కవిత్వ మీమాంస
సాహితీమిత్రులారా!
1. నేటి కవిత్వం తీరుతెన్నులు
“ఈ మాట” సంపాదకులు నేటికవిత్వం గూర్చి రాయమని ఒకసారి సూచించారు. ఇండియా నుండి స్నేహితుడు వస్తుంటే, విశాలాంధ్రలో కనిపించిన ప్రతి కవిత్వ పుస్తకాన్ని పట్టుకురమ్మని కబురంపాను. ఓ పది పుస్తకాలు మన తెలుగులో కవితా వ్యవసాయం బలంగానే జరుగుతుంది అనడానికి నిదర్శనంగా నా బల్ల మీద. ఆకలిగొన్న నసీరుద్దీన్ గాడిదలా వేగంగా చదవడం మొదలుపెట్టాను.
మన కవులకు ఒక జబ్బు వుంది. పగటివేషగాళ్ళలా రోజుకో వేషం వేయడం. జర్నలిస్టు, రచయిత ,చరిత్రకారుడు,వేదాంతి / తాత్వికుడు ఇలా అన్నీ తామైౖ అసలు తామెవరో మరచిపోతారు. ఇక అక్కడి నుండి సమస్య మొదలవుతుంది.
జరిగింది జరిగినట్టు చెప్పేవాడు జర్నలిస్టు. వాడికి యథాతథ కథనం ముఖ్యం. సాఫీగా, తాపీగా వచనం రాసేవాడు రచయిత, ఇందులో ఆలోచన ప్రధానం. గతాన్ని నానా ఆధారాల నుండి సంగ్రహించి ప్రదర్శించేవాడు చరిత్రకారుడు. వీడికి యథార్థ దృష్టి ప్రాణం. అదిలేనిదే క్షణం మనలేడు.చివరిగా మిగిలిన వాడు వేదాంతి / తాత్వికుడు. చరాచర జగత్తును ఒక్క సూత్రంతో బంధించ గలగడం వీడి ప్రత్యేకత. సదసద్వివేచన వీడికి ఆత్మ. చివరి వ్యాపకాలు అందరూ చేపట్టగలిగేవి కావు. అందరికీ అందుబాటులో వున్నవి మిగిలిన తేలిక వేషాలు రెండు జర్నలిస్టు, రచయిత. కవి వీరందరి కన్నా ఏ రకంగా భిన్నుడు?
స్ఫటికానికి, గులకరాయికి ఉన్నంత తేడా వుంది కవికి, ఇతరులకు. కవిభాష వేరు. అతను రూపు కట్టించే భావం వేరు. అతని పరంపరే వేరు. అందుకే మనం కవిత్వానికి అంత విలువ ఇచ్చుకొంటాము. నేను పేర్కొనని వేషం ఇంకొకటుంది. రాజకీయవాది / ఉద్యమకారుడు.కవిత్వాన్ని అధ్వాన్నపు ఎడారిలో వదిలేసి రాజకీయాన్ని / ఉద్యమాన్ని తలకెత్తుకోవడం వీడి పని. కవి వేయగల అన్నివేషాల్లో అధమ వేషం ఇదే.
తెలుగు సాహిత్య వాతావరణాన్ని రాజకీయం ఎంత దిగజార్చిందో చెప్పడానికి మాటలు చాలవు. గతంలో మార్క్సిస్టులు సాహిత్యాన్ని చరిత్రకు కట్టుబానిసగా చేశారు. దాని కన్నా హీనమైన పాపం కవిత్వ వటపత్ర ఛాయను వదిలేసి నానా రాజకీయ ఉద్యమ ఛత్రాల క్రింద ,తమకంటూ సొంత అస్తిత్వం లేకుండా కవులు తలదాచు కోవాల్సి రావడం.
ఇక్బాల్ చంద్ అలవోకగా మంచికవిత్వాన్ని రాశాడు. ఐతే సంకలనం పేరు “ఆరో వర్ణం”. మళ్ళీ అక్కరకు రాని రాజకీయ వాసన. పుస్తకంలో విస్తరించిన దట్టమైన కవిత్వానికి ,”ఆరోవర్ణం ” కవితలో వ్యక్తమైన అస్తిత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. అతని కవితాత్మను అది ప్రతిబింబించడం లేదు. ఇంత చక్కటి కవి తన సంకలనానికి అటువంటిపేరు ఎన్నుకోవడానికి కారణం?? మన తెలుగులో భోపాల్ విషవాయువులా వ్యాపిస్తున్న రాజకీయ కాలుష్యం !
ఇక పోతే, ఇక్బాల్ చంద్ కవిత్వంలో అంతుపట్టని సంఘర్షణ, ‘ ఆత్మలోకంలో దివాలా ‘ , అన్వేషణ, వడపోతా, అరుదుగా ఆశా, అశాంతి అన్నీ ముప్పిరిగొని కని పిస్తాయి. ఇతనిలో నన్నాకర్షించినది నిరాడంబర శైలి. అక్కడక్కడ పద్యకవుల్లో కనిపించే ‘నిర్గమ్య’ భాషాలౌల్యం, అసమతౌల్యం కొంచెం కుదిపినా, ఇటీవలి కాలంలో వచ్చిన కవిత్వంలో నిస్సందేహంగా ఇతనిది సొంత గొంతుక. అరుదైన అంతరంగ మధనం ,నిజాయితీ నిలువెల్లా వున్న కవి. ‘నిక్కమయిన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల’ అన్నట్టు ఇతనిదొక కవిత మచ్చుకి.
దీపకాంతి.
కనుచూపు మేరలో దీపకాంతి
బ్రతకడానికి ఒక నమ్మకం దొరికింది
సుదీర్ఘ జ్వరకాలం
పత్యం తర్వాత ఆకలిలా
ఒక విశ్వాసం భవిష్యత్తు పుష్పించింది.
‘మల్టీ నేషనల్ ముద్దు ‘ కవయిత్రి కొండేపూడి నిర్మల ఫెమినిస్టుగా లబ్ధ ప్రతిష్ఠులు. ముప్ఫైకి పైగా కవితలున్న ఈ సంకలనంలో బలమైన కవితాంశ గల కవితలుగా నేను ఎంపిక చేయగలిగినవి నాలుగే. ( seasonal love , పురుగులందు పుణ్య పురుగులు వేరయా, మేల్ వార్డ్ నం.2, అలలెప్పుడూ తీరం మీదనే). ఇంకో ఐదు కవితలు (జాడ, పంటిబిగువున, చావుడప్పు, ఊపిరాడ్డం లేదు,హోమ్ సిక్ ) ఫర్వాలేదనిపించినా, అనవసర కవిత్వేతర అంశాలు దూరి, కవిత్వాన్ని ఈనగాచి నక్కలపాలు చేశాయి. దీనికి కారణం తనలో కవికన్నా జర్నలిస్టు, రచయిత, రాజకీయవాది / ఉద్యమకారుడు బల పడటమే. క్లుప్తతను విస్మరిస్తే ఎలా?? చైనా గోడలా అంతూపొంతూ లేని భావావేశాలు ఇబ్బంది కలిగిస్తాయి. పేర్కొన్న కవితల్లో NRI ల శుష్క జీవితం,అసహాయ స్త్రీల వేదన, frigidity , గృహిణిగా స్త్రీ అంతరంగం వ్యక్తం చేయడంలో కసి, వ్యంగ్యం ఇట్టే ఆకట్టుకొంటాయి.
seasonal love కవితలో
అనువదిస్తే తప్ప
నాకల నీకర్థం కాదు
దుబాసీ కావాలి
ఫ్రెంచి ముద్దే తప్ప
పెదవి మీది నిట్టూర్పు నీకర్థం కాదు.
రెండు దేశాలు కరుణిస్తే తప్ప
తల్లి చావుకు రాలేని పరాధీనం పెళ్ళికొడకా
ఐ వుడ్ లైక్ టు మిస్ యు!
ఇంకో సంకలనం బైరెడ్డి కృష్ణా రెడ్డి “ఆర్తి”. ఎక్కడో తప్ప కవిత్వఛాయలు కనిపించవు.( ‘నడిసంద్రపు అగాధాల బాహువులపై ‘ లాంటివి). కలగా పులగపు భావజాలం. కాపీ పుస్తకాల్లో వాక్యాలు. తెలుగు వ్యావహారికమే సరిగా రాయడం చేతగాకపోతే , కవిత్వం దాకా ఎందుకు??
ఒక వెళ్ళిపోతాను ఎమ్‌ఎస్‌నాయుడు. ‘మో ‘ మార్కు కవి అని ఒక్క మాటలో తేల్చేయడం సబబు కాదు., ‘కలల పాతాళం లోకి వెళ్ళే గబ్బిలం ‘ , ‘గోళ్ళు గిల్లుకొనే పౌరుషాల్లో కుక్కకన్నుకోపాలు,’ ‘గేదెనీడ మనసుతో చేతులు కట్టుకొన్న ముఖంతో ‘ ప్రత్యక్షమవుతాడు కవి. ఇతని ఊహా వైచిత్రికి పెదాల మీద నవ్వు మెరిపించేంత ఝటితిస్ఫూర్తి ఉంది. ఐతే అధివాస్తవికులకు నాదో ప్రశ్న కవిత్వమంటే అంతేనా ??
రమణజీవీ ‘నలుగురు పాండవులు’ లో కూడా అధివాస్తవిక వాసనలే తొంగి చూస్తాయి.రమణ కవిత్వం సజల గంధకితామ్లము (diluted Sulphuric acid) ఐతే నాయుడిది గాఢము. వీరిద్దరిలో ఇంకో సమాన గుణం సంకోచాలు (inhibitions) వదిలేసి రాయడం. చెప్పేదేదో క్లుప్తంగా చెప్పడం. కానీ ఎవరి ఊహావైచిత్రి, కవితా నిర్మాణం వారిదే. వీరిద్దరూ గుర్తు పెట్టుకోవలసింది ఏమంటే, కవిత్వం చాలా ” organized activity “, కావున అనియంత్రిత భావాల సమాహరమే కవిత్వం కానేరదు. అయోమయం ఇద్దరి కవిత్వాల్లో చోటు చేసుకొన్నా, వీటి కేంద్రాలు వేరు. రమణలో నాయుడి తరహా నిర్మాణ జటిలత లేదు, మరి అయోమయ కేంద్రం ఎక్కడుంది? అనుభవాలను కాకుండా, వైయక్తిక ఊహా చమత్కారాన్ని ప్రవేశ పెట్టడంలో ఉంది చిక్కంతా. అధివాస్తవిక దృష్టి నీలో కొత్త ద్వారాలను తెరవాలి!! ఆ దాఖాలాలు ఏమీ కనిపించవు ముఖ్యంగా “నలుగురు పాండవులు” అన్న టైటిల్ కవితలో. పుస్తకం మూశాక మనకంటూ ఏ అనుభూతి మిగలక పోవడం ఎంత విచారకరం!! ఇతనిదో కవిత
“నాకు తెలిసినంత వరకు”
నాకు తెలిసినంత వరకు
రాత్రి నిలువుగా వుంటుంది
పగలు త్రిభుజంగా వుంటుంది
రోడ్డు గుండ్రంగా వుంటుంది
భూమి బల్లపరుపుగా వుంటుంది
నువ్వు సరళరేఖలా వుంటావు.
నీ మీదేగా నన్ను ఆరేసుకొనేది.
“ఆమె నా బొమ్మ ” లో అయిల సైదాచారి కవిత్వం obsessive గా స్త్రీ చుట్టూ పరిభ్రమిస్తుంది, అడపా దడపా తన నాయనను, వృత్తిని తలచుకొన్నా. స్త్రీ కేంద్రంగా వ్యక్తమయ్యే అనుభవం, బలం, బలహీనత, ఐంద్రియ సమ్మోహం అన్నీ కాన వస్తాయి. ఇతని కవిత inhibitions తీసి అవతల పెట్టింది.
Liberated woman ని స్వప్నిస్తూ
వివాహితుడైన కవి అన్న కవితలో
ఆమె రక్తసరస్సులో రెక్క విచ్చుకొన్న పావురాయి
నా భుజమ్మీద వాలుతుంది.
ఆమె కళ్ళ ఇంద్రనీలాల్ని ముక్కున కరచుకొని.
సొంతంగా ఏమీ మిగలని అమూర్త అస్తిత్వం నేను
ఎవరి సొంతం కాని విముక్త సౌందర్యం ఆమె.
ఆమె నా మోహాన్వేషణ మజిలీ.
శ్రీధర్ బాబు అనేక వచనం పక్కదారులు తొక్కకుండా సూటిగా ప్రవహించే కాలువలా మనసును తాకుతుంది. ‘తాడి చెట్ల మధ్య ప్రత్యూష నక్షత్రాలను పట్టుకు వేలాడే ‘ భావుకుడు. ఇతని కవితా దృష్టి ప్రసరించిన మేరకు ప్రకృతి వింతకాంతులతో గోచరిస్తుంది, ఈతని ఏకాంతపు తీక్ష్ణతకు లోబడి. తిలక్ తరహా భావుకత్వం దర్శనమిచ్చినా, శైలి మాత్రం అతనికన్నా నిరలంకారం. కానీ అది లోపం కాదు. ఇతని హైకూలు కూడా సారమంత మైనవే! మచ్చుకి ఓ రెండు
తల్లి ఒడిలో
ముద్దొచ్చే కవల పిల్లలు
ఒకరికొకరు అద్దం
చెదిరిన ముంగురుల్ని
తనే సవరించుకొంది
నాకెందుకో బాధ
వేడన్ తాంగల్ అన్న అందమైన కవితలో
రకరకాల రంగురంగుల పక్షులు
ఆకు పచ్చగా పరచుకొన్న చెట్లన్నీ
హృదయాల్ని ఆరబోసుకొన్నట్టు..
నేనొక్కడినే అందరిలో ఒంటరిగా
కాసేపటికి ఆ ఒక్కడు జాడలేడు.
ముకుందరామారావు గారి “మరో మజిలీకి ముందు” చాలా నిరాడంబరంగా, సాంధ్య తారలా సున్నితంగా ఆకట్టుకొంటుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం, పూలు, వర్షం, ఆకాశం ,సంబంధ బాంధవ్యాలు అన్నీ ఒద్దికగా ఒక చోట నిలిచి చేర బిలుస్తాయి. అనుభవజ్ఞుడైన గృహస్థులా ఈయన దేన్నీ దుబారా చేయడు. మాటలు, భావాలు, పదచిత్రాలు అన్నీ సరిగ్గా అమరుతాయి. తనకు తెలిసిన ప్రపంచాన్ని మనముందు దృశ్యమానం చేస్తాడు.
ఏకాంత వేళ అన్న కవితలో
గతాగతాలు
ఊహాతీత ఉదయాలు
ఆలోచనంతా పాకిన
అల్లకల్లోల ప్రశాంతం
దినాంతపు ఏకాంతం చీకటి.
వెంటాడే కలాలు(వెనుక బడిన కులాలు) దీని వెనుక ఓ ఇరవై ముగ్గురు వున్నారు. రెండు వందల పుటల మేరా విస్తరించి. పరిశీలన కు ముందుగా
కవిత్వమంటే ఏమిటి ??
అభిప్రాయాలు వెల్లడించడం కాదు. రాజకీయాలు తలకెత్తుకోవడం కాదు. తాత్విక వాక్యాలను పేర్చడం కాదు. కేవల వైయక్తిక వేదనను వెలిగ్రక్కడం కాదు. అర్థం కాని సిద్ధాంతకబళాన్ని వెదజల్లడం కాదు. భాషాడంబరం కాదు, భావ తిమిరం అసలు కాదు మరేది కవిత్వం?? సంక్షుభిత హృదయాకాశంలో అరుదుగా మిరిమిట్లు గొలిపే మెరుపుతీగ. దానికి శుష్క తర్క ప్రజ్ఞ అవసరం లేదు. తాత్విక చర్చలతో పని లేదు. దాని జాడ సోకినంత మేర బుద్ధి జనిత జాడ్యాలు తేరిపార చూడలేవు. మన్నూ మిన్నూ ఏకమయే ఒక గాఢానుభూతి..తీవ్ర సంవేదన ఒక ఆకృతి తీసుకోవడం సప్తవర్ణ చాపాన్ని వేయడం అదీ కవిత్వం.
మన తెలుగు కవులు తరచూ ఎందుకు దారి తప్పుతున్నారు? సాయంత్రం చిక్కబడి రాత్రిగా మారి దిగంతాల్లో వెలిగే దీపాలను కనులకు చూపినట్టు కవిత్వాన్ని ఎందుకు రాయలేక పోతున్నారు? దీనికి కారణాలు POLITICS లో లేవు. POETICS లో వున్నాయి. మొట్టమొదటి కారణం గతానుగతికంగా వస్తున్నదే గద్యాన్ని, పద్యాన్ని వేరు చేయలేని, వేరుగా చూడలేని అసమర్థత. కవన్న వాడికి ఏది శుద్ధ కవిత్వం ,ఏది శుష్క వచనం తెలియకపోతే ఎలా? వాడికి తెలియదే అనుకొందాం. విమర్శకుడు కలుగజేసుకోవసింది అక్కడే!! గాడి తప్పుతున్నప్పుడు కఠినంగా నైనా సరిచేయవలసిందే!! ‘బుద్ధి చెప్పు వాడు గుద్దితే నేమయా ‘ అని మన వేమన అననే అన్నాడు.
ఇక వెంటాడే కలాల్లోకి ప్రవేశిద్దాం !
‘ సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల ‘ చుట్టూ ఎడం ఎడంగా తిరిగారే తప్ప ఒకరిద్దరు మినహా ఎవరూ కవిత్వం రాయలేక పోయారు. దీనికి కారణం వీరు politics ను నమ్ముకొన్న వారు, poetics ను కాదు.తెచ్చి పెట్టుకొన్న ఆవేశాలు పెట్టుడు మీసాల్లా ఎక్కువ సేపు నిలవవు. గుండె గొంతుకతో కొట్లాడని సందర్భాలే ఎక్కువ. రాళ్ళపల్లి వారు ఏనాడో శలవిచ్చారు తన వేమన ఉపన్యాసాల్లో. అందరికీ భావాలు ఉంటాయి. కవన్నవాడు వ్యక్తపరిస్తే అది కవిత్వం మనం ఉద్యమిస్తే అది భవ్యమైన నత్తి అవుతుంది అని. ఆ చందానే తయారయ్యాయి అధికశాతం రచనలు.
వివరాల్లోకి పోత ే ఇరవై ముగ్గురి లో కవిత్వం రాసింది ముగ్గురే. మిగిలిన వారంతా వచనకవిత్వంలోని మొదటి పదాన్ని వదలకుండా పట్టుకొన్నారు. “మంచి అన్నది పెంచు మన్నా” అని వారి జోలికి పోకుండా ఈ ముగ్గురు రాసింది ఎందుకు కవిత్వమైంది ? ఇతరులు రాసింది వచనం లేదా అంతకన్నా హీనం ఎందుకైంది? అని వివేచిస్తే వీరి వేదన వైయక్తికమే .. సార్వత్రికం కాలేక పోయింది. అంతే కాదు హృదయ కవాటాలకు బుద్ధి భూతంలా కాపలా కాసి కవిత్వాన్ని దూరం చేసింది.
అంబటి వెంకన్న రాసిన ఆరు కవితల్లో చిత్తశుద్ధి, చేస్తున్న పనిలో మమేకం కావడం కనిపిస్తుంది. అతని ఊహలు, భావాలు, కవిసమయాలు ఏవీ పరాయి కావు. “జిల్లేడు పూవు” అన్న కవితలో మొదటి పంక్తులు.
ఏటి చివర మనసు ఎరవేసి కూర్చున్న
ఒడ్డెంట నీసుకంపుతో నువ్వొస్తున్నప్పుడు
ఏరొస్తున్న అలజడితో
నీటిబుడగల్లాంటి ఆనందం నాది.
నీ ఒంటిపై
నా ఒండు పెదాలతో పెట్టిన ముద్దు
వాగై ఎన్ని వంకలు దిరిగిందో..
ఈ కవితలు రాయడానికి కారణం అతను మత్స్యకారుల కుటుంబంలో పుట్టడం కాదు, కవి కావడమే !
తర్వాత వెంకట్ రాసిన ఆరు కవితల్లో (వెనుకబడ్డ కల మినహాయించి) రమారమి పై నేపథ్యమే కనిపిస్తుంది. ఏదీ కృతకంగా లేదు, జాలరి సముద్రం మీదికి పోయినంత అనాయాసంగా కవితామీనాలను పట్టుకొస్తాడు.
“గంగమ్మ” అన్న కవితలో
చేపల తట్ట మోస్తూ అమ్మ
వంటి నిండా నీసు నింపుకొని
ఉప్పుచారలతో మెరుస్తూ
తీరం వెంట నడుస్తుంది సముద్రంలా
పులిపాటి గురుస్వామి రాసిన నాలుగు కవితల్లో తనదైన బలమైన గొంతుక వినిపించాడు.
“అయ్యా మల్లెప్పుడొస్తవే” అన్న కవితలో అడవులు పట్టిన నాన్నను గురించి పసిదాని ఆవేదనలు,ఆలోచనలు. చక్కటి narrative poem మరో కవిత “ద్రవ పురుషుడు” మంచి ఎత్తుగడతో మొదలవుతుంది. అన్నీ అమరిన పద్యమిది.
అతడెవరు మిత్రుడా
స్వచ్చమైన నీటికింది నాచులా కళ్ళు
కళ్ళల్లోని సముద్రం
దాని అంచులవెంట ఒంటరి ప్రయాణము
ఈ ముగ్గురు తెలంగాణా మాండలికాన్ని ప్రతిభావంతంగా వాడుకొన్నారు. “కుక్క పని గాడిద చేసినట్టు” ఏ రాజకీయాన్ని తలకెత్తుకోరు. రసాభాస చేయరు. కవిశబ్ద వాచ్యుడు చేయవలసింది కవిత్వం రాయడం ఇతర వేషాలను కట్టిపెట్టడం. వీరు చేసిందదే.
ఇక కడగా వచనానికి వస్తే నాళేశ్వరం శంకరం “శవం ముందు శంఖం”, బాణాల శ్రీనివాసరావు “కుంపటి”, జుగాష్ విలీ “కొన్నివాక్యాల్లో” కొన్నివాక్యాలు ఆర్తితో కదిలిస్తాయి.
2. కవిత్వ మీమాంస
గద్య పద్యాల మధ్య విభజన రేఖ గతానుగతికంగా గజిబిజిగానే వుంది. పద్యరూపం లో వెలువడినదంతా కవిత్వమేనా? కాదు అనే గట్టి సమాధానం. దానికి నిదర్శనగా ఇంట్లో బూజు పట్టిన పుస్తకం (1930ల్లో ప్రకటితం), మనసులో మెదలుతుంది! అది విషకేసరి అన్న detective , మొత్తం పద్యాలతో నిండి వుంటుంది. అందులో కవిత్వమన్నది కాగడా వేసి చూసినా, దుర్భిణి పెట్టి పరిశీలించినా మచ్చుకైనా కనిపించదు. రచయిత ఉద్దేశం లో కూడా అది కవిత్వం కాదు, అపరాధ పరిశోధక నవలే కాబట్టి మనకు సమస్య లేదు. మబ్బులు, మెరుపులు, చంద్రుని చుట్టూ గుడి కట్టడం ఇత్యాది వాతావరణ అంశాలు ప్రస్తావించే రెట్టమత శాస్త్రం, నానా గణిత సమస్యలను విపులీకరించే పావులూరి మల్లన, గణిత సార సంగ్రహం “టాటోటు,టకటొంకు,ఠవళికాడు” అని దొంగలకు కూడా పర్యాయ పదాలు చెప్పే పైడిపాటి లక్ష్మణ కవి ఆంధ్రనామ సంగ్రహం, పద్యాత్మకమే నయినా, అందులో కవిత్వాన్ని వెదకడం, చీకటి గదిలో లేని నల్లపిల్లిని వెదకడం రెండూ ఒకటే. గ్రంథకర్తలు వాటిని కవిత్వాలుగా ఎక్కడా పేర్కొనలేదు కాబట్టి గొడవ లేదు. చరిత్రలో వాటి ఘనతకు వచ్చిన లోపం లేదు.
ఛందోబద్దంగా వున్నంత మాత్రాన కవిత్వం కాదు అని చెప్పడానికే ఇదంతా! ఖద్దరు కట్టిన ప్రతివాడూ గాంధేయవాది కానట్టు, పద్యరూపం లో వెలువడ్డ అసంఖ్యాక రచనలు (శాస్త్రాలు, నిఘంటువులు) కవిత్వం కాదు. పద్యరూపంలో ఊదిన ప్రతీది కవిత్వం కానేరదు, ఏ భాషలో నైనా సరే! పద్యం కేవలం వాహిక, పాత్ర, లేదా చషకం. అందులోని ద్రవం మధువే కానక్కర్లేదు, ఉట్టి మంచి నీళ్లు కావచ్చు. ప్రతీది పద్యరూపం లో పెట్టడం ఆనాటి అలవాటు, మౌఖిక సంప్రదాయానికి సంబంధించినది. ఈ నాడు కంప్యూటర్ , మిక్సీ ఎలా వాడాలో తెలిపే పుస్తకం ,ఎవరైనా పద్య రూపం లో పెడితే ఝడుసుకొంటాం.
ఇక గద్యం సంగతి. పద్యం కేవలం వాహిక ఐనప్పుడు ఇక గద్యం ఎక్కడ తల దాచుకొంటుంది? గద్యాత్మకమైతే కవిత్వమవుతుందా? వచనమే కవిత్వమా? ముమ్మాటికీ కాదనే సమాధానం. “కవీనాం గద్యం నికషా వదంతి” అన్న ఉక్తి మనకు వుండనే వుంది. చలామణిలో వున్న ఛందస్సులను కాదని, స్వతంత్రంగా నడక నేర్చి, కొత్త పోకడలు పోయే కవుల గూర్చే ఆ అభిభాషణ. గద్యాన్ని పద్యంగా మార్చేది ఛందస్సు. అంతవరకే దాని పని. పేచీ లేదు. ఛందస్సులో ఎక్కడా పద్యాన్ని కవిత్వంగా మార్చే పూచీ లేదు. “తెలుసుకొన్న జ్ఞానికి గంగంతా సారాయే ఐనట్టు”, పద్యమంతా గద్యమే, అటుదిటుకూడా. భూమ్యాకర్షణ వదిలించి,శూన్యావరణంలోకి విసిరేయడం వరకే ఛందస్సు పని. పద్యాన్ని కవిత్వ కక్ష్యలో ప్రవేశపెట్టడం దాని చేతుల్లో లేదు. సారాంశం ఏమంటే గద్యం నడుస్తుంది, పద్యం ఎగురుతుంది. పోతే ఎగిరేదంతా కవిత్వం కాదు విమానం పక్షి కాలేనట్టే.(కారణం అది నిర్జీవం కావడమే.)
మరి వచనమేమిటి? పద్యమేమిటి? వంధ్యమూ, వక్రమూ అయిన వచన పద్యం ఏమిటి? దాని జ్యేష్ఠ భ్రాత వచన కవిత్వం ఏమిటి? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనుకోవడం వెనుక వున్న అమాయకత్వానికి ఇదేమీ తీసిపోదు.
verselibre వచన కవిత్వం కాదు, దాని ముక్కస్య ముక్క అనువాదం “ముక్తకవిత” అంతకన్నా కాదు. పాతవాసనలు వదిలేసి, అవశేషాలను పాతేసి, సరళంగా కవిత, కవిత్వం అని పిలుచుకోవడం సులువు, సబబు కూడా. వచనం వచనమే, కవిత్వమెలా అవుతుంది. కింద పడి పల్టీ అన్నాడట వెనుకటి వాడెవడో!! చూస్తుంటే అలా వుంది మన వ్యవహారం! కాబట్టి వచన కవిత్వమన్న సంకర జాతి వంగడం అవసరం మనకు లేదు. నేలమీద తిరిగే జంతువు లాంటి వచనాన్ని, నింగిలో ఎగిరే పక్షి లాంటి కవిత్వాన్ని, కలిపేందుకు పరిణామక్రమంలో అంతరించిపోయిన ArcheoT Rex లాంటి వచన కవిత్వం అవసరం మనకు లేదు. prose ను వచనంగా, poetry ని కవిత్వంగా వ్యవహరించుకోవడమే హాయి. పద్యగద్యాలతో “చంపూ” కోకుండా!
గద్యమూ కవిత్వం కాక, పద్యమూ కవిత్వం కాక, మరేమిటి కవిత్వం? కవిత్వమన్న బ్రహ్మపదార్థ నిరూపణ కు నేతివాదమే నేటి వాదమా? అది అనుభవైక వేద్యం. “నవా అరె జాయా కామాయ ప్రియా భవతి, ఆత్మనస్తు జాయా ప్రియా భవతి”; ఆత్మ వల్లే భార్య ప్రియంగా కనిపిస్తుంది, మరొక దానివల్ల కాదు, అన్న ఉపనిషద్ వాక్యం ఇక్కడ అక్కరకు వస్తుంది. కవిత్వం ఆత్మ! దానివల్లే కృతి శోభాయమానమవుతుంది!! ఇతరేతరాల వల్ల కాదు. దాన్ని పరిగణనలోకి తీసుకోని రూపచర్చ అంతా వృధా. పునరావృతమయే జీవితానుభవాలు కవితలుగా మారతాయి అంటాడు ఒక కవి. కవి మరచిపోలేనివి, మళ్లీ మళ్లీ ఏకాంతం లో తలచుకొనేవి భాషలోని జవజీవాలను నింపుకొని, ఛందోబద్దంగా, లయాన్వితంగా వెలువడుతాయి!
వాటికి ఒక తక్షణ ప్రయోజనం కూడా వుంది. రాసినవాడికి సాంత్వన చేకూర్చడం. ఆ అనుభవం విశ్వజనీనం కావడం, కేవలం యాదృచ్ఛికం. తమ ఆనందం కోసం సంసారం చేస్తే ముచ్చట గొలిపే పిల్లలు పుట్టు కొచ్చినట్లు! జీవితమే ఒక పెద్ద paradox ! కవి శోకిస్తూ రాసినదాన్ని చదివి జనం అనందించడం ఈ కోవలోకే వస్తుంది. జనాల చప్పట్లు కవన్న వాడికి అవసరం లేదు. వాడిలో ఊపిరి తీసుకొనే జగత్తు, ఊహలూ, ఉల్లంఘనలూ, ఎందరు ఆచూకీ తీసినా అంత తేలికగా అందేవికావు.
కొందరి కవితలు ఎక్కువ లయబద్దంగా వుండటానికి ఏమైనా కారణాలు వున్నాయా? అలా రాయడం వారికి స్వాభావికం కావచ్చు (ఉదా : శ్రీ శ్రీ, బైరాగి); వారిలోని భావతీవ్రత వారిని అలా పురిగొల్పి వుండవచ్చు. కొందరి కవితలు కోమలంగా వుండటానికి ఇవే కారణాలు కావచ్చు (ఉదా : కృష్ణశాస్త్రి,ఇస్మాయిల్ )
ఒక్కొక్క సారి ప్రేరేపణ బయటి నుండి కూడా రావచ్చు. పేరుపొందిన రష్యన్ కవులందరూ (బ్రాడ్ స్కీ, అఖ్మతోవా, మెండెల్ స్తామ్ ) కవితారచనలో చాలా జాగ్రత్తలు తీసుకొనేవారు. కారణం ప్రచురించబడితే ప్రభుత్వం తో తలనొప్పులు, కాబట్టి ప్రచురణ కాక ముందే ఎందరికో వారి కవితలు కంఠతా వచ్చేసేవి. ముఖ్యంగా మెండెల్ స్తామ్ మరణానంతరం ఆతని భార్య, మననం చేసుకొంటూ నిలిపిన కవితలే ఇవాళ మన ముందు పుస్తకరూపం లో వున్నాయి. అమెరికన్ కవులు విట్మాన్ ,ఫ్రాస్ట్ , కార్లోస్ విలియమ్స్ తదితరులు కొన్ని సడలింపులతో శ్రావ్యమైన కవిత్వం రాశారు. భాష విషయం లో ఫ్రెంచి symbolist కవుల పట్టుదల అందరికీ తెలిసినదే, రింబా,మల్లార్మే, వెరలైన్ అందరూ అచ్చమైన కవిత్వం కోసం తపించినవారే, ఇందులో వారు ప్రదర్శించిన అతి తర్వాతి కవులను దారి తప్పేలా చేసింది. ఆడెన్ కూడా ఎంతో శ్రద్ధ చూపే వాడు.
పోతే ఎన్నో రకాల కవిత్వాలు. స్మృతి కవిత్వాలు, అంటే గతాన్ని పునాదిగా చేసుకొని బయల్దేరేవి. ప్రసిద్ధ అమెరికన్ కవి Billy Collins , స్మృతి కవిత్వం మీద పెద్ద గ్రంథమే రాశాడు. మా తాత గారి భోషాణం పెట్టె : స్మృతి కవిత్వం పరిమితులు, అన్న వ్యాసంలో “కవిత్వ చోదకశక్తి కల్పన; అది కరవైతే గతాన్ని అంటి పెట్టుకొని ఊహాకాశాల్లో రెక్కలు విప్పలేదు కవితావిహంగం! అంటాడు. చరిత్రకారుడికి, జర్నలిస్ట్ కు, కవికి తేడా వుంది. కల్పన లేనిదే కవిత్వం లేదు. ఉన్నది ఉన్నట్లు చూపేది చరిత్ర. జరిగినది జరిగినట్టు రాసేది జర్నలిజం. కవిత్వాన్ని గతం చుట్టూ తిప్పే గానుగెద్దులా మార్చరాదు. ‘ నేటి ‘ తో ప్రమేయం లేని కవిత్వానికి ఊపిరాడదు! గింజుకుంటుంది. గతం కారాగారం. చెర కవిత్వానికి హాని చేస్తుంది, బొత్తిగా పనికి రాదు. స్మృతి కవిత్వం పేరిట గతమనే ద్వీపాంతరవాసం లో నెట్టివేయరాదు. వర్తమానం మీద దృష్టి పోగొట్టుకోరాదు.కాబట్టి స్మృతి కవిత్వం రాయడం కన్నా, చక్కని వచనంలో స్మృతులు నెమరువేసుకోవడం చాలా సులువు.
చెట్లను,మిద్దెలను, టెలిఫోన్ స్తంభాలను క్షణ కాలం లో వెనక్కితోసివేస్తూ, గత వర్తమానాల మధ్య పరిగెత్తే రైలు స్మృతికవిత్వం. కొండచరియ విరిగి రోడ్డున పడ్డట్లు గతం వచ్చి వర్తమానాన్ని ఢీ కొనాలి ఎంతచేసినా స్మృతికవిత్వం నిఖార్సైన కవిత్వం కావడం చాలా కష్టం. కావున అందులో “తరు చాపం వీడిపోయి గురిమరచిన బాణంలా తిరుగాడే పిట్టలు” (ఇస్మాయిల్ , చెట్టు నా ఆదర్శం), “పసుప్పచ్చ కళ్ళలో రాత్రి తాలూకు నాణేలు దాచుకొనే పిల్లులు”( నెరుడా, Ode to the cat ) కనిపించక పోవచ్చు.
వ్యాస రచనలో సంప్రదించిన పుస్తకాలు అకారాది క్రమంలో
1.అనేక వచనం పసునూరి శ్రీధర్ బాబు
2.ఆమె నా బొమ్మ అయిల సైదాచారి
3.ఆరో వర్ణం ఇక్బాల్ చంద్
4.ఆర్తి బైరెడ్డి కృష్ణారెడ్డి
5.ఒక వెళ్ళి పోతాను ఎమ్ .ఎస్ . నాయుడు.
6.నలుగురు పాండవులు రమణజీవీ
7.మల్టీ నేషనల్ ముద్దు కొండేపూడి నిర్మల
8.మరో మజిలీకి ముందు ముకుంద రామారావు
9.వెంటాడే కలాలు(సం) జూలూరి గౌరీశంకర్
-----------------------------------------------------------
రచన: తమ్మినేని యదుకులభూషణ్,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment