పదహారో రోజు.
తన తొలినాటి యుద్ధానికి రాధేయుడు మకరవ్యూహం పన్నాడు. దానికి తుండంగా తను నిలబడ్డాడు. శకుని, ఉలూకుడు కళ్లు. శిరోభాగాన అశ్వత్థామ. కంఠాన నీ చిన్నకొడుకులు. ఉదరం దుర్యోధనుడు. ఎడమపాదం నారాయణ గోపాలకుల్తో కృతవర్మ. కుడిపాదం త్రిగర్త, దాక్షిణాత్య సైన్యాల్తో కృపాచార్యుడు. వెనక ఒక కాలు నానాదేశ సేనల్తో శల్యుడు. మరో కాలు పెద్ద సైన్యంతో సుషేణుడు. తోక మహాసైన్యంతో చిత్రుడు, అతని తమ్ముడు చిత్రసేనుడు. మిగిలిన వాళ్లు అక్కడక్కడ నిలబడ్డారు.
అదిచూసి ధర్మరాజు అర్జునుడితో “చూస్తున్నావా, ఇప్పుడిక దుర్యోధనుడి ఆశలన్నీ కర్ణుడి మీదే. మన కష్టాలన్నిటికి మూలకారణమైన వీణ్ణి నీ పౌరుషం చూపి చంపే సమయం వచ్చింది. వీడు చచ్చాడా ఇక దుర్యోధనుడు నీరుకారి పోతాడు. నీ సమరకౌశలం చూపించి విజయం దక్కించుకో” అని ఉత్సాహపరిచాడు.
అర్జునుడు అర్థచంద్ర వ్యూహం నిర్మించాడు.
రెండు సైన్యాలు తీవ్రంగా తాకినయ్. ఇంతకు ముందెప్పుడూ చూడనంత ఘోరంగా సాగింది పోరు. వాళ్ల వైపు నుంచి సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు, ద్రౌపదేయులు మన వైపు ప్రభద్రక, చేది, పాండ్య, చోళ, మగధ, వంగ దేశాల బలాల్తో తలపడ్డారు.
ఒక మదగజాన్నెక్కి భీముడు మన సేనల మీదికి రౌద్రాకారుడై కదిలాడు. అతన్ని చూసి కులాతదేశపు రాజు క్షేమధూర్తి తన బలాల్తో ఏనుగు మీద వెళ్లి తలపడ్డాడు. రెండు ఏనుగులూ ఒకదాంతో ఒకటి తలపడినయ్. క్షేమధూర్తి భీముడికి తీసిపోకుండా పోరాడాడు. బాణాల్తో, నారసాలతో, శక్తుల్తో, తోమరాల్తో మోదుకున్నారిద్దరు. క్షేమధూర్తి ఏడు తోమరాల్ని భీముడి రొమ్ము మీద నాటాడు. భీముడు ఉగ్రంగా ఒక తోమరాన్ని అతని మీదికి విసిరితే మధ్యలో కరూశరాజు దాన్ని ఖండించి అరవై బాణాల్తో భీముడికి గాయాలు చేశాడు. ఐతే భీముడు కరూశరాజుని పట్టించుకోకుండా క్షేమధూర్తి గజాన్ని బాణవర్షంలో ముంచాడు. అది వెనక్కి తిరిగి పరిగెత్తటం మొదలెట్టింది. వదలకుండా భీముడు వెంటపడ్డాడు. అతి ప్రయత్నం మీద క్షేమధూర్తి దాన్ని భీముడికి ఎదురుగా తిప్పి భీముణ్ణెదుర్కున్నాడు. భీముడతని విల్లు విరిచి అతన్నీ అతని ఏనుగునీ నొప్పిస్తే అతను వేగంగా మరో విల్లు తీసుకుని భీముడి మీద, అతని ఏనుగు మీద బాణపరంపరలు కురిపించాడు. దాంతో భీముడి ఏనుగు ముందుకు ఒరిగింది. ఒక పెద్ద గద తీసుకుని కిందికి ఉరికాడు భీముడు. గదాఘాతంతో ఒక్కదెబ్బకి వాడి ఏనుగుని చంపాడు. క్షేమధూర్తి కత్తి దూసి దూకితే గదతో వాణ్ణి వాడి ఏనుగు పక్కనే పీనిగని చేశాడు భీముడు.
మనమొన విచ్చిపోయింది. పాండవ సైన్యం చొచ్చుకు వస్తుంటే కర్ణుడు దాన్ని ఎదిరించి నిలిపాడు. మన సైన్యం అతనికి అండగా నిలిచింది. అటునుంచి పాండవులు వచ్చారు. నకులుడతనితో తలపడ్డాడు. సాత్యకి కైకేయులైన విందానువిందుల్తో. భీముడు అశ్వత్థామతో. చిత్రసేనుడు శ్రుతకర్మతో. ప్రతివింధ్యుడు చిత్రుడితో. ధర్మరాజు దుర్యోధనుడితో. అర్జునుడు సంశప్తకులతో. ధృష్టద్యుమ్నుడు కృపుడితో. శిఖండి కృతవర్మతో. శ్రుతకీర్తి శల్యుడితో. సహదేవుడు దుశ్శాసనుడితో.
విందానువిందులు సాత్యకితో ఘోరయుద్ధం చేశారు. వాళ్లతని విల్లు విరిస్తే మరో విల్లు తీసుకుని అతను వాళ్ల విళ్లని విరిచాడు. ఒక భల్లంతో అతను అనువిందుడి తల కొట్టాడు. రత్నకుండలాల్తో ప్రకాశిస్తూ ఎగిరిపడిందది. అదిచూసి విందుడు వీరావేశంతో అతనితో పెనిగాడు. ఇద్దరూ సారథుల్ని చంపుకున్నారు. గుర్రాల్ని ఖండించుకున్నారు. విళ్లని విరుచుకున్నారు. కత్తులు తీసుకుని కిందికి దూకి బహు చిత్ర విచిత్రాలైన మండలప్రచారాల్తో సమరం సాగించారు. అదును చూసుకుని సాత్యకి విందుణ్ణి రెండు ముక్కలుగా నరికాడు. అలా ఆ ఇద్దర్నీ చంపి యుధామన్యుడి రథం ఎక్కి వెళ్లి మరొక రథం అమర్చుకుని వచ్చి కేకయ బలాల మీదికి కదిలాడు సాత్యకి.
మరోవంక నీ మనవడు శ్రుతకర్మ చిత్రసేనుణ్ణి యముడి దగ్గరకి పంపాడు. ధర్మరాజు కొడుకు ప్రతివింధ్యుడు చిత్రుడితో తలపడితే చిత్రుడొక శక్తిని ఉగ్రంగా వేశాడు. ప్రతివింధ్యుడు దాన్ని నాలుగు ముక్కలు చేస్తే చిత్రుడొక గద విసిరి అతని గుర్రాల్ని సారథిని చంపాడు. అదే గదతో అతని చేతిని ముద్ద కింద కొట్టాడు. దాంతో ప్రతివింధ్యుడు మహోగ్రంగా ఒక తోమరాన్ని వేగంగా విసిరితే అది చిత్రుడి శరీరాన్ని దూసుకుని వెళ్లింది, వాడొక పర్వతంలా కూలాడు.
భీమాశ్వత్థామలు ఒకరికొకరు తీసిపోకుండా ఘోరసమరం చేసి ఇద్దరూ మూర్ఛపోయారు. వాళ్ల సారథులు రథాల్ని రణరంగం బయటికి తోలుకుపోయారు. అర్జునుడి కొడుకు శ్రుతకీర్తి శల్యుడితో తలపడ్డాడు. ఇద్దరూ కళ్లు మిరుమిట్లు గొలిపే సమరం సాగించారు. శల్యుడతని విల్లు విరిస్తే మరో వింటితో వాడు శల్యుడి మీద అరవై నాలుగు అమ్ములేశాడు. శల్యుడా వింటినీ విరిచాడు. వాడు గద విసిరితే దాన్ని ముక్కలు చేశాడు. శక్తి వేస్తే దాన్ని నుగ్గు చేశాడు. ఓ భల్లంతో సారథి శిరస్సుని ఖండించాడు. శ్రుతకీర్తి గుర్రాలతని రథాన్ని యుద్ధభూమి బయటకి లాక్కుని పరిగెత్తినయ్. అలాగే సహదేవుడితో సమరం సాగిస్తున్న దుశ్శాసనుడు కూడ అతని దెబ్బకి మూర్ఛపోతే సారథి అతని రథాన్ని బయటికి తోలుకుపోయాడు.
నకులుడు, కర్ణుడు మరోవంక యుద్ధం చేస్తున్నారు. ఒకరు ప్రయోగించిన అస్త్రాల్ని మరొకరు ఉపసంహరిస్తూ ఒకరి బాణాల్ని ఒకరు విరుస్తూ పోరాటం తీవ్రంగా సాగించారు. చివరకు కర్ణుడు కోపోద్దీప్తుడై అతని సారథిని చంపి గుర్రాల్ని కూల్చి వింటిని విరిచి రథాన్ని నుగ్గుచేస్తే పలకా వాలూ తీసుకుని దూకాడు నకులుడు. కర్ణుడు వాటిని చెక్కలు చేశాడు. గద ఎత్తితే దాన్ని తుంచాడు. పరిఘ పట్టుకుని పరిగెత్తుకు వస్తే ఆ పరిఘని ముక్కలు చేశాడు. అప్పుడిక క్రూరబాణాల్తో కర్ణుడతన్ని వేధిస్తుంటే సిగ్గూ లజ్జా లేకుండా పరిగెత్తి పారిపోసాగాడు నకులుడు. ఐతే కర్ణుడతన్ని వదలక వెంటబడి తన వింటి తాటిని అతని మెడకి వేసి లాగుతూ కుంతికిచ్చిన మాట ప్రకారం చంపకుండా తిట్టి పంపించాడు. నకులుడు లజ్జతో తలవంచుకుని వెళ్లి ధర్మరాజు రథం ఎక్కాడు.
కర్ణుడు పాంచాలబలాల మీద దూకి వాటిని పంచబంగాళం చేశాడు. మరోవంక పాండవుల పక్షాన చేరిన నీ కొడుకు యుయుత్సుడు పర్వతం లాటి ఉలూకుడితో తలపడ్డాడు. ఉలూకుడతని వింటిని విరిస్తే యుయుత్సుడింకో గట్టివిల్లు తీసుకుని అరవైనాలుగమ్ముల్తో అతన్ని కొట్టి పదమూడు సాయకాల్తో అతని సారథిని నొప్పించి అతివేగంగా అతని మీద పదునైన బాణాల్ని ప్రయోగించాడు. దాంతో కోపించి ఉలూకుడు ఇరవై శిలీముఖాలతని శరీరాన నాటి కేతనాన్ని విరిచాడు. నీకొడుకు ఐదు విశిఖాల్ని అతని రొమ్మున నాటాడు. అవతన్ని బాగా బాధించినయ్. దాంతో అతను వేషం దాల్చిన రోషంలా ఓ భల్లంతో సూతుణ్ణి, నాలుగు బాణాల్తో గుర్రాల్ని చంపి, ఐదు పదునెక్కిన బాణాల్తో అతని కవచాన్ని చించితే అందరూ చూస్తుండగా నీకొడుకు పారిపోయి మరో రథం ఎక్కాడు. ఆ గెలుపుతో ఇంకా విజృంభించి ఉలూకుడు పాంచాలబలాల మీదికి దూకాడు.
ఇలా వుండగా కృపాచార్యుడు ధృష్టద్యుమ్నుడితో తలపడ్డాడు. ద్రోణవధకి ప్రతీకారంగా ధృష్టద్యుమ్నుడి చావు చూడకుండా వదలడని అందరూ కుతూహలంగా వాళ్ల యుద్ధం చూస్తున్నారు. కృపుడు మహోగ్రంగా పటిష్టమైన బాణాల్తో అతని గుర్రాల్ని, సారథిని నొప్పించి అతని శరీరాన్ని రక్తసిక్తం చేశాడు. అతని సారథి ధృష్టద్యుమ్నుడికి “ఇప్పుడితనితో యుద్ధం నీవల్ల అయే పని కాదు. ఇతను అవధ్యుడు కూడ. నీ బాణాలేవీ ఇతని మీద పనిచెయ్యటం లేదు. కనక ఇప్పటికి మనం ఇక్కణ్ణుంచి తప్పుకోవటమే మంచిది” అని సలహా ఇస్తే ధృష్టద్యుమ్నుడు కూడ “నిజమే, నా కాళ్లూ చేతులూ వణుకుతున్నయ్, ఒళ్లు తూలుతున్నది, మనసు పరిపరి విధాల పోతున్నది. అర్జునుడో భీముడో దగ్గర్లో వుంటే వాళ్ల దగ్గరికి మనరథం మళ్లించు” అన్నాడు చిన్న గొంతుతో. సారథి వెంటనే రథాన్ని అతివేగంగా భీముడి దగ్గరికి తోలాడు. ఐనా వదలకుండా వెంటపడి బాణాలేస్తూ తరిమాడు కృపుడు.
మరోచోట కృతవర్మతో యుద్ధం చేస్తున్న శిఖండికి కూడ అలాటి అనుభవమే ఎదురయ్యింది. శిఖండి రథాన్ని చిత్రవిచిత్ర గతుల్లో తిప్పుతూ ఎంతో సాహసంగా పోరినా కృతవర్మ అతని ఒళ్లంతా రక్తం కారేలా నానాశరాల్తో బాధించి ఉగ్రనారాచాల్ని వేసి అతన్ని మూర్ఛితుణ్ణి చేశాడు. అతని సారథి రథాన్ని తోలుకుని పారిపోయాడు. అతనితో పాటే వాళ్ల సేనంతా చెల్లాచెదురైంది.
శిబి, త్రిగర్త, సాల్వ, సంశప్తక సైన్యాలు ఎంత నష్టం జరుగుతున్నా వెనక్కి తిరక్కుండా అర్జునుడితో పోరాడుతున్నయ్. సుశర్మ, అతని తమ్ములు, కొడుకులు ఒకేసారి అర్జునుడితో తలపడ్డారు. సత్యసేనుడు మూడు సాయకాలు, మిత్రదేవుడు ఆరు మార్గణాలు, చంద్రదేవుడు మూడు క్రూరబాణాలు, మిత్రవర్ముడు ఏడు శరాలు, సౌశ్రుతి డెబ్బైమూడు కంకపత్రాలు, శత్రుంజయుడు ఏడు విశిఖాలు, సుశర్మ ఇరవై కాండాలు ఒక్కసారిగా ప్రయోగించారు. అర్జునుడు చెక్కుచెదరకుండా నిలబడి అందర్నీ అనేక ఆయుధాల్తో ఎదుర్కుని శత్రుంజయుణ్ణి చంపి సౌశ్రుతిని బాగా గాయపరిచాడు. ఇంతలో సత్యసేనుడు బలంగా విసిరిన తోమరం కృష్ణుడి భుజానికి తగిలి అతని చేతి మునికోల నేల మీద, పగ్గాలు నొగల్లో పడినయ్. అర్జునుడు “వాడి రథం దగ్గరకి వెళ్దాం పద” అంటే కృష్ణుడు మరో మునికోల తీసుకుని వేగంగా అక్కడికి నడిపాడు. పదునైన అనేక భల్లాలు ప్రయోగించి వాణ్ణి చిత్రవధ చేశాడు అర్జునుడు. మిత్రవర్ముణ్ణి, వాడి సారథిని నేలకూల్చాడు. ఐనా సుశర్మ దాయాదులు వెనక్కి తగ్గకుండా పోరారు. అర్జునుడప్పుడు ఇంద్రాస్త్రం ప్రయోగిస్తే దాన్నుంచి అనేక భల్లాలు, అంజలికాలు మొదలైన ఆయుధాలు వచ్చి సంశప్తక సేనల్ని మట్టుబెట్టినయ్. ఆ ప్రదేశమంతా పీనుగుపెంటల్తో నిండిపోయింది. అర్జున శరాగ్నిలో మిడతల్లా మాడిన సంశప్తక సేనల్లో మిగిలిన కొద్దిమంది దిక్కుకొకరుగా పారిపోయారు. పొగ విడిచిన అగ్నిలా అతను ప్రకాశించాడు.
దుర్యోధనుడు ధర్మరాజుని ఎదుర్కుని తొమ్మిది సాయకాలు అతని శరీరానికి గుచ్చి సారథినొక తీవ్రబాణాన కొడితే కళ్లనుంచి నిప్పులు రాలుస్తూ ధర్మరాజు పదమూడు బాణాల్తో దుర్యోధనుణ్ణి నొప్పించాడు. వెంటవెంటనే నాలుగు శరాల్తో గుర్రాల్ని చంపి, ఐదో బాణంతో సూతుణ్ణి, ఆరో బాణంతో కేతనాన్ని, ఏడో దాంతో ధనుస్సుని, ఎనిమిదో బాణంతో దుర్యోధనుడెత్తిన కత్తిని తునకలు చేశాడు. పన్లో పనిగా ఐదు వాలిక నారసాల్ని అతని వక్షాన నాటితే భయపడి దుర్యోధనుడు రథం మీంచి దూకేశాడు. అతని పరిస్థితి చూసి పరుగున వచ్చి అశ్వత్థామ, కర్ణ, కృపులు అతని చుట్టూ చేరారు. అది చూసి ఆ వైపునుంచి పాండవులు హుటాహుటిన అన్నకి సాయంగా వచ్చారు.
ఇలా మధ్యాన్న సమయానికి దొరలంతా ఒక్కచోట చేరారు. ఇరు పక్షాలకి రౌద్రంగా రణం జరిగింది. ఏనుగుల దంతాల్లో చిక్కుకున్న గుర్రాలు, గుర్రాల కాళ్ల కింద నలిగిన బంట్లు, ఒరుసుకుని ముక్కలైన రథాలు, రథచక్రాల కింద పడి మడిసిన రథికులు – ఇలా రణరంగం పీనుగుపెంటల్తో, నెత్తురు కాలవల్తో, అవయవాల గుట్టల్తో నిండిపోయింది. విరథుడైన దుర్యోధనుడు కూడ రణభూమిని విడవకుండా మరో రథం కూర్చుకుని తన సారథిని ధర్మరాజు మీదికి పోనివ్వమన్నాడు. అలాగే అతని రాకని చూసిన ధర్మరాజు తన రథాన్ని దుర్యోధనుడి వైపుకి తిప్పమని తన సారథికి చెప్పాడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి యుద్ధం కొనసాగించారు. నీకొడుకు ధర్మజుడి వింటిని విరిచాడు, అతను వేగంగా ఇంకో విల్లు తీసుకుని దుర్యోధనుడి విల్లు తుంచాడు. దుర్యోధనుడు మరో వింటితో బాణాలేశాడు. ఇద్దరూ ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకున్నారు. దుర్యోధనుడొక ఘోరశక్తిని వేస్తే ధర్మరాజు దాన్ని మధ్యలో తుంచి ఐదు పదునైన బాణాల్తో నీకొడుకు వక్షాన్ని కొట్టాడు. దుర్యోధనుడు తొమ్మిది భల్లాలు వేశాడు. ధర్మరాజు కోపోద్రేకంతో పిడుగు లాటి శిలీముఖంతో దెబ్బతీశాడు. దుర్యోధనుడు గద తీసుకుని ఈ యుద్ధం ఇప్పుడే మానిపిస్తానని కిందికి దూకితే ధర్మరాజు ఏమీ కంగారు పడకుండా ఒక ఉగ్రశక్తితో అతని రొమ్ముని మోదితే నీకొడుకు తిరిగి రథం ఎక్కాడు. ఐతే ధర్మరాజు కొట్టిన దెబ్బకి రక్తం చిమ్ముతుంటే అతను నిలబడలేక మూర్ఛపడ్డాడు.
కృతవర్మ వేగంగా వచ్చి దుర్యోధనుడికి అడ్డంగా నిలిచాడు. భీముడతనితో తలపడితే కృతవర్మకి సాయంగా మనబలాలు పోగయినయ్. అదే అదునుగా అర్జునుడు మనబలాల్ని చేతుల తీట తీరేట్టు చెండాడుకున్నాడు. ఇంతలో దుర్యోధనుడు తెప్పరిల్లి లేచి అర్జునుడితో తలపడ్డాడు. అర్జును డతివేగంగా అతని జెండాని, గుర్రాల్ని, సూతుణ్ణి, వింటిని ముక్కలు చేశాడు. అతని ప్రాణాలు తీసే ఒక శక్తివంతమైన బాణాన్నీ వేశాడు. ఐతే దాన్ని అశ్వత్థామ మధ్యలోనే ఆరుబాణాల్తో పొడి చేశాడు. అర్జునుడు అశ్వత్థామ వింటిని విరిచి గుర్రాల్ని చంపి అడ్డొస్తున్న కృపుడి వింటిని కూడ పనిలో పనిగా నరికాడు. కృతవర్మ వచ్చి తాకితే అతని గుర్రాల్ని, కేతనాన్ని, వింటిని రూపు మాపాడు. ఎదుర్కోబోయిన దుశ్శాసనుడి విల్లు కూడ రెండు ముక్కలు చేసి గాండీవ గుణధ్వనితో దిక్కులు మారుమోగుతుంటే కర్ణుడి మీదికి కాలుదువ్వాడు.
అర్జునుణ్ణి మూడు, కృష్ణుణ్ణి ఇరవై బాణాల్తో భేదించి మరో మూడు బాణాలు అర్జునుడి మీద వేశాడు కర్ణుడు. అంతకుముందు వరకు కర్ణుడితో పోరుతున్న సాత్యకి వచ్చి అర్జునుడికి అడ్డుపడి తొంభై శరాలు, తొమ్మిది మార్గణాలు, వంద శిలీముఖాలు కర్ణుడి మీద ప్రయోగించాడు. కర్ణుడతని రథం, సారథి, గుర్రాలు, జెండా – అన్నిటినీ అస్త్రవర్షంలో ముంచెత్తాడు. యుధామన్యుడు, శిఖండి, ఉత్తమౌజుడు, ద్రౌపదేయులు, యుయుత్సుడు, కవలు, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు, ప్రభద్రక, చేది, కరూశ, మత్స్య, కేకయ, వత్స సేనల్తో కలిసి వచ్చి కర్ణుణ్ణి చుట్టుముట్టారు. కర్ణుడు సమరోల్లాసంతో ఆ సైన్యాల్ని చెల్లాచెదురు చేసి తన ధనుర్గుణ ధ్వని రోదసి నిండేట్టు విజృంభించాడు.
అదిచూసి అసూయ పడ్డాడు అర్జునుడు. అతనికి సమానంగా మన సేనల్ని ముప్పుతిప్పలు పెట్టి గాండీవం పదునెంతో చూపించాడు.
సూర్యుడు పశ్చిమాద్రికి చేరాడు. దుమ్మూ ధూళీ కలిసి అంధకారం అలుముకుంది. పాండవబలాలు తరుముతున్నా మన వాళ్లు యుద్ధం ఆపి వెనక్కి తిరిగారు. మన బలగాల్ని హేళన చేస్తూ పాండవబలాలు వెనక్కి మళ్లినయ్.
అంతవరకు విని ధృతరాష్ట్రుడు “అర్జునుడు తల్చుకుంటే మిమ్మల్నందర్నీ చంపగలడనేది తేటతెల్లమైపోయింది. ఐతే అతన్నెదిరించటం యముడు, అగ్ని లాటి వాళ్లకే సాధ్యం కాదు, వీళ్లని అనుకోవటానికేముంది? యాదవవీరులందర్నీ అవలీలగా ఓడించి సుభద్రని తెచ్చుకున్నాడు. వినోదప్రాయంగా అగ్నికి ఖాండవ వనాన్ని ఇప్పించాడు. శబరవేషంలో వచ్చిన శివుడినే పోరాడి మెప్పించాడు. గంధర్వుల చెరనుంచి దుర్యోధనుణ్ణి విడిపించాడు. కాలకేయాది రాక్షసుల్ని కాలుడి దగ్గరికి పంపాడు. అలాటి అర్జునుడి చేతిలో మనవాళ్లు ఓడిపోయారంటే దాన్లో ఆశ్చర్యం ఏముంది? అసలతని ఎదురుగా నిలబడి పోరాడారు, అదే గొప్ప విషయం” అని విశ్లేషించాడు. సంజయుడు యుద్ధవృత్తాంతాన్ని కొనసాగించాడు.
అలా శిబిరాలకి తిరిగి వెళ్లిన మనవాళ్లు అర్జునుడి పరాక్రమాన్ని తల్చుకుని నీరుగారి పోయారు. పాలిపోయిన మొహాల్తో దీనంగా దిక్కులు చూడసాగారు. అప్పుడు కర్ణుడు “అర్జునుడు మొనగాడు, నిజమే. అతనికి ఏవన్నా తెలియకపోతే బోధించటానికి పక్కనే కృష్ణుడు కూడ వున్నాడు. ఇంద్రుడిచ్చిన ఘనశక్తిని నేను ఘటోత్కచుడి మీద ప్రయోగించేలా చేసి అర్జునుణ్ణి ఎలా రక్షించుకున్నాడో మనందరం విన్నాం, చూశాం. ఐనా ఏమీ భయం అక్కర్లేదు. రేపు నేను నా ప్రతాపం చూపిస్తా. అర్జునుడి అంతం చూస్తా. నీకిక ‘పగ ‘ అనేది లేకుండా చేస్తా” అని దుర్యోధనుడితో చెప్పాడు. నీకొడుకు తృప్తి పడ్డాడు. అందరూ వారి వారి మందిరాలకి వెళ్లారు.
--------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment