Sunday, October 1, 2017

రైలుబండిలో వైతాళికులు -(చివరి భాగం)


రైలుబండిలో వైతాళికులు  -(చివరి భాగం)




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి...........



     టిక్కెట్లవాడు వుదాసీనంగా విని, రైలు ఆగే స్టేషన్ కోసం చూస్తున్నాడు - ఓ నిర్ణయానికి వచ్చేసి.

     కొందరు వినయం ప్రదర్శిస్తూ నిలబడ్డారు.

     కొందరు కానున్నది కాక మాననా యని కూర్చున్నారు.

     కాటూరిగారు చుట్టకాల్చడం మానలేదు.

     "చుట్ట పారెయ్యండి. బొత్తిగా లౌక్యం తెలీదు.... " అని గుసగుసలు విన్పిస్తున్నాయి.

     కృష్ణశాస్త్రిగారి పరిమళం తగ్గలేదు.

     కురుమెళ్లవారు స్తిమితపడ్డారు. సభాపతి ఈ విధంగానైనా రుక్మిణీనాథానికి శాస్తి జరుగుతుందని లోలోపల తృప్తి పడుతుండగా-

      రైలు ఆగింది-

      శ్రీశ్రీ చేత "రుక్కాయ్ "అని పిలువబడే రుక్మిణీనాథం రొప్పుతూ రోస్తూ రావడం కన్పించింది.

      అందరికీ జ్యోతిర్దర్శనం అయినంత సంతోషమైంది.

      "కొంప ముంచావు కదయ్యా..... " అన్నారంతా ముక్త కంఠంతో.

      "ముంచేవాడినైతే అసలు రాకే పోదును కదా......." అన్నాడాయన.

      "ఇంతకీ టిక్కెట్లెక్కడా......."

      "నోట మాట రావడం లేదు. కొంచెం స్తిమిత పడనీండి"

      జలసూత్రం వెనకాల, తరుముకు వస్తున్నట్టు - ఎర్రరంగు సేలం పట్టుపంచె, పైన నిండుగా ఉత్తరీయం కప్పుకుని ఓ నిండైన విగ్రహం కదలి వస్తూంది. ఆయన చేతిలో వెండి చెంబు - అందులో దర్భతో కట్టిన కూర్చ.. మధ్య మధ్య మనిషి తగిలినప్పుడల్లా ఆగి, చెంబులోంచి కూర్చోదకం నెత్తిన జల్లుకు ముందుకు సాగుతున్నాడు. కాలుతున్న ప్లాట్ఫాం మీద కాళ్లకి చెప్పులు కూడా లేవేమో మరీ వేగంగా నడుస్తున్నారు.

     "ఏమోయ్.... సఖుడా! కుశలమా?" అన్నారాయన కవులు అందర్నీ వుద్దేశించి.

      "తమరా మహాశయా......." అన్నారంతా

      ఆయన రాయప్రోలు సుబ్బారావుగారు అమలిన శృంగార చక్రవర్తి

      "కాళ్లకి జోళ్లు తగిలించుకో కూడదూ......." అన్నారు కాటూరివారు.

      "......ఈ అనంత భూతలిని

      మన భూమి వంటి చల్లని భూమి లేదు.
     
      ఏ దేశమేగినా, ఎందుకాలిడినా......."

                                  అన్నారాయన గాంభీర్యంగా

      "ఈ జీవుని వేదన ఈ జీవిది.... " అని విశ్వనాథ ప్రకాశంగా నిట్టూర్చారు.

       జలసూత్రంవారి రొప్పు తగ్గింది. అందరూ ఆయన వంక గుచ్చి గుచ్చి ముద్దాయిని చూసినట్టు చూస్తున్నారు.

       "అమలిన శృంగారం...శృంగారం అంటూ ఆయచన ఆడవాళ్ల పెట్టిలో కూర్చున్నారు. నేను పెట్టి పెట్టి తిరిగి తిరిగి చచ్చి చెడి వెదికి
తెచ్చాను......" అన్నారు జరుక్ కోపంగా.

      "అమలిన శృంగారానికి ఆడవాళ్ల పెట్టి దేనికి..." అప్పర్ బెర్త్ మీంచి కృష్ణశాస్త్రి ప్రశ్న.

      "స్త్రీ లేక శృంగారము వుండదు కదా! నా అమలిన శృంగారం ఆడవాళ్ల పెట్టిలోనే సాధ్యమోయి సఖుడా" అని రాయప్రోలు వారి జవాబు.

       "పైగా క్షణక్షణం ఈ నెత్తిని నీళ్లు జల్లుకోవడం... మీద పడ్డాయని కోపాసెంజెర్లతో ఘర్షణలూ - సర్ది చెప్పి తీసుకొచ్చేసరికి నా తలప్రాణం తోకకి వచ్చింది... మరో పులి మీద పుట్ర, ఆడవాళ్ల పెట్టెలో గుడిపాటి వెంకటాచలం నన్ను ముట్టుకున్నాడు స్నానం చేయాలంటూ వీరు నన్ను తింటున్నారు..." ఘాటుగా నిట్టూర్చారు జలసూత్రం.

       "సర్లే - టిక్కెట్లివ్వండి..."

       " నా దగ్గర అన్నీ లేవు - కొన్నే వున్నాయి."

        "అదేమిుటయ్యా - అనీ నీ దగ్గరేగా వుంటా...."

       " నిజమే. అది వేరే కథ. గుడుపాటి వెంకటాచలం మొదట్లోనే మనతో చీలిపోయి ఇంకో లేడీస్ కంపార్ట్ మెంట్లో ఎక్కాడు కదా! ఆ బోగీలో నిబడి అయిదారు స్టేషన్లదాకా వుమెన్స్ లిబ్ మీద వుపన్యాసం యిచ్చాడు..."

     "ఆ తర్వాత..." అడిగారెవరో ఆత్రంగా

     "తర్వాత..ఏదో స్టేషన్లో అయిదారు మంది స్త్రీప్యాసింజర్లతో దిగిపోయాడు. ఇప్పుడు నాదగ్గర టికెట్లలో అయిదు షార్టు...."అని కథ ముగించారు రుక్మిణీనాథం.

     "మరీ ఆశ్చర్యం.....పైగా అయిగారుగురివా...అమ్మో?" అని ఆశ్చర్యంతో ముణిగిపోయారు పిలకా గణపతిశాస్త్రిగారు. రాయప్రోలువారు అందరిమీదా కూర్చోదకం చల్లారు. కూతవేసి రైలు బయలుదేరింది- వైతాళికులతో-


(ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1979లో ప్రచురించ బడింది.
  1994 అక్టోబరులో ఆహ్వానం మాసపత్రికలో పునర్ముద్రించబడింది.)

(శ్రీరమణ పేరడీలు నుండి..............)

No comments: