Sunday, November 10, 2019

సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ


సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ


సాహితీమిత్రులారా!


ప్రస్తుతం విమర్శ అన్న పదాన్ని మనం criticism– ఒక సృజనను విశ్లేషించి మంచిచెడ్డలు ఎంచడం– అన్న అర్థంలో వాడుతున్నాం. ఇది పాశ్చాత్య ప్రభావం వల్ల ఆంగ్లేయుల పాలన తరువాత మనం కొత్తగా అలవాటు చేసుకున్నది. అంతకు ముందు మనం విమర్శ అన్న పదాన్ని ఈ అర్థంలో వాడలేదు. పూర్వకవులు ఒక రచనను సవిస్తరంగా పరిశీలించి, వివరించి చెప్తూ వ్యాఖ్య అని రాసేవారు. (ఉదా: మల్లినాథసూరి వ్యాఖ్యలు) ఇప్పుడు మనకున్న ఈ critical evaluation అన్న విమర్శ పద్ధతి మనకు మొదటినుంచీ అలవాటైన పద్ధతి కాదు.

ప్రస్తుతం తెలుగు సాహిత్యరంగంలో విమర్శ కనిపించటం లేదు అని తరచూ వినపడుతున్న మాటకు కారణాలు ఆలోచిస్తే– తమ విద్వత్ప్రతిభలపై విశ్వాసం హద్దులు దాటి వున్న రచయితలు పొగడ్తలు మినహా మరేమీ తీసుకోలేకపోవడం మొదలుకుని, సాహిత్యేతరకారణాలు, స్పర్థలు, విభేదాల వల్ల కావ్యవిమర్శను కవివిమర్శగా దూషణలతో అలంకరించి, తమ అభిప్రాయాలను సాహిత్యసత్యాలుగా ప్రకటించి విమర్శ అన్న పదానికి చెడ్డపేరు తెచ్చిన విశ్లేషకులు, వ్యాఖ్యాతల వరకూ- ఎన్నో కనపడతాయి.

కారణాలేమైనా, విమర్శ అన్న పదానికి తప్పులెన్నడం అన్న అర్థం ఇటీవలి కాలంలో స్థిరపడిపోయింది కానీ నిజానికి విమర్శ అన్నది సునిశితమైన పరిశీలన. సంయమనంతో, నిరాపేక్షగా విమర్శ చేయడం విమర్శకునికి ఎంత ముఖ్యమో, దానిని అంతే నిరాపేక్షగా తన సృజనకు దక్కిన అభినందనగా స్వీకరించవలసిన బాధ్యత సృజనకారునిది కూడా. ఈ రకమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడాలి అంటే ముందు మనకంటూ విమర్శాపద్ధతులు ఏర్పరచుకోవాలి. ఏది మంచి విమర్శ, ఏది కాదు అని నిర్ణయించే ముందు, విమర్శ అంటే ఏమిటో నిర్వచించి వివరించగలగాలి. ఆ ప్రతిపాదనలు తప్పు అని ఇంకొకరు నిరూపించవచ్చు. ఒకవేళ అదే జరిగితే, ఏది తప్పు ఏది ఒప్పు అని చర్చించడం ద్వారానైనా విమర్శాపద్ధతికి ఒక చక్కటి ఉదాహరణగా నిలబడే అవకాశమూ ఉంది. ఇదే ప్రధాన ఉద్దేశ్యంగా, ఈ వ్యాసం ద్వారా నా దృష్టిలో విమర్శ అంటే ఏమిటి, అది ఎలా ఉండాలి అన్నది కొన్ని ఉదాహరణలతో వివరించి, ప్రస్తుత విమర్శ పరిస్థితి, అది మెరుగుపడే మార్గాలను స్పష్టపరిచే ప్రయత్నం చేస్తాను.

విమర్శ అంటే ఏమిటి?
విమర్శ అంటే ఒక సృజన యొక్క విశ్లేషణాత్మక పరిశీలన అని నిర్వచించుకుందాం. సృజన అంటే ఏమిటి? తన అనుభూతులకు, అనుభవాలకు, ఆలోచనలకు, ఒక కళాకారుడు ఇచ్చే రూపం సృజన. ఇది శిల్పం, వర్ణ చిత్రం, సంగీతం, సాహిత్యం ఇలా ఎన్నో లలిత కళారూపాల్లో ప్రకటితమవుతుంది. సాహిత్యవిమర్శ గురించి చర్చిస్తున్నాము కనుక, ఇప్పుడు మనముందున్న మొదటి ప్రశ్న: సాహిత్యాన్ని ఎలా పరిశీలించాలి? ఎలా అర్థం చేసుకోవాలి?

ఏ రచనకైనా ఒక పరిధి, సందర్భం ఉంటాయి. ఏ సాహిత్యవిమర్శ అయినా తాను విమర్శిస్తున్న రచన యొక్క పరిధి, సందర్భాలను దాటి ఆ రచనను తప్పుగానో ఒప్పుగానో నిర్ణయించకూడదు. ఒక్కొక్కసారి పరిధి సందర్భం ఒకటే కావడం కద్దు. ఐతే, ఈ పరిధి, సందర్భం ఏమిటి?

ప్రతి రచనా తనకంటూ ఒక లోకాన్ని సృష్టించుకుంటుంది. మన భౌతిక ప్రపంచం కొన్ని నియమాలు, ధర్మాల మీద ఆధారపడి ఉన్నట్టే ఒక రచనాలోకం కూడా కొన్ని ధర్మాలు, నియమాల ఆధారంగా నిర్మించబడి వుంటుంది. అవి మన ప్రపంచపు ధర్మాలే కావాలని కూడా నియమమేమీలేదు. రచనాలోకపు నియమాలు అభూత కల్పనలూ కావచ్చును. ఐతే ఒకసారి నిర్మించబడ్డాక ఈ భౌతిక ప్రపంచంలానే ఆ రచనాలోకం కూడానూ ఆ నియమాలననురించి ఒక తర్కబద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇది ఆ రచన పరిధి. ఒక రచన, ఇలా తన రచనాలోకపు ధర్మాలకు కట్టుబడి వున్నదా లేదా అని చూడడం ఒక రచనను ఆ రచన పరిధిలో పరిశీలించడం అవుతుంది. ఉదాహరణకి, సైన్స్‌ ఫిక్షన్‌ రచనలో టైమ్‌ ట్రావెల్‌ ఒక అంగీకరింపబడిన సత్యం. అలాంటి రచనను టైమ్‌‌ ట్రావెల్‌ అనేది లేదు అది కేవలం కల్పన అనే ప్రాతిపదికన పరిశీలించబోవడం, ఆ రచనను దాని పరిధి దాటి పరిశీలించడం అవుతుంది. హాస్యం ప్రధానోద్దేశమైన రచనలో సామాజిక సందేశం వెతకడం ఇలాంటిదే. ఎంచుకున్న ఆవరణం, శైలి, శిల్పం తదితర సాహిత్య పరికరాలన్నీ కూడానూ ఒక రచన తన పరిధిలో ఎంత సహజంగా పటిష్టంగా ఇమిడిందో లేదా ఇమడలేదో చూపిస్తాయి.

కళాసృజన ఏకాంతంలో సాగే స్వార్థపూరిత ప్రక్రియే అయినప్పటికీ దాని అంతిమ లక్ష్యం ఇతరులతో పంచుకోబడటం. ప్రతి రచన, రచయిత అంతర్‌ప్రపంచంతోనో బాహ్యప్రపంచంతోనో ముడిపడి ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో ఆ రచనాలోకం, పాఠకలోకంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ సంబంధాన్నే సందర్భం అని పిలుస్తున్నాను. అంటే ఒక రచన తను ఉన్న సమాజంతో ఏ రకమైన సంబంధాన్ని కలిగివుంది లేదా ఆ సమాజంలో ఏ విధమైన పాత్ర పోషిస్తున్నది? అప్పటికి ఉన్న సాహిత్యంలోనూ, సమాజంలోనూ ఏ రకంగా అంతర్భాగం అవుతున్నది? అని పరిశీలించడం ఆ రచన సందర్భాన్ని అంచనా వేయడం అవుతుంది. ఉదాహరణకి సూరన కళాపూర్ణోదయం యొక్క ప్రశస్తి, అందులోని వర్ణనలకే పరిమితం కాదనీ, మన దేశంలో ఆ కాలానికి వాడుకలో లేని ఆధునిక నవలా సాహిత్య లక్షణాలన్నీ అందులో ఉన్నాయనీ, ఆ రకంగా ఆ కావ్యం సాహిత్య చరిత్రనే కాదు, సాహిత్యం ఆధారంగా మన దేశచరిత్రనే పునఃపరిశీలించడానికి ఆస్కారం ఇచ్చిందనీ చెప్పడం– ఆ రచన సామాజిక, సాహిత్య చరిత్రలో ఎక్కడ ఒదుగుతోందో వెల్చేరు నారాయణరావుగారు[1] విశ్లేషించి, వివరించి చూపించడం వల్లే సాధ్యపడింది. రచనా సందర్భమన్నది విమర్శలో ఇందుకే ఒక ముఖ్యభాగం.

రచయిత కర్తవ్యం తన రచనాలోకాన్ని వీలైనంత పకడ్బందీగా సృష్టించటం. విమర్శ పని ఆ ప్రపంచాన్ని, దాని నిర్మాణ కౌశలాన్ని ఆ రచన పరిధీ సందర్భాలను విశ్లేషించి, ఆ రచనను పాఠకుడు మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి తోడ్పడడం.

కథ, కవిత, గేయం, పద్యం– అన్నీ సాహిత్య ప్రక్రియలే అయినా, ప్రస్తుత వ్యాసాన్ని, స్వభావసిద్ధంగా సాంద్రతరమైన కవిత్వం గురించి ప్రధానంగా చర్చిస్తూ కొనసాగిస్తాను.

విమర్శ ఎందుకు కావాలి?
కవిత్వం స్వభావసిద్ధంగా కొంత క్లిష్టంగా ఉంటుంది. మామూలు భాష వేరు, కవిత్వ భాష వేరు. కవిత్వ వ్యాకరణమూ వేరు. కనుక, కవిత్వం పాఠకుడి నుండి మరింత ప్రయత్నాన్ని కోరుతుంది. మనకు ఎప్పటికప్పుడు కవిత్వంలో కొత్త ఉద్యమాలు కనపడుతూ ఉంటాయి. సామాజిక, రాజకీయ ధోరణులు ఆయా కాలాల కవిత్వాలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా భావానికి సంబంధించో, అభివ్యక్తి మార్గానికి సంబంధించో, అనివార్యమైన మార్పులు పుట్టుకొస్తాయి. కవి ఏ ప్రభావంతో వ్రాసినా, సృజన సంపూర్ణత్వాన్ని పొందేది పాఠకుణ్ణి చేరిన తర్వాతే. పాఠకుడికి అదెలా చేరిందన్న దాని మీదే రచన విలువ నిర్ణయింపబడుతుంది.

రచయిత స్వరం సూటిగా లేని సందర్భాల్లో, ఆ రచన మనం నమ్మే భావజాలాన్నెక్కడో సమర్థిస్తోందన్న ఊహతో పఠనం కొనసాగిస్తాం. కొత్త మార్పులను అవగాహన చేసుకోకుండా, మనం మునుపు చదివిన ధోరణిలోనే చదువుకుపోతుంటాం. అంటే, రచన పరిధిని మనం మన పరిమితుల మేరకు కుదిస్తున్నాం. దానికి లేని లక్షణాలేవో ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా చేసే ప్రక్రియలో, మనం కొన్నిసార్లు రచన విలువను పెంచుతూండవచ్చు, కొన్నిసార్లు తగ్గించనూ వచ్చు. అంటే రచనలో లేనిది మనం చూసుకుంటున్నాం, ఉన్నదని ఊహించుకుంటున్నాం. సాహిత్యం యొక్క లక్షణం సువ్యాప్తమవడం కనుక, పాఠకులను ఈ ఊహల్లో నుండి మెలకువలోకి తోసేందుకు విమర్శ కావాలి. రచన ఉద్దేశ్యాన్ని విప్పి చెప్పడం రచయిత బాధ్యత కాదు కాబట్టి, ఈ నూతన అభివ్యక్తి మార్గాల ఒరవడిలో పాఠకులు కొట్టుకుపోతున్నప్పుడు, వీరిద్దరి మధ్యా ఒక వారధిని నిర్మించే పనికి పూనుకునేవారు విమర్శకులు. వీళ్లు, ఒకేసారి పాఠక హృదయాన్ని, కవి హృదయాన్ని తమలో నింపుకుని, ఈ ఇద్దరి మధ్యా బంధాన్ని బలీయం చేస్తారు. ఇజాలకు ఆవల నిలబడి, కవిత్వాన్ని శాస్త్రీయంగానూ సహృదయతతోనూ పరిశీలించి, దానిని పాఠకులకు తేలిగ్గా చేరవేసే ప్రయత్నం చేస్తారు. కవిత్వమే లేని ప్రేలాపనల్ని సాహిత్యంలో కలవకుండా అడ్డుకుంటారు.

ఒక సంపుటిలోని కవితలను పేరు పేరునా పేర్కొంటూ, వాటిలోని పంక్తులనే వచనంగా తిప్పి రాయడం, కేవలం ఆ మాటల గురించే మాట్లాడటం పరిచయమే అవుతుంది తప్ప విమర్శ కాదు. ఏ విధమైన వ్యాఖ్యానము, సమర్థన లేకుండా ఒక కవిత్వ సంపుటి తమకు నచ్చిందనో, నచ్చలేదనో చెప్పడం వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది తప్ప, విమర్శ కాదు. ఇలాంటి వ్రాతల వల్ల పాఠకులకుగానీ కవులకుగానీ సాహిత్యానికిగానీ ఏ విధమైన లాభమూ ఉండదు. విమర్శ అన్నది కవిత్వధోరణి పట్ల జరగాలి. ఆ కవిత్వం విడుదలైన స్థలకాలాలతో సహా, ఆ కవిత్వం మొత్తం సాహిత్యంలో ఎక్కడ నిలబడి ఉన్నదో, ఆ ధోరణితో మనకున్న ప్రాచీన, సమకాలీన కవిత్వం ఎటువంటిదో, వాటన్నింటి మధ్యా ఈ కవిత్వం ఎలా, ఎందుకు భిన్నమైనదో గుణదోషాలతో సహా నిష్పక్షపాతంగా చర్చించేందుకూ, కవిత్వ ఉద్దేశ్యం సామాజికమో, రాజకీయమో, వ్యక్తిగతమో, మానసికోల్లాసమో గమనించి, ఒక కళారూపంగా దాని ప్రత్యేకత ఏమిటో విడమరచి చెప్పేందుకూ విమర్శ కావాలి.

కవిత్వంలో కొన్నిసార్లు కొట్టొచ్చినట్టుగా కనపడే శబ్ద సౌందర్యము, లయ, భావుకత వంటివి పాఠకులను తేలిగ్గా, ఊపిరి తీసుకున్నంత సహజంగా, తమ తమ లోకాల్లోకి లాక్కొనిపోతాయి. ఇందుకు భిన్నంగా, కొన్ని రచనారీతులను మనం ఆస్వాదించడానికి, అభినందించడానికి, కొంత పరిశ్రమ అవసరం. ఉదాహరణకి మనమొక గంట శబ్దం విన్నామనుకుందాం, వినగానే గంట శబ్దమని గుర్తుపట్టగల జ్ఞానం మనలో చాలామందికి ఉండవచ్చు. ఆ గంట వీధిలో వెళుతోన్న బండిదా, గుడి గంటా, బడి గంటా, అని గుర్తు పట్టగల వివేచన మాత్రం అన్ని వయసులవారికీ వర్గాలవారికీ ఉండకపోవచ్చు. ఇది వయసును బట్టీ అనుభవాన్ని బట్టీ కలిగే మెలకువ. ఆలయంలో గంట ఓ సత్సంప్రదాయానికి చెందినదనీ, అక్కడ సభక్తితో మెలగాలనీ; ఆంబులెన్స్‌ ఒక ఆందోళనాపూరిత వాతావరణ స్పృహ కలిగిస్తుందనీ, ఈ వివేచనే మనకు చెబుతుంది. ఇతరత్రా సంగీత పరికరాలేవో కాకుండా, ఇక్కడ ప్రత్యేకించి గంటనే ఎందుకు వాడుతున్నారన్నది, ఇదే దారిలో ఎదురయ్యే మరుసటి ప్రశ్న. (ఇది నేను ముందు ప్రస్తావించిన నిర్మాణ కౌశలంలో భాగం.) అప్పుడప్పుడే శబ్దాలనూ వస్తువులనూ గుర్తుపడుతున్న పసివాడికి ఇవన్నీ తెలుస్తాయని అనుకోలేం. ఆ అనుభవమున్న పెద్దలెవరో సందర్భానుసారం ఇవన్నీ విడమరచి చెప్పాలి. నేర్పించాలి. అప్పుడే ఆ ఉద్వేగాలన్నీ సరిగ్గా పరిచయం చేసినవారమవుతాం. వాళ్లలోని సున్నితత్వాన్ని మేల్కొల్పినవారమవుతాం. జాగ్రత్తగా గమనిస్తే, విమర్శకుల పని ఒక స్థాయిలో దీనినే పోలి ఉంటుంది. అందుకే, విస్తృతంగా చదివే విమర్శకులకి సహజంగానే కొన్ని సౌలభ్యాలుంటాయి. వారి పదసంపద బాగుంటుంది. ఏ సందర్భంలో ఏ పదం ఏ అర్థాన్నిస్తుందన్న వివేకం సామాన్య పాఠకులని మించి ఉంటుంది. కనుక కొత్త రచనను చదివినప్పుడు, దాని ప్రత్యేకతను తేలిగ్గా గుర్తుపడతారు. తమ విమర్శ ద్వారా సమకాలీన సాహిత్యంలో ఆ రచన ఎలా రాణిస్తుందో, ఎందుకు రాణిస్తుందో సూటిగా, స్పష్టంగా చెప్పగల్గుతారు. సాహిత్యం యొక్క ఆకాంక్ష మన లోపలి లోకమొకటి విశాలం కావడం, ఆత్మవికాసం, జీవితం పట్ల మనకి మెరుగైన అవగాహన కల్పించడం, మరింత సమర్థవంతంగా జీవితాన్ని అభినందించే మార్గాన్ని చూపడం అనుకుంటే, విమర్శకులు తమ విమర్శ ద్వారా మన ఎదుటనున్న సాహిత్యం దానికెలా దోహదం చేస్తుందో చెబుతారు.

సోదాహరణంగా కవిత్వ విమర్శ
“మాటలన్నీ అయిపోయాక, కలిసి నిద్రలేవడం గురించే చివరగా ఇంకోసారి చెప్పుకుంటాం. మన దేహాల్ని మనమే దూరంగా చూస్తూ మేల్కొనే కల వచ్చిన విషయం మాత్రం దాచేస్తాం. అదే కలలో ఒక ఆకుపచ్చ దుప్పటి మట్టి వేర్లతో మనమీద పరచుకోవడం చూసి ఇష్టంగా నవ్వుకుంటాం. పచ్చికపై రాలే పూల శబ్దాల కింద ఆదమరచి నిద్రపోతాం. ఇక అప్పుడు మనం కలిసే ఉంటాం.” (కవి: బండ్లమూడి స్వాతికుమారి, సంపుటి: ఆవిరి, పు: 63.)

ఇప్పుడు ఎవరైనా- ఆ రచన ఆసాంతమూ చదవనివాళ్లు, ఈ మట్టివేర్లతో ఓ ఆకుపచ్చ దుప్పటి మీద కప్పుకోవడమన్న భావన ఆహ్లాదంగా ఉందనీ, ఇది సౌందర్యమనీ అనుకోవడం కద్దు. సమర్థులైన విమర్శకులు ఇలాంటి వ్యాఖ్యానాన్ని అందించడంతోనో, లేదా దీన్ని ఖండించడంతోనో ఆగిపోరు. ఇక్కడ కవి ఒక సమాధిస్థితిని చెబుతున్నారనీ, తన ప్రియుడు/ ప్రియురాలితో కలిసి మరణించి, తమ శవాలను చూస్తూ తాము కలిసి లేవడం గురించి మాట్లాడుతున్నారనీ, వాళ్ల శవాలు భూస్థాపితం అయ్యాకా, తిరిగి అక్కడ మొలిచే గడ్డి గురించీ, అక్కడి పూలచెట్టు మీద నుండి రాలిపడ్డ పువ్వుల గురించీ మాట్లాడుతున్నారనీ తెలియజేస్తారు. ఇది ప్రాథమికమైన విశ్లేషణ. అంటే, మొదటి చూపులో మనకు ఆహ్లాదంగా కనపడ్డ కల, కలిసి నిదురలేవడం, మట్టివేర్లతో పరచుకున్న ఆకుపచ్చ దుప్పటి, స్వేచ్ఛగా రాలే పూలు– వీటన్నింటినీ అపారమైన దుఃఖాన్ని ప్రకటించడానికే కవి వాడారని మనకు తెలిసిపోయింది. అంటే, కొన్ని పదాలను, వాటి సాధారణ అర్థాలతోనే వాడుతూ కూడా, వాటి కలయిక ద్వారా, అవి సాధారణంగా అందించే ఉద్వేగాలకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగించే ప్రయత్నం చేసింది కవయిత్రి. ఇది, ఇందులో మొదటగా తోచే ప్రత్యేకత.

ఇలా అత్యంత సుకుమారమైన పదాలతోనే అత్యంత వేదనాభరిత కవిత్వం రాసిన కవులు, మన ఆధునిక తెలుగు సాహిత్యంలోనూ ఉన్నారు. కృష్ణశాస్త్రి[2] మనకు చప్పున గుర్తొచ్చే పేరు. అయితే, ఈ కవితలో కనపడుతున్నది విషాదమూ, దిగులూ కూడా! ఈ రెండూ భిన్నమైనవి. దిగులే తొట్టతొలి మాటగా కవిత్వం రాసిన రేవతీదేవి[3], శివలెంక రాజేశ్వరీదేవి[4] మొదలైనవారి కవిత్వం వాళ్ల వాళ్ల ఒంటరితనాలతో ముడిపడి, లోకంలో మరెవ్వరూ అక్కర్లేదన్న నిరాశను ఒకరి గొంతులోనూ, అందరూ హృదయం ఒంపి మాట్లాడితే బాగుండన్న ఆశను మరొకరి గొంతులోనూ వినిపించింది. కానీ, పైన ఉదహరించిన కవిత్వంలోని దిగులు వీటికి భిన్నమైనది. ఇక్కడ, కవి గొంతులో ధ్వని ఆశ. నిరూపణమవుతున్నది మాత్రం నిరాశ. ఇది ఒంటరితనంతో, ప్రేమరాహిత్యంతో నిలువునా కుంగిపోయిన మనసు కథ. ఈ మనసు కోరుకుంటున్నది విముక్తి, శాశ్వతమైన విశ్రాంతి. ఈ విముక్తిలోనే శాంతి దొరుకుతుందని కవి భావన కనుక, అక్కడ ధ్వని ఆశగా మనకు వినపడుతోంది. నిజానికి, ధ్వనిపరంగా ప్రతీ కవిత మనకు ఎంతో కొంత చెబుతుంది.

కొన్ని కవితలు, కేవలం శబ్దచాతుర్యంతోనే మనను కొత్త ఆవరణలోకి తీసుకుపోతాయి. నన్నయ్య నలదమయంతుల దీర్ఘ విరహాన్ని చెప్పిన ‘సలిపిరి దీర్ఘవాసర నిశల్‌ విలసన్నవ నందనంబులన్‌'[5] మొదలుకుని, తిలక్‌ ‘జలజల మని కురిసింది వాన’, పోతనామాత్యుల ‘లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలం బయ్యె…’ వరకూ, శబ్ద ప్రధానమైన కవితలకు మనకెన్నో ఉదాహరణలున్నాయి. వీటిలోని కవితా సౌందర్యమంతా ఈ కవితలు నిర్మింపబడ్డ పదాలు అందించే సంవేదనాత్మక ధ్వనులూ, అవి వ్యక్తం చేసే రూపాల్లోనే ఉందని చెప్పవచ్చు. ఆధునిక కవుల్లో కొందరు, కవిత్వంలో నాదాన్ని, అంత్యప్రాసలనూ కూడా కాదని, కవిత నైరూప్యంగానే ఉండాలనీ, దాని సౌందర్యమంతా అది అందించే భావంతోనే తెలియాలనీ పట్టుబట్టారు. అంటే, అక్కడ భావానికే పెద్దపీట. ఇప్పుడీ నేపథ్యంలో మనం చర్చిస్తున్న కవితను చూస్తే, ఇది ఏ కోవకు చెందిందో స్పష్టంగా చెప్పడం అంత తేలిక కాదు. వాక్యం వెనుక వాక్యం హాయిగా ముగిసే తీరు, సౌమ్యమైన పదాల పోహణింపు ఇది ఒక సౌందర్యాత్మకమైన కవితేనన్న భావన కలిగించినా, కవి పాఠకుడికి చెప్పాలనుకున్న భావం ఆ వాతావరణానికి పూర్తిగా ఆవలి దిక్కున ఉండి, ఒక చేదు అనుభూతినీ బాధనూ మిగుల్చుతోంది. ఇలా ఒకేసారి రెండు భిన్నమైన అనుభవాలను కలిగించడం ద్వారా, ఈ కవిత పాఠకుడిని మలి పఠనాలకు ప్రేరేపిస్తోంది. ఇది, ఈ కవితలోని మరో ప్రత్యేకత.

భావపరంగా, మనకు కొన్ని ఉర్దూ కవితలతో సామ్యం కనపడుతుంది. బాధ ఉంటుందని తెలిసీ కోరుకోవడం, విడిపోవడానికే అయినా కలుసుకోవడం- ఈ విరహం, ఈ ఎదురుచూపు మనకు కొన్ని ఉర్దూ గీతాల్లో కనపడుతుంది.

“एक उम्र से हूँ लज़्ज़त-ए-गिरिया से भी महरूम
ऐ राहत-ए-जाँ मुझ को रुलाने के लिए आ”

విరహవేదన అనుభవించి కూడా చాలా కాలమయింది /ప్రియా, మళ్లీ నన్ను ఏడిపించడానికే ఐనా, రా!— అన్న అహ్మద్‌ ఫరాజ్‌ గజల్‌ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

“My grave will be in a place where every spring the northern winds will shower blossoms.”

వసంత ఋతువుల్లో ఉత్తరగాలులు జల్లే పూవులన్నీ రాలే చోట, నా సమాధి ఉంటుంది[8] అన్న ఉమర్‌ ఖయ్యాం మాటలు అప్రయత్నంగా గుర్తురావడంలో కూడా ఆశ్చర్యమేమీ లేదు. ఇవి ఈ కవిత మనకు పరిచయం చేస్తోన్న కొత్త ప్రపంచం తాలూకు కిటికీలు. (page IX, Introduction; The Nectar of Grace, Omar khayyam’s life and works, by Swami Govinda Tirtha)

అలాగే, ఈ ఆవిరి సంపుటిలో ‘అనుకోకుండా’ సింహభాగం. ఇదే శీర్షిక కింద దాదాపు తొమ్మిది భాగాలు ప్రచురించారు కవి. అంటే, ఈ తొమ్మిదిటినీ కలిపే అంతస్సూత్రమేదో ఉందని అర్థం. ఆ అంతస్సూత్రపు లక్షణాలు మనం పైన చెప్పుకున్న ఒంటరితనం, ప్రేమరాహిత్యం లేదా వైఫల్యం, వేదన, నిరాశ ఇత్యాదులు. ‘అనుకోకుండా’కూ, మిగిలిన వాటికీ శిల్పపరంగా పరిణతి కనపడుతుంది. రచన బట్టి, శిల్పం దానంతటదే రూపుమార్చుకోవడం ఇక్కడ కనపడుతుంది. అత్యంత వైయక్తికమైన కవిత్వం కనుక, అసంబద్ధత అక్కడక్కడా ఇబ్బంది పెడుతుంది. ఒకే శీర్షికలో సాగుతున్నప్పుడు, ఇవి భాగాలుగా ఊహిస్తూ చదువుతున్నప్పుడు, స్వరం మారినప్పుడల్లా ఆ ఇబ్బంది పాఠకులకు తెలుస్తూనే ఉంటుంది. ఉదాహరణకు, ఇవి ఎక్కువ భాగం స్వగతంగానూ, లేదంటే, కేవలం ఆ పాత్ర మాట్లాడదలచిన మరొక్కరితోనూ ముడిపడి ఉన్న సంభాషణలు. ఐతే, జాగ్రత్తగా గమనించినప్పుడు, అక్కడక్కడా మనకో మూడో పాత్ర కూడా కనపడుతుంది. కొన్నిసార్లు ఒకే భాగం రెండు విభాగాలుగా కూడా సాగి, ఒక భాగంలో సంభాషణ, రెండవ భాగంలో స్వగతం కనపడుతుంది. అయితే, మొదటి సంభాషణలో ఉన్న పాత్ర, రెండవ భాగంలో కవి స్వగతంలో ఉద్దేశిస్తున్న పాత్ర ఒకటి కాదు. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలేవీ వదల్లేదు కనుక, రెండు భాగాల మధ్యా ప్రయాణం అంత సాఫీగా జరగక పాఠకుడికి అసహనాన్ని కలిగిస్తుంది. అలాగే, ప్రతీకలు తేలిగ్గా అందక ఇబ్బంది పెడతాయి. ఉదాహరణకి, ‘మునిగిపోయిన గులక రాయొకటి ఈదుకుంటూ ఒడ్డు చేరినప్పుడు ఉలికిపడకుండా, ఎవరూ చూడకుండా దాన్ని నీ చేతిలో పెట్టి దోసిలి మూసిన గుర్తు. ఇది తీసుకు వెళ్లిపొమ్మని చెయ్యి వదిలినప్పుడు, పదే పదే అదేపనిగా వేళ్లని ముద్దాడాలని గుర్తుకు రాకపోవడమూ గుర్తే.’ అన్న వాక్యంలో మునిగిపోయిన గులకరాయి దేనికి ప్రతీకగా వాడారో తెలుసుకునే అవకాశమేదీ కవితలో కనపడదు. ఈ అస్పష్టతే ఈ కవిత్వాన్ని అందరికీ చేరువ కాకుండా అడ్డుకుంది.

ఇలా, పైన ప్రస్తావించిన వివరాల బట్టి మనకు పొరలుపొరలుగా ఈ కవిత ప్రత్యేకతలు, ఈ కవితతో మిగతా కవిత్వానికి ఉన్న సారూప్యాలు, భేదాలు తెలుస్తున్నాయి. కొంత వివరణ ద్వారా, ఈ కవితను ముందుకన్నా ఎక్కువగా అభినందించగల్గుతున్నాం. విమర్శకులు వదిలిన కొన్ని ఆధారాల ద్వారా, మిగతా భాషల కవిత్వాన్నీ వెదికి చదివే ప్రయత్నం చేస్తున్నాం. ఆ కొత్త కవిత్వం తెరిచిన కిటికీలతో మనం మరో కొత్త ప్రపంచాన్ని చూడటానికి ఉద్యుక్తులమవుతున్నాం. కొత్త రచయితల గురించి కొత్త విశేషాలు తెలుసుకుంటున్నాం. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ కవిత్వం పట్లా ఈ తరహా సాహిత్యం పట్లా కవుల పట్లా మనకున్న అవగాహనను పెంచే ప్రయత్నం చేస్తోందీ విమర్శ. ఆవేశంలోనో, అనాలోచితంగానో కవి చేసిన తప్పులను ప్రస్తావించడం ద్వారా, కవి తన మలి రచనల్లో మరింత జాగ్రత్తపడేలానూ చేస్తోంది. తద్వారా, భాష మరింత మెరుగైన సాహిత్యసృజనతో అలరారేందుకు కూడా పరోక్షంగా తోడ్పడుతోంది.

విమర్శ అంటే వీలైనంత వివరంగా రచనను చర్చించడం అనుకున్నాం. రచన అద్దాల మండపం మధ్యలో ఉందని భావించి, వీలైనన్ని ప్రత్యేకమైన కోణాల్లో దర్శింపజేసి, ఆ రచన ప్రత్యేకతనూ పూర్ణత్వాన్నీ స్పష్టంగా చూపించడం విమర్శకుల ధర్మం. అయితే, ఈ క్రమంలో లేని అర్థాలను ప్రతిపాదించడం విమర్శ లక్షణం కాబోదు. రచన ఉద్దేశించని అర్థాలను చూపించడం విమర్శ పని కాదు. విడిగా కొన్ని భాగాలు మనకు కొత్త అర్థాలను ప్రతిపాదించినట్టు అనిపించినా, ఒక రచనగా అది ఏమి చెబుతోందన్నదే విమర్శకుల ఆసక్తి కావాలి. అలా వివరించే క్రమంలో, విమర్శకులు తమ అభిప్రాయం జనబాహుళ్యంలో అప్పటికే ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి భిన్నమైనదైనా సరే, ప్రతిపాదించడానికి కూడా వెనుకాడకూడదు. యెఱిగించరే పతికి యీ సుద్దులెల్లాను[11] అన్న అన్నమయ్య కృతికి ప్రతిపాదించబడిన విమర్శ ఇందుకు శ్రేష్టమైన ఉదాహరణ. కనుక ఎన్ని కోణాలున్నాయో అన్నీ చెప్పడం, లేని ఉద్దేశ్యాలేవీ రచనకు ఆపాదించకపోవడం, రెండూ విమర్శకుల కర్తవ్యాలే. ఇవి ఒకదానికొకటి భిన్నంగా కనిపించినా, నిజానికి ఈ వాక్యం సృజనను సృజన పరిధి, సందర్భాలననుసరించే చూడాలన్న మన మొదటి మాటలకు పొడిగింపు.

ప్రస్తుత తెలుగు సాహిత్య విమర్శ స్థితి, మెరుగుపరిచే మార్గాలు
ఇప్పుడు మనకున్న విమర్శ, సాహిత్యాన్ని బట్టి కాక వ్యక్తుల బట్టి ఉండటం విచారకరం. ఒక్కో కవిత్వానికి ఒక్కో ముద్ర వేసి, ఆ ఇజాన్ని భుజాల మీద వేసుకు మోసేవారే ఈ కవిత్వాన్నీ మోయడం, లేదంటే కాదనుకోవడం ఇప్పుడు కనపడుతున్న ప్రమాదకర ధోరణులు. సామాజిక సమస్యల మీద చూపు సారించని సంపుటులను స్వాప్నిక జగత్తుల్లో కవి చేసిన ఆషామాషీ విహారంగా భావించి చిన్నచూపు చూడటమూ; ప్రతీ సమస్యకూ ప్రశ్నగానో, పరిష్కరణగానో, లేదా బాధగానో కవిత్వాన్నే చూపించడమూ రెండూ ప్రబల ధోరణులై, విమర్శకులను కూడా ఏదో ఒక వైపు వచ్చి నిలబడాల్సిందిగా శాసించడం; విమర్శకులూ ఆ తరహాగానే చీలిపోవడం ప్రస్పుటంగా కనపడుతోంది. మనం కవిత్వాన్ని కాక, కవులను చూడటం మొదలెట్టినప్పుడే, కవిత్వంలోని అందాన్ని కాక, అది వినబరిచే ఉద్యమం వైపు మొగ్గు చూపినప్పుడే, విమర్శ పేలవమైపోతుంది. కవిత్వం ఏమైనా చెప్పనివ్వండి, ఏ భావజాలాన్నైనా మోయనివ్వండి, ముందది కవిత్వం అయి తీరాలన్న నిరంకుశ ప్రతిపాదనే మన విమర్శకులు చెయ్యవలసినది. విమర్శకు బదులుగా, అభిప్రాయాలు, సమీక్షలు అన్న పదాలు వాడటం, వాటినే విమర్శగా చలామణీ చేయటం, పత్రికల్లో వీటన్నింటికీ చోటివ్వడంవల్ల, గుణదోషాల చర్చ అన్నది మటుమాయమైపోయింది. అభిప్రాయాలు, సమీక్షలు కేవలం కవిత్వంలోని గొప్పదనాన్నే కీర్తించడం పనిగా పెట్టుకోవడం వల్లనూ, వ్యక్తులతోనో, సమష్టి శక్తులతోనో శతృత్వమెందుకన్న నేటి సమీక్షకుల అతి మంచితనమూ లేదా జాగ్రత్త వల్లనూ, ‘తప్పు లెన్నువాడు తన తప్పులెరుగడు’ అన్న పాఠకుల ఎదురుదాడుల వల్లనూ, ఎక్కడైనా ఏదైనా యథేచ్ఛగా ప్రచురించగల్గిన నేటి ప్రచురణాపద్ధతుల వల్లనూ, ప్రశ్నించి, మాటమాటకూ రచయితను జవాబుదారీ చేసి, నిజాలు, నిరూపణలు లేకుండా ఆరోపణ చెయ్యనివ్వని సమర్థవంతమైన ఎడిటర్లు అటు ప్రింట్‌ మాధ్యమంలోకానీ ఇటు వెబ్‌ పత్రికల్లోకానీ లేకపోవడంవల్లనూ, విమర్శ నానాటికీ నాసిరకంగా తయారవుతోందన్నది కాదనలేని సత్యం. అభిప్రాయాలను వెలువరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ అన్ని వేళలా ఉంటుందన్న నెపంతో, విపరీత వ్యాఖ్యానం చేయడమెన్నటికీ సద్విమర్శ కాబోదు.

విమర్శ ‘సీరియస్‌ సాహిత్యం’గా పరిగణింపబడాల్సిన అవసరం ఎంతో ఉన్న ఈ కాలంలో, దానిని సగటు పాఠకుడు చదవలేని, చదవాలనుకోని శీర్షికగా గుర్తిస్తున్నారు కొందరు సంపాదకులు. స్వాతి, నవ్య, ఆంధ్రజ్యోతి, ప్రభ– ఇలా తెలుగు పత్రికలు వేటిలోనూ సాహిత్యవిమర్శకు అరపేజీ చోటు కూడా లేదు. దినపత్రికల్లో సాహిత్య పుటల్లో అప్పుడప్పుడూ విమర్శ కనపడినా, ఆ విమర్శకు ప్రతి విమర్శ జరగే వీలున్న సందర్భాల్లోనూ, సమర్థత కలిగిన విమర్శకులు కూడా, ఉత్తరప్రత్యుత్తర వ్యవహారాలకి జడిసి, సామాజిక మాధ్యమాల్లో స్పందన తెలియజేసి ఊరుకుంటున్నారు. పత్రికా ముఖంగా విమర్శను ఖండించడమన్నది చాలా అరుదుగా కనపడుతోంది. ప్రింట్‌ పత్రికలు సైతం, నిర్ణీత వ్యవధిలో మరుసటి సంచిక ప్రచురించాలి గనుక, ముందే ఎంపిక చేసుకున్న రచనలతో పత్రిక విడుదల చేసేస్తున్నారు. వీలువెంబడి పత్రిక ప్రతి విమర్శ ప్రచురించేసరికి, జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. కేటాయించేందుకు తగిన స్థలము, సమయము, లేదా సాంకేతిక వనరుల లేకపోవడాన్ని ఆయా సందర్భాల్లో కారణాలుగా వింటున్నాం. నిడివితో నిమిత్తం లేకుండా, రచయితలకు వ్యాస విస్తరణలో స్వేచ్ఛనిచ్చే పాలపిట్ట వంటి పూర్తి స్థాయి సాహిత్యపత్రికలను ఆర్థిక వనరులు సరిపోక నెలకూ, రెణ్ణెల్లకూ, కుదరనప్పుడు మూడు నెలలకూ పత్రిక ప్రచురిస్తున్నారు. ఇలాంటి పత్రికల ద్వారా సాహిత్యానికి దగ్గరవుదామనుకున్న వాళ్లు, వీటి ప్రచురణలోని నిబద్ధతను ప్రశ్నిస్తూ, చందాలను నిలిపి వేస్తున్నారు. దీనివల్ల పరిస్థితి మరింత విషమిస్తోందే తప్ప మెరుగవ్వడం లేదు. ఇలా, మనకున్న అతి కొద్ది సాహిత్య పత్రికలు కూడా వనరుల లోపం వల్ల మూతబడిపోతున్నాయి. సాహిత్యాన్నే బతికించుకోలేని సమాజం, విమర్శ వైపుకి చూపు సారించలేదు.

అరచేతిలో ఇమిడే ప్రపంచాన్ని అ ఆ ఇ ఈ లు నేర్చిన వారెవ్వరూ వదలాలనుకోని ఈ అంతర్జాలపు రోజుల్లో, మనకు మిగిలున్నది, ఆశ కలిగించగలిగినదీ, ఆశ నిలపగలిగేదీ వెబ్‌ పత్రికలే. సాంకేతిక సహకారం, నిర్వహణావ్యయం హామీగా దొరికితే, ఇవి అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉంటాయి. మనకు కావలసినదల్లా నిబద్ధత కలిగిన రచయితలు, రచయితలను స్వలాభం కోసం ఏమార్చని ఎడిటర్లూ. విమర్శ ఎక్కడ దూషణగా మారుతోందో, అక్కడ దాని ప్రచురణ నిల్చిపోవాలి. వేన్నోళ్ల పొగిడినా, వేలెత్తి చూపినా, విమర్శ సాధికారంగా అందుకు తగ్గ కారణాలను ప్రకటించి, వివరించి నిరూపించాలని నియమం పెడితే విమర్శకు విలువ పెరుగుతుంది. విమర్శ, విమర్శకుని అసందర్భ పరిజ్ఞాన ప్రదర్శనకుగాక రచన ప్రత్యేకతను వివరించడమే లక్ష్యంగా సాగాలి. ఏ ప్రత్యేకత, ప్రయోగాత్మకత లేని రచనలు కూడా కొన్నిసార్లు బహుళ ప్రాచుర్యాన్ని పొందడం చూస్తూనే ఉంటాం, ఆయా విజయాలకు కారణాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించకుండా, పాఠకుల విజ్ఞతను ప్రశ్నిస్తూ, పాఠక హృదయాలను గేలిచెయ్యడమూ, రచయిత అసమర్థతను అవహేళన చేయడమూ మాత్రమే ప్రధానోద్దేశ్యంగా విమర్శ సాగకూడదు. విమర్శకు శాస్త్రీయత, సహృదయత ప్రమాణంగా ఉండేలా చూడాలి. సంయమనం కోల్పోయిన విమర్శలను సంపాదకులు గుర్తించి తిరస్కరించాలి. అలాగే, విమర్శ కరినంగా ఉన్న ప్రతిసారీ, వ్యక్తిగత దాడులకు పాల్బడే ఆయా రచయితలనుగానీ, వారి అభిమానులనుగానీ, వారికి మద్దతుగా నిలిచే మరే ఇతర సమూహాలనైనా సరే, నిర్ద్వంద్వంగా చర్చకు ఆవల నిలబెట్టే హక్కును పత్రికలు నిలుపుకోవాలి.

చర్చకూ ప్రశ్నించడానికీ వాదోపవాదాలకూ అవసరమైన వేదికనూ సమయాన్నీ అందరికీ ఇస్తూనే, పరిధి దాటిన వ్యాఖ్యలను నిలిపివేసే బాధ్యతను వారే తీసుకోవాలి. ఇలా చెయ్యడం ద్వారా, సాహిత్య చర్చలు వీధి చివరి కుళాయి వాదనలు కాదనీ, వాటిని బాధ్యతగా, జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉందనీ తేల్చిచెప్పినవారమవుతాం; ఇక్కడ ఎవ్వరి గౌరవానికీ ఏ రకమైన హానీ ఉండదన్న హామీని కల్గించినవాళ్లమవుతాం. మాట్లాడటం హక్కే కాదు, బాధ్యత కూడా అనుకున్నప్పుడు, మంచి చర్చ జరుగుతుంది. మంచి చర్చల నుండే మంచి విమర్శా పుడుతుంది. విమర్శకు ప్రతివిమర్శ జరిగినప్పుడు, దానికి సాధ్యమైనంతవరకూ అదే పత్రికలో, లేదా అదే చర్చావేదికలో స్థానం కల్గించడం మంచిది. పాఠకులకు భిన్న స్వరాలను నిష్పక్షపాతంగా వినిపించేందుకు, తాము ఏ వైపుకూ మొగ్గకుండా నిలబడతామన్న నైతిక ప్రమాణానికి పత్రికలు అన్ని వేళలా లోబడి ఉండాలి. అధికారం చేతుల్లో ఉన్నవాళ్లు, తమవాళ్లకో, తమ భావజాలానికో వత్తాసు పలుకుతున్నారని, కొందరికి సభల్లోనూ పత్రికల్లోనూ పెద్దపీట వేసి, వాటిపై రానున్న విమర్శకు ఆయాచోట్ల స్థానాన్నీ సమయాన్నీ మిగల్చకపోవడం, సాహిత్యం పట్ల చేస్తున్న నేరమేనని విజ్ఞులైన పాఠకులు తెలుసుకుని ఆ రాజకీయాలను దూరం పెట్టాలి.

సాహిత్యం ఏ వాతావరణంలోనైనా, ఎవ్వరి చేతుల్లోనైనా ప్రాణం పోసుకోగలదు. దానికా అవకాశం ఉంది. కానీ, ఉత్తమసాహిత్యమేదో గుర్తించడం, దానినే ప్రోత్సహించడం కళను నిలబెట్టే దారులు. ఆ పని చెయ్యగలిగింది, విమర్శ ఒక్కటే. దాని నడక ఎటు మళ్లుతోందో వేయికళ్లదో గమనించాల్సిన బాధ్యత సాహిత్యంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముడిపడ్డ ప్రతి ఒక్కరిదీ.

వ్యాసరచనకు సహకరించిన పుస్తకాలు, ఇతర వివరాలు:

Pingali Surana, Translated by Velcheru Narayana Rao and David Shulman, The Sound of the Kiss, or the Story That Must Never Be Told, Columbia University Press, 2002, Introduction.
కృష్ణశాస్త్రి సాహిత్యము, కృష్ణపక్షము, విశాలంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, డిసెంబరు, 2008.
రేవతీదేవి, శిలాలోలిత, ప్రియబాంధవి ప్రచురణలు, 1981.
శివలెంక రాజేశ్వరీదేవి, సత్యం వద్దు, స్వప్నమే కావాలి, ప్రేమలేఖ ప్రచురణలు, 2016.
నన్నయ్య, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్రమహాభారతము, అరణ్య పర్వము, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి ప్రచురణ, 2008, పు: 176.
దేవరకొండ బాలగంగాధర తిలక్‌, అమృతం కురిసిన రాత్రి, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 1968, పు: 9.
బమ్మెర పోతన, భాగవతవము, ఎనిమిదవ స్కంధము, గజేంద్రమోక్షము- పు:176, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి ప్రచురణ, 2010.
అహ్మద్‌ ఫరాజ్‌ గజల్‌ : రంజిష్‌ హీ సహీ.
Swami Govinda Thirtha, “Nectar Of Grace Omar Khayyam’s Life And Works”, Government Central Press, Hyd, 1941, Introduction- LIV, LV.
స్వాతికుమారి బండ్లమూడి, ఆవిరి, జె.వి. పబ్లికేషన్స్‌, 2015, పు: 57.
God on the Hill: Temple Poems from Tirupati, Annamayya (Author), Velcheru Narayana Rao (Translator), David Shulman (Translator), ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 2005, SCP 419, 12:63.
-----------------------------------------------------
రచన: మానస చామర్తి, 
ఈమాట సౌజన్యంతో

No comments: