Sunday, October 28, 2018

తెలుగులో అంకెలు, సంఖ్యలు 11 నుంచి పైన


తెలుగులో అంకెలు, సంఖ్యలు 11 నుంచి పైన



సాహితీమిత్రులారా!

తెలుగులో పది, ఒండు పదకొండు ఎలా అయిందో అదే విధంగా పాత ఇంగ్లీషులో “ఎలెవెన్‌” అంటే “(పదిమీద) మిగిలింది ఒకటి” అని అర్థం. ఇదే విధంగా “ట్వెల్వ్‌” అర్థం “మిగిలింది రెండు”. ఇది కాస్తా సంస్కృతంలో ద్వ, దశ ద్వాదశ అయింది. ఇదే మాట లేటిన్‌లో “డూవోడెసిమ్‌”. “డూవో” అంటే రెండు, “డెసిమ్‌” అంటే పది. మాటకట్టడి చూసేరా? లేటిన్‌కీ సంస్కృతానికీ పోలిక ఉంది. పాత ఇంగ్లీషుకీ తెలుక్కీ పోలిక ఉంది. ఈ డూవోడెసిమ్‌ అన్న లేటిన్‌మాట భ్రష్టయి ఇంగ్లీషులో “డజను”గా మారింది. కనుక డజనుని ద్వాదసికి భ్రష్టరూపంగా తెలుగులోకి తీసేసుకోవచ్చు. లేదా తెలుగులో డజనుని ద్వాదశం అనొచ్చు. ఇలాంటి నియమాలు ఒక డజను సంపాయించగలిగే మంటే ఇంగ్లీషు మాటల్ని డజన్ల కొద్దీ తెలుగులోకి తీసుకురావచ్చు.

పాశ్చాత్యదేశాలలో, హోటేళ్ళు మొదలైన అంబరచుంబితాలలో (అంటే “స్కైస్క్రేపర్‌”లలో) సాధారణంగా పదమూడో అంతస్తు ఉండదు. అంటే, పన్నెండు తర్వాత పద్నాలుగు వస్తుంది. మనకి ఏడు ఎలాగో పాశ్చాత్యులకి పదమూడు అలాగ. పదమూడు వల్ల కీడు కలుగుతుందనే భయాన్ని “త్రిస్‌కైడేకాఫోబియా” అంటారు. తెలుగువాళ్ళకి త్రయోదశభీతి లేదు కానీ అమావశ్య అంటే కొంచెం భయం ఉంది.

ఇంగ్లీషులో ఎవెవెన్‌, ట్వెల్వ్‌ లకి తెలుగులో పదకొండు, పన్నెండు లతో పోలిక ఉన్నాదని చెప్పేను కదా. ఈ పోలిక తర్వాత కనపడదు. థర్టీన్‌ త్రీ, టీన్‌ అయితే తెలుగులో పదమూడు మూడు, పది కాదు; పది, మూడు. ఇంగ్లీషులో ముందు మూడు, తర్వాత పది వస్తే తెలుగులో కొంచెం తిరకాసు వచ్చింది. ఇదే తిరకాసు నైన్‌టీన్‌ వరకు కనిపిస్తుంది.

ఇక్కడ సంస్కృతంలో లెక్క పెట్టే పద్ధతిని ఒకసారి పునర్విమర్శిద్దాం. ఉదాహరణకి, ఎనభైరెండుని ద్వ్యశీతి అంటే 2, 80 అనీ, ఎనభై మూడుని త్య్రశీతి అంటే 3, 80 అనీ చెబుతూ, ఎనభై తొమ్మిది దగ్గరికి వచ్చేసరికి “నవాశీతి” అనకుండా “ఏకోన నవతి” అన్నారు. అంటే “తొంభైకి ఒకటి తక్కువ” అని అర్థం. ఈ పద్ధతి ఇంగ్లీషులోనూ తెలుగులోనూ కూడ కనిపించదు. కాని రోమక సంఖ్యలని రాసేటప్పుడు ఈ సంస్కృతంలో వాడే పద్ధతినే ఇప్పటికీ వాడుతున్నాం అని గమనించండి.

మనం తొమ్మిది రాత్రులని నవరాత్రులు అన్నట్లే ఇంగ్లీషులో పద్నాలుగు రాత్రులని “ఫోర్టీన్‌ నైట్స్‌” అంటారు. దీన్ని కుదిస్తే “ఫోర్ట్‌నైట్‌” అవుతుంది.

పక్కా తెలుగు వాడికీ పదహారుకీ ఏదో తీయని సంబంధం ఉండబట్టే పదహారణాల ఆంధ్రుడు అన్న పేరు వాడుకలోకి వచ్చింది.

భారతంలో పద్ధెనిమిదికి చాలా ప్రాముఖ్యత ఉంది. అష్టాదశ పర్వాలు. భారతయుద్ధంలో పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం. భగవద్గీతలో పద్ధెనిమిది అధ్యాయాలు. ఈ 18 అధ్యాయాలలో ఉన్న 700 చిల్లర శ్లోకాలనీ 18 శ్లోకాలలోకి కుదించి దానిని అష్టాదశగీత అన్నారు. పురాణాలు, ఉపపురాణాలు పద్ధెనిమిదేసి ఉన్నాయి.

పచ్చీస్‌పాళీ ఉత్తరాది వారి ఆట అనుకుంటాను. ఈ ఆటలోనే దస్సు, దోదస్సు, పచ్చీసు వస్తాయి.

దేశానికి కొత్తగా వచ్చే మనుషులకి జబ్బు చేస్తే వారిని కొన్నాళ్ళు ” క్వారన్‌టీన్‌”లో పెడతారు అంటే. ఆగంతుకులకి ఏమైనా అంటురోగాలుంటే అవి మిగిలిన వాళ్ళకి సోకకుండా నలభైరోజుల పాటు ఏకాంతరవాసం ఏర్పాటు చేస్తారు. ఫ్రెంచి భాషలో “క్వారంటె” అంటే నలభయ్‌!

అరవైకి మానవ సంస్కృతిలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనకున్న సంవత్సరాలు అరవై. అరవై ఏళ్ళు బతికితే అదొక మైలురాయి లాంటిది. కనుక మన సంస్కృతిలో షష్టిపూర్తికి అంత ప్రాముఖ్యత. గంటకి 60 నిమిషాలు, నిమిషానికి అరవై “సెకండు”లు, సెకండుకి అరవై “థర్డ్‌”లు. ఇదే విధంగా వృత్తంలో ఒక డిగ్రీకి అరవై నిమిషాలు, నిమిషానికి అరవై సెకండ్లు, సెకండుకి అరవై థర్డ్‌లు. ఇప్పటికైనా అర్థమయిందా “సెకండు” అన్న మాటలోని అంతరార్థం? మనలో కొందరు “సెకండు షో”, “సెకండు హేండు” మొదలైన ఇంగ్లీషు మాటలని నిర్మొహమాటంగా వాడేస్తూ నిమిషంలో అరవైయవ వంతైన సెకండు దగ్గరకు వచ్చేసరికి దానిని “సెకను” అంటారు, అక్కడికేదో తెలుగు మీద అభిమానం మండిపడి పోతూన్నట్లు.

ఇరవై, ముప్ఫయ్‌, .. , తొంభయ్‌ అన్న అంకెలు దరిదాపు అన్ని భాషలలోనూ ఒకే బాణీలో వెళతాయి. ఇరు, పది ఇరువది లేదా ఇరవై… ఏను, పది ఏబది లేదా ఏభయ్‌. ఆరు, పది అరువది లేదా అరవై. కాని అరవై దాటిన తరవాత వచ్చే అంకెలు అన్ని భాషలలోనూ పైన ఉదహరించిన బాణీలో నడవవు. ఉదాహరణకి, ఏడు, పది డెబ్బది ఎలాగయిందో, ఏ వ్యాకరణసూత్రం ఉపయోగించాలో నాకు అర్థం కాలేదు. ఈ రకం ప్రవర్తన ఇంగ్లీషులో కనిపించదు కాని ఫ్రెంచి భాషలో ఎనభైని నాలుగు ఇరవైలు అనే అలవాటు ఉంది.

నూరు, వంద అన్న పేర్లు ఎలాగొచ్చేయో తెలియదు. “రెండు వందల”, “మూడు వందల” అని అంటాం కానీ “వంద పదహారు”కి బదులు “నూటపదహారు” అంటాం. ఈ నూటపదహారుకి మన సంస్కృతిలో ఒక ప్రత్యేకస్థానం ఉంది. కట్నం, పారితోషికం మొదలైనవి వంద ఇవ్వకూడదు, నూరు ఇవ్వకూడదు నూటపదహార్లు ఇవ్వాలి.

“నూరు” ఎప్పుడు వాడాలో, “వంద” ఎప్పుడు వాడాలో అన్న సందేహనివృత్తికి ఒక నియమమంటూ ఉన్నట్లు లేదు. అంతేకాదు, పేరుకి నూరే కాని ఆచరణలో నూరుని నూరులా వాడని సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

శతకంలో నూరు కాదు, నూట ఎనిమిది పద్యాలుంటాయి. కాని “వేమన శతకం”లో వందల కొద్దీ పద్యాలున్నాయి కనుక వాటిని వేమన పద్యాలంటేనే మెరుగేమో. పూజ చేయించేటప్పుడు చదివే అష్టోత్తరశత నామాలు నూట ఎనిమిది.

విశాఖపట్నం జిల్లాలో వంద మామిడి పళ్ళు కొంటే నూటపన్నెండు వస్తాయి. మామూలు వంద 100 అయితే “పెద్ద వంద” 112. ఈ ఆచారం ఇంగ్లండులోనూ ఉంది. “హండ్రెడ్‌వెయిట్‌” అంటే 112 పౌనులు. “హండ్రెడ్‌కౌంట్‌” అంటే 112 శాల్తీలు.

మనిషి పూర్ణాయుర్దాయం నూరేళ్ళు అని చాలమంది నమ్మకం. కాని ఈ రోజులలో చాల మంది నూరు దాటే బతుకుతున్నారు. అసలు గాంధీ గారు “నూట ఇరవై ఏళ్ళు బతుకుతాను” అని అనేవారు. ఈ నూట ఇరవై ఎక్కడి నుండి వచ్చిందా అని చాల రోజులు ఆలోచించేను.

మనిషి ఆయుర్దాయం నూరన్న నమ్మకంతోటే నూరేళ్ళు నిండుగా బతుకు అని ఆశీర్వదిస్తాం. దీన్నే వేదాల్లో “జీవేమ శరదః శతం” అంటే “నూరేళ్ళు జీవించాలి” అని కోరుకోవడం. ఈ నూరేళ్ళూ ఎలా జీవించాలి? ఆరోగ్యంగా, ఇంకొకరి మీద ఆధారపడకుండా, సంఘశ్రేయస్సుకి భంగం కలగకుండా, జబ్బుపడి మంచం పట్టిపోకుండా, పనిచేస్తూ జీవించాలి. నూరేళ్ళు పనిచెయ్యడం అంటే కుదురుతుందా? నిద్రాహారాల మాటేమిటి? రోజుకి నాలుగో వంతు నిద్రాహార విశ్రాంతులకి కేటాయించి, పనిచేసే కాలమే లెక్క కట్టగా ఆయుర్దాయం 125 సంవత్సరాలు. ఇందులోంచి బాల్యంలో గడిపిన కాలం కొంత కొట్టేస్తే గాంధీగారి నమ్మకానికి ఆధారం దొరుకుతుంది.

డాలర్లో నూరోవంతు సెంటు. సెంటు అంటే నూరు అనే అర్థం కూడా ఉండబట్టే “సెంటు పెర్సెంటు” అంటే నూటికి నూరు అయింది. క్రికెట్‌లో వంద రన్నులు కొడితే అది “సెంచెరీ”. వంద సంవత్సరాల కాలమైన శతాబ్దం కూడ సెంచెరీయే.

సహస్రం అంటే వెయ్యి. విరాట్‌పురుషుడికి వెయ్యి తలలు, వెయ్యి కళ్ళు, వెయ్యి పాదాలు ఉన్నాయని వర్ణిస్తాం; “సహస్ర శీర్షం దేవం, సహస్రాక్షం సహస్రపాత్‌”. ఇక్కడ “వెయ్యి” అంటే “ఎన్నో” అని అర్థం చెప్పుకోకుండా, “వెయ్యి తలలుంటే రెండు వేల కళ్ళు ఉండొద్దా?” అని అడగడం అవివేకం. ఇది అలంకారాలలో ఒకటయిన అజహర్లక్షణానికి మరొక ఉదాహరణ అని సరిపెట్టుకోవాలి.

ఇంగ్లీషులో “మిలియనమ్‌” అంటే వెయ్యి సంవత్సరాలు. దీన్నే మనం సహస్రాబ్దం అంటాం. మనం ఇప్పుడు, పాశ్చాత్య పంచాంగం ప్రకారం, ఒక సహస్రాబ్దం దాటి మరొక సహస్రాబ్దంలోనికి ప్రవేశించే సంధి యుగంలో ఉన్నాం. ఈ రోజుల్లో “వైటుకె” సమస్య గురించి వినని వాళ్ళు అరుదేమో?

మిల్లీ అంటే వెయ్యో వంతు. ఈ “మిల్లీ”లో నుండి ఉద్భవించిన “మైలు” అంటే వెయ్యి అంగల దూరం.

ఇంగ్లీషులో “సెంటీపీడ్‌” అంటే వందపాదాలు కల పురుగు అని అర్థం. కాని సెంటీపీడులని పట్టుకుని వాటి పాదాలు లెక్కపెడితే అవి 30 కీ 42 కీ మధ్య ఉంటాయి కాని వంద ఎప్పుడూ ఉండవు. “మిల్లీపీడు” అంటే వెయ్యి పాదాలు కల పురుగు. కాని వీటికి సాధారణంగా ఏ రెండు వందల కాళ్ళో ఉంటాయి అంతే. (నేతిబీరకాయ లాంటి మాటలు ఇంగ్లీషులోనూ ఉన్నాయి.) ఈ మధ్య 750 కాళ్ళు ఉన్న మిల్లీపీడుని కనుక్కున్నారు. ఎక్కడైనా వెయ్యి కాళ్ళు ఉన్న మిల్లీపీడు దొరుకుతుందేమోనని వెతుకుతున్నారు. ఇవి పురాణాలలో పెట్టిన పేర్లు కావు కదా! శాస్త్రవేత్తలు వీటికి పేర్లు పెట్టడంలో పప్పులో కాలేసేరు! సెంటిపీడులనీ మిల్లిపీడులనీ కలిపి “మిరియపోడా” అంటారు. “మిరియడ్‌” అంటే పదివేలు. “మిరియపోడా” అంటే పదివేల కాళ్ళు ఉన్న పురుగు అని అర్థం. కనుక ఈ పేర్లన్నిటినీ అతిశయోక్తులుగా తీసుకోవాలి.

వెయ్యిని ఇంగ్లీషులో “థౌజండ్‌” అంటాం కదా! “థౌజండ్‌” అంటే “గట్టివంద” లేదా”పెద్దవంద”, అని అర్థం. ఇటలీ వాళ్ళు తీసిపోయారా? వాళ్ళు వెయ్యికి “మిల్లీ” తగిలించి దానిని “గట్టివెయ్యి” లేదా “మిలియోన్‌” చేసేరు. అదే మిలియన్‌ అయింది. కాని గట్టి వంద వెయ్యి అయితే గట్టివెయ్యి పదివేలు అవాలి, న్యాయంగా. కాని ఇక్కడ అయి చావలేదు.

పెద్ద పెద్ద అంకెలని ఊహించి లెక్క పెట్టడం భారతీయులకి వెన్నతో పెట్టిన విద్య. ఉదాహరణకి పెద్దపెద్ద అంకెలు ఎంతవరకు లెక్కపెట్ట వచ్చో చూద్దాం.

ఒకటి పక్కన సున్న వేస్తే అది పది. పదిని ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. మన చేతులకి పది వేళ్ళు ఉన్నాయి కదా!

పది మధ్య సున్న వేస్తే “పంది” అవుతుంది కానీ, అది వేరే విషయం.
పది పక్కన సున్న చుడితే అది వంద. వందని ఊహించుకోవడం కూడ పెద్ద కష్టం కాదు. వంద రూపాయలు ఖర్చు పెడితే ఏమీ రాని ఈ రోజులలో వంద పెద్ద సంఖ్య కానే కాదు. కాని నా చిన్నతనంలో వంద చాలా పెద్ద సంఖ్య. మా పెద్దన్నయ్య పెళ్ళికి నూటపదహార్లు కట్నం ఇచ్చేరు!

ఒకటి పక్కన మూడు సున్నలు చుడితే అది వెయ్యి. ఒక మంచి చొక్కా కొనుక్కోవాలంటే వెయ్యి రూపాయలు అయిపోతోంది ఈ రోజులలో.

ఒకటి పక్కన నాలుగు సున్నలు చుట్టడంతో మనం పేర్లు పెట్టే పద్ధతిలో కొంచెం మార్పు వచ్చింది. 10,000 కి మరో కొత్తపేరు పెట్టకుండా “పదివేలు” అనేసి ఊరుకున్నాం. మనమే కాదు ఇంగ్లీషు వాడూ ఇదే పని చేసి, “టెన్‌, హండ్రెడ్‌, థౌజండ్‌” అయిన తర్వాత మనలాగే “టెన్‌ థౌజండ్‌” అన్నాడు. కాని ఇంగ్లీషు వాడు మనదేశం రాక పూర్వం దీనిని “మిరయడ్‌” అనే వాడు. మిరయడ్‌ రూపాయలు ఉంటే హైదరాబాద్‌ నుండి ఢిల్లీ విమానంలో వెళ్ళిరావచ్చు.

ఒకటి పక్కన ఐదు సున్నలు చుడితే అది లక్ష. దీన్ని హిందీలోనూ, ఇంగ్లీషులోనూ కూడ “లేక్‌” అంటారు. తంతే దమ్మిడీ లేని బేపనోళ్ళ ఇళ్ళలోనే ఈ రోజులలో కట్నాలు లక్ష రూపాయలు ట! పూర్వం గొప్పవాళ్ళు లక్షాధికారులు. “వాళ్ళింట్లో లక్షలు మూలుగుతున్నాయిరా!” అనుకునే వాళ్ళం. ఇప్పుడు లక్ష అంటే ఎవ్వరూ ఖాతరు చెయ్యడం లేదు.

ఒకటి పక్కన ఆరు సున్నలు చుట్టగా వచ్చిన సంఖ్య “పది లక్షలు”. కొత్తసున్న చుట్టినప్పుడల్లా ఒక కొత్త పేరు పెడదాం అనుకుంటే, ఆ కొత్త పేరే మిలియను. అమెరికాలో మిలియను డాలర్లు ఆస్తి ఉంటే మధ్య తరగతిలో కొంచెం పైమెట్టు లో ఉన్నట్లు లెక్క వేసుకోవచ్చు. మన దేశంలో లక్షాధికార్లకి పట్టిన గతే అమెరికాలో ఈ మిలియనీర్లకి కూడ పడుతోంది. బిల్‌ గేట్స్‌ లాంటి బిలియనీర్లు వచ్చిన తర్వాత మిలియనీర్ల ముఖాలు ఎవ్వరూ చూడడం లేదు.

ఒకటి పక్కన ఏడు సున్నలు చుడితే అది కోటి. దీన్ని హిందీలో “కరోర్‌” అంటారు. ఇదే ఇంగ్లీషులో “క్రోర్‌”. ఈ రోజులలో గొప్పవాళ్ళు కోటీశ్వరులు, లేదా కరోర్‌పతులు. “వాళ్ళింట్లో డబ్బు కోటికి పడగలు ఎత్తిందిరా!” అనుకునే వాళ్ళం. అంత డబ్బుంటే ఆ డబ్బు పాములుగా మారిపోతుందనే కథ నా బాల్యంలో వినేవాడిని.

కోటిని ఊహించుకోవడం కొంచెం కష్టం నా బోంట్లకి. ఉదాహరణకి భారతదేశం జనాభా ఉరమరగా 100 కోట్లు! కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళు పార్టీ నిధి కొరకు డబ్బు దండుకుంటూ హైదరాబాదులో ఉన్న ఒక “ఇండస్ట్రియలిస్టు” దగ్గరకి వెళితే ఆయన ఒక కోటి ఇచ్చి మరేమీ అనుకోవద్దని క్షమార్పణ వేడుకున్నాట్ట. ఆయనని నేను ఒకసారి కలుసుకున్నాను. పేరు మాత్రం చెప్పను. క్రీ.శ. 1992లో ఆంధ్రప్రదేశ్‌లో పుగాకు, సారా వగైరాల అమ్మకం పన్ను ద్వారా వచ్చిన ఆదాయం 840 కోట్ల రూపాయలుట!

మానవకోటి, జంతుకోటి అన్న మాటలలో మాత్రం కోటి అంటే ఎన్నో అనే అర్థం. కనుక “ఏనిమల్‌ కింగ్‌డమ్‌” వంటి “బయాలజీ” మాటని “జంతుకోటి” అంటేనే బాగుంటుంది.

ఒకటి పక్కన ఎనిమిది సున్నలు చుడితే వచ్చే సంఖ్యకి మంచిపేరు, నలుగురికీ పరిచయం అయిన పేరు ఏదీ లేదు. పదికోట్లు అనో, దశకోటి అనో, వంద మిలియన్లు అనో అనవచ్చు; కాని అవి కొత్త పేర్లు కావు. “వెంకట్రావ్‌, పెద వెంకట్రావ్‌” అన్నట్టు పాత పేర్లనే పునరావృతం చేసేం, అంతే.

ఒకటి పక్కన తొమ్మిది సున్నలు చుడితే వచ్చే సంఖ్య వంద కోట్లు లేదా బిలియను. మిలియను ఊహించుకోవడం చేతనయిన వాళ్ళకి కూడ బిలియను ఊహించుకోవడం కష్టం. వెయ్యికీ మిలియనుకీ మధ్య ఎంత దూరం ఉందో మిలియనుకీ బిలియనుకీ మధ్య అంత దూరం అని ఉపమానం చెప్పినా ఆ ఉపమానం ఉపయోగకారి కాదు. కనుక రెండు ఉదాహరణలు చెబుతాను.  ఈ భూలోకపు జనాభా 5 బిలియన్ల పై చిల్లర. ప్రస్తుతం ప్రపంచం అంతటిలోనూ ధనవంతుడైన బిల్‌గేట్స్‌ దగ్గర దరిదాపు ఏ ఏభై బిలియను డాలర్లో ఉంటాయని అంచనా.

అసలు ఆధునిక శాస్త్రీయ యుగం మొదలయే వరకూ పాశ్చాత్య దేశాలలో పెద్ద పెద్ద సంఖ్యలతో పనే ఉండేది కాదు. బిలియనుతో సామాన్యులకి అవసరం ఏముంటుంది? కనుక మొన్న మొన్నటి వరకూ పాశ్చాత్య భాషలలో పెద్ద పెద్ద సంఖ్యలకి పేర్లే లేవు. పని ఉంటే కదా పేర్ల అవసరం? కాని మన భారతదేశంలో ఏమి పని వచ్చిందో తెలియదు కాని పెద్ద పెద్ద సంఖ్యలకే కాదు, పేద్ద పేద్ద సంఖ్యలకి కూడ పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి ఒకటి తర్వాత 11 సున్నలు చుడితే అది అర్బుదం, 13 సున్నలకి ఖర్వం, 15 సున్నలకి పద్మం, 17 సున్నలకి క్షోణి, 19 సున్నలకి శంఖం, ఇలాగే తరువాయి బేసి సంఖ్యల సున్నలుంటే వాటిని క్రమంగా క్షితి, క్షోభం, నిధి, సరి సంఖ్యలైన సున్నలుంటే వాటి పేరుకి “మహా” తగిలించి మహాపద్మం, మహాఖర్వం, వగయిరా పేర్లు. ఒకటి తర్వాత 27 సున్నలుంటే పర్వతం, 28 పరార్థం, 29 అనంతం. ముప్పయ్‌ సున్నలుంటే సాగరం, 31 అవ్యయం, 32 అచింత్యం, 33 అమేయం, … భూరి, వృందం, అన్న పేర్లు ఉన్నాయి. ఈ లెక్కలో వృందం తర్వాత ఏమి పేర్లు వస్తాయో ఇదమిద్ధంగా తెలియదు కానీ రావణాసురుడి సైన్యం ఎంత పెద్దదో వర్ణిస్తూ వాల్మీకి ఒకటి తర్వాత 55 సున్నలు చుడితే వచ్చే సంఖ్యంత అని చెప్పి దానికి మహౌఘం అని పేరు పెట్టేడు.

ఈ పేర్లు మనదేశంలో వాడుకలో లేవు కానీ మన దగ్గర ఈ పేర్లు నేర్చుకున్న జపాను వాళ్ళు ఇప్పటికీ వీటిని వాడుతున్నారు. మచ్చుకి ఒకటి తర్వాత 80 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని జపాను వాళ్ళు “పుకషీగీ” అంటారు. పుకషీగీ అంటే “అచింత్యం”. ఒకటి తర్వాత 56 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని “కుగాషా” అంటారు. కుగాషా అంటే “గంగా నది ఒడ్డున ఉన్న ఇసకంత” అని అర్థం.

పేర్లు పెట్టడం అంటూ పెట్టేరు కానీ, ఈ పేర్లలో ఒక బాణీ లేకపోతే జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం. అప్పుడు ఒకదానికి మరొక పేరు వాడే ప్రమాదం ఉంది. మన ప్రాచీన గ్రంథాలలో, మచ్చుకి, ఒకటి తర్వాత 12 సున్నలు ఉన్న సంఖ్యని ఒకచోట మహార్బుదం అన్నారు, మరొక చోట న్యర్బుదం  అన్నారు. ఇలాంటి ఇబ్బందుల నుండి తప్పించుకుందికి అధునాతనులు ఒక పద్ధతి ప్రవేశపెట్టేరు. ఈ పద్ధతిలో సంఖ్యల పేర్లలో బాణీ ఈ విధంగా ఉంటుంది. పది, వంద, వెయ్యి మామూలే. తర్వాత కొత్త పేరు ఒకటి తర్వాత ఆరు సున్నలు చుట్టగా వచ్చిన మిలియను. తర్వాత కొత్తపేరు ఒకటి తర్వాత తొమ్మిది సున్నలు చుట్టగా వచ్చిన బిలియను. అలా మూడేసి సున్నలు అధికంగా చేర్చినప్పుడల్లా మరొక కొత్త పేరు. ఈ లెక్కని ఒకటి తర్వాత ఆరు సున్నలుంటే మిలియను, తొమ్మిది ఉంటే బిలియను, 12 అయితే ట్రిలియను, 15 సున్నలకి క్వాడ్రిలియను, తదుపరి క్వింటిలియను, అలా.

బాగానే ఉందయ్యా! ఇవన్నీ “లియను” అనే శబ్దంతో అంతం అవుతున్నాయి. కాని ఈ “లియను” ముందుండే పూర్వప్రత్యయం జ్ఞాపకం పెట్టుకోవడం ఎలా? ఈ పూర్వ ప్రత్యయాలని విడిగా, వరసగా వాటి అర్థాలతో రాసి చూద్దాం.
బి రెండు, ట్రి మూడు, క్వాడ్‌ నాలుగు, క్వింట్‌ అయిదు, సెక్స్‌ట్‌ ఆరు, సెప్ట్‌ ఏడు, ఆక్ట్‌ ఎనిమిది, నవ్‌ తొమ్మిది … అలా అలా వెళుతుందీ వరస. ఈ వరస అర్థం ఏమిటంటే మిలియనుని మూలంగా తీసుకుని ఆ మిలియనుని రెండు సార్లు వేసి హెచ్చవేస్తే వచ్చే సంఖ్య బిలియను, మూడు సార్లు గుణిస్తే వచ్చే సంఖ్య ట్రిలియను, నాలుగు సార్లు గుణకారం చెయ్యగా వచ్చింది క్వాడ్రిలియన్‌, ..

ఆగాలి, కొంచెం ఆగాలి.. ఇక్కడ నేను తప్పేనా చెబుతూ ఉండుండాలి, మీరు తప్పేనా అర్థం చేసుకుని ఉండుండాలి. ఎందుకంటే మిలియనుని రెండు సార్లు వేసి గుణిస్తే ఒకటి తర్వాత 12 సున్నలు వస్తాయి కాని తొమ్మిది రావు. నిజానికి అది నిజమే. బ్రిటిష్‌ వాళ్ళ హయాంలో ఈ ప్రపంచం ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ తార్కికంగా ఆలోచించి ఒక పద్ధతిలో పేర్లు పెట్టేరు. ఒకటి తర్వాత 12 సున్నలుంటే దానిని బిలియను అనీ, 18 సున్నలుంటే దానిని ట్రిలియను అనీ, అలా అనుకుంటూ వెళ్ళమన్నారు. అలాగే వెళ్ళేవాళ్ళం. తర్వాత ఈ అమెరికా వాళ్ళు వచ్చేరు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, పైపెచ్చు ఈ అమెరికా వాడి దగ్గర డబ్బు మస్తుగా ఉంది. దాంతో జబ్బశక్తి, గోరోజనం పుంజుకున్నాయి. తన శక్తిని ప్రపంచానికి చాటడం ఎలా? ఇంగ్లీషువాడు ఎడం పక్కని నడిపితే తను కుడి పక్కన కారు నడుపుతానన్నాడు. ఇంగ్లీషు మాటలకు స్పెల్లింగులు మార్చేస్తానన్నాడు. కొన్నింటికి అర్థాలే మార్చీసీడు. అందుకనే ఈ రోజులలో బిలియను అంటే ఒకటి తర్వాత తొమ్మిది సున్నలే. ట్రిలియను అంటే ఒకటి తర్వాత 12 సున్నలూ, అలాగ వెళుతోంది ఈ బండి. ఈ మార్పు వల్ల వచ్చిన నష్టం ఏమిటంటే పూర్వప్రత్యయాన్ని చూసి ఆ సంఖ్యలో ఎన్ని సున్నలుంటాయో చెప్పడం కష్టం బట్టీ పట్టేయాలి అంతే.

ఈ పేర్లు ఇంకా ఎంత దూరం వెళతాయి? మిలియనుని వంద సార్లు వేసి హెచ్చవేస్తే వచ్చే సంఖ్యని “సెంటిలియన్‌” అనమన్నాడు బ్రిటీషువాడు. అప్పుడు సెంటిలియన్‌ అంటే ఒకటి తర్వాత 600 సున్నలు అని ఠకీమని చెప్పగలిగి ఉండేవాళ్ళం. కాని ఈ అమెరికా వాడి సొద వల్ల ఆ సౌలభ్యం పోయి ఒకటి తర్వాత 303 సున్నలు చుడితే అది సెంటిలియన్‌ అయింది.

వంద మన మస్తిష్కంలో ఎలా పాతుకుపోయిందంటే ఒకటి తర్వాత వంద సున్నలు వేస్తే వచ్చే సంఖ్యకి పేరేమిటి అనే సందేహం ఒకాయనకి వచ్చింది. సరదాగా పొడుపు కథలా కొడుకుని అడిగేడు. ఆ కొడుకుకి మాత్రం ఏం తెలుసు? సరదాగా ఒక పిచ్చి మాట తయారుచేసి “గూగోల్‌” అన్నాడు అదేదో సినిమాలో శివరావు “గిడిగిడి”  అన్నట్టు. ఆ గూగోల్‌ స్థిరపడి పోయింది. ఒకటి తర్వాత గూగోల్‌ సున్నలు చుట్టగా వచ్చిన సంఖ్య? దీన్ని “గూగోప్లెక్స్‌” అనమని మరొక ప్రభృతుడు సలహా ఇచ్చేడు.

నా చిన్నతనంలో నేను నా తమ్ముడు గిరి వీధి వసారాలో కూర్చుని “అంకెల ఆట” ఆడుకుంటున్నాం (ఆ రోజులలో టీవీలు లేవుగా!). ఆట మధ్యలో దారిన పోతున్న తొర్రిపంతులు కలిసేడు.

“మరయితే ఒకటి తర్వాత గూగోప్లెక్సు సున్నలు చుడితే దానిని ఏమంటారండీ?” అన్నాడు. దానికి సమాధానంగా తమ్ముడు గిరి చటాలున “టొర్రిపంతులు” అన్నాడు. అప్పటినుండీ మా ఇంట్లో మాత్రం “అన్నిటి కంటె పెద్ద సంఖ్య ఏమిట్రా?” అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం “టొర్రిపంతులు”!
----------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: