తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – మొదటి భాగం
సాహితీమిత్రులారా!
[యుద్ధక్రమంలో అక్షౌహిణుల ప్రసక్తి పదేపదే వస్తుంది గనక ముందుగా అక్షౌహిణి అంటే ఎంతో చూద్దాం – ఒక రథం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, ఐదుగురు పదాతులు కలిస్తే ఒక పత్తి; మూడు పత్తులు ఒక సేనాముఖం; మూడు సేనాముఖాలు ఒక గుల్మం; మూడు గుల్మాలు ఒక గణం; మూడు గణాలు ఒక వాహిని; మూడు వాహినులు ఒక పృతన; మూడు పృతనలు ఒక చమువు; మూడు చమువులు ఒక కనీకిని; పది కనీకినులు ఒక అక్షౌహిణి.
అంటే ఒక అక్షౌహిణి సేనలో 21,870 రథాలు, అన్నే ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 పదాతులు ఉంటారన్నమాట.]
తిక్కన ఇలా చెప్తున్నారు:
ఓ హరిహరనాథా ! ఇక భారతయుద్ధ వృత్తాంతం విను.
జనమేజయుడికి వైశంపాయనుడు అతని ముత్తాతలు పాండవుల వృత్తాంతాల్ని విపులీకరిస్తూ వాళ్లకీ కౌరవులకీ జరిగిన మహాభారతసంగ్రామ క్రమాన్ని వినిపించటానికి పూనుకున్నాడు.
కృష్ణుడి సంధి ప్రయత్నాలు విఫలమైనయ్. దుర్యోధనుడు దుశ్శాసన, కర్ణ, శకునుల్తో సభ విడిచి వెళ్లిపోయాడు. వాళ్లంతా కలిసి కృష్ణుణ్ణి బంధించబోతున్నారని గ్రహించాడు సాత్యకి. యాదవసైన్యంతో కృతవర్మని సభాభవనం ముందుంచి తనొక్కడే లోపలికి వెళ్లి దుర్యోధనుడి పన్నాగం గురించి రహస్యంగా అన్న చెవిలో చెప్పాడు. తర్వాత అతని అనుమతితో సాత్యకి అక్కడున్న వాళ్లందరికీ దుర్యోధనుడి పథకం గురించి వివరించాడు. కృష్ణుడు తన సంగతి తను చూసుకోగలనని, ఇక బయల్దేరటానికి అనుమతి ఇవ్వమని ధృతరాష్ట్రుణ్ణడిగాడు. కంగారుపడి ధృతరాష్ట్రుడు దుర్యోధన దుశ్శాసనాదుల్ని వెంటనే తీసుకురమ్మని విదురుణ్ణి పంపాడు.
ధృతరాష్ట్రుడు కొడుకుని మందలించాడు. విదురుడు కూడ కృష్ణుణ్ణి తక్కువగా అంచనా వెయ్యొద్దని హెచ్చరించాడు. కృష్ణుడు “నేనొక్కణ్ణే వున్నాననుకుంటున్నావేమో, ఇలా చూడు” అంటూ తన విశ్వరూపం చూపించాడు. అతని శరీరాన్నుంచి బ్రహ్మాది దేవతలు, అష్టదిక్పాలకులు, బలరామార్జునులు, ఇతర పాండవులు, యాదవ వృష్ణి సైన్యాలు పుట్టుకొచ్చినయ్. అదిచూసి అంతా నిర్ఘాంతపోయారు. ధృతరాష్ట్రుడా రూపాన్ని చూడాలని కోరితే అతనికి తాత్కాలికంగా దివ్యదృష్టి ఇచ్చాడు కృష్ణుడు. తర్వాత ఆ రూపాన్ని ఉపసంహరించి సాత్యకి, కృతవర్మల్తో తిరుగు ప్రయాణం సాగించాడు. ధృతరాష్ట్రుడు, భీష్మ ద్రోణాది ఇతర పెద్దలు అతన్ని సాగనంపటానికి అతని వెనకే వచ్చారు.
ముందుగా కుంతి మందిరానికి వెళ్లి జరిగినదంతా ఆమెకి చెప్పి కొడుకులకి ఆమె ఏం చెప్పమంటుందో అడిగాడు కృష్ణుడు. “పరాక్రమంతో సంపాదించుకున్నదే రాజులకి భోజ్యం. సంధి ప్రయత్నాలు జరిగినయ్, వాళ్లతో కలిసుండటం సాధ్యం కాదని తేలిపోయింది. ఇంక అనుమానాలు వద్దు, యుద్ధమే మార్గమని చెప్పు” అన్నదామె.
కృష్ణుడక్కణ్ణుంచి బయల్దేరి అందర్నీ వీడ్కొలిపి, ఒక్క కర్ణుణ్ణి మాత్రం తనతో రమ్మని తీసుకెళ్లాడు.
మరోవంక ధృతరాష్ట్రుడి కొలువులో అంతా కృష్ణుడి రాయబార విశేషాల గురించి మాట్లాడుతుంటే భీష్మద్రోణులు దుర్యోధనుడితో “కనీసం కుంతి ఐనా యుద్ధం వద్దని చెప్తుందనుకున్నాం, అదీ జరగలేదు. పాండవులకి దిశాదిర్దేశం చెయ్యగలిగిన వాళ్లు ఇద్దరే – కృష్ణుడు, కుంతి. వాళ్లిద్దరూ యుద్ధం వైపే మొగ్గు చూపుతున్నారు. అడ్డుపడకపోతే యుద్ధం తప్పదు. నువ్వు వెంటనే బయల్దేరివెళ్లి దార్లోనే కృష్ణుణ్ణి ఆపి అతనితో కలిసి వెళ్లి ధర్మరాజుతో సంధి మార్గం ఆలోచించు” అని ఉపదేశించారు. మొహాన గంటు పెట్టుకుని మౌనంగా ఉండిపోయాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు కూడ ఏమీ మాట్టాడలేదు.
విషయం అర్థమై “జీవితంలో అన్నీ చూసిన వాళ్లం మేము, మాకింకా మిగిలున్న ఆశలేం లేవు. ఒళ్లు దాచుకోవటానికి ఈ మాటలనటం లేదు, వెళ్లొస్తాం” అని అక్కణ్ణుంచి వెళ్లిపోయారు వాళ్లిద్దరు. దుర్యోధనుడు తన మందిరానికి వెళ్లాడు.
కృష్ణుడు కర్ణుడితో రహస్యంగా అతని జన్మవృత్తాంతం చెప్పి అతను నిజానికి కుంతికొడుకని, పాండవపక్షానికి వస్తే అతన్ని రాజుని చేస్తానని, ద్రౌపది కూడ అతన్ని ఆరోభర్తగా తీసుకుంటుందని చెప్పాడు. కర్ణుడతన్ని సున్నితంగా తిరస్కరించి తన జన్మరహస్యం గురించి తను ముందే విన్నానని, ఐతే దుర్యోధనుణ్ణి వదిలి వచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసి, ఈ విషయాన్ని రహస్యంగానే వుంచమని కోరాడు. కృష్ణుడు ఒప్పుకుని ఇంక ఏడెనిమిది రోజుల్లో అమావాస్య అని, అదే యుద్ధానికి సరైన ముహూర్తమని దుర్యోధనాదుల్తో చెప్పమని చెప్పి పాండవుల దగ్గరికి బయల్దేరాడు.
ఇంకోవంక కుంతి కర్ణుణ్ణి కలవాలని నిశ్చయించుకుంది. ఉదయాన్నే అతన్ని చూడాలని వెళ్తే అతను గంగాస్నానానికి వెళ్లాడని విని అక్కడికి వెళ్లి అతని జపం అయేవరకు అక్కడే కూర్చుంది. అతనామెని చూసి నమస్కరించి వచ్చిన పని అడిగాడు. రహస్యంగా ఆమె తనే అతని తల్లని, పాండవులతో కలవమని చెప్పింది. అతనా విషయం ముందే తెలుసని, ఐతే తను దుర్యోధనుడి ఋణం తీర్చుకుంటానని బదులిచ్చాడు. ఆమె అంత దూరం వెదుక్కుంటూ వచ్చింది గనక యుద్ధంలో అర్జునుడు తప్ప పాండవుల్లో మరెవరినీ చంపనని మాటిచ్చాడు కర్ణుడు. అదీ బాగానే వుందని కుంతి వెళ్లిపోయింది.
కృష్ణుడు ఉపప్లావ్యం చేరుకుని జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి ధర్మరాజు తమ్ముల్తో కలిసి వుండి కృష్ణుణ్ణి రప్పించి హస్తినలో జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పమన్నాడు. కృష్ణుడు ఎవరెవరు ఏమేం మాట్టాడింది, ఏం చేసింది చెప్పాడు. చివరికి దుర్యోధనుడు తనని బంధించటానికి ప్రయత్నిస్తే తను ఆ సమయానికి తగ్గట్టు హంగులు, మాయలు చేసి బయటపడ్డానని వివరించాడు. కుంతి చెప్పిన మాటలు వినిపించి యుద్ధమే కర్తవ్యమని తన అభిప్రాయమని కూడ చెప్పాడు. ఇంకా సంధి ప్రయత్నాలకి ఏమైనా అవకాశముందా అనడిగాడు ధర్మరాజు. లేదన్నాడు కృష్ణుడు. తమ్ముళ్ల అభిప్రాయం అడిగితే అర్జునుడు కృష్ణుడు యుద్ధమే మార్గమంటే అదే తమ అభిప్రాయమని అన్నాడు. యుద్ధమే కర్తవ్యమని నిర్ణయించాడు ధర్మరాజు.
కౌరవులకి భీష్ముడు సర్వసేనాధ్యక్షుడుగా వుండబోతున్నాడు గనక తమ వైపు నుంచి మంచి సమర్థుడైన వాణ్ణి సర్వసేనాపతిని చెయ్యాలన్నాడు ధర్మరాజు. సహదేవుడు విరాటుడి పేరు సూచించాడు. నకులుడు ద్రుపదుణ్ణి పెడదా మన్నాడు. అర్జునుడు ధృష్టద్యుమ్నుడు గాని, శిఖండి గాని ఐతే బాగుంటుందన్నాడు. ధర్మరాజు కృష్ణుడి ఉద్దేశం అడిగాడు. అతను ధృష్టద్యుమ్నుణ్ణి సేనాపతిగా అభిషేకించమన్నాడు. అలాగే అక్షౌహిణులకి ప్రత్యేకనాయకుల్ని కూడ చెప్పమన్నాడు ధర్మరాజు. “వాళ్లకి సొంతసైన్యాలున్నాయా లేవా అని కాకుండా మహాయోధులైన వాళ్లని అక్షౌహిణీనాయకులుగా ఉంచుదాం. ద్రుపదుడు, సాత్యకి, జరాసంధుడి పెద్దకొడుకు సహదేవుడు, యాదవవీరుడు చేకితానుడు, శిశుపాలుడి కొడుకు ధృష్టకేతుడు, శిఖండి – ఈ ఏడుగురు మన ఏడక్షౌహిణులకి నాయకులు” అని నిర్ణయించాడు కృష్ణుడు.
మర్నాడు ఉదయం కొలువు చేశాడు ధర్మరాజు. యుద్ధం తన నిర్ణయంగా ప్రకటించి, ఏడుగురు అక్షౌహిణీనాయకుల్ని అభిషేకించాడు. శ్వేతజాతుడైన ధృష్టద్యుమ్నుణ్ణి సకలచమూపతిగా ఉత్కృష్టంగా అభిషేకం చేసి పట్టం కట్టాడు. అర్జునుణ్ణి పిలిచి వాళ్లందర్నీ చూపించి “వీళ్లందర్నీ కంటికి రెప్పలా కాపాడాలి నువ్వు. అవసరాన్ని బట్టి గురువులా వీళ్లకి ఎప్పుడెప్పుడు ఏం చెయ్యాలో చెప్తూ వాళ్ల ఆలోచనల్ని కూడ తీసుకుని పనులు చక్కబెట్టు. ఇక నీకు రక్షగా కృష్ణుడుంటాడు” అని చెప్పాడు. తమ సేనలో వున్న పెద్దలందర్నీ మంచిమాటల్తో సంతోషపరిచి ప్రస్థానభేరి వేయించాడు ధర్మరాజు.
మర్నాడు పెళ్లికి వెళ్తున్నట్టు బయల్దేరారందరూ. ముందుగా ద్రౌపది దగ్గరికి వెళ్లి ఆమె, ఇతర పుణ్యస్త్రీలు చల్లిన అక్షతల్ని స్వీకరించి శుభశకునాల్తో కదిలారు. ధృష్టద్యుమ్నుడు ధర్మరాజుకి ఎదురుగా వచ్చి సాష్టాంగప్రణామం చేసి అతని అనుమతితో సైన్యాన్ని ముందుండి నడిపించాడు. వెనగ్గా పరిచారకులు కావలసిన సామాగ్రిని, డేరాల్ని బళ్లమీద వేసుకుని వచ్చారు. మున్యాశ్రమాలకి ఇబ్బందులు కలిగించకుండా జాగ్రత్తగా సాగుతూ కురుక్షేత్రం చేరిందా సైన్యసముద్రం. హిరణ్వతి అనే పుణ్యనది పక్కన నీరు, గడ్డి, కట్టెలు సమృద్ధిగా వుండి సమతలంగా వున్న చోట విడిది చేసింది. వెంటనే అక్కడ రాజమందిరాలు, తదితర శిబిరాలు వెలిసినయ్. ధృష్టద్యుమ్నుడు చుట్టూ కట్టుదిట్టాలు చేశాడు.
అక్కడ దుర్యోధనుడు ప్రయాణానికి అంతా సిద్ధం చేసేపని కర్ణ, దుశ్శాసన, శకునులకి అప్పగించాడు.
మర్నాడు దుర్యోధనుడు కొలువుదీరి తన అక్షౌహిణీనాయకులుగా ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, బాహ్లికుడు, శల్యుడు, కృపుడు, భూరిశ్రవుడు, శకుని, కృతవర్మ, కాంభోజరాజు సుదక్షిణుడు, సైంధవులని నిశ్చయించి వాళ్లని అభిషేకించాడు.
ఆ తర్వాత వాళ్లని తీసుకుని భీష్ముడి దగ్గరికి వెళ్లి నమస్కరించి వినయంగా సర్వసేనానాయకత్వం వహించమని ప్రార్థించాడు. అందుకు భీష్ముడు “నాకు మీరూ పాండవులు ఒకటే. ఐతే ఇంతకాలం మీతో వున్నా గనక మీపక్షాన యుద్ధం చెయ్యటం నా ధర్మం. సర్వసైన్యాధిపత్యం తీసుకుంటా. ఒక్క అర్జునుడు తప్ప అక్కడ నన్నెదిరించగలిగే వాళ్లు లేరు. అర్జునుడికున్న అస్త్రసంపద నాకు లేదు. ఇకపోతే, పాండవుల్ని చంపటానికి నాకు చేతులు రావు, వాళ్లూ నామీద విరుచుకుపడరు. మిగిలిన వాళ్లందర్నీ నేను చంపుతా. కాకుంటే ముందుగా యుద్ధానికి కర్ణుణ్ణన్నా పంపు, నన్నన్నా పంపు, మేం ఇద్దరం మాత్రం ఒకసారి యుద్ధం చెయ్యం. అలా ఒప్పుకుంటేనే నేనీ బాధ్యత తీసుకుంటా” అని ఖచ్చితంగా చెప్పాడు. దానికి కర్ణుడు “ఇందులో కొత్తగా చెప్పేదేముంది, భీష్ముడు పడ్డాకే నేను యుద్ధం లోకి వస్తానని సభలోనే చెప్పా” అని గుర్తుచేశాడు.
సకల చమూపతుల సమక్షంలో భీష్ముడికి సర్వసేనాపతిగా అభిషేకం చేసి పట్టంగట్టాడు దుర్యోధనుడు.
కౌరవసేనానీకం కూడ కురుక్షేత్రానికి కదిలింది. ఆ దగ్గర్లో ఒక చక్కటి ప్రదేశం చూసుకుని అక్కడ విడిదులేర్పాటు చేశారు. హస్తినలో ఎలా వున్నాయో అలాగే ఎవరెవరికి ఎలాటి మందిరం అవసరమో అలాటి మందిరాలు తయారైనయ్.
ఇదంతా విని హడావుడిగా కదిలొచ్చాడు బలరాముడు. ధర్మరాజుని కౌగిలించుకుని అందర్నీ కొలువు దీర్చి “ఎలాగైనా సంధి చెయ్యమని కృష్ణుడికి ఎన్నో విధాలుగా చెప్పా, ఐనా ఏదో కోపం తెచ్చుకుని సంధి కాకుండా చేశాడు కృష్ణుడు. అర్జునుడి మీద తనకున్న పక్షపాతంతో దాయాదులకి యుద్ధం తెచ్చిపెట్టాడు. ఇక పాండవులకి జయం, కౌరవులకి చావు నిశ్చయం. నేనీ ఘోరాన్ని చూడలేను, వినలేను. నేను తీర్చిదిద్దిన శిష్యులు భీమ దుర్యోధనులు ఒకర్నొకరు చంపుకోబోవటం నేను భరించలేను. సరస్వతీ తీర్థానికి వెళ్తూ ఆ విషయం మీకు చెబ్దామని ఇలా వచ్చా” అని అందరికీ చెప్పి తీర్థయాత్రలకి వెళ్లాడతను.
దుర్యోధనుడు శకుని కొడుకు ఉలూకుణ్ణి పిలిచి పాండవుల దగ్గరికి వెళ్లి కొన్ని మాటలు చెప్పిరమ్మని పంపాడు. అతను వెళ్లి ధర్మరాజుకా విషయం చెప్తే, అతను “అలాగే, ఆ బుద్ధిమంతుడు చెప్పిపంపిన తులువ మాటలేమిటో బయటపెట్టు, అందరం వింటాం” అన్నాడు. ఉలూకుడిలా అన్నాడు ధర్మరాజుతో – “పెద్ద పోటుగాడిలాగా యుద్ధానికి బయల్దేరొచ్చావ్, మీదగ్గరేవో అస్త్రశస్త్రాలున్నయ్యని మిడిసిపడుతున్నావ్. భీష్మ ద్రోణుల ముందు అవన్నీ ఎందుకు పనికిరావని చూడబోతున్నావ్. వాళ్లచేతిలో అర్జునుడి చావు తప్పదు”. ఆ తర్వాత భీముడివైపు తిరిగి “దుశ్శాసనుడి రొమ్ము చీలుస్తా, రక్తం తాగుతా అని బీరాలు పలికావుగా, వచ్చి అదేదో చేసి చూపించు. నూతిలో కప్పలా నీ బలం తల్చుకుని నువ్వే పొంగిపోవటం కాదు, అవతల వాళ్ల బలం గురించి తెలుసుకో” అని ఎత్తిపొడిచాడు. అర్జునుణ్ణి చూసి “తాటిచెట్టంత విల్లు గాండీవం వుందని మిడిసిపడకు. అంత పోటుగాడివైతే అదేదో సభలో పాంచాలిని పరాభవించినప్పుడే చూపించాల్సింది” అని చివరగా “ఏదో కృష్ణుడు కొన్ని మాయలు, ఇంద్రజాలాలు చేస్తేనో, లేకపోతే అర్జునుడి పరాక్రమానికో రాజ్యం వస్తుందనుకోకండి. వెయ్యిమంది కృష్ణులు, వెయ్యిమంది అర్జునులు వచ్చినా యుద్ధం చేస్తాం, రాజ్యంలో ఒక్క అంగుళం ఇవ్వం” అని దుర్యోధనుడి సందేశాన్ని వినిపించాడు ఉలూకుడు.
అదంతా విని పాండవులు కోపంతో ఊగిపోతుంటే కృష్ణుడు నవ్వుతూ ఉలూకుడితో “అందరూ వినేట్టుగా దుర్యోధనుడితో నువ్వూ ఇలా చెప్పు. యుద్ధంలో నువ్వెక్కడున్నా చావు తప్పించుకోలేవ్, భీముడు నువ్వు చూస్తుండగనే దుశ్శాసనుడి రక్తం తాగుతాడు” అంటుండగా అందుకుని అర్జునుడు ” సొంతంగా గెలిచే చేవలేక కాటికి కాళ్లు చాచిన భీష్ముణ్ణడ్డంపెట్టుకుని యుద్ధంలో గెలుద్దామనుకుంటున్నాడు దుర్యోధనుడు. పాపం ఆ ముసలాయన మాకు తొలికబళమై కాటికి పోవటం ఖాయం. ఆ తర్వాత ద్రోణుడు, కర్ణుడు చస్తారు. భీముడి గద దెబ్బలకి తన తొడలు విరుగుతుంటే అప్పుడు దుర్యోధనుడికి తన దుర్మార్గప్పనులు తెలిసొస్తయ్ లే. రేపే యుద్ధం మొదలు. వచ్చి తలపడమను” అని చెప్పాడు.
తాంబూలం, ఆభరణాలు ఇచ్చి ఉలూకుణ్ణి సాగనంపాడు ధర్మరాజు.
ఉలూకుడు తిరిగెళ్లి వాళ్లకి జరిగింది చెప్తే భీష్ముడు “నేనుండగా నీకు భయం అక్కర్లేదు. శత్రువుల సంగతి నేను చూస్తాగా” అని ధైర్యం చెప్పాడు దుర్యోధనుడికి.
“ఐతే మనలో, వాళ్లలో వున్న యోధముఖ్యుల తారతమ్యాలు నాకు వివరించి చెప్పు” అనడిగాడు దుర్యోధనుడు. భీష్ముడిలా వివరించాడు – “నువ్వు అతిరథుడివి, నీ తమ్ముళ్లంతా సమరథశ్రేష్టులు, నా గురించి నేనే చెప్పుకోవటం ఎందుకు, నా సంగతి అందరికీ తెలుసు. ఇక యాదవవీరుడు కృతవర్మ అతిరథుడు, శల్యుడూ అతిరథుడే. కృష్ణుడి మీద అసూయతో అల్లుళ్లని కాదని నీవైపుకి వచ్చాడు. భూరిశ్రవుడు అతిరథశ్రేష్టుడు. సైంథవుడు మహారథుడు. ద్రౌపది విషయంలో జరిగిన అవమానంతో తపస్సు చేసి వరాలు కూడ పొందాడు. కాంభోజరాజు సుదక్షిణుడు సమరథుడు. మేలైన రథసైన్యం వుందతనికి. మాహిష్మతీపతి నీలుడు అతిరథుడు. అతనికీ సహదేవుడికీ పడదు. అవంతిదేశాధీశులు విందానువిందులు అర్థరథులు. మంచిస్నేహితులు, ఒకరికోసం ఒకరు ప్రాణాలిస్తారు. త్రిగర్తపతులు ఐదుగురు సోదరులు, అందరూ మహారథులే. గోగ్రహణసమయాన జరిగిన అవమానానికి కుతకుతలాడుతున్నారు.
ఇక లక్ష్మణకుమారుడు సమరథుడు. కోసలరాజు బృహద్బలుడు సమరథుడు. దండధారుడు కూడ సమరథుడే. కృపాచార్యుడు అతిరథోత్తముడు. సమరథుడు శకుని. అశ్వత్థామ దివ్యాస్త్రసంపన్నుడు, అర్జునుడికి దీటైనవాడు. అతను బ్రాహ్మణుణ్ణని కాస్త వెనకముందాడతాడు గాని పూనుకుంటే యముడే. ఇక ద్రోణాచార్యుడు అతిరథోత్తముడు. అటూ ఇటూ అందరికీ విలువిద్యలో గురువు. వ్యూహరచనలో దిట్ట. వృద్ధుడని తగ్గించకూడదు. ప్రాణాలకి లెక్కచెయ్యడు, ప్రపంచం అంతా కలిసి వచ్చినా తన బాణాల్తో చిక్కు పరుస్తాడు. ఐతే అతనికి అర్జునుడంటే మహాప్రీతి, అతన్ని మాత్రం గట్టిగా కొట్టలేడు.
బాహ్లికుడు అతిరథుడు, మహాబలవంతుడు. ఇతని కొడుకు సోమదత్తుడు కూడ అంతే. వీళ్లకి యుద్ధం అంటే పెళ్లి లాటిది. రాక్షసరాజు హలాయుధుడు సమరథుడు, పాండవుల మీద అతనికి కోపం. పెద్ద రాక్షససేన వుందతనికి.
ప్రాగ్జ్యోతిషపతి భగదత్తుడు సమరథుడు. ఏనుగుయుద్ధంలో అతన్నెవరూ అడ్డుకోలేరు. గాంధారరాజులు వృషకుడు, అచలుడు సమరథులు. పెద్ద బలగం వున్నవాళ్లు, మంచి యుద్ధకౌశలం వుంది వాళ్లకి. ఇక నీ మిత్రుడు కర్ణుడు అర్థరథుడే. ఎందుకంటే అతని కవచకుండలాలు పోయినయ్, పరశురాముడి శాపాన అస్త్రబలం తగ్గింది.”
ద్రోణుడు కూడ అందుకంగీకరిస్తూ “ఔను, అతని సంగతి ఇంతకుముందూ చూశాం. పారిపోవటానికి వెనకాడడు కనక అర్థరథుడే” అని వరస కలిపాడు.
కర్ణుడు కళ్లనుంచి నిప్పులు రాలుస్తూ భీష్ముడితో “దుర్యోధనుడి మంచి గురించి ఆలోచించవు, నిజంగా అర్థరథుడివి నువ్వే” అని దుర్యోధనుడితో “ఇతను అర్జున పక్షపాతి, పట్టుబట్టి యుద్ధం చెయ్యడు. ఇలాటివాడొక్కడు తక్కువైతే మనకి పోయేదేమీ లేదు. ముసలితనంతో బుద్ధి వశంలో లేక ఇలా మాట్టాడుతున్నాడు” అని విరుచుకుపడ్డాడు.
“ముసలివాణ్ణైన నా బలం ఏమిటో, ధైర్యం ఏమిటో, అస్త్రశస్త్రసంపద ఎలాటిదో నీ గురువు పరశురాముణ్ణడుగు, చెప్తాడు. నాతో యుద్ధం చేసిన వాళ్లేమయ్యారో లోకానికి తెలుసు, వృద్ధుణ్ణి నా పరాక్రమం ఎలాటిదో, యువకుడివి నీ పరాక్రమం ఎలాటిదో అర్జునుడికి బాగా తెలుసు” అని బదుచిచ్చాడు భీష్ముడు.
దుర్యోధనుడిద్దర్నీ సర్దిచెప్పి శత్రుసైన్యంలో ముఖ్యుల గురించి చెప్పమని అడిగాడు భీష్ముణ్ణి. అందుకతను, “నిజమాడితే నిష్టూరం, కర్ణుడికి నచ్చదు. నీకూ నచ్చకపోవచ్చు, మధ్య నాకెందుకు?” అని తప్పించుకోబోతే వదల్లేదు. చివరికి భీష్ముడిలా చెప్పుకొచ్చాడు – “ధర్మరాజు అతిరథుడు. భీముణ్ణి యుద్ధంలో పట్టలేం, అతను అతిరథశ్రేష్టుడు. అతనిది అమానుషమైన బాహుబలం, అసమాన విక్రమం. నకులసహదేవులు సమరథులు. ఐతే వాళ్లంతా ధర్మపరులు, ఆరంగాల విలువిద్య ఆసాంతం నేర్చుకున్నారు. ఒక్కొక్కరు విడివిడిగా యుద్ధాలు చేసి అనుభవం సంపాయించారు, అంతా కలిసి ఒక్కటిగా వస్తే మన సేనలు గగ్గోలు పడటం ఖాయం. ఇక అర్జునుడి విషయానికి వచ్చామంటే అతని శక్తిని కొలవటానికి మానాలే లేవు, అంతవాళ్లు న భూతో న భవిష్యతి. ఇక అతనికి తోడు కృష్ణుడు కలిస్తే చెప్పేదేముంది – వాళ్లు పాండవసేనల్ని రక్షించటం, మనబలాల్ని నిర్జించటం నిశ్చయం.
ద్రౌపదేయులు ఐదుగురూ మహారథులు. ఉత్తరుడు కూడ అలాటివాడే. అభిమన్యుడు అతిరథశ్రేష్టుడు, కృష్ణార్జునుల్తో సమానుడు. సాత్యకి అతిరథోత్తముడు, పాండవుల పట్ల స్నేహం వల్ల మనమీద అతనికి చాలా కోపం. వాళ్లిద్దరు చాలు మనవాళ్లందరి అంతు చూడటానికి.
ద్రుపదుడు, విరాటుడు పాండవులకి దగ్గరి బంధువులు, స్నేహితులు. ఇద్దరూ మహారథులు. శిఖండి మహారథుడు. అతని తమ్ముడు ధృష్టద్యుమ్నుడు అతిరథుడు. అతని కొడుకు ధృతవర్ముడు అర్థరథుడు, చిన్నప్పుడు చెడుతిరుగులు తిరిగి శస్త్రాస్త్రాల్లో పరిశ్రమ చెయ్యలేదు. చేదిరాజు, శిశుపాలుడి కొడుకు ధృష్టకేతుడు మహారథుడు. భోజుడు, అజుడనే రాజులు కూడ అలాటివాళ్లే.
ఇక పాంచాలవర్గంలో ఉత్తమౌజుడు, యుధామన్యుడు, క్షత్రదేవుడు, జయంతుడు, అమితౌజుడు, విరాటుడు, సత్యజితుడు మహారథులు. కేకయపతులు ఐదుగురు సోదరులు, అంతా మహారథులే. కాశీపతి నీలుడు, విరాటుడి దాయాదులు సూర్యదత్తుడు, మదిరాక్షుడు, శంఖుడు మహారథులు. చిత్రాయుధుడు, చేకితానుడు మహారథులు. అర్జునుడి స్నేహితులు. చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు కూడ అలాటి వాళ్లే. సేనాబిందుడనే రాజు అతిరథోత్తముడు, భీముడితో సమానమైనవాడు. పాండ్యుడు అతిరథుడు, పెద్దబలగం వున్నవాడు. కాశ్యుడు సమరథుడు. కుంతిభోజుడు అతిరథుడు., అతని దగ్గర అమితబలులైన యోధులున్నారు. రోచమానుడు మహారథుడు. అతిరథశ్రేష్టుడు, తండ్రంత వాడు ఘటోత్కచుడు, మాయాబలసంపన్నుడు.
మొత్తం మీద అటు ఇటూ గొప్పగొప్ప వాళ్లున్నారు. ఐతే వాళ్లలో నాముందు నిలబడగలిగే వాళ్లు చాలాకొద్దిమంది. ఒక్క శిఖండిని మాత్రం నేను చంపలేను” అని రెండు బలాల్లోని ప్రధానయోధుల గురించి సమగ్రంగా విశ్లేషించాడు భీష్ముడు.
దుర్యోధనుడు తాతతో “ఈ యుద్ధం ముగించటానికి నీకెంత కాలం పడుతుంది?” అనడిగాడు. భీష్ముడు “నా సంగతి నేను చెప్తా, మిగిలిన వాళ్లు వాళ్ల లెక్కలు వాళ్లు చెప్తారు. ఐతే నేను నీకో మాటిస్తా – వెయ్యిమంది పెద్ద రథికుల్ని చంపేవరకు రణం సాగిస్తా. ఆ తర్వాత ఎన్నాళ్లుంటాననేది అర్జునుడి చేతిలో వుంది. మొత్తం మీద పదివేలమందిని స్వయంగా చంపుతానని నాకు తోస్తున్నది. ఒక నెల సమయం వుంటే పాండవసైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేస్తా” అని తన లెక్క చెప్పాడు. ద్రోణుణ్ణి అదే మాట అడిగితే అతను “నేనా వృద్ధుణ్ణి, ఏదో ఓపిక్కొద్ది యుద్ధం చేస్తా. మీ తాతకి లాగే నాకూ ఒక నెల పడుతుంది పాండవబలాలన్నిట్నీ చంపటానికి” అన్నాడు. కృపాచార్యుడు ఆ పని రెండునెలల్లో చెయ్యగలనంటే అశ్వత్థామ పదిరోజులు చాలన్నాడు. అంతా విని కర్ణుడు, “నా దివ్యాస్త్రాల్తో వాళ్లని పొడిచెయ్యటానికి ఒక్క వారం చాలు” అన్నాడు.
ఆ మాటకి కలకలమని నవ్వాడు భీష్ముడు. “ఇక్కడ కూర్చుని చెప్పే మాటలకేం, ఎన్నైనా చెప్పొచ్చు. అక్కడ అర్జునుడి గాండివదీప్తులకి కళ్లు తిరుగుతుంటే, అతని గుణధ్వనికి చెవులు బద్దలౌతుంటే అప్పుడు చెప్పు, వింటా” అని ఎత్తిపొడిచాడు కర్ణుణ్ణి.
ఈ విషయాలన్నీ తీసుకెళ్లి చారులు ధర్మరాజుకి వినిపించారు. అతను తమ్ముళ్లని పిలిపించి తను విన్న విషయాలు వాళ్లకి చెప్పి “కౌరవసైన్యాన్ని చంపటానికి నీకెంతకాలం పడ్తుంది, చెప్పు” అని అర్జునుణ్ణడిగాడు.
దానికతను నవ్వుతూ “నా దగ్గరున్న పాశుపతాస్త్ర ప్రభావం వాళ్లెవరికీ తెలీదు గనక అలా మాట్టాడుతున్నారు. దాంతో ఒక్క నిమిషంలో ముల్లోకాల్నీ నాశనం చెయ్యగలను. ఐతే అలాటి ఘోరాయుధంతో అందర్నీ చంపటం తప్పు. మామూలు శస్త్రాస్త్రాల్తో యుద్ధం చేస్తేనే పౌరుషం. అప్పటికి అవసరాన్ని బట్టి చూద్దాంలే. ఐనా మనలో ఎవరు తక్కువ, భీముడా, కవలా, అభిమన్యుడా, ద్రౌపదేయులా? సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ఘటోత్కచుడు – ఇలా జమాజెట్టీలున్నారు. ఎక్కడిదాకానో ఎందుకు ఏనుక్కిలాగా నీబలం నీకు తెలీదు. నీకెలాటి సందేహమూ అక్కర్లేదు, మనకి విజయం సులభంగానే దొరుకుతుంది” అని ధైర్యం చెప్పాడు.
అవతల హస్తినలో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పక్కన పెట్టుకుని యుద్ధం గురించి బాధ పడుతూ ఉన్నాడు. అప్పుడక్కడికి త్రికాలవేది ఐన వేదవ్యాసుడు వచ్చాడు. “కాలానుగుణంగా రాజుల మధ్య యుద్ధం వచ్చింది, ఇదేమీ చింతించవలసిన విషయం కాదు. నీకీ యుద్ధం చూడాలనే కోరికుంటే చెప్పు, దివ్యదృష్టినిస్తాను, చూద్దువు గాని” అన్నాడతనితో. ధృతరాష్ట్రుడు “అన్నదమ్ముల మధ్య ఘోరయుద్ధం నేను చూడలేను. ఐతే మరెవరన్నా చూసి వివరంగా వినిపిస్తే వినాలని వుంది” అన్నాడు. సంజయుడికి యుద్ధంలో అందరి ప్రవర్తనలు, మనోభావాలు, రహస్యసంభాషణలు తెలిసేటట్టు, ఎలాటి ఆయుధాలూ అతన్నేమీ చెయ్యకుండా వుండేట్టు వరాలిచ్చి, శీఘ్రగమనాన్ని కూడ అనుగ్రహించి యుద్ధభూమికి వెళ్లి అక్కడ జరిగే అన్ని విషయాలు గమనించి వచ్చి ధృతరాష్ట్రుడికి వినిపించే పని అప్పగించి అంతర్ధానమయ్యాడు వ్యాసుడు.
“ఎంతో విస్తారమైన భూమిలో ఒక చిన్న భాగమైన భారతవర్షం కోసం ఇదివరకు ఎందరో రాజులు యుద్ధాలు చేశారు, ఇప్పుడు వీళ్లూ చెయ్యబోతున్నారు. ఏమిటో ఈ మాయ!” అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడన్నాడూ, “భారతవర్షం ఎంతో భాగ్యవంతమైన ప్రదేశం, గొప్ప పర్వతాలు మణిమాణిక్యాలకూ ఖనివిశేషాలకూ నెలవులు; నదులు ధనధాన్య సమృద్ధి కలిగించేవి; జనపదాలు సంపదలకి ఆలవాలాలు. సరిగా పాలించే రాజుకి భూమి నిజంగా కామధేనువు లాటిది. అందుకే ఈ యుద్ధం. విచారించే సమయం మించిపోయింది. నేను యుద్ధభూమికి వెళ్లి అక్కడి విశేషాలు గమనించి వచ్చినీకు వివరంగా చెప్తా.”
అలా చెప్పి, వ్యాసవరంతో యుద్ధవిశేషాలన్నీ చూసివచ్చి ధృతరాష్ట్రుడికి ఆ వివరాలన్నీ వినిపించటానికి సంజయుడు యుద్ధభూమికి వెళ్ళాడు. కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు రాత్రి సంజయుడు తిరిగివచ్చాడు – గోడుగోడున ఏడుస్తూ.
“అందరికీ ఆధారమైన ఆ మహావీరుడికి అస్త్రాలు ఆధారాలయ్యాయి; పరశురాముణ్ణి ఓడించిన వాడికి శిఖండి చేతిలో ఓటమి కలిగింది; పదిరోజుల పాటు ప్రచండభానుడై పాండవబలగాల్ని కాల్చిన భీష్ముడు అస్తమించాడు” అని శోకాలు పెడుతూ వచ్చాడతను. ధృతరాష్ట్రుడు గుండెలవిసి మూర్ఛపడి ఉపచారాల్తో లేచాడు. “దేవాసురులంతా ఒక్కటై వచ్చినా గెలిచే ఆ మహానుభావుణ్ణి శిఖండి ఓడించటం ఎలా జరిగింది? పాండవ సముద్రాన్నుంచి కౌరవసేనని రక్షించే ద్వీపం, శౌర్య సత్వ శీల పరాక్రమాల్లో ఎదురులేని వాడు అన్న నమ్మకాలన్నీ వమ్మయ్యాయా? మిగిలిన వాళ్లంతా ఏమయ్యారు? అడవులకి పారిపోయారా? ఆయనే లేకపోతే ఇంక మిగిలిందేముంది? ఇక అంతా ఐపోయినట్టే! అసలిదంతా ఎలా జరిగిందో నాకు వివరంగా చెప్పు” అనడిగాడు ఆత్రంగా. సంజయుడు వ్యాసుడికి నమస్కరించుకుని భీష్మ మరణం వరకు జరిగిన యుద్ధం గురించి చెప్పటం మొదలెట్టాడు.
అలా నేను పదిరోజుల నాడు ఇక్కడి నుంచి వెళ్లి దుర్యోధనుడి నగరుకు చేరా. అప్పుడతను దుశ్శాసనుడితో “మనందరికీ రక్ష భీష్ముడు. ఐతే తను శిఖండితో మాత్రం యుద్ధం చెయ్యలేనని మనకు ఇదివరకే చెప్పాడు. సరైన రక్షణ లేని సింహాన్ని నక్కలు పొట్టనపెట్టుకున్నట్టు ఈయన్ని మనం రక్షించుకోకపోతే శిఖండికి చిక్కే అవకాశం వుంది. కనక శిఖండి ఆ చాయల కనిపిస్తే చాలు, మీమీ బలగాల్తో మీరు అడ్డు పడాలి” అని చెప్పి పంపాడు.
మొదటి రోజు
తెల్లవారింది. కౌరవసేన కదిలింది. ఆ సేనాసముద్రానికి చంద్రుడిలా భీష్ముడు. అతని కేతనం సువర్ణతాళమయం. కాంచనమయ వేదికతో మెరిసేది ద్రోణుడిది. బంగారు ఎద్దుతో కృపుడు. సింహపుతోక కేతువు అశ్వధ్ధామది. అరటిపోక జెండా శల్యుడు.
యాదవబలాల్తో కృతవర్మ. పృథుసైన్యంతో సైంధవుడు. మదపుటేనుగుల సైన్యంతో విందానువిందులు, కాళింగుడు, భగదత్తుడు. కొడుకులు, తమ్ముల్తో గుర్రపు బలగంతో శకుని. కొడుకు వీరోత్తముడైన సోమదత్తుడు, మనవడు భూరిశ్రవుడితో పెద్ద బలగంతో బాహ్లికుడు. కాంభోజరాజు సుదక్షిణుడు. కోసలపతి బృహద్బలుడు. మాహిష్మతీ పురపు నీలుడు. త్రిగర్తపతి సుశర్మ. అలంబుస, హలాయుధ రాక్షసులు. సాల్వ, సౌవీర, శూరసేన, ఆభీర, యవన రాజులు. ఇలా పది అక్షౌహిణుల సైన్యం. రాజరాజు సొంత బలం మరో అక్షౌహిణి. పెళ్లికి వెళ్లినట్టు ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ కదిలారు.
ముఖ్యమైన రాజులందర్నీ పిలిచి భీష్ముడు అన్నాడు “యుద్ధం అంటే రాజులకు తెరిచివున్న స్వర్గద్వారం. క్షత్రియుడై పుట్టి ఇంట్లో చావటం నీచం. ఉంటే రాజ్యయోగం, పోతే స్వర్గభోగం. ఇదివరకు మన పూర్వులు నడిచిన ఈ మార్గంలోనే మనమూ నడుద్దాం”. అంతా అలాగేనని అతనికి వాగ్దానాలు చేసి సంతోషంగా తమతమ సైన్యాల దగ్గరికి వెళ్లారు.
“గుర్తుంది కదా, నేను యుద్ధం చేసేప్పుడు కర్ణుడు గాని అతని బంధువులు గాని యుద్ధానికి రారు” అని దుర్యోధనుడికి గుర్తు చేశాడు భీష్ముడు.
తొలినాటి యుద్ధానికి నాందిగా మహాదృఢంగా మానుషవ్యూహం నిర్మించాడు భీష్ముడు. దేవతలు, పితృదేవతలు కూడ భారతరణం చూడటానికి విమానారూఢులై వేంచేశారు.
ఇక రెండో వంక – ధర్మజుడు, భీముడు, కృష్ణార్జునులు, కవలు, అభిమన్యుడు, ఉప పాండవులు కదిలి వచ్చారు. ఏనుగుల సైన్యంతో ద్రుపదుడు, కొడుకులు తమ్ముళ్లతో పెద్ద సైన్యంతో విరాటుడు, యాదవబలగంతో సాత్యకి; చేకితానుడు, అతనితో సల్లాపాలాడుతూ శిఖండి కదిలారు. అంబరమదిరే తూర్యధ్వనుల్తో మాగధసహదేవుడు, పాండవులకి కన్నులపండగ్గా ధృష్టద్యుమ్నుడు, చేత శూలపు వెలుగులు చిమ్ముతూ ఘటోత్కచుడు. పాండ్యపతి, కేకయు లైదుగురు, శైబ్యుడు, కాశ, కరూశాది అనేక దేశాల రాజులు. ఈ పాండవబలగం ఏడు అక్షౌహిణులు.
ఇరుసైన్యాలు కదిలి కురుక్షేత్రంలో ఉత్తమప్రదేశమైన శమంతపంచకానికి చేరాయి. శుభశకునాలు తోస్తుండగా ధర్మజుడు, తనవైపు రాజుల్ని పిలిచి “సమరంలో జయిస్తే రాజ్యం, లేకుంటే స్వర్గసామ్రాజ్యం. ఇందుకు సిద్ధమైతే నా పక్కన నిలవండి” అన్నాడు. అందరూ అలాగేనని ప్రతిజ్ఞలు చేశారు.
అప్పుడు ధృతరాష్ట్రుడికి ఒక సందేహం కలిగింది “మన సైన్యం వాళ్ల సైన్యం కన్నా చాలా పెద్దది. ఐనా ఏమాత్రం తొణుకూ బెణుకూ లేకుండా పాండవులు ఈ యుద్ధానికి ఎందుకు సిద్ధమయ్యారో?” సంజయుడన్నాడూ “ధర్మరాజుకీ ఇదే అనుమానం వచ్చింది. దానికి అర్జునుడు, ‘ఇదివరకు నారదుడు, వ్యాసుడు ఒక సందర్భంలో ధర్మనాశనులైన వాళ్లకి ఎంత పెద్ద సైన్యం వున్నా వాళ్లు చిన్న సేనకి ఓడిపోతారని’ చెప్పారు. అంతే కాక ‘మన సైన్యం సామాన్యం కాదు, ఎందరో మహాయోధులున్నారు, నీబలం కూడ నీకు తెలియదు. నువ్వూ, కృష్ణుడూ వున్న మన బలగం అజేయం’ అన్నాడు. అది నిజమని నా అభిప్రాయం కూడ.”
అప్పుడిక అర్జునుడు ధృష్టద్యుమ్నుడి చేత అచలవ్యూహం పన్నించాడు.
ఇంతలో ధర్మరాజు కవచం తీసి, ఆయుధాలు రథం మీద పెట్టి కిందికి దిగి మౌనంగా చేతులు మోడ్చి భీష్ముడి వైపుకి నడిచాడు. అతని తమ్ములు, బంధువులు బిత్తరపోయి అతని వెంట పరిగెత్తారు. ఎవరెంతగా అడిగినా ఒక్కముక్క మాట్లాడకుండా నడిచాడు ధర్మరాజు. కృష్ణుడు “పెద్దల ఆజ్ఞ తీసుకుని యుద్ధం చెయ్యటం జయప్రదం అని చెప్తారు. ఇప్పుడీయన చేస్తున్న పని అదే” అని వాళ్లని సమాధాన పరిచాడు. అందరూ నిలబడిపోయి చోద్యంగా చూస్తుంటే తమ్ముళ్లూ కృష్ణుడూ తనతో రాగా భీష్ముడి దగ్గరికి వెళ్లాడు ధర్మరాజు. సైన్యాలన్నీ ఆశ్చర్యంగా చూస్తున్నాయి, యుద్ధం మొదలు కాకుండానే పాండవులు ఓడిపోయినట్టు ఒప్పుకుంటున్నారని అనుకోసాగారు.
భీష్ముడికి నమస్కరిస్తూ వినయంగా, శత్రువుల్ని జయించేట్లు దీవించమని అడిగాడు ధర్మజుడు. “ఇలా వచ్చి మంచిపని చేశావు, లేకపోతే నేన్నిన్ను శపించేవాణ్ణి సుమా! నీవైపుకు రమ్మని తప్ప ఇంకేదన్నా వరం కోరుకో” అన్నాడు భీష్ముడు. నిన్ను యుద్ధంలో గెలిచే మార్గం చెప్పమన్నాడు ధర్మరాజు. “నేను చేతి ఆయుధం వదిల్తే కాని నన్నెవరూ జయించలేరు. ఐతే అదెలా జరుగుతుందో చెప్పటానికి ఇది సమయం కాదు. అందుకు మళ్లీ వద్దువులే” అన్నాడు భీష్ముడు చిరునవ్వుతో.
అక్కడినుంచి ద్రోణ, కృప, శల్యుల దగ్గరికీ వెళ్లి పాదప్రణామాలు చేసి అనుజ్ఞ తీసుకున్నాడు. తన మరణరహస్యం చెప్పమంటే ద్రోణుడు ‘నేను ప్రాయోపవేశం చేసి శస్త్రాస్త్రాలు వదిల్తే తప్ప నన్ను ఎవరూ ఓడించలేరు, అలా జరగాలంటే మంచి నమ్మకస్తుడైన వ్యక్తి నేను భరించలేని కీడుమాట చెప్పాలి’, అని చెప్పాడు. కృపుడు తన్నెవరూ చంపలేరని చెప్పి ఆశీర్వదించాడు. శల్యుణ్ణి ‘నువ్వు కర్ణుడికి సారధివయే అవకాశం కలిగితే అతనికి చిక్కులు తెచ్చిపెట్టాలని’ అడిగితే, ‘అది మనం ముందు అనుకున్న విషయమేగా అలాగే చేస్తా’నని మాట ఇచ్చాడతను.
అప్పుడిక ధర్మజుడు వెనక్కు తిరిగాడు. ఇంతలో కృష్ణుడు అక్కడికి వచ్చిన కర్ణుణ్ణి చూశాడు. “భీష్ముడుండగా అతని వైపు యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేశావు, మరి అందాక పాండవుల వైపు ఒక చెయ్యి వెయ్యొచ్చు కదా” అనడిగాడతన్ని. “నాకు భీష్ముడి మీద కోపం గాని అలాగని రారాజుకి వ్యతిరేకంగా పోరాడను” అని ఖచ్చితంగా చెప్పాడతను. అతని సమాధానానికి కృష్ణుడు సంతోషించాడు. పాండవులతో కలిసి కౌరవసైన్యం బయటకు వచ్చాడు.
అప్పుడు ధర్మరాజు కౌరవసైన్యం వంక తిరిగి పెద్దగా – “మామీద స్నేహంతో మాతో కలవాలనుకున్న వారికి ఎవరికైనా స్వాగతం. వాళ్లని నా తమ్ముళ్లలాగా ఆదరిస్తా” అని ప్రకటించాడు. దానికి నీ కొడుకు యుయుత్సుడు “నేను వస్తా, నన్ను కలుపుకో”మన్నాడు. ధర్మజుడు అతన్ని కౌగిలించుకుని, ఉపచారాల్తో ఆనందింప చేశాడు. యుయుత్సుడు, అతని సైన్యం వెళ్ళి పాండవుల్తో కలిశారు. పాండవులు, ఇతర దొరలు తమతమ స్థానాలకు వెళ్లి యుద్ధసన్నద్ధులయారు.
అప్పుడు దుర్యోధనుడు గురువు దగ్గరికి వెళ్లాడు “ఎందరో గొప్ప యోధులున్నా మనకన్నా పాండవుల వ్యూహం దిట్టంగా కనిపిస్తున్నది. మీరంతా అవసరమైన చోట్ల వుండి భీష్ముడికి కావలి కాయాలి సుమా” అన్నాడు. ఆమాట వేరే చెప్పాలా అని ద్రోణుడంటే భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. కౌరవ పక్షాన వున్న ఇతర మహావీరులు కూడ శంఖాలు పూరించారు. వివిధ వాద్యాల ఘోష మిన్ను ముట్టింది.
అటువైపు కృష్ణార్జునులు, తదితర దొరలూ కూడ శంఖాలు పూరించారు.
శస్త్ర ప్రయోగ సమయం వచ్చింది.
అర్జునుడు గాండీవం తీసుకుని అల్లెతాడు సారించి ఒక చేత్తో బాణం పట్టుకున్నాడు. “బావా, కౌరవుల్లో ఎవరితో యుద్ధం చెయ్యబోతున్నానో ఒక్కసారి చూద్దాం, రథాన్ని రెండుసైన్యాల మధ్య కొంచెం సేపు నిలుపు” అనడిగాడు. అలాగే చేశాడు కృష్ణుడు. ఒక్కసారి వాళ్లందర్నీ చూశాడు అర్జునుడు. ధనుర్బాణాలు పడేసి రథమ్మీద చతికిల పడ్డాడు. “ఎవరికోసం రాజ్యం సంపాయించాలనుకున్నానో వాళ్లంతా ఇక్కడ రణభూమిలో వున్నారు. వీళ్లని చంపి తెచ్చుకునే ఆ రాజ్యం నాకెందుకు? ఈ యుద్ధం నా వల్లకాదు” అంటూ బావురుమన్నాడు.
కలకల నవ్వాడు కృష్ణుడు. “ఎవరికోసం బాధపడ కూడదో వాళ్లని తల్చుకుని బాధపడుతున్నావు. ఆత్మ శాశ్వతం కాని శరీరం కాదు. ఆత్మ బాధించేది కాదు, బాధ పడేదీ కాదు” అంటూ ఎంతగానో బోధించాడు. “ఎండుటాకులు ఏ సమయంలో రాలాలో అప్పుడు రాల్తాయి. అలాగే శరీరాలకి మరణం కలుగుతుంది. దీన్లో ఒకరి ప్రమేయం లేదు” అని అతన్ని శాంతింప చేశాడు. అప్పుడు అర్జునుడు, “ఇప్పుడు నాకు కొంత ఉపశమనం కలిగింది. ఐతే మహనీయమైన నీ దివ్యరూపాన్ని ఒక్కసారి చూపించు” అనడిగాడు. “ఇది మానవనేత్రాల్తో చూడగలిగింది కాదు. నీకు దివ్యదృష్టి నిస్తున్నా, చూడు” అంటూ తన దివ్యరూపాన్ని చూపించాడు కృష్ణుడు. ఆ ఆకారం భయంకరమై తోచిందర్జునుడికి. అది తన కాలరూపమని, తను అప్పటికే వధించిన వారిని అర్జునుడు ముందుముందు చంపబోతున్నాడని వివరించాడు కృష్ణుడు. అతని కోరిక మేరకు ఆ రూపాన్ని ఉపసంహరించి పూర్వరూపంతో కనిపించాడు. అర్జునుడు యుద్ధానికి సుముఖుడయ్యాడు.
ఇలా విఘ్నాలన్నీ తీరటంతో ఇక యుద్ధం మొదలెట్టమని ఆజ్ఞాపించాడు దుర్యోధనుడు వీరావేశంతో. దుశ్శాసనుడు కౌరవసేనని పురికొల్పాడు. భీష్ముడు ముందు సాగగా అతని వెనక కౌరవ సేనానీకం కదిలింది. రెండోవంక నుంచి భీముడు ముందుండగా పాండవసేన ఎదురుగా వచ్చి నిలిచింది. భీముడు శత్రువుల గుండెలు పగిలేలా సింహనాదం చేశాడు. దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుష్ప్రహుడు, దుర్మర్షణుడు, వివింశతి, వృషసేనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, పురుమిత్రుడు ఒక్కసారిగా అతని మీద విరుచుకుపడ్డారు. అటువైపు నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, ద్రౌపదేయులు ఐదుగురు భీముడికి సాయంగా దూకారు. పోరు తీవ్రమైంది.
తన సైన్యాన్ని ప్రోత్సహిస్తూ పిచ్చెక్కినట్టు తిరుగుతున్నాడు దుర్యోధనుడు.
అటు ధర్మరాజు జయం మనదే అని తన సైన్యాన్ని ఉరికిస్తున్నాడు.
ఏనుగుల గంటల మోతలు, గుర్రాల సకిలింపులు, సైన్యాల పదఘట్టనలు భూనభోంతరాళాల్ని బద్దలు కొడుతున్నయ్. నడిమింటి సూర్యుడిలా మీ తండ్రి భీష్ముడు భీషణ రూపంతో యుద్ధం చేస్తున్నాడు. అది చూసి అర్జునుడు దేవదత్తాన్ని భీకరంగా మోగిస్తూ అతనితో తలపడ్డాడు. సాత్యకిని కృతవర్మ మార్కొన్నాడు. అభిమన్యుడు బృహద్బలుడితో తలపడితే అతను సూతుణ్ణి, గుర్రాల్ని చంపాడు. కోపంతో అభిమన్యుడూ వెంటనే అతనికి అదేపని చేశాడు. భీష్ముడు భీముడిపైకి కదిలాడు. దుశ్శాసనుడు నకులుడి మీద ఉగ్రబాణాలు వేశాడు. అతను ఒక భల్లంతో దుశ్శాసనుడి విల్లు విరగ్గొట్టి పాతిక బాణాల్ని అతని మీద వేశాడు. దుశ్శాసనుడు ఇంకో విల్లు తీసుకుని ఆ బాణాల్ని నరికి నకులుడి జెండా విరిచాడు. దుర్ముఖుడు సహదేవుడి మీదికి పోతే అతను వాడి సారథిని చంపి గుర్రాల్ని గాయపరిచాడు. ధర్మరాజు శల్యుడితో పోరాడాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడితో తలపడితే అతను వాడి పెద్దవింటిని మూడుముక్కలు చేశాడు. ఇంకోవిల్లు తీసుకుని పధ్నాలుగు వాడిబాణాలు వేశాడు వాడు. మాగధసహదేవుడు భూరిశ్రవుడితో తలపడ్డాడు. అలంబుసుడూ ఘటోత్కచుడూ ఢీకొన్నారు. అశ్వద్ధామ, శిఖండి ఒకర్నొకరు గాయపర్చుకున్నారు. భగదత్తుడు, విరాటుడు మరోవంక. కైకయరాజు బృహక్షత్రుడు, కృపుడు ఒకరొకరివి అన్నీ చంపుకుని కత్తులు పట్టుకుని కిందికి దూకారు. ఇంతలో ఒకవైపు నుంచి జయద్రథుడు మరోవైపు నుంచి ద్రుపదుడు వాళ్లిద్దరి మధ్యకు వచ్చి వాళ్ల రణాన్ని ఆపి ద్వంద్వయుద్ధంలో ఒకర్నొకరు గాయపర్చుకున్నారు.
ఇలా రణస్థలమంతా యుద్ధం చేస్తున్న చిన్న చిన్న గుంపుల్తో నిండిపోయింది.
మధ్యాన్నమయింది.
దుర్యోధనప్రేరితుడైన భీష్ముడు అంతటా తానే ఐ పాండవవర్గంలోని వ్యూహాలన్నిటినీ చీల్చిచెండాడుతూ తిరిగాడు. ఆ తేజోమూర్తిని ఎదిరించే ధైర్యం లేక అందరూ దిగాలుపడి చూస్తుంటే అభిమన్యుడు చెలరేగి శల్యుడు, కృతవర్మ, దుర్ముఖుడు, వివింశతి, కృపుడు – వీళ్లందర్నీ చీకాకు పరిచి భీష్ముడిని తొమ్మిది బాణాల్తో గాయపరిస్తే, ‘వీడు వివ్వచ్చుడికి కాస్త ఎక్కువేమో గాని తక్కువేమీ కాడు” అని భీష్మాదులంతా ముక్కున వేలేసుకున్నారు. భీష్ముడు, అతని పక్కనున్న ఐదుగురు దొరలూ తన మీద అంబుల వాన కురుస్తుంటే వాటన్నిటిని వ్యర్థపరిచి అభిమన్యుడు తాత తాళధ్వజాన్ని విరగ్గొట్టాడు. కౌరవసైన్యం హాహాకారం చేస్తే పాండవసేన ఉబ్బిపోయింది.
సింహనాదం చేస్తూ భీముడు వచ్చి తమ్ముడి కొడుక్కి సాయంగా శత్రువుల మీద దూకాడు. భీష్ముడు కోపంతో అతని కేతనాన్ని కూల్చాడు. సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకయులు, విరాటుడు భీష్ముడితో తలపడ్డారు. ఉత్తరుడి ఏనుగు శల్యుడి రథాన్ని పిప్పిచేసింది. ఉగ్రకోపంతో శల్యుడు ఉత్తరుడి వక్షాన్ని ఒక శక్తితో బద్దలుకొడితే వాడు కింద పడుతూ దార్లోనే మరణించాడు. దాంతో ఆగక శల్యుడు వాడి ఏనుగునీ పీనుగ చేసి కృతవర్మ రథం మీదికి లంఘించాడు. అన్న చావుతో రెచ్చిన శంఖుడు శల్యుడి మీదికి దూకాడు. అంతలో భీష్ముడు వచ్చి వాణ్ణి ముప్పుతిప్పలు పెట్టాడు. ఇది చూసి అర్జునుడు అతనికి అడ్డంగా వచ్చాడు. భీష్మార్జునుల పోరు ఘోరమైంది.
కృతవర్మ రథం నుంచి దూకి శల్యుడు శంఖుడి రథాల్ని నుగ్గుచేశాడు. వాడు అర్జునుడి రథం వెనక్కి పారిపోయాడు. ఇక అక్కణ్ణుంచి కదిలి భీష్ముడు విరాటసైన్యం మీద విరుచుకుపడ్డాడు. పాండవసైన్యాన్ని పరుగులు పెట్టించాడు. పాండవులు దిక్కుతోచక దిక్కులు చూస్తుండగా వాళ్ల మీద దయతలిచి సూర్యుడు అస్తమించాడు. తొలినాటి యుద్ధం ముగిసింది.
ఆ రాత్రి ధర్మజుడు తమ్ములు, మిగిలిన వాళ్లతో కలిసి నీరసంగా కృష్ణుడి దగ్గరకు వెళ్లాడు. “కృష్ణా, ఈ భీష్ముడి చేతిలో మన సైన్యం పూర్తిగా నాశనం కాకముందే యుద్ధం చాలించి నేను అడవులకి పోయి కూరాకులు తిని బతుకుతా. వీళ్లని అతనికి బలివ్వలేను. అర్జునుడేదో అతన్ని ఆపగలడని ఇన్నాళ్లు నేను భ్రమలో వున్నా. అది నిజం కాదని ఈ రోజు తేలిపోయింది” అని బావురుమన్నాడు. కృష్ణుడతన్ని ఊరడించాడు. మనవైపూ మహాయోధులున్నారు. ఒళ్లు దాచుకోకుండా పోరాడుతున్నారని ఇంకా పోరాడతారని వివరించాడు.
తను పుట్టిందే ద్రోణుణ్ణి వధించటానికని, మిగిలిన కౌరవసేనని అవసరమైతే తనే కడతేర్చగలనని భరోసా ఇచ్చాడు ధృష్టద్యుమ్నుడు. ధర్మరాజు కొంత శాంతించి తన నివాసానికి వెళ్లాడు.
రెండవ రోజు
తెల్లవారింది. కాల్యకృత్యాలు తీర్చుకుని యుద్ధోన్ముఖులయారు. అత్యంత శక్తివంతమైన క్రౌంచవ్యూహం నిర్మించమని ధృష్టద్యుమ్నుడికి చెప్పాడు ధర్మరాజు. అతనలాగే చేశాడు. అదిచూసి దుర్యోధనుడు భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృప, శల్య, కృతవర్మలతో మంతనాలు చేశాడు. మూడు వ్యూహాలు పన్నారు. వాటన్నిటికీ వెనగ్గా తన సైన్యంతో దుర్యోధనుడు నిలబడ్డాడు.
యుద్ధం మొదలైంది. భీష్ముడు మళ్లీ విజృంభించి అంతటా తానే అయి విహరించటం మొదలెట్టాడు.
అర్జునుడు అక్కడికి తీసుకువెళ్లమని అడిగితే, అలాగే చేస్తా; ఐతే నువ్వు ఎలాటి సందేహాలకీ తావులేకుండా భీష్ముడి చుట్టూ వున్న వాళ్లంతా బిత్తరపోయేట్టు నీ పరాక్రమం చూపించు అని పురికొల్పుతూ రథాన్ని అటు తోలాడు కృష్ణుడు. అర్జునుడు అడ్డొచ్చిన వాళ్లందర్నీ తన బాణవర్షంలో ముంచుతూ ముందుకు సాగాడు.
భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, వికర్ణుడు, శల్యుడు, దుర్యోధనుడు అతని మీదికి బాణప్రయోగాలు చేశారు. అర్జునుడు ఏమాత్రం చెదరక వాళ్లందరికీ సరైన రీతిలో బాణ సమాధానాలు చెప్పాడు.
ఇంతలో సాత్యకి, విరాటుడు, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపదేయులు, అభిమన్యుడు వచ్చి భీష్ముడికి సాయపడే వాళ్లందరి మీద విరుచుకుపడ్డారు. అర్జునుడు భీష్ముణ్ణి దాటి కౌరవబలం మీద పడి చించి చెండాడాడు.
దుర్యోధనుడు భీష్ముడితో “అలా అర్జునుడు మన వాళ్లని ఊచకోత కోస్తుంటే ఏమీ చెయ్యటం లేదు నువ్వు. పైగా కర్ణుణ్ణి యుద్ధానికి రాకుండా చేశావు” అని ఎత్తిపొడిచాడు. భీష్ముడి మనసు కలుక్కుమంది. ఐనా మౌనంగా అర్జునుడి వైపుకి బయల్దేరాడు. దుర్యోధన వికర్ణులు ఒకపక్క నుంచి, అశ్వత్థామ మరోపక్క నుంచి అర్జునుడి మీద బాణాలు కురిపించారు. అటువైపు అర్జునుడికి తోడుగా అతని అన్నదమ్ములు వచ్చారు. వాళ్లందరి మధ్యా యుద్ధం తీవ్రమైంది.
భీష్ముడు కృష్ణుడి వక్షాన ఒక అమ్ము నాటాడు. కోపంతో అర్జునుడు భీష్మ సారధిని నొప్పించి కురుబలాన్ని తన బాణాల్లో కప్పేశాడు. భీష్ముడొక్కడే వాళ్లకి దిక్కయ్యాడు. అంతలో మధ్యాన్నమయింది.
మరోపక్క ద్రోణ ధృష్టద్యుమ్నులు తలపడ్డారు. ధృష్టద్యుమ్నుడి అన్ని ఆయుధాల్ని ముక్కలు చేశాడు ద్రోణాచార్యుడు. రథం నుగ్గయింది. ధృష్టద్యుమ్నుడు కిందికి దూకి వాలూ పలకా తీసుకుని అతని మీదికి దూకబోయాడు కాని ద్రోణుడి శరపరంపరలు అతన్ని కదలనివ్వలేదు. ఇంతలో భీముడు అడ్డంగా వచ్చి ధృష్టద్యుమ్నుడిని ఇంకో రథం ఎక్కించి ద్రోణుడితో తలపడ్డాడు. దుర్యోధనుడు కాళింగుడైన శ్రుతాయువుని పిలిచి భీముడి పైకి పంపాడు. వాడు మహాసైన్యంతో భీముడి మీదికి ఉరికాడు.
ద్రోణుడు విరాట ద్రుపదుల మీదికి కదిలాడు.
శ్రుతాయువు, తన నిషాద సైన్యంతో కేతుమంతుడు, భీముణ్ణి ఢీకొన్నారు. కేతుమంతుడు తొలిదెబ్బకే చచ్చాడు. శ్రుతాయువు కొడుకు శక్రదేవుడు భీముడి మీదికి దూకి అతని గుర్రాల్ని కూలిస్తే మండిపడుతూ భీముడో పెద్ద గదతో మోదాడు. రథమూ, సారధుల్తో సహా వాడు గతించాడు. పలకని కత్తిని పుచ్చుకుని భీముడు రథం మీంచి దూకి శ్రుతాయువు బాణాల్ని వమ్ము చేశాడు. ఇంతలో శ్రుతాయువు తమ్ముడు భానుమంతుడు ఏనికసైన్యంతో వచ్చి భీముడితో తలపడ్డాడు. సింహనాదం చేస్తూ భీముడు వాడి ఏనుగు దంతాల మీదికి లంఘించి ఒక్కపోటుతో వాణ్ణి చంపాడు. శ్రుతాయువు తన సైన్యాన్ని భీముడి మీదికి ఉసిగొల్పాడు. భీముడు రథం లేకుండానే భీభత్సంగా ఏనుగల్ని పీనుగుపెంటలు చేసి గుర్రాల్ని ఎక్కడ దొరికితే అక్కడ నరికి రథాల్ని సారధుల్ని ఊచకోత కోసి శ్రుతాయువు మీదికి దూకబోయేంతలో భీముడి సారధి అక్కడికి రథాన్ని తీసుకొచ్చాడు. అది ఎక్కి శ్రుతాయువు చక్రరక్షకుల్ని చంపి అతన్ని మూర్ఛితుణ్ణి చేసి ఒక్క బొబ్బ పెట్టే సరికి అతని సారథి భయంతో శ్రుతాయువు రథాన్ని దూరంగా తోలుకుపోయాడు. అతని బలాలు చిందరవందరగా పారిపోయినై.
భీముడు విజయసూచకంగా శంఖం పూరించాడు. అదివిని భీష్ముడు భీముడి మీదికి వస్తుంటే ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి భీముడికి తోడుగా వచ్చిచేరారు. భీష్ముడు వాళ్లందరి మీదా విపరీతంగా బాణాలు వేసి భీముడి గుర్రాల్ని చంపాడు. భీముడు వీరావేశంతో గద తీసుకుని అతని మీదికి వెళ్ళాడు. ఇంతలో సాత్యకి భీష్ముడి సారధిని చంపాడు. సారధిలేని గుర్రాలు అతన్ని రథాన్ని తీసుకుని పరిగెత్తినయ్. ధృష్టద్యుమ్నుడు ఆదరంగా భీముణ్ణి తన రథం ఎక్కించుకున్నాడు. సాత్యకి భీముడితో, “ఒక్కడివే ఇలా కళింగ బలాన్నంతటినీ బూడిద చెయ్యటం బాగుందా!” అని సరసమాడాడు.
ఇంతలో శల్య, కృప, అశ్వత్థామలు అటు వస్తుంటే ధృష్టద్యుమ్నుడు భీముణ్ణి వినయంగా తన రథం మీది నుంచి దించి వాళ్ల మీదికి వెళ్లాడు. వాళ్లు ముగ్గురూ అతనొక్కడితో యుద్ధం చెయ్యటం దూరం నుంచి గమనించిన అభిమన్యుడు అక్కడికి వేగంగా వచ్చి వాళ్లతో యుద్ధం చేస్తుంటే నీ మనవడు లక్ష్మణకుమారుడు పదునైన బాణాల్తో అతన్ని గాయపరిచి అతని విల్లు విరగ్గొట్టాడు. కౌరవులు ఆనందంగా అరిచారు. అభిమన్యుడు ఇంకో విల్లు తీసుకుని అతన్ని నొప్పించాడు. కొడుకు గాయాలు చూసిన దుర్యోధనుడు కోపంతో అభిమన్యుడి మీదికి కదిలాడు. అది చూసి భీష్మ ద్రోణాదులు కూడ అటు వెళ్ళారు. కొంచెమైనా జంకకుండా అభిమన్యుడు అందరికీ అన్నిరూపులై యుద్ధం చేస్తుంటే చూసి వాయువేగంతో రథం తోలుకుని బాణవర్షం కురిపిస్తూ దేవదత్తం పూరిస్తూ అర్జునుడక్కడికి వచ్చాడు. ఇది చూసి ధర్మరాజు తన సైన్యాన్ని పురికొలిపి అటు పంపాడు.
భూమ్యాకాశాలు కనపడనంత దట్టంగా దుమ్మూ ధూళీ అలముకున్నయ్. మన సైన్యం దిక్కుతోచక పారిపోసాగింది. కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తాలు పూరించారు. భీష్ముడు ద్రోణుడితో “ఇలా భీషణంగా పోరాడుతున్న అర్జునుడిని మనం ఇప్పుడేమీ చెయ్యలేం. పొద్దు కూడ వాలుతున్నది. మన వాళ్లంతా అలిసిపోయారు. ఇవాల్టికి యుద్ధం చాలిద్దాం” అని చెప్పి అందర్నీ పిలిచి నడిపించాడు. పాండవ బలగాలు ఉత్సాహంగా కేకలు పెడుతూ శిబిరాలకు కదిలారు.
మూడవరోజు
మూడవరోజు యుద్ధానికి పొద్దున్నే లేచి భీష్ముడు గరుడవ్యూహం పన్నాడు. మన వ్యూహాన్ని చూసి అర్జునుడు అర్థచంద్రవ్యూహం అమర్చమని ధృష్టద్యుమ్నుడితో చెప్పాడు. అతనలాగే చేశాడు. రెండుబలాలు కదిలినయ్. అర్జునుడు మన పదాతులు జడుసుకుని పారుతుంటే తన రథాన్ని నడిపించి రథాలు, రథికులు, గుర్రాలు, సారథులు అని చూడకుండా అందర్నీ అన్నిట్నీ నుగ్గు చేస్తూ సాగుతుంటే నీ కొడుకులంతా కోపంగా అతని మీద విరుచుకుపడ్డారు. దాంతో పాండవులు వాళ్ల మీదికి ఉరికారు. ఎవరెవరో తెలియరానంతగా బలగాలు కలగలిసి పోయినై. దేవాసుర యుద్ధాన్ని తలపిస్తూ ఇరుపక్షాలు పోరుసాగించినయ్. మనవైపు నుంచి భీష్ముడు, ద్రోణుడు, పురుమిత్రుడు, సైంధవుడు, సౌబలుడు (శకుని), వికర్ణుడు పాండవసేన మీద పడితే; వాళ్లవైపు నుంచి భీముడు, ఘటోత్కచుడు, సాత్యకి, శైబ్యుడు, చేకితానుడు, ద్రౌపదేయులు వాళ్లతో తలపడ్డారు. అప్పుడు నీ పెద్దకొడుకు భీముడున్న చోటికి వెళ్తుంటే అతని కన్నా ముందుగానే భీష్మద్రోణులు అక్కడికి చేరి పోరుతుంటే అన్నకి సాయంగా అర్జునుడూ అక్కడికే వచ్చి కౌరవసేనని మట్టుపెడుతుంటే సాత్యకి, అభిమన్యుడు గాంధార బలగాల పని పట్టారు. ఆ శకుని బలగం సాత్యకి రథాన్ని నుగ్గుచేస్తే అతను వేగంగా అభిమన్యుడి రథం మీదికి దూకాడు. వాళ్లిద్దరూ కలిసి గాంధార బలాన్ని గందరగోళం చేశారు.
ఇంతలో ధర్మజుడు భీష్ముడితో తలపడ్డాడు. దుర్యోధనుడు భీముడి మీద అనేక బాణాలేశాడు. దానికి నవ్వుతూ భీముడు వేసిన ఒక ఉగ్ర బాణానికి దుర్యోధనుడు చతికిలపడి మూర్ఛపోవటంతో భయపడి అతని సారథి రథాన్ని అక్కడి నుంచి దూరంగా తోలుకుపోయాడు.
కౌరవబలంలో కలకలం చెలరేగింది. కంగారులో వున్న ఆ సైన్యాన్ని ధృష్టద్యుమ్నుడు ఒకవంక, భీముడు మరోవంక ఊచకోత కోశారు. భీష్మ ద్రోణులు నిలపటానికి వ్యర్థప్రయత్నం చేశారు. సాత్యకి, అభిమన్యుల దెబ్బలకు గాంధారసేన కూడ భయంతో పారిపోతుంటే వాళ్లతో పాటే శకునీ అతని బంధువులూ పరుగులు తీశారు. మరోవంక అర్జునుడు మిగతా కౌరవసేనని చిందరవందర చేశాడు.
అప్పుడు నీ కొడుక్కి తెలివొచ్చి సారథిని తిట్టిపోసి యుద్ధరంగానికి తిరిగొచ్చి అందర్నీ పిలిచి పరుగులు ఆపించాడు. భీష్మ ద్రోణుల దగ్గరికెళ్ళి, “మీరొక్కొక్కరే ముల్లోకాల్ని మూడుచెరువులు తాగించగలరు. మీ ముక్కున ఊపిరి వుండగానే మన సైన్యం ఇలా దిక్కుమాలిన దురవస్థలో వున్నదంటే ఏమనాలి? మీరు పాండవుల మీద కోపగించరన్న మాట ముందే చెప్పొచ్చు కదా?” అంటూ, భీష్ముడితో, “నువ్విలా చేస్తావనుకుంటే ముందే కర్ణుణ్ణి తెచ్చుకుని మా తిప్పలేవో మేం పడేవాళ్లం. నీ మూలాన అడియాసకి పోయి భంగపడ్డా” అని నిష్టూరాలాడాడు.
దానికి భీష్ముడు చిరునవ్వు నవ్వాడు. “పాండవులు గట్టిగా నిలబడి యుద్ధం చేస్తే వాళ్లని ఓడించటం దేవేంద్రుడికి తరమా? అలాటి వాళ్లు మనలాటి వృద్ధులు, దుర్బుద్ధుల చేతిలో ఓడుతారా? ఐనా నా ఓపిక్కొద్దీ పరాక్రమిస్తా. మీరంతా పక్కనుండి చూస్తూండండి” అని అప్పుడున్న మధ్యాహ్నసూర్యుడు తానే అయి భీష్ముడు అర్జునుడి మీదికి దూకాడు. అప్పుడు నీ తండ్రి ప్రళయకాల రుద్రుడిని తలపిస్తూ అన్ని దిక్కులా తనే కనిపిస్తూ శత్రుబలంలోని మొనగాళ్లను పేరెత్తి పిలిచి మరీ దండిస్తూ రణభూమిని రక్తసిక్తం చేస్తూ పరాక్రమనృత్యం చేశాడు. పాంచాల యాదవ బలగాలు చెల్లాచెదురైనై. పాండవులు కూడ బిక్కచచ్చి నీరుగారి నిలుచున్నారు.
అదిచూసి కృష్ణుడు “ఎప్పుడెప్పుడు నేను భీష్మద్రోణకృప సహితంగా కౌరవబలాల్ని నుగ్గుచేస్తానా అని ఇన్నాళ్లు ఎదురుచూసిన వాడివి ఇప్పుడు అవసరమైనప్పుడు ఇలా వూరుకుంటే ఎలా?” అంటే అర్జునుడు “నువ్వంత మాటంటే ఇంకా ఊరుకుంటానా! అతని మీదికి నడుపు మన రథాన్ని” అని భీష్ముడితో తలపడ్డాడు. ఇద్దరూ ఘోరంగా పోరారు. భీష్ముడు కృష్ణార్జునులిద్దర్నీ బాణాల్తో బాగా గాయపరిచాడు. ఐనా ఆగక అర్జునుడతని మీద బాణపరంపరలు కురిశాడు.
కృష్ణుడు తనలో “ఇటు పాండవ సైన్యాలా పారిపోతున్నయ్, ఇప్పుడిక్కడ భీష్ముణ్ణి ఎదిరించి నిలవగల మగతనం ఎవడిలోనూ కనపడటం లేదు, అర్జునుడు కూడ అలిసి తూగుతున్నాడు, యాదవ కేకయ పాంచాల బలాలు కాపాడేవాడు లేక పారుతున్నయ్, కురుబలాలు వాళ్ల మీద పడి వీరవిహారం చేస్తున్నయ్, ఇంకా ఉపేక్షిస్తే దుర్యోధనుడి కోరిక ఈపూటే తీరబోతుంది. నేనీ భీష్ముణ్ణి చంపి ధర్మజుణ్ణి గెలిపించాలి” అనుకుంటూ ఉండగా సాత్యకి ఏనుగుబలగంతో వచ్చి అందర్నీ పిలిచి “ఇచ్చిన మాట గాలికి వదిలి ఇలా పారిపోవటం మగతనం కాదు, రండి ఈ భీష్ముడు గీష్ముడి పనిపడదాం” అని అర్జునుడి రథం వైపుకి వస్తుంటే కృష్ణుడతనితో, “పారిపోతున్న పిరికిపందల్ని ఎందుకు పిలుస్తావ్? నేనుండగా దుర్యోధనుడు గెలవటం అసాధ్యం. ఇప్పుడే భీష్మ ద్రోణాదుల్ని మట్టుబెట్టి పాండవులకి రాజ్యం ఇస్తా, చూడు” అంటూ సుదర్శనచక్రాన్ని తలవటంతోనే అది వెంటనే వచ్చి అతన్ని చేరింది.
దాన్ని తన కుడిచేతికి అమర్చుకుని పగ్గాల్ని రథం మీద పారేసి పట్టుపీతాంబరం చెంగు తూలగా ధరణి అదిరేట్టు కిందికి దూకి సింహనాదంతో భీకరవదనంతో జగత్సంహారానికి కదిలిన రుద్రుడిలా భీష్ముడి వైపుకి కదిల్తే కౌరవసేనంతా కిక్కురుమనకుండా నిలబడిపోయింది; దుర్యోధనుడు గుటకలు మింగుతూ చూస్తున్నాడు; భీష్ముడొక్కడే ప్రశాంతంగా ప్రేమగా “ఇంతకన్నా నాకు కావసిందేముంది, త్వరగా వచ్చి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి” అన్నాడు; అర్జునుడు రథం మీంచి దూకి పరిగెత్తి అతని వెనకభాగాన్ని గుచ్చిపట్టుకుని పదడుగుల మేర ఈడ్చినా వదలకుండా ఎలాగో వేలాడి “ఇంక ఒక్క అడుగేస్తే సాత్యకిని చంపినంత ఒట్టు, కోపం చాలించు, నీ సాయంతో కౌరవసేనని నరుకుతా. నువ్విలా నా పరాక్రమాన్ని తక్కువ చెయ్యటం నీకు న్యాయం కాదు” అంటూ అతన్ని ఆపాడు.
కృష్ణుడు శాంతించి రథం మీదికి తిరిగి వచ్చి పాంచజన్యం పూరించాడు. గాండీవీ దేవదత్తాన్ని పూరిస్తూ కౌరవసైన్యం మీద బాణవృష్టి కురిపించాడు. భీష్ముడు, భూరిశ్రవుడు, శల్యుడు, దుర్యోధనుడు అతని మీద రకరకాల శస్త్రాలు ప్రయోగించారు. అర్జునుడలిగి ఇంద్రాస్త్రాన్ని వేశాడు. ఆ అస్త్రం కురుసైన్యాల్ని కలచివేసి అపారనష్టం కలిగించింది. కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తాల్ని మోగించారు. అరుణకిరణుడు అస్తమాద్రికి చేరాడు.
నాలుగవ రోజు.
తెలతెలవారుతుండగా లేచి భీష్ముడు యుద్ధానికి బయల్దేరితే సాగరతరంగాల్లా అతని వెనక సేనలూ కదిలాయి. వ్యూహాలేవీ లేకుండానే రెండు బలాలూ తలపడ్డాయి. సూర్యచంద్రుళ్లా నరనారాయణులు కౌరవసేన మీదికి దూకారు. అనేక సైన్యాల్ని ఇలా అర్జునుడు తరుముతుంటే భీష్ముడు అతన్ని ఢీకొన్నాడు. భీష్ముడి పక్కన ద్రోణుడు, వివింశతి, కృపుడు, సోమదత్తుడు, శల్యుడు ఉన్నారు. వాళ్లందరితో అభిమన్యుడు ఒక్కడే తలపడ్డాడు. భీష్ముడు అభిమన్యుణ్ణి దాటివెళ్లి అర్జునుడి మీద బాణాలు కురిశాడు. అందరూ ఆశ్చర్యంతో వాళ్ల యుద్ధం చూస్తుండగా అశ్వత్థామ, భూరిశ్రవుడు, శల్యతనయుడు, చిత్రసేనుడు అభిమన్యుడితో పోరారు. ఇలా ఎంతోమంది తనని చుట్టుముట్టినా ఏమాత్రం తొణక్కుండా అందరితో అతను యుద్ధం చేశాడు.
ధృతరాష్ట్ర మహారాజా, అనకూడదు కాని హస్తలాఘవంలో, బలంలో, శౌర్యంలో అభిమన్యుడికి సరిపోయే వాళ్లెవరూ మన బలగంలో లేరు. అప్పుడు కొడుకుని చూసి అర్జునుడు వేగంగా అక్కడికి వచ్చి అందర్నీ చిక్కుపరిచాడు. ఇంతలో నీ కొడుకు పంపగా త్రిగర్తులు, కృతవర్మ, కేకయులు ముప్పై ఐదు వేల రథాల వారు వాళ్లిద్దర్నీ చుట్టుముట్టారు. ఇదిచూసి ధృష్టద్యుమ్నుడు వచ్చి కలిశాడు. అప్పుడు శల్యుడి కొడుకు అతనితో ద్వంద్వయుద్ధానికి తలపడ్డాడు. ధృష్టద్యుమ్నుడి చేతిలో అతని రథం విరిగితే పలకా వాలూ పట్టుకుని భీకరసమరం చేశాడు. ధృష్టద్యుమ్నుడి సైన్యం కకావికలైంది. ధృష్టద్యుమ్నుడు గద తీసుకుని ఒక దెబ్బతో అతని పలకనీ రెండో దెబ్బతో అతని తలనీ పగలగొట్టాడు. కోపంతో శల్యుడతని మీదికి దూకితే ధృష్టద్యుమ్నుడు నానాబాణాల్తో అతన్నెదుర్కున్నాడు.
“ఏం చెప్తాం, అంతా దైవాధీనం. పాండవుల చేతిలో మనవాళ్లు చావటం ఖాయం, చావు వార్తలు వినటం నా ఖర్మం. పాండవుల్ని గెలిచే ఉపాయమే లేదుగదా” అని నిట్టూర్చాడు ధృతరాష్ట్రుడు. “అదంతే మరి. నీ సైన్యం చాలా నాశనమైంది, నాయకులూ చస్తారు. స్థిరంగా వుండి విను” అంటూ సంజయుడు కొనసాగించాడు.
ఇలా శల్యుడు ధృష్టద్యుమ్నుడిని గాయపరుస్తూ పోరుతుంటే అభిమన్యుడు అతనితో తలపడ్డాడు. దుర్యోధనుడు పంపగా వచ్చి దుర్ముఖుడు, దుస్సహుడు, దుర్మర్షణుడు, సత్యవ్రతుడు, చిత్రసేనుడు, పురుమిత్రుడు, వివింశతి, వికర్ణుడు వాళ్లిద్దరి మీద పడ్డారు. నకులుడు సహదేవుడు వచ్చి మామ మీద బాణాలు కురిపించారు. ఒకవంక ప్రేమతోనే అతను వాళ్ల మీదా బాణాలు ప్రయోగించాడు. వాళ్లకి తోడుగా ద్రుపదుడు, విరాటుడు వచ్చి కలిశారు. మనవైపు నుంచీ యోధానుయోధులు శల్యుడికి సాయంగా వెళ్లారు. మధ్యాన్నమైంది.
అప్పుడు భీముడు తీవ్రావేశంతో “ఈపూటతో యుద్ధం సమాప్తం కావాల్సిందే” అంటూ నీ కొడుకు మీదికి రథాన్ని కదిలించాడు. నీ కొడుకులంతా కంగారుపడ్డారు. దుర్యోధనుడు గజానీకంతో మాగధుణ్ణి భీముడి పైకి ఉసిగొల్పాడు. ఐతే భీముడు ఉల్లాసంగా గద తీసుకుని కిందికి దూకి గజసైన్యాన్ని నుగ్గుచెయ్యటం మొదలెట్టాడు. ద్రౌపదేయులు, అభిమన్యుడు, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు అతని పక్కల ఉండి ఏనుగుల మీద బాణాలు కురిపించారు. ముఖ్యంగా నకులుడి కొడుకు శతానీకుడు ఎన్నో ఏనుగుల్ని సంహరించాడు. మాగధుడు అభిమన్యుడి మీదికి ఏనుగుని తరిమితే అతనొక పదునైన బాణంతో దాని కుంభస్థలాన్ని కొట్టి అది కొంచెం ఒరిగితే క్షణమాత్రంలో వాడి తల నరికాడు.
ఇక భీముడు, అభిమన్యుడు మిగిలిన పాండవవీరులు ఆ గజసైన్యాన్ని చెండాడుకున్నారు. మిగిలిన ఏనుగులు పరిగెత్తి కౌరవసైన్యాన్నే తొక్కసాగినయ్. దుర్యోధనుడు పిలిచి ఆపే వరకు సైన్యం కకావికలై పారిపోయింది. అప్పుడు భీష్ముడు వచ్చి బాణపరంపరల్తో భీముణ్ణి ఎదుర్కున్నాడు. ఇంతలో సాత్యకి వచ్చి భీష్ముడి మీద దూకితే మధ్యలో అలంబుసుడు సాత్యకిని నొప్పించాడు. సాత్యకి తన బాణాల్తో ఆ రాక్షసుణ్ణి ఆపితే సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు సాత్యకితో తలపడ్డాడు. ఇటు దుర్యోధనుడు, అతని తమ్ములు భూరిశ్రవుడికి తోడుగా నిలిస్తే అటు పాండవులు సాత్యకి పక్కకి వచ్చారు. ఇరువర్గాల వారికి పోరు ఘోరమైంది. భీముడు నీ కొడుకుల మీదికి దూకాడు. దుర్యోధనుడు అతని మీదికి బాణాలు కురిశాడు. వజ్రాయుధం లాటి బాణంతో దుర్యోధనుడు భీముడి వక్షాన్ని నాటాడు. భీముడు మూర్ఛవచ్చి తూలాడు. ఇదిచూసి కోపించి అభిమన్యుడు, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపదేయులు ఒక్కుమ్మడిగా నీ కొడుకుని చుట్టుముట్టారు.
ఇంతలో తెలివొచ్చి భీముడు భీషణంగా యుద్ధం ప్రారంభించాడు. నీ కొడుకులు పధ్నాలుగు మంది భీముడి పైకి లంఘిస్తే వాళ్లలో చాలామందిని అతను అప్పటికప్పుడే చంపాడు. మిగిలిన వాళ్లు పారిపోయారు. అదిచూసి భీష్ముడు మనవైపు మొనగాళ్లతో, “భీముడిలా రాజు కొడుకుల్ని చంపుతుంటే మీరు ఊరుకోవచ్చా?” అని అదిలిస్తే భగదత్తుడు భీముడి పైకి తన భద్రగజాన్ని నడిపించాడు. అభిమన్యాదులు దాని మీద బాణాలేస్తే అది రెచ్చిపోయి పాండవసైన్యాన్ని తొక్కెయ్యటం మొదలెట్టింది. దాన్నెలా ఆపాలా తోచక పాండవయోధులు తబ్బిబ్బయారు. దుర్యోధనుడు మరోబాణం భీముడి వక్షాన నాటితే అతను తూలి కేతనం పట్టుకుని నిలదొక్కుకున్నాడు. కౌరవసేన ఉబ్బిపోయింది.
అప్పుడు తండ్రికి సహాయంగా ఘటోత్కచుడు వచ్చాడు. “ఇది మాయాయుద్ధానికి సమయం” అని తన మాయాజాలంతో కౌరవసేనకి విభ్రమం కలిగించాడు. భగదత్తుడు తన ఏనుగు మీద వచ్చి అడ్డుపడబోయాడు గాని అతని ఏనుగు మాట వినక పరిగెత్తింది. ఘటోత్కచుడు దుర్యోధనుడి మీదికి వెళ్తుంటే భీష్మ ద్రోణాదులంతా అతనికి అడ్డు పడ్డారు. పోరు భీకరమైంది. ఆ ఘటోత్కచుణ్ణి ఆ సమయంలో ఎదిరించటం సాధ్యం కాదని ఆ రోజుకి యుద్ధం చాలిద్దామని భీష్ముడు ద్రోణుడికి చెప్తే అతను మిగిలిన వాళ్లను తోడుకుని తిరుగుముఖం పట్టాడు. జయ జయ ధ్వానాల్తో పాండవసైన్యం శిబిరాలకు తరలింది.
ఐదవరోజు.
మకరవ్యూహంతో కౌరవసైన్యం, శ్యేనవ్యూహంతో పాండవసైన్యం తలపడ్డాయి. భీముడు సునాయాసంగా మకరవ్యూహం లోకి చొరబడ్డాడు. భీష్ముడి మీద బాణాలు వర్షించాడు. ఐతే పితామహుడు నెయ్యిపోసిన అగ్నిలాగా భీముణ్ణి నొప్పించి అతని సైన్యాన్ని చెండాడాడు. అంతలో అర్జునుడక్కడికి వచ్చి దివ్యశరాల్ని కురిపించాడు కౌరవుల మీద.
నీ పెద్దకొడుకు ద్రోణుడి దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు – “నీకూ భీష్ముడికీ పాండవుల్ని గెలుద్దామన్న ఉద్దేశమే లేదు. అర్జునుడిలా మన సైన్యాన్ని కోస్తుంటే ఏవీ పట్టించుకోరు” అని. ద్రోణుడు నొచ్చుకుని “ఇప్పటివరకు అర్జునుడితో తలపడ్డ ప్రతిసారీ అతనే గెలిచాడు – గోగ్రహణ సందర్భం ఇంతలోనే మర్చిపోయావా? ఇంతవరకు ఎప్పుడూ వాళ్లని ఆపలేకపోయాం. ఇప్పుడు వాళ్లని జయించటం సాధ్యమా? ఎందుకీ మాటలు?” అంటూ పాండవవ్యూహం లోకి ప్రవేశించాడు. అక్కడతన్ని సాత్యకి ఎదుర్కున్నాడు. వాళ్లిద్దరూ యుద్ధం చేస్తుంటే శల్యుడు అతని తోడై భీముడితో తలపడితే ద్రౌపదేయులు, అభిమన్యుడు వాళ్ల మీదికి దూకారు. ఇంతలో శిఖండి భీష్ముడి మీద బాణాలు వేస్తుంటే, “దీనితో నేను యుద్ధం చేస్తానా?” అని అతను పక్కకి తిరిగి వెళ్లాడు. అదిచూసి దుర్యోధనుడు ఉసిగొలిపితే ద్రోణుడు శిఖండితో తలపడ్డాడు.
ఘోరమైంది యుద్ధం. ఎటుచూసినా పీనుగుదిబ్బలు. భీముణ్ణి చుట్టుకుని పాండవబలగం, భీష్మరక్షితమై కౌరవబలగం పోరాడినయ్. నీ కొడుకులు ఉమ్మడిగా వెళ్లి భీముడిని చుట్టుముడితే అతనూ అర్జునుడూ కలిసి వాళ్లని చెల్లాచెదురు చేశారు. దుర్యోధనుడు అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు కదిలించాడు. అటూ ఇటూ పోటువీరులు ఒకళ్ళొకళ్లతో తలపడి పోరుతుంటే భీష్ముడు భీముణ్ణి ముప్పుతిప్పలు పెట్టాడు. కోపంతో సాత్యకి భీష్ముడి మీద బాణప్రయోగం చేశాడు. భీష్ముడలిగి అతని సారథిని చంపితే గుర్రాలు అటు ఇటూ అయి రథం ఒరిగిపోయింది. “వెళ్లండి, సాత్యకిని కాపాడండి” అన్న అరుపులు పాండవసైన్యంలో. విరథుడైన అతనితో యుద్ధం భావ్యం కాదని భీష్ముడు పాండవవ్యూహం మీదికి నారి సారించాడు.
విరాటుడు యముడిలా భీష్ముడిని అడ్డుకున్నాడు. భీష్ముడతన్ని బాణాల్తో నొప్పిస్తే అర్జునుడు భీష్ముడి మీదికి బయల్దేరాడు. మధ్యలో అశ్వత్థామ అడ్డుకుని నొప్పించాడు. వాళ్లిద్దరి మధ్యా తీవ్రయుద్ధం జరిగింది. అశ్వత్థామకి గాయాలయాయి. అర్జునుడతనితో యుద్ధం చాలించి మరోవైపుకు కదిలాడు.
భీష్ముడితో తలపడబోతున్న భీముణ్ణి దుర్యోధనుడు ఆపాడు. ఇద్దరికీ ఉగ్రమైన బాణయుద్ధం జరిగింది. దుర్యోధనుడికి సాయంగా చిత్రసేనుడు, పురుమిత్రుడు, భీష్ముడు వస్తే వాళ్లని అభిమన్యుడు ఎదుర్కున్నాడు. అందరూ విస్తుపోతుండగా వాళ్లందర్నీ మూడుచెరువుల నీళ్లు తాగించాడు. ఇదిచూసి లక్ష్మణకుమారుడు అభిమన్యుడి మీద అంపపరంపరలు కురిస్తే అభిమన్యుడతని గుర్రాల్నీ సారథినీ చంపాడు. ఐనా తొణకక నీ మనవడు శక్తిని విసిరాడు. అభిమన్యుడు దాన్ని నరికి నీ మనవడి మీద ఓ తీవ్రసాయకాన్ని సంధిస్తుంటే అది గమనించి కృపుడు లక్ష్మణుణ్ణి తన రథమ్మీదికి లాగి దూరంగా తీసుకుపోయాడు.
దుర్యోధనుడు తన బలగాన్ని సమకూర్చుకుని మళ్ళీ తలపడ్డాడు. సాత్యకి కౌరవసేనని కలగించాడు. భూరిశ్రవుడు అతనికి అడ్డు పడ్డాడు. అతని ధాటికి తట్టుకోలేక సాత్యకి పక్కనున్న యోధులు పారిపోతే సాత్యకి కొడుకులు పదిమంది భూరిశ్రవుణ్ణి తమలో ఒకణ్ణి ఎన్నుకుని వాడితో పోరాడమనంటే అతను అందరితో ఒకేసారి పోరుతానని ఆ పదిమందినీ చంపాడు. అదిచూసి బాధతో సాత్యకి భూరిశ్రవుడి మీద దూకి అతని గుర్రాల్ని సారథిని చంపితే భూరిశ్రవుడూ అదేపని చేశాడు. ఇద్దరూ కత్తులు పట్టి కిందికి దూకి తలపడబోతుంటే సాత్యకిని భీముడు భూరిశ్రవుణ్ణి దుర్యోధనుడు వాళ్ల రథాల మీద దూరంగా తీసుకెళ్ళారు.
ఇంకో వంక అర్జునుడు కౌరవసేనని నాశనం చేస్తున్నాడు. దుర్యోధనుడు అరవై ఐదు వేల రథాల్ని అతని మీదికి పురికొల్పితే అతను వాటన్నిటినీ నుగ్గు చేశాడు. ఇంతలో సూర్యాస్తమయం కావొచ్చింది. “జంతువులన్నీ అలిసిపోయి కనిపిస్తున్నయ్, ఇవాల్టికి యుద్ధం ఆపుదాం” అని నీ తండ్రి ద్రోణాదులకు చెప్పి సేనల్ని మరలించాడు.
ఆరవ రోజు.
పొద్దున్నే అర్జునుడు సేనాపతిని రప్పించి మకరవ్యూహం పన్నమని చెప్పాడు. అదిచూసి భీష్ముడు దానికి ప్రతిగా క్రౌంచవ్యూహం కట్టాడు. రెండుసైన్యాలు ఎదురుగా నడిచినై. అసహనంగా భీముడు కౌరవవ్యూహం వైపుకి దూసుకుపోయాడు. ఎదురుగా వున్న కౌరవసేన భయపడి తప్పుకుని అతనికి దారిస్తుంటే ద్రోణుడు కోపంతో భీముడి మీద బాణాలేశాడు. భీముడతని సారథిని చంపాడు. ద్రోణుడు రథం తనే తోలుకుంటూ పాండవవ్యూహం వైపుకి కదిలాడు. భీష్ముడతనికి బాసటగా కలిశాడు.
ఇటు భీమవిక్రమానికి కౌరవసేన కకావికలైంది. దుర్యోధన ధర్మజులిద్దరూ తమ సేనల్ని కూడగట్టి ప్రోత్సహిస్తే రెండు సైన్యాలు తలపడినయ్. నీకొడుకులు దుశ్శాసనుడు, దుర్విషహుడు, దుర్మదుడు, దుస్సహుడు, జయుడు, జయత్సేనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, సుదర్శనుడు, చారుచిత్రుడు, సువర్ముడు, దుష్కర్ణుడు ఒకేచోట కనపడేసరికి భీముడు ఉత్సాహంగా వాళ్లని తాకాడు. నీకొడుకులు కూడ భీముడిప్పుడు ఒంటిగా దొరికాడు వీణ్ణి వదలకూడదని చుట్టుముట్టారు. దానికి భీముడు ఆనందపడి తన సారథిని రథాన్ని ఒక పక్కన నిలబెట్టి ఉండమని చెప్పి గద తీసుకుని కిందికి దూకాడు. భీముడు గదతో కనిపించిన ఏనుగుల్ని, గుర్రాల్ని, రథాల్ని, రథికుల్ని మోదుతూ వీరవిహారం చేస్తుంటే దూరాన ద్రోణుడితో యుద్ధం చేస్తున్న ధృష్టద్యుమ్నుడు అది మాని భీముడున్న వైపుకి వచ్చాడు. ఐతే అక్కడతనికి భీముడి రథం మాత్రమే కనిపించటంతో ఒక్కసారిగా దుఃఖంతో వణికే గొంతుతో “భీముడికి ఏమన్నా ఐతే నా ప్రాణాలుండవు, ఎక్కడ భీముడు?” అని అతని సారథిని అడిగాడు. సారథి మాటలకి ఊరట పొంది, పీనుగులే తనకు భీముడున్న వైపుకు దారి చూపుతుంటే వెళ్లి నీకొడుకుల్ని ఎదుర్కున్నాడు. అప్పుడు దుర్యోధనుడు అందర్నీ పిలిచి బిగ్గరగా “వీణ్ణీ వదలొద్దు, చంపండి” అనరిచాడు. వాళ్లంతా ధృష్టద్యుమ్నుడి మీదికి దూకారు. అతను ప్రమోహన బాణంతో వాళ్లని నిశ్చేష్టితుల్ని చేశాడు. భీముడు దాహం వేస్తుంటే వెళ్లి ఒక మడుగులో దప్పితీర్చుకున్నాడు.
అక్కడ ధృష్టద్యుమ్నుడు తప్పుకున్నాక ద్రుపదుడు ద్రోణుడితో తలపడ్డాడు. కాని ద్రోణుడి ధాటికి నిలవలేక పారిపోయాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడు వెళ్లిన వంక బయల్దేరాడు. దార్లో నిశ్చేష్టులై వున్న వాళ్లకి వినుతప్రజ్ఞా బాణంతో తెలివి తెప్పించి అందరూ కలిసి భీమ ధృష్టద్యుమ్నుల మీదికి కదిలారు. ఇదిచూసి ధర్మరాజు ఐదుగురు కేకయుల్ని, ద్రౌపదేయుల్ని, ధృష్టకేతుణ్ణి పిలిచి మీరు అభిమన్యుణ్ణి ముందుంచుకుని వాళ్లకి తోడుపడమని పంపించాడు. ఆ పన్నెండుమందీ వెళ్లి భీముడి దగ్గరకి చేరారు. ఇంకా ఇలా నేల మీదే నిలబడి యుద్ధం చెయ్యడం బాగుండదు, రథం ఎక్కమని భీముణ్ణి పంపాడు ధృష్టద్యుమ్నుడు.
ద్రోణుడు పాండవసైన్యం మీద విరుచుకుపడుతుంటే అతన్నెదుర్కున్నాడు ధృష్టద్యుమ్నుడు. ద్రోణుడతన్ని ముప్పుతిప్పలు పెట్టి రథం నుగ్గుచేస్తే అభిమన్యుడి రథం ఎక్కాడు. ఇంతలో ఇంకొక సారథి తెచ్చిన రథం మీద ఎక్కి మళ్లీ ద్రోణుడితో తలపడ్డాడు. భీముడు కూడ తన రథం ఎక్కి దుర్యోధనుడి మీద బాణాలేశాడు. ఐతే దుర్యోధనుడు తన తమ్ముల్తో కలిసి భీముణ్ణి పట్టుకుందామని చుట్టుముట్టాడు కాని అభిమన్యుడు, తక్కిన పాండవకుమార వర్గం వాళ్ల మీద దాడి చేశారు. తట్టుకోలేక నీ కొడుకులు పారిపోతే వాళ్లందర్నీ ఒకేసారి చంపే అవకాశం పోయిందని భీముడు బాధపడ్డాడు. అదిచూసి దుర్యోధనుడు భీముడితో తలపడ్డాడు. వికర్ణుడు, చిత్రసేనుడు అభిమన్యుడితో పోరాడారు. అభిమన్యుడు వికర్ణుడి రథం విరగ్గొడితే వాడు చిత్రసేనుడి రథం మీదికి దూకి ఇద్దరూ కలిసి అక్కణ్ణుంచి తప్పుకున్నారు. ద్రౌపదేయులు దుర్యోధనుడి మీద బాణాలు విసిరారు.
మరోవంక భీష్ముడు పాండవవ్యూహంలోకి చొచ్చుకుపోయి వీరవిహారం చేస్తుంటే అర్జునుడతనికి అడ్డుపడ్డాడు. ఇద్దరికీ ఘోరసమరం జరిగింది. ఇంతలో మధ్యాన్నం అయింది.
భీముడెలాగైనా సరే ఇవాళే దుర్యోధనుణ్ణి చంపాలని అతని మీద అనేక బాణాలు ప్రయోగించి గాయపరిచాడు. దుర్యోధనుడు మూర్ఛపోయాడు. అదిచూసి సైంధవుడు తన సైన్యంతో వచ్చి భీముణ్ణి చుట్టుముట్టాడు. కృపుడు దుర్యోధనుణ్ణి తన రథమ్మీద దూరంగా తీసుకుపోయాడు. అభిమన్యుడు తదితరులు సైంధవుడితో తలపడ్డారు. అప్పుడు నీకొడుకులు అభిమన్యుడి మీదికి దూకితే వాళ్లకి సాయం చెయ్యటానికి అదివరకు విరథుడై పారిపోయిన వికర్ణుడు తిరిగొచ్చి అభిమన్యుడిని ఎదుర్కున్నాడు. అభిమన్యుడతన్ని నానాబాణాల్తో హింసించాడు. అదిచూసి మిగిలిన వాళ్లంతా అభిమన్యుడి మీదికి వెళ్తుంటే ద్రౌపదేయులు అతనికడ్డంగా వాళ్లతో తలపడ్డారు. ముఖ్యంగా నకులుడికొడుకు శతానీకుడు వీరవిక్రమంతో పోరాడాడు. రెండోవంక భీష్ముడు ప్రళయకాల కాలుడిలా పాండవబలాల్ని పరుగులు తీయించాడు. సాయంత్రమైంది. తన బలాల్ని మళ్లించుకుని శిబిరం దారి పట్టాడు భీష్ముడు.
--------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment