Saturday, December 22, 2018

ఎందుకు రాయాలో అందుకే చదవాలి


ఎందుకు రాయాలో అందుకే చదవాలి




సాహితీమిత్రులారా!

బాపు, రమణ, శ్రీశ్రీ, చలం, విశ్వనాథ, జాషువ, కందుకూరి, గురజాడ, త్యాగరాజు, శ్యామశాస్త్రి, నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగ్గడ, అన్నమయ్య, శ్రీనాథుడు, పోతన, ఘంటసాల, సాలూరి రాజేశ్వరరావు, శ్రీపాద – కొ. కు. … మనకు అంతులేని జాబితా ఉన్న ప్రముఖ తెలుగు వ్యక్తులున్నారు! అది తెలుగు వారి అదృష్టం!

అందరూ మహానుభావులే! అందరూ తెలుగు సాహిత్య, సంగీత, సంస్కృతికి వన్నె తెచ్చినవారే! ఇలా మన భాషా, సంస్కృతుల్ని సుసంపన్నం చేసినవారందరికీ, అభినందన మందార మాలలు వెయ్యవల్సిందే! వారి సేవలను గుర్తుంచుకొని మన తరవాత తరాలకు చెప్పవలసిందే! అందుకు సందేహం లేదు!

కానీ, ఈ పనులన్నీ నివాసంలో ఉన్న తెలుగువారు చెయ్య గలుగుతారు, కొంత వరకు చేస్తున్నారు కూడా! అరిచి “గీ” పెట్టినా, ప్రవాసాంధ్రుల జీవితానుభవాలు నివాసాంధ్రులు అన్వయించుకోలేరు! అది కష్టం, అసహజం కూడా! ఒక ప్రముఖ నివాస ఆంధ్రుణ్ణి అమెరికాలో సత్కరించే సభలో, ఆయనతో పాటు సభా వేదికపై కూర్చుండే అవకాశం నాకొచ్చింది! సత్కార గ్రహీత, తన ఉపన్యాసంలో తాను గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా వచ్చి వెడుతున్నానని, కొంచెం గర్వంగానే చెప్పుకున్నాడు. అందులో తప్పు లేదు! కానీ, ఆ ప్రసంగంలో, ప్రవాస ఆంధ్రుల జీవితాలు నాకు తెలుసులే అన్న అర్ధం అనుమానం లేకుండా ధ్వనించింది! ఒక నివాస ఆంధ్రుడు, అమెరికాకి చాలా సార్లు వచ్చి వెళ్ళటం సంతోషింప తగ్గ విషయమే! అసలు విషయం ఏమిటంటే, ప్రవాసంలోని జీవితం తెలియాలంటే, ప్రవాసంలో బతకటంలో తప్ప వేరే దారి లేదు. నివాస ఆంధ్రుడు ఎన్ని సార్లు అమెరికాకి వచ్చి వెళ్ళినా, అమెరికాలో తెలుగు వారి జీవితాన్ని అర్ధం చేసుకోటం, వీలు పడదు.

ఎంతసేపూ తెలుగువారికి ఇష్టమైన ముద్ద పప్పు, గుత్తొంకాయ కూర, ముక్కల పులుసు రుచుల గురించేనా! అదృష్తవశాత్తు ప్రవాసాంధ్రులకి, ఈ రుచులతో పాటు, మరిన్ని రుచులు తెలుసుకొనే అవకాశం ఉంది! మరి, ఈ “కొత్త” రుచుల గురించి తోటి తెలుగు వారికి మనం చెపుతున్నామా? ఇప్పటి దాకా చెప్పకపోతే, ఇకనైనా చెప్పాలి!

ఈ మధ్య ఈమాటలో వచ్చిన, కొడవళ్ళ హనుమంతరావు గారు “జిం గ్రే” గురించి రాసిన వ్యాసం, కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి “హిందూస్తానీ సంగీతంలో ఘరానాలు” పై వ్యాసం వంటివి, నివాసాంద్రులు రాయగలరని నేననుకోను! అది నిశ్చయంగా, ప్రవాసాంధ్రులు మాత్రమే చెయ్యగలిగే పని. చెయ్యాల్సిన పని కూడా!

ఈమాట అంతర్జాతీయ వెబ్ పత్రిక! ప్రపంచంలో తూర్పున ఉన్న అటు ఆష్ర్టేలియా, జపాన్ వంటి దేశాలు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాక భారత్ లోని ఇతర రాష్టాలలోని తెలుగు వారు, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలు, ఐరోపా ఖండంతో పాటు, ఇటు పశ్చిమ దేశాల్లోనే పశ్చిమంగా ఉన్న ఉత్తర అమెరికా తెలుగు వారందరూ చదువుతున్న ప్రముఖ పత్రిక అన్న విషయం, దాదాపు పదేళ్ళుగా ఈమాట పాఠకుల అభిప్రాయాల వల్ల నిశ్చయంగా తెలుస్తోంది! ఒక్క ఉత్తర అమెరికాలోనే, విభిన్న రంగాలలో నిష్ణాతులైన తెలుగు వారు ఉన్నారు. మెడికల్ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, విద్యాలయాల్లో ప్రొఫెసర్లు, వ్యాపారవేత్తలు – ఇలా మరెన్నో రంగాల్లో ప్రవీణులైన తెలుగు వారున్నారు. వీరి జీవితాల్లో, అంతులేని వైవిధ్యం ఉంది! ఒక్క ఉత్తర అమెరికాలోనే ఇంత వైవిధ్యం ఉన్న తెలుగువారుంటే, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రతిభ, వైవిధ్యం ఊహించుకోటం కూడా కష్టమే!

ఉదాహరణకి, జపాన్ దేశంలో, ఆష్టేలియా ఖండంలో చెప్పుకో తగ్గ సంఖ్యలోనే తెలుగువారున్నారని వినికిడి. వీరి గురించి మిగిలిన ప్రవాసాంద్రులకి దాదాపు ఏమీ తెలియదని నేననుకొంటున్నాను!

అప్పుడప్పుడు ఈమాట కోసం నేను రాసిన వ్యాసాలు, మొన్న మొన్ననే అమెరికాకి చదువుకోసం వచ్చి, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న మా అన్నయ్య కొడుక్కిచ్చి, చదివి అభిప్రాయం చెప్పమన్నా! నేనేదో గొప్పగా రాస్తున్నానని కాక, నా వ్యాసాలపై మావాడి అభిప్రాయాలు తెలుసుకుందామని నా ఆశ! ఒకటి, రెండు వారాల తరవాత అడిగా! “ఏరా ఎలా ఉన్నాయి నా వ్యాసాలు” అని. నవ్వుతూ, “ఇంకా చదవలా బాబాయ్” అని సమాధానం! రెండు నెలల తరవాత ఏదో మాటల సందర్భంలో మళ్ళీ అదే ప్రశ్న వేసా! మళ్ళీ అదే సమాధానం!

ఇలా కాదని, ఈసారి క్రిస్‌మస్ శలవుల్లో కలిసినప్పుడు, నా లాప్‌టాప్ మీద ఈమాట వెబ్ సైట్‌కి వెళ్ళి, ఆన్‌లైన్‌లో నా వ్యాసాల్ని లోడ్ చేసి, మా వాడ్ని దగ్గర కూర్చోబెట్టి చదివించటానికి ప్రయత్నించా! మా వాడు తడుముకొని, తడుముకొని, ఒక్కొక్క అక్షరమే చదువుతుంటే, నా కడుపులో ఏదో అవుతున్నట్టనిపించింది! మా వాడు ఒక చిన్న పేరా చదవటానికి పది నిమషాలు టైం తీసుకోటం చూసి నా కళ్ళు గిర్రున తిరిగాయి. పైగా ఈ పది నిమషాల్లో వంద తప్పులు. మా వాడు హైదరాబాదులో చదువుకొన్నాడు. అమెరికా వచ్చి రెండేళ్ళు దాటలేదు. “ఏరా నీ తెలుగు ఇలా ఉందేమిటీ?” అని అడిగితే, “నీకు తెలియదా బాబాయ్? నేను తెలుగు చదవటం మానేసి చాలా రోజులైంది! అందులో మనది హైదరాబాద్ తెలుగు!” అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. మా వాడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక, నోరు మూసుకున్నా!

ఎందుకంటే!

దాదాపు 20 ఏళ్ళ క్రితం, అవి నేను అమెరికాకి కొత్తగా వచ్చిన రోజులు. ఎక్కడో, తూర్పు గోదావరి జిల్లాలో ఒక మారుమూల పల్లెటూళ్ళో, ఆర్థిక అవసరాలకోసం డబ్బు పంపమంటూ ఆమె రాసిన ఉత్తరానికి సమాధానంగా, వృద్ధాప్యంలో ఉన్న మా పెద్దమ్మ గారికి డబ్బు పంపిస్తూ తెలుగులో ఉత్తరం రాద్దామని మొదలు పెట్టా! ఒక్క వాక్యం కూడా కదలదే? తెలుగు అక్షరాలు, గుణింతాలు, వత్తులు అన్నీ దాదాపు మర్చిపోయా! భయం వేసింది! నాకు అంతో ఇంతో బాగా వచ్చిన భాష తెలుగు ఒక్కటే! అది కూడా ఇలాంటి స్థితిలో ఉంది. ఏం చెయ్యాలో తెలియలా! అప్పుడు గుర్తొచ్చింది. కారణాలు ఏమైనా, దాదాపు పదేళ్ళపాటు నేను తెలుగు రాయటం మర్చిపోయా! అసలు తెలుగు చదవటమే మర్చిపోయా! చిన్న పిల్లవాడు తప్పటడుగులు వేస్తున్నట్టు, ఇంట్లో ఉన్న తెలుగు పుస్తకాలు కూడబలుక్కొని చదవటం మొదలెట్టా! చిన్నప్పటి నుంచి తెలిసిన భాష కాబట్టి, తొందరలోనే మళ్ళీ ధారాళంగా చదవటం నేర్చుకున్నా. అప్పుడప్పుడు రాయటం వల్ల, రాత కూడా మళ్ళీ పట్టుపడుతోంది. ఇదే విషయాన్ని, మా వాడికి చెప్పా! “ప్రయత్నిస్తాలే బాబాయ్” అని మా వాడు భరోసా ఇచ్చాడు! చూద్దాం ఏం అవుతుందో?

కొస మెరుపు: నేను తెలుగులో ఈ మాత్రం రచనలు చెయ్యగలనని ఎప్పుడూ అనుకోలేదు! నా పదవ తరగతి పరీక్షల్లో, తెలుగులో నాకు నూటికి అత్తెసరు మార్కులే వచ్చాయి! తెలుగులో ఇంటర్‌నెట్ సౌకర్యం వల్ల, నాకు తెలుగులో రాసే అవకాశం వచ్చింది. వీలు చూసుకొని, గత రెండు దశాబ్దాలుగా ఇంటర్‌నెట్‌లో తెలుగులో రాయడానికి దారి సుగమనం చేసిన వ్యక్తులు, వారి కృషి మీద వచ్చే ఈమాట సంచికల్లో రాయడానికి ప్రయత్నిస్తాను! ఇందుకు సంబంధించిన వివరాలు మీ దగ్గర వుంటే, నాకు పంపమని మనవి! గత శతాబ్దిలో, అచ్చు యంత్రం కనిపెట్టటం వల్ల, తెలుగులో కొత్త రచయితలు ఎలా పుట్టుకొచ్చారో, ఈ శతాబ్దిలో, ఇంటర్‌నెట్లో తెలుగు లిపి పరిచయం ద్వారా మరింతగా తెలుగు రచయితలు పుట్టుకొచ్చారన్నది అతిశయోక్తి కాదు!
-----------------------------------------------------------
రచన: విష్ణుభొట్ల లక్ష్మన్న, 
ఈమాట సౌజన్యంతో

No comments: