Thursday, December 27, 2018

తెలుగు భాషకి భవిష్యత్తులేదా?


తెలుగు భాషకి భవిష్యత్తులేదా?
సాహితీమిత్రులారా!

విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లనో, కాలేజీల్లో పండితులనో, మీరుగనక ఈమధ్యకాలంలో పలకరించి ఉంటే తెలుగు భాష ఎవ్వడికీ అక్కరలేనిదయ్యింది, తెలుగు భాషకి తెలుగు దేశంలోనే భవిష్యత్తు లేదు, తెలుగు భాష చచ్చిపోతున్నది, దాని బాగోగులు చూసే దిక్కులేదు, ప్రభుత్వానికీ పట్టదు, ప్రజలకంతకన్నా పట్టదు ఈ బాపతు విలాపాలు తప్పకుండా వినే ఉంటారు. అందాకా ఎందుకు? కాస్తోకూస్తో తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళు, లేదా అమెరికావచ్చి నాలుగు డాలర్లు వెనకేసుకున్న తరువాత అమాంతంగా తెలుగుమీద మమకారాన్ని ఉవ్వెత్తుగా యానాంలో ఉప్పెనల్లా పెంచేసుకున్నవాళ్ళు, అదే! డాక్టర్లో, ఇంజనీర్లో, ప్రొఫెసర్లో, ఎవరినైనా పలకరించి చూడండి సరిగ్గా ఇదే ధోరణి. తెలుగు భాషకి అరిచిచచ్చినా ఏ విధమైన భవిష్యత్తూ ఎక్కడా లేదు, మనం ఏదో “విప్లవాత్మక” మైన చర్య వెంటనే తీసుకోకపోతే మనభాష, “ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌” అని ప్రపంచప్రఖ్యాతి పొందిన మన మాతృభాష, పూర్తిగా చచ్చిపోతుంది అని ఒహటే గోల. చచ్చేదాన్ని పట్టుకొని వేళ్ళాడడం వెర్రితనం అనే వాళ్ళుకూడా లేకపోలేదు. వాళ్ళు పైకి అనరు, ఈ మమకారవాదులు గొంతుపిసికి చంపేస్తారనో, “ఆంధ్ర ద్రోహీ” అని దండోరా వేస్తారనో, భయం.

నిజం చెప్పద్దూ! నేను కూడా, మూడేళ్ళక్రితం వరకూ తెలుగు భాష చచ్చిపోతూన్నదనే భావనలో ఉన్నాను. చాలా భయపడి పోయాను కూడాను. అందుకని, తెలుగుని పునరుద్ధరించాలని ఏ వార్షిక సంతర్పణలో ఏ యాక్టర్‌ నోట విన్నా, ఏ సావనీరులో చదివినా విపరీతంగా బాధ పడిపోయేవాడిని. మనసు కుమిలి పోయేది. అయితే, మూడేళ్ళక్రితం నాకు జ్ఞానోదయం అయ్యింది.

మే నెల. రోహిణీ కార్తె. తలమాడ్చేసే మండుటెండలు. బట్టతలైతే చెప్పక్కర్లేదు, తలమీద చర్మం కరిగించేసే ఎండలు. దానికి తోడు నోరు పిడచగట్టుకు పోయేట్టు గాడుపులు. ఆ సీజన్‌ లో ఏలూరు వెళ్ళాం, నా బాల్యస్నేహితుడు సత్యం, నేనూ కలిసి. వెళ్ళిన రెండు రోజుల తరువాత ఏదో స్వచ్ఛంద సంస్థకి డిమాండు డ్రాఫ్ట్‌ పంపించాలసి వచ్చింది. పేరయ్యకోనేరు స్టేటుబ్యాంక్‌ బ్రాంచ్‌ ఆఫీసు కెళ్ళాం, మా ఇళ్ళకి దగ్గిరేకదా అని. (మెయిన్‌ ఆఫీసుకి జనం వెళ్ళడం మానేశారని కాబోలు, ఆ బ్రాంచ్‌ ఈ మధ్య మూసేశారట!) అక్కడ అందరితోపాటు లైనులో నించున్నాం.

అదేమి ఖర్మమో కాని, కష్టమర్లు పడగాపులు పడేచోట సీలింగు పంఖాలు వుండవు, ఉన్నా అవి తిరగవు. కష్టమరులు అంటే ప్రభుత్వంవారి నిఘంటువులో కష్టపడాలసిన మరులు అని కాబోలు. కటకటాల వెనకాల కూచున్న బ్యాంకు పనివారి నెత్తిమీద ఒక్కక్కడికీ ఒక్కక్క పంఖా! గట్టిగా “రయ్‌ రయ్‌ ” అంటూ మోతపెడుతూ తిరిగేస్తుంటాయి, బాబుగారు ఎలట్రీ ఇచ్చిన కొద్ది ఘడియలూనూ! చెమటలో తడిసిపోయిన ఒక అరఘంట తరువాత నా ఛాన్సు వచ్చింది. కటకటాల వెనకున్న పెద్దమనిషికి చెప్పాను, నా పని గురించి. ఆయనగారు ఒక ఊదా రంగు కాగితం ఇచ్చి “ఇది పూర్తి చేసుకు రా,” అని గసిరాడు. అక్కడే నిలబడి ఆ కాగితం చదవడం మొదలెట్టా. వెనకాల నించున్నాయన తన నుదిటిమీద చెమట నా మొహం మీదకి దులుపుతూ, నన్ను మోచేత్తో ఎడంపక్కకి తోసేస్తున్నాడు. పక్కకి తప్పుకున్నామో,లైనులో మన పొజిషను పోయినట్టే! మొదటిరోజు మొదటి ఆట సినిమా టికెట్ల కోసం పడే యాతన కన్నా అన్యాయం!

ఆయనగారి తోపిడి భరించలేక, పక్కకి జరిగా. మరి తప్పదుగా! ఈ కాగితంలో పూర్తిచెయ్యాలసిన వివరాలు మూడు భాషల్లో అచ్చు కొట్టారు. హిందీలో, తెలుగులో, దానికింద ఇంగ్లీషులోనూ! తెలుగులో రాసింది బెంగుళూరు లో అచ్చుకొట్టారేమో, తెలుగు అక్షరాలూ గుర్తుపట్టేట్టు లేవు. పోనీ, ఇంగ్లీషులో వున్నది చదువుదామనుకుంటే, అదీ అంతత మాత్రమే. ఇంగ్లీషు అచ్చులు ఏవీ సరిగా అచ్చవలేదు. నాకేమో మన రాజభాషలో బూతులు తప్ప ఇంకేవీ రావు, సరిగదా, ఆ దేవతల లిపి అసలే రాదు. వెనకాల గుమ్మందగ్గిర నించున్న మా సత్యంతోటి గట్టిగా అరుస్తూ అన్నాను, ” ఒరేయ్‌ ఈ కాగితం నేను చచ్చినా పూర్తిచెయ్యలేను. కాస్త, ఈ హిందీలో ఏడిసింది చదివి, పూర్తిచెయ్యి.” సత్యం, కేవలం రాజభాష మాత్రమే మాట్లాడే చోట కొన్నేళ్ళు ఉన్నాడు లెండి.

ఈ లోగా, నా బాధ అర్థం అయినట్టుంది, ఆపద్భాంధవుడిలాగా లేచి వచ్చాడు, ఒక పెద్దమనిషి, బ్రాంచ్‌ మేనేజర్‌ సీటులోంచి. ఎ. బి. చౌదరి అని ఆయన కూర్చున్న సీటు కెదురుగా బల్ల మీద నేమ్‌ ప్లేట్‌ ఉంది. ఆయనే ఎ.బి. చౌదరి గారయి ఉంటాడు. పేరేదయితేనే! నన్ను రక్షించడానికి వచ్చిన విష్ణుమూర్తి, ఆయన. ” మీరు ఇలా లోపలికి రండి సార్‌” అన్నాడు, ఆయన. మేమిద్దరం దబ దబ లోపలికి వెళ్ళాం. ఆయన బల్ల ఎదురుగా కుర్చీల్లో చతికిలబడ్డాం. పైన పంఖా తిరుగుతూన్నదేమో, “అమ్మయ్య” అంటూ సేదదీర్చుకున్నాం.

” మీది ఈ ఊరు కాదను కుంటా!” అన్నాడు ఆయన చిరునవ్వు నవ్వుతూ. వెంటనే నేను అందుకోని, “లేదండీ! మేము ఈ ఊరు వాళ్ళమే. దిబ్బ మీద హైస్కూల్లో చదువుకున్నాం కూడానూ!” అన్నాను, తడుముకోకుండా. మా సత్యం తలూపాడు, అవును, నిజమే అన్నట్టు. “ఆ కాగితం ఇల్లా ఇవ్వండి. నేను పూర్తి చేసిపెడతా,” అని అనంగానే గజేంద్ర మోక్షంలో పద్యాలు గట్టిగా పాడేద్దామనిపించిది. వెంటనే, ఆయనకి ఆ కాగితంతో పాటు డబ్బులుకూడా ఇచ్చేశాను. ఒక పదిహేనునిమిషాల తరువాత రసీదు తెచ్చి ఇచ్చాడు, మహానుభావుడు. “మా ఊళ్ళో వి. వి. చౌదరి మీకు ఏమవుతాడు?” అని అడుగుదామని, నాకు నోటి దాకావచ్చింది. కానీ వెంటనే తట్టింది, చౌదరి, శాస్త్రి, రెడ్డి, ఇవన్నీ కులం గుర్తులనీ, రావు లాగా ఎవడుపడితే వాడు తగిలించుకోటానికి అవి విభక్తిప్రత్యయాలు కావనీ! అంతే కాదు, ఆయనేమన్నా అనుకుంటాడేమోనని ఊరుకున్నా. థాన్క్స్‌ చెప్పి వెళ్ళబోయేముందు, ఆయన్ని ఆడిగాను, ” ఏమండీ, మాది ఈ ఊరుకాదేమోనన్న అనుమానం మీకు ఎందుకు వచ్చింది? మేము వేసుకున్నా బట్టలా?” ఆయన వెంటనే, “మీరు ఏమీ అనుకోకపోతే చెప్పుతా. మీబట్టలు కాదు. నిజం చెప్పాలంటే, మీ ఫారిన్‌ బట్టల కన్నా మోడర్న్‌ బట్టలు ఇక్కడ మాకాలేజీ కుర్రాళ్ళు వేసుకుంటారు. మీరు తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. అందుకని అన్నాను, మీరు ఈ ప్రాంతం వాళ్ళు కారా అని” అన్నాడు. అక్కడ నవ్వేసి ఊరుకున్నా.

ఆ తరువాత నాతెలుగు గురించి ఆ చౌదరి గారు అన్నది తలచుకుంటే సిగ్గేసేసింది. ఆయన అన్నమాటలకి అసలు అర్థం ఏమిటి? మనం మాట్లాడే తెలుగు, ఇప్పుడు, ఇక్కడి జనానికి తెలుగు కాదన్నమాట. అది తాతలనాటి తెలుగన్న మాట. సత్యాన్ని అడిగా. ఏరా! మనం మాట్లాడే తెలుగు అంత అన్యాయం అంటావా, అని. నీ తెలుగు స్వచ్ఛంగా ఉన్నది అన్నాడు గానీ ఛండాలంగా ఉన్నది అని ఆయన అనలేదుగదురా? అని ఓదార్చాడు. నిజం చెప్పద్దూ! వాడికీ కొంచెం అనుమానంగానే ఉన్నది. సాయంత్రం రాజుగారిని అడుగుదాం లే అని ఊరుకున్నా. ఇంట్లో మా తమ్ముడి కూతురు ని అడుగుదామనిపించింది కానీ, అది నన్ను ఎక్కడవేళాకోళం పడుతుందో అని ఊరుకున్నా. దానికి తెలుగులో బంగారు పతకంకూడా వచ్చింది, ఎం.ఎ. పరీక్షల్లో.

సాయంత్రం ఐదు కొట్టంగానే, రామా అండ్‌ కో గేటు దాటి, రాజు గారి ఇంటికి బయలు దేరా. ఇంకెవ్వరూ అక్కడ చేరక ముందే, ఆయన్ని నా తెలుగు గురించి అడుదామని. గేటు దాటంగానే రోడ్డు కుడిపక్కన సిమెంట్‌ స్తంభాల పైన కట్టిన సినిమా పోస్టర్లు, ఇవ్వాళ నన్ను ఆకర్షించాయి. ఆ పోస్టర్లు చాలారోజులనుంచీ ఉన్నాయి, ఎందుకో ఇవ్వాళ వాటిని చదువుదామనిపించింది. ఓ ఇరవై సినిమాపోస్టర్లున్నాయి, వరసగా. ఆ సినిమాల పేర్లు చదవడం పూర్తికాకముందే, చౌదరి గారు నా తెలుగు గురించి అన్న మాట నిజమేనేమో అన్న అనుమానం దృఢపడడం మొదలయ్యింది. ఒక్క సినిమా పేరుకూడా, మనకి అవగతమైన పరిథిలో లేదు. వరసగా చదివాను పేర్లు, గట్టిగా పైకి చదివినట్టున్నా, ఓ ఇద్దరు ఖద్దరు పెద్దమనుషులు నాకేసి ఎగాదిగా చూస్తూ మరి వెళ్ళారు కూడాను. అయినా సరే! మళ్ళీ మళ్ళీ చదివాను సినిమాల
పేరులన్నీ. చెప్పద్దూ!

ఇదీవరస!

ఎదురింటి మొగుడుపక్కింటి పెళ్ళాం, పరవాలేదు అది తెలుగేగదా అనుకుంటే, దాని పక్కనే ఉన్న పోస్టర్లు, ఆవిడ మా ఆవిడే!, ప్రేమకు వేళాయె రా!, ప్రేమించుకుందాం రా, అని. పోస్టరులన్నిటిమీదా అర్థనగ్నంగా పంచరంగుల్లో అమ్మాయిల బొమ్మలూ! చూడాలని ఉంది అని ఒక సినిమా పోస్టరు, దానిపక్కనే వినాలని ఉంది అని మరో పోస్టరు. ఇదేదో సినిమా పేర్లకి పోటీ పడుతున్నట్టు. పోటీ అన్నాను కదూ! కొంచెం ముందుకెడితే, ఊరికి సోగ్గాడు, ఊరికి మొనగాడు అని మరో రెండు
సినిమాలు. అక్కడితో అవలేదు. వాటిపక్కనే, యముడే నామొగుడు అని ఒక కొత్త సినిమా. దానికి పోటీగా కాబోలు, యముడికి మొగుడు. అక్కడితో ఆగలే! అత్తకి యముడుఅమ్మాయికి మొగుడు, హలో! యమా హలో! ఐ లవ్‌ యూ! అని సినిమాలు. మనకేమో మల్లేశ్వరి, పాతాళభైరవి, బంగారుపాప, పెద్దమనుషులు, భాగ్యరేఖ, పెళ్ళిచేసిచూడు, సీతారామకల్యాణం, భక్త పోతన, జడగంటలు, ఇల్లాటి పేర్లు అలవాటాయె! మరి ఇప్పటి సినిమాల పేర్లు మళ్ళీ చదవాలని అనిపించదూ, చెప్పండి. దీనికి తోడు, ఇంగ్లీషు నుంచి డబ్బు చేసిన సినిమాలు. నాకు తెలిసిన సినిమా, టైటానిక్‌ దాని తెలుగు డబ్బింగు, మేటినీ కూడా ఆడుతోంది, ప్రతిరోజూ! అప్పుడు నిజమేననిపించింది. మనకి సాహిత్యరంగంలో జోరుగా జరుగుతున్న విప్లవాలే కాదు; సినిమారంగంలో అంతకన్నా జరూరుగా వచ్చేస్తున్న వింత పరిణామాలు కూడా తెలియవూ, అని.

తిన్నగా, రాజుగారింటికెళ్ళాను. ఆయన ఏమీ అనకముందే, మనం టైటానిక్‌ తెలుగులో చూడాలి ఇవ్వాళ అన్నాను. “ఛ ఛ,” అన్నాడు ఆయన. “పైగా మీకు ఇల్లాటి చెత్త కోరిక పుట్టిందేమిటీ?” అన్నాడు. అని, ఊరుకుంటే బాగుండేది. “మీకు తెలుసో తెలియదో, ఈ మీ అమెరికా చెత్త సినిమా టైటానిక్‌ ఇండియాలో రెండే రెండు భాషల్లోకి డబ్బు చేశారు, హిందీ, తెలుగు! అరవంలోకి గాని, మళయాళంలోకి గాని, కన్నడంలోకిగాని, కనీసం బెంగాలీలోకి గాని, దీన్ని డబ్బు చెయ్యలేదు. వాళ్ళకి బాగా తెలుసు, డబ్బింగు చెత్త చూసి డబ్బు తగలేసుకునే జనం ఎక్కడున్నారో!” అంటూ ముగించాడు. ఇంత ఉపోద్ఘాతం తరువాత ఆయనతో చెప్పదలచుకోలేదు, ఎందుకు నేను ఆ సినిమా చూద్దామని అన్నానో.

మర్నాడు, మంగళవారం. ఎవ్వరికీ చెప్పకండా, మధ్యాన్నం తెలుగు టైటానిక్‌ మ్యాటినీ ఆట చూడటానికెళ్ళాను. అబ్బ! రిజర్వుడు క్లాస్‌ కి కూడా పెద్ద లైను. మొత్తం హాలు నిండిపోయింది. చాలామంది కాలేజీ పిల్లలు వచ్చారు, క్లాసులు ఎగ్గొట్టేసి! సినిమా మొదలయ్యింది. సినిమాహాలు కొత్తది. ఎయిర్‌ కూల్డ్‌ హాలు. సరౌన్డ్‌ సౌండుట. ఆ నేపథ్య సంగీతమ్‌ మోతెక్కి పోయి, చెవుడొచ్చినంత పని అయ్యింది. ఒక్క మాట అంటే ఒక్క మాట తెలుగు మాటలే ఒక్కటి కూడా సరిగ్గా బోధపడలేదు. నాపక్కన కూచున్న అబ్బాయిని సిగ్గు విడిచేసి మరీ అడిగేశా, తనకి అర్థం అవుతున్నదా అని. “మాటలకోసం ఎవడొస్తాడుసార్‌ అమెరికన్‌ సినిమాకి?” అన్నాడు. అదీ పాయింటే! ఇది డబ్బింగు లోపమేమో అని సర్దుకున్నా!

ఇంటికి వెళ్ళుతూవుంటే, అమోఘమైన ఐడియా వచ్చింది. మా అమ్మాయికి చెప్పి తెలుగు సినిమా విడియోలు తెప్పించి చూద్దామని. “సడెన్‌ గా మీకు తెలుగు సినిమాలు చూద్దామని ఎందుకు అనిపించిందీ?” అని అడిగింది. నాకు చెప్పక తప్పలేదు. బ్యాంక్‌ చౌదరి గారి కథ చెప్పాను. “పెదనాన్నా! ఆ విడియోల్లో బొమ్మలు సరిగా ఉండవు. అలికేసినట్టుంటాయి. మీకు కావలసింది మాటలేగా. మన ఇంట్లో బోలెడు టేపులున్నాయి. మాటలున్నవి, పాటలున్నవీనూ! పాటలు వినండి. బాగుంటాయి,” అని, దబ దబా టేపులు పెట్టిన సూట్‌ కేసు తెచ్చింది. ఆ పెట్టెలో రెండు వందల పైచిలుకు టేపులున్నాయి.

ఒక్కక్క టేపూ తీసి చూశా. సినిమాలపేరులు, పాటల మొదటిచరణాలూ రాసి కూడా ఉన్నాయి. అయితే వినడం ఏమంత తేలిక కాదు. “పాటల్లో మాటలు తెలియాలంటే, ఒక్కొక్క టేపూ పదిసార్లన్నా వెనక్కి తిప్పాలి,” అని నసుగుతూ ఉంటే, మా అమ్మాయి అందుకొని, “మన పక్కింటి సుదర్శనం గారి అబ్బాయి, నీకు సాయం చేస్తాడు, టేపు రికార్డరు తో! అతను నిరుడు తెలుగు బి. ఎ. ప్యాస్‌ అయ్యాడు. ఇక్కడ లోకలు తెలుగు పేపర్లో పని చేస్తున్నాడు,” అని అంది.

మర్నాడు సుదర్శనంగారి అబ్బాయి వచ్చాడు. పిచ్చాపాటీ మాట్లాడుకున్నాం. తెలుగు లో బి.ఎ. కదా అని, అతన్ని అడిగా! బాబూ! నీకు విశ్వనాధ గారి గురించి
ఏమన్నా తెలుసా, చదివావా, అని. “ఓ! కానీ ఆయన, మరీ క్లాసు సినిమాలు తీస్తాడు సార్‌ నంది బహుమానం అల్లాంటి వాటికోసం. మామూలు వాళ్ళకి ఆయన
సినిమాలు నచ్చవ్‌” నేను నోరు మూసుకున్నా. పాపం అతను టేపులు నాతో పాటు విని, సుమారు రెండువందల పైచిలుకు పాటలు రాసిపెట్టడానికి సాయం చేశాడు.

మచ్చు తునకలు, మీకు కొన్ని మాత్రమే “వినిపిస్తా!”

కిరాయి కోటిగాడు సినిమాలోంచి

కూడబలుక్కొని కన్నారేమో మీయమ్మా మాయమ్మా
మీయమ్మ నా అత్తో నా అమ్మ నీ అత్తో
నీ అత్త నా అమ్మో నా అత్త నీ అమ్మో… మంచి రిదిమ్‌ ఉన్నది కదూ!

మరి ఇదివినండి. అదిరిపోయే అంత్యప్రాస కోసం.

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ముద్దు
అమ్మమ్మో ఇద్దూ అథరాల తొలిముద్దు చూడాలని ఉంది అన్న సినిమా లోది.

ప్రేమికుడు నుంచి

మండపేట మలకపేట నాయుడుపేట పేటరప్‌
అచ్చంపేట కొబ్బరిమట్ట….. అని ఊళ్ళపేరులు చెప్పితే,

ఖైదీ నెం 786 లో

తోటకూర గోంగూర కొత్తిమీర కరేపాకు
బొమ్మిడాయిలు పీతలు పిత్తబరికెలు … కూరగాయలు, జంతువులూ! కాదేదీ కవిత కనర్హం అన్నాడు కదూ మహాకవి!

రౌడీ అల్లుడు లో

లవ్‌ మీ మై హీరో చలాకిముద్దు ఇస్తా రారో
కుషీగ కౌగిట్లొ మారో ఇంగిలీషు, రాజభాష కలిపేసి.

పోనీ శుభాకాంక్షలు అని పేరుగదా, ఈ సినిమాలో పాటలు విందామనుకుంటే,

ఓ పోరీ పానీ పూరీ బొంబాయి నారీ నువ్వే లే నా టాబూ టాబూ టాబూ
లౌలీగా స్నానం చేస్తూ కిస్మీ అంటే షేకైపోదా గ్లోబూ గ్లోబూ గ్లోబూ
చైనీసు లోటసు నీవూ టొమేటా సాస్‌ నేనూ
ఇది ఫాస్ట్‌ ముద్దుల కాలం టైం వేస్ట్‌ చేయుట ఘోరం…

ఇదిగో, దాని బాబులాంటి పాట, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో నించి.

పాపరా పాప్‌ టపరా టప్‌
ఊపరా ఊప్‌ షేప్రా షేప్‌.. . అంటే అర్థం ఏమిటో!

అల్లాంటిదే మజాకాకి మరోక్కటి! రిక్షావాడు సినిమా నుంచి. ఇది తారక స్థాయి కాబోలు!

చాక్‌ చిక్లెట్‌ షాక్‌ చాక్లెట్‌ జాం జాం జాక్పాట్‌
టిట్‌ ఫర్‌ టాట్‌ షూట్‌ యట్‌ సైట్‌ స్వీట్‌ ఆఫ్‌ ఫిట్‌

రూపుతేరా మస్తానా నీకు డేరా వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లీ కజ్య్జా
వాటేసుకోరాద ముద్దూ ముజ్య్జా
దగ్గిరయితే సిగ్గు పుట్ట దూరమైతే అగ్గిపెట్టె
ఇద్దరైతే నిద్దరయితా
హద్దుపేరా హద్దు పెట్ట ముద్దుమీద ముద్దు పెట్ట
అదరై అల్లరట్టా…

అదేసినిమాలోది, మరో కవిత.

నీ పెట్ట నాపుంజుని ముద్దెట్టుకోనా
నీపుంజు నాపెట్టని జోకొట్ట పోనా
చిక్కావె చేతుల్లో చెమ్మచేకోడీ
మోతెక్కిపోవాల చేసెయ్యి దాడీ
కౌగిట్లొ కరగాల నీలో నాలో వేడీ…

రిక్షావాళ్ళు ఇంత చవకబారుగా ఎక్కడ ఎప్పుడు మాట్లాడు తారు? రిక్షా సంఘాలు ఎందుకూరుకున్నాయో, ఆ యూనియన్‌ నాయకులకే తెలియాలి!

యముడికి మొగుడు అన్న సినిమాలో పాట వినండి.

అందం ఇందోళం అథరం తాంబూలం
అసలే చలికాలం వయసే జలపాతం… ఇది పోస్ట్‌ మోడర్న్‌ పాట కాదని ఎవరన్నా అనగలరా? ఒప్పుకోరూ? మరి రావోయి చందమామ లోది, ఈ పాట కనీసం అల్ట్రా మోడర్న్‌ అని అన్నా ఒప్పుకుంటారా లేదా?

నాకోసమె ఎల్లోరాలు నాకోసమె మంజీరాలు నాకోసమె ఎన్నో అందాలు
నాకోసమె చైనా వాలు నాకోసమె కొడైకనాలు నాకోసమె ఎన్నో అందాలు
అర్జంటుగా చూడాలి చిత్రాలు ఇంకా ఆనందమె రావాలి నాఇంటి వంక
హలో హలో హలో హలోహో…..

మరికొన్ని ప్రేమ కవితలు, ఇదే బాణీలో …

మెకానిక్‌ అల్లుడు లో

గుంతలకిడి గుండమ్మో గుండెల్లో గుబగుబ
చింతపిక్కల చిట్టెమ్మో షోకంతా లఫ టఫ…

బావగారు బాగున్నారా! సినిమా లోది, ఈ కింది పాట.

ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబు అదిరింది
అంకుల్‌ పుత్రుడా హలో అల్లుడా వరసే కుదిరిందీ, అని చెప్పితే, దాని తలదన్నింది, రౌడి ఇన్స్పెక్టర్‌ లో కవిత.

పాపా పాపా పండిస్తావా మాపటివేళకి ముద్దిస్తావా
వారెవా యెస్సయ్యో పరేషాన్గుందయ్యో

ప్రేమించుకుందాం రా అన్న సినిమాకి పేరుకి తగినట్టుగా ఈ పాట,

మేఘాలే తాకిందీ హాయ్‌ హై లెస్సా
నవరాగంలో పలికిందీ మోనాలీసా…,

జగదేక వీరుడు అతిలోకసుందరి లోది, వినండి.

అబ్బనీతియ్యనీ దెబ్బ ఎంతకమ్మగావుందిరోయబ్బ
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటె వారెవ్వా
పురుషులలోన పుంగవా పులకింతొస్తే ఆగవా?

దీన్ని మించింది, అల్లుడా మజాకా సినిమాలో,

చిన్న పాపకేమో చీరకాస్త చిన్నదాయరా
పెద్దపాపకేమో పైటకాస్త పెద్దదాయెరా
చూడలేకపోతున్నా ఆగలేక చస్తున్నా…

అని వాడు చస్తూంటే, చూడండి అడివిరాముడు హీరోయిన్‌ ఏమంటున్నదో!

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె
కోకెత్తుకెళ్ళింది కొండగాలి
నువ్వు కొంటే చూపు చూస్తుంటే చలీ చలీ…

ఇక వరసగా, హలో బ్రదర్‌ , ముద్దుల ప్రియుడు, పెద్దన్నయ్య, చిన్నల్లుడు, తొలిముద్దు సినిమాల నుంచి

కన్నె పిల్లరో కన్నుకొట్టరో ఓ ఓ ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ ఓ ఓ
బుచ్చిబుచ్చిగా రెచ్చగొట్టరో
రెచ్చరేగితే పిచ్చిపట్టెరో…

నాకేగనక నీతోనె గనక పెళ్ళయితె గనక
త్త త్త త్త త్తర్వాత ఏమిచెయ్యాలి
క్క క్క క్క కాముడిని కాస్త అడగాలి
అయితేగనక కాదన్ను గనక ఓ పెళ్ళీకొడకా
మ్మొ మ్మొ మ్మొ మోజులమోత మోగాలి
గ్గ గ్గ గ్గ గాజుల గోల జరగాలి
ఆహా ఓహో అంటూ ఉంటే వింటున్న వాళ్ళు వేడెక్కి పోవాలి….

ఓ ముస్తఫా నీముద్దబంతి బుగ్గమీద ముద్దు పెట్టనా
దిలేదిల్రుబా నీ కన్నెలేతమొగ్గలన్నీ రాలగొట్టనా
ఓ ముస్తఫా నీముద్దబంతులాటలింక కట్టిపెట్టవా
కిస్కిస్తఫా నీకుర్రకారు కిందినించి కిందపెట్టనా
ఓ యమ్మో ఒళ్ళంతా వయ్యారాలు
వద్దన్నా కవ్వించే సింగారాలు…

కుర్రాడు బాబోయ్‌ కుంపటెట్టినాడు
పిల్లాడు బాబోయ్‌ గిల్లిపెట్టినాడు
పరికిణి పావడ పరువపు ఆవడ రుచిమరిగిన మగడా
విరహపు వీరుడ రసికుల సోముడ విరువకు విరుల జడా
అమ్మాయి బాబోయ్‌ అందమైన పిట్ట
బుజ్జాయి బాబోయ్‌ బుజ్జగించుకుంట
కలిగిన పోకడ వలపుల రాకడ తెలిసెను చెలి గురుడా
నున్నని నీమెడ వెన్నెల మీగడ చెలిమికి చెరుకుగడా…

వన్నెలాడి హే హే గిన్నెకోడి
దమ్ములుంటే కాస్కో కన్నె కేడీ
టింగుటిల్లా ఆవుమల్లా
హుషారు బ్రేక్‌ షేక్‌ డాన్స్‌ లో నా
కథాకళిని నేను మిక్స్‌ చేస్తా
ఇట్‌ ఈజ్‌ చాలెంజ్‌ యువర్స్‌ డాన్సె
ఐ ఆమ్‌ ఎ షోకింగ్‌ డోంట్‌ టేక్‌ చాన్సె
డిస్క్‌ బాబు హేహే రెచ్చిపోకు ఓ డిస్క్‌ బాబు….

ఈ అమెరికా తెలుగువాడు తెలుగుదేశంలో తెలుగు సినిమారంగంలో వస్తూన్న విప్లవ సంచలనం గురించి తెలిసీ తెలియకుండా తెలుగు సినిమాలని విమర్శిస్తున్నాడని సీనియర్‌ రచయితలు, సీనియర్‌ విమర్శకులూ నన్ను ఆడిపోసుకోకముందే, చెప్పితీరాలి. బ్యాంకు చౌదరి గారు మొహమాటం కొద్దీ “మీరు స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతున్నారు,” అన్నాడు. నిజానికి, మీ తెలుగు తాతలనాటి తెలుగు అనీ, అది ఎప్పుడో చచ్చిపోయిందనీ అనడానికి బదులుగా! అందులో సందేహం లేదు, ఒప్పుకోక తప్పదు. సినిమాల సంగతి పక్కన పెట్టండి.

ఇక దిన పత్రికల్లో తెలుగు చూస్తే, సంస్కృత పండితుడు కూడా చదవలేడు, తత్తత్త, మెమ్మెమ్మె అని నట్టుకోకండా చదవలేడు, అదేదో పాటలో లాగా! అర్థం సంగతి సరేసరి! సంపాదకీయాలు ఎవ్వరూ చదవరనే ధైర్యం కాబోలు, చూడండి,

“సంస్కరణల సంస్మరణలతోనే వ్యవస్థీకృత అవ్యవస్థ మటుమాయం కాదు.” “నల్లధన ప్రవాహాల్లో ప్రజాతంత్ర స్ఫూర్తి.”

ఇక మకుటాలు, బైలైనులు గురించి చెప్పక్కర లేదు. “అక్షర రెప రెపలు, ఆశావహ ఫలితాలు.” “పార్లమెంటు పొలిమేరల్లో సెగ, భారత్‌ తొలిబాణం భుగ.” “సంఘర్షణల ఆనవాళ్ళివి, సరిహద్దు ఉద్రిక్తతల సంకేతాలివి.”

మీకూ నాకొచ్చిన సందేహమే వస్తూన్నది కదూ? సినిమాలవాళ్ళు పేపర్లు చూసి పాటలు రాస్తున్నారా? పేపర్ల వాళ్ళు సినిమాలు చూసి వార్తలు రాస్తున్నారా? అని.

కలభాషిణి మాటల్లో సంగీతం, కంకుభట్టు పద్యంలో ఆవేదనా, లేకపోతే వరూధిని విరహ వేదనా, … ఇదే తెలుగు సుమా అని అనుకునే వాళ్ళకి, తెలుగు చచ్చిపోయినట్టే లెక్క! తెలుగుకి భవిష్యత్తు లేదు అని వాళ్ళు అనుకోవడంలో విచిత్రమేమీ లేదు.

నిజం నివురుగప్పిన నిప్పులాంటిది. మీరు ఎన్ని రకాల స్టాటిస్టిక్కుల లెక్కలు కట్టి ఎంతచెప్పండి, ప్రయోజనం లేదు. తొమ్మిది కోట్లజనం ఎడతెరపి లేకండా ప్రతి ముప్ఫై ఆరుగంటలకీ ఒక కొత్త తెలుగు సినిమాని అందులోవచ్చే పాటలనీ మాటలనీ పోషించుతూ ఆనందిస్తూ వుంటే, తెలుగు చచ్చిపోవడం ఏమిటి?

ఇలా విప్లవాత్మకంగా, ప్రగతిపథంలో ముందుకు ముందుకు తోసుకొ పోతూన్న తెలుగుకి ఢోకాలేదు. అది అసలు నిజం. మనం నిశ్చింతగా నిద్ర పోవచ్చు.
----------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: