కట్టమంచి వారి “కవిత్వతత్వ విచారం”
సాహితీమిత్రులారా!
గత శత వసంతాల తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని గురించి ఆలోచించేటప్పుడు మొట్టమొదట మనసులో మెదిలే కొద్దిమంది వైతాళికుల్లో కట్టమంచి రామలింగారెడ్డి గారొకరు. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం, అంటే 1899లో రామలింగారెడ్డి గారు 20వ శతాబ్దంలో రాబోయే సాహిత్యానికి దారి చూపారు. 1899లో తన 19 సంవత్సరాల వయస్సులో వారి రాసి ప్రచురించిన “ముసలమ్మ మరణము” తెలుగు కవిత్వంలోకి కొత్త ఆలోచనను ప్రవేశపెట్టింది. నూటికి నూరుపాళ్ళు ఆధునిక కావ్యం కాకపోయినా అది విషాదాంత కథనూ, ఆధునిక ఇతివృత్తాన్నీ తెలుగు కవిత్వంలోకి ప్రవేశపెట్టింది. అదే సంవత్సరంలో రెడ్డి గారు మద్రాసు క్రైస్తవ కళాశాల ఆంధ్ర భాషాభిరంజనీ సంఘం వారి సమావేశంలో కళాపూర్ణోదయాన్ని గురించి ఒక ఉపన్యాసాన్ని చదివారు. అది చిలకమర్తి లక్ష్మీనరసింహం, వేదం వెంకటరాయ శాస్త్రి, దర్భా సుబ్రహ్మణ్యం మొదలైన పండిత ప్రకాండుల మెప్పును పొందింది. ఇంగ్లండులో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని తిరిగివచ్చి, మైసూరులో ఆచార్యపదవిలో స్థిరపడిన తర్వాత అంటే 1914లో రామలింగారెడ్డి గారు దాన్ని విస్తృతపరిచి రాసి “కవిత్వతత్వవిచారము” అన్న పేరుతో ప్రచురించారు. ఆ గ్రంథం తెలుగుసాహిత్యాధ్యయనంలో కొత్త వెలుగును ప్రసరింప చేసింది.
19వ శతాబ్దం వరకు తెలుగు సాహిత్యరంగంలో సాహిత్యవిమర్శ లేదు. అంతేకాదు తెలుగులో సంస్కృతానికి భిన్నమైన సాహిత్యసిద్ధాంతం కూడా లేదు. దాదాపు ఏడువందల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో ఒక యుగాన్నో, ధోరణినో, కావ్యాన్నో పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ ఎవరూ విమర్శ రాయలేదు. కవుల చరిత్రలూ, వ్యాఖ్యానాలూ మాత్రమే సాహిత్యవిమర్శగా చెలామణి అవుతుండేవి. ముఖ్యంగా ఒక కావ్యాన్ని తీసుకొని అందులోని వస్తువునూ, రూపాన్నీ విశ్లేషిస్తూ, వాటి పరస్పర సామంజస్యాన్ని చర్చిస్తూ, ఆ కావ్య ఉద్దేశాన్ని నిరూపిస్తూ విమర్శలు రాసే సంప్రదాయం అప్పటికింకా ప్రారంభం కాలేదు. కవిత్వవిమర్శ మొత్తం కావ్యం ప్రాతిపదికగా కాకుండా ఒక పద్యమో శ్లోకమో ప్రాతిపదికగా సాగుతూ వచ్చింది. ఈ ధోరణికి స్వస్తి చెప్పి ఒక కావ్యాన్ని సమగ్రంగా విశ్లేషించే విమర్శకు రామలింగారెడ్డి గారు “కవిత్వతత్వవిచారం”లో బాటలు వేశారు. అంతేకాకుండా ఒక ధోరణి కవిత్వాన్ని చర్చించి విలువ కట్టే సంప్రదాయాన్ని కూడా వారే ప్రారంభించారు. ఈనాడు ఆబాట ఎంతో విశాలమైంది. ఆ బాటలో ఎందరో సాహిత్యవిమర్శకులు నడుస్తున్నారు. నడుస్తూ ఆ బాటను మరింత విశాలం చేస్తున్నారు.
ఇంగ్లండులో చదువుకుంటున్నప్పుడూ, ఆ తరువాతా రామలింగారెడ్డి గారు అంతవరకూ వచ్చిన పాశ్చాత్యవిమర్శను శ్రద్ధగా అధ్యయనం చేశారు. సమాజానికి, సాహిత్యానికి మధ్య ఉన్న లేదా ఉండవలసిన సంబంధాన్ని అవగతం చేసుకున్నారు. ఆ తరువాతనే వారికి భారతీయ అలంకార శాస్త్రం లోని అసమగ్రత తేటతెల్లంగా అర్థమైంది. రామలింగారెడ్డి గారు ఇంగ్లండులోనూ, ఇతర యూరోపియన్ దేశాలలోనూ పారిశ్రామిక విప్లవం సృష్టించిన పరిణామాలను గమనించారు. శతాబ్దులుగా కొనసాగిన ఫ్యూడల్ సంస్కృతి పతనం కావటం, దాని స్థానంలో అంతకంటె అభ్యుదయకరమైన బూర్జువా సంస్కృతీ, ప్రజాస్వామ్య భావాలూ ఆ దేశాలలో విస్తరించటం రామలింగారెడ్డి గారిని ఆకర్షించింది. అలాంటి ఫ్యూడల్ వ్యతిరేక ప్రజాస్వామ్య భావాలను తెలుగు సాహిత్య విమర్శలోకి ప్రవేశపెట్టాలని వారు “కవిత్వతత్వవిచారం”లో ప్రయత్నించారు. పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతం ప్రభావం అందులో ఉండటం చేత ఆ గ్రంథం అనేక ప్రతివిమర్శలకూ, అపవాదాలకూ గురికావలసి వచ్చింది. ఫ్యూడల్ సామాజిక విలువల్ని సాహిత్యంలో పరిరక్షించే ఒక చిన్న పండిత వర్గం వారిని తీవ్రంగా వ్యతిరేకించింది. కాని కొత్తదనం కోసం ఎదురుచూస్తున్న అసంఖ్యాక సాహిత్యాభిమానులు దాన్ని సాదరంగా ఆహ్వానించారు.
రామలింగారెడ్డిగారు “కవిత్వతత్వవిచారం”లో ప్రధానంగా కవిత్వతత్వాన్ని గురించి చర్చించారు. మంచికవిత్వం యొక్క లక్షణాలను చెప్పారు. విజయనగరయుగం తర్వాత తెలుగు కవిత్వం ఎందుకు పతనమైందో, ఎలా పతనమైందో చూపించారు. భారతకవుల్లోనూ, “కళాపూర్ణోదయం”లోనూ ఉన్న గొప్పతనాన్ని చూపించారు. గొప్ప కవిత్వ లక్షణాలుగా వారు భావించే కల్పనాశక్తికీ, కథనానికీ, పాత్రపోషణకూ, నాటకీయతకూ, అంగాంగ సమన్వయానికీ (యూనిటీ) “కళాపూర్ణోదయం” వారికి మంచి ఉదాహరణంగా కనిపించింది. ఆ కావ్యాన్ని కూడా రామలింగారెడ్డి మినహాయింపులు లేకుండా మెచ్చుకోలేదు. ఆరవ ఆశ్వాసంలోని 189వ పద్యం వద్ద కావ్యాన్ని ఆపి ఉండవలసిందన్నారు. పింగళిసూరన్న గారే రాసిన “ప్రభావతీప్రద్యుమ్నం”లోని చవకబారు శృంగారాన్ని తీవ్రంగా విమర్శించారు.
రామలింగారెడ్డిగారి అభిప్రాయం ప్రకారం కవిత్వానికి భావనశక్తి ప్రాణం. “భావనశక్తి అంటే కావ్యంలోని విషయాలు పాఠకుని మనస్సులో ప్రతిబింబించేటట్టుగా ప్రత్యక్షంగా అవతారమెత్తేటట్టుగా చేయగల శక్తి” అని వారే నిర్వచించారు. వ్యాకరణమూ, యతిప్రాసలూ, అన్నీ కుదిరినా భావనాశక్తిలేని పాండిత్యం జీవం లేని ఆకారంలాగా జడంగా కనిపిస్తుందన్నారు. భావనశక్తిలేని కావ్యాలను చదవటం వల్ల “నూనెకు నష్టియే కాని కవితకు పుష్టి లేదు” అన్నారు.
“ఆలోచనలూ, భావాలూ, సంకల్పాలూ” మానవప్రకృతిలోని మూడు ప్రధానాంశాలుగా రామలింగారెడ్డి గారు గుర్తించారు. వీటిలో “భావాలు” భావనాశక్తిని విజృంభింపజేస్తాయని వారు భావించారు. భావాలు లేకుండా కొయ్యల్లాగానో, మహర్షుల్లాగానో నిర్వికారంగా ఉన్నవారు “పద్యాలు” రాయవచ్చునేమో కాని “కవిత్వం” రాయలేరన్నారు.
భారతకవుల తర్వాత ఆలంకారికతే కవిత్వంగా చెలామణి అయిందని రామలింగారెడ్డి గారు భావించారు. మితిమీరిన ఆలంకారికతకు కారణం భావశూన్యత మాత్రమేనని వారు తెగేసిచెప్పారు. తెలుగుకవుల్లో ఈ బలహీనత లేని వారు భారతకవులున్నారు. మన కవుల్లో ఎక్కువమంది పండితులు మాత్రమేననీ వారిలో కార్యోత్సాహమూ, భావప్రాబల్యమూ చాలా తక్కువనీ అన్నారు. అందుచేతనే వారిలో భావనాశక్తి తగినంతగా అభివృద్ధి చెందటానికి అవకాశం లేకుండా పోయిందని రామలింగారెడ్డిగారు “కవిత్వతత్వవిచారం”లో గట్టిగా ప్రతిపాదించారు. అందుచేతనే చాలామంది మన ప్రాచీన కవులు పాండిత్యాన్నీ, ఆలంకారికతనూ ఆశ్రయించారన్నది వారి సిద్ధాంతం. మితిమీరిన పాండిత్య ప్రదర్శనా, ఆలంకారికతా రసదృష్టికి ఎలా ఆటంకాలుగా నిలిచాయో రామలింగారెడ్డి ఈ గ్రంథంలో సోదాహరణంగా నిరూపించారు.
ప్రాచీన అలంకార శాస్త్రం మనదేశంలో కవుల ప్రతిభకు సంకెళ్ళు వేసిందనీ, సాహిత్యం విభిన్నమార్గాలలో వికసించకుండా అడ్డుపడిందనీ రామలింగారెడ్డి గారి నిశ్చితాభిప్రాయం. నాయకులనూ, నాయికలనూ జాతులుగా విభజించిన అలంకార శాస్త్రాల్ని చాలామంది కవులు “అదే వేదమనుకొని, ప్రమాణమను పిచ్చిపట్టి” మానవస్వభావచిత్రణను నిరాదరించారని రామలింగారెడ్డిగారి అభియోగం. వారు కావ్యాలలో పాత్రచిత్రణ సహజంగా ఉండాలన్నారు. పాత్రల మనస్సులలో కలిగే భావోద్రేకాలు చిత్రించాలన్నారు. “పేడివారి తెగకు చెందిన మన వేదాంతులు” మానవుల సహజభావోద్రేకాలకు “మనోవికారా”లన్న పేరుపెట్టి నిరసించారని రామలింగారెడ్డిగారు తీవ్రంగా ధ్వజమెత్తారు.
మన సాహిత్యంలో అతి ఎక్కువగా ఉన్న పునరుక్తినీ, అతి తక్కువగా ఉన్న ఉపజ్ఞనూ మొదటిసారిగా తీవ్రంగా ఖండించిన వారు రామలింగారెడ్డి గారే. సమకాలీన వాస్తవ జీవితాన్ని తిరస్కరించటమూ, అలంకారశాస్త్ర గ్రంథాల ఆధిపత్యాన్ని తెలిసో, తెలియకో అంగీకరించటమూ, జీవితాన్ని గురించి మౌలికంగా ఆలోచించే సాహసం లేకపోవటమూ అందుకు ముఖ్యకారణాలని వారు చెప్పారు. శాస్త్రాలలో అంటే సైన్సుల్లో ఒకరు ప్రతిపాదించిన విషయాన్ని మరొకరు గ్రహించవచ్చనీ, అది పునరుక్తి అనిపించుకోదనీ రామలింగారెడ్డిగారి అభిప్రాయం. కాని సాహిత్యంలాంటి కళల్లో ఆ పద్ధతి పనికి రాదంటారు వారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వారు “ఏలనో మన కవులేనాటికీ రుక్మిణీపరిణయములూ, సుభద్రాపరిణయములూ వ్రాయుచుండిరి. వారు పెండ్లాడి, పెండ్లాడి అలసిపోయి ఉన్నారు. వారికి పింఛను ప్రసాదించకున్న నెంతయు ఘోరము” అని తీవ్రంగా విమర్శించారు.
కావ్యంలో వస్తువూ, రూపమూ రెండూ ముఖ్యమేనని, కథకు సంబంధం లేని వర్ణనలు విసుగును కలిగిస్తాయని, నిర్మాణసౌష్టవం లేని కావ్యం పాఠకుని తాకలేదనీ రామలింగారెడ్డిగారు చెప్పారు. తన సిద్ధాంతాలకు తగిన ఉదాహరణల్ని ఈ గ్రంథంలో చూపించారు.
“కవిత్వతత్వవిచారం” వచ్చిన కాలాన్ని (1914) దృష్టిలో ఉంచుకొని చూస్తే రామలింగారెడ్డి గారి అభిప్రాయాలు విప్లవాత్మకంగా ఉంటాయి. వారికి పూర్వం మన సాహిత్యాన్ని గురించి అంత మౌలికంగా ఆలోచించే సాహసాన్ని ఎవరూ చేయలేదు. కాని ఆ తర్వాత రామలింగారెడ్డిగారు అంతకంటె మరేమీ చేయలేకపోయారు. ఆ కాలంలోనే వచ్చిన భావకవిత్వం కాని, ఆ తర్వాత వచ్చిన అభ్యుదయ కవిత్వం కాని రామలింగారెడ్డి గారిని బలంగా కదిలించలేకపోయాయి. “కన్యాశుల్కం” గొప్పతనాన్ని గుర్తించటమూ, “తృణకంకణం” రాసిన రాయప్రోలును అభినందించటమూ చేశారు గాని ఆ ఉద్యమాల సారాన్ని పట్టుకోలేకపోయారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సుప్రసిద్ధ విమర్శకుడు రా.రా. ఇలా అన్నారు.
“కట్టమంచి వారు ప్రబంధ కవిత్వాన్ని అంతగా చెడతిట్టిపోసినా తెలుగుకవిత్వానికి ఒక దారీ తెన్నూ చూపించలేకపోయారు. తెలుగు కవిత్వానికి ఆయన చేసిన positive contribution ఏమీలేదు. ప్రబంధకవిత్వం 19వ శతాబ్దంలోనే చచ్చింది. ఆ శవానికి అంత్యక్రియలు చేసిన ఘనత మాత్రం రామలింగారెడ్డిగారికి దక్కింది. ఆ తరువాత వచ్చిన భావకవిత్వం దశ ఆయన ఊహకే తట్టలేదు. నిజానికి ఆయనది చారిత్రాత్మకంగా ముందుచూపు కాదు”
రా.రా. అభిప్రాయంలో సత్యం లేదనలేము కాని అది పూర్తి సత్యం మాత్రం కాదు. అంతేకాదు రామలింగారెడ్డిగారు మొదటినుంచీ చివరివరకూ పరమచాదస్తమైన గ్రాంధికభాషనే రాశారు. 1951 వరకు జీవించినా అభ్యుదయ శిఖరాలను కూడా వారు తలెత్తిచూడలేదు. కానీ వారు ప్రబంధ కవిత్వంలోని గతానుగతికత్వం నుంచీ, అలంకారశాస్త్రాల సంకెళ్లనుంచీ, తుఛ్ఛశృంగారం నుంచీ సాహిత్యజిజ్ఞాసువుల దృష్టిని భావనాశక్తి వైపుకూ, వాస్తవిక జీవితం వైపుకూ మళ్ళించగలిగారు. అలా వారు పరోక్షంగా కొత్త కవిత్వానికి దారి చూపారు. ఆ తరువాత వారు ఘనీభవించి పోవటానికి రెండు కారణాలుండవచ్చు.
మొదటిది సాహిత్యం రామలింగారెడ్డి గారికి ప్రధాన కార్యరంగం కాదు. “కవిత్వతత్వవిచారం” ప్రచురించిన కొద్దికాలానికే వారు రాజకీయాల్లో, విశ్వవిద్యాలయ పరిపాలనలో తలమునకలుగా కూరుకుపోయారు. ఇంగ్లీషులో రొమాంటిక్ కవితతో, విమర్శతో బాగా పరిచయం ఉన్న రామలింగారెడ్డి గారికి తెలుగులో భావకవుల పట్ల వైముఖ్యం ఉండటానికి అవకాశం లేదు.
రెండవ కారణం సాధారణంగా మానవుడు తాను ఎంతవరకు మారాడో అంతవరకు మాత్రమే మార్పును ఆమోదిస్తాడు. తన్ను దాటి వెళ్ళే మార్పుల్ని ఆమోదించలేడు. ఇది చాలామంది మేధావుల్లో కూడా ఉన్న బలహీనత. బహుశా ఈ బలహీనత రామలింగారెడ్డి గారిలో కూడా ఉందేమో!
“కవిత్వతత్వవిచారం” వచ్చిన కొత్తలో దాని మీద చాలా ప్రతివిమర్శలు వచ్చాయి. కాళూరి వ్యాసమూర్తి శాస్త్రి గారూ, అక్కిరాజు ఉమాకాంతం గారూ, నోరి నరసింహశాస్త్రి గారూ ఆ గ్రంథం మీద విరుచుకుపడ్డారు. వీరెవరూ రామలింగారెడ్డి గారు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పలేదు. వీరు రామలింగారెడ్డి గారు పాశ్చాత్యసులోచనాలతో తెలుగు సాహిత్యాన్ని చూస్తున్నాడన్నారు. రెడ్డిగారు పెద్ద పెద్ద పదవుల్లో ఉండటం చేత సాహిత్యంలో వారిమాట చెల్లుతోందన్నారు. కానీ కాలం వారిని పక్కకునెట్టి ముందుకు సాగింది. ఆనాడే విశ్వనాథ సత్యనారాయణ గారు “రామలింగారెడ్డి గారు తమ కవిత్వతత్వవిచారము రాసి విమర్శపదాల్లో గొప్ప దృక్పథం కలిగించి నవ్యసాహిత్యానికి కొత్తబోదెలు తవ్వారు” అన్నారు. ఈనాడు చే.రా. వంటి వారు “కాలానికి అవసరమైన విమర్శ కట్టమంచిది. కాలగమనం ఇష్టంలేక అన్నీ తాటాకుల్లోనే ఉన్నాయనే తత్వం ఆయన వ్యతిరేకులది” అంటున్నారు.
-----------------------------------------------------------
రచన: వల్లంపాటి వెంకట సుబ్బయ్య,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment