Thursday, November 1, 2018

తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు 4, 5


తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు 4, 5




సాహితీమిత్రులారా!

రెండు పాదాలున్న తెలుగు పద్యాలని ద్విపద అన్నట్లే నాలుగు పాదాలు ఉన్న వాటిని చతుష్పాది అనొచ్చు కానీ, చతుష్పాదులంటే జంతువులనే అర్థమే సాధారణంగా నలుగురికీ స్ఫురిస్తుంది. ఇక్కడ “నలుగురికీ” అన్న ప్రయోగం, “నలుగురితో చెప్పి మరీ చెయ్యి,” “నాలుగు మూలలా వెతుకు,” “నాలుగు చివాట్లు వేసి రా,” అన్న ప్రయోగాలు అజహర్లక్షణం అనే అలంకారానికి ఉదాహరణలు. ఇక్కడ “నలుగురూ” అంటే “పది మందీ” అని లేదా చాలా మంది అని అర్థం. ఇక్కడ పులి మీద పుట్రలా ఒక అజహర్లక్షణాన్ని వివరించడానికి మరొక అజహర్లక్షణం వాడవలసి వచ్చింది గమనించారో లేదో!

చింతపిక్కలాటలలో నాలుగు పిక్కలని పుంజీ అంటారు. కాని నిజానికి పుంజీ అన్నది “పుంజము” కి భ్రష్టరూపం. పుంజం అంటే పోగు. చెవిపోగు కాదు. ఇక్కడ పోగు అంటే రాశి.

నాలుగు కానులని “అణా” అనే వాళ్ళం. ఇప్పుడు అణాలు చెల్లక పోవడమే కాకుండా “పరహారణాల ఆంధ్రుడు” అన్న జాతీయం కూడ చెలామణిలో లేకుండా పోయింది.

సంస్కృతంలో “చౌ” అంటే నాలుగు. నాలుగు ముత్యాలతో చేసిన జూకాలని చౌకట్లు అంటారు. పలకలు, కిటికీలు మొదలైన వాటికి నాలుగు పక్కలా ఉండే బందుని [“ఫ్రేము”ని] కూడా చౌకట్టు అనే అంటారు. గుర్రం నాలుగు కాళ్ళనీ ఎత్తి అవరోధాన్ని దాటే విధానం చౌకళించడం అవుతుంది. నాలుగు స్థంభాలతో కట్టి అన్నివైపులా తెరచి ఉన్న కట్టడాన్ని చౌకం అంటారు. ఇదే చౌకు గా మారింది. మరీ “బూతులు” వాడటం ఇష్టం లేని వాళ్ళు ఇంగ్లీషులో “బూత్‌”ని చౌకు గా తెలిగించవచ్చు. అప్పుడు “టోల్‌ బూత్‌” ఆసీల చౌకు అవుతుంది. నాలుగురకాల తినుభండారాలని కలపగా వచ్చిన “మిక్చర్‌”నే చౌచౌ అని కూడ అంటారు.

చవితి అనే మాట చౌతి కి రూపాంతరం. చౌషష్టి 64, చౌసీతి 84.
చౌదరిలో “చౌ” అంటే నాలుగు అనే అర్థం స్ఫురించదు.
నాలుగు దంతాలు ఉన్న ఇంద్రుడి ఏనుగు చౌదంతి. దీన్నే చతుర్దంతి అని కూడ అంటారు. “చౌ” కంటె “చతుర్‌” బాగా వాడుకలో ఉంది.
చతుర్ముఖుడు చతుర్వేదములకీ కర్త అని నలుగురూ నమ్మే విషయమే. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు చతుర్విధ ముక్తులు.

సనాతన ధర్మంలో “నాలుగు” చాలా చోట్ల కనిపిస్తుంది. “చాతుర్వర్య్ణం మయాసృష్టం” అన్నాడు. చతురాశ్రమములు అంటే బ్రహ్మచర్యం, గార్హస్య్తం, వానప్రస్థం, సన్యాసం. ఈ నాలుగు వర్ణాలనీ, నాలుగు ఆశ్రమాలనీ కలిపి వర్ణాశ్రమధర్మం అన్నారు.

“చతుర్వర్ణ” సిద్ధాంతం మీద అధునాతనులు ఈ మధ్య దండెత్తి దుమ్మెత్తి పోస్తూ ఉంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేక నేనొక వ్యాఖ్యానం రాసేను. దాని సారాంశం ఇది. “చాతుర్వర్య్ణం మయాసృష్టం” అంటే “నాలుగు రంగులనీ నేనే సృష్టించేను” అని కదా అర్థం. ఇక్కడ నాలుగుని అజహర్లక్షణంగా వాడేడనుకుందాం. అంటే ఏమిటి? నాలుగంటే నాలుగు కాదు “ఎన్నో” అని కాని “రకరకాల” అని కాని అర్థం. ఎన్నో రంగులు సృష్టించటం అంటే? “రంగు” అన్న మాటకి స్వభావం అనే అర్థం తెలుగులో వాడుకలో ఉంది. “వాడి అసలు రంగు బయటపడిందిరా” అన్న ప్రయోగం చూడండి. కనుక “చాతుర్వర్య్ణం మయాసృష్టం” అంటే “రకరకాల స్వభావాలు గల మనుష్యులని నేను సృష్టించేను” అని అర్థం వస్తున్నది కదా. అంటే మనుష్యుల స్వభావాలు రకరకాలుగా ఉంటాయి. ఎవరి స్వభావానికి అనుకూలంగా వారు ప్రవర్తించాలి అని చెబుతున్నాడు భగవానుడు!

నేను ఈ రకంగా గీతావాక్యాన్ని వ్యాఖ్యానిస్తే “అజహర్లక్షణం వాడిన వాడు చతుర్‌ అనే మాటనే ఎందుకు ఎన్నుకున్నాడూ, “దశవర్ణం మయాసృష్టం” అనవచ్చు కదా?” అని ఆక్షేపించేరు. దీనికి సైంటిఫిక్‌ కారణం ఉంది. మన బుద్ధులు, స్వభావాలు అన్నీ మన డి. ఎన్‌. ఏ. లో రాసి ఉన్నాయని ఈ రోజుల్లో అందరికీ తెలిసున్న విషయమే. ఈ డి. ఎన్‌. ఏ. లో నాలుగే నాలుగు న్యూక్లియోటైడులు ఉన్నాయి. వీటినే చతుర్వర్ణాలుగా ఊహించుకుంటే నాలుగు వర్ణాలతో రకరకాల మనుష్యులు ఎలా పుడతారో అవగాహన అవుతుంది.

చతుష్టయం అంటే నాలుగు శాల్తీలు. అవస్థాచతుష్టయంలో బాల్యం, కౌమారం, యవ్వనం, వార్థక్యం ఉన్నాయి. దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులు దుష్టచతుష్టయం అని ఆబాలగోపాలానికీ తెలుసు. చతుష్టయం అన్న మాటని “క్వాడ్రపుల్‌” అని కానీ “క్వార్టెట్‌” అని కానీ ఆంగ్లీకరించవచ్చు.

భోజనానికి వాడే “ఫోర్కు”లలో మూడు రకాలు ఉన్నాయి. కావలిస్తే వాటిని తెలుగులో ద్విశూలం, త్రిశూలం, చతుశ్శూలం అనవచ్చు. నలుచదరానికి చౌపదం కంటె చతుర్భుజం, చతురస్రం అన్న మాటలే ఎక్కువ వాడుకలో కనిపిస్తాయి. చతుర్భుజం అంటే నాలుగు భుజాలున్న ఏ రేఖాగణితపు బొమ్మేనా కావచ్చు కాని చతురస్రం అంటే మాత్రం ఆ నాలుగు భుజాల నిడివి సమానమనిన్నీ, ఆ భుజాల మధ్య లంబకోణమనిన్నీ గ్రహించునది.

“స్క్వేర్‌” అంటే చదరం కదా. ఈ మాట లేటిన్‌ లోని “ఎక్స్‌ క్వాడ్రెన్‌” నుండి వచ్చింది. ఇంగ్లీషులో “క్వాడ్రిలేటరల్‌”, “క్వాడ్రేంగిల్‌” అన్న రెండూ వాడుకలో ఉన్న మాటలే అయినప్పటికీ తెలుగులో చతుర్భుజాన్ని “క్వాడ్రిలేటరల్‌” అనే ఎక్కువగా అంటారు; చతుర్కోణి అనే ప్రయోగం అరుదే. విశ్వవిద్యాలయాలలోనూ, కళాశాలలలోనూ నాలుగు భవనాల మధ్య భూమిని తరుచుగా “క్వాడ్రేంగిల్‌” అని కానీ ఇంకా ముద్దుగా “క్వాడ్‌” అని కాని పిలుస్తూ ఉండడం కద్దు.

ఈ “క్వాడ్‌” బీజగణితంలోకి వచ్చినప్పుడు కొంచెం తిరకాసు వ్యవహారానికి లోనయి “క్వాడ్రేటిక్‌” గా మారింది. “క్వాడ్‌” అర్థం “నాలుగు” అయినప్పటికీ, లెక్కలలో ఒక చలనరాసి ఘాతం రెండు అయినప్పుడు “క్వాడ్రేటిక్‌” అన్న విశేషణాన్ని వాడుతారు. “క్వాడ్‌” ని ఇలా రెండు అర్థాలలో వాడడం వల్ల కొంత గాసటబీసటకి ఆస్కారం ఉంది గాని ఈ పరిస్థితికి కారణం లేక పోలేదు. ఒక చతురస్రం యొక్క వైశాల్యం కావాలంటే దాని భుజం కొలతని ఘాతించాలి. ఘాతించడం అంటే భుజం కొలతని రెండు సార్లు వేసి హెచ్చవెయ్యడం. ఇదీ రెండుకీ నాలుగుకీ మధ్య ఉన్న బాదరాయణ సంబంధం! కనుక బీజగణితంలో ఒక చలనరాసి ఘాతం రెండు అయితే దానిని వర్ణించడానికి “క్వాడ్రేటిక్‌” అన్న విశేషణాన్నీ, నాలుగు అయితే “బైక్వాడ్రేటిక్‌ ” అన్న విశేషణాన్నీ వాడుతారు.

మూడు కాళ్ళ పీటని ముక్కాలి పీట అన్నట్లే గ్రీకు భాషలో నాలుగు కాళ్ళ మంచాన్ని “ట్రెపీజ్‌” అంటారు. సర్కసులో మనుషులు గెంతడానికి వాడే నులకమంచం లాంటి సాధనాన్ని “ట్రెపీజ్‌” అంటారు. నాలుగు భుజాలున్న ఒక జాతి చతుర్‌భుజానికి “ట్రెపీజియం” అన్న పేరు రాడానికి కారణం ఇదే. గ్రీకు వారికి “ట్రెపీజ్‌” ఎటువంటిదో హిందీ వారికి చార్‌పోయ్‌ అటువంటిది. హిందీలో చార్‌పోయ్‌ అన్నా, లేటిన్‌లో “క్వాడ్రుపెడ్‌” అన్నా, గ్రీకులో “టెట్రాపాడ్‌” అన్నాఒకటే. ఇంగ్లీషులో “క్వాడ్రుపెడ్‌” అంటే నాలుగు పాదాలున్నది, జంతువు! తెలుగులో నాలుగు పాదాలు ఉన్నది మంచం కాదు, పద్యం అని మొదట్లోనే చెప్పేను.

నలుగురుతో పాటు నారాయణా అనుకోమన్నారు కనుక నాలుగు గురించి నాకు తెలిసిన నాలుగు విషయాలూ నలుగురుకీ చెప్పేసేను.

5

మన చేతులకి ఐదు వేళ్ళు ఉండబట్టి ఐదుకీ చేతికీ ఒకవిధమైన సంబంధం ఉంది. “అయిదు” ఐదుకి రూపాంతరం. ఐదు చేతుల మల్లి మొగ్గలు కొంటే ఐదైదులు ఇరవై అయిదు, పైన ఒక చెయ్యి కొసరుతో వెరసి ముఫ్ఫై మొగ్గలు వస్తాయి.

ఐదు పది చెయ్యడం అంటే రెండు చేతులూ జోడించి నమస్కరించడం. “ఒక ఐదిచ్చుకో” [గిమ్మీ ఎ ఫైవ్‌] అన్నప్పుడు “హై ఫైవ్‌” అనే పద్ధతి కరచాలనానికి ఆహ్వానం అనే అర్థం ఒకటి అమెరికాలో ఉంది.

అయిదవతనం, ముత్తయిదువ అన్న మాటలు తప్పించి తెలుగులో “ఐదు” మాటలు అంతగా కనిపించవు. ముత్త + అయిదువ = ముత్తయిదువ ని బట్టి అయిదోతనం ఉన్న ముదుసలి అన్న అర్థం స్ఫురిస్తూన్నప్పటికీ ముత్తయిదువ అన్న మాటని భర్త బతికివున్న ఏ స్త్రీ ఎడలైనా వాడతారు. కాని ఈ మాటని పెద్దవారి యెడల ఉపయోగించినంతగా చిన్న వారిని ఉద్దేశించి వాడరు.

అయిదవతనం అంటే అయిదు వన్నెలు కలిగి ఉండడం. ఇక్కడ “వన్నెలు” అంటే సుమంగళి యొక్క అలంకారాలు మంగళసూత్రం, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు. చెవ్వాకు అంటే ఏమిటో నాకు తెలియదు.

ఏను అన్న మాట ఐదుకి రూపాంతరం. ధాన్యాన్ని కొలిచేటప్పుడు వాడే కొలమానంలో “ఏదుము” అనే మాట మీరు వినుంటే మీ వయస్సు కనీసం ఏభై [ఐదు పదులు] దాటి ఉంటుందని నేను ఊహించగలను. ఏదుము = ఐదు + తూము. ఐదు తూములు ఒక ఏదుము. ఇదే విధంగా బరువులు తూచేటప్పుడు విశాఖపట్నం జిల్లాలో వాడే ఏబలం = ఐదు + పలము. ఐదు పలములు ఒక ఏబలం. ఇదే విధంగా పదలం అంటే పది పలములు.

అయిదు తర్వాత ఎక్కువగా తెలుగులో కనిపించేది, వినిపించేది “పంచ” శబ్దం. “పంచ”లో దంత్య చకారం ఉన్న మాటలన్నీ శుద్ధ తెలుగు మాటలు. కానివి సంస్కృతం నుండి దిగుమతి అయినవి. తెలుగులో దంత్య చకారంతో పలికే పంచ [దీనిని “పంచదార”లో పంచ లా ఉచ్చరించాలి] అంటే చూరు. కాని సంస్కృతంలో పంచ అంటే “అయిదు” అనే అర్థం ఒకటుంది. ఈ రెండర్థాలతోటీ దోబూచులాడుతూ ఉన్న ఈ వేమన పద్యం చూడండి.

పంచశత్రుల దెగి పంచబాణుని గెల్చి
పంచవర్ణములను పఠన చేసి
పంచముఖముగల భవసంజ్ఞ గలవాని
పంచ చేరువాడు పరగ వేమ.

ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, నలుపు, పసుపులని పంచరంగులు అంటారు కాని ఆధునిక శాస్త్రం ప్రకారం తెలుపు, నలుపులని విడివిడిగా రంగులలో లెక్కపెట్ట కూడదు. అంతే కాదు. “తెలుపు”, “నలుపు”అన్న మాటల రెండింటి మధ్య వ్యత్యాసం వాటి ద్యుతిలో ఉన్న తేడా మాత్రమే. అన్ని రంగులు కలిసినప్పుడే తెలుపు వస్తుందని చిన్నప్పుడు సైన్స్‌లో చదువుకున్నాం. నలుపు కూడ అంతే అన్ని రంగుల కలయికే. తెలుపు వస్తువులు తెల్లగా ఉండడానికి కారణం వాటి మీద పడ్డ కాంతి అంతా పరావర్తనం చెంది మన కంటికి చేరుకోవడమే. నల్ల వస్తువుల మీద పడ్డ కాంతి అస్సలు పరావర్తనం చెందదు.

పంచకళ్యాణి గుర్రం అంటే అయిదు రంగుల గుర్రం కానే కాదు. ఏ రంగు గుర్రమైనా సరే శరీరమంతా ఒకే రంగు ఉండి ఒక్క నుదుటి మీద, కాళ్ళ దగ్గర తెల్లగా ఉంటే అది పంచకళ్యాణి. గుర్రం రంగే తెలుపైనప్పుడు ముఖం మీద మచ్చ మరో రంగులో ఉంటుంది.

పంచాస్యం, పంచాననం అంటే పెద్ద ముఖం ఉన్న జంతువు సింహం. ఇక్కడ “పంచ” అంటే పెద్ద అని రెండవ అర్థంలో వాడబడింది.

పంచనఖం అంటే అయిదు గోళ్ళు ఉన్న జంతువు పెద్దపులి. ఈ సందర్భంలోనే ” పంజా” అన్న మాట పుట్టి ఉంటుంది. హైదరాబాదు నగరంలో ఉన్న”పంజాగుట్ట” అంటే ఐదు కొండలనే అర్థం స్ఫురిస్తోంది.

పంచతంత్రం అనగానే మిత్రలాభం, మిత్రభేదం గుర్తుకొస్తాయి. కొంచెం చదువుకున్న ఘటానికి అయితే సంధివిగ్రహం జ్ఞాపకం వస్తుంది. మిగిలిన రెండింటి పేర్లు చెప్పుకోండి చూద్దాం!

న మ శి వా య అన్న అయిదు అక్షరాలే పంచాక్షరి మంత్రం! వైష్ణవుడు కావడానికి పంచ సంస్కారాలు చేయాలి. తప్త చక్రాంకనం, నొసట ఊర్వ్ధ పుండ్రం, పేరు మార్పు, మంత్రజపం, యజనం [అంటే దేవపూజ]. శివుడికి పంచాననుడు ఐదు ముఖములు కలవాడు అన్న పేరు ఉందని ఎంతమందికి తెలుసు? ఎలిఫెంటా గుహలలో ఉన్న శివుడు పంచాననుడే కాని మనకు నాలుగు ముఖాలే కనిపిస్తాయి. అయిదవది లోకోత్తరం [లేదా “ట్రాన్‌సెండెంటల్‌”]. వీటి పేర్లు అఘోరం, ఈశానం, తత్పురుషం, వామదేవం, సద్యోజాతం.

తంత్రవిద్యకి పంచ మకారాలు మద్యం, మత్స్యం, మాంసం, ముద్ర, మైథునం ముఖ్యం అంటారు.

పంచబాణుడు మన్మథుడు. ఈయనకి అయిదు రకాల పువ్వుల బాణాలు ఉన్నాయి అరవిందము [తామర], అశోకము, చూతము [మామిడి], నవమల్లిక, నీలోత్పలం [నల్లకలువ].

“పంచ” హిందీలోకి వెళ్ళి పాంచ్‌ అయింది. ఇంగ్లీషులోకి వెళ్ళి “పంచ్‌” అయింది. అయిదు రకాల పండ్ల రసాలు కలపగా వచ్చిన దానిని ఇంగ్లీషులో “పంచ్‌” అంటారు. రీXలం, చీనాబ్‌, రావి, బీయాస్‌, సట్లెజ్‌ అనే అయిదు నదులు ప్రవహించే దేశాన్ని పంజాబ్‌ అన్నారు. సనాతనుల దృష్టిలో పంచగంగలూ కావేరి, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, భగీరథి. ఈ ఐదు నదులే పంచగంగలు ఎందుకు అయాయో, ఇందులో నాలుగు దక్షిణాది నదులవడంలో ఉన్న సూక్ష్మం ఏమిటో నాకు బోధపడడం లేదు.

పంచామృతాలు వేసుకుందికి వీలుగా ఐదు గదులు ఉన్న పాత్రని పంచపాత్ర అనేవారు, మొదట్లో. ఇటీవలి కాలంలో పంచపాత్ర అంటే పూజాసమయంలో ఉద్ధరిణితో వాడే ఏదైనా ఒక చిన్న పాత్ర. సంతర్పణలలోనూ, హొటేళ్ళలోనూ పచ్చళ్ళు, ఊరగాయలూ వడ్డించడానికి ఐదు పాత్రలు కలిసి ఉన్న పాత్రా విశేషాన్ని ఈ రోజుల్లో “గుత్తి” అంటున్నారు.

తిథి [“డేట్‌”], వారం [“డే ఆఫ్‌ ద వీక్‌”], నక్షత్రం [నిజానికి చంద్రుడు ఉన్న నక్షత్ర సముదాయం], యోగం [గ్రహాల కలయిక], కరణం [జాతకం] ఉన్న పుస్తకాన్ని పంచాంగం అంటాం.

అప్పు ఇచ్చిన వాడు, పుచ్చుకున్న వాడు, దస్తావేజు రాసిన వాడు, ఇద్దరు సాక్షులు సంతకం పెట్టిన కాగితం పంచారూఢిపత్రం అవుతుంది.

పంచభక్ష్యములు అంటే భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం. భక్ష్యం అన్నా భోజ్యం అన్నా “తినదగినది” [“ఎడిబుల్‌”] అనే నిఘంటుకారుడు చెప్పేడు. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏమిటో? లేహ్యం అంటే ముద్దలా ఉన్నది, చోష్యం అంటే పీల్చదగ్గది లేదా జుర్రుకోడానికి వీలైనది. పానీయం అంటే తాగేది.

భూమి, నీరు, అగ్ని, గాలి ఈ నాలుగింటినీ అనాది కాలపు గ్రీకులు ముఖ్యమైన మూలకాలు లేదా “ఎసన్‌షియల్‌ ఎలిమెంట్స్‌” అనేవారు. ఈ భూలోకంలో ఉన్నవి అన్నీ ఈ నాలుగింటి తోటే తయారయాయనీ స్వర్గలోకంలోవన్ని మరొక అయిదవ పదార్థంతో చేయబడ్డాయనీ నమ్మేవారు. ఈ “అయిదవ పదార్థం” గ్రీకు భాషలో “క్వింటిసెన్స్‌” అయింది. “ఎసెన్స్‌” అంటేనే ముఖ్యం అని అర్థం. ఎంతో ముఖ్యమైన విషయం అని ఇంకా నొక్కి వక్కాణించవలసి వచ్చినప్పుడు ఇంగ్లీషులో “క్వింటిసెన్స్‌” అన్న మాట వాడతారు.

ఈ ఐదింటిని మనవాళ్ళు పంచభూతములు అన్నారు. కాని మనవాళ్ళు ఈ ఐదవ ధాతువుని ఆకాశం అనమన్నారు.

పంచగవ్యములు అంటే ఆవు వల్ల మనకు లభించే అయిదు ముఖ్యమైన పదార్థాలు. అవి పాలు, పెరుగు, వెన్న, గోపంచితం, గోమయం. మరీ ఉచ్చ, పేడ అంటే నాటుగా ఉంటుందేమోనని “గోపంచితం”, “గోమయం” అన్నాను, అంతే.

ఉపనయనం చేసినప్పుడు పంచశిఖలు ఎందుకు చేస్తారో, దానిలోని అంతరార్థం ఏమిటో ఎవరైనా విడమర్చి చెబితే బాగుండును.

పంచపాండవుల గురించి నాకు ఎవ్వరూ విడమర్చి చెప్పక్కరలేదు. వాళ్ళు మంచపుకోళ్ళలా ముగ్గురు అని నాకు చిన్నప్పటి నుండీ తెలుసు.

పంచమవేదం అంటే పంచముడు చదవడానికి అనుకూలమైన వేదం అని కాదు, ఐదో వేదం అని మాత్రమే అర్థం చెప్పుకోవాలి. పంచమవేదం ఏదయ్యా అంటే మహాభారతం అని కొందరు, ఆయుర్వేదం అని మరికొందరు అంటూ ఉండగా విన్నాను. ఆయుర్వేదంలో పంచకర్మలు ఉన్నాయి. వీటిని వమనం [వాంతి చేసుకోవడం], రేచనం [ఊపిరి విడవడమా? విరేచనం అవడమా?], అనువాసన, నిరూహ, నశ్యం [ముక్కుతో ఎగబీల్చడం] అంటారు.

పంచజ్ఞానేంద్రియములు ఏమిటో మనకి తెలుసు. ముక్కు మన ఘ్రాణేంద్రియం, నాలుక రసనేంద్రియం, కన్ను చక్షురింద్రియం, చెవి శ్రోత్రేంద్రియం, చర్మం త్వగింద్రియం. త్వక్‌ అంటే చర్మం.

గణితంలో 5 కి ప్రత్యేక స్థానం ఉన్నట్టు కనిపించదు. రేఖాగణితంలో పెంటగన్‌ని పంచకోణి లేదా పంచభుజి అంటారు. అమెరికా ప్రభుత్వపు దేశరక్షణ విభాగం పంచభుజి ఆకారంలో ఉన్న ఒక పెద్ద భవనంలో ఉంది. అందుకని ఆ భవనాన్ని “పెంటగన్‌” అంటారు. ఇది భవనం పేరు కనుక దీన్ని మనం తెలుగులోకి అనువదించి పంచభుజి అనక్కర లేదు. అలాంటప్పుడు మన “లాల్‌ ఖిల్లా”ని ఇంగ్లీషువాడు “రెడ్‌ఫోర్ట్‌” అంటూంటే మనం ఎందుకు ఊరుకున్నాం? మంచి ప్రశ్నే!

పంచతంత్రంలో మిగిలిన రెండింటి పేర్లు లబ్ధనాశం, అసంప్రేక్ష్యకారిత్వం అని ఇప్పటికేనా తెలుసుకొండి.

ఇంకొన్ని “పంచ” పదాలు

పితృపంచకం
మాతృపంచకం
పంచప్రాణాలు ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం
పంచ మహాకావ్యాలు
పంచ మహాపాతకాలు
పంచ ఆరామక్షేత్రాలు అమరారామం, కుమారారాం, క్షీరారామం, ద్రాక్షారామం, భీమారామం
పంచదళాలు
పంచతన్మాత్రలు
పంచమి
పంచాయతి
పంచకం ఐదు కల ఒక సమితి
----------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో 

No comments: