ఒక పద్యంలోనే నాలుగు పద్యాలు
సాహితీమిత్రులారా!
విన్నకోట పెద్దన
కావ్యాలంకార చూడామణిలోని
సరసిజ వృత్తం పద్యంలోనే నాలుగు పద్యాలు ఉన్నాయి గమనిద్దాం-
శ్రీవిశ్వేశక్ష్మావరు సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
ధీవిద్యా సంభావితదేవున్ ధృతియతు హిత జనదివదినకరున్
శ్రీవర్ణింతున్ భావనజీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
భావోదంచద్భావితభావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్
(కావ్యాలంకార చూడామణి - 6-54)
ఇది ఒక గమ్మత్తైన వృత్తం ఇందులో రెండు కంపద్యాలున్నాయి
మొదటిది మొదటి రెండు పాదాలను చదివిన ఒక కందపద్యమవుతుంది
మూడు నాలుగు పాదాలు చదివిన రెండవ కందపద్యమవుతుంది
దీనిలోని మరో గమ్మత్తేమిటంటే
ఈ పద్యంలో రెండు కంద పద్యాలేకాదు
ఒక నవాక్షర వృత్తం, ఒక మణిగణనికరం ఉన్నాయి.
మొత్తం నాలుగు పద్యాలను ఇందులో ఇమిడ్చాడు విన్నకోట పెద్దనగారు
మొదటి కందము-
శ్రీవిశ్వేశక్ష్మావరు - సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
ధీవిద్యా సంభావిత - దేవున్ ధృతియతు హిత జనదివదినకరున్
శ్రీవిశ్వేశక్ష్మావరు
సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
ధీవిద్యా సంభావిత
దేవున్ ధృతియతు హిత జనదివదినకరున్
రెండవ కందము-
శ్రీవర్ణింతున్ భావన - జీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
భావోదంచద్భావిత - భావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్
శ్రీవర్ణింతున్ భావన
జీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
భావోదంచద్భావిత
భావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్
శ్రీవిశ్వేశక్ష్మావరు సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
ధీవిద్యా సంభావితదేవున్ ధృతియతు హిత జనదివదినకరున్
శ్రీవర్ణింతున్ భావనజీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
భావోదంచద్భావితభావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్
ఈ పద్యంలో మొదటి తొమ్మిది అక్షరాలను
నాలుగు పాదాలలో నుండి తీసి ప్రక్కన వ్రాస్తే
నవాక్షర వృత్తమవుతుంది.
పద్యంలో తొమ్మిది అక్షరాలను ప్రతిపాదంనుండి
తీయగా మిగిలిన పాదాలను ప్రక్కన వ్రాసి చూస్తే
అది మణిగణనికరమవుతుంది.
శ్రీవిశ్వేశక్ష్మావరు సేవాశ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
ధీవిద్యా సంభావితదేవున్ ధృతియతు హిత జనదివదినకరున్
శ్రీవర్ణింతున్ భావనజీవున్ జితరిపుశశికుశిఖరి మృగపతిన్
భావోదంచద్భావితభావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్
నవాక్షరవృత్తం-
శ్రీవిశ్వేశక్ష్మావరు సేవా
ధీవిద్యా సంభావితదేవున్
శ్రీవర్ణింతున్ భావనజీవున్
భావోదంచద్భావితభావున్
మణిగణనికరము-
శ్రితులు వొగడుదురు సిరివరులగుటకై
ధృతియతు హిత జనదివదినకరున్
జితరిపుశశికుశిఖరి మృగపతిన్
బ్రతిదినసముదిత బహుతర విభవున్
4 comments:
విన్నకోట పెద్దన వారికి జేజేలు.
ఈ విన్నకోట వారు మన బ్లాగ్ లోకపు విన్నకోట వారు ఒకే ఊరి వారా? అయినచో వీరేల పద్యము వ్రాయరూ?
జిలేబి
సరియైన సరసిజ
శ్రీవిశ్వేశక్ష్మావరు సేవాశ్రితులు వొగడుదురు సిరివరగుటకై
ధీవిద్యా సంభావితదేవున్ ధృతియతు హితజన దివస దినకరున్
శ్రీవర్ణింతున్ భావనజీవున్ జితరిపుశశికుల శిఖరి మృగపతిన్
భావోదంచద్భావితభావున్ బ్రతిదినసముదిత బహుతర విభవున్
Source- కావ్యాలంకార చూడామణి
https://archive.org/details/kavyalankarachud020721mbp/page/n79/mode/2up
జిలేబి
నాకంతటి సీనేదండి, "జిలేబి" గారు?
అయినా అంతమంది విన్నకోట వాళ్ళు పద్యరచన చేసేస్తే పాఠకలోకం తట్టుకోవద్దా?
విన్నకోట పెద్దన గారు ప్రముఖ లాక్షణికుడు అని చెప్పుకోవడమే ఒక గర్వకారణం, ఇంకా నేను కూడా పద్యాలు కడితే కవి చౌడప్ప గారు ఏనాడో చెప్పినట్లు:-
--------+
"పెద్దన వలె కృతి చెప్పిన
పెద్దనవలె, అల్పకవిని పెద్దనవలెనా?
ఎద్దనవలె మొద్దనవలె
గద్దనవలె కుందవరపు కవి చౌడప్పా! "
-----------
అన్నట్లుంటుంది.
విన్నకోట పెద్దన
😄🙆
Post a Comment