Friday, October 5, 2018

అనువాదాలు – అపవాదాలు


అనువాదాలు – అపవాదాలు
సాహితీమిత్రులారా!

వెనకటికి ఓ పల్లెటూరాయన ఫోటోలు తీయించుకోడానికి వెళ్తూ బట్టలకు అత్తరు రాసుకున్నాడట. ఆ తరువాత ఫోటోలో అత్తరు వాసన పడలేదని ఫోటో తీసినవాణ్ని నానా మాటలూ అన్నాడట. తెలుగు సాహిత్యాన్ని ఇంగ్లీషు అనువాదాల్లో చదివి ఆ అనువాదాల్లో తెలుగుభాషలో వున్న శబ్ద చమత్కారాలు పట్టుబడలేదని అనువాదాల్ని నిందించే తెలుగు వాళ్ళని చూస్తే నాకీ పల్లెటూరాయన గుర్తొస్తాడు. అనువాదం చేసే పని ఏమిటి? చెయ్యని పని ఏమిటి? సాహిత్యానువాదం ఎలా వుండాలి? సాహిత్యానువాదానికి అనుసరించవలసిన పద్ధతులేమిటి? దాని వల్ల ఆశించవలసిన ఫలితాలేమిటి? అనే విషయాల్ని గురించి తెలుగు సాహిత్య విమర్శకులు పట్టుదలగా ఆలోచించలేదు. అనువాద సమస్యల్ని గురించి రాచమల్లు రామచంద్రారెడ్డి రాసిన పుస్తకమూ, అడపాదడపా అక్కడా ఇక్కడా కనిపించే వ్యాసాలూ మినహాయిస్తే, మనకి సాహిత్యానువాదాన్ని గురించి చర్చలు లేవు. ఇది స్తిమితంగా పరిశీలనాత్మకంగా ఆలోచించవలసిన సాహిత్య సమస్య అని ఎక్కువ మందికి తట్టలేదు. ఒక రకంగా చూస్తే తెలుగుసాహిత్యం అనువాద సంప్రదాయంలోనే పుట్టింది, పెరిగింది. అంచేత, నిజానికి మనకి సాహిత్యానువాదంలో చాలా అనుభవం వుంది. అయితే, ఈ అనుభవానికి తగిన సిద్ధాంతం లేదు.

లేదా అంటే వుంది. దాని గురించి మనం వివేచనతో ఆలోచించలేదంతే! అలంకారశాస్త్రంలో శబ్దాన్ని అర్థాన్ని రెండు భాగాలుగా విడదీసి మొత్తం పుస్తకాల్ని అన్నిటినీ ఆ ప్రాతిపదిక మీద మూడు భాగాలు చేస్తారు. ఒకటి: శబ్ద ప్రధానమైన గ్రంథాలు. రెండు: అర్థ ప్రధానమైనవి. మూడు: శబ్దార్థ ఉభయ ప్రధానమైనవి. ఈ మూడు రకాల పుస్తకాలలో శబ్దప్రధాన మైన గ్రంథం వేదం. ఇది ఎవ్వరూ ఎక్కడా అనువాదం చెయ్యలేదు (ఈ మధ్య కాలం వరకూ). రెండోవి అర్థప్రధాన గ్రంథాలు. అంటే పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు. ఇవి యధేచ్ఛగా ఎంతో మంది ఎన్నోసార్లు అనువాదం చేసారు. మూడు శబ్దార్థ ఉభయ ప్రధానమైన గ్రంథాలు. ఈ కోవలోకి కావ్యాలు చేరతాయి. ఇవి కూడా ఎవ్వరూ ఎప్పుడూ అనువాదం చెయ్యలేదు. కాళిదాసు మీద, భవభూతి మీద, మురారి మీద ఇంకా అలాంటి వందలాది సంస్కృతకవుల మీద మనవాళ్ళకి ఎంత గౌరవం వున్నా వాళ్ళ పుస్తకాలేవీ దేశభాషల్లోకి అనువదించలేదు. ఈ నియమాన్ని కాదన్నవాడు శ్రీనాథుడొక్కడే. అతనొక్కడే శ్రీహర్షుని నైషధాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. శ్రీనాథుడు ఎదుర్కొన్న సమస్యల్ని, అతని అనువాదాన్ని ఎదుర్కొన్న విమర్శకుల్ని పక్కన పెట్టి చూస్తే తెలుగు సాహిత్యంలో సంస్కృతం నుంచి చేసిన అనువాదాలన్నీఅర్థప్రధాన మైన గ్రంథాల అనువాదాలే.

శబ్దం అనువాద సాధ్యం కాదు. అర్థం మాత్రమే అనువాద సాధ్యం. ఒక సాహిత్యంలో వున్న శబ్దచమత్కారం ఇంకో భాషలోకి వెళ్ళదు. అంచేత అనువాదకుడి పనల్లా అర్థాన్ని తీసుకుని తాను ఏ భాషలోకి అనువాదం చేస్తున్నాడో ఆ భాషలో దానికి శబ్ద గౌరవం కలిగించడమే. శబ్దానువాదం చెయ్యాలనే భ్రమకాని, చెయ్యనందుకు నింద కానీ అనువాదకుల మీద పెట్టేవాళ్ళు అనువాద రహస్యాన్ని బోధపరుచుకోలేనివాళ్ళు మాత్రమే. అంటే, ఫోటోలో అత్తరు వాసన పడలేదని అడిగే వాళ్ళు మాత్రమే.

మూలాన్ని దగ్గర పెట్టుకుని ఏదో పుస్తకంలో కొంత భాగాన్నో, ఒక వాక్యాన్నో చూపించి, అందులో ఉండే ఏదో ఒక రకమైన సొంపు అనువాదంలో రాలేదని చెప్పడానికి, మూలంతో పోల్చి చూస్తే, అందులో వుండే అందాలు అనువాదంలో పోయాయని చెప్పి ఉదాహరణ చూపించడానికి తెలివితేటలు అక్కర్లేదు. ఈ పని దాదాపుగా ఎవరేనా చెయ్యగలరు. మూల గ్రంథం యొక్క సాహిత్య స్వభావం ఏమిటి? దాని సాహిత్యపు గొంతుక ఏమిటి? అది మూల భాషలో వున్న సాహిత్య ప్రపంచంలో ఎటువంటి స్థానంలో వుంది — అనే సంగతి గమనించి అనువాదం చెయ్యబడిన భాషలోని సాహిత్య ప్రపంచం ఎలాంటిది అందులో ఏ జాగాలో ఈ అనువదించిన గ్రంథం ప్రవేశిస్తుంది? ఈ కొత్త సాహిత్య ప్రపంచంలో ఈ పరాయి పుస్తకానికి ఎలాంటి జాగా దొరుకుతుంది? ఆ ప్రపంచంలో ఈ అనువాదం ఏ గొంతుకతో మాట్లాడాలి, అది అక్కడ నప్పుతుందా? అన్న సంగతిని గమనించి, ఆ తరువాత అనువాదం మంచి చెడ్డల్ని బేరీజు వేయటం నిజంగా అనువాదాన్ని విమర్శించే వాళ్ళు చెయ్యాల్సిన పని.

భాషలు దూరమవుతున్న కొద్దీ, భాషల సంస్కార ప్రపంచాలు దూరమవుతున్న కొద్దీ భాషల మధ్య వినిమయం కష్టమవుతుంది. భారతీయ భాషలు ఒకదానితో ఒకటి అనువాదం చెయ్యడానికి ఎక్కువ అవకాశం కల్పించే భాషలు. భారతీయ భాషల అర్థ ప్రపంచం దాదాపుగా ఒక్కటే. అంచేత ఒక భారతీయ భాషలోంచి ఇంకొక భారతీయ భాషలోకి పుస్తకాన్ని అనువదించడానికి కావలసిన అర్థప్రపంచాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత అనువాదకులు కొంత తేలికగా నిర్వహించగలరు. అప్పుడు కూడా ఒక పాతకాలపు పుస్తకాన్ని అధునిక కాలపు లోకానికి అనువదించి అందించాలంటే ఈ అర్థప్రపంచాన్ని దాటడానికి కొంత శ్రమ పడాల్సి వుంటుంది. ఈ పనే ఒక భారతీయ భాష నుంచి భారతదేశపు సాహిత్య సంస్కృతితో సుతరామూ సంబంధం లేని ఇంగ్లీషులోకి అనువదించాలంటే అనువాదకులు చెయ్యాల్సిన పని అత్యంత క్లిష్టమైనది. అందులోనూ భారతీయ భాషల్లోని పాతకాలపు పుస్తకాలను ఇంగ్లీషు ఆధునిక పాఠకులకి అనువాదం చెయ్యాలంటే దాదాపు అసాధ్యం అని చెప్పదగినంత కష్టం.

ఏదైనా తెలుగు పుస్తకం ఇంగ్లీషులోకి అనువాదం చేశామంటే అది ఎవరి కోసం చేశామో ముందు మనం నిర్ణయించుకోవాలి. భారతీయ భాషల్లో కూడా ఒక భాషలోంచి ఇంకో భాషలోకి పుస్తకాలు మారడానికి ఇంకా ఇంగ్లీషే ఆధారమవుతోంది. మన విద్యావంతుల్లో చాలా మందికి కేవలం రెండు భాషలే వచ్చు – మన సొంత భాష, ఇంగ్లీషు. మన చుట్టుపక్కల వున్న రాష్ట్రాల్లోని భాషలు వచ్చిన వాళ్ళు మనలో చాలా తక్కువ. ఆ కారణం చేత మనం భారతీయ భాషల పుస్తకాలు కూడా ఇంగ్లీషు అనువాదంలోనే చదవాల్సి వుంటోంది. నేను టాగూర్ పుస్తకాలు ఇంగ్లీషు లోనే చదివాను. మీరాబాయినీ, కబీర్‌ని, ప్రేమ్చంద్‌ని ఇంగ్లీషులోనే చదివాను. కన్నడంలో పేరున్న రచయితలు చాలా మంది వున్నా, నాకు అనంతమూర్తి రాసిన “సంస్కార” మాత్రమే ప్రధానంగా కంటికి కనిపించడానికి అది ఇంగ్లీషు అనువాదంలో దొరకడమే. ఇలా చూస్తే, మన తెలుగు పుస్తకాలు భారతదేశంలో మిగతా భాషల వాళ్ళు చదవాలన్నా అవి ఇంగ్లీషు ద్వారా అందించాల్సిన అవసరం వుంది. అంటే, మన ఇంగ్లీషు అనువాదాల పాఠకుల్లో ఒక ప్రధాన భాగం మనదేశపు ప్రజలు. తెలుగులోంచి ఇంగ్లీషులోకి అనువాదం చేసిన పుస్తకం వీళ్ళని దృష్టిలో పెట్టుకుని చేసిందయితే, ఆ ఇంగ్లీషు కొంత భారతీయ వాసన గుబాళించే భాష అవడం ఒక రకంగా ప్రయోజనం. అలా కాకుండా మన తెలుగు పుస్తకాలు అమెరికాలోనో, ఇంగ్లాండ్‌లోనో ఆధునిక సాహిత్య పాఠకులకు అందించాలన్న ప్రయత్నం వుంటే, ఆ ఇంగ్లీషు, ఆ అనువాదం తరహా మరో రకంగా వుంటుంది. అంటే, ఈ రెండు రకాల అనువాదాలూ అవి ఉద్దేశించబడిన పాఠకుల దృష్ట్యా రెండు రకాల ఇంగ్లీషుని వాడాలి. అంతమాత్రం చేత ఒక సమాజానికి ఉద్దేశించిన అనువాదం ఇంకో సమాజానికి పనికి రాదని నేను అనడం లేదు. కొన్ని తేడాలున్నప్పటికీ రెండూ స్థూలంగా ఇంగ్లీషులే కాబట్టి కొంత శ్రమపడితే, కొద్దిగా ఎబ్బెట్టుగా వుండడాన్ని కాస్త విస్మరిస్తే, ఒక రకం పాఠకులకు ఉద్దేశించిన ఇంగ్లీషు అనువాదం ఇంకో రకం పాఠకులకు కూడా పనికొస్తుంది.

అనువాదం రెండు రకాలు. పుస్తకాన్ని అనువాదం చెయ్యడం. లేదా పాఠకుల్ని అనువాదం చెయ్యడం. స్పష్టంగా చెప్పాలంటే, పుస్తకంలో వున్న ప్రపంచాన్ని పాఠకుల ప్రపంచం లోకి తీసుకురావడం ఒకటి. పాఠకుల ప్రపంచాన్ని పుస్తకపు ప్రపంచంలోకి పట్టుకెళ్ళడం ఇంకొకటి. సాధారణంగా అందరి మన్ననలూ పొందిన అనువాదాలు కాస్త కాస్త రెండు పనులూ చేస్తాయి. ఏ పదహారో శతాబ్దంలోనో తెలుగులో రాసిన పుస్తకాన్ని ఇరవయ్యొకటో శతాబ్దంలో ఇంగ్లీషులోకి అనువాదం చెయ్యాలంటే ఇంగ్లీషు పాఠకుల్ని కొన్ని ప్రక్రియల ద్వారా పదహారో శతాబ్దంలోని తెలుగు సాహిత్య ప్రపంచంలోకి పట్టుకెళ్ళాలి. ఇది ఈ కాలపు పుస్తకం కాదు, ఇది అప్పటి పుస్తకం అనే భావాన్ని కొంతవరకు కలిగించగలిగితే, ఆ పుస్తకాన్ని ఆధునిక పాఠకులకి అందించగలగడం అనువాదకులకి కొంత తేలికవుతుంది. ఈ కాలపు తెలుగు పుస్తకాన్ని ఇరవై ఒకటవ శతాబ్దపు పాశ్చాత్య పాఠకులకి అందించాలంటే ఇది మీ దేశపు పుస్తకం కాదు అనే స్పృహని అనువాదకులు తమ పాఠకులకి కలిగిస్తే చాలు, మరీ అంత కాలగమనం చెయ్యక్కర్లేదు. కాని, ఈ రెండు సందర్భాల్లోనూ కూడా ఈ భాషా ప్రపంచాల మధ్య వున్న సాంస్కృతిక వ్యత్యాసాన్ని దగ్గరకు తీసుకురావడానికి సాహిత్య మార్గాల ద్వారా అనువాదకులు ప్రయత్నించాలి. ఆ పని సాహిత్య మార్గం ద్వారా కాకుండా కేవలం సాంస్కృతిక వివరణల ద్వారా — అంటే పాద సూచికల్లో ఇచ్చే సమాచారం ద్వారా –సాధించాలని చూడకూడదు. పాద సూచికలు, వివరణలు అవసరమే. కాని వాటిని విస్మరించి చదివినా పాఠకులకి ఇది సాహిత్యం సుమా అనే స్పృహ కలగాలి. అందుకోసం అనువాదకులు చాలా కొత్త రకమైన పనులు చెయ్యాలి. అంతకుముందు ఇంగ్లీషులో అలవాటు లేని కొన్ని రకాల పదబంధాల్ని తయారుచేసుకోవాలి. కాని ఈ తయారుచేసుకున్న కొత్త మాటలు ఇంగ్లీషులో చదివేవాళ్ళకి ఎబ్బెట్టుగా వుండకూడదు. ఈ మాట ఇంగ్లీషులో లేదు కాని వుంటే బాగుండేది సుమా అనిపించేలా వుండాలి. పాఠకులకి అనువాదకులు తయారు చేసి పెట్టిన భాష ద్వారా ఒక కొత్త సాహిత్య ప్రపంచం నిర్మించబడాలి. కాని ఈ ప్రపంచం తనదే సుమా అనే నమ్మకం కూడా పాఠకులకి కలగాలి.

“మూల భాష యజమాన భాష లాంటిది. అనువదించే భాష బానిస భాష లాంటిది. యజమాని ఆజ్ఞలకు బానిస లోబడి వుండాలి. యజమాన భాషకి బానిస భాష ఒదగక పోతే తప్పు బానిస భాషది. మూల గ్రంథకర్త యజమాని. అనువాదకుడు బానిస. మూలగ్రంథ విధేయంగా అనువాదం లేకపోతే తప్పు బానిసదే”– ఇది చాలా మంది అనువాదకులూ, అనువాద విమర్శకులు అనాలోచితంగా నమ్మే సిద్ధాంతం. ఈ సిద్ధాంతం మనసులో వున్నంత కాలం మంచి సాహిత్యానువాదాలు రావు. మంచి అనువాద విమర్శలూ రావు.

మూల భాషకి అనువాదకులు బానిసగా వున్నంత వరకూ ముక్కస్య ముక్కానువాదం వస్తుందేమో కాని అందమైన అనువాదం రాదు. విధేయతకి అందానికి మధ్య వున్న వైరుధ్యం మనకి విసుగు కలిగించేటన్ని సార్లు అనువాద సిద్ధాంతవేత్తలు చెప్పారు. కాని సాహిత్యానువాదం విషయంలో మాత్రం ఈ సంఘర్షణకి సుతరామూ చోటు లేదు. అనువాదం అనువదించబడే భాషలో సాహిత్య స్థానాన్ని సంపాదించ లేక పోతే అది ఎంత విధేయంగా వున్నా అది సాహిత్యానువాదం కాదు. అంచేత సాహిత్యానువాదకుల పని ప్రధానంగా తాము అనువదించిన భాషలో తమ అనువాదానికి సాహిత్యస్థానాన్ని సంపాదించుకోవటమే. ఆ పని చేసుకోలేకపోతే, మూలగ్రంథం మంచిది కాదనే అపవాదు వొస్తుంది.

ఒక మంచి సాహిత్య గ్రంథం తనలో చాలా గ్రంథాల్ని ఇముడ్చుకుంటుంది. ఈ విషయాన్ని అనువాదకులు తెలివైనవాళ్ళయితే గ్రహిస్తారు. అలా అనేక గ్రంథాలను ఇముడ్చుకోలేని మూల గ్రంథానికి సాహిత్యానువాద యోగ్యత లేదు. అలా ఒక మూల గ్రంథంలో నిక్షిప్తమై వున్న అనేక గ్రంథాలలో తను అనువాదం చేస్తున్న భాషలోకి నప్పే గ్రంథాన్ని అనువాదకులు ఎంచుకుని దాన్ని అనువాదం చేస్తారు. అలా అనువాదం చేసిన పుస్తకం అనువాదం చెయ్యబడిన భాషలో దాదాపు స్వతంత్ర గ్రంథంలా కనిపిస్తుంది. అంతే కాదు, మూల గ్రంథాన్ని చదివిన పాఠకులు కూడా ఈ అనువాదం చదివిన తర్వాత కానీ తాము చదివిన మూలగ్రంథంలో ఇంకో గ్రంథం కూడా ఉంది అన్న సంగతి గమనించలేరు. ఈ దృష్ట్యా చూస్తే సమర్థమైన సాహిత్యానువాదం స్వతంత్రమైన సాహిత్య సృజనలాంటిదే. నన్నయ చేసిన భారతం వ్యాసభారతం లోనే వుందని నన్నయ భారతాన్ని చదవకుండా వ్యాసభారతాన్ని మాత్రమే చదివిన వాళ్ళకి తెలియదు.

మూల గ్రంథానికి పైకి కనిపించే ప్రక్రియా స్వరూపం, మాటలూ మాత్రమే కాకుండా అంతర్గతంగా తనదైన ఒక గొంతుక వుంటుంది. ఆ గొంతుకని పట్టుకోవడం దాన్ని తను అనువాదం చేస్తున్న భాషలో మెప్పించడం సాహిత్యానువాదకులు చెయ్యాల్సిన పని. ఈ గొంతుక తాము అనువాదం చేస్తున్న భాషలో అంతకుముందు పాఠకులు ఎవరూ విని వుండకపోవచ్చు. కాని అది విన్నాక ఆ గొంతుక తమకి బాగుందని అనిపించేట్టు చెయ్యగలిగితే అనువాదకులు తాము చేస్తున్న భాషని సంపన్నం చేసినవారవుతారు. ఈ ప్రకారం మంచి అనువాదం అటు మూల గ్రంథాన్ని పెంపొందిస్తుంది,అనువాదం చేసిన భాషలో సాహిత్యాన్నీ పెంపొందిస్తుంది. అంచేత అనువాదం ఉభయ తారకం. మంచి సాహిత్యానువాదకులు దాదాపు స్వతంత్ర రచయితల్లాగా స్పష్టంగా కనిపిస్తారు. అందుకే, వాళ్ళకి ఆ సాహిత్య ప్రపంచంలో ఒక స్థానమూ, ఒక గౌరవమూ వుంటాయి. మన నన్నయలూ, శ్రీనాథులూ అలాంటివారు. ఇంత ప్రముఖ స్థానంలో లేకుండా మూల గ్రంథకర్తల క్రీనీడలో ఉండిపోయిన అనువాదకులూ వుంటారు, కాని వాళ్ళు పూర్తిగా అదృశ్యంగా వుండిపోవడం ప్రమాదం. వాళ్ళు అనువాద బాధ్యత తీసుకోవాలి. అనువాదంలో జరిగిన మార్పులు పాఠకుల స్పృహలోకి వచ్చే వీలుండాలి. జాగ్రత్తగా చదివే పాఠకులకి మూల గ్రంథం వేపు దృష్టి మళ్ళాలి. కాని అనువాద సాహిత్యానుభవానికి ఆటంకం కలగకుండా ఈ పని జరగాలి.

అయితే, ఒక భాషలోంచి ఒక పుస్తకం ఇంకో భాషలోకి వెళ్ళినప్పుడు ఆ రెండు భాషలూ ఒకే రాజకీయ ఆర్థిక ప్రాబల్యం కలవైతే, వాటి మధ్య అధికార రాజకీయాలు ప్రవేశించవు. కాని ఇంగ్లీషుకీ తెలుగుకీ మధ్య, పాశ్చాత్య ప్రపంచానికీ, భారతీయ ప్రపంచానికీ మధ్య ఈ రకమైన సమతౌల్యం ఎన్నడూ లేదు. సర్ విలియం జోన్స్ కాళిదాసుని అనువాదం చేసే రోజుల్లో ఆయన ఇంగ్లీషు వలస రాజ్య ప్రతినిధి. సంస్కృత గ్రంథాలు తాము పరిపాలించే వలస దేశపు వస్తువులు. ఆ దృక్పధం వల్ల వచ్చిన అధికార బలం సంస్కృత సాహిత్యానికి ఒక వలస వాదపు మూసని తయారు చేసింది. ఆ మూస యొక్క ప్రభావం సర్ విలియం జోన్స్ చేసిన అనువాదంలో నూ, ఆయన్ని అనుసరించి తర్వాతివాళ్ళు చేసిన అనువాదాల్లోనూ, కనిపిస్తుంది. అలాగే, ఇంగ్లీషు సాహిత్యాన్ని మనం అనువాదం చేసుకుని వుండవచ్చు. కాని, తొలి రోజుల్లో వలస పాలనకి లోబడిన వాళ్ళకి వుండే అణుకువ భావంతో మనం ఇంగ్లీషు నేర్చుకున్నామే కాని ఇంగ్లీషులో నుంచి మన భాషల్లోకి అనువాదాలు చేసుకోలేదు. చేసుకుని వుంటే ఆ సాహిత్యానికి మనం ఎలాంటి మూస తొడిగి వుండేవాళ్ళమో మరి. ఇంతకీ రెండు భాషల వినిమయం తరు చుగా అధికార ప్రాబల్య రాజకీయాలకి అతీతంగా వుండదు. ఈ పరిస్థితుల్లో అనువాదకుల పరిస్థితి మరింత క్లిష్టం. వాళ్ళు ఆ రాజకీయ ప్రభావాల ఆవరణని ఒప్పుకోడానికీ, దాని నించి తప్పుకోడానికి చాలా ప్రత్యేకమైన కృషి చేయాలి.

ఇంకో ఇబ్బంది సంస్కృతుల మధ్య తేడాకి సంబంధించినది. భారతీయ సంస్కృతి గురించి ఇంగ్లీషు పుస్తకాల్లో గత రెండు వందల సంవత్సరాల వలస రాజ్య ప్రభావం వల్ల తయారయిన చాలా సమాచారం సులభంగా దొరుకుతోంది. కాని ఈ సమాచారం వలసవాద ప్రభావానికి లోనైనది కాబట్టి భారతదేశ సంస్కృతిని సరిగ్గా ప్రతిబింబించదని వలసవాదాన్ని, దాని అనంతర పరిణామాల్ని పరిశీలిస్తున్న విద్వాంసులు కొంతకాలంగా చెబుతున్నారు. అంతే కాకుండా, వలసవాదపు అనువాదకులు భారతీయ సాహిత్యాన్ని అనువాదం చేసేటప్పుడు వాడిన కొన్ని పదబంధాలు భావవిశేషాలు అటు ఇంగ్లీషుకి దూరంగా వుంటాయి, ఇటు భారతీయ సాహిత్య సమాజానికీ దూరంగా వుంటాయి. ఈ భాషకి ఇండాలజీస్ (indologese) అని ఒక పేరు కూడా కొంత నిందా సూచకంగా వాడతారు ఆధునిక అనువాదకులు. అయినా, భారతీయ సాహిత్యాన్ని భారతీయ భాషల్లో కాకుండా ఇంగ్లీషు లోనే చదివి, వాటిని గురించి తెలుసుకున్న మేధావులు భారతదేశంలో చాలా మంది వున్నారు. అంటే, ఉపనిషత్తుల్ని, వేదాల్ని, కాళిదాసుని, భవభూతిని ఆ మాటకొస్తే బౌద్ధ గ్రంథాల్ని, ఖురాన్‌ని, మనలో చాలామందిమి వలస పరిపాలనా కాలపు ఇంగ్లీషు విద్యావంతులు చేసిన అనువాదాల్లోనే చదివాం. అంచేత మనకి ఆ భాష –అంటే ఇండాలజీస్ –బాగా పట్టేసింది. అది సాహిత్య భాషగా సమర్థమైన భాష కాదనీ, అది ఒక రకమైన మృతభాష అని చెప్పినా, తెలుగు దేశంలో ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు కొందరు ఒప్పుకునే ట్టులేరు. ఆ కారణం చేత తెలుగుసాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని ,అనువదించేటప్పుడు ఆ ఇండాలజీస్‌లో ఉన్న మాటలు కనిపించకపోతే అనువాదం వాళ్లకి నచ్చదు.

ఇప్పుడు శ్రీనాథుడు చేసిన అనువాదం గురించి ఒక క్షణం ఆలోచిద్దాం. సాహిత్యానువాదంలో శబ్దం అనువాదం అవుతుందనీ, అవాలనీ పట్టుబట్టి ప్రయత్నించిన వాడాయన. తన అనువాద విధానం ఎలాంటిదో స్పష్టంగా చెప్పినవాడు కూడా ఆయనే. ఆయన తన శృంగారనైషధంలో చివర ఇలా అన్నాడు.

… భట్టహర్ష మహాకవీశ్వరుండు గవి కులాదృష్టాధ్వ పాంథుండొనర్చిన నైషధ శృంగార కావ్య ప్రబంధ విశేషంబు, నశేష మనీషి హృదయంగమంబుగా, శబ్దంబనుసరించియు, నభిప్రాయంబు గుఱించియు, భావంబుపలక్షించియు, రసంబు పోషించియు, నలంకారంబు భూషించియు, నౌచిత్యం బాదరించియు, ననౌచిత్యంబు పరిహరించియు, మాతృకానుసారంబున జెప్పబడిన యీ భాషానైషధకావ్యంబు …

పై మాటల్లో “శబ్దంబనుసరించియు” అన్న మాట ముఖ్యమైన మాట. ఒక భాషలో శబ్దాన్ని ఇంకో భాషలో అనుసరిస్తే రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఆ రెండు భాషలు ఒక దానితో ఒకటి పెనవేసుకున్న భాషలే కావచ్చు. ఉదాహరణకి తెలుగు, సంస్కృతం అలాంటి భాషలు. ఆ కారణం చేత శబ్దాన్ని అనుసరించడానికి ఎక్కువ అవకాశమిచ్చే భాషలే కావచ్చు. అయినా కూడా సంస్కృత శబ్దం వున్నది వున్నట్టుగా తెలుగులోకి పట్టుకువస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్లో ఒకటి అశ్లీలార్థ స్ఫురణ. మూలంలో లేని అశ్లీలార్థం లేదా అమంగళార్థం సంస్కృతపు మాటల్ని తెలుగులో వాడడం వల్ల కనిపించే ప్రమాదం వుంది. ఇలాంటి ప్రమాదాన్ని తప్పించుకోడానికి ప్రయత్నించాను అని చెప్పడానికి తాను అనౌచిత్యంబు పరిహరించియు … అని చెప్పుకున్నాడు. శ్రీనాథుడు రాసిన ఈ భాగాన్ని ఆయన తను నిర్మించుకున్న అనువాద సిద్ధాంతంగా బోధపరుచుకోకుండా శ్రీహర్షుని మూల గ్రంథంలో వున్న అనౌచిత్యాల్ని శ్రీనాథుడు పరిహరించాడు అని అర్థం చేసుకున్నారు కొందరు.శబ్దానుసరణం అంటే, మూలంలో వున్న మాటల్ని వీలున్నంత యథాతథంగా తెలుగులోకి పట్టుకురావడం, మూలంలో ఉన్నది సంస్కృతం. కాని అవే మాటలు తెలుగులోకి పట్టుకొచ్చేసరికి తెలుగు మాటలవుతాయి. ఇలాంటి శబ్దానుసరణం ఇంగ్లీషుకీ తెలుగుకీ మధ్య సాధ్యమా అన్న సంగతి ఆలోచించాలి. గత కొన్ని దశాబ్దాలుగా ఇంగ్లీషు మాటలు కొల్లలుగా తెలుగులోకి వచ్చిపడుతున్నాయి. కాని, జాగ్రత్తగా చూస్తే వాటికి తెలుగు అర్థాలు కూడా ఏర్పడుతున్నాయి. తెలుగులో వాడిన ఇంగ్లీషు మాట ఇంగ్లీషులోకి పట్టుకెళ్ళాలంటే దాన్ని మళ్ళీ ఇంగ్లీషు లోకి అనువాదం చెయ్యాలి. అది పుట్టుకకు ఇంగ్లీషు మాటే అయినా తెలుగు వాడుకలోకి తెలుగీకరించబడి దాని ఇంగ్లీషుతనాన్ని పోగొట్టుకుంటుంది. “కన్యాశుల్కం”లో గిరీశం వాడిన ఇంగ్లీషు మాటలు ఇంగ్లీషు లోకి అనువాదం చేసినప్పుడు ఈ సంగతి స్పష్టంగా బోధపడుతుంది. శ్రీనాథుడు అంత సమర్థంగా శ్రీహర్షుడి నైషధంలో వున్న సంస్కృత శబ్ద స్వరూపాన్ని తెలుగులో అనువదించడానికి, సంస్కృతానికి తెలుగుకీ మధ్య వున్న దగ్గరితనం కొంత కారణం కాగా శ్రీహర్షుడి సంస్కృతాన్ని తెలుగు సంస్కృతంగా మార్చడంలో శ్రీనాథుడి చాకచక్యం ఎక్కువ కారణం.

తెలుగు పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువదించేటప్పుడు శబ్దానుసరణం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే, తెలుగు, ఇంగ్లీషు మధ్య ఉన్న ఎడం శాబ్దికంగా చాలా పెద్దది. ఇంగ్లీషు మాటలు తెలుగులోకి వచ్చాయి. కానీ ఇంగ్లీషులోకి వెళ్ళిన తెలుగు మాటలు గట్టిగా వేళ్ళ మీద లెక్కించవచ్చు. అయినా, తెలుగు పుస్తకాల్ని ఇంగ్లీషులోకి అనువదించేటప్పుడు శబ్దానుసరణం సాధ్యమా? భాషల చప్పుళ్లు బోధపర్చుకోగల చెవికి ఇది సాధ్యమేననిపిస్తుంది. తెలుగు చప్పుళ్లు విని ఇంగ్లీషు చప్పుళ్లు గమనించి, ఆ రెండింటికి ఎక్కడైనా కలయిక వుందేమో గమనించి, ఆ కలయికని జాగ్రత్తగా దాన్ని ఇంగ్లీషులోనిర్మించగల అనువాదం కనీసం కొన్ని చోట్లయినా సాధ్యమవుతుంది. ఇది గమ్యంగా నిర్దేశించుకోవడం కష్టం కానీ అనువాదకులు ఇది సాధిస్తే ఆనందకరంగా వుంటుంది.

అనువాదాన్ని గురించి కొంత వివరంగా ఆలోచించిన ఇంకొక తెలుగు కవి కొరవి గోపరాజు. ఇతను బహుశా శ్రీనాథుడి కాలంవాడే కావచ్చు. గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రింశిక సంస్కృతంలో వున్న విక్రమార్క చరిత్ర అనే పుస్తకానికి తెలుగు పరివర్తనం అని గడియారం రామకృష్ణశర్మ గారు చెబుతున్నారు. గోపరాజు ఏ సంస్కృత గ్రంథాన్ని అనువదించాడో స్పష్టంగా చెప్పలేదు. కాని, సంస్కృత భాషలో వున్న ఒక పుస్తకాన్ని అనువదించానని మాత్రం సూచించాడు. మూలంగా తీసుకున్న ఒక పుస్తకాన్ని వున్నది వున్నట్టు అనువదిస్తే ఏం గొప్ప, తన కవితావిశేషం తన అనువాదంలో చేర్చకపోతే విశేషం ఏముంది? –అని గోపరాజు అన్నాడు, ప్రథమాశ్వాసంలో.

తన వచోవిశేష మొనయక పూర్వక
థామితోక్తిఁజెప్పు టేమికడిఁది
యొకఁడు గోలవట్టి యెయ్యనఁగొనిపోవ
నంధుఁడెచటికైన నరుగుటరుదె

అంటే, మూలాన్ని ముక్కస్య ముక్క అనువాదం గోపరాజుకు అంగీకారం కాదన్న మాట. కళ్లున్నవాడి కర్ర సాయంగా గుడ్డివాడు నడవడంతో పోల్చాడు అలాటి అనువాదాన్ని.సంస్కృతంలో వున్న మూలానికి తాను చేసిన అనువాదాన్ని కేవలం ఇది అనువాదమేలే అని అనాదరం చేయొద్దని పాఠకుల్నికోరాడు గోపరాజు.

ఈసరసోక్తి కావ్యమొకఁడిమ్ముల సంస్కృతభాష నచ్చుగాఁ
జేసిన నట్ల వీఁడు మఱి చేయుట యేటిది యంచుఁ జెప్పగాఁ
జేసి యనాదరం బురక చేయకుఁడీ విలుకాఁడు తూఁటుగా
నేసిన నందె పాఱ మఱి యేసినవానిద సూటిగావునన్‌.

ఒక రకంగా చూస్తే, మూల రచయిత కన్నా అనువాదకుల పనే గొప్పదని గోపరాజు నిర్ణయం. ఒక విలుకాడు తన ఇష్టం వచ్చిన చోట బాణం వేయడం గొప్ప కాదు. అతను బాణం వేసిన చోట సూటిగా తగిలేట్టు మరో విలుకాడు బాణం వేయడం –అదీ గొప్ప. అంటే, మూల రచయిత కన్నా అనువాదకుడి ప్రజ్ఞ ఉన్నతమైనది.

గోపరాజు కాలానికే సాహిత్యానువాదానికీ, ముక్కస్య ముక్కానువాదానికీ తేడా చూడగలవాళ్లు తగ్గిపోయారనీ , అనువాదాలంటే ఒక చిన్న చూపు కూడా ఏర్పడుతోందనీ అనిపిస్తుంది — ఈ మాటలు చదివితే.

శ్రీనాథుడూ, గోపరాజూ కాక ఇంకా ఎవరేనా అనువాదాల్ని గురించి చెప్పినవాళ్లు వున్నారేమో వెతికి వాళ్లమాటలు కూడా పరిశీలనగా చూస్తే మన అనువాద సిద్ధాంతం మరింత వివరంగా స్పష్టపడొచ్చు. ఇంతకీ అనువాదం అనే మాట పూర్వకవులెవరూ వాడలేదు. ఆ రోజుల్లో అనువాదానికి భాషాంతరీకరణం అనే అర్థం లేదు. ఇది మనం ఇంగ్లీషు మాటకి ఇరవయ్యో శతాబ్దిలో చేసుకున్న అనువాదం.

మూల గ్రంథం ఒకటే అయినా అనువాదాలు చాలా వుండొచ్చు. అవి అన్నీ ఒకే స్థాయికి చెందినవి కాకపోవచ్చు. సమర్థమైన సాహిత్యానువాదాలు చెయ్యని అనువాదకులు కూడా మూలగ్రంథకర్తకీ, మూలభాషకీ ఉపకారం చేస్తారు. సర్ విలియం జోన్స్ కాళిదాసు శాకుంతలాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసి ఉండకపోతే పాశ్చాత్య ప్రపంచానికి కాళిదాసు గురించి తెలిసి వుండేది కాదు. కాని ఇవాళ ఆయన చేసిన అనువాదం మంచి అనువాదం అనుకుని చదువుతున్న వాళ్లెవ్వరూ లేరు. కాళిదాసు శాకుంతలానికి ఇంగ్లీషులో కనీసం ఒక డజను అనువాదాలు వచ్చాయి. అందులో ఆధునికులకు నచ్చేవి కనీసం రెండు మూడయినా వున్నాయి. వాటి ముందు సర్ విలియం జోన్స్ అనువాదం నిలవదు. అయినా, సర్ విలియం జోన్స్ ఇటు సంసృత సాహిత్యానికి అటు ఇంగ్లీషు సాహిత్యానికి ఉపకారం చేశాడనే చెప్పాలి.

తెలుగు ఒక భాష అని, దాదాపు ఏడు కోట్ల మంది ఈ భాష మాట్లాడే వాళ్ళున్నారని, ఈ భాషలో వెయ్యి సంవత్సరాల సాహిత్యం ఉందని ప్రపంచంలో చాలా మందికి తెలియదు. తెలియకపోతే మానె; అందువల్ల మనకేం నష్టం; వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళే ఈ భాష నేర్చుకుని అందులో తగినంత సామర్థ్యం సంపాదించుకుని వాళ్ళ వాళ్ళ భాషల్లోకి మన పుస్తకాలు అనువాదం చేసుకుంటారులే –అనే నిబ్బరం తెలుగు వాళ్ళమైన మనకు లేదు. ఈ భాష నీ, ఈ సాహిత్యాన్నీ, ఇంగ్లీషు వ్యావహారిక భాషగా వున్న ప్రపంచానికీ అంతటికీ అందించాలనే ఆశ మనకుంది. ఆ ఆశని చాతనైనంతవరకూ సఫలం చెయ్యడానికి తెలుగు సాహిత్యానువాదకులు ప్రయత్నిస్తున్నారు.

ఒక వెయ్యి సంవత్సరాల విశాలసాహిత్యాన్ని ఇంగ్లీషులో పెట్టడానికి ప్రయత్నిస్తున్న తెలుగువాళ్ళు పట్టుమని పదిమంది కూడా లేరు. వాళ్ల సంఖ్య ఇంకా పెరుగు తుందనీ తెలుగు సాహిత్యం ఇంకా విరివిగా ఇంగ్లీషు ప్రపంచంలోకి వెళ్తుందనీ ఎదురుచూద్దాం.
----------------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు, 
ఈమాట సౌజన్యంతో 

No comments: