తెలుగు సాహిత్యంలో హాస్యపాత్రలు
సాహితీమిత్రులారా!
కన్యాశుల్కం నాటకం వచ్చేవరకు తెలుగువాడికి హాయిగా నవ్వుకోవడం తెలియదని మా గురువు డా॥ శ్రీపాద కృష్ణమూర్తి తెగేసి చెప్పారు. అది నిజమే. గిరీశం నించి బైరాగి దాకా అందరికీ గొప్ప వాగ్ధోరణి ఉంది. దాదాపు పదమూడు దశాబ్దాలుగా కన్యాశుల్కం పాత్రలన్నీ తెలుగువాళ్లని నవ్విస్తూ బతికేస్తున్నాయి. అసలు మన వాళ్లు కూడబలుక్కొని విజయనగరం కూడలిలో మధురవాణి శిలా విగ్రహం నిలబెట్టడం తెలుగుజాతి కనీస ధర్మం అన్నాడొక పెద్దమనిషి. కన్యాశుల్కంలో పాత్రలన్నీ లౌక్యంతోనో, ఆగ్రహంతోనో, అమాయకత్వంతోనో ప్రవర్తిస్తూ నాటకాన్ని నడిపిస్తారు. వెంకటేశం… గిరీశం మధ్య జరిగే ఓ సంభాషణను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
‘‘మీ వల్లొచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే…’’ పాఠం ఎప్పుడూ చెప్పని గిరీశానికి చురకేస్తాడు వెంకటేశం.
వెంటనే గిరీశం… ‘‘ఇది బేస్ ఆన్గ్రాటిట్యూడ్. నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్…’’ అంటూ గొప్పగా చెప్పుకుంటాడు.
కాంతం పాత్రని సృష్టించి, కాంతం కథలు రాసిన మునిమాణిక్యం నరసింహారావు, ‘గురజాడది శబ్దాశ్రయ హాస్యం,’ అన్నాడని ఆరుద్ర, ముళ్లపూడి మునిమాణిక్యాన్ని ఏకి పడేశారు. ముళ్లపూడి వెంకటరమణ గిరీశాన్ని చెన్నప్పటం తీసుకొచ్చి సినీ మాయ మీద లెక్చర్లిప్పించి, గరజాడ కీర్తిలో వాటా దండుకున్నారు.
‘‘నేను, శ్రీశ్రీ రోజూ అయిదు నిమిషాలు కన్యాశుల్కం మాట్లాడుకుని ఆనక సొంత విషయానికొస్తాం,’’ అనేవారు ఆరుద్ర. అంటే సంభాషణ చాలావరకు కన్యాశుల్కంలోని సంభాషణలతోనే సాగేదన్నమాట. తరువాత కూడా చాలామంది కన్యాశుల్క ప్రియులు అందులోని మాటల్నే దాఖలు చేసేవారు. ఇప్పటికీ అలాంటివారు అడపాదడపా తగుల్తుంటే ఆశ్చర్యంగా చూస్తుంటాం.
ఆధునిక కాల్పనిక సాహిత్యంలో పుట్టిన హాస్యపాత్రల్ని పరామర్శించే ముందు కాస్త వెనక్కి వెళ్దాం. సృష్టితో పాటు పుట్టిన హాస్య పౌరాణిక పాత్ర నారద మహర్షి. ఆయన తంపులమారి, కలహభోజనుడు. రాక్షసులకి, దేవతలకి, దేవునికి, భక్తునికి, అమ్మవారికి, అయ్యవారికి మధ్య అగ్గి రాజేస్తాడు. అయినా అది చినికి చినికి గాలివానై, లోకకల్యాణానికి దారితీస్తుంది. నారద మహర్షి చాలామందికి గర్వభంగాలు చేయించాడు. సతీ లీలావతికి ఆశ్రయం ఇచ్చి, హిరణ్యకశిపుడికి గర్భశత్రువుతో నరకం చూపించాడు. సత్యభామతో, మీరజాలగలడా, నా యానతి అని నాట్యం చేయించి సత్యవతిని దానంగా స్వీకరించి, చివరకు భలే మంచి చౌకబేరము అంటూ కృష్ణమూర్తిని నడివీధిలో అమ్మకానికి పెట్టాడు. సత్యభామ కన్ను తెరిపిస్తాడు. కృష్ణ తులాభారంలో సూత్రధారి నారద మహర్షి. మన పురాణాల్లో నారదుడు నడిపించిన రక్తి, ముక్తి, భక్తి కలగలసిన కథలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటికీ సూత్రధారి నారుదలవారే. నారదుడంటే హాస్యం. నారదుడంటే విశ్వశాంతి!
మరో హాస్యస్ఫోరక పౌరాణిక పాత్ర వసంతకుడు. కథా నాయకునికి కూరిమి చెలికాడు. నాయికా నాయకుల మధ్య రాయబారం నడుపుతాడు. నాయకుడు సాక్షాత్తూ దేవుడే అయినా గులాబీరెమ్మతో చెమ్కీచెండుతో చిన్న వేటు వేస్తాడు.
రాధాకృష్ణ నాటకంలో ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక సందర్భంలో వసంతకుడు తన బాధను వ్యాకరణంలోకి మార్చుకుని, ‘‘స్వామీ ఉంగరము తాము ధరించి, ముద్దు ఆమె కొసంగి, టుగాగమము మాత్రము నాకు దయచేసితిరి,’’ అని వాపోతాడు. వ్యాకరణరీత్యా ముద్దుGఉంగరము వెరసి ముద్దు టుంగరము అవుతుంది. ఇది చమత్కారంతో సాధించిన సరస శృంగారభరిత హాస్యం. ఇవి పానుగంటివారి పలుకులు. వసంతు కుని నోటి వెంట సందర్భోచితంగా వెలువడి స్వాతిముత్యాలుగా తెలుగువారికి అందాయి.
పానుగంటి సాక్షి వ్యాసాలు అప్పట్లో చాలా ప్రసిద్ధి. అందు లో జంఘాలశాస్త్రి ముఖ్య భూమిక. ఆయన రచనల్లో ‘కంఠా భరణము, వృద్ధవివాహము’ ప్రసిద్ధాలు. సాక్షి వ్యాసాల్లో కాలా చార్యుణ్ణి వర్ణిస్తూ, ‘‘…ఈతని తల పెద్దది. గుండ్రటి కనులుండు టచే, ముక్కు కొంచెం వెనుకాడుటచే, మొగము గుండ్రముగా నుడుటచే నీతడు నరులలో బుల్‌డాగ్ జాతిలోనివాడు. ఈతడు మాట్లాడినా మొఱిగినట్లుండును,’’ అని నవ్విస్తారు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం గణపతి నవల్లో ఒక మేధకుని పాత్రని సృష్టించారు. గణపతి ప్రహసనంగా రూపొంది గణపతి పాత్ర ప్రాచుర్యంలోకి వచ్చింది. అమాయకత్వాన్ని దాటిపోయి జడ్డితనం కనిపిస్తుంది గణపతి పాత్రలో. నాజూకుతనం ఏమాత్రం లేని మొరటుపాత్రగా, వగరు హాస్యంగా మిగిలింది. భమిడిపాటి కామేశ్వరరావు మోలియార్ నాటకాలను తెనిగించారు. ఆయన హాస్యంలో నవ్యత కనిపిస్తుంది. కానీ గుర్తుండిపోయే సజీవ పాత్రలు మనముందు నిలిచి నవ్వించే భాగ్యం లేకపోయింది. మొక్కపాటి నరసింహశాస్త్రి సృష్టించిన బారిష్టర్ పార్వతీశం పాత్ర ఇప్పటికీ తెలుగువారి మనోఫలకంపై తారట్లాడుతూనే ఉంది. నిజానికి అవి ఆయన స్వానుభావాలే చాలావరకు. మొక్కపాటి వ్యవసాయశాస్త్రం అభ్యసించడానికి లండన్ వెళ్లారు. చివరంతా లేకుండానే తిరిగి వచ్చారు. తన అనుభవాలను కథలు కథలుగా వినిపించి నవ్విస్తుంటే, ఈ నవ్వుల్ని గ్రంథస్తం చేయరాదా అని సాటి కవిమిత్రులు సూచించారు. మొదటి భాగం అలా వచ్చి తెలుగునేలను నవ్వుల్లో ముంచెత్తింది. కొంతకాలానికి పార్వతీశం రెండోభాగం రాశారు. ఇందులో సహజత్వం పాలు తగ్గి కల్పన పాళ్లు ఎక్కువైంది. చాపల్యం నశించక మూడోభాగానికి కంకణం కట్టుకున్నారు. రచయిత పార్వతీశాన్ని పూర్తిగా పూనేశాడు. అందుకే ఎక్కడ ఆరంభించాలో కాదు ఎక్కడ ఆపాలో తెలియాలని విజ్ఞులంటారు.
మళ్లీ ఒక్కసారి వెనక్కి వెళ్తే, తెనాలి రామకృష్ణుడు, ఆయన పేరు మీద వచ్చిన చమత్కార కథలు గుర్తుకు వస్తాయి. వరాన్నీ, శాపాన్నీ ఏకకాలంలో అందుకుని వికటకవిగా వాసికెక్కాడు. ఆయన తెనాలి రామకృష్ణుడని కొందరు, కాదు రామలింగడని కొందరు అంటారు. ఆయన రచనల్లో హాస్యం కనిపించదు. కానీ ఆయన జీవితంలో చాలా హాస్యం వినిపిస్తుంది. ‘కుంజర యూధంబు దోమకుత్తుక జొచ్చెన్,’ సమస్యను క్షణ కాలంలో రెండు విధాలుగా పూరించిన ప్రతిభాశాలి. చాలా హాస్య కథలను రామకృష్ణుని పరంగా చెబుతుంటారు. ఆ రోజుల్లో రాజుగారి కొలువులో ఆస్థాన విదూషకులుండేవారు. వారి పని తమ చమ త్కార భాషణతో రాజుని, సభని రంజింపజేయడమే. ఉత్తర భారతంలో బీర్బల్ పేరు పలు హాస్యకథల్లో వినిపిస్తుంది. మన జానపద కళారూపాల్లో ఎన్నో హాస్యపాత్రల సృష్టి జరిగింది. ప్రాచీన మైన తోలుబొమ్మలాటలో జుట్టుపోలిగాడు, కేతిగాడు, బంగారక్క తమ సంభాషణలతో నవ్వించడమే కాదు తమకు ఉదారంగా కానుకలివ్వని వారిపై విసుర్లు కూడా వుండేవి. అయితే వారి హాస్య సంభాషణలు విచ్చలవిడిగా ముతకగా ఉండేవి. అయినా ఇప్పటికీ ‘కేతిగాడు’ అనే మాట మనం తరచూ వాడుతూనే వుంటాం. ఇక జానపద కళారూపాలుగా వాటినే నమ్ముకుని జీవించేవారు కొందరుండేవారు. గాంధోళిగాడు, కొమ్మదాసరి, పగటి భాగవతులు, పిట్టలదొర` వీరంతా గడప గడపకూ వచ్చి వినోదపరచి యజమానుల ఆదరణను చూరగొనే వారు.
1950వ దశకంలో ఒక కొత్త తరం రచయితలు వచ్చారు. అప్పటిదాకా పల్లెల్లో తిరుగుతున్న కథలు బస్తీలకు, నగరాలకు వచ్చాయి. ముళ్లపూడి వెంకటరమణ చెన్నపట్నం నేపథ్యంలో దిగువ మధ్యతరగతి జీవితాలను అక్షరచిత్రాలుగా మలిచారు. పైకి వెళ్లాలన్న ఆశ, ఇంకా పడిపోతామేమోననే భయం క్షణక్షణం మధ్యతరగతిని వేధిస్తూ ఉంటుంది. రమణ జనతా ఎక్స్‌ప్రెస్ కథలో కథ కంటే పాత్రలే ముఖ్యపాత్ర వహిస్తాయి. పక్కింటి లావుపాటి పిన్నిగారు, రాధాగోపాళాలు, అప్పారావు, ప్రైవేటు మాస్టారు వీళ్లంతా ఒక ఎత్తయితే బుడుగు, సీగాన పెసూనాంబ మరో ఎత్తు. బుడుగు భాషని కూడా ప్రత్యేకంగా తెలుగు చెట్టుకి రమణ అంటుతొక్కారు.
‘బుడుగు’ గమ్మత్తులు కోకొల్లలు. వాటిల్లోంచి ఒకటి… ఇది బుడుగు సొంత బాధ. ‘మాస్టార్లకసలు తెలివుండదు. ఒక మేస్టారేమో కుడివైపు మెలి పెడతాడు. ఇంకొన్నాళ్లకి కొత్త వాడొ స్తాడు కదా? వాడేమో ఎడమవైపు మెలి పెడతాడు. ఇలా అవుతే చెవి పాడైపోదూ? అందుకనీ ఎటేపు మెలిపెట్టాలో కొత్త మేష్టరు ముందుగా పాత మేష్టరును కనుక్కుని రావాలి. లేదా మనలాంటి పెద్ద మనిషినడగాలి. ‘నేనేం చిన్నపిల్లాణ్ని కాదు అంటే అమ్మ వినదు. కుర్రకుంకా అంటుంది. ‘బుడుగు బొబ్బ పోసుకుందు గాని లాఅమ్మ,’ అనీ ‘బువ్వ పెత్తనా బులుగూ’ అని అంతే నాకు ఎంత అవమానం. చెపితే వినరూ…’
ఇక మునిమాణిక్యం వారి ‘కాంతం’ మాటల తూటాలకు మారుపేరు. ఒకరోజు భర్త, ‘మీ చెల్లెలు ఒక కోతి, మీ అక్కయ్య మరో కోతి. తోకలు మాత్రం లేవు,’ అని ఎగతాళి చేస్తే, ‘మీ చెల్లెళ్లకు ఆ లోటు లేదు,’ అని అంటుంది కాంతం తడుము కోకుండా! మరోసారి కాంతాన్ని భర్త పిలిచి, ‘నా కలం కనపడట్లేదు వెతికి పెట్ట,’మంటే… వంటగదిలోంచి, ‘నాకు అట్లకాడ కనిపించ డంలేదు. కాస్త వెతికి పెట్టండ,’ని తిరుగు సమాధానమిస్తుంది. ఇంకోసారి, ‘నేను ఒట్టి తెలివి తక్కువాడిననా నీ అనుమానం,’ అని అడిగిన భర్తతో, ‘అహహ అనుమానమేమీ లేదు. గట్టి నమ్మకం,’ అని బల్లగుద్ది చెబుతుంది. ఇలాంటి సన్నివేశాలెన్నో ‘కాంతం కథల్లో’ మనల్ని నవ్విస్తాయి.
రా.వి.శాస్త్రి తన రచనల్లో పలికిందంతా బంగారం చేశారు. అది హాస్యమా అంటే` చదివేటప్పుడు హాస్యంలానే ఉండేది. తరువాత కంటతడి పెట్టించేవి అందులోని వాక్యాలు, పాత్రలు… అడ్డబుర్ర, రక్తాలు నవ్విస్తూనే వెంటాడే పాత్రలు. ఆరుద్రని ఒక అభిమాని, ‘మీరు ఇన్ని గొప్ప రచనలు చేశారు కాని గుర్తుండి పోయే ఒక పాత్రని కూడా తెలుగువారికి ఇవ్వలేదెందుకని,’ అని అడిగితే, క్షణం కూడా ఆలోచించకుండా, ‘నేనుండగా వేరే పాత్ర లెందుకని ఆ పనిలో తల పెట్టలేదు,’ అని జవాబు చెప్పారట.
------------------------------------------
రచన: శ్రీరమణ,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment