Friday, November 16, 2018

(సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి


(సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి



సాహితీమిత్రులారా!

తెలుగు సినిమా దర్శకుల్లో గొప్పవాళ్ళు ఎవరనే ప్రశ్న వస్తే మనం ముందుగా వినే పేరు “బి.ఎన్‌. రెడ్డి”. నిజానికి 30 ఏళ్ళ సినీ జీవితంలో ఆయన తీసింది పదకొండు సినిమాలే. కాని ప్రతి ఒక్కటీ పేరు గడించిందే!


లోకానికంతటికీ “బి.ఎన్‌” గా పరిచితుడైన ఆయన అసలు పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. 16.11.1908 న కడపజిల్లాలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లి అనే కుగ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన బి.ఎన్‌ ప్రాథమిక విద్యాభ్యాసం పొట్టిపాడులో జరిగింది. ఆయన తండ్రి Rallis, Louis Dreyfuss లాంటి కంపెనీ లకు వేరుసెనగలు సరఫరా చేసేవారు. వ్యాపారం నెమ్మదిగా విదేశాలకు ఉల్లిపాయలు, మిర్చి, ధాన్యం వగైరా ఎగుమతి చేసే వరకు పెరగడంతో కుటుంబం మద్రాసుకు మకాం మార్చింది.

ఈ శతాబ్దపు తొలి దశకాల్లో బెంగాలీ రాజకీయ విప్లవకారులు, సంఘసంస్కర్తలు, సాహిత్యవేత్తలు ఇతర రాష్ట్రాల వాళ్ళకు మార్గదర్శకులు, ఆదర్శప్రాయులు అయ్యారన్నది తెలిసినదే. బెంగాల్‌లో ఏవుద్యమం ప్రారంభమైనా ఆ గాలి ముందుగా మన తెలుగువాళ్ళకే సోకేది అన్న విషయం చరిత్ర నెరిగిన వాళ్ళెవరూ కాదనరు. అక్కడ పి.సి.బారువా, దేవకీ బోస్‌లు సినీ రంగంలో ముందుకొచ్చి మంచి సాంఘికచిత్రాలు తీశారు. బి.ఎన్‌ కూడా బెంగాలీ ప్రభావానికి లోనయ్యారంటే ఆశ్చర్యం ఏమీ లేదు [1] . అలా ఆయనకు హైస్కూలు చదువు పూర్తయిన తర్వాత “శాంతి నికేతన్‌”లో చదువుకోవాలన్న కోరిక బలంగా వుండేది. కాని, కొడుకు “బారిస్టర్‌” కావాలని తల్లిదండ్రుల ఆకాంక్ష. దానితో వాళ్ళు బి.ఎన్‌ శాంతి నికేతన్‌కు వెళ్ళడానికి ఇష్టపడ లేదు. తరువాత మద్రాసు పచ్చయప్ప కాలేజిలో చేరినా చదువు మధ్యలోనే ఆపివేయడం జరిగింది. కాలేజి విరమించిన తరువాత కలకత్తా, బొంబాయి,రంగూన్‌లలో గడిపిన కాలంలో బెంగాలీ, మరాఠీ, చైనీస్‌ నాటక,నృత్యాలు ఆయనను బలంగా ఆకర్షించాయి. రంగూన్‌లో వున్న కాలంలోనే గాంధీ “విదేశీ వస్తు బహిష్కరణ” పిలుపు నందుకొని గాంధేయవాదిగా మారి, ఖాదీ ధారణ ప్రారంభించారు.

మద్రాసుకు తిరిగి వచ్చిన అనంతరం “Government Diploma in Auditing”(G.D.A , ఈనాటి C.A కు సమానం.) కోర్సులో చేరి “శాస్త్రి అండ్‌ షా కంపెనీ “లో అప్రెంటిస్‌గా పని ప్రారంభించారు. అప్రెంటిస్‌ కాలంలో రోజూ “ఆగ్ఫా” కంపెనీ ఆఫీసుకి రావలసి వచ్చేది. దానికి దగ్గర్లోనే వున్న “ప్రజామిత్ర” పత్రిక కార్యాలయం, గూడవల్లి రామబ్రహ్మం సారధ్యంలో, సాహితీవేత్తలతోనూ, సినీ ప్రముఖులతోనూ సందడిగా వుండేది. కవులు, రచయితలు, రాజకీయవేత్తలు,కళాకారులు ఎవరొచ్చినా అక్కడే ఆతిధ్యం! బి.ఎన్‌ విరామ సమయమంతా అక్కడేగడిపేవారని చెప్ప నక్కరలేదు. గూడవల్లి ద్వారా ఆయనకు దువ్వూరి,దేవులపల్లి, సముద్రాల, కాటూరి, అడవి, తల్లావఝల, తాపీ, నార్లవంటి ప్రముఖులతో తొలి పరిచయాలు అక్కడే ఏర్పడ్డాయి. ఆకార్యాలయంలోజరిగే వాదోపవాదాలు, విమర్శలు బాగా ప్రభావితుణ్ణి చేశాయి.

“ప్రజామిత్ర” ముద్రించేవారితో పేచీలు రావడంతో, రామబ్రహ్మం బి.ఎన్‌తో “మీరేదైనా ప్రెస్‌ పెడితే మా పత్రిక అచ్చు వేయడమే గాక, నేనే నడిపిస్తాను”అని హామీ ఇవ్వడంతో బి.ఎన్‌.కె. ప్రెస్‌తో వ్యాపార రంగంలోకి కాలు పెట్టారు. ఇంతలో రామబ్రహ్మం తన దృష్టి సినీ రంగంవైపు మరల్చడంతో బి.ఎన్‌కి కూడా ప్రెస్‌పైన ఆసక్తి తగ్గింది. దాన్ని నడిపే బాధ్యత సోదరుడు నాగిరెడ్డికి అప్పగించి తను కూడా సినిమాలపై మరింత ఆసక్తి చూప సాగారు. దీనికి ముందే ఆయనకు సినీ, నాటక రంగాలతో వున్న పరిచయం గురించి కొంచెం చెప్పుకోవలసి ఉంది.

విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే “చెన్నపురి ఆంధ్ర మహాసభ”లో సభ్యుడిగా అక్కడి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ “చంద్రగుప్త”,”బొబ్బిలియుద్ధం” నాటకాల్లో చిన్న వేషాలు కూడ వేశారు. అప్పటి నుండే బళ్ళారి రాఘవ, బెల్లంకొండ సుబ్బారావు, పారుపల్లి సుబ్బారావు,స్థానం, యడవల్లి సూర్యనారాయణ, నాగయ్య వంటి నాటకరంగ ప్రముఖులతో పరిచయాలు ఉండేవి. “బాగా ఆంగ్ల చిత్రాలను చూడడం, అమెరికన్‌ కాన్సలేట్‌ లైబ్రరీలో సినిమా కళపై పుస్తకాలు చదివేవాడిన”ని కూడా ఆయనొకసారి పేర్కొన్నారు.

ఆయనపైన బెంగాలీ సంస్కృతి ప్రభావం గురించి పైన చెప్పుకున్నాం.ప్రముఖ బెంగాలీ దర్శకుడు దేవకీ బోస్‌ బి.ఎన్‌కు ఏకలవ్య గురువు.ఆయన చేసిన “సీత” (1934) అన్న చిత్రాన్ని మద్రాసులో ఒకే రోజు మూడు సార్లు చూసిన బి.ఎన్‌, మరల పదహారోసారి చూడడానికి బెంగుళూరు వెళ్ళివచ్చారంటే, ఆ అభిమానం ఎలాంటిదో అర్థమవుతుంది. “ఆ సినిమా ప్రభావంతోనే సినీ కారీర్‌ను ఎన్‌నుకున్నట్లు” చెప్పేవారు.

1936 ప్రాంతాల్లో రామబ్రహ్మం “కనకతార” (1937) చిత్రానికి ప్రొడక్షన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నప్పుడు తరచుగా సెట్ల మీదకు వెళ్తుండే బి.ఎన్‌కు ఆ చిత్ర నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ఒక గొప్ప వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ వ్యక్తి ఎవరో కాదు. “తెలుగు టాకీ పితామహుడు”గా పేరొందిన హనుమప్ప మునియప్ప రెడ్డి. హెచ్‌.ఎమ్‌. రెడ్డి ప్రోత్సాహంతో అదే సంవత్సరంలో 65 వేల రూపాయిల మూల ధనంతో “రోహిణీ” సంస్థ స్థాపించబడింది. బి.ఎన్‌తో పాటు ముఖ్య పెట్టుబడిదారుడైన కుటుంబమిత్రుడు మూలా నారాయణస్వామి తాడిపత్రి నుంచి వస్తూ తనతో పాటు పట్టభద్రుడైన ఒక నిరుద్యోగ మిత్రుణ్ణి వెంట పెట్టుకొని వచ్చి క్యాషియర్‌గా చేర్చారు. అతని పేరు కదిరి వెంకటరెడ్డి. అతనే కె.వి.రెడ్డిగా మనందరికీ పరిచితుడు!

“కనకతార”లో హీరోగా వేసిన దొమ్మేటి సత్యనారాయణ అప్పటికి “రంగూన్‌ రౌడీ” అన్న జనాదరణ పొందిన నాటకంలో ముఖ్య పాత్ర ధరించేవారు. “మద్య నిషేధ ఉద్యమం” దీనిలోని ప్రధాన ఇతివృత్తం.ఆ నాటకాన్ని సినిమాకి అనువుగా బి.ఎన్‌ మలచారు. ఈ చిత్రం ద్వారానే గేయరచయిత సముద్రాల రాఘవాచార్య, అనాధాశ్రమం నడిపే ఒక గాంధేయవాదిగా చిత్తూరు నాగయ్య సినిమాల్లోకి అడుగు పెట్టారు. దొమ్మేటి అకాల మరణంతో “కన్యాశుల్కం” నాటకంలో పేరు సంపాదించిన ముక్తేవి రామానుజాచారిని ప్రధాన పాత్రధారిగా ఎన్ను కొన్నారు.(చాలా ఆశించినా, ఆయన చిత్ర రంగంలో నిలవలేకపోయారు.) కన్నాంబ,కాంచనమాల రెండు ముఖ్య పాత్రలను పోషించారు. “గృహలక్ష్మి”లో నాగయ్య పాడిన “లెండు భారత వీరులారా! కల్లు మానండోయ్‌” అన్న పాట (సం. ప్రభల సత్యనారాయణ, హిందీలో కె.సి.డే పాడిన “మన్‌కీ ఆంఖెన్‌ ఖోల్‌ దే బాబా!” అన్న పాటకు మక్కికి మక్కి అనుకరణ.) తెలుగు దేశం నాలుగు మూలలా మార్మోగింది. టెక్నికల్‌గా కూడా, 1937 లోనే, రద్దీగా వుండే వీధులపైన “ఔట్‌డోర్‌ షూటింగ్‌” జరుపుకొని సంచలనం సృష్టించింది.

“గృహలక్ష్మి” 25 వారాలపైన ప్రదర్శింపబడి మంచి పేరు తెచ్చుకొన్నా,చిత్ర నిర్మాణ కాలంలో హెచ్‌.ఎమ్‌.తో తేడాలు రావడంతో బి.ఎన్‌ బయటకు వచ్చి మిత్రులైన బ్రిజ్‌మోహన్‌ దాస్‌, మూలా, నాగయ్య, సోదరుడు నాగిరెడ్డిల ప్రోత్సాహంతో “వాహినీ” సంస్థను నెలకొల్పారు. అప్పటికి మద్రాసులో పెద్దగా స్టూడియోలు లేవు. గ్రీన్‌వేస్‌ రోడ్డులో “కార్తికేయ ఫిల్మ్స్‌” అన్న పేరిట ఒక చిన్న స్టూడియో వుండేది. అక్కడ తడికలతో షెడ్డు లాంటిది కట్టి అందులో “గృహలక్ష్మి” చిత్రాన్ని తీశారు. ఆ స్టూడియో అధినేతలైన ఎ.కె.శేఖర్‌, కె. రామ్‌నాథ్‌ల (మూడవ వ్యక్తి” మురుగదాసన్‌”) నిజాయితీ,బహుముఖప్రజ్ఞ బి.ఎన్‌ని బాగా ఆకర్షించాయి. అదే సమయంలో “కార్తికేయ” ఆర్ధికసమస్యల వల్ల మూత పడడంతో, వారిద్దరినీ “వాహినీ”లో చేరమని ఆహ్వానించారు. తరువాత కాలంలో “వాహినీ” విజయాలకు వీరిరువురూ చాలా దోహద పడ్డారు. రామ్‌నాథ్‌ స్క్రీన్‌ప్లే, ఛాయాగ్రహణం,ఎడిటింగ్‌,దర్శకత్వ విభాగాల్లో అందెవేసిన చేయి కాగా, శేఖర్‌ కళాదర్శకుడిగాను, శబ్ద గ్రాహకుడిగాను మంచి పేరు సంపాదించారు.

“వాహిని” మొదటి చిత్రం “వందేమాతరం” (1939) ఆనాడు ప్రబలంగా ఉన్ననిరుద్యోగ సమస్య ప్రధాన అంశంగా తీసుకొని నిర్మించబడింది. ఆ సినిమా కథకు బి.ఎన్‌ గతంలో రచించిన “మంగళసూత్రం” అన్న నవల మూలాధారం. నాగయ్య, కాంచనమాల ముఖ్య తారాగణంగా నిర్మించబడ్డ ఈ చిత్రం పొరుగు రాష్ట్రాల్లో కూడా విజయవంతంగా ప్రదర్శించబడింది.

సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి కనుక “సినిమా అనేది ప్రయోజనాత్మకంగా,సందేశపూర్వకంగా ఉండాలి” అనేది ఆయన దృఢ నమ్మకం. అది ఒక బలీయమైన ఆయుధమని, ఆ ఆయుధాన్ని సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగించి సమాజంలో కొన్ని ఆలోచనా విధానాల్ని మలిచేటటువంటి శక్తి దానికుందని నమ్మినవారిలో ఆయనొకరు.

ఆయన తదుపరి చిత్రం “సుమంగళి” (1940) కందుకూరి వీరేశలింగం నడిపిన సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రేరణతో బాల వితంతువుల సమస్యను తెరపైకి ఎక్కించినది [2] . వీరేశలింగాన్ని ప్రతిబింబించే “పంతులు” పాత్రలో నాగయ్య నటనకు ఎనలేని ఖ్యాతి లభించింది. ఈ చిత్రంలోని సాంకేతిక విలువలు ఈనాటికీ మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి. కాని, నాటి సంఘం ఆ కథావృత్తాన్ని జీర్ణించుకోలేక పోయింది. అభిరుచి విషయంలో రాజీ పడని మనిషి కావడంతో, చిత్ర నిర్మాణ కాలం, వ్యయం ఊహించని రీతిలో పెరిగిపోయాయి. ఆర్ధికంగా కూడా బాగా నష్టం కలిగింది. దానికి పోటీగా అదే కథా వస్తువుతో వై.వి.రావు తన “మళ్ళీపెళ్ళి”ని (1939) 2 నెలల కాలంలో, సగం ఖర్చుతో పూర్తి చేసి ఘనవిజయం సాధించాడు. ఇక్కడ మనం ఆయన అభిరుచుల గురించి కొంచెం చెప్పుకోవాలి.

మొదటి నుండీ ఆయన పరిచయాలన్నీ కవులు, రచయితలు, పండితులు,కళాకారులతోనే వుండేవి. వారే ఆయనకు స్నేహితులు, ఆప్తులు,ఆత్మీయులు! అలాగే ప్రతిదీ కళాత్మకంగా వుండాలి. దారిన పోయే మనిషి, మురికితో నిండిన కాలవ, చివరకు చేతికర్ర కూడా! ఏదయినా సరే అన్నింటిలోను కళ కనిపించాలి. “సినిమాలు కేవలం వ్యాపారదృష్టితో తీయకూడదు.సినిమా తీయడం ఖరీదయిన వ్యవహారమే, ప్రతి నిర్మాత తన పెట్టుబడయినా తిరిగి రావాలని కోరుకుంటాడు. కాని డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు” అన్నది ఆయన సిద్ధాంతం. అలా అని పూర్తిగా పగటి కలలు కన్న వ్యక్తి కూడా కాదు.

“సుమంగళి” అపజయం పాలైనా లెక్క చేయకుండా తర్వాత చిత్రం “దేవత”(1941) ప్లాన్‌ చేయడం మొదలు పెట్టారు. “దేవత” కథ క్లుప్తంగా “ఉన్నత విద్యావంతుడైన కథానాయకుడు (నాగయ్య) కాలుజారి ఒక పెళ్ళికాని అమ్మాయిని (కుమారి) అనుభవించడం, తనవారిని (మాలతి,సూర్యకుమారి)కూడా మోసగించడం, మరల జ్ఞానోదయమై తిరిగి ఇల్లు చేరడం”. చాలామంది ఆ కథ విని కన్నెర్ర చేశారు. చివరకు అత్యంత సన్నిహితుడైన రామ్‌నాథ్‌ కూడా వద్దని హెచ్చరించినా బి.ఎన్‌.లెక్కచేయలేదు. 11.09.1941 న విడుదలైన “దేవత” అనూహ్యంగా జయభేరి మోగించింది! కేరళ రాష్ట్రంలో కూడా చాలా కాలం ఆడడం గమనించదగ్గ విషయం. ముఖ్యంగా ఖాళీ అయిన “వాహినీ” ఖజానా మరల నిండింది.

అప్పటివరకు సాంఘిక చిత్రాలు నిర్మిస్తున్న “వాహిని” ఆంధ్ర భాగవత కర్త “పోతన” జీవిత చరిత్రను కథావస్తువుగా ఎన్నుకుంది. మూలా ప్రోద్బలంతో, అప్పటి వరకు నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్న కె.వి దర్శకుడయ్యారు. కె.వి బాధ్యతలు బి.ఎన్‌ స్వీకరించారు. “భక్తపోతన” (1942) నిర్మాణ కాలంలోనే మూలధనం చాలకపోవడంతో వాహినీపిక్చర్స్‌ను పంపిణీ సంస్థగా మార్చి వాహినీ ప్రొడక్షన్స్‌ అన్న కొత్త సంస్థ నెలకొల్పబడింది. అప్పటి నుండి వాహినీ సంస్థకు బి.యెన్‌, కె.వి. ఒకరి తర్వాత ఒకరు సినిమాలు డైరెక్ట్‌ చేయడం ఆనవాయితీ అయ్యింది. “పోతన” పూర్తవుతున్న కాలంలోనే “వాహినీ” విజయాలలో కీలక పాత్ర వహించిన రామనాథ్‌, శేఖర్‌లు “జెమినీ” సంస్థలో చేరిపోయారు.వారిద్దరి తోడు లేని బి.ఎన్‌ సినీ చరిత్ర అంతటితో ముగిసిందని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన వాళ్ళందరి ఊహలని తన తరువాత చిత్రంతో తల్లకిందులు చేశారు.

అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ముడి ఫిల్మ్‌ కొరత వల్ల,ప్రభుత్వం ఏ సినిమా కూడా 11 వేల అడుగుల నిడివి దాటరాదనే నియమం ఒకటి ప్రవేశపెట్టింది. ఎస్‌.ఎస్‌. (జెమినీ) వాసన్‌, టి.ఆర్‌. సుందరం లాంటి పెద్ద నిర్మాతలు “ఆ నిడివితో భారతీయ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీయడం అసాధ్యం” అని సినిమా నిర్మాణం ఆపి వేశారు [3] .వారి అంచనాలన్నీ తారుమారు చేస్తూ, 10, 600 అడుగుల నిడివిలోనే,బి.ఎన్‌.సృష్టించిన, “స్వర్గసీమ” (1945) సాధించిన విజయం చిత్రరంగాన్ని యావత్తూ కుదిపివేసింది. ఈ చిత్రానికి బెర్నార్డ్‌ షా రాసిన “పిగ్మాలియాన్‌” నాటకం ఆధారం. దానికి స్క్రీన్‌ప్లే, సంభాషణలు “చక్రపాణి”గా ప్రసిద్ధి పొందిన ఆలూరు వెంకటసుబ్బారావు రాసారు. ఇదే చిత్రం ద్వారా ఆంధ్రుల అమర గాయకుడు “ఘంటసాల” సినీ నేపథ్యగాయకుడిగా తొలిసారి పరిచయమయ్యారు.

“స్వర్గసీమ”లో భానుమతి పాడిన “ఓహో పావురమా” అన్న పాట ఎంత పాపులర్‌ అయ్యిందో వర్ణించడం కష్టం. దక్షిణ భారతమంతా మార్మోగిన ఈ పాటతో ఆవిడ “పావురమా భానుమతి”గా పిలవబడింది. ఈ పాటకు ప్రేరణ రీటా హేవర్త్‌ “బ్లడ్‌ అండ్‌ శాన్డ్‌” (1941) చిత్రంలో పాడిన ఒక పాట [4] .ఈ అపూర్వ సృష్టితో పాటు బాలాంత్రపు రజనీకాంతరావుగారు (“రజని”) ఈ సినిమాలో ఒక పాట కూడా పాడటం గొప్ప విశేషం.

“స్వర్గసీమ” విజయంతో, ఎందరో నిర్మాతలు ఆయన దర్శకత్వం వహిస్తే లక్షల రూపాయలు ముట్ట చెప్తామని వచ్చారు. “నిర్మాత, దర్శకుడూ ఒక్కడే అయినప్పుడే ఫలితం బావుంటుంది. లేదా ఇద్దరూ ఒకర్నొకరు అర్థం చేసుకోగలిగే సమర్థులైనా ఫర్వాలేదు. లేకపోతే పొత్తు కుదరదు. దర్శకుడు చేసినవి నిర్మాతలకు, నిర్మాతలు చేసేవి దర్శకుడికి నచ్చక, అనుకున్న సినిమా అనుకున్నట్టుగా రాదు” అని నమ్మిన ఆయన, బయటి వారికి చేసిన చిత్రాలు రెండే : ఒకటి “భాగ్యరేఖ” (1957), రెండవది “పూజాఫలం” (1964, ప్రముఖ కథకుడు మునిపల్లె రాజుగారి “పూజారి” కథ ఆధారంగా). ఆ రెండూ కూడా కుటుంబ మిత్రులైన పొన్నలూరి సోదరులు నిర్మించినవి.

“స్వర్గసీమ” చిత్ర నిర్మాణ కాలంలో ఇతర స్టూడియోల వాళ్ళతో ఇబ్బందులు పడలేక “వాహినీ సంస్థ సొంతంగా ఒక స్టూడియో కట్టుకుంటే బాగుంటుందన్న ఆలోచన” బి.ఎన్‌కి ఉండేది. మూలా నారాయణ స్వామి పెట్టుబడితో 1947ప్రాంతాల్లో ఆ నిర్మాణ కార్యక్రమం మొదలయింది. తదుపరి మూడు సంవత్సరాలు ఆయన తన సమయం, శక్తియుక్తులన్నింటినీ ఆ స్టూడియో నిర్మాణంపైనే కేంద్రీకరించారు. అందువల్లనే, “యోగి వేమన” (1947) తరువాతి చిత్రం ఆయన తీయ వలసి వున్నా కె.వి. రెడ్డికే (“గుణసుందరి కథ”, 1949) అప్పగించారు.

స్టూడియో నిర్మాణం పూర్తయిన తర్వాత మరల కొత్త కథ కోసం అన్వేషణ మొదలయింది. “వందేమాతరం” నిర్మాణ కాలంనుండే కృష్ణదేవరాయలుపై ఒక సినిమా తీయాలనే కోరిక ప్రబలంగా వుండేది. “స్క్రిప్టే సర్వస్వం” అని నమ్మిన వ్యక్తి కావడంతో (చివరకు టెక్నీషియన్స్‌తో సహా అందరికీ చదివి వినిపించేవారు.) ఆ అన్వేషణ 12 ఏళ్ళకు పైగా కొనసాగింది. ఈ సందర్భంలో తరచు హిచ్‌కాక్‌ మాటలు: “I have finished the script. I have just got to shoot it, thats’s all!” కోట్‌ చేసేవారు.

మల్లీశ్వరి స్కెచ్
మల్లీశ్వరి కోసం వేసిన స్కెచ్
“మల్లీశ్వరి” కథకు మూలం ఎక్కడిదన్న విషయంపై చాలా చర్చ జరిగింది. ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారు తమ “రాయలవారి కరుణకృత్యము” అన్న నాటికకు రాసిన పరిచయంలో “ఈ నాటికలో యితివృత్తానికి, ‘ మల్లీశ్వరి ‘ యితివృత్తానికి కొన్ని పోలికలు కనపడవచ్చు. ఈ నాటిక ‘ భారతి ‘ లో ప్రచురింపబడిన ఏడెనిమిది సంవత్సరాలకా చిత్రం విడుదలైందని పాఠకులు గుర్తుంచుకుంటే చాలు” అని రాసారు. “మల్లీశ్వరి”కి రచన, పాటలు సమకూరుస్తూ సినీ రంగ ప్రవేశం చేసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి సినీ పత్రిక “విజయచిత్ర”లో రాస్తూ (డిసెంబర్‌, 1977), “బుచ్చిబాబుగారు ‘ భారతి’ లో ప్రచురించిన కథ, ‘ ఇల్లస్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా ‘ లో వచ్చిన వేరొక కథల ప్రభావంతో ‘ మల్లీశ్వరి ‘ కథ రూపొందింది” అన్నారు.కాని, “అందమైన అమ్మాయిలను తమ ఆటవస్తువులుగా తెప్పించుకొని జనానాలలో జాగ్రత్త చేయడం ఆనాటి రాజులు ఎందరో చేసినదే అని,కృష్ణదేవరాయల గురించి అలా చూపడం బాగుండదని కొన్ని మార్పులు చేసినట్లు” బి.ఎన్‌. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. “మల్లీశ్వరి” చిత్రం గొప్పదనం గురించి వేరు చెప్పనవసరం లేదు. దానిని మించిన చిత్రం తెలుగులో రాలేదు అంటే పెద్ద అతిశయోక్తి కాదు!

ఇంతలో మూలా అబ్కారీ వ్యాపారం పూర్తిగా దెబ్బతిని పోయి,ఆర్ధికంగా గొప్ప చిక్కుల్లో పడటంతో వాహినీ స్టూడియో మూతబడే పరిస్థితి ఏర్పడింది.ఆ సమయంలో ఆర్ధిక సహాయం చేసిన బి. నాగిరెడ్డికి వాహినీని లీజుకు ఇచ్చారు. తన కలలకు ప్రతిరూపంగా నిర్మించు కున్నానని అనుకున్న స్టూడియో అనూహ్యంగా బి. నాగిరెడ్డి ఆధీనంలోకి జారిపోవడం, దానికి తోడు సినీ నిర్మాణంలో పెరుగుతున్న వేగం, పడిపోతున్న విలువలు, లాభార్జనే ప్రధాన ధ్యేయం కావడం మొదలైన కారణాలతో అయనలో నెమ్మదిగా నైరాశ్యత చోటు చేసుకుంది.

“మల్లీశ్వరి” అనంతరం, కె.వి. రెడ్డి దర్శకత్వంలో “పెద్ద మనుషులు”(1954) చిత్ర నిర్మాణం సాగుతున్నప్పుడు, తర్వాతి చిత్రానికి కథ కోసం వెదకడం మొదలయింది. ఆ సమయంలో జార్జి ఇలియట్‌ రాసిన “సైలాస్‌ మార్నర్‌” అన్న ఆంగ్ల నవల ఆయనని ఆకర్షించింది. దానిని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మలచడానికి భీమవరం నుంచి పాలగుమ్మి పద్మరాజుగారిని పిలిపించారు. [5]

“బంగారు పాప” (1955) ఆర్ధికంగా విజయం సాధించక పోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఎస్‌.వి. రంగారావు నటనను,లండన్‌లో చూసిన చార్లీ చాప్లిన్‌, ఇలియట్‌ “బ్రతికి వుంటే చాలా సంతోషించి ఉండేవాడని” అన్నారు. బి. ఎన్‌కు గురువైన దేవకీ బోస్‌ బెంగాలీలో తీయ పూనుకొన్నారంటే ఆ చిత్రం మేధావులను ఎంతగా ఆకర్షించిందో తెలుస్తుంది. బి.ఎన్‌. చివరి రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో “నేను బెస్టు అనేది ఇంతవరకు తీయలేదు. […] ప్రజలు “మల్లీశ్వరి” అంటారు. కాని నాకు “బంగారు పాప” ఇష్టం” అని చెప్పుకున్నారు. 1955లో రాష్ట్రపతి స్వర్ణ పతకం కొద్దిలో తప్పిపోయి రజత పతకం పొందగలిగింది. [6]

“బంగారు పాప” విడుదలైన రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక జిల్లా ముఖ్యపట్టణంలోని న్యాయవాదుల సంఘం వారు ఆయనకు సన్మానం జరిపారు. ఆ సభలో ప్రసంగించిన ప్రతి వక్త ఆ సినిమాని ఆకాశానికి ఎత్తివేస్తుంటే, “చూసిన వారెవ్వరో నిజాయితీగా చేతులెత్తండని” బి.ఎన్‌.అడిగితే, లేచిన చేతులు పది, పన్నెండు మాత్రమే. “చివరకు, కనీసం,ఒక్క సారైనా ఆ లాయర్లు నిజాయితీగా జవాబు చెప్పార”ని ఆయన చాలా వ్యంగ్యంగాను, ఆవేదనతోను చెప్పుకునేవారు. బిజీ కాల్షీట్లతో స్టూడియోలో ఒక ఫ్లోర్‌ నుండి మరొక ఫ్లోర్‌కి పరుగులెత్తే “అగ్ర”నటీనటులు, పెరుగుతున్న “స్టార్‌ వ్యాల్యూ సిస్టం” ఆయన్ను బాగా బాధించేవి. అందువల్లనే ఎప్పుడూ కొత్తవారిని తీసుకోవడానికి ప్రయత్నించేవారు. ఉదాహరణలుగా గిరి, మాలతి, కుమారి, జగ్గయ్య, చ. నారాయణరావు, చంద్రమోహన్‌,రామమోహన్‌, విజయ నిర్మల పేర్లు చెప్పుకోవచ్చు.

ఆయనకు సంగీతాభిరుచి ఎక్కువ. ఒక్కో పాటకు ఐదారు వరసలు కట్టించుకొని నచ్చినది ఎన్నుకునేవారు. వాహినీ చిత్రాల్లో సంగీత విలువలగురించి ఒకటి రెండు వాక్యాల్లో చెప్ప ప్రయత్నించడం దుస్సాహసం. నాగయ్య, “రజని”, అద్దేపల్లి రామారావు, సాలూరి, పెండ్యాల,మాస్టర్‌ వేణు బి.ఎన్‌కు అందించిన బాణీలతో పాటు,నాగయ్య, టంగుటూరి సూర్యకుమారి, బెజవాడ రాజరత్నం, ఎ.ఎస్‌. గిరి,మాలతి, ఘంటసాల, భానుమతి, సుశీల, జానకిల గళాలనుండి జాలువారిన ఆ మధుర గీతాల గురించి మరో సారి ముచ్చటించుకుందాం.

సినిమా అన్నది అనేక విభాగాల సమిష్టి కృషి అన్న విషయం మనకందరికీ తెలిసినదే. సాంకేతిక విభాగాలలో కూడా, బి.ఎన్‌కు రామనాథ్‌, శేఖర్‌లతో పాటు, సోదరుడు కొండారెడ్డి, మార్కుస్‌బ్త్లారే, యు. రాజగోపాల్‌ (ఛాయాగ్రహణం), వల్లభజోస్యుల శివరామ్‌,కోటీశ్వరరావు (శబ్దగ్రహణం) వంటి వ్యక్తులు దొరకడం ఒక అదృష్టమనే చెప్పాలి. అడయార్‌, పూనా ఇన్స్టిట్యూట్‌లు తెరవక ముందే, టెక్నీషియన్స్‌ విలువ తెలిసిన వ్యక్తి కావడంతో యువకుల్ని అప్రెంటిస్‌లుగా తీసుకొని తర్ఫీదు ఇచ్చేవారు. తెలుగు సినిమాల్లో మొదటిగా “ప్లేబ్యాక్‌” పద్ధతిని సమర్ధంగా వాడుకుంది “వాహిని” చిత్రాలలోనే. “వందేమాతరం”లో “పూలో పూలు “అన్న పాట మాస్టర్‌ విశ్వంపై చిత్రీకరించబడినా, రికార్డుపైన పాడింది సాబు. ప్రఖ్యాత గాయకుడు : ఎమ్‌.ఎస్‌.రామారావు కూడా వాహిని (“దేవత”)చిత్రం ద్వారానే మనకు పరిచయమయ్యారు. ఎమ్‌.ఎస్‌. రామారావు మొదటి మేల్‌ ప్లేబ్యాక్‌ గాయకుడైతే, బెజవాడ రాజరత్నం తొలి ప్లేబ్యాక్‌ గాయని (“భక్త పోతన” చిత్రం ద్వారా) [7]

“బంగారు పాప” తర్వాత ఐదు సినిమాలకు : భాగ్యరేఖ” (1957),”రాజమకుటం” (1960), “పూజాఫలం” (1964), “రంగుల రాట్నం” (1966),”బంగారుపంజరం” (1968), దర్శకత్వం వహించినా అవి ఆయనకు పూర్తి సంతృప్తిని కలిగించలేదు. కొంత సంతృప్తిని కలిగించిన “పూజా ఫలం” బాక్స్‌ఆఫీస్‌వద్ద ఘోర పరాజయం పొందింది. ప్రేక్షకుల్ని తన కథలో,పాత్రల్లో లీనం కావాలని ఆశించే ఆయన తానే ముందుగా నటీనటుల నటనలో లీనమయిపోయి కంట తడిపెట్టుకొని “కట్‌” చెప్పడం మర్చిపోయిన సందర్భాలు పలువురిచేత ఉటంకించబడ్డాయి. ఆయన ఊహించుకొన్న చేతికర్ర దొరకలేదని ఒక రోజు షూటింగ్‌ రద్దు చేయడం, ఒక ప్రఖ్యాత నటీమణి నిద్రమొహంతో షూటింగుకొస్తే “నీ ‘ ముఖం ‘ మీద ఆధారపడి తీస్తున్నాను. అలా ‘ డల్‌ ‘ గా వుంటే నా సీన్‌ పండదు. కనుక ఈరోజు షూటింగు కాన్సిల్‌ చేస్తున్నాను” అనడం ఆయనకే చెల్లింది. ఇది మారుతున్న కాలంలో చాలామందికి “చాదస్తం” అనిపించేది. కాని ఆయన “అది నా పెర్ఫెక్షన్‌” అనేవారు. నచ్చని విషయాలు ముఖం మీదే అనేసే వ్యక్తి కావడంతో చాలా అపోహలు ఏర్పడ్డాయి.

కర్ణ, దుర్యోధన, రామానుజాచార్య, విప్ర నారాయణ, ఆది శంకరాచార్య వంటి వ్యక్తుల జీవిత చరిత్రలను, బీనాదేవి (“మా పుణ్యభూమి), బుచ్చిబాబు (“చివరకు మిగిలేది”) మొదలైన ప్రముఖుల రచనలను వెండితెరపై మలచాలని ఎన్ని కోరికలున్నా మిగిలిన జీవితకాలంలో మరల కెమెరా వద్దకు కదలలేదు.

దక్షిణ భారతదేశం నుండి ప్రతిష్ఠాత్మకమైన “ఫాల్కే అవార్డ్‌”ను అందుకొన్న మొదటి వ్యక్తి బి.ఎన్‌. అంతకు ముందే భారత ప్రభుత్వం నుండి “పద్మశ్రీ” బిరుదు లభించింది. ఇంకా ఆయనకు జరిగిన సన్మానాలు, లభించిన అవార్డులు, అందుకున్న గౌరవ పురస్కారాలు లెక్కించడం కష్టం.కాని, అన్నింటికంటే ముఖ్యంగా, అప్పటివరకు ఎవరూ గుర్తించని తెలుగు సినిమాకు గౌరవాన్ని సంపాదించి పెట్టి, ప్రపంచ పటంపై నిల్పింది ఆయనే. సినిమా వాళ్ళకు మేధావి వర్గంలో ఒక స్థానం కల్పించింది,సినిమా వాళ్ళను సాంస్కృతిక, విద్యా సంస్థలు పిలిచి గౌరవించడం కూడా ఆయనతోనే మొదలయినదని మనం గుర్తుంచుకోవాలి.

శ్రీశ్రీ ఒక రేడియో ప్రసంగంలో “తెలుగు వాళ్ళ సినిమాల్లో కేవలం తెలుగుభాష మాట్లాడడంవల్ల తెలుగు చిత్రాలనుకుంటున్నాం తప్ప తెలుగు వాస్తవికతని, జీవితాన్ని, తెలుగుతనాన్ని ప్రతిబింబించేవి చాలా తక్కువగా వచ్చాయి” అంటూ, “బి. ఎన్‌. చిత్రాల్లో ఆ తెలుగు తనం కనపడుతుందన్నారు.” ఆ మాట ఎంతైనా నిజం! తెలుగు సినిమాకి ఇంత విశిష్ఠ స్థాయి కల్పించిన బి.ఎన్‌. నవంబర్‌ 8, 1977న కన్ను మూశారు. భౌతికంగా ఆయన లేకపోయినా, ఆయన మనకందించిన చిత్రాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.

బి.ఎన్‌ను ఏ విషయంలోనైనా సరే ఒప్పించాలంటే, ఆ కథో,వస్తువో,ఐడియానో “బెంగాలీది” అని చెప్తే చాలు, అని ఆయనతో బాగా పరిచయం వున్నవాళ్ళ ఛలోక్తి.
తర్వాత ఫిల్మ్స్‌ డివిజన్‌వాళ్ళు వీరేశలింగం పై ఒక Documentary తీసివ్వమని అడిగారు. నిర్మాణ వ్యయం లాంటి విషయాల్లో రాజీ పడని వ్యక్తి కావడంతో అది సఫలీకృతం కాలేదు. తరువాత ఎల్‌.వి. ప్రసాద్‌ ఆ Documentary ని తీశారని వినికిడి. కాని అది ఎక్కడ పడి వుందో కూడా ఎవరికీ తెలియదు. అలాగే “వీణ ” అచ్యుతరామయ్య, ద్వారం వెంకటస్వామి నాయుడలపిౖెన తీసిన రీళ్ళు కూడా ఈనాడు మనకు దక్కకుండా పోయాయి.
ఆ సంవత్సరంలో విడుదలైనది కేవలం 5 చిత్రాలు మాత్రమే
కచ్చితంగా చెప్పాలంటే ఆ పాటకు ముందు ఆవిడ చేసే హుమ్మింగ్‌. కొంత అరబ్‌ సంగీత పోకడలు కూడా కనిపిస్తాయి.
ముందుగా డి.వి. నరసరాజుగారిని తీసుకుందామనుకున్నారు.ఆయన “దొంగరాముడు” (1955)చిత్రానికి పని చేయ వలసి రావడంతో,పరిచయస్తుడైన పా.ప.గారికి ఆహ్వానం అందింది.
ఆ ఏడాది సత్యజిత్‌ రే దర్శకత్వం వహించిన ” పథేర్‌ పాంచాలి”కి ప్రథమ బహుమతి లభించింది.
ఈ ముగ్గురు గాయకుల పేర్లు రికార్డులపైన కూడా పేర్కొన బడ్డాయి. కాని, రికార్డులపైన వేయకపోయినా, అంతకుముందే ఈ పద్ధతి వాడబడి వుండవచ్చు! ఉదా : “చల్‌ మోహనరంగా” (1936) అన్న (హ్రస్వ)చిత్రంలో చల్‌మోహన రంగా అన్న పాట చిత్రీకరింపబడింది పుష్పవల్లి పైన. కానీ, పాడింది టేకు అనసూయ.
-----------------------------------------------------------
రచన: పరుచూరి శ్రీనివాస్, 
ఈమాట సౌజన్యంతో 

No comments: