Saturday, October 21, 2017

ప్రేమ - లేఖై పారిపోయింది


ప్రేమ - లేఖై పారిపోయింది




సాహితీమిత్రులారా!


శేషేంద్ర శర్మ గారిది తెలుగులో కొత్తబాణి. ఆయనదొక ప్రత్యేకవాణి.
వారు రాసే లేఖ వచనకవితలాంటి గద్యంలో సాగితే యిలా వుండవచ్చు.............

       కాదంబరీ!
       నాటి ప్రత్యూషంలో క్షణక్షణమూ నీవే అయి పరిస్పందిస్తున్నప్పుడు - నా హృదయ కుహరంలో లార్క్ పాడిన పాటను మొహమల్ తివాచిగా పరిచాను నీకోసం.
       నీ రూపం సోకి నా మనసు ముక్కలై వడగళ్ళను వర్షిస్తోంది. ఉద్యానంలో రాలిపోతున్న లిల్లీలు నా గుండెలోకి జారిపడే పిడుగులు
గుప్పెడు గుల్ మొహర్ లు నీడలు నా తాపాన్ని చల్లార్చలేక ఆవిరులై దిగంతాలకు పారి పోతున్నాయ్-
       చిట్టిపోయిన ఊహల్లోంచి స్రవిస్తున్న అశ్రువులు చెంపల్ని జలపాతాలు చేసి, పాదపీఠాన్ని నిర్దాక్షిణ్యంగా కోసేస్తున్నాయి - కోమల విషాదాన్ని భరిస్తూ, నీ సౌమ్యశాసనం కోసం బానిసనై నిలబడ్డాను.....
       సాగరగర్భంలోంచి చీల్చుకు వస్తున్న ప్రతి కెరటపులయలోనూ నీ రూపాన్ని దర్శిస్తున్నా - విచ్చుకుంటున్న ప్రతి పువ్వు చేసే రెక్కల సవ్వడిలోనూ ఆ సీమ చైతన్యమూర్తిని వీక్షిస్తున్నా-
       వేకువలో నీ లావణ్యాన్ని పాటలలోకి తర్జుమాచేసి నా కళ్లకు విన్పిస్తుంది. చిన్న పక్షి ఘోషించే కోటి జలపాతాలను భరిస్తున్న నన్నాపాట సముచ్ఛకితుణ్ణి చేస్తుంది. నీ పదధ్యనుల్ని దోసిళ్ళలో గ్రోలి, నీ దరహాసాలను చూపుల చెమ్కీదారాలతో దండలల్లి హృదయ దవాక్షానికి తోరణం కట్టాలని వుంది-
      కాదంబరీ నీ రాక ఎప్పుడో నీకోసం నిరీక్షిస్తూనే వుంటా - మృత్యువుతో కబురంపినా చాలు.......

(లేఖ చదివాక మనసు దూదిపింజలై తేలిపోతుంది - జవాబు మాట యెలా వున్నా)

(శ్రీరమణ పేరడీలు నుండి...........)
       

No comments: