Sunday, November 24, 2019

మా ఈజిప్ట్ యాత్ర


మా ఈజిప్ట్ యాత్ర




సాహితీమిత్రులారా!



నేను కుటుంబ సమేతంగా ఆస్టిన్, టెక్సాస్ 2002 లో వదిలి మూడేళ్ళు ఫ్రాన్స్‌లో ఉద్యోగ రీత్యా ఉండవలసి వచ్చింది. అలా ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు నాతో కలసి పనిచేస్తున్న అమెరికన్ స్నేహితుడు (పేరు విక్టర్) భార్య ఈజిప్టియన్ కావటంతో, వారి ఆహ్వానం పై రెండు వారాల పాటు ఏప్రెల్ 2005లో ఈజిప్ట్ యాత్ర కోసం మా రెండు కుటుంబాలు కలసి వెళ్ళాం! ఆ వివరాలను ఈమాట పాఠకులతో పంచుకోవాలని ఈ ప్రయత్నం. ఈ యాత్రలో మేం తీసుకొన్న ఫొటోలు కొన్ని ఈ వ్యాసంతో జతపరుస్తున్నాను!

ఫ్రాన్స్‌లో మేం పారిస్‌కి దాదాపు 600 కిలోమీటర్ల దూరంగా దక్షిణ-తూర్పు ప్రాంతంలో ఉన్న గ్రనోబుల్‌కి 20 కిలోమీటర్ల దూరంలో సెయింట్ ఇస్మైర్ (సెంటిమియే అని పిలుస్తారు) అన్న ఊరులో ఉండేవాళ్ళం. మా ఊరికి స్విజర్లాండ్‌లోని జెనీవా 140 కిలోమీటర్ల దూరం. ప్రతి ఆదివారం జెనీవా నుంచి ఈజిప్ట్‌లో ప్రసిద్ధమైన షర్‌మల్ షేక్ అన్న సముద్రతీరపు బీచ్ రిసార్ట్‌కి డైరెక్ట్‌గా ఈజిప్ట్ ఎయిర్ విమాన సౌకర్యం ఉందని తెలిసి అలా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం! విక్టర్ భార్య “అమాని”కి తెలిసిన వారి ద్వారా ఒక మంచి టూర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. ఆరోజు ఆదివారం, ఏప్రెల్ 17, 2005. మామూలుగా అయితే మా ఊరు నుంచి జెనీవాకి డ్రైవ్ చేస్తే ఒక గంట 30 నిమషాలు పడుతుంది. అన్నట్లు, ఫ్రాన్స్‌లో కార్లు గంటకు 130 కిలోమీటర్ల (80 మైళ్ళు) వేగంతో నడపవచ్చు. జెనీవా, ఫ్రాన్స్ – స్విజర్లాండ్ దేశాల సరిహద్దులో ఉన్న పట్టణం. మా విమానం జెనీవా నుంచి బయలుదేరే సమయం మధ్యాహ్నం మూడున్నర. మేం ఇంటినుండి ఉదయం పది గంటలకు బయలుదేరాం! మేం బయలుదేరుతూ ఉండగా కొంచెం స్నో పడటం మొదలయింది. రాను రాను అది తీవ్రమై, దారి మధ్యలో ఉన్న కొండ ప్రాంతానికి వచ్చేసరికి ఉధృతమైంది! మేం వెడుతున్న రోడ్డులో ముందర ఎక్కడో ఏదో యాక్సిడెంటు అయిందేమో కార్లన్నీ రోడ్డుమీద ఆగిపోయాయి. ప్రతి పది, పదిహేను నిమషాలకి ఒక వంద మీటర్లు కదలటం మళ్ళీ ఆగిపోటం. ఇలా మూడు గంటలపాటు నడిచింది. కార్లో ఉన్న ఆడవాళ్ళు, పిల్లలు, బాత్రూంకి వెళ్ళాలంటే కూడా వీలు లేని పరిస్థితి. మొత్తం మీద మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తరవాత, కార్లు కొంచెం స్పీడుగా కదలటం మొదలయ్యింది. మాకు టైంకి విమానాన్ని అందుకోగలమనే నమ్మకం పోయింది. ఈ లోపల అమాని జెనీవా ఎయిర్‌పోర్ట్‌లోని ఈజిప్ట్ ఎయిర్ కౌంటర్ వాళ్ళకి సెల్ ఫోన్ ద్వారా కాల్ చేసి, మేం కొంచెం ఆలశ్యంగా రావచ్చునని చెప్పింది – అందువల్ల పెద్దగా లాభం ఉండదు అని తెలిసినా! వారానికి ఒక్క ఫ్లయిట్ కావటం వల్ల, ఈ ఫ్లయిట్ మిస్సయితే, మళ్ళీ వారం దాకా ఏం చెయ్యాలి అని ఒక బాధ! ఎలాగయితే, మూడు గంటల పదిహేను నిమషాలకి ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాం! విమానం బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నా, మా కోసం విమానాన్ని ఆపారట! గబగబా సామాన్లు చెక్ఇన్ చేసి, నేను, విక్టర్ కార్లు పార్క్ చేసి, అది లాంగ్ టెరం పార్కింగ్ కావటం వల్ల అంతదూరం పరిగెత్తుకుంటూ ఫ్లయిట్ గేటు దగ్గరకి చేరుకున్నాం! ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడూ అలా పరిగెట్లా! ఈ లోపల మమ్మల్ని మా ఇంటి పేర్లతో పిలుస్తూ మైక్‌లో “విమానం లోకి రమ్మని ఆహ్వానిస్తూ” ఎనౌన్స్ చేస్తున్నారు. తరవాత నా భార్య కల్యాణి చెప్పింది. మేం పార్క్ చెయ్యటానికి వెళ్ళినపుడు, మా పేర్లు చాలా సార్లు పిలిచారట! అమెరికాలో ఇలా ఎప్పుడూ ప్రయాణీకుల కోసం విమానాన్ని ఆపటం నాకు అనుభవంలో లేదు. ఈజిప్ట్ ఎయిర్ కాబట్టి ఇది వీలయింది అనుకుంటూ విమానంలో మా సీట్లలో కూర్చున్నాం! విమానంలో ఉన్న తోటి ప్రయాణీకుల్లో కొంతమంది “మీ కోసం మేం అంతా వైట్ చేస్తున్నాం, తెలుసా!” అన్నట్లు అదో రకంగా చూసారు. మరికొంత మంది “మొత్తానికి చేరుకున్నారు” అన్నట్లు మొఖాలలో సంతోషం చూపించారు.

షర్‌మల్ షేక్
మా విమానం షర్‌మల్ షేక్ చేరేసరికి రాత్రి తొమ్మిదిన్నర అయింది. మమ్మల్ని రిసీవ్ చేసుకోటానికి అహమద్ అనే అతను వచ్చాడు. అమాని మాకు చెప్పింది ” ఇతనే మనకి మొత్తం రెండు వారాల ప్రయాణ సదుపాయాలన్నీ కుదిర్చాడు” అని. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తరవాత ఈజిప్ట్‌లో టూర్ చెయ్యటానికి అప్పటికప్పుడే అహమద్ మా పాస్‌పోర్ట్‌లు తీసుకొని వీసాలు తీసుకొని వచ్చాడు (అమెరికన్ పాస్‌పోర్ట్‌లు ఉన్నవాళ్ళకి ఈజిప్ట్‌లో ఏ ఎయిర్‌పోర్ట్‌లో అయినా అప్పటికప్పుడే వీసా తీసుకొవచ్చు). ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం మా కుటుంబం, విక్టర్ కుటుంబం పక్క, పక్కనే ఉన్న రెండు ఇమిగ్రేషన్ క్యుబికల్స్ నుండి క్లియరెన్స్ పని పూర్తి చేసుకున్నాం! ఇక మా సామానులు కోసం ఎదురు చూస్తుంటే, విక్టర్ “మీ ఇమిగ్రేషన్ ఆఫీసర్ నీతో ఏమన్నా అన్నాడా?” అని అడిగాడు. “మా USA పాస్‌పోర్ట్‌లు చూసి ‘Bush’ అంటూ కోపంగా పాస్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ క్లియరెన్స్ స్టాంపు వేసాడు” అన్నా! విక్టర్ నవ్వుతూ “మాకు సరిగ్గా ఇలాగే జరిగింది” అన్నాడు. అమెరికన్స్ అంటే ఈజిప్ట్ లాంటి అరబ్ దేశాల్లో ఇటువంటి స్పందన ఉండటం చూసి ఆశ్చర్యపోయాం!

సామాన్లు అన్నీతీసుకొని అహమద్ సాయంతో Savoy Hotelకి చేరుకున్నాం. హొటేల్‌లో ఉండటానికి కావలసిన ఫారాలు అవి నింపుతున్నాడు అహమద్. ఇంతలో హొటేల్‌కి సంబంధించిన ఒకతను లాంజ్‌లో కూర్చున్న మా అందరికీ ఎర్రటి రంగుతో ఉన్న వేడి టీ (పాలు లేకుండా) ఇచ్చాడు. ఒక సిప్ రుచి చూసి “ఈ టీ చాలా బాగుంది కదండీ?” అని కల్యాణి అంటూండగా, నేనూ కొంచెం రుచిచూసా! బాగానే ఉంది కానీ ఏదో తేడాగా అనిపించింది. తరవాత తెలిసింది. మేం తాగిన టీ మందారం లాంటి పువ్వులను ఎండబెట్టి వాటితో తయారు చేసిన టీ అని! దీన్నే bright-red hibiscus tea అని ఇంగ్లీషులో అంటారు. అరబిక్‌లో “కార్‌కడీ” అంటారు. ఈజిప్ట్‌లో ఈ పానీయం చాలా ప్రసిద్ధమైనది.

మేం హొటేల్ రూంలకు చేరుకొని, అన్నీ సర్దుకొని పడుకొనే సరికి అర్ధరాత్రి అయిపోయింది. మర్నాడు ఉదయానికి కాని షర్‌మల్ షేక్ ఊరు ఎంత అందంగా ఉందో మాకు తెలియలేదు. హొటేల్ నుంచి దూరంగా కనిపిస్తున్న ఎర్రటి కొండలు, పక్కనే చిక్కని నీలం రంగుతో కనిపిస్తున్న ఎర్ర సముద్రం (చుట్టు పక్కల ప్రాంతం అంతా మినరల్స్‌తో సారవంతమైన భూములు {వర్షపాతం మాత్రం దాదాపు శూన్యం} కావటంతో, ఎర్ర సముద్రానికి ఆ పేరు వచ్చింది!) ఎంతో అందంగా ఉంది. ఆ రోజంతా హొటేల్ ఆనుకునే ఉన్న ఇసుక బీచ్‌లో గడపటానికి నిశ్చయించుకున్నాం! పిల్లలు ఇసుకలో ఆడుకుంటుంటే, ఈత బాగా వచ్చిన పెద్దవాళ్ళం స్నోర్కలింగ్ (నీటి ఉపరితలానికి కనపడకుండా, నీటిలో చాలా సేపు ఉంచగలిగినటువంటి పరికరం) చెయ్యటం కోసం సముద్రంలో దిగాం. స్నోర్కలింగ్ (పరికరం పేరు, నీటిలో దీనితో ఆడే ఈత పేరు ఒకటే) అంటే, కళ్ళలోకి నీరు పోకుండా కళ్ళద్దాలు పెట్టుకొని, నీటి ఉపరితలానికి సమాంతరంగా ఈదుతూ, కళ్ళద్దాల పక్కనే ఉన్న చిన్న గొట్టం ద్వారా గాలి పీలుస్తూ, నీటిలో తేలటం అన్నమాట. ఈ రకంగా నీటిలో ఉన్న చేపల్ని, కోరల్స్‌ని (తెలుగులో పగడం అనొచ్చు), మిగతా జల చరాలని చూడొచ్చు. ఈ రకంగా ఈత కొట్టటానికి పెద్దగా అనుభవం అక్కరలేదు. కళ్ళల్లోకి (ఉప్పు) నీళ్ళు పోకుండా కళ్ళద్దాలని సరిగ్గా ఉపయోగిస్తూ, జాగ్రత్తగా అవసరమైనట్టు ఊపిరి తీస్తూ, వదులుతూ ఉంటే చాలా సేపు నీటిలో ఉండొచ్చు. మేం ఇలా మూడు గంటలకు పైగా గడిపాం! ఏప్రెల్ నెలాఖరులో ఈజిప్ట్‌లో వాతావరణం బాగానే ఉంటుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు 90 F (36 C) కన్నా ఎక్కువగా ఉన్నా, రాత్రికి చల్లబడి 50 F (10 C) కన్నా తక్కువగా ఉండేది. అందువల్ల, సముద్రపు నీరు పగటి పూట చల్లగానే ఉండటం వల్ల, ఎక్కువసేపు నీళ్ళల్లో ఉండలేకపోయాం! మామూలుగా ఇలాగ రకరకాలైన సముద్ర జీవుల్ని, ముఖ్యంగా అనేక రంగులతో ఉన్న కోరల్స్‌ని డిస్కవరీ వంటి టీవీ ఛానల్స్‌లో చూసాం గాని, సముద్రంలో ఈదుతూ ప్రత్యక్షంగా చూడటం ఒక గొప్ప అనుభవం! మేం ఉన్న ప్రదేశాన్ని సెనై పెనెన్సులా అంటారు. ఇది భూగోళంలో చాలా అందమైన ప్రదేశం. కొన్ని మిలియన్ల సంవత్సరాలనుండి, ఎటువంటి కాలుష్యం లేకుండా, మానవ నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండటం వల్ల, ఈ ప్రాంతపు సముద్ర ప్రాణులు (sea life) ఎటువంటి పరిణామం (evolution) లేకుండా అల్లాగే ఉన్నాయని అహమద్ మాటల వల్ల తరవాత తెలిసింది. అందుకే ఆ చుట్టూ ఉన్న చాలా సముద్ర తీర ప్రాంతాలను మానవ సంచారానికి వీలు కాకుండా రక్షిత ప్రాంతాలు (protected areas) గా ఈజిప్ట్ ప్రభుత్వం నిర్ణయించిందట!



అలా వెళ్ళిన మొదటి మూడు రోజులు షర్‌మల్ షేక్ లోనే గడిపాం! ఒక రోజు సాయంత్రం, ఊరు చూద్దామని వెళ్ళాం. మొత్తం ఊరు అంతా వచ్చే పోయే యాత్రికులకోసం నిర్మించబడ్డ ఊరు కాబట్టి, ఊరులో ఎక్కువ భాగం షాపులు, రెష్టరెంట్స్, పెద్ద, పెద్ద హొటేల్స్‌తో నిండి ఉంది. స్నోర్కలింగ్ ద్వారా ఎర్ర సముద్రంలో ఉన్న చేపలు, కోరల్స్, మిగిలిన సముద్ర జీవాలను చూట్టానికి వీలుకాని వాళ్ళకోసం కొన్ని ప్రత్యేకమయిన మోటార్ బోట్స్ ఉన్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే, బోటు క్రిందలోని ఎక్కువ భాగం పూర్తిగా గ్లాసు లాంటి పారదర్శక పదార్ధంతో చెయ్యటం వల్ల, యాత్రికులు బోటులో కూర్చుని, కిందకు చూస్తూ సముద్రంలోని అందాలను చూడవచ్చు. మొత్తం మీద ఒక గంటకు పైగా మేమంతా అలాంటి బోటులో గడిపాం!

షర్‌మల్ షేక్ లో ఉన్న మూడు రోజుల్లో మేం ఎక్కువగా రష్యన్ యాత్రికుల్ని చూసాం. అమెరికన్, యూరోపియన్ యాత్రికులు సహజంగానే ఎక్కువగా ఉన్నా, రష్యన్ యాత్రికుల సంఖ్య అందరికన్నా ఎక్కువ అనిపించింది. అహమద్ మాటల ద్వారా తెలిసింది ఏమిటంటే, రష్యాలో పెట్రోలు, మిగిలిన వ్యాపారాల ద్వారా పెద్ద, పెద్ద లాభాలు తీసినవారు, సరదాగా సమయం గడపటానికి షర్‌మల్ షేక్ వస్తారట! పైగా, రష్యా నుంచి డైరెక్టు విమాన సౌకర్యాలు ఇక్కడికి ఉన్నాయట! ఈ రష్యన్ యాత్రికుల్లో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనించతగ్గది.రష్యన్ యాత్రికులు తమ సమయాన్ని బాగా తిరుగుతూ, తాగుతూ (రష్యన్ డ్రింక్ వోడ్కా) అక్కడ ఉన్న ఈజిప్షియన్ పోలీసులకు, షర్‌మల్ షేక్ పుర నివాసులకు తల నెప్పిగా ఉంటారుట! అయితే, ఈజిప్ట్ పేద దేశం కావటం, పైగా ఈ రష్యన్ యాత్రికులు విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టటం వల్ల ఈ ప్రాంతం ఆర్ధిక పరిస్థితి (local economy) బాగుండటం వల్ల ఎవరూ వీరిని ఏమీ అనరట! ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అహమద్ చెప్పాడు. డబ్బున్న రష్యన్ యువతులు, ముఖ్యంగా పిల్లల తల్లులు కావాలనుకొనే వారు, ఎక్కువ సంఖ్యలో వచ్చి, ఈజిప్షియన్ యువకుల ద్వారా గర్భవతులై, రష్యా తిరిగి వెళ్ళిపోతారట! ఇందులో నిజానిజాలు ఎంతో తెలియకపోయినా ( రష్యా ప్రస్తుత జనాభా తగ్గుదల దృష్ట్యా ఇది నిజం అయ్యే అవకాశాలే ఎక్కువ), ఇటువంటివి కూడా జరిగే అవకాశాలున్నాయని తెలిసి మేం ఆశ్చర్యపోయాం!

కైరో
నాలుగో రోజు ఉదయాన్నే, షర్‌మల్ షేక్ నుంచి విమానంలో ఈజిప్ట్ ముఖ్య పట్టణమైన కైరో చేరుకున్నాం. ఇది చాలా చిన్న ప్రయాణం. ఒక గంటలో కైరోలో ఉన్నాం. అహమద్ ద్వారా ఏర్పాటు చెయ్యబడ్డ ఒక వ్యక్తి వచ్చి మమ్మల్ని ఎయిర్‌పోర్ట్ నుంచి గీజా ప్రాంతంలో ఉన్న ల మెరిడియన్ హొటేల్ కి తీసుకొచ్చాడు. హొటేల్‌కి వస్తుంటే పెద్ద పెద్ద కొండల్లా ఉన్న గ్రేట్ పిరమిడ్స్ దూరంగా కనపడ్డాయి. ప్రపంచ వింతల్లో అతి పురాతనమైన వింతను చూడబోతున్నాం కదా అని సంబరపడ్డాం! హొటేల్‌లో ఉండటానికి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి ఒక గంట విశ్రాంతి తీసుకొని, హొటేల్‌కి దగ్గరగా ఉన్న స్ఫింక్స్ (Sphinx) చూట్టానికి బయలుదేరాం. హొటేల్ నుంచి బయలుదేరినప్పుడు, హొటేల్ లాబీలో ఎవరో ఒకతను నవ్వుతూ పలకరించాడు. సభ్యత కోసం నేను కూడా ఒక చిరునవ్వుతో పలకరించా! నేను అప్పటికి ఆ విషయం మర్చిపోయా! (అన్నట్టు చెప్పటం మరచా! మేము ఈజిప్ట్ వచ్చినప్పటి నుంచి, చాలా మంది నాతో అరబిక్‌లో మాట్లడటానికి ప్రయత్నించే వాళ్ళు! అమానితో ఈ విషయం చెపితే, “లక్కీ! నిన్ను చూడగానే ఇక్కడ అందరూ ఈజిప్షియన్ అనుకుంటారు. నీకు మెడిటెర్రేనియన్ సముద్ర ప్రాంతాల్లో ఉన్న దేశాల వాళ్ళ పోలికలు చాలా ఉన్నాయి!” అంది. అప్పుడు నాకు ఎదురయ్యే ప్రతి ఈజిప్షియన్‌ని పరీక్షగా చూట్టం మొదలు పెట్టా! అమాని మాటల్లో నిజం తెలిసింది. ఏమో, మా పూర్వీకులు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళేమో!) మరొక ఐదు నిమషాల్లో మమ్మల్ని తీసుకెళ్ళటానికి ఒక మినీ వాన్ వచ్చింది. అందరం సర్దుకొని వాన్‌లో కూర్చోగానే, హొటేల్‌లో నన్ను నవ్వుతూ పలకరించిన వ్యక్తి వచ్చి, డ్రైవర్ పక్కగా ఉన్న ముందు సీట్లో కూర్చున్నాడు. మేమంతా, అతను డ్రైవర్‌కి సంబంధించిన వ్యక్తి అయివుంటాడని సరిపెట్టుకున్నాం! తరవాత తెలిసింది. ఈజిప్ట్ ప్రభుత్వం, అమెరికన్ యాత్రికుల రక్షణ కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని – అతను, “మాకు ప్రొటెక్షన్ కోసం, ఒక స్టెన్ గన్‌తో సహా హొటేల్ ద్వారా నియమించబడ్డ సెక్యూరిటీ గార్డ్” అని. అసలు విషయం ఏమిటంటే, హొటేల్‌లో దిగేటప్పుడు యాత్రికులు అమెరికన్ పాస్‌పోర్ట్ ఉన్న వాళ్ళయితే, హొటేల్ యాజమాన్యం వెంటనే ఈజిప్ట్ ప్రభుత్వపు హోం డిపార్టుమెంటుకి తెలియచేస్తుందిట. నలుగురు కంటే ఎక్కువ ఉన్న బృందానికి రక్షణ కోసం ప్రభుత్వ ఖర్చుతో బాడీ గార్డ్‌లను పెట్టాలని నిర్ణయించడం వల్ల, హొటేల్ నుంచి బయటకు వచ్చిన మరు క్షణం నుంచి తిరిగి హొటేల్‌కి వచ్చే దాకా, యాత్రికుల రక్షణ భారం ప్రభుత్వమే భరిస్తుందిట!

పిరమిడ్స్ – స్ఫింక్స్
“మనిషి కాలానికి లోబడి ఉంటే, కాలం పిరమిడ్స్‌కి లోబడి ఉంటుంది” – అరబ్ నానుడి.

మేం స్ఫింక్స్ దగ్గరకి వెళ్ళేసరికి సాయంత్రం ఐదు గంటలయ్యింది. ఆరు గంటలకు “స్ఫింక్స్‌లో ప్రత్యేక ఆకర్షణ అయిన Sound & Lights Show ఇంగ్లీషులో ఉందని – అవి చూడటానికి అందరికీ టిక్కట్లు తీసుకున్నా” నని మా కైరో ట్రావెల్ ఏజంటు చెప్పాడు. పక్కనున్న కొంతమంది యాత్రికులు స్ఫింక్స్ చూట్టానికి మనిషి ఒక్కడికి ధర $25 కొంచెం ఎక్కువే అని అనుకోటం విన్నా! ఇన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణించి ఈ ఖర్చుకి వెనకాడటం సరైంది కాదనిపించింది. జీవితంలో ఇటువంటి ప్రపంచ వింతలు చూసే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఇలా అనుకుంటూ స్ఫింక్స్ షోలోకి కదిలాం! సుమారు 4,500 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ స్ఫింక్స్ ఇంకా అదే ప్రాంగణంలో ఉన్న గ్రేట్ పిరమిడ్‌గా చెప్పబడిన ఖుఫు పిరమిడ్ – మానవ నిర్మితమైన అతి ప్రాచీన కళాఖండాలు అనటంలో సందేహం లేదు! స్ఫింక్స్ అన్నపదం ప్రాచీన గ్రీకులు ఇచ్చిన పేరు – ఈ విచిత్రమైన ప్రాణికి స్త్రీ తల, సింహం శరీరం, పక్షిలాగా రెక్కలు ఉంటాయి. స్ఫింక్స్‌ని ఒక రకమైన సున్నపు రాయితో చేసారు. భూగర్భ శాస్త్రజ్ఞలు ఉత్తర ఆఫ్రికా సముద్ర ప్రాంతాల్లో 50 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం ఏర్పడ్డ Muqqatam Formation ద్వారా సముద్రనీటి భూమి ఉపరితలం పై పేరుకున్న సున్నపు రాయి తో స్ఫింక్స్ ని చేసినట్టు కనుగొన్నారు. మానవనిర్మితమైన రాతి కట్టడాలలో అతి పెద్ద కట్టడంగానూ, అందులో అతి గుండ్రమైన అంచులతో కట్టిన కట్టడం గానూ స్ఫింక్స్‌ని పేర్కొంటారు. ఈ స్ఫింక్స్ శరీరం 72 మీటర్ల పొడవు కలిగి 20 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. వాతావరణంలోని తేమ, కాలుష్యం , కోత (eroson) వల్ల ఇప్పటికి కనిపించే స్ఫింక్స్ రూపం చాలా మార్పులు పొందింది. నెపోలియన్ 1798 సంవత్సరంలో ఈజిప్ట్ పర్యటించేసరికి, స్ఫింక్స్ శరీర భాగం పూర్తిగా ఇసుకలో పూడుకుపోయి, ఒక్క తల మాత్రం కనపడుతూ ఉండేదట! అప్పటికి 400 సంవత్సరాలకి పూర్వమే స్ఫింక్స్‌కి ముక్కు పోయిందంటారు. స్ఫింక్స్ ఉన్న ప్రాంగణంలో ఇంకా, Khafre’s causeway, Old Sphinx Temple, Valley Temple of Khafre కూడా ఉన్నాయి.


ఎన్ని ఫొటోలు, టీవీ ప్రోగ్రాములు, వీడియోలు చూసినా, ప్రత్యక్షంగా పిరమిడ్లని చూస్తే కలిగే అనుభూతుల్ని వర్ణించటం కష్టం! ఎవ్వరీ పిరమిడ్‌లని కట్టించినవారు – కట్టిన వారు? ఏ కారణాల వల్ల ఇవి కట్టబడ్డాయి? గ్రేట్ పిరమిడ్ కట్టటానికి ఉపయోగించిన 2.3 మిలియన్ల పెద్ద పెద్ద సున్నపు రాళ్ళని ( ఒక్కొక్క రాయి బరువు 2.5 నుంచి 7 టన్నుల దాకా ఉంటుంది ) ఎక్కడ నుంచి తెచ్చారు? ఎలా తెచ్చారు? ఎన్ని వేల మంది, ఎన్ని సంవత్సరాలు కష్టబడి ఇవి సాధించారు? మానవ నాగరికతకు సాంకేతిక సూత్రమైన చక్రం (wheel) ని కనుక్కోకముందే ఇంత అద్భుతమైన కట్టడాలను ఎలా సాధించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ నాటికీ లేవు. గ్రేట్ పిరమిడ్‌గా చెప్పబడిన పిరమిడ్‌లోని రాళ్ళని ఒకదాని పక్క ఒకటి పేర్చుకుంటూపోతే అమెరికా సంయక్త రాష్ట్రాలలోని తూర్పు భాగంలో ఉన్న న్యూయార్క్ నుండి సుమారు 4000 మైళ్ళ దూరంలోని పశ్చిమ తీరాన ఉన్న శాండియాగో వరకూ వెళ్ళి తిరిగి న్యూయార్క్ రావచ్చు! ప్రపంచంలో అతి పెద్ద పిరమిడ్‌గా గా చెప్పబడుతున్న ఖుఫు పిరమిడ్ ఈజిప్షీన్ ఫెరో (మహా రాజు) చియొప్స్ కోసం క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో కట్టబడింది! కట్టినపుడు 482 అడుగులు ఎత్తైన ఈ పిరమిడ్ కాలక్రమంలో 33 అడుగులు కోల్పోయింది. ప్రాచీన గ్రీకులు ఈ పిరమిడ్‌ని కనుక్కున్న సమయానికే దీనికి 2000 ఏళ్ళ వయస్సు! దీని పక్కనే ఉన్న మరొక పిరమిడ్ చియోప్స్ రాజు కొడుకు ఫెరో చెఫర్న్ ది. దీని ఎత్తు 446 అడుగులు ( కట్టినపుడు ఎత్తు 470 అడుగులు). దీన్ని కొంచెం ఎత్తైన ప్రదేశంలో తెలివిగా కట్టడం వల్ల తండ్రి పిరమిడ్ కన్న కొడుకుదే పెద్ద పిరమిడ్ అనిపిస్తుంది. తండ్రి పై గౌరవంతో కొడుకు పిరమిడ్ చిన్నదిగా కట్టారట!


గీజాలోని పిరమిడ్‌లు చూస్తుంటే, ఏదో తెలియని ఆధ్యాత్మికమైన భావాలు కలగటం మొదలైంది! వీటిని చూస్తూ కొన్ని గంటలు నేను ఒక్కడినే గడపగలననిపించింది! ప్రాచీన ఈజిప్ట్ ఫెరోలు చనిపోయిన కొంత కాలం తరవాత, తిరిగి అదే శరీరంలోకి వారి ఆత్మలు ప్రవేశిస్తాయని పూర్వుల నమ్మిక! అందుకు వీలుగా శరీరం కృశించకుండా మమ్మిఫికేషన్ వల్ల నిలవ (preserve) చేసి, పెద్ద పెద్ద సమాధుల్లో (పిరమిడ్) ఫెరోల శరీరాలను దాచేవారు. మరుజన్మలో జీవితం బాగా సాగటానికి వీలుగా ఎన్నో విలువైన సంపదలను, భోజన సదుపాయం కోసం కావలసిన సరుకులు, చివరకు వైన్ కూజాలు కూడా ఈ సమాధుల్లో దాచేవారు.

ఈజిప్ట్‌లో ఎన్నో పిరమిడ్‌లు ఉన్నాయి. గీజా ప్రాంతమే కాక, గీజాకి దగ్గరలో ఉన్న సక్కారా (పిరమిడ్లు కట్టటం అన్న సాంప్రదాయం మొదలైంది ఇక్కడ కట్టిన మొదటి Step పిరమిడ్ ద్వారానే!), ఇక్కడికి దక్షిణంగా ఉన్న లుక్సర్ ప్రాంతాల్లో ఉన్న వాలీ ఆఫ్ కింగ్స్ – క్వీన్స్ లో ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి. ఈ పిరమిడ్లలో ఉన్న సంపదలను దొంగలు ఎత్తుకు పోయినవి ఎత్తుకు పోగా, ఈ నాటికి అందుబాటులో ఉన్న ఈ సంపదలను విలువ కట్టటం అసాధ్యం. లెక్కలేనన్ని పిరమిడ్‌లలో ఉన్న ఫెరోల గురించి అన్నీ ఇక్కడ చెప్పటం కష్టం! ఇద్దరు మహా మహుల గురించి కొన్ని వివరాలిస్తాను!

మొదటిది : ఫెరో రాంసెస్ (II). ప్రాచీన ఈజిప్ట్ సామ్రాజ్య చరిత్రలో ఇతని పేరు చిరస్థాయిగా ఉంటుంది. 90 ఏళ్ళ దాకా రాజ్య పాలన చేసి, అనేక దేవాలయాలకి ఇతర కట్టడాలకి మూలమైన ఈ ఫెరో జనానాలో లెక్క పెట్టలేనంత మంది స్రీలు ఉండేవారట. ఇతని జనానాలో తన సొంత కుమార్తెలు ముగ్గురు, సొంత చెల్లి కూడా ఉండటం బహుశా చరిత్రలో ఇంతకు ముందు తరవాత కూడా ఏ రాజు జనానాలో కూడా జరగలేదేమో! 90 మందికి పైగా సంతానం కొన్ని వందలమంది మనుమలు మనుమరాళ్ళు కలిగిన రాంసెస్‌ను ప్రజలు దైవంగానే కొలిచేవారట! ఇతని మమ్మీ కైరోలోని మ్యూజియంలో భద్రపరచబడి ఉంది. మా కైరో పర్యటనలో ఫెరో రాంసెస్ మమ్మీని చూసాం. జీవించి ఉన్నపుడు ఆరు అడుగులకు పైగా ఉండే ఫెరో రాంసెస్, మమ్మీగా మార్చబడిన తరవాత ఆరు అడుగులకన్న కొంచెం పొట్టిగా కనిపించాడు. ఈజిప్ట్ దేశంలో చాలా చోట్ల ఉన్న ప్రాచీన దేవాలయాల్లో లెక్కపెట్టలేనన్ని ఇతని రాతి విగ్రహాల ద్వారా ఫెరో రాంసెస్ ప్రజల మధ్య ఎటువంటి స్థానం సంపాయించాడో ఊహించవచ్చు. ఇక రెండవ ఫెరో టూటన్‌కామున్ (తేలికగా పలకాలంటే ఈయన పేరు రాజు టట్). 1922 సంవత్సరంలో జరిగిన తవ్వకాల్లో అతి విలువైన సంపదలతో భద్రంగా పొందుపరచబడి ఉన్న టట్ సమాధి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తి, ప్రాచీన ఈజిప్ట్ నాగరికతను ప్రపంచానికి తిరిగి పరిచయం చేసింది. 19 ఏటనే చనిపోయిన టట్ చావు ఒక మిస్టరీ! ఇతని సమాధిలో దొరికిన వస్తువులు కూడా కైరో మ్యూజియంలో ఉన్నాయి! వాటిని కూడా మేం కైరో మ్యూజియంలో చూసాం.


పపైరస్ (ప్రపంచానికి నైల్ కానుక)
కైరోలో ఉన్న ఒక రోజు ఉదయాన్నే మా ట్రావెల్ ఏజెంటు, ఈజిప్టు ప్రాచీన నాగరికతకు అతి ముఖ్య చిహ్నమైన పపైరస్ (ఒక రకమైన కాగితం) అమ్మే షాపుకి తీసుకెళ్ళాడు. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలకి పూర్వం కనిపెట్ట బడ్డ ఈ కాగితం తయారుచేసే పద్ధతి అతి రహస్యంగా దాచబడింది. పపైరస్ అన్న కాగితం (మనం మామూలుగా వాడే “పేపర్” అన్న పదం వచ్చింది ఇలానే!) తయారీకి ముడిపదార్ధం “సైప్రస్ పపైరస్” అన్న మొక్క. దిగువ నైల్ నది (నైల్ నది దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుంది. భారత దేశంలోనూ, ఉత్తర అమెరికాలోనూ నదులు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తాయి.) ప్రాంతం, అంటే అలగ్జాండ్రియా దగ్గరగా ఉన్న నైల్ నదీప్రాంతాల్లో విరివిగా పెరిగే ఈ మొక్క రాయడానికి పనికొచ్చే కాగితం తయారీకి మాత్రమే కాకుండా, తాళ్ళు అల్లడానికి, పడవల తయారీలకి కూడా ఉపయోగిస్తారు. కానీ, అతి ముఖ్యమైన ఉపయోగం ఒక్క కాగితం వల్లనే! చిత్రమైన విషయం ఏమిటంటే, కాగితం ప్రాచీన ఈజిప్టు నాగరికతలో ఒక ముఖ్య భాగమైనా, అది తయారుచేసే కీలకమైన వివరాలు రాత పూర్వకంగా ఎక్కడా పొందుపరచలా! అందువల్ల ఈ పపైరస్ తయారీ పూర్వులతోనే అంతరించిపోయింది. 1969 సంవత్సరంలో, పపైరస్ తయారీ అంతమైన దాదాపు వెయ్యి సంవత్సరాల తరవాత, హసన్ రగబ్ అన్న వ్యక్తి పపైరస్‌ను ఈజిప్టులో పునఃప్రవేశం చేయించాడు. ఈజిప్టులో అప్పటికే సైప్రస్ పపైరస్ మొక్క అంతరించటంతో, పొరుగునే ఉన్న సుడాన్ దేశం నుంచి ఈ మొక్క వేళ్ళు సంపాయించి తిరిగి కైరోలో గీజాకి దగ్గరగా ఉన్న జాకబ్ (Jacob) ద్వీపంలో నాటించి పునరుద్ధరించాడు. ఈ నాటికి కూడా ఇది ప్రపంచంలోని మానవ ప్రయత్నంతో తయారుచేయబడ్డ అతి పెద్ద పపైరస్ ప్లాంటేషన్‌గా చెప్పుకుంటారు! రగబ్‌కు తరవాత ఎదురైన సమస్య – ఈ మొక్కలనుంచి కాగితాన్ని ఎలా తయారుచెయ్యటం? మూడు సంవత్సరాలు, రగబ్ అతని కుటుంబ సభ్యుల నిరంతర కృషి వలన పపైరస్ తయారీ మళ్ళీ కనుక్కున్నారు! ఈనాటికీ రగబ్ తరవాత రెండు, మూడు తరాల కుటుంబ సభ్యులు ఈ పపైరస్ తయారీలోని సూక్ష్మాలను ఇంకా పరిశోధిస్తూనే ఉన్నారు.

మేం వెళ్ళిన షాపులో రకరకాలైన పపైరస్‌తో తయారు చెయ్యబడ్డ చిత్రాలు అమ్మకానికి ఉన్నాయి. అతి చక్కగా ఉపయోగించబడ్డ రంగులతో రకరకాలైన చిత్రాలు పపైరస్ పై చిత్రించబడి, అందమైన ఫ్రేములలో షాపంతా అలంకరించబడ్డాయి. షాపులో ఒక పక్కగా పపైరస్ కాగితాన్ని మొక్కలనుండి ఎలా తయారు చేస్తారో వివరంగా చూపించడానికి ఒక అందమైన ఈజిప్షియన్ అమ్మాయి నిల్చుని ఉంది. ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి, పపైరస్‌ని ఇలా తయారు చేస్తారు. సైప్రస్ పపైరస్ మొక్కల నుండి కాండం కొంచెం పెద్దగా, దృఢంగా ఉన్న కాడలను (మనకు తెలిసిన జనప, గోగు కాడలు గుర్తొచ్చాయి) తీసుకొని, వాటికి పైనున్న ఆకుపచ్చని బెరడు తీసి, లోపల ఉన్న దవ్వ (pith)ని తీసి, పొడుగ్గా పల్చని బద్ద (strips) లాగ తీసి ఉంచుతారు. తరవాత వాటిని అతి పల్చగా రేకుల్లాగా నలక్కొట్టి మూడు రోజులు నీటిలో మెత్తగా (pliable) అయ్యేంత వరకు నానబెడతారు. తరవాత వీటిని సరైన పొడుగుకి కోసి, ఒక పల్చని మెతక గుడ్డపై పరుస్తారు. ఈ బద్దలని కొన్ని నిలువుగాను, మరి కొన్ని అడ్డంగాను పెట్టి, ఖాళీ స్థలం లేకుండా, ఒక చదరంగం లాంటి గడిని తయారు చేస్తారు. దాని పైన మళ్ళీ ఒక సన్నటి గుడ్డను కప్పి, వీటిని ఒక దానికి మరొకటి బాగా అతుక్కునేట్లు గట్టిగా నొక్కి ఉంచుతారు. ఈ మొక్కలో ఉన్న ఒక రకమైన జిగురు పదార్ధం వల్ల, ఇవన్నీ ఒకదానికి మరొకటి అతుక్కొని, ఒక పల్చని కాగితంలాగా తయారవుతుంది. ఈ కాడల్లో ఉన్న తేమ పూర్తిగా పోయేవరకు, వీటిని నొక్కిపెట్టి ఉంచి పపైరస్ తయారీ పూర్తి చేస్తారు!


ఈజిప్ట్‌లో రైలు ప్రయాణం
కైరోలో చూద్దామనుకున్నవన్నీ చూసిన తరవాత, ఈజిప్ట్‌లో దక్షిణ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద పట్టణమైన అస్వాన్ చేరుకోటానికి కైరో నుంచి రైలులో వెళ్ళాలని మా ప్లాన్. ఈజిప్ట్‌లో అన్ని ప్రాంతాల్లోకి నైల్ నది అస్వాన్ దగ్గర అత్యంత అందంగా ఉంటుంది. కైరో నుంచి అస్వాన్ దాదాపు 900 కిలోమీటర్లు దూరం. నాకు ఆంధ్రాలో బాగా అనుభవమైన హైదరాబాద్-విశాఖపట్నం రాత్రి పూట రైలు ప్రయాణం లాగ, కైరోలో బయలుదేరి ఒక రాత్రి అంతా ప్రయాణిస్తే, ఉదయానికి అస్వాన్ చేరుకోవచ్చు! మేం అలాగే వెళ్ళాలని ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం, కైరోలో రాత్రి 8 గంటలకి రైల్లో బయలుదేరాం. ఈజిప్ట్ దేశానికి ఎక్కువ ఆదాయం వచ్చేది టూరిజం ద్వారానే! అందుకని దేశంలో చాల చోట్ల యాత్రీకుల కోసం సౌకర్యాలు చక్కగా ఏర్పాటు చేసారు. మేం అందరం ఒక కూపేలో ఇద్దరు చొప్పున నాలుగు పక్క పక్క కూపేల్లో సర్దుకున్నాం. ఆ రాత్రి భోజనం రైల్లోనే చేశాం. ఇక్కడ కొంచెం ఈజిప్ట్ భోజనం గురించి చెప్పడం అవసరం! శనగ పిండితో చేసిన వడలు (ఫలాఫల్ అంటారు Falafel), నువ్వుల నూనె పెరుగు కలిపి చేసిన చట్నీ (తహిని అంటారు Tahini), వంకాయ – ఉల్లిపాయలు – టొమేటోలతో చెసిన ఒక కూర (ముసాక అంటారు Moussaka), ఒక రకమైన పెసలు ఉల్లిపాయలు కలిపి చేసిన అన్నం (Egyptian Rice), లెబనీస్ చపాతీలు ఆ రాత్రి మా భోజనంలో కొన్ని పదార్ధాలు. మాంసాహరులకు ముఖ్యంగా దొరికేవి లాంబ్ (అరబ్ దేశాల్లో లాంబ్ చాలా ఇష్టంగా తినే మాంసాహారం) తరవాత చికెన్. మా భోజనాలు అన్నీ అయిన తరవాత, రైల్లోనే ఉన్న ఒక రెష్టరెంట్‌లో ఈజిప్ట్‌లో ప్రసిద్ధమైన అరాక్ (భోజనం తరవాత తాగే మద్య పానీయం) తాగాం! అనుకోకుండా అక్కడ ఉన్న అమెరికన్ యాత్రికులతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఆష్టిన్, టెక్సస్ నుంచేనని తెలుసుకొని ఆశ్చర్యపోయాం! కబుర్లన్నీ చెప్పుకొని పడుకునే సరికి రాత్రి 12 దాటింది. పొద్దున్నే నిద్ర లేచేసరికి ఆరు గంటలయింది. ఒక్క నిమషం ఎక్కడ ఉన్నానో తెలియలా! రైలు కిటికీ గుండా చూస్తే చక్కని పొలాలు, తోటలు కనపడ్డాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం రైలులో వెడుతుంటే, రాజమండ్రి దాటిన తరవాత, కడియం ప్రాంతాల్లో ఎంతో అందమైన ప్రకృతిని చూస్తున్నానా అనిపించి, ఒక్క క్షణం నేను ఆంధ్రాలో ఉన్నట్టనిపించింది. రైలు అస్వాన్ చేరేసరికి ఉదయం 10 గంటలు దాటింది. రైల్ ష్టేషన్ నుంచి మేం వెళ్ళవలసిన క్రూజ్ బోటు చాలా దగ్గర. ఒక గంటలోపు మేం అందరం క్రూజ్ బోటులో మా గదుల్లోకి చేరుకున్నాం!

నైల్ నది
ఈజిప్ట్ గురించి వివరాలిస్తున్నప్పుడు, నైల్ నది గురించి చెప్పకపోతే అది సంపూర్ణం కాదు. నైల్ నది ఈజిప్ట్ దేశానికి గుండె వంటిది. చిన్నప్పుడు ఎప్పుడో నైల్ నది ఈజిప్ట్ నాగరికతకు మూలం అని చదువుకున్నా, మా ఈజిప్ట్ యాత్ర జరిగే దాకా అది ఎంత నిజమో నాకు అనుభవంలోకి రాలేదు. ప్రపంచంలో అతి పొడవైన నదిగా పేరుపొందిన నైల్ నది మొత్తం 6600 కిలోమీటర్ల పొడవులో, ఈజిప్ట్‌లో ప్రవహించేది 1500 కిలోమీటర్లు మాత్రమే. ఎక్కడో ఈజిప్ట్‌కి దక్షిణంగా ఉన్న విక్టోరియా సరస్సులో పుట్టి, సుమారు 8 దేశాల గుండా ప్రవహించి, ఈజిప్ట్‌లో ఉత్తరంగా ఉన్న మెంఫిస్ దగ్గర పాయలుగా విడిపోయి, మెడిటెర్రేనియన్ సముద్రంలో కలుస్తుంది. ఈజిప్ట్‌లో దక్షిణంగా ఉన్న అతి పెద్ద పట్టణమైన అస్వాన్ సమీపంలో ఉన్న నాసర్ సరస్సులో 80వ దశాబ్దంలో కృత్రిమంగా నిర్మించబడ్డ ఆనకట్ట వల్ల ఈజిప్ట్ దేశస్తులు ప్రతి ఏటా భయపడే అతి పెద్ద ప్రమాదమైన నైల్ వరదలు ఆపబడ్డాయి. పొడవులో అతి పెద్ద నది అయినా, నైల్ నది వెడల్పులో మాత్రం చిన్నదే! కొన్ని కొన్ని చోట్ల, నైల్ నది వెడల్పు, అర కిలోమీటరు కూడా ఉండదు. నైల్‌తో పోలిస్తే, గోదావరి నది రాజమండ్రి దగ్గర మూడు కిలోమీటర్ల కన్న ఎక్కువే పొడవు కదా! ఈజ్ఇప్ట్‌లో వర్షపాతం అతి తక్కువ కాబట్టి, నైల్ నది నీరు ఈజిప్ట్ ప్రజల జీవనాధారం! ఒక ఒడ్డునుంచి చూస్తే ఆవలి ఒడ్డు సుబ్భరంగా కనపడుతుంది. అంతే కాదు! చాలాచోట్ల, ఒడ్డుని ఆనుకుని చిన్న చిన్న మొక్కలు, గడ్డి పెరుగుతాయి. మరి కొన్ని చోట్ల ఒక పది మీటర్లు ఒడ్డు నుంచి బయటకు వస్తే, ఇసుక పర్రలతో, ఎడారి మొదలవుతుంది. ఈజిప్ట్ లోని పిరమిడ్‌లు అన్నీ, నైల్ నది పశ్చిమ తీరం పైనే కట్టడం గమనించ తగ్గది. ఇందుకు కారణం, ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో ముఖ్యమైన దేవత సూర్యుడు. (“రా” అని పిలుస్తారు) సూర్యాస్తమయం పశ్చిమాన జరుగుతుంది కాబట్టి, పిరమిడ్‌లు కూడా పశ్చిమాన్నే కట్టాలన్న సాంప్రదాయం వచ్చింది. మా నైల్ నదిపై క్రూజ్ విహారం అస్వాన్ నుంచి 90 కిలోమీటర్లు ఉత్తరంగా ఉన్న లుక్సర్ అన్న ఊరికి. ఇలా నైల్ నదిపై విహారం నాలుగు రోజులు (మూడు రాత్రులు). ఈ ప్రయాణంలో బోలెడన్ని ప్రాచీన దేవాలయాలు చూసాం. అన్ని దేవాలయాలు తూర్పు ఒడ్డున ఉన్నాయి, వాలీ ఆఫ్ కింగ్స్, క్వీన్స్ (ఇక్కడ ప్రాచీన ఈజిప్ట్ రాజు-రాణీల సమాధులున్నాయి) అన్నీ పశ్చిమతీరం వెంబడి ఉన్నాయి.


అస్వాన్ నుంచి లుక్సర్ దాకా
ఈజిప్ట్ యాత్రా విహారం కోసం వచ్చిన వాళ్ళు, నైల్ అందాలను, నది పొడవునా ఉన్న లెక్కపెట్టలేనన్ని ప్రాచీన దేవాలయాలను, శిధిలాలను చూడకుండా వెళ్ళరు! అలా చూడాలంటే, అస్వాన్ నుంచి లుక్సర్ దాకా ఉన్న 90 కిలోమీటర్ల దూరం మోటారు బోటులో ప్రయాణం చాలా వీలుగా ఉంటుంది. మేం అలానే చేసాం! ఇది నాలుగు రోజులు (మూడు రాత్రులు). ప్రాచీన ఈజిప్ట్ నాకరికతలో ముఖ్యమైనవి రకరకాలైన దేవతలు, వారికి కట్టిన దేవాలయాలు, వాటిలో ప్రపంచంలో అతి ప్రాచీన భాషల్లో ఒకటయిన ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ (Egyptian Hieroglyphs) లో రాయబడ్ద రాతలు. ఈ ప్రయాణంలో నైల్ నదికి తూర్పు తీరాన, అస్వాన్ (Aswan), కొమొంబో (Kom Ombo), లుక్సర్ ((Luxor), కార్నాక్ దేవాలయం (Karnak Temple) ఉన్నాయి. పశ్చిమ తీరం వెంబడి ఎడ్పు (Edfu), ఎస్న (Esna), వాలీ ఆఫ్ కింగ్స్ (Valley of Kings), వాలీ అఫ్ క్వీన్స్ (Valley of Queens) ఉన్నాయి. ఒకటి, రెండు దేవాలయాలు చూడగానే, వాటిల్లో ఉన్న వివరాలు, వాటి కథల సమాచారాలతో ఉక్కిరి బిక్కిరి అవుతాం! అంతే కాకుండా, ఒకటి-రెండు దేవాలయాలు చూసిన తరవాత, మిగిలిన దేవాలయాలు ఇంతకు ముందు చూసిన దేవాలయాల్లాగే ఉన్నట్లు అనిపించటంతో ఏ దేవాలయం దేనికి ప్రసిద్ధమో మరిచిపోతాం! విదేశీయులు భారతదేశానికి యాత్రలకి వచ్చినపుడు, మన దేవాలయాలని, ప్రాచీన శిధిలాలను చూసి ఇలాంటి అనుభూతులకే గురి అవుతారనిపించింది. చాలా దేవాలయాల్లో, అనేక రకాలైన జంతువులను కూడా “మమ్మీ”ల క్రింద మార్చి భద్రపరచారు.


ఇందాకా చెప్పుకున్నట్టు, పశ్చిమ తీరంలో ఉన్న ప్రాచీన రాజు-రాణీల సమాధులు తప్పని సరిగా చూడవలసిందే! ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి, ఈ పిరమిడ్‌ల లోపలి గోడలపై చిత్రించిన అనేక రకాలైన చిత్రాలు, అందమైన నగిషీలతో మలచబడ్డ బొమ్మలు, శవపేటికల. అంతే కాకుండా, పిరమిడ్‌ల నిర్మాణంలో చూపించిన నైపుణ్యం మరువ లేనివి. ( ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి! మేం చూసిన సమాధులు {పిరమిడ్స్} అన్నిటిలోనూ ఫోటోలు తీయటం నిషేధం! ఒక యాత్రీకుడు తాను ఎవరికీ తెలియకుండా తెలివిగా ఫోటో తీస్తున్నాననుకొని, మేం చూస్తుండగానే, అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ కంటబడ్డాడు! వెంటనే, సెక్యూరిటీ గార్డ్ ఆ యాత్రికుడి నుంచి కెమేరా లాక్కొని తిరిగి ఇవ్వలేదు!) మా క్రూజ్ గైడు చెప్పిన దాని బట్టి, ఈజిప్ట్ ప్రభుత్వం ఇప్పటికీ కొత్త కొత్త సమాధులని తవ్వకాల ద్వారా కనుక్కుంటూనే ఉన్నారట! ఇప్పటి దాకా మేము చూసిన వాటికే మాకు మతి పోతుంటే, ముందు ముందు కనుక్కోబోయే విషయాలు ఇంకెన్ని ఉంటాయో అని తలచుకుని ఆశ్చర్యపోయాం!


పగలల్లా బోటులో ప్రయాణం, మరి ప్రయాణం లేకపోతే బోట్ ఆపి అక్కడక్కడ దేవాలయాలు, ఇతర యాత్రా స్థలాలు చూట్టం. మరి ప్రతి రాత్రీ బోటులో ఏదో ఒక విందు ఉండేది. ఒక రాత్రి, ఈజిప్ట్‌లో ప్రసిద్ధమైన బెల్లీ డాన్స్ (Belly Dance) ఏర్పాటు చేసారు. బెల్లీ డాన్స్ ఈజిప్ట్ ప్రాంతాల్లో ప్రసిద్ధమైన ప్రాచీన నృత్యం. మన హిందూ సాంప్రదాయంలో స్త్రీలు బొడ్డు చూపించకుండా బట్టలు వేసుకుంటారుకదా, ఈ బెల్లీ డాన్స్ అసభ్యంగా ఉంటుందేమో అనుకున్నా! నిజానికి ఈ డాన్స్ ఎటువంటి అసభ్య ప్రదర్శన లేకుండా ఉండే నృత్యం! కానీ నాకు ఎందుకో, ఈ బోట్ లో చూసిన నృత్యం అంత బాగా నచ్చలా. మా తిరుగు ప్రయాణంలో షర్‌మల్ షేక్‌లో చూసిన బెల్లీ డాన్స్ నాకు బాగా నచ్చింది. బెల్లీ డాన్స్ ప్రస్థుతం ఈజిప్ట్‌లో అంతరించి పోతున్న కళ అని అమానీ చెప్పింది. మరొక రాత్రి జల్లబియ (Jallabiya) విందు ఏర్పాటు చేసారు. జల్లబియ అంటే, శరీరం పైనుంచి క్రింద వరకు, అతుకుల్లేకుండా, ఒకే గుడ్డతో చేసిన డ్రెస్. ఇది ఈజిప్షియన్‌ల జాతీయ డ్రెస్. ఈజిప్ట్‌లో సంవత్సరం పొడుగునా ఉండే మండే ఎండ నుంచి శరీరం కాపాడుకోటానికి ఇటువంటి బట్టలే సరిపోతాయి. మేం పెద్ద వాళ్ళమే కాకుండా, చిన్న పిల్లలకి కూడా సరి అయిన జల్లబియలు కొనుక్కుని విందుకి వెళ్ళాం!


మా ఈజిప్ట్ యాత్రలో మరి కొన్ని పరిశీలనలు ఇవి. మేం ఎక్కడకు వెళ్ళినా, నాతో అంతా అరబిక్‌లో మాట్లాడటానికి ప్రయత్నించేవారని ముందే చెప్పాను కదా! నా మొఖంలో అరబిక్ తెలిసిన ఛాయలేవీ కనపడక పోవటంతో, వెంటనే నేను భారతీయడ్నని గుర్తు పట్టామని చెప్పటానికి “ఇండియా” అనేవారు. భారతీయుల్లో ఒకే ఒక వ్యక్తి ఈజిప్ట్ దేశస్థులందరికీ పరిచయస్థుడు. అతను ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్. నాతో మాట్లాడిన ఒకళ్ళిద్దరు ఈజిప్షియన్‌లు మాత్రం మహాత్మా గాంధీ పేరు చెప్పగలిగారు! కైరో నుంచి ఫెరో రాంసెస్ రాజ్యానికి ముఖ్య పట్టణమైన మెంఫిస్ వెడుతుంటే, చిన్న పిల్లలు నైలు నదికి సంబంధించిన పిల్ల కాలువల ఒడ్డున గాడిదలపై ఆడుకుంటూ కనపడ్డారు. కోనసీమ పరిచయం ఉన్న తెలుగు వారికి కళ్ళకి గంతలు కట్టి ఇక్కడ వదిలేస్తే, కోనసీమలో ఉన్నామన్న ఆలోచన తప్పకుండా వస్తుందనిపించింది. ఒకటే తేడా, మన వైపు పిల్లలు గేదెలమీద తిరుగుతూ ఆడుతుంటే, ఇక్కడి పిల్లలు గాడిదల మీద ఎక్కి ఆడుకుంటారు!

తిరిగి షర్‌మల్ షేక్
నైల్ నది పై క్రూజ్‌లో ఆఖరి మజిలీ లుక్సర్. నాలుగు రోజుల క్రూజ్‌లో అఖరు రోజు లుక్సర్‌లో గడిపి ఆ రోజు రాత్రి విమానంలో తిరిగి షర్‌మల్ షేక్ చేరుకున్నాం. మా తిరుగు ప్రయాణంలో జెనీవా వెళ్ళటానికి మరొక రోజు మిగలటంతో, షర్‌మల్ షేక్‌లో మళ్ళీ ఒక రోజు గడిపాం. ఈ సారి అందరం సముద్రం ఒడ్డునే పారా సైలింగ్ (Parasailing) లాంటివి చేస్తూ రోజంతా గడిపాం.

తిరుగు ప్రయాణం
మా తిరుగు ప్రయాణం రోజు పొద్దున్నే నాలిగింటికి లేచి, అందరం తయారయి, సామాన్లతో పాటు ఆరు గంటలకల్లా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాం. అన్ని పనులూ పూర్తి చేసుకొని విమానంలో కూర్చున్న తరవాత, ఎందుకో ప్రముఖ భాషా సేవకుడు, మహామహోపాధ్యాయ స్వర్గీయ శ్రీ తిరుమల రామచంద్ర గారి ఆఖరి రచన, బహుళ ప్రజాదరణ పొందిన రచన,”హంపీ నుంచి హరప్పా దాకా” పుస్తకంలో ఆఖర్న ఉదహరించిన ఈ క్రింది శ్లోకం గుర్తొచ్చింది.

యస్తు సంచరతే దేశాన్
యస్తు సేవేత పండితాన్
తస్య విస్తారితా బుధిః
తైల బిందు రివాంభసి
(ఎవరు దేశాలు తిరుగుతారో, ఎవరు పండితులను సేవిస్తారో, వారి బుద్ధి నీటిలో పడిన నూనె సెక్కలా విస్తరిస్తుంది!)

ఎక్కడో ఆంధ్రదేశంలో ఒక పల్లెటూర్లో పుట్టి, కొన్ని వేల మంది ప్రవాస ఆంధ్రుల్లాగే అమెరికా దేశం వచ్చి, పదిహేను సంవత్సరాలు అమెరికాలో ఉండి, వృత్తిరీత్యా ఫ్రాన్స్‌లో మూడేళ్ళు గడిపి, అమెరికా, యూరప్ అంతా చూసాను. ఇప్పుడు ఇలా ఈజిప్ట్ చూడటం జరిగింది కదా! ఇన్ని దేశాలు చూడటం వల్ల నా బుద్ధి ఏమైనా వికసించిందా లేదా అని ఆలోచిస్తూ, రెండు వారాల ప్రయాణ బడలిక వల్ల నిద్రలోకి జారుకున్నా!
-------------------------------------------------------
రచన: విష్ణుభొట్ల లక్ష్మన్న, 
ఈమాట సౌజన్యంతో

No comments: