Friday, December 14, 2018

అక్షరమాలా పద్యములు


అక్షరమాలా పద్యములు





సాహితీమిత్రులారా!

వివిధ దైవ స్తోత్రములలో అక్షరమాలా స్తోత్రము ఒకటి. కొన్ని దేవతలపై అట్టి స్తోత్రములు గలవు. అద్రీశ జాధీశ అను పదములతో ప్రారంభమయ్యే మృత్యుంజయ స్తోత్రములో ప్రతి పంక్తి అ, ఆ, ఇ, ఈ ఇత్యాదులైన అక్షరములతో ప్రారంభమై క్ష-కారముతో అంతమవుతుంది. అక్షరములతో ప్రారంభించు పంక్తులకు బదులు అకారాది అక్షరములతో ప్రారంభమగు వృత్తములతో పద్యములను వ్రాయవలయుననే ఒక ఆలోచన నాకు కలిగినది. దాని ఫలితమే ఈ ప్రయత్నము. ఇందులో అ-కారమునుండి హ-కారము వఱకు ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క వృత్తము ఉన్నది. ౠ, ఌ, ఙ, ఞ, ణ, ళ అక్షరములు పరిగణించబడలేదు. ఎందుకనగా ఈ అక్షరములతో ప్రారంభమగు పదములు లేవు, ఉన్నను అవి చాల తక్కువ, అంతే కాక ఉపయోగములో లేవు. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, క, క్ష, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ట, ఠ, డ, ఢ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ఱ, ల, వ, స, ష, స, హ అక్షరములతో (ఏ గుణింతమైనను సరియే) ప్రారంభమగు వృత్తములను, జాత్యుపజాతులను నేను వాడినాను. ఈ మొత్తము 46 పద్యములు. ఇందులో ఐ, ఒ, థ, ఠ, ఱ అక్షరములతో ఏ వృత్తములు గాని, జాత్యుపజాతులు గాని లేవు. ఈ అక్షరములకు పద్యములను నేను సృష్టించినాను. వాడుకలో ఉండే పద్యములన్నిటికి చోటు నిచ్చుటకు ప్రయత్నించినాను. రెండు పద్యములు ఒకే అక్షరముతో ప్రారంభమయినప్పుడు (ఉదా. మత్తేభవిక్రీడితము, మత్తకోకిల) వాటి అన్య నామములను ఉపయోగించినాను (మత్తకోకిల – చర్చరీ, చంపకమాల – సరసీ, దుర్మిలా – ఘోటక, తోటక – ఛిత్తక). సీసపద్యమును షట్పదలో గర్భితము చేసినాను. సంస్కృత, తెలుగు భాషలనుండి మాత్రమే కాక కొన్ని పద్యములను ఇతర భాషలనుండి దిగుమతి చేసికొన్నాను (కన్నడమునుండి ఏల, ధవళము; మరాఠీనుండి ఓవి; హిందీనుండి ఝూలనా, డమరు). మొట్టమొదట అన్ని పద్యములకు ఉదాహరణములు ఇవ్వబడినవి. చివరి భాగములో అన్ని పద్యములకు యతి గణాదులను తెలిపియున్నాను. కొన్ని పద్యముల ఛందస్సు గుఱించి నా సూచనలను అంతములో నిచ్చినాను. పాఠకులకందఱికి నా ఈ చిన్ని ప్రయత్నము నచ్చుతుందని భావిస్తున్నాను.

1) అశ్వధాటి –

శ్రీనందసూనుఁ గన – నానంద మయ్యె నొక – గానమ్ము లేచెను గదా
తేనెల్ స్రవించె నిఁకఁ – బానమ్ము సేయఁగను – వీనుల్ జలించెను గదా
వేణూరవమ్ములకు – వీణాస్వనమ్ములను – నేనిందుఁ గూర్చెదనుగా
తానాన తానతన – తానాన యంచుఁ జిఱు – ప్రాణమ్ముఁ జేర్చెదనుగా

2) ఆటవెలఁది –

శ్రీసరస్వతీ వి-రించి హృదయరాణి
భాసురమ్ము చేయు – భవము వాణి
హాస మొలుకు దేవి – యనురాగముల తల్లి
ఆసపడెదఁ గరుణ – కమృతవల్లి

3) ఇంద్రవజ్ర[1] –

రాజాధిరాజా – రవివంశతేజా
రాజీవనేత్రా – రమణీయగాత్రా
నా జీవధారా – నవజీవసారా
యీ జన్మ నీదే – యిహమంత నీదే

4) ఈశ –

జగదీశ్వరా మహేశా
నగజాపతీ గణేశా
త్రిగుణాత్మకా సురేశా
భగవత్స్వరూప యీశా

5) ఉత్పలమాల[2]–

కూరిమి నిండె నీ నెలఁత – కోమలికిన్ నినుఁ గోరఁగా సఖా
నారికి గుండెలోఁ గొలువ – నామ మగున్ స్మరణమ్ముకై సదా
వారుచుఁ బండు నా వలపు – స్వామి కృపన్ మురిపమ్ములౌ గదా
భీరువు కండ రా యలర – ప్రేమమయా లలి పెంచఁగా హరీ

6) ఊర్వశి –

ప్రియతమా చూడ రా – ప్రేమతోఁ గూడ రా
భయముతో నుంటి నే – బాధలన్ బాప రా
హయముపై వచ్చి నన్ – హాయిలో ముంచ రా
శ్రయము నీవేగదా – శ్యామ నవ్వించ రా

7) ఋషభగజవిలసిత –

వేణువు మ్రోఁగుచుండెఁ – బ్రియముగ నవనవమై
ధేనువు లాఁగకుండెఁ – దిరుగుచు నటునిటులన్
మానస మూఁగుచుండె – మధురత కనుగతమై
హా నినుఁ జూడకుండ – హరుసము గలుఁగదుగా

8) ఎత్తుగీతి –

ఈ హృది చిన్న దిచట
నీ హృది పెద్ద దచట
రా హృత్కమలము విరియ
సౌహార్దపు సుధ కురియ

9) ఏల –

ఏల నీవిట్లు యీ – బేల నన్నిట వీడి
చాల సేపుంటి వీవేళ
మాలి రావేల నా – కేల బట్టంగ గో-
పాలకా వేగ మీవేళ

10) ఐశ్వర్య –

ఇల నాకు నైశ్వర్య – మెప్పు డీవే
వలరాజు తండ్రి నా-వైపు నీవే
యలరారు నా మన్కి – కర్థ మీవే
శిలయైన రూపంపు – జీవ మీవే

11) ఒయ్యారి –

తెలతెల మేఘము – తేలుచు నింగినిఁ దోఁచె
మెలమెల గాలియు – మృదువుగఁ జల్లగ వీచె
ఉలుకుచు భావము – లొయ్యార మొలుకుచు లేచె
పలుకవె బంగరు – భామరొ మనసిట వేఁచె

12) ఓవి –

కానంగ సూర్యుని నీ యుషస్సు
ఆనందమైనది నా మనస్సు
ఆ నందగోపాలుఁడే తపస్సు
ఈ నాకు లేదు తమస్సు

13) ఔపచ్ఛందసిక (పుష్పితాగ్ర) –

కమలనయన – కాలమాయె గాదా
కమలుచు నుంటిని – కళ్ల జూడ రాదా
భ్రమల వలకు – బాగ చిక్కికొంటిన్
విమలుని ప్రేమకు – వేగ వేఁగుచుంటిన్

14) అంబుదావళి –

గగనమ్ములోనన్ – గన నంబుదావళిన్
నగధారి నాకున్ – నగుమోముతో లలిన్
అగుపించెఁ గాదా – యలరంగ డెందముల్
జగమెల్ల వాఁడే – జనియించె నందముల్

15) కందము –

సుందర చిత్రము గీచెను
సందె వెలుఁగులందుఁ బ్రకృతి – జ్వలియించంగా
స్కందా వెదుకుచు వేఁగుచు
సుందరవల్లి యిట నిన్ను – జూడఁ దపించెన్

16) క్షమా –

వెలుఁగుచు మెఱయున్- విశ్వమం దందమై
బులకల నిడు నీ – భూమి నా తల్లిగాఁ
దలతును మదిలో – తథ్యమై నిత్యమున్
సలుపుదు నఘముల్ – చాల మన్నించుమా

17) ఖజన[3] –

ఎందుకో మోసపో-యేను యీ రీతిగా – నిందువై చల్లఁగా – యిప్పుడే వాఁడు నా
ముందు రాఁడెందుకో – ముచ్చటల్ దీరఁగా – మోముపైఁ దీయగా – ముద్దిడన్ లేఁడుగా
సుందరుం డా హరిన్ – జూఁడగాఁ గోరితిన్ – సొంపులన్ జక్కఁగా – జూపఁగా నుంటిఁగా
నందగోపాల యా-నంద మీయంగ రా – నవ్వుతోఁ బువ్వులా – నన్నుఁ దాకంగ రా

18) గరుడరుతము –

గరుడరుతమ్ములన్ వినఁగ – కంజనేత్రుండు సం-
బరముగ నేఁగుదెంచెనని – బర్హిపింఛమ్ములన్
గరముల నుంచి వానిఁ గనఁ – గాంక్షతో నేఁగఁగా
వరదుఁడు గానరాఁడుగద – వంతలఁ గ్రుంగితిన్

19) ఘోటక[4]–

కమలాక్ష ననున్ – గనికారముతోఁ – గనరా యిపుడే – కడు వేగముగా
అమలానన నీ – యమృతాంబుధిలో – నలగా ననుఁ జే-యర యందముగా
సుముఖమ్ముగ నీ – సురగానములో – శ్రుతిగీతమునై – సుఖ మొందెదరా
రమణీయముగా – రసరాసములో – రజనిన్ వ్రజమున్ – రవ మయ్యెదరా

20) చర్చరీ –

నిన్ను జూచిన యా క్షణమ్మున – నేను వేఱుగ మారితిన్
గన్ను మూసినఁ గన్ను విప్పినఁ – గంటి ముందర నీవెగా
వన్నెచిన్నెల వెల్గు రూపము – వహ్ని నింపెను నామదిన్
ఖిన్న నైతిని కన్నె నేనిటఁ – గృష్ణమోహన రమ్మురా

21) ఛిత్తక[5] –

మధుసూదన రా – మనమోహన రా
యదునందన రా – అహినాశన రా
మధురాపతి రా – స్మరసుందర రా
మధురమ్ముగ రా – మది నిత్తునురా

22) జయా –

గగనమ్ములోనఁ – గనకప్రభారుచుల్
సొగసైన చిత్ర – సుషమమ్ము నెవ్వరో
మిగులన్ రచించి – మెఱయంగఁ జేసిరో
భగవంతు వాని – పదధూళిఁ గోరెదన్

23) ఝూలనా[6] –

ఉయ్యాల లూగంగ – సయ్యాట లాడంగ – నెయ్యమ్ముఁ జూపంగఁ – జయ్యంచు రా
అయ్యారె నీయొక్క – కయ్యాలఁ జాలించి – తియ్యంగ ముద్దీయఁ – జయ్యంచు రా
ఇయ్యకొని పలుకుమా – వ్రయ్యు నా హృదయమ్ము – కొయ్యవలె మాఱకను – జయ్యంచు రా
వెయ్యి దివ్వెల వెలుఁగు – నియ్య నీ వదనమ్ము – నెయ్యివలె కరుగు మది – చయ్యంచు రా

24) టంకణము –

నీవె నా గళము – నీవె నా ఫలము – నీవె నా బలమురా
నీవె నా కరము – నీవె నా వరము – నీవె నా స్వరమురా
నీవె నా తలఁపు – నీవె నా వలపు – నీవె నా కలలురా
నీవె నా విరులు – నీవె నా సిరులు – నీవె నా మరులురా

25) ఠారా –

దిశ లెల్ల నవనూత్న – దీప్తితో నిండెఁగా
శశినిఁ గన మనసొక్క – సంద్రమై లేచెఁగా
నిశివేళ నిను వీడి – నేను వేఁచేనుగా
వశమయ్యె నా హృదియు – వంశికిన్ మోహనా

26) డమరు –

శివుఁడన మన సొక గుడియగు నిజముగ – శివుఁడన జగమది శివమయ మగుఁ గద
భవుఁడన భవ మది నవమగు నిజముగ – భవ మది సుఖముల శుభమయ మగుఁ గద
భవమున హర యనఁ గలతలు తొలగుఁగ – భయహర మవ మది భ్రమములు తొలగుఁగ
భువియును దివమును డమరుక రవముల – మొరయుఁగ శివసతి నటనల కనువుగ

27) ఢుంఢి –

కరిరాజాస్యమ్ము
వరదా నా యిమ్ము
వరడుంఢీ రమ్ము
వరముల్ నాకిమ్ము

28) తేటగీతి –

నిదుర బోయేను నిశిలోన – నేను డస్సి
యదను నీకాయె నప్పుడె – యరుగుదెంచ
నిదురలో నన్నుఁ జూచేవు, – నిముసమందు
వదలి వెళ్లంగ, మిగిలె నీ – పాదధూళి

29) థోడన –

అంబరమందున – నందపు రంగుల
సంబర మెల్లెడ – సందె వెలుంగుల
చుంబిత మాస్యము – సూర్యకరమ్ముల
నంబుజనేత్రుఁడె – యందము

30) దండకము –

ఓ దేవదేవా మహాదేవదేవా, త్రిలోకాధినేతా పునీతా సునీతా, చిదానందరూపా సదానందదీపా, విరాడ్విశ్వమూర్తీ వివేకానువర్తీ, సదాసత్యగామీ సుధాపానకామీ, రమాచిత్తలోలా రసోత్సంగశీలా, నవాంభోజనేత్రా నవోత్సాహగాత్రా, అశేషాఽవనీశా, అశుద్ధాత్మనాశా, విదోషా విశేషా విపాశా వినాశా, అమోఘప్రవాహా విమోహా అదేహా, విరాగా సరాగా సురాగా పరాగా, ముకుందా మురారీ ముదాబ్ధీ మునీంద్రా, సచిత్రా విచిత్రా సుచిత్రా పవిత్రా, అనేకార్థనామా హరీ పరంధామా, అనంతాంఽతరంగా, మహోత్తుంగశృంగా, మహాకాలతత్త్వా మహోత్కృష్టసత్వా, అచింత్యప్రమాణా ప్రభాభాసమానా, సునీలాంగరంగా సుధర్మప్రసంగా, మదిన్ నిన్ను దల్తున్ సదా నిన్ను గొల్తున్, హృదిన్ బూయు పూలన్ విధిన్ నీకె యిత్తున్, నిధుల్ నీవె నాకున్ నిజమ్మీవె నాకున్, పదార్థమ్ము నీవే స్వరార్థమ్ము నీవే, యధార్థమ్ము నీవే భవార్థమ్ము నీవే, ననున్ గావ వయ్యా నమో కృష్ణమూర్తీ, నమస్తే నమస్తే నమస్తే నమః

31) ధవళము –

పావనమగు శ్రీపతి పదముల
పావనియగు గంగ జనించెనుగా
పావనమగు మునుగఁగ జలముల
జీవనమున ముక్తి లభించునుగా

32) నందన –

విను యదునందనా మనసులోఁ – బ్రియమ్ముగా నుండి క్రొ-
న్ననల గ్రహించు సంతసముతో – నయమ్ముగా నిత్యమున్
గనుఁగొన సాధ్యమే మహిమలన్ – కళామయా కృష్ణమో-
హన నను గావుమయ్య కరుణన్ – హరించు నా పాపముల్

33) పంచచామర[7] –

అనాథనాథుఁ డీవెగా – ననంతమూర్తి నీవెగా
సునీతిశాలి నీవెగా – సునాదబిందు వీవెగా
మనోజవమ్ము నీవెగా – మనోజ్ఞరూప మీవెగా
వినోదశీలి నీవెగా – వినాయకుండు నీవెగా

34) ఫుల్లదామ –

నీ హాసమ్ముల్ నాకు – నిజము వరదా – నిత్యసంతోషముల్గా
నీహారమ్మై తోచె – నెనరు పదముల్ – నిక్కమై నిండె నాలో
మోహమ్మాయెన్ నాకు – ముఖముఁ గన నే – ఫుల్లదామమ్ము నైతిన్
దేహమ్మందున్ నీవె – తెలిసినది నా – దేమియున్ లేదాయెరా

35) బింబ –

ప్రాణ మ్మీవే నాకు – ప్రణయవరదా – ప్రార్థింతు నిన్నే గదా
తాన మ్మీవే యెప్డు – తపితహృదిలో – తల్లీన మౌదున్ సదా
గాన మ్మీవే పాఱు – గతుల వడిలోఁ – గంపించు రాగమ్ము నేన్
శ్రీనాథా రారమ్ము – చెలిమి జగతిన్ – శృంగార బింబమ్ము నేన్

36) భుజంగప్రయాతము[8] –

నభమ్మందు కాంతుల్ – నవమ్మైన శాంతుల్
ప్రభాతమ్మునందున్ – ప్రకాశమ్ము జిందున్
శుభోషస్సు దీప్తుల్ – సుఖానంద సూక్తుల్
విభూ వేగ రావా – విమోహమ్ము నీవా

37) మత్తేభవిక్రీడితము –

మధురమ్మైనది నీదు మాట లవి యా – మాణిక్య వీణాస్వరం-
బధరమ్మందునఁ దేనె పాట నుడు ల-త్యానంద రాగమ్ములే
మధురమ్మైనది నీదు రూప మది నన్ – మంత్రించె మాయాత్మకన్
మధురోత్సాహము గల్గె నిన్ను దలఁచన్ – మత్ప్రాణనాథా హరీ

38) యమునా –

అల యమునానది – యందమై సదా
గలగల పారఁగ – గంతులేయుచున్
సలలితరాగము – శ్యామలాంగుఁడున్
మెలమెలఁ బాడఁగ – మింటి నంటితిన్

39) రగడ –

నీకై నేనిట – నీవట నాకై
రాకాశశి యట – రాజిలె మనకై
నదిలో హాయిగ – నౌకాయానము
హృదయానంద – మ్మిచ్చుఁ బ్రయాణము
ముదముగఁ బాడుము – మోహన రాగము
పదముల నింపుము – వడి ననురాగము
నను పాలింపుము – నవ్వులు కురియఁగ
ప్రణయాశ్లేషము – ప్రాణము తరియఁగ

40) ఱింగు –

వాసుదేవా హరీ మాధవా – వందింతున్ నే నిన్
శ్రీసతీశా సఖా కేశవా – సేవింతున్ నే నిన్
రాసలీలావినోదప్రియా – ప్రార్థింతున్ నే నిన్
ధ్యాస నీవేగదా యెప్పుడున్ – ధ్యానింతున్ నే నిన్

41) లయగ్రాహి –

గాలి యతి మందమయె – నీల గగనాన శశి – నేలపయి వెన్నెలలు – తూలె నిల రేయిన్
పూలవనిలోనఁ బలు – లీలలను బాడఁగను – దేలుచును గోపికలు – వ్రాలి రట హాయిన్
ఆలు బలు యూగుఁగద – వ్యాళములు నూగుఁగద – బాలతతి యూగుఁగద – మేలములఁ గృష్ణా
చాల తడవాయె నిఁకఁ – గేలఁ మురళిన్ గొనుచు – లీలలను జూపు మిట – శ్రీలొసఁగఁ గృష్ణా

42) వసంతతిలక[9] –

దేవాధిదేవుని మదిన్ – దినమెల్ల గొల్తున్
శ్రీవేంకటేశుని హృదిన్ – సిరియంచు దల్తున్
నావైపు చూపుమ హరీ – నగుమోము కాంతుల్
భావింతు నే నిను సదా – భవసార మంచున్

43) శార్దూలవిక్రీడిత –

పారావారము గాదె జీవితము సం-బంధమ్ములన్ ద్రెంచ సం-
సారమ్మందు నసాధ్యమౌను భువిలో – సందేహమే లేదుగా
పారావారము దాట నావ నొక టీ-వయ్యా నినున్ జేరఁగా
శ్రీరంగేశ్వర శ్రీనివాస వ్రజనా-రీచిత్తహారీ హరీ

44) షట్పద[10] –

చాలించు మారాము
బాలగోపాలకా
చాలించు మాటలన్ – జక్కనయ్య
చాలించు మన్నతో
కేళికల్ కజ్జముల్
చాలించు మిఁకమీదఁ – జల్లనయ్య
చాలించు పెర యిండ్లఁ
బాలు త్రాగుట నీవు
చాలించు మెదిరింపు – చారుహాస
చాలించు మెదురీత
నీలనీరమ్ములో
చాలించు దౌష్ట్యమున్ – సారసాక్ష
చాలు నాటకములు
చాలు కపటములు
చాలు బూటకములు – శ్యామలాంగ
వేళ నిద్ర కిదియె
లాలి పాట వినుచు
పూల కనులు మూసి – పొమ్ము నిద్ర

45) సరసి –

నవసరసీరుహాక్షుఁడు, సు-నాదవినోదవిచారుఁ, డభ్రమం-
దవనతమైన మేఘముల – నందముఁ బొందినవాఁడు, గంధ నం-
దవనమునందు సుందర సు-ధామధురధ్వనిఁ జిందు వాఁడు, నా
కవనమునందు రాజిలుచుఁ – గామము లన్నియుఁ దీర్చు వాఁడెగా

46) హరిణీ[11] –

హరినిఁ దలచన్ – హ్లాదమ్మయ్యెన్ – హరించిపోయెన్ వ్యధల్
హరిణి దయతో – నానందమ్మై – హసించి యిచ్చున్ సుధల్
ఇరువురు సదా – యిష్టార్థమ్ముల్ – హితమ్ముగా నివ్వరే
సరసహృదయుల్ – చక్కంగా శా-శ్వతమ్ముగా నవ్వరే

పద్యపట్టిక
* స్వకపోలకల్పితము, U గురువు, I లఘువు, సూ – సూర్యగణము, ఇం – ఇంద్రగణము, చం – చంద్రగణము, చ – చతుర్మాత్ర, ప – పంచమాత్ర

1) అశ్వధాటి – త/భ/య/జ/స/ర/న/గ, ప్రాసయతి (UUI UIII) (UUI UIII) (UUI UIII U) 22ఆకృతి 1915509
2) ఆటవెలఁది – (సూ-సూ-సూ) (ఇం-ఇం) / (సూ-సూ-సూ) (సూ-సూ)
3) ఇంద్రవజ్ర – త/త/జ/గగ, (UUI UU) (IIUI UU) 11 త్రిష్టుప్ 357
4) ఈశ – స/జ/గగ (IIUI UIU U) 8 అనుష్టుప్ 44
5) ఉత్పలమాల – భ/ర/న/భ/భ/ర/లగ (UII UIU III) (UII UII UIU IU) 20 కృతి 35579
6) ఊ(ఉ)ర్వశీ (కౌముదీ )- న/త/త/త/గ (IIIU UIU) (UIU UIU) 13 అతిజగతి 2344
7) ఋషభగజవిలసిత – భ/ర/న/న/న/గ (UII UIUI) (IIII IIIIU) 16 అష్టి 32727
8) ఎత్తుగీతి – ఇం-సూ-సూ
9) ఏల – ప్రాసయతి (ఇం-ఇం) (ఇం-ఇం) / (ఇం-సూ-ఇం)
10) *ఐశ్వర్య – స/య/జ/గగ (IIUI UUI) (UIUU)11 త్రిష్టుప్పు 332
11) *ఒయ్యారి – (ఇం-ఇం) (ఇం-ఇం-సూ)
12) ఓవి – మొదటి మూడు పాదములు 6 – 15 అక్షరములు, నాలుగవ పాదము తక్కిన పాదములకన్న చిన్నది, మొదటి మూడు పాదములకు అంత్యప్రాస నియతము.
13) ఔపచ్ఛందసిక – (6 మాత్రలు, ర,య) / (8 మాత్రలు, ర,య)
అందులో పుష్పితాగ్ర (III III – UIU IUU) / (IIII UII – UUI IUU)
14) అంబుదావళి – స/య/స/జ/గ (IIUI UU) (IIUI UIU) 13 అతిజగతి 2764
15) కందము – (చ-చ-చ) / (చ-చ-చ) (చ-చ) బేసి గణముగా జ-గణము నిషిద్ధము, చివరి గణము UU లేక IIU, ఆఱవ గణము IIII లేక IUI
16) క్షమా (చంద్రికా, కుటిలగతి) – న/న/త/త/గ (IIII IIU) (UIU UIU) 13 అతిజగతి 2368
17) ఖజన (గంగోదకము, స్వైరిణీక్రీడన) – ర/ర/ర/ర/ర/ర/ర/ర (UIU UIU) (UIU UIU) (UIU UIU) (UIU UIU)
24) సంకృతి 4793491
18) గరుడరుతము (వాణినీ) – న/జ/భ/జ/త/గ (IIII UIU III) (UIU UIU) 16 అష్టి 19376
19) ఘోటక (దుర్మిలా) – స/స/స/స/స/స/స/స (IIU IIU) (IIU IIU) (IIU IIU) (IIU IIU) 24 సంకృతి 7190236
20) చర్చరీ (మత్తకోకిల, ఉజ్జ్వల, హరనర్తన, విబుధప్రియా, మల్లికామాల) – ర/స/జ/జ/భ/ర (UI UII UI UII) (UI UII UIU)
18 ధృతి 93019
21) ఛిత్తక (తోటక) – స/స/స/స (IIU IIU) (IIU IIU) 12 జగతి 1756
22) జయా (మంజుభాషిణీ, కనకప్రభా, నందినీ, ప్రబోధితా) – స/జ/స/జ/గ (IIUI UI) (IIUI UIU) 13 అతిజగతి 2796
23) ఝూలనా – (5, 5) (5, 5) (5, 5) (5, 2) మాత్రలు ప్రాసయతి (అశ్వధాటి దీని ప్రత్యేకత)
24) టంకణము – ర-న-ర-న- ర-న-గ, ప్రాసయతి (UI UIII) (UI UIII) (UI UIIIU) 19 అతిధృతి 241339
25) *ఠారా – (5, 5) మాత్రలు, ర/ర (ప-ప) (UIU UIU)
26) డమరు – 32 లఘువులు – (16 లఘువులు) (16 లఘువులు) అంత్యప్రాస
27) ఢుంఢి – స/త (IIU UUI) 6 గాయత్రి 36
28) తేటగీతి – (సూ-ఇం-ఇం) (సూ-సూ)
29) *థోడన – మొదటి మూడు పాదములు (ఇం-ఇం) (ఇం-ఇం), నాలుగవ పాదము (ఇం-ఇం-ఇం)
30) దండకము – త-గణ దండకము – వరుసగా త-గణములు, చివర ఒక గురువు
31) ధవళము – గంగాధవళము – నాలుగు పాదములు, బేసి పాదములు (6,4,4) మాత్రలు, సరి పాదములు (6,4,4,2) మాత్రలు
32) నందన – న/జ/భ/జ/ర/ర (IIII UIU IIIU) (IUIU UIU) 18 ధృతి 76720
33) పంచచామర (నారాచ, మహోత్సవ) – జ/ర/జ/ర/జ/గ (IUIUIUIU) (IUIUIUIU) 16 అష్టి 21846
34) ఫుల్లదామ – మ/త/న/స/ర/ర/గ (UUU UUI) (III IIU) (UIU UIUU) 19 అతిధృతి 75745
35) బింబ – మ-త-న-స- త-త-గ, యతి (1, 7, 13) (UUU UUI) (IIIIIU) (UUI UUIU) 19 అతిధృతి 149473
36) భుజంగప్రయాత (ఆదిదైవీ, అప్రమేయా) – య/య/య/య (IUU IUU) (IUU IUU) 12 జగతి 578
37) మత్తేభవిక్రీడితము – స/భ/ర/న/మ/య/లగ (IIUU IIU IUI IIU) (UUI UUIU) 30 కృతి 298676
38) యమునా (తతి, మాలతీ, వరతను) – న/జ/జ/ర (IIII UII) (UIUIU) 12 జగతి 1392
39) రగడ – మధురగతి రగడ – (చ-చ) (చ-చ) ప్రాస, అంత్యప్రాస
40) *ఱింగు – ర/ర/ర/మ/గగ (UIU UIU UIU) (UUU UU) 14 శక్వరి 147
41) లయగ్రాహి – భ/జ/స/న/భ/జ/స/న/భ/య ప్రాసయతి (UIII UIII) (UIII UIII) (UIII UIII) (UIII UU)
42) వసంతతిలక – త/భ/జ/జ/గగ (UUI UIIIU) (IIUI UU) 21 శక్వరి 2933
43) శార్దూలవిక్రీడితము – మ/స/జ/స/త/త/గ (UUU IIU IUI IIU) (UUI UUIU) 19 అతిధృతి 149337
44) షట్పద – మూడు ప్రాసయతులు (ఇం-ఇం) (ఇం-ఇం) (ఇం-ఇం) (ఇం-చం)
45) సరసి (చంపకమాల, ధృతశ్రీ, పంచకావళీ) న/జ/భ/జ/జ/జ/ర (IIII UIU III) (UII UII UIUIU) 21 ప్రకృతి 711600
46) హరిణీ (వృషభలలిత) – న/స/మ/ర/స/లగ (IIIIIU) (UUUU) (IUI IUIU) 17 అత్యష్టి 46112

కొన్ని సూచనలు
1. ఇంద్రవజ్రకు తెలుగులోవలె గాక తాళరీత్యా యతి నుంచినాను.
2. ఈ ఉత్పలమాలలో జలదము (కూరిమి నిండె నీ నెలఁత – కోమలికిన్), మణిభూషణము (నిండె నీ నెలఁత కోమలికిన్ – నినుఁ గోరఁగా), ద్రుతవిలంబితము (నెలఁత కోమలికిన్ – నినుఁ గోరఁగా), అంబా (కోమలికిన్ నినుఁ – గోరఁగా సఖా) వృత్తములు గర్భితమై యున్నవి.
3. ఖజన వృత్తపు పాదములో రెండు స్రగ్విణీ వృత్తపు పాదములు గలవు.
4.ఘోటక వృత్తపు పాదములో రెండు తోటక వృత్తపు పాదములు గలవు.
5. ఛిత్తక (తోటక) వృత్తమునకు యతి తెలుగులో తొమ్మిదవ అక్షరమువలె గాక, రెండేసి చతుర్మాత్రలు విఱుగునట్లు నేను ఉంచినాను.
6. ఝూలనా లయ అశ్వధాటివంటిదే. మాత్రాగణములతో అశ్వధాటిని వ్రాస్తే అది ఝూలనా అవుతుంది.
7. పంచచామరమునకు తెలుగులోవలె గాక పాదము రెండుగా విఱుగునట్లు ఒక అక్షరము ముందు ఉంచినాను.
8. భుజంగప్రయాతమునకు తెలుగులోవలె గాక పాదము రెండుగా విఱుగునట్లు ఒక అక్షరము ముందు ఉంచినాను.
9. వసంతతిలకమునకు యతిని తెలుగులోవలె గాక ఒక అక్షరము ముందు ఉంచినాను.
10. తెలుగులో ఒక షట్పద పాదము నేను వ్రాసిన మూడు చిన్న పాదములను కలిపితే వస్తుంది. షట్పదలో మూడు ప్రాసయతులనే నేను ఉంచినాను. చివరి యతిని సామాన్య అక్షరయతిగా భావించినాను. ఇందులోని ప్రతి షట్పద పాదము ఒక సీస పాదమునకు సరిపోతుంది. షట్పదలోని చివరి చంద్ర గణమును రెండు సూర్యగణములుగా చేయుటవలన ఇది సాధ్యము అవుతుంది. ఇందులోని చివరి రెండు పాదములు (చాలు నాటకములు … నుండి) ఆటవెలదికి సరిపోతుంది.
11. హరిణికి నేను సంస్కృతములోవలె (ఉదా. మందాక్రాంతము) రెండు యతులను ఉంచినాను.
----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: