Friday, July 5, 2019

పఠాభి కవిత్వం: మళ్ళీ కొత్తగా కొన్ని ఆలోచనలు


పఠాభి కవిత్వం: మళ్ళీ కొత్తగా కొన్ని ఆలోచనలు
సాహితీమిత్రులారా!
ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘పఠాభి’గా ప్రసిద్ధుడైన తిక్కవరపు పట్టాభిరామరెడ్డి రాసిన కవిత్వం, ఆయన చూపించిన అతినవ్యత, తెలుగువాళ్ళిప్పటికీ జీర్ణించుకోలేక పోయిన ఆయన ప్రయోగపరత్వం, ఆయన వేసిన కొత్త దారులు, వీటి గురించి మళ్లీ కొత్తగా కొన్ని ఆలోచనలు.

పఠాభి కేవలం కవిగా మాత్రమే కాక, సంస్కార అనే చలనచిత్రం ద్వారా జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన గొప్ప చలనచిత్ర దర్శకుడు కూడా. సైన్స్‌ని, గణితాన్ని గాఢాతిగాఢంగా అభిమానించిన అత్యంత హేతుబద్ధ మానవుడు కూడా. తనలో రేషనలిజం, ఇర్రేషనలిజం, రెండూ కలగలిసి ఉన్నాయని ఆయనే ఒకచోట చెప్పుకున్నాడు. ఐన్‌స్టీన్ పట్ల ఆయనకున్న గాఢాతిగాఢమైన అభిమానం, గణిత శాస్త్రం పట్ల తీవ్రాతితీవ్రమైన మమకారం ఆయనలోని రేషనల్ భావజాలానికి గుర్తులైతే, ఆయనలో ఇర్రేషనల్ పట్ల ఒక వ్యామోహం కూడా ఉంది. అయితే ఆయన దృష్టిలో ఇర్రేషనల్ అంటే హేతురహితం కాదనీ, హేతువుకతీతమైన, కేవలం హేతువు ద్వారా మాత్రమే నిలబెట్టుకోలేని అనేక మానవీయ భావాల్ని, మానవీయ కోణాల్ని కూడా పట్టించుకోవడమనీ అర్థమవుతుంది. ఆ కోణాల్ని చూపించటానికి వీలైన అత్యుత్తమ ఉపకరణంగా ఆయన సాహిత్యాన్ని భావించాడు. ముఖ్యంగా కవిత్వాన్ని.


ఆయన జీవితకాలం పొడుగునా 1939 నుండి 80 దాకా దాదాపుగా నలభై ఏళ్ల పొడుగునా రాసిన కవిత్వం మూడు సంకలనాలుగా తెలుగువాళ్ళకు పరిచయమయింది. మొదటి సంకలనం ఫిడేలు రాగాల డజన్ అయినప్పటికీ కూడా తెలుగు సాహిత్యంలో అత్యంత వివాదాస్పదమైన, ఎంతో చర్చకు నోచుకున్న ఇప్పటికీ ఏ ఇద్దరు విమర్శకులూ కూడా ఏకాభిప్రాయానికి రాలేని కవితా సంపుటి. దాని గురించీ, ముఖ్యంగా పఠాభిని కొత్తగా అర్థంచేసుకోవడానికీ, ఈ 21వ శతాబ్దంలో ఆయన కవిత్వం ప్రాసంగికత ఏమిటి, తెలుగు సాహిత్యంలో అది తీసుకొచ్చిన కొత్త కాంట్రిబ్యూషన్ ఏమిటి అన్నదాని గురించి కొంత ఆలోచించాలి.

పఠాభి ఫిడేలు రాగాల డజన్ అనే పేరు మీద వచన పద్యాలను 1939లో తెలుగులో తీసుకువచ్చినపుడు, దానికి శ్రీశ్రీ ఒక ‘ఇంట్రో’ రాశాడు. ఏ ముహూర్తాన ఈ కవిత్వం శ్రీశ్రీ పరిచయవాక్యాల్తోటి తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించిందో, ఆ రోజునించి ఇప్పటిదాకా దానిమీద చాలా సుదీర్ఘమైన వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయ్.

పఠాభి సాహిత్య వ్యక్తిత్వంలో, ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వంలో సమున్నతమైన కోణమేమిటంటే, ఆయన తన కవిత్వం మీద విదిలించబడ్డ దుర్భాషల్ని, దూషణల్ని, మందలింపుల్ని కూడా చాలా సంతోషంతో స్వీకరించడం. అబ్యూజ్ అనే పదం వాడాడాయన. తన కవిత్వం ఎంత అబ్యూజ్ అయితే తన కవిత్వం ప్రాముఖ్యత అంతగా పెరుగుతుందని. అంటే ఆ కవిత్వం ప్రాముఖ్యత దూషణ వల్ల పెరుగుతుందని కాదు, ఆ దూషణల వల్ల తన కవిత్వం రేకెత్తించగల సంవేదనలేమిటో, పాఠకుల్లో గాని, సాహిత్య ప్రపంచంలో గాని తన కవిత్వం ఎటువంటి సంవేదనలు తీసుకు రాగలుగుతుందో అర్థంచేసుకోవడానికి అవి పనికొస్తాయని ఆయన అనుకొన్నాడు. అందువల్ల తిరిగి తిరిగి ఆ కవిత్వాన్ని పునః పునః ముద్రిస్తూ వచ్చినపుడు ముఖ్యంగా ఇటీవలి ముద్రణల్లో ఆయన పకపకలు-వెకవెకలు అనే పేరుమీద తన కవిత్వం గురించి అంతవరకు సుప్రసిద్ధ తెలుగుకవులు, విమర్శకులు, విశ్లేషకులు, ఏ ఏ భావాలు వ్యక్తం చేశారో, ఆ భావాలన్నిటినీ కూడా, ఒక్క వాక్యం కూడా ఎడిట్ చేయకుండా, దాచకుండా మొత్తం ఆయన మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. తన కవిత్వాన్నందిస్తున్నట్లే, తన కవిత్వం మీద అభిప్రాయాలను కూడా సమానంగా రెండు చేతులతో అందించిన ఇటువంటి సహృదయ సాహిత్యమూర్తిని మనం చూడం. ఆ అభిప్రాయాలన్నిటివల్లా కూడా ఆ కవిత్వాన్ని అర్థంచేసుకోవడానికి మనకి మరింత అవకాశం కలిగింది.

ఆ కవిత్వం చారిత్రక ప్రాధాన్యత ఏమిటి? ఎందుకు ఆ కవిత్వం ఆనాడు అటువంటి తీవ్ర ప్రతిస్పందన కలుగజేసింది? ఆయన కవిత్వం మీద విశ్లేషణ చేసినవాళ్లు సరిగ్గానే నిదానించారా లేక తీవ్రంగా పొరపాటుపడ్డారా? వారు పొరపాటుపడి ఉంటే ఏ అంశాల్లో పొరపాటుపడ్డారు? వీటిని మనం సాకల్యంగా పరిశీలించుకోవడానికి, ఎప్పటికప్పుడు పరిశోధించుకోవడానికి ఈ భావాలన్నిటినీ ఆయన మన ముందుకు తీసుకురావటం చాలా ఉపకరించింది.

ఆయన కవిత్వాన్ని విమర్శించిన వారందరికీ శ్రీశ్రీ ఇంట్రోనే మూలాధారమైంది. ఈ ఇంట్రోలు, ముందుమాటలు చాలా సందర్భాలలో కవిత్వాలకు తెర తీయటానికి బదులు తెర వేస్తాయన్నమాట. అక్కడేం జరుగుతుందంటే, ఒక కొత్త కవి, అతినవ్య ధోరణిలో కొత్త కవిత్వం ఒక భాషలో ప్రవేశిస్తునప్పుడు దానికి ముందుమాటలు రాసేవాళ్ల వల్ల జరిగే హాని ఏమిటంటే చాలా సందర్భాల్లో ముందుమాటలు రాసేవాళ్ళ భావజాలమే ఆ కవి భావజాలంగా పాఠకులు పొరపాటు పడటం. ఇది శ్రీశ్రీకి కూడా చలం వల్ల జరిగింది. శ్రీశ్రీ వ్రాసిన మహాప్రస్థానానికి చలం రాసిన యోగ్యతా పత్రాన్ని మనం గనుక జాగ్రత్తగా చదివితే, దాన్లో చాలావరకు శ్రీశ్రీ భావజాలంకన్నా గూడా చలం భావజాలమే, చలం తాలూకు తిరుగుబాటు మనస్తత్వమే, చలం తాను సమాజం పట్ల ఏ విధంగా ప్రతిస్పందించాడో దాన్నే దాదాపుగా శ్రీశ్రీకి కూడా ఆరోపిస్తూ ఆ యోగ్యతా పత్రం రాసినట్టు మనకి కనిపిస్తుంది. ఉదాహరణకి, శ్రీశ్రీ ఎటువంటి ప్రపంచాన్ని కోరుకుంటున్నాడు అని చెప్తూ మరో ప్రపంచంలో కూడా ఇవి ఉండనే ఉండవని ఒక జాబితా ఇస్తూ, అందులో స్కాండల్స్ కూడా ఉండవు అంటాడు చలం. స్కాండల్స్ లేని ప్రపంచం ఒక అభిలషణీయ ప్రపంచం చలానికి. కాని శ్రీశ్రీ మహాప్రస్థానానికి స్కాండల్స్ లేని ప్రపంచం కాదు ప్రధానం. కాని మహాప్రస్థానానికీ, మహాప్రస్థానంలోని మరో ప్రపంచానికీ తెర తీసేటప్పుడు, చలం దాన్ని అది స్కాండల్స్ లేని ప్రపంచంగా ఊహించడం మనం గమనించాలి. అంటే, ఒక ఇంట్రో రాస్తున్నప్పుడు లేదా ఒక ముందుమాట రాస్తున్నప్పుడు కవులు, ముఖ్యంగా వాళ్లు చాలా తీవ్రమైన చింతకులు, భావనాపరులైతే, వాళ్లతో జరిగే ప్రమాదమేంటంటే వాళ్ల భావజాలమే కవి భావజాలంగా మన కళ్లుగప్పడం.

దాదాపుగా ఇదే ప్రమాదం ఫిడేలు రాగాల డజన్‌కు కూడా శ్రీశ్రీ ఇంట్రో వల్ల జరిగిందని నాకనిపిస్తోంది. అందులో ఈ కవి వ్యాకరణానికి తిలోదకాలిచ్చాడనీ, ఇతడు ఒక పదానికి ఒకే అర్థం కాని, లేదా ఒక పదానికి అనేక నానార్థాలు కాని ఉండకుండా ఉండాలని కోరుకున్నాడనీ, విచిత్రమే సౌందర్యం, సౌందర్యమే విచిత్రమన్నాడనీ శ్రీశ్రీ తన ముందుమాటలో రాశాడు. ఆనాటి సమకాలిక కవులందరూ కూడా, పఠాభి, శ్రీశ్రీల కన్నా వయసులో పెద్దవాళ్లూ, అనుభవమున్నవాళ్లూ. వారి తర్వాత వచ్చినవాళ్లు కూడా దాదాపుగా, ఈ ఇంట్రో చూపించిన వెలుతురులోనే, ఆ ఫోకస్‌లోనే ఫిడేలు రాగాల డజన్‌ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించారు.

పఠాభి ఫిడేలు రాగాల డజన్‌ని మనం సరిగా అర్థంచేసుకోవాలి అనుకొంటే, ఆయన సమకాలీకులు, పఠాభి కాలంనాటి తెలుగు సాహిత్య ప్రపంచమంతా చేసిన పొరపాట్లు మనం చేయకుండా ఉండాలి అంటే, మనం శ్రీశ్రీ రాసిన ఇంట్రోని, శ్రీశ్రీని కూడా పక్కన బెట్టి, పఠాభి కవితలు వాటికవే స్వయంగా మనతో ఏం మాట్లాడుతున్నాయో చూడాలి.

ఫిడేలు రాగాల డజను 1936-38 సంవత్సరాల మధ్య కాలంలో, అంటే ఇరవయ్యవ శతాబ్ది నాలుగో దశకంలో చివరి ముప్పైల్లో వచ్చిన కవిత్వం. 1938లో ఒక సంపుటిగా సాహిత్య ప్రపంచానికందింది. అది రెండవ ప్రపంచయుద్ధం ఆరంభమౌతున్న కాలంలో, ఆరంభమవగానే ప్రచురణకి వచ్చింది. ప్రపంచం మీద రెండో ప్రపంచయుద్ధ మేఘాలు కమ్ముకొంటున్న సమయంలోనే ఈ కవిత్వం మీ ముందుకొస్తోందని రాశాడాయన. ఆధునికత, ఆధునిక సాహిత్యం, ఈరోజు మనం చెప్తున్న అనేకానేక ఆధునిక కళా ఉద్యమాలు, అతి వాస్తవిక ఉద్యమాలు మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండవ ప్రపంచ యుద్దానికి మధ్యకాలంలో ప్రపంచమంతటా సంభవించాయని గుర్తుపెట్టుకోవాలి.

శ్రీశ్రీ ‘జయభేరి’ 1934లో వ్రాసిన కవిత. శ్రీశ్రీ మహాప్రస్థానంలో కవితలన్నీ కూడా 1934 తర్వాత రాసినవే. అప్పణ్ణుంచే, శ్రీశ్రీ కొత్త సాహిత్య వ్యక్తిత్వం ఆవిష్కరణ కావడం మొదలయ్యింది. పఠాభి కవితలు 1936-38 అంటే దాదాపుగా మహాప్రస్థానానికి సమకాలికంగా వచ్చిన కవితలు. ఆ రోజుల్లో శ్రీశ్రీ వేసిన దారి ఒకదారి ఐతే, పఠాభి వేసిన దారి మరోదారి అన్నమాట. శ్రీశ్రీని అనుసరించి పఠాభి కవిత్వం వ్రాశాడని గాని, శ్రీశ్రీ ప్రభావం వల్ల వ్రాశాడనిగాని చెప్పడం సరికాదు. ప్రభావమనేది చాలా అస్పష్టమైన మాట. సమకాలికులైనవాళ్లు ఒకరి కవిత మరొకరు చదివినపుడు ఏదో ఒక మేరకు కొంత అనుసరించక పోరు. కానీ దాన్ని ప్రభావమనలేం.

ఆ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, పఠాభి ఒక ప్రపంచయుద్ధం సృష్టించిన విధ్వంసం అనంతరం, ఆ విధ్వంసం నుంచి కోలుకోకుండానే ప్రపంచం మరొక ప్రపంచయుద్ధం కోసం సమాయత్తమౌతున్న కాలంలో, అంటే అత్యంత ఆత్మవిధ్వంసకరమైన కాలంలో, తెలిసో, తెలియకో, రెక్‌లెస్‌గానో ప్రపంచం మృత్యువు వైపు అడుగులు వేస్తున్న సమయంలో పఠాభి కవిత్వం చెప్పాడని మనం గమనించాలి. మృత్యువు వైపుగా, వినాశనం వైపుగా, యుద్ధం వైపుగా, ఆత్మ విధ్వంసకత్వం వైపుగా ప్రపంచం నడుస్తూ ఉన్న కాలంలో ఆ యుగ మనఃస్థితిని, ఆ కాలంలో తన ఆత్మ విచికిత్సని పఠాభి కావ్యరూపంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని మనమర్థం చేసుకోవాలి.

పఠాభి ఫిడేలు రాగాల డజన్‌ గురించి చాలా తీవ్రంగా విమర్శించినవాళ్లలో, దువ్వూరి రామిరెడ్డి ఒకడు. దువ్వూరి రామిరెడ్డి గురజాడ అప్పారావుకి కొద్ది వెనుకగా, చాలా వాస్తవికవాద దృష్టితోటి సామాజిక సమస్యల గురించి, సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించి, సాహిత్య వచనం, ముఖ్యంగా కవిత్వరచన చేసిన మనిషి, సాహిత్య ప్రపంచంలో చాలా పొడగరి. విస్పష్టమైన వాస్తవికవాదంతో, అత్యున్నత ఆదర్శాలతో సాహిత్య సృష్టి చేసినవాడు. సహజంగానే దువ్వూరి రామిరెడ్డికి ఇటువంటి కవిత్వం, పఠాభి తరహా కవిత్వాన్ని స్వీకరించగలిగే మనఃస్థితి ఉండదు; స్వీకరించకూడదు నిజానికి. దువ్వూరి రామిరెడ్డి మొదటి ప్రపంచయుద్ధానికి పూర్వమే తలెత్తిన కవి. గురజాడ అప్పారావులాగే ఆయనకూడా మొదటి ప్రపంచయుద్ధానికి పూర్వమే తలెత్తి, మొదటి ప్రపంచయుద్ధం కాలంలోనే కవితలు రాశాడు. మొదటి ప్రపంచయుద్ధం ప్రభావం భారతదేశంలో చాలా తక్కువ. ఎక్కడో యూరప్‌లో జరిగే యుద్ధంగానే అప్పటి కవులు దాన్ని భావించారు. కాబట్టి మొదటి ప్రపంచయుద్ధ ప్రభావానికి దూరంగానే రామిరెడ్డి కవిత్వం రాశాడు. ఇక రెండవ ప్రపంచయుద్ధం నాటికి ఆ స్వరూప స్వభావాలను పట్టించుకొనే పరిస్థితిలో లేడాయన. కాబట్టి రెండు ప్రపంచ యుద్ధాలకు మధ్యకాలపు యువత ఆంతరంగిక మనస్తత్వానికి రామిరెడ్డి దూరంగానే జీవించాడు. తాను పెరిగిన వాతావరణం, తన భావనలు వేరే కాబట్టి, ఆయన పఠాభి మీద చేసిన మొట్టమొదటి ఆరోపణ ఆ కవిత్వంలో రిస్ట్రెయింట్ లేదని. సంయమనం, ఆత్మ సంయమనం లేవని. అంటే, కవికి తన మీద తనకి అదుపు లేదని.

మనం గమనించవలసిందేంటంటే, ప్రపంచయుద్దాల మధ్యకాలంలో కవులు, ముఖ్యంగా వివిధ రకాల వాస్తవికతా వాదాలు, సర్రియలిస్ట్ వాస్తవికతా వాదాల కవులందరూ కూడా అదుపు తప్పిపోయిన ప్రపంచంలో కవిత్వం రాస్తూ, అదుపుతో కవిత్వం రాయడమనేది ఆత్మవంచన అని భావించారు. ప్రపంచశక్తులే తమను తాము అదుపు చేసుకోలేని విధంగా యుద్ధం వైపు అడుగులేస్తున్న వేళ గురజాడ అప్పారావు లాంటివాడే: ‘బ్రతుకునందు లేని స్థిరత భాషకెక్కడిది!’ అన్నాడు. కాబట్టి కవి స్వయంగా తనని తాను అదుపులో పెట్టుకోకూడదనే ఆ కవిత రాశాడు. అందులో అదుపులేదు అనే ఆరోపణ చేసేముందు అసలు ఆ ప్రవృత్తి ఎందుకొచ్చింది, ఆ యువకుడు ఎందుకట్లా అదుపులేనితనంతో కవిత రాశాడని ప్రశ్నించుకొని ఉండవలసింది.

ఇక బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం పఠాభి కవిత్వాన్ని ఇంగ్లీషులో సమీక్షిస్తూ ‘క్లెవర్’ అనే పదం వాడాడు. అంటే కవి తన హృదయంతో కాకుండా బుద్దితో తన కవిత్వాన్ని ఒక ప్రహేళికలాగా రాశాడని. చిత్ర కవిత్వం, బంధ కవిత్వం అని పూర్వం ఉండేవి కదా! అట్లా తెలివితో రాయడానికి ప్రయత్నించాడని చెప్తూ ఆయన తన సమీక్షలో చిట్టచివర అన్నాడు: ‘ఏదైనా ఈ కవి ముందుముందు మంచి కవిత్వం రాయాలంటే ముందు తన తెలివితేటల్ని వదులుకోవాలి’ అని.

రామిరెడ్డి తన విమర్శలో పద్య నిర్మాణం గురించి, ఛందస్సు గురించి, ఛందో రీతుల గురించి, నిఘంటువుల గురించి, నిఘంటువుల అవసరం గురించి కూడా ప్రస్తావిస్తాడు. పఠాభి పద్యాలకు చలం రాసిన ఒక ప్రశంసను తీసుకొని, ఆ ప్రశంసా వాక్యాలు ఏ విధంగా తేటగీతి ఛందస్సులో ఒదిగి ఉన్నాయో చూపిస్తూ, అసలు ‘నీ భావంలోనే, నీ ఆలోచనలోనే ఛందస్సుంది, నీవు దాన్నుంచి బయటకు అంత సునాయాసంగా తప్పించుకోలేవు’ అని చెప్పబోతాడు! ఈరోజు మనకి పఠాభి మీద దువ్వూరి రామిరెడ్డి చేసిన విమర్శ వెంకట పార్వతీశ కవులమీద అక్కిరాజు ఉమాకాంతంగారు చేసిన విమర్శలానే అనిపిస్తుంది. కొత్త కవిత్వాన్ని పాత ప్రమాణాలతో పరిశీలించే పొరపాటు పద్ధతి. కాకపోతే, ఒక శిల్పశాస్త్రజ్ఞుడు, ఉన్నత ఆదర్శాలు కలిగినవాడు, ముఖ్యంగా వయసులో పెద్దవాడు, ఒక యువకుడి గురించి ఆతృతపడి చేసిన హితబోధగా ఆ విమర్శ పట్ల ఉదాసీనత చూపించగలం, అంతే.

ఫిడేలు రాగాల డజన్‌ని దువ్వూరి రామిరెడ్డి కాని, బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం కాని, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి కాని అర్థంచేసుకునే ప్రయత్నంలో తామేవైనా కొన్ని నిర్ణయాలకు వచ్చి ఉంటే, అదొక సంగతి. కాని, పఠాభి కన్నా కొద్దిగా వెనగ్గా వచ్చిన సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు, కొద్దో గొప్పో సాహిత్యస్పష్టత ఉన్నవాళ్ల పరిస్థితి కూడా అలానే వుంది. ఉదాహరణకి, కె.వి. రమణారెడ్డి. రమణారెడ్డికి సాహిత్య పరిజ్ఞానం ఉంది, అర్థం చేసుకోగల శక్తి ఉంది. కాని ఆయన చాలా ఆశ్చర్యకరంగా ఫిడేలు రాగాల డజన్‌ బూర్జువా బోర్‌డమ్ లోంచి, అంటే, పనీపాటా లేని జీవితం నుంచి, అన్నీ అనుభవించటానికి ఉండి, అన్నీ సంసిద్ధంగా ఉన్నందువల్ల వాటి పట్ల రుచిని పోగొట్టుకున్న ఒక సంపన్న యువకుడి తీరికతనంలోని విసుగుదనం వల్ల వచ్చిన కవిత్వం అన్నాడు. కాని, తన అభియోగాలకు సమర్థనగా ఆయన పఠాభి కవిత్వం నుంచి, ఎట్లాంటి నిరూపణలు గాని, ఉదాహరణలు గాని, సాక్ష్యాలు గాని ఇవ్వటానికి ప్రయత్నం చేయలేదు. నిజమైన సాహిత్య విశ్లేషణ చేయలేదు; ఆ కవిత్వంలో కవి ప్రతిపాదించిన భావాలు, రమణారెడ్డికుండే వామపక్ష భావజాలాని కనుగుణంగా లేవు కాబట్టి, పఠాభి గురించి తెలిసిన వ్యక్తిగత సమాచారాన్ని కలగలుపుతూ సాహిత్య విమర్శ పేరిట తీవ్రాతితీవ్రమైన ఆరోపణలకు పాల్పడ్డాడు.

మరొక ఆశ్చర్యకరమైన విమర్శ సి. నారాయణరెడ్డి చేశాడు. ఆయన ‘ఆధునిక తెలుగు సాహిత్యము, సంప్రదాయములు, ప్రయోగములు’ అనే తన సాహిత్య సిద్ధాంత వ్యాసంలో పఠాభి గురించి రాస్తూ అంతకు పూర్వం వ్రాసినవాళ్లకన్నా గూడా ఎంతో కొంత ఎక్కువ సానుభూతితో దానిని పరిశీలించటానికి ప్రయత్నం చేస్తూనే, ఒకచోట ‘ఈ సంప్రదాయం, ఈ అనారోగ్యం పఠాభితోటే అంతమైపోవడం చాలా మంచిదైంది. ఇది ముందుకు జరక్కుండా ఉన్నందువల్ల తెలుగు సాహిత్యం చాలా లాభపడింద’ని రాస్తాడు. ఎందుకాయన పఠాభి నుంచి తెలుగు సాహిత్యాన్ని రక్షించాలనుకున్నాడో, అలా అనుకోవడానికి పఠాభిలో ఆయనకి ఏ ప్రమాదం కనిపించిందో వివరించడుగాని, ‘వీటిని వైచిత్రీ ప్రియత్వమను మైకములో పడిపోయి, విశృంఖలముగా చేసిన ప్రయోగములనవచ్చునేమో!’ అంటాడు.

దాన్లో సెక్స్ ఉందని, అణచుకోలేని కామోద్రిక్త భావనలున్నాయని, కామోద్రిక్తత వల్లనే ఆ విధంగా వ్రాశాడని, ఫ్రాయిడ్ సెక్స్ గురించి మాట్లాడాడని, ఫ్రాయిడ్‌ని చదివినందువల్ల పఠాభి మీద కూడా ఇటువంటి ప్రభావముందని ఒక నెరేటివ్ రూపొందించుకుంటూ పోతాడు. నారాయణరెడ్డి విమర్శ పఠాభి కవిత్వం వ్రాసిన వెంటనే వచ్చింది కాదు. చాలా కాలం తరవాత వచ్చింది, అప్పటికి ప్రపంచ చరిత్ర గురించి, ప్రపంచయుద్ధాల గురించి చాలా సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఆ సమాచారం ఆధారంగా సమ్యక్ విమర్శ చెయ్యవచ్చు. కాని, సరైన శ్రమ పడకుండా, శ్రద్ధ చూపకుండా నారాయణరెడ్డితో సహా విమర్శకులంతా పఠాభి కవిత్వం గురించి దుందుడుకు అభిప్రాయాలు వెలిబుచ్చారనే మనం భావించవలసి ఉంటుంది.

పఠాభి గురించి కొంత కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నించిన సాహిత్య విమర్శకులు కూడా లేకపోలేదు. వెల్చేరు వారాయణరావు తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అనే తన పుస్తకంలో పఠాభి చేసిన కృషి గురించి, ప్రయోగపరత్వం గురించి, చాలా వివరంగా చర్చించాడు. అందులో ఆయన నారాయణరెడ్డి, రామిరెడ్డి, రమణారెడ్డి చేసిన విమర్శని తిప్పికొట్టడానికి చాలా వరకు ప్రయత్నం చేశాడు. కాని, భావకవుల ప్రభావం వల్ల చాలామంది కవులు, భావకవిత్వ రూపంలో అకవిత్వం రాస్తూన్న సమయంలో, పఠాభి అకవిత్వం రూపంలో కవిత్వం రాయటానికి ప్రయత్నించాడనే విచిత్రమైన ప్రతిపాదన ఒకటి చేస్తాడు.

నేను మొదటిసారి నారాయణరావు పుస్తకం చదివినప్పుడు ఆ ప్రతిపాదనకి తలపంకించాను గాని, ఈవేళ చూస్తే ఆ మాటలు అర్థరహితమనిపిస్తున్నాయి. ఎందుకంటే, దేన్నైనా సరే అకవిత అనడం చాలా కష్టం. కవిత అనడం చాలా సులభం. ఏది కవిత, ఏది నిలబడే కవిత, ఏది శాశ్వతంగా ఉండే కవిత, అంటే చెప్పడం కష్టమేమో కాని దేన్నైనా కవిత అని చెప్పవచ్చు. అకవిత అనడం చాలా కష్టం. అకవిత అని దేన్ని అనగలుగుతావు? ఎందుకు దాన్ని అకవిత అంటున్నావు? అకవిత అంటే ఏమిటి? చాలా ప్రశ్నలొస్తాయి. ఆ రోజుల్లో ఆ విమర్శలను తిప్పికొట్టడానికి ఆయనేదో ఒక ప్రతిపాదన చేశాడు గాని, ఏ ఆధారాల ప్రకారంగా పఠాభిని అర్థం చేసుకోవాల్సి ఉంటుందో ఆయనకు కూడా తెలియలేదు.

మరి పఠాభి కవిత్వ రహస్యాన్ని పట్టుకోగలిగే మాటలెవ్వరూ చెప్పనే లేదా?

ఒకాయన ఉన్నాడు. కాని మనం ఊహించని మనిషి.

ఎక్కడో రేడియోలో చేసిన ఒక సాహిత్య ప్రసంగంలో విశ్వనాథ సత్యనారాయణ తమ కాలంనాటి ఆధునిక తెలుగు కవితల పోకడల గురించి మాట్లాడుతూ పఠాభి గురించి కూడా నాలుగైదు వాక్యాలు చెప్తూ, ‘ఈ కవిలో చాలా విప్లవపరత ఉంది. ఈ విప్లవపరత దేని పట్ల అంటే, ఇతను చేసిన విప్లవం పూర్వకవిసమయాల మీద చేశాడు’ అన్నాడు.

చాల చక్కటి మాట! శ్రీశ్రీతో సహా ప్రసిద్ధ విమర్శకులందరికంటే గూడా, పట్టాభి కవిత్వ లక్ష్యాన్ని చాలా స్పష్టంగా పట్టుకున్న మాట! ఇది చాలా ఆశ్చర్యం! విశ్వనాథ సత్యనారాయణ మాట్లాడిన ఈ వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్లిన వాళ్లు లేరు గాని, ఈ వాక్యం వెనుక చాలా అర్థముంది.

మనం గమనించవలసిందేమిటంటే, మొదటి ప్రపంచయుద్ధం వరకూ కూడా, సాహిత్యం సమాజాన్ని విమర్శించింది; చరిత్రను విమర్శించింది; లేదా లోకాన్ని విమర్శించింది; వాస్తవాన్ని విమర్శించింది; కాని మొదటి ప్రపంచయుద్ధం తరువాత రెండో ప్రపంచయుద్ధం దాకా మధ్యకాలంలో సాహిత్యం అసలు సాహిత్య కళనే విమర్శించింది. డాడాయిజం గాని, సర్రియలిజం గాని, క్యూబిజం గాని, ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సాహిత్య రూపాలన్నీ కూడా తత్పూర్వ కళారూపాల విమర్శగానే ముందుకొచ్చాయి. అంటే, అంతకుముందున్న సాహిత్య ప్రయోజనం క్రిటిసిజం ఆఫ్ లైఫ్, ఐతే, రెండు ప్రపంచయుద్ధాల మధ్యలో వచ్చిన సాహిత్య ప్రయోజనం క్రిటిసిజం ఆఫ్ లిటరేచర్ ఇట్‌సెల్ఫ్. సాహిత్య శిల్పవిమర్శ అది. ఆ విధంగా చూస్తే, విశ్వనాథ సత్యనారాయణ ‘పఠాభి కవిత్వం పూర్వ కవితా సమయాల మీద, పూర్వ కవితా సంప్రదాయాల మీద విమర్శ’ అని అనడంలో పఠాభిని బాగా పట్టుకున్నాడని నాకనిపిస్తుంది. కాని ఇది మెరుపులాగా ఉండే ఒక వాక్యం మాత్రమే! దీన్ని మనం మరింత వివరించి చెప్పుకోవలసి ఉంటుంది. సౌందర్యానికీ, ప్రకృతికీ సంబంధించిన భావజాలానికీ, దానికి ప్రతిగా అనాకారితనం, లేదా అందవిహీనత్వానికి, వికృతానికీ సంబంధించిన భావజాలానికీ, ప్రకృతికి వికృతికి మధ్య ఉన్న తేడాని ఎత్తి చూపడంగా పఠాభి కవిత్వాన్ని అర్థంచేసుకోవలసి ఉంటుంది.

పఠాభి ఏమన్నాడంటే ‘నేను శాంతినికేతన్‌లో పెరిగాను; శాంతినికేతన్‌లో చదువుకొన్నాను; నేను శాంతినికేతన్ వెళ్లడానికి రావడానికి కలకత్తాలో అత్యంత రద్దీతో ఉన్నటువంటి మానవ జీవితం చాలా నిస్సిగ్గుగా, అత్యంత నగ్నంగా మానవ జీవితం కనబడే చోట నేను జీవించవలసివచ్చింది. రెండూ నాకు పొసగేవి కావు. ఈ రెండిటి యొక్క అంటే ఈ శాంతినికేతనం బయట ఉన్న జీవితానికి, శాంతినికేతన్‌లో ఉన్న స్వప్నప్రాయమైనటువంటి ప్రశాంత జీవితానికీ మధ్యనుండే ఆ అగాధంలోంచి నా కవిత్వం వచ్చింద’ని.

శాంతినికేతనాన్ని ప్రకృతి అనుకుంటే, కలకత్తాలోని మానవ జీవితం వికృతి. శాంతినికేతనంలో సౌందర్యమున్నదనుకొంటే, కలకత్తా జీవితంలో సౌందర్య రాహిత్యముంది. కాని, అది జీవితమే. సుందరం కానంత మాత్రాన జీవితం కాకుండా పోదు. ఆ మాటకొస్తే అత్యంత వాస్తవమైన జీవితమది. ప్రకృతికి సన్నిహితంగా, ప్రకృతి ఒడిలో ఉన్నప్పటికీ శాంతినికేతన్‌ లోని జీవితం కృత్రిమ జీవితం. కలకత్తా ఇరుకు గొందుల్లో, పారిశ్రామికవాడల్లో, తొక్కిసలాటలో, పేదరికంలో, దుర్భర వేదనలో కృత్రిమత్వం లేదు. సహజత్వముంది. అంటే, ఏది వికృతిగా ఉందో, అది సహజంగా ఉంది. ఏది ప్రకృతికి చేరువగా ఉందో, అది కృత్రిమంగా అసహజంగా ఉంది. అంటే, ఏది ప్రకృతిగా ఉందో అది వికృతిగాను, ఏది వికృతిగా ఉందో అది ప్రకృతిగాను గోచరిస్తోందన్నమాట.

దీన్ని వెల్చేరు తొందరపడి ‘అకవిత’, ‘కవిత’ అంటూ వివరించబోయాడు. యథార్థానికి ఇది ‘అకవిత’ కాదు. వికృతి ద్వారా అసలైన ప్రకృతికి చేరువగా తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం. దీన్ని ఇంగ్లీషులో ‘గ్రోటెస్క్’ అంటారు. గ్రోటెస్క్ పొయిట్రీ ఇది. సంస్కృతంలో కూడా వక్రోక్తి అని ఉంది. సూటిగా చెప్పకుండా వంకరగా చెప్పడం. కాని వక్రోక్తి, ఒక స్వభావోక్తి మధ్యన ఒక వక్రోక్తిగా దాని మోతాదులో అది పరిమళిస్తుంది, కవిత్వం అనిపించుకుంటుంది కాని మొత్తం కవితనే వక్రోక్తిగా ఉంటే, గ్రోటెస్క్‌గా ఉంటే? కవిత మొత్తం వికృతిగా ఉంటే దాన్నర్థం చేసుకోవడం, అంగీకరించడం నిజంగా కష్టం.

అందువల్లనే పఠాభి కవిత్వం గరుగ్గా, బిరుసుగా, గుచ్చుకుంటూ, రాపాడుతూ తెలుగు సాహిత్య ప్రపంచాన్ని విపరీతమైన అలజడికి గురిచేసింది. ఆ అలజడి నుండి తెలుగు సాహిత్య ప్రపంచం ఇప్పటికీ తేరుకోలేదనే చెప్పాలి.

వికృతిని ప్రకృతిగా పఠాభి ఎలా చూపిస్తున్నాడో, ఈ గ్రోటెస్క్‌ను మనముందుకు తీసుకురావడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడో చూస్తే, అతడు ప్రతిపాదిస్తున్న నవీన సౌందర్యవాదం ఏమిటో మనకి కొంత సూచన దొరుకుతుంది. మొట్టమొదటి కవిత ‘ఆత్మకథ’ చూడండి. అందులో డాక్టర్ పట్టాభి ఒక ఆదర్శం, ఒక సౌందర్యం; అతడొక జాతీయవాది, దేశభక్తుడు. నేను అతణ్ణి కాను అని చెప్పడంలో మీకు సుపరిచితమైన ఒక ఆదర్శంగా తెలిసిన ఆదర్శాన్ని కాను నేను, అతను పట్టాభి; నేను పఠాభిని అని చెప్పటమన్నమాట. పట్టాభిని వికృతపరిస్తే పఠాభి అయ్యాడు.

మనకు సహజంగా తెలిసిన, మనం ఆరాధిస్తున్న, అభిమానిస్తున్న ఆదర్శవాద సౌందర్యంకన్నా భిన్నమైన మరొక ఆత్మని తాను పరిచయం చేస్తున్నానని మొదలుపెడుతున్నాడాయన. ఆ కవితలో టెలిస్కోపు, మైక్రోస్కోపు అనే పదాలు వాడాడు. టెలిస్కోపు దూరంగా ఉన్న వస్తువుని అతి పెద్ద వస్తువుని అతి చిన్నదిగా చూపించగలుగుతుంది, మైక్రోస్కోపు అతి చిన్న వస్తువుని అతి పెద్దదిగా చూపించగలుగుతుంది. అంటే రెండు సందర్భాలలో కూడా జరిగేది డిస్టార్షనే. రెండు సందర్భాల్లోనూ, అతి దూరంగా ఉన్నదాన్ని చిన్నదిగాను, అతి చిన్నదాన్ని పెద్దదిగాను చూపించడం ద్వారా వాటి గోచర పరిమాణాల్ని మనం డిస్టార్ట్ చేస్తున్నాం. కాని అట్లా డిస్టార్ట్ చేస్తే తప్ప మన నేత్రాలు చూడగలిగే ప్రమాణంలో అవి కనబడవు. ఆ సూక్ష్మక్రిమి గాని, ఆ సుదూర గ్రహం కాని, ఆ రెండూ మన నేత్రాలర్థం చేసుకునే రూపంలో కనపడాలి అంటే అవి డిస్టార్టెడ్‌గానే మనకు దృగ్గోచరం కావాలి. కాబట్టి వాస్తవ ప్రపంచ యథార్థాన్ని మనకి తెలియజేయాలంటే వాటిని మనకి తెలిసిన పరిమాణాల్లో కాకుండా డిస్టార్టెడ్‌ ప్రపోర్షన్స్‌లో చూపించడం తప్ప మరో మార్గం లేదు.


ఈ కవితలో ఉన్న ఈ నిర్మాణం గాని, ఈ పద సౌకుమార్యం–నిజంగానే అరాయించుకోవడం కష్టం. ఇందులో ఉన్న ప్రతి ఒక్క వాక్యం మీద చాలా చర్చ చేశారు. ‘ఈ నా వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుమును విరగదంతాను’ అంటే పద్యం నడుము విరగలేదు, పద్యం బ్రతికే ఉంటుందని రామిరెడ్డి అన్నాడు. కాని ఇదంతా కూడా వాచ్యార్థంగా కవితనర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. కానీ వ్యంగ్యార్థమేమిటంటే, ఇందులో ఉన్న వక్రోక్తి, గ్రోటెస్క్ ఏమిటంటే, ఇది మనకి సుపరిచితమైన ఆదర్శం లాంటి ఆదర్శం కాకపోవడం. అంతమాత్రాన ‘ఆ ఆదర్శం కన్నా ఇది తక్కువ ఆదర్శమని అనుకోకండి, మీకు తెలిసిన రూపంలో లేదు కాబట్టి ఇది గొప్పది కాదని మీరనుకోకండి’ అంటున్నాడు కవి.

మనకు తెలిసిన ప్రమాణాలతో, పరిమాణాలతో, మనకు సాధారణంగా తెలిసిన విషయాలు చూపించట్లేదు కాని మనకు తెలియని ఆంతరంగిక సత్యాల్ని లేదా సుదూర సత్యాల్ని మనకి చూపించటానికి ముందుకొస్తున్నాడు కాబట్టి, అందులో అనివార్యంగా ఒక డిస్టార్షన్ ఉంటుంది. ఆ డిస్టార్షన్ తప్పదు కాబట్టి, అదో కొత్త రకమైన సత్యాన్ని చెప్పే క్రమం కాబట్టి, మనమీ డిస్టార్షన్‌తో పరిచయం ఏర్పరచుకోవలసి ఉంటుంది. ఈ డిస్టార్షన్ గురించి తను చెప్పవలసి వస్తున్నాడు కాబట్టి తను కేవలం ఒక భావకవి అంటే, కేవలం ఒక భావాన్ని మాత్రమే మనకి పరిచయం చేసే కాదు, అంతకన్నా కూడా అహంభావ కవిని అని కవి మనతో అంటున్నాడు. ‘అహంభావ కవి’ అనే పదం మీద కూడా చాలా చర్చ చేశారు. అహంభావమంటే గర్వమని కాదు, అహంభావమంటే సెల్ఫ్ కాన్షియస్‌నెస్. తనది చాలా సెల్ఫ్ కాన్షియస్‌గా ఉన్న కవిత్వమని చెప్పడమన్న మాట. మాడర్నిజం ప్రధాన లక్షణం సెల్ఫ్ కాన్షియస్‌నెస్ అని మనం గుర్తు చేసుకుంటే, పఠాభి కవితలోని కొత్తదనం మనకర్థమౌతుంది.

పఠాభి రాసిన మరో కవిత ‘జాబిల్లి’. అది ‘ఓయి సుధాకరా! నిలువుమొక్క నిమేషము’ అని వేదుల సత్యనారాయణశాస్త్రి చంద్రుని మీద రాస్తున్న కాలంలో, ‘పవన పులకిత చంద్రా తపః ప్రఫుల్ల చారుశారద యామినీ సమయమందు’ అని భావకవులు పాడుతున్న కాలంలో వచ్చిన కవిత. చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ఈ కవిత మీద కూడా చాలా గొడవపడ్డారు. ఇందులో నగర జీవితాన్ని వర్ణించారనీ, ‘పౌడరు పూయబడిన ముఖాల్ని కళ్ల పిడికిళ్ళతో గట్టిగా పట్టి తిండిబోతులాగా తినివేస్తా’నంటే అందులో విపరీతమైన కామోద్రిక్తత ఉందనీ, ఒకటికాదు, రకరకాల ఆరోపణలు చేశారు. కానీ, ఈ కవితలో చాలా సహజంగా, స్పష్టంగా కనబడుతుంది ఏమిటంటే, వికృతిగా మారిన నగరం మధ్య ప్రకృతికి చిహ్నమైన చంద్రుడికి, చంద్రుడిగా, స్థానం లేదని.

చంద్రుణ్ణి గుర్తించటానికి మనకు తెలిసిన ఆధారాలు అప్పటిదాకా పూర్వ కవిసమయాలే. ఆ పూర్వ కవిసమయాల రూపంలో, పూర్వపద్ధతుల్లో చంద్రుణ్ణి ఈరోజు మనమిక్కడ స్వీకరించడానికి అవకాశం లేదు. కొత్త పద్ధతుల్లో స్వీకరించాలి అంటే మార్కెట్‌లోని దుస్సాధ్య కాంపిటీషన్‌కు చంద్రుడు తట్టుకోగలిగి ఉండాలి. చంద్రుడు తట్టుకుంటాడు అంటే చంద్రుడు తట్టుకొనే విధంగా మన పర్‌సెప్షన్స్, మన ఆలోచనలు, మన గ్రహణ సామర్థ్యాలు మారాలి. మారే పరిస్థితి లేదు. మార్చాలని కూడా కవి ఉద్దేశం కాదు. ఇప్పుడు చంద్రుడి కోసం మళ్లా కొత్త పదబంధాల్ని, కొత్త భాషని తయారుచేయాలని కవి అనుకోవటం లేదు. కవి చెప్పదల్చుకొన్నదల్లా మనకి తెలిసిన చంద్రుడు పురాణ చంద్రుడు; కావ్య చంద్రుడు మాత్రమేననీ; ఆ చంద్రుడికి ఈ ఆధునిక నగర జీవితంలో స్థానం లేదనీ. ఆధునిక నగర జీవితంలో పౌడరు పూసిన ముఖాల మీదనే మనం దృష్టి పెడుతున్నాం గాని చంద్రుడి మీద దృష్టి పెట్టం. చంద్రుడు ఉన్నప్పటికీ కూడా చంద్రుడక్కడ అనవసరమవుతున్నాడు. మనం దృష్టి పెట్టేది ఆ పౌడరు పూసిన ముఖాల మీదనే. చంద్రుడి మీద కాదు. తర్వాత రోజుల్లో ఇదేమాట బుచ్చిబాబు కూడా అన్నాడు: ‘నగర జీవులకు చంద్రుడు గుర్తొచ్చేదొక్క చంద్రగ్రహణం రోజు మాత్రమే! ఆ రోజు చంద్రుడెలాగూ కనబడడు’ అని.

అలాగే వర్షం అనే కవిత చూడండి: ఈ కవిత మొత్తం డిస్టార్షనే! ఎందుకు డిస్టార్షనంటే, ఇందులో ఏది చూడకూడదో, ఏది దృశ్యమానం కాదో, ఏది వర్ణనీయం కాదో, ఏది రమణీయం కాదో, ఏది రమణీయార్థ ప్రతిపాదకం కాదో, అదంతా కూడా రమణీయ సందర్భానికి అడ్డుపడుతున్నది.

భారతీయ కవిత్వానికి మేఘసందేశం ఒక నమూనా. ఒక మేఘాన్ని చూడగానే కవి ఎట్లా పులకించాడో, ఒక కవిపరంపర మేఘం చుట్టూ ఒక కావ్య సంప్రదాయాన్నెట్లో నిర్మించారో మనకి తెలుసు. కాని, ఈరోజు వర్షం అనగానే ఎన్ని రకాల సమస్యలు! వర్షం పడాలని కాలేజీ పిల్లలు కోరుకుంటున్నారు. టీచర్లు మాత్రం ఎందుకు కోరుకోవట్లేదు? హెూటళ్లలో తినడం, ఆ తింటున్న చప్పుడు, అక్కడ అమ్ముకుంటున్న యానాదిపిల్ల, ఆమెను చూస్తున్న దృశ్యం. అంటే జీవితం తాలూకు దుర్భరమైన డిస్టార్షన్ అంతటినీ గూడా కవి యథాతథంగా తీసుకొచ్చి, మనకు పరిచయం చేస్తూ చెప్తున్నదేమంటే, ఈ అబ్సర్డిటీని రిడిక్యులస్‌నెస్‌ని చూడండి. వీటిని మీరు పాత కవితా సంప్రదాయాలతో, గుర్తించగలిగే సందర్భం కాదు. అసలు సందర్భమే ఒక అసందర్భంగా మారిపోయింది అని.

ఫిడేలు రాగాల డజన్‌లో ఉన్న కవితలన్నీ కూడా జీవితంలోని సందర్భం, కావ్యసందర్భం కన్నా ఏ విధంగా భిన్నంగా ఉందో, మనకు అలవాటైన పూర్వ కవితా సంప్రదాయాలకీ, పూర్వ సౌందర్య సందర్భానికీ భిన్నంగా, ఈ కొత్త జీవితం మనకెలా సాక్షాత్కరిస్తూ ఉందో, దీన్ని మనం విస్మరించి, దీన్ని చూడకుండా, ఇంకా పాత కవితా సంప్రదాయాలు, పాత కవితా పద్ధతుల మీదనే జీవితాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తే, అది ఒక అలవాటుగా, రొటీన్‌గా మారిపోతుందని చెప్తున్నవే. అలాగని తను ప్రతిపాదిస్తున్నదే సౌందర్యమని కూడా కవి అనట్లేదు. మనం అలవాటు పడ్డది మటుకు సౌందర్యం కాదు అని మాత్రమే కవి గుర్తు చేస్తున్నాడు, ఇప్పటికే ఒక సౌందర్య విధ్వంసం జరిగింది. విధ్వంసమైన పౌందర్యాన్ని మీరింకా సౌందర్యమని పాకులాడకండి అని మటుకే మనకి సూచిస్తున్నాడు.

వసంతమనే కవిత చూడండి: అందులో కూడా ఇదే డిస్టార్షన్. వసంతమంటే? మనకు తెలిసిన రూపంలో ఆ వసంతం లేదు; ఆ సౌందర్యం లేదు; ఆ సందర్భం లేదు; వసంతమనేది పరిచిత రూపంలో ఎక్కడా కనపడలేదు. మరి ఎక్కడ కనబడింది? స్త్రీల చీరల మీద అలంకరించిన లతలు, చెట్లు, అద్దకం పూల, బొమ్మల రూపంలోనూ, వాళ్ళు తల్లో ధరించిన పూల రూపంలోనూ మటుకే వసంతం కనబడుతూ ఉంది. వసంతం ఒక ప్రాకృతిక వాస్తవం అన్నది పోయి, కనీసం కవి సమయంగా కూడా అదృశ్యమైపోయి, చివరకు ఒక అలంకరణగా, ఒక నమూనాగా మాత్రమే మనకు కనబడుతూ ఉంది. అటువంటి వసంతాన్ని నువ్వు స్వీకరించు. వసంతం వచ్చింది కాబట్టి స్త్రీల చిత్తం గూడా సరళంగా ఉంటుందనే ఒక్కమాట మాత్రం పూర్వకవి సంప్రదాయానికి అనుగుణంగా మాట్లాడిన మాట అనిపిస్తుంది. అది వ్యంగ్యంగా అన్నాడు అని తీసిపారేయడానికి లేదు. ఆ ఒక్కచోట మాత్రం కవి ఇంకా వసంతం గురించి ఆశపడుతున్నాడు. కాని తక్కినదంతా కూడా వసంతం ఒక సాహిత్య సందర్భంగా కాకుండా, ధ్వస్త సందర్భంగా ఉందనే ఆయన చెప్తున్నాడు.

ఫిడేలు రాగాల డజన్‌లో అన్నిటికన్నా ముఖ్యమైన కవిత ‘ఫిడేలు రాగం’లో ఆయన ఫిడేలునొక పాశ్చాత్య పరికరంగా భావిస్తూ, ఫిడేలుకి, రాగానికి మధ్య పెళ్ళి జరిగితే, వాటికి పుట్టే సంతతి మీద రాశాడు. అందులో ఒక సంగీత పరికరాన్ని కావ్య పరికరంగా మార్చడానికి ప్రయత్నం చేశాడు. మరోవిధంగా చెప్పాలంటే, వీణకు బదులు ఫిడేలని అన్నాడని అనుకోవాలి. అంతవరకు భావకవులు గాని, సంప్రదాయ కవులు గాని వీణ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఫిడేలు గురించి ఈయన మాట్లాడాడు. కాని ఫిడేలు కూడా ఏదో ఒక మేరకు కావ్య సౌకుమార్యం కలిగిన వస్తువే! దానికీ, రాగానికీ మధ్య ముడిపెడుతూ ఆయన వ్రాశాడు. ఈ కవిత నిర్మాణంలో మొత్తం పదాలు, పదబంధాలు, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు మొత్తం విడగొట్టేశాడాయన. నిర్దాక్షిణ్యంగా ఆద్యంతం విడగొట్టాడు. దానిలో ఉన్న భావాన్ని, సమస్తాన్ని విడగొట్టాడు. దాన్ని మొత్తం వదులు చేసేశాడు. అట్లా విడదీయడంలో, వదులు చేయడంలో అంతవరకు భాష మీద, భావ సంప్రదాయాల మీద, మన విశ్వాసాల మీద, మన సౌందర్య విశ్వాసాల మీద, మనకేవైతే పట్లున్నాయో, ఆ పట్టులన్నిటినీ గూడ ఆయన తునాతునకలు చేసేశాడు.

ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా ఉద్యమాలు తీసుకువస్తాడు. ఒక కవి సామాజిక రాజకీయ వ్యవస్థని బహిరంగంగా ప్రశ్నిస్తాడు. రాజ్య వ్యవస్థ తాలూకు హింసని ధిక్కరిస్తాడు. తుపాకులతో పోరాడతాడు. ఒక కవి గరిమెళ్ళ సత్యనారాయణ లాగా ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అని ప్రకటించగలుగుతాడు. కాని, నిజంగా కవి చేసే ప్రయోగం, కవి చేసే యుద్ధం భాషతో కాబట్టి, నిజంగా స్వతంత్రశీలుడైన కవి, ముందు భాషని విడిపించడానికి ప్రయత్నిస్తాడు.

అందుకనే పాల్‌గ్రేవ్ గోల్డెన్ ట్రెజరీ సంకలనంలో ఒక మాట రాసి వుంటుంది. ‘Poetry fettered, fetters the human world’ అని. సంకెళ్ళలో చిక్కుకొన్న కవిత్వం, ప్రపంచాన్నే సంకెళ్ళలో ఇరికిస్తుందని, అదే కవిత్వం సంకెళ్లు విదుల్చుకొంటే ప్రపంచాన్ని కూడా సంకెళ్ళనుంచి తప్పిస్తుంది.

పట్టాభి అట్లా కవిత్వాన్ని సంకెళ్ళనుండి తప్పించడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నించే క్రమం, ఆ గొలుసులు విడగొట్టే క్రమం, ఆ చప్పుడు, మనకు కొద్దిగా కర్ణకఠోరంగా ఉండవచ్చు కాని అది స్వాతంత్ర్య శంఖారావం తాలూకు తొలి విశృంఖల ధ్వనిగా ఈరోజు మనం దానిని గుర్తించవలసి ఉంటుంది.

ఫిడేలు రాగాల డజను తర్వాత పఠాభి కయిత నా దయిత అనే పేరుతో వివిధ గేయాలు, గీతాలు అన్నీ కూడా 1978లో ఒక పుస్తకరూపంలో తీసుకొచ్చాడు. దానికి ఆరుద్ర చక్కటి ముందుమాట రాశాడు.

ఫిడేలు రాగాల డజన్‌ రాకుండా కేవలం కయిత నా దయిత కవితలే తెలుగు పాఠక లోకానికి పరిచయమయ్యుంటే పఠాభిని కూడా మనం దువ్వూరు రామిరెడ్డి స్థాయి కవిగా భావిస్తూ, ఆయనను కూడా భావకవులలో ఒకరుగా లెక్కించి ఉండేవాళ్ళం. ఈ కవితలన్నీ కూడా మనకు బాగా పరిచితమైన పూర్వ కవితా సంప్రదాయాల పద్దతిలో, సంప్రదాయిక శయ్య మీద మాత్రమే ఏర్పరచిన కవితలన్నమాట! ఆ కవితలలో పఠాభి తక్కిన కవులందరిలాగా మనం ఏ అభిరుచితో, ఏ విశ్వాసాల్తో సాహిత్య సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నామో, అటువంటి సౌందర్యాన్నే ఆస్వాదించడానికి ప్రయత్నించాడు.

అయితే అందులో కూడా కొంత ప్రయోగపరత్వం లేకపోలేదు. ప్రయోగ పరత్వపు అత్యున్నతస్థాయి కవిత్వంగా దాన్ని ఆరుద్ర పేర్కొన్నాడు. ఆ ప్రయోగాల్లో ఒకటి అంత్యప్రాసకి సంబంధించింది. తెలుగులో అంత్యప్రాసకి పెద్ద ప్రాధాన్యత లేదు. తెలుగులో ఆదిప్రాసకు ప్రాధాన్యత. తెలుగు పద్యాలన్నిటిలో గూడా రెండవ అక్షరం ప్రాసస్థానంగా ఉంటుంది. ఆ ప్రాసస్థానాన్ని నిర్వహించడంలోనూ, దుష్కర ప్రాసల్ని నిభాయించడంలోనూ కవి ప్రతిభను మనవాళ్ళు అంచనా వేస్తుంటారు. తెలుగులో మాత్రమే ఈ లక్షణముంది. తక్కిన కావ్య భాషల్లో అంత్యప్రాసలుంటాయి. బెంగాలీ కవిత్వంలో టాగూర్ అంత్యప్రాసలు వాడటం చూసి, ‘కయిత నా దయిత’ లో కవితలన్నీ కూడా దాదాపుగా చాలావరకు అంత్యప్రాసల్తో రాయడానికి పఠాభి ప్రయత్నించాడు. ఆ ప్రయోగాలు ఎట్లా చేశాడు, ఎటువంటి నియమాలు పాటించాడు, ఎటువంటి నియమాలు ఉల్లంఘించాడు ఆరుద్ర చక్కగా వివరించడానికి ప్రయత్నం చేశాడు.

అత్యంత గంభీరమైన, తదేక దీక్ష కలిగిన కవిత్వమైనా కూడా ఫిడేలు రాగాల డజనును ఎందుకనో తెలుగు కవిత్వ ప్రపంచం సీరియస్ కవిత్వంగా తీసుకోలేదు. ఆ కవిత్వంలో ఆయన సాహిత్య శృంఖలాల్ని బద్దలుకొట్టే ప్రయత్నం చేశాడు. కాని, అతడు చాలా సీరియస్ పొయెట్, విదూషక కవి కాడు అనేదాన్ని కయిత నా దయిత పుస్తకం వచ్చేదాకా, తెలుగు సాహిత్య పాఠకులు నమ్మలేకపోయారు.

‘కయిత నా దయిత’ కవితని శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’ తో పోల్చి చూడాలి. ఆ పని ఆరుద్ర చేశాడు. శ్రీశ్రీ ‘కవితా ఓ కవిత’ని కుండలినీశక్తితో పోలుస్తూ, పఠాభి కవిత్వాన్ని ఒక దేవతగా ఆరాధించాడంటాడు. అంటే, కవిత్వాన్ని ఊరికే వినోద సాధనంగా భావించకుండా ఆరాధించాడని చెప్తాడు.

కవిత యగును దివ్యమోహిని
ఏనాటికి కాదు గేహిని

అంటే కవిత ఇంట్లో తెచ్చిపెట్టుకొని అర్ధాంగిగా చేసుకొనేది కాదు. ఆయన కవిత్వాన్ని ఒక దివ్య మోహినిగా, ఒక దేవతగా మాత్రమే భావించాడని చెప్పిన కవిత. చాల చక్కటి కవిత. ఆ కవితలో ఆయన వ్యక్తంచేసిన కొన్ని భావాలు ప్రాచీన భావాల కొనసాగింపు, కొన్ని భావాలు నవీన భావాలు, కాని ఆ భావాలన్నీ నిజాయితీతో కూడిన సాధకుడి నివేదన అని మనం గుర్తించాలి. కయిత నా దయిత లోని కవితలన్నీ కూడా దాదాపు, పూర్వ కవి సమయాల్లో, పూర్వ పద్ధతుల్లో, మనకలవాటైన సౌందర్య దృక్పథంలోనే, ప్రకృతిని ప్రకృతిగానే, చిర సహజంగా, మనం అలవాటుపడ్డ మార్గంలోనే నడుస్తాయి. ఒక్క ‘జాబిల్లి’ కవిత మాత్రం ఫిడేలు రాగాల డజనుకి దగ్గరగా వస్తుంది. కయిత నా దయిత లో చాలా కవితలు ఫిడేలు రాగాల డజనుకు ముందు వ్రాసినవి కూడా ఉన్నాయి. కాని వాటిని ఆ సంకలనంలో చేర్చకుండా ఇందులో చేర్చాడు. జాబిల్లి అనే కవితని ఫిడేలు రాగాల డజనుకు అనుబంధంగా పెట్టుండవచ్చు.

కయిత నా దయితలో పఠాభి కొన్ని అనువాదాలు, షేక్స్పియర్, షెల్లీ, ఇంకా చాలామంది కవుల అనువాదాలున్నాయి. ఉమర్ ఖయాం రుబాయత్‌లను కూడా అనువాదం చేశారాయన. రుబాయత్‌లను చాలా సరళసులభ భాషలో, చిన్నచిన్న పదాల్లో అనువాదం చేశాడాయన. షేక్స్పియర్, రవీంద్రుడు, షెల్లీ కవితల్ని, ప్రాచీన కవిసమయాలని గౌరవించే కవితల్ని, మనకలవాటైన పద్ధతుల్లో సౌందర్యాన్ని ప్రతిపాదించే కవిత్వాన్ని ఆయన కయిత నా దయితలో తీసుకొనివచ్చాడు. దీన్ని ఫిడేలు రాగాల డజనుకు సరిగ్గా 180 డిగ్రీలు వ్యత్యస్తంగా ఉన్న కవితాసంకలనం అనుకోవచ్చు.

ఆధునిక తెలుగు సాహిత్య విప్లవకారుడు పఠాభి ఫిడేలు రాగాల డజనుతో మొదలైన సాహిత్య ప్రస్థానం 1980లో వచ్చిన పఠాభి పన్ చాన్‌గమ్ అనే పన్‌ల సంకలనంతో ముగుస్తుందని చెప్పవచ్చు. పన్ అంటే శ్లేష, అంటే, ఒకే పదాన్ని విరిచే క్రమంలో, వాడే క్రమంలో రెండర్థాల్ని స్ఫురించేట్టు చూడటం. ఇది తెలుగు సాహిత్యంలో కొత్తగాదు, తెలుగులో మొదటినించీ కూడా శ్లేష కవిత్వాలు, రెండు మూడు అర్థాలు ఇచ్చే కవిత్వాలు వస్తూనే వున్నాయి.

ఐతే, పఠాభి వివిధ రకాల సందర్భాల్లో మాట్లాడిన మాటల్లోని ‘పన్’ లన్నింటినీ సేకరించి ఆయన మిత్రులు పుస్తకంగా తీసుకొచ్చారు. పఠాభి పన్‌లలో సంపన్నుడు అని ఆరుద్ర అన్నాడని శ్రీశ్రీ గుర్తుచేస్తాడు. వీటి ప్రయోజనమేమిటయ్యా అంటే, భాష గురించిన ఒక మెలకువను మనకు కలగచెయ్యడం, ఇందులో ఒక ఆహ్లాదం కూడా ఉంది. ఉదాహరణకు: ‘చైనాది ఆటం శక్తి – మాది రాటం శక్తి’ అంటాడు. ఈ మాటలు మామూలు మాటలు కావు. మనిషి తన లోపల చాలా బలంగా నమ్ముతూ ఉండే మాటలే పన్‌ల రూపంలో వస్తాయి. ఈ పన్‌లన్నిటి వెనుక పఠాభి జీవిత దృక్పథం ఎంత విశిష్టమైనదో మనకొక సూచన దొరుకుతూంటుంది.

పఠాభి ఫిడేలు రాగాల డజను వచ్చి దాదాపుగా 80 ఏళ్ళ పైగా కావస్తూ ఉంది. ఈ కాలమంతా కూడా ఆ కవిత్వాన్ని తెలుగు సాహిత్యం ఒక ప్రయోగవాదశీల కవిత్వంగా మాత్రమే భావించింది. ఎవరో ఆరుద్రలాంటి వాళ్లు ఒకరిద్దరు మాత్రమే ఆ ప్రయోగవాద ధోరణిని కొనసాగించారు అని సాహిత్య విమర్శకులనుకొంటూ వచ్చారు.


కానీ ఈనాడు, పోస్ట్ మాడర్న్ పద్ధతిలో కవితలు వ్రాస్తున్న కవులు, ఎమ్. ఎస్. నాయుడు లాంటి కవి ‘ఒక వెళ్ళిపోతాను’ లాంటి కవితలు రాసినప్పుడు, అతని వెనక స్పష్టంగా పఠాభి ప్రభావముందని మనం చెప్పవచ్చు. అట్లాగే వేగుంట మోహన్ ప్రసాద్ వంటి ఆధునిక కవులూ, అత్యాధునిక కవులూ తమను పట్టి ఉంచుతున్న కవి సమయాల సంకెళ్లను ఛేదించడానికీ, కవిసమయాల భారం నుంచి తమని, కవిత్వాన్ని గూడా రక్షించుకోవడానికీ, పఠాభి వేసిన దారి ఎంతో కొంత స్ఫూర్తినిచ్చిందని మనం గుర్తుపెట్టుకోక తప్పదు.

ఏ విధంగా చూసినా 20వ శతాబ్దపు తెలుగు కవిత్వ చరిత్ర నుంచి పఠాభిని విస్మరించలేం. ఆయన కవిత్వం రానున్న కాలంలో మరింత బలంగా, మరింత చారిత్రక ప్రాధాన్యం సంతరించుకొని మనముందు పునరావిష్కృతమౌతూ ఉంటుందనే అనిపిస్తున్నది. అతడికి మన నివాళి.

(2007లో వరల్డ్ స్పేస్ రేడియోలో మోహనరాగం ప్రసంగపరంపరలో వెలువరించిన ప్రసంగానికి కొన్ని మార్పులతో)

15-09-2018
హైదరాబాదు

[పఠాభి రాసిన ఫిడేలు రాగాల డజన్, కయిత నా దయిత, పఠాభి పన్‌చాన్‌గమ్ పుస్తకాలు మూడిటినీ కలిపి పఠాభి పేల్‌చిన ఫిరన్‌గులు అన్న పేర ఆర్ట్స్ & లెటర్స్ ప్రచురణ సంస్థ శివాజీ తల్లావఝ్ఝల బొమ్మలతో పఠాభి శతజయంతి ప్రచురణగా పునర్ముద్రించిన సందర్భంగా ఆ పుస్తకంలోని ముందుమాట.]
---------------------------------------------------------
రచన: వాడ్రేవు చినవీరభద్రుడు, 
ఈమాట సౌజన్యంతో

No comments: