Friday, March 2, 2018

అనంతభట్టు - చంపూభారతం


అనంతభట్టు - చంపూభారతం




సాహితీమిత్రులారా!


అనంతభట్టు 14-15 శతాబ్దాలకు చెందిన సంస్కృతకవి.
సంస్కృతంలో చంపూభారతాన్ని వ్రాశారు. 
చంపూభారతం చాలా ప్రౌఢకావ్యం. దీనిలోని ఇతివృత్తం
భారతకథ. ఇందులో 12 స్తబకాలున్నాయి. భారతంలోని
ఏ ప్రధానాంశం వదలకుండా రసవత్తరంగానూ, సంక్షిప్తంగానూ
భారత చంపువును రచించారు. ఈ కావ్యాంతంలో ఈ కవి
తనకీర్తి దిగంతాలకు వ్యాపించిందని చెప్పుకున్నాడు.
దీనిలో శబ్ద చిత్రాలకు, శ్లేషలకూ చ్యుతచిత్రాలకు
ఇచ్చిన ప్రాధాన్యం అలంకారాలకు కూడ ఇవ్వలేదు.
అయినప్పటికి అక్కడక్కడా అర్థచమత్కృతి ఉంది.
ఇది ఇప్పటికీ పఠన పాఠనాలలో ఉంది. ఇతనిది
నారికేళపాకం. ఇతడు ఎంత గొప్ప విషయాన్నయినా 
గాంభీర్యగుణంతో సూక్ష్మంగా చెప్పగలడు.

అర్జునుడు తీర్థాయాత్రా సందర్భంలో ఉత్తర, దక్షిణ,
పశ్చిమాలందు ఉలూపి, చిత్రాంగద, సుభద్రలను 
వివాహమాడాడు. కాని తూర్పదిక్కున ఏ కన్యనూ
వివాహమాడలేదు. ఎందుకంటే ఆ దిగంగనను
అంటే తూర్పుకన్యను ఇంద్రుడు స్వీకరించాడు
(ఇంద్రుడు తూర్పునకు అధిపతి) కాబట్టి
అక్కడి కన్యలందరూ తనకు సోదరీసమానులనని 
విడచినాడు అని కవి ఇక్కడ ఉత్ప్రేక్షించాడు.
భీముని పుట్టుకవల్ల వాయుదేవుడు పురుడుపడటం
(జాతాశౌచం) వల్ల ఎవరికైనా తగులుతుందేమో అనే 
భయంతో మెల్లమెల్లగా(మందమందగా) చరిస్తున్నట్లు
ఉత్ప్రేక్షించాడు. ఇలాంటి సొగసైన భావాలను
ఎన్నింటినో చూడవచ్చు ఈ భారతచంపువులో.

ఈ గ్రంథానికి వ్యాఖ్యలు రచించినవారు చాలమంది వున్నారు.
వారిలో కురరి రామకవీంద్రులు, మల్లాది లక్ష్మణసూరి, 
నారాయణస్వామి, కుమార తాతాచార్యులు, నరసింహాచార్యులు
చెప్పదగినవారు. 

No comments: