Wednesday, October 17, 2018

తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది?


తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది?




సాహితీమిత్రులారా!


తెలుగు చాలా అందమైన భాష. తెలుగు చాలా తియ్యని భాష. తెలుగు చాలా గొప్ప భాష. (అప్పుడే చప్పట్లు కొట్టకండి.) ఈమాటని ఎవ్వరూ కాదనరు. మా అమ్మాయి చాలా అందమైనది. చాలా తెలివైనది. నాతో ఆ విషయం మీద మీరు ఎప్పుడూ పోట్లాడరు. మీ అమ్మాయి అందమైనది కాదు అని నాతో వాదించరు. పోన్లే పాపం ఆ తండ్రికి కూతురంటే ప్రేమ, అని వొదిలేస్తారు. తెలుగు విషయంలో కూడా అంతే. తెలుగువాళ్ళు కానివారి సభకి వెళ్ళి, అందరూ ఇంగ్లీషువాళ్ళో, అందరూ ఫ్రెంచివాళ్ళో, అందరూ జర్మన్లో ఉండగా, తెలుగు ప్రపంచంలోకల్లా అందమైన భాష, గొప్ప భాష అని మీరనండి, తెలుగువాళ్ళు అంతేలే, తెలుగువాళ్లకి వాళ్ళ భాష అంటే అభిమానమని కాసేపు ఊరుకుంటారు.  వాళ్ళ సభ్యత అడ్డు వస్తుంది కాబట్టి అంతకన్నా ఇంకేమీ అనరు.

మనకి తెలుగు అందమైన భాష కావడానికి కారణం మనకి తెలుగు ఒక్కటే రావడం. మనకి ఇంకొక భాష నిజంగా రాదు. ఉద్యోగరీత్యా వచ్చిన ఇంగ్లీషు భాష మనకి వొచ్చు. సాహిత్యరూపంలో వచ్చే ఇంగ్లీషు మనకి రాదు, కాకపోతే రాదని మనకి తెలియదు. తెలుగువాళ్ళు ప్రపంచంలోకి వచ్చారు. అమెరికా వచ్చారు, ఇంగ్లాండు వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు. దాదాపుగా ఇంగ్లీషు మాట్లాడేటటువంటి దేశాలన్నింటిలోనూ తెలుగువాళ్ళు కొద్దొ గొప్పో వున్నారు. కొద్దిమంది ఇంగ్లీషు మాట్లాడని ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా వున్నారు. ఇంత దూరం వొచ్చినా మనం తెలుగు వాళ్ళమే, అంటే తెలుగు మీద ప్రేమ వున్న వాళ్లమే.

ఇంతకీ – తెలుగు మీద ప్రేమ అంటే ఏవిటి? మా అమ్మాయి తెలుగు పండితురాలవుతుందంటే నేను ప్రోత్సహిస్తాననే నమ్మకం లేదు నాకు. మీరు ఇంజనీర్లవక్కర్లేదు, డాక్టర్లవక్కర్లేదు, కంప్యూటర్‌ సైంటిస్టులవక్కర్లేదు, తెలుగు పండితులవండి చాలు అని మీ పిల్ల్లలతో అంటారని నాకు నమ్మకం లేదు. అయినా ఇక్కడ, మరీ ముఖ్యంగా అమెరికాలో, అప్పుడప్పుడు ఇంగ్లండ్ లో కూడా, తెలుగు నిలబెట్టాలనే మాట వినిపిస్తోంది. అమెరికాలో ఈమధ్య ఈ మాట మరీ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇలాటి సభల్లో.

మరి అమెరికాలో తెలుగు నిలబెట్టడం అంటే ఏమిటి? తెలుగువాళ్ళు అమెరికా వొచ్చిన మాట నిజమే. కాని అమెరికాలోకి తెలుగు వెళ్ళలేదు. తెలుగు మన ఇళ్ళల్లో ఉంది. ఇంట్లో పెద్దవాళ్ల మాటల్ల్లో వుంది. కాని అమెరికాలో తెలుగు లేదు. అమెరికా స్కూళ్లలో తెలుగు లేదు, ఒకటి రెండు జాగాలలో తప్ప, విశ్వవిద్యాలయాల్లో లేదు, గ్రంథాలయాల్లో లేదు, పుస్తకాల షాపుల్లో లేదు, రేడియోలో, టి.వి. లో లేదు. మన పిల్లలు అమెరికన్ ఇంగ్లీషు మాట్లాడుతున్నారు. పిల్లలు మనతో తెలుగు మాట్లాట్టం లేదే అన్న బెంగ ఇప్పుడిప్పుడే కలుగుతోంది మనకి. వాళ్ళు అమెరికన్లు అయిపోతున్నారు. వాళ్ళు ఒకవేళ కొద్దో గొప్పో తెలుగు మాట్లాడినా, వాళ్లు తెలుగు వాళ్ళు కారు. ఏదో ఒక ఉగాది రోజునో, సంక్రాంతి రోజునో పరికిణీలు కట్టుకుని, జడగంటలు పెట్టుకుని నాట్యం చేసినా, వాళ్ళు నిత్యజీవితంలో అమెరికన్లే.

తెలుగు, మీరు మీ యిళ్ళల్లో మాట్లాడుకుంటున్నంత వరకూ బాగానే ఉంటుంది. ఇంకో యాభై యేళ్ళ వరకూ నాకు హామీయే, ఇక్కడున్న పెద్ద వాళ్ళందరూ తెలుగులో మాట్లాడతారు, కొందరు తెలుగులో రాస్తారు, రచయితలూ, కవులూ అవుతారు. మీరు తెలుగులో పుట్టి, తెలుగులో పెరిగి ఇక్కడికి వొచ్చిన వాళ్ళు. అందుచేత హాయిగా ఉంటుంది మీతో తెలుగు మాట్లాడుతూంటే. ఇప్పుడు మీ పిల్లలూ, మీ మనవలూ కుటుంబాల్లో తెలుగు మాట్లాడాలని, వాళ్ళకి తెలుగు నేర్పాలనే ప్రయత్నం కొంత కొంత మనలో కనిపిస్తోంది. మన పిల్లలకి తెలుగు చెప్పాలని దీక్షగా పనిచేస్తున్న వాళ్లని ఓ పదిమందిని నేను ఎరుగుదును. వాళ్ళ ఆసక్తికి, శ్రద్ధకి, పిల్లలకి తెలుగు నేర్పడంలో వాళ్ల కృషికి నమస్కారాలు చెప్పాలి.

కాని, వాళ్ళు పాఠాలు చెప్పడానికి పుస్తకాలు లేవు, వాళ్ళు పాఠం చెప్పే పద్ధతులు లేవు.

మనం తెలుగు నేర్చుకోలేదు. మనకి తెలుగు వచ్చింది. ఏది మీరు నేర్చుకున్నారో, అది మీరు చెప్పగలరు. సంగీతం నేర్చుకుంటే, సంగీతం చెప్పగలరు. నాట్యం నేర్చుకుంటే, నాట్యం నేర్పగలరు. వంకాయ కూర చెయ్యడం మీకొస్తే వంకాయ కూర ఎలా చెయ్యాలో మీరు చెప్పగలరు. కానీ, తెలుగు మనం నేర్చుకోలేదు. ఏరకంగా తెలుగు మన మనస్సుల్లోకి ప్రవేశించిందో  ఏరకంగా తెలుగు మన శరీరంలో  భాగమైపోయిందో మనం చెప్పలేం. అంచేత తెలుగు పుట్టుకతో రానివాళ్లకి తెలుగు ఎలా చెప్పాలో మనకి తెలియదు.

నేను మా యింటి’కి’ వెళతాను. కానీ మా అమ్మ ‘దగ్గరికి’ వెళతాను. మా తాతయ్య ‘దగ్గరికి’ వెళతాను. కారు దగ్గరికి వెళతాను. ఇంటికి అన్నప్పుడు ‘కి’ అని ఎందుకు అంటాము? అమ్మ, తాతయ్య, ఇలాంటి మాటలు అన్నప్పుడు  ‘దగ్గరికి’ అని ఎందుకంటాం? అమ్మకి, తాతయ్యకి, కారుకి అని ఎందుకు అనం? అక్కడ ‘దగ్గర’ ఎందుకు పెడతాం, ఇక్కడ ఎందుకు మానేస్తాం?

మనం పుస్తకాలు కొనుక్కోవచ్చు, చొక్కా కొనుక్కోవచ్చు. కాని అన్నం కొనుక్కోం, భోజనం కొనుక్కోం, కాఫీ కొనుక్కోం. నేను కాఫీ  కొనిపెట్టను, కాఫీ ఇప్పిస్తాను. భోజనం కొనిపెట్టను, భోజనం పెట్టిస్తాను. మీకు చొక్కా కొనిపెడతాను. కొను అనే క్రియ తినే పదార్థాలకు ఎందుకు వాడం తెలుగులో?

నాకు ఆకలేస్తోంది. నాకు భయం వేస్తోంది. నాకు సంతోషంగా ఉంది. ఇంగ్లీషులో I am hungry అవుతుంది కదా, నేను ఆకలేస్తోంది అంటే ఎందుకు తప్పు?

మా యింటికి నేనొక్కణ్ణే యజమానిని. నా డబ్బుతోనే కొనుక్కున్నాను. అయినా మా యిల్లు అంటాను నేను. మీ అమ్మకి మీరు ఒక్కరే కొడుకో, కూతురో కావచ్చు. అయినప్పటికీ మీ అమ్మ అంటాను. నీ అమ్మ అంటే తిట్టు! ఏ కారణం చేత?

ఇంగ్లీషు పుట్టుకతో మాట్లాడడం వొచ్చిన వాళ్ల పలుకుబడిలో  take (తీసుకొను) అనే క్రియ భోజనానికీ, స్నానానికీ, కాఫీ లాంటి ద్రవ పదార్థాలకీ, సలహాకీ – ఉమ్మడిగా వాడతారు. మరి తెలుగులో భోజనం తీసుకోరు, స్నానం తీసుకోరు. వీటికి చెయ్యడం క్రియగా వాడాలి. మళ్లా భోజనం చెయ్యడం, వంట చెయ్యడం అనే మాటల్లో చెయ్యడం ఒకే అర్థంలో లేదు. అంటే, తెలుగులో  ప్రతి నామవాచకానికి ఒక నిర్దిష్టమైన క్రియ వుంది, ఆ క్రియకి చిన్న చిన్న అర్థచ్చాయలు ఉన్నాయి. ఆ క్రియలు ఇంగ్లీషులో మల్లే వుండవు.

ఈ వివరాలు మనకి ఇప్పుడున్న తెలుగు వ్యాకరణాలేవి చెప్పవు. ఆ వ్యాకరణాలు తెలుగు వొచ్చేసిన వాళ్ల కోసం రాసినవి.

అలాంటి వ్యాకరణాలు తెలుగు నేర్పడానికి పనికి రావు. తెలుగు మొదటి భాష కాని వాళ్ల కోసం వ్యాకరణాలు, భాషా బోధన విధానాలూ తయారు చెయ్యవలసిన అవసరం మనకి ఇంత వరకూ కలగలేదు. అంతే కాదు, ఆ బోధన విధానాలు ఇంగ్లీషు మాతృభాష అయిన వాళ్లకీ, ఇంకొక భారతీయ భాష మాతృభాష అయిన వాళ్లకీ వేరువేరుగా తయారు చెయ్యాలి అనే దృష్టి కాని, పిల్లలకి ఒకరకం గానూ, పెద్దవాళ్ళకి మరొక రకంగానూ, పుస్తకాలు తయారు చేయాలనే ఆలోచన కూడా మనకు కలగలేదు.

మన పిల్లల మాతృభాష ఇంగ్లీషు. అంటే మన పిల్లల మొదటి భాష ఇంగ్లీషు. వాళ్ళు ఇంగ్లీషులో ఊహిస్తారు, ఇంగ్లీషులో మాట్లాడతారు, ఇంగ్లీషులో ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు. వాళ్ళకి తెలుగు చెప్పటం ఎలా? ఫ్రెంచ్‌ నేర్చుకోవచ్చు, జర్మన్‌ నేర్చుకోవచ్చు, ఇటాలియన్‌ నేర్చుకోవచ్చు. మీకిష్టమొచ్చిన భాషలు నేర్చుకోవచ్చును. దానికి కావలిసిన పుస్తకాలు విడియోలు బోలెడు ఉన్నాయి. ఆ ఆ భాషలు ఎలా నేర్పాలో తెలుసుకొని, నేర్పేవాళ్ళున్నారు. ఆయా భాషల సాహిత్యం చెప్పేవాళ్ళున్నారు. అందుకు కావలసిన పరికరాలు తయారు చెయ్యడానికి కొన్ని వందలమంది పరిశోధనలు చేశారు. చాలా అమెరికన్‌ యూనివర్సిటీలలో ఈ.ఎస్.ఎల్ అంటే English as Second Language అని ఒక ప్రత్యేక విభాగం వుంటుంది. తెలుగు మాతృభాష కానివాళ్లకి తెలుగు నేర్పే విధానాలని గురించి ఆంధ్ర దేశంలో ఎన్ని యూనివర్సిటీలలో పరిశోధన చేస్తున్న వాళ్లున్నారో చెప్పండి నాకు.

తెలుగు విషయంలో ఈ భాష రెండో భాషగా నేర్పడానికి అనుసరించవలసిన పద్ధతులూ, రాయవలసిన పుస్తకాలూ తయరు చేసేవాళ్లని మనం తయారు చేసుకోవాలి. తెలుగు దేశంలో వున్న విశ్వవిద్యాలయాలలో వున్నతెలుగు భాషా శాస్త్రవేత్తలలొ ఈ రంగంలో పని చేసేవాళ్లని ఈ పని చెయ్యమని పురమాయించాలి. వాళ్లకి అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. అంటే వాళ్ళకి డబ్బిచ్చి, ఈ రంగంలో పరిశోధనలు చేసి, ప్రామాణికమైన పుస్తకాలు రాయమని చెప్పాలి. మనం ఎవ్వరమూ అడగక పోయినా ఇప్పటికే ఈ పని చేసిన ఒకరిద్దరు భాషాశాస్త్రజ్ఞుల్ని నేనెరుగుదును. ఒకరు, ప్రపంచ విఖ్యాత ద్రావిడ భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి గారు, రెండవ వారు, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ నించి ఈ మధ్యనే రిటైర్‌ అయిన పరిమి రామ నరసింహం గారు. తెలుగు రెండో భాషగా చెప్పడానికి కావలిసిన వ్యాకరణాలు రాసిన వాళ్లు వీరిద్దరూ. అయితే ఆ వ్యాకరణాలు పెద్దవాళ్ళ కోసం రాసినవి, అంటే కాలేజీ లో చేరే వయస్సున్న వాళ్లకోసం రాసినవి.

పైకి చెప్పక పోయినా తెలుగు భాష చవక అనే అభిప్రాయం ఒకటి మనలో చాలా గట్టిగా వుంది. చవక అంటే తక్కువ డబ్బుతో దొరికేది అని అర్థం. శని ఆదివారాల్లో మనలో ఉత్సాహవంతులు పిల్లలలకి తెలుగు చెప్పడం ఆనందించదగిన విషయం. వాళ్లు ఊరికే పనిచేస్తారు. వాళ్ళకి జీతాలివ్వక్కరలేదు. కాని, మన పిల్లలకి తెలుగు రావాలనుకుంటే అందుకు కావలసిన పెట్టుబడి మనం పెట్టాలి.

మన దగ్గిర డబ్బు లేక కాదు. తెలుగుభాష మీద ప్రేమ లేక కాదు. మనకు తెలుగుని ఏరకంగా పైకి తీసుకు రావాలో తెలియదు. డబ్బు ఎక్కడ  పెట్టాలో తెలియదు. డబ్బు పెట్టుబడిగా పెట్టేటప్పుడు ఫలానా కంపెనీలో షేర్లు కొనండి, ఫలానా కంపెనీలో పెట్టుబడి పెట్టండి అని చెప్తారు. సరిగ్గా అదే పద్ధతిలో తెలుగు మీద పెట్టుబడి పెట్టమని అడుగుతున్నాను. తెలుగు మీద ప్రేమని చూపించమని అడగట్లేదు. ఉదారంగా విరాళాలివ్వమని అడగటం లేదు నేను. తెలుగు మీద పెట్టుబడి పెట్టమంటున్నాను. పెట్టుబడి అంటే అర్థమేమిటి? దీనివల్ల లాభాలొస్తాయి, ఆ లాభాల వల్ల మీరు బాగుపడతారు. నేను షేర్లెందుకు కొంటాను? వాటి ధర పెరుగుతుంది,  నాకు లాభం వస్తుంది. నా డబ్బు ఎక్కువౌతుంది.

నేనెవ్వరినీ నిస్వార్థంగా పని చెయ్యమని అడగను. నిస్వార్థంగా పనిచేస్తున్నాననే వాళ్ళంటే నాకు భయం. మనకి స్వార్థం లేకపోతే ఇక్కడికి వొచ్చేవాళ్లం కాదు. స్వార్థం కోసమే ఇక్కడున్నాం. స్వార్థం తప్పు కాదు. కానీ తెలివైన స్వార్థం కావాలి. అజ్ఞానంతో కూడుకున్న స్వార్థం మన స్థానాన్ని తగ్గిస్తుంది. తెలివితేటలతో ఉన్న స్వార్థం మనకు ఉపయోగపడుతుంది.

తెలుగుని మన పిల్లల మనస్సుల్లో నిలబెట్టమని అడిగేది ఎందుకూ అంటే మీ స్వార్థం కోసం అడుగుతున్నాను. ప్రజాస్వామిక దేశాలలో అధికసంఖ్యాకుల కన్నా సంస్థాగతంగా కూడి ఉన్న తక్కువమందికి ఎక్కువ బలముంటుంది. ఈ సంగతి సాధారణంగా తెలీదు మనకి. మనం organized minority గా అవగలమా? ఆ organized minorityగా అవడానికి కావలిసిన ప్రయత్నంలో తెలుగు ఒక భాగం, ముఖ్యమైన భాగం. ఈ ముఖ్యమైన భాగం నిలబెట్టుకోవడంలో మన పిల్లలందరూ తెలుగు పండితులై పోవలసిన అవసరం లేదు. మీరు కోరుకున్నా అవరు వాళ్ళు, ఒకవేళ అయినా వాళ్ళు బాగుపడరు. అంచేత వాళ్ళు తెలుగు పండితులై పోవాలనీ, తెలుగులో రచనలు చేయాలనీ, కోరుకోకండి మీరు. వాళ్ళు తెలుగు నా భాష అనుకుంటే చాలు, మాట్లాడగలిగితే చాలు. వాళ్ళు ఒకరితో ఒకరు తెలుగు మాట్లాడుకుంటే అప్పుడు వాళ్ళకి మనం తెలుగు వాళ్ళం అనే భావన ఏర్పడుతుంది.

కానీ, తెలుగులో బాగా పని చేయగలిగిన వాళ్లు కొద్ది మంది కావాలి. వాళ్ళు పండితులవాలి. ఆ కొద్ది మందీ విశ్వవిద్యాలయాల్లో పని చేసేవాళ్ళు కావాలి. వాళ్లు తెలుగు వాళ్ళే అవక్కరలేదు. ఫ్రెంచివాళ్ళు కావచ్చు, ఇంగ్లీషువాళ్ళు కావచ్చు, జర్మన్లు కావచ్చు, అమెరికన్లు కావచ్చును. వాళ్ళు తెలుగులో పనిచేయాలి. వాళ్ళు తెలుగులో పెద్ద పని చేయాలి. చాలా కొద్దిమంది పనిచేస్తే చాలు. తెలుగు సాహిత్యం మీద పీహెచ్‌.డీలు చేసినవాళ్ళూ, గొప్పగొప్ప పుస్తకాలు రాసినవాళ్ళూ అందరూ తెలుగు వాళ్లే కానక్కర్లేదు. ఈ విషయం ఇంకొంచెం వివరంగా ఒక నిమిషంలో చెప్తాను.

ఈ మధ్య తరచూ  ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఆంధ్ర దేశంలో ప్రభుత్వపు ఖర్చు తోను, ఈ దేశంలో ఇదిగో ఇలా మన ఖర్చు తోనూ. నేను ప్రస్తుత సందర్భానికి అనుగుణంగా ఒక సంగతి అడుగుదాం అనుకుంటున్నాను. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి కదా, ప్రపంచ ఇంగ్లీషు మహాసభలు జరుగుతున్నాయా? ప్రపంచ ఫ్రెంచి మహాసభలు జరుగుతున్నాయా? ప్రపంచ జర్మన్‌ మహాసభలు జరుగుతున్నాయా? మరి ప్రపంచ తెలుగు మహాసభలు ఎందుకు జరుగుతున్నాయి? తెలుగు ప్రపంచభాష కాదు కాబట్టి.

తెలుగుని ప్రపంచభాష చేయాలి. అంటే, దానికి కావలిసిన పరికరాలేమిటి?

మనం ఒక ఉత్సాహంలో రెండు రోజులో మూడు రోజులో ఒకచోట చేరి, బ్రహ్మాండమైన ఉపన్యాసాలు చెప్పి, అంతకన్న బ్రహ్మాండమైన ఉపన్యాసాలు విని, ఎన్నాళ్లుగానో కలుసుకోలేక పోయిన తెలుగు స్నేహితులని మళ్ళీ పలకరించి, మంచి తెలుగు భోజనాలు చేసి, వెళ్ళిపోతాం.

ఎక్కడ చూసినా సరే, చిన్న చిన్న సంస్థలు, ఎక్కువ బలమైన ఏర్పాట్లు లేని సంస్థలను నేను చూశాను. సంస్థ అంటే కొన్ని తరాల పాటు నిలిచేది. విశ్వవిద్యాలయం ఒక సంస్థ. అది ఒక ఐదేళ్ళో, మూడేళ్ళో, నాలుగేళ్ళో ఉండి ఆగిపోదు. నడుస్తూ ఉంటుంది, కొన్ని వందల సంవత్సరాలు నడుస్తుంది.

మనం ప్రపంచం గుర్తించదగిన ప్రచురణ సంస్థలు నిర్మించాలి. విశ్వవిద్యాలయాలలోకి, లైబ్రరీలకి, పుస్తకాల షాపుల్లోకి ఆ సంస్థలు ప్రచురించిన పుస్తకాలు వెళ్లగలగాలి. హీబ్రూ లోంచి వచ్చినటువంటి అనువాదం పెద్ద పుస్తకాల షాపుల్లో తేలికగా దొరుకుతుంది. గట్టిగా ఐదుకోట్ల జనాభా ఉండరు వాళ్ళు. ఆ చాలా కొంచెం మంది ఈ దేశం మొత్తం మీద ఎంత ప్రభావం చూపిస్తున్నారో ఒకసారి చూడండి వెళ్ళి. విశ్వవిద్యాలయంలో హీబ్రూ డిపార్ట్‌మెంట్ లేని పెద్ద విశ్వవిద్యాలయం ఎక్కడుందో వెళ్ళి చూడండి. అలా అని, యూదుల కుటుంబాలలో ఉండేవాళ్ళందరూ హీబ్రూ నేర్చేసుకుంటున్నారా  – లేదు. వాళ్ళు ఇంగ్లీషే నేర్చుకుంటున్నారు. అయినా హీబ్రూ భాషని గౌరవిస్తారు. ఆ భాషలోంచి అనువాదమైన పుస్తకాలు వెంటనే కొంటారు. అవి లైబ్రరీలో ఉన్నాయో లేదో చూస్తారు. యూనివర్సిటీలో పాఠాలు చెప్తున్నారో లేదో అని చూస్తారు. హీబ్రూలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగేలా చూస్తారు. అమెరికాలో కూడా హీబ్రూ నేర్చుకోదలుచుకుంటే అన్ని అవకాశాలూ వున్నాయి. కొన్ని వేల లక్షల డాలర్లు అమెరికన్  యూనివర్సిటీలలో పెట్టుబడిగా పెట్టారు యూదులు.

విశ్వవిద్యాలయాలలో తెలుగు శాశ్వతంగా నిలబడడానికి కనీసం ఒకటి రెండు మిలియన్ల డాలర్లు కావాలి. మనం తల్చుకుంటే ఆ పని చెయ్యగలం. గత పాతిక ఏళ్ళుగా తెలుగు సంస్థలు  — ఒకప్పుడు ఒకటే వుండేది, ఇప్పుడవి నాలుగు అయ్యాయి – రెండేళ్లకొకసారి ఒకరితో ఒకరు పోటి పడి మహాసభలు నిర్వహిస్తారు. వాటి కోసం రెండురోజుల్లో కనీసం కొన్ని మిలియన్ల  డాలర్లు ఖర్చు పెడతారు  —  రాజకీయ నాయకుల కోసం, సినిమా తారల కోసం, ఇతర ఆనందాల కోసం. అందులో ఇరవయ్యోవంతు ఒకచోట తెలుగు నిధిగా చేర్చి వుంటే ఈపాటికి నాలుగయిదు విశ్వవిద్యాలయాల్లో తెలుగు endowed professorship ఏర్పాటు చెయ్యగలిగి వుండేవాళ్ళం. అయినా ఈ సంస్థల ముఖ్యులే తెలుగు దేశం వెళ్లి తాము తెలుగు పీఠాలు ఏర్పాటు చేస్తున్నామని ఉపన్యాసాలు చెప్తారు.

తెలుగు పీఠం అంటే, ఇప్పుడు అమెరికాలో రెండో మూడో యూనివర్సిటీలలో ఉన్నట్టు, తెలుగు నేర్పడానికి ఉన్న చిన్న లెక్చరరు స్థాయి ఉద్యోగం కాదు. అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో లెక్చరరు అంటే తాత్కాలికంగా పనిచేసే ఉద్యోగి. కొన్ని విశ్వవిద్యాలయాలలో నిరంతరం కొనసాగుతూనే వున్న, నిత్య తాత్కాలికతలో వుండే ఉద్యోగి. విశ్వ విద్యాలయాలో పీహెచ్.డీ.లని తయారు చేసే స్థాయి ఈ వ్యక్తికి ఉండదు. అంచేత, తెలుగు నిజంగా నిలబడాలంటూ ప్రొఫెసరు స్థాయిలో ఉద్యోగులు తెలుగు కోసం ఏర్పడాలి. ఇలాటి ప్రొఫెసరు స్థాయి ఉద్యోగులు సంస్కృతానికి ఉన్నారు. తమిళానికి ఉన్నారు. హిందీకి ఉన్నారు. తెలుగుకి లేరు.

యూనివర్సిటీలలో తెలుగు ప్రొఫెసర్లు ఏర్పడడానికి అమెరికాలో తెలుగు వాళ్ళు, తెలుగు దేశంలో తెలుగు వాళ్ళూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమూ కలిసి ఒక ప్రణాళిక వేసుకోవాలి. విశ్వవిద్యాలయాలలో తెలుగు సాహిత్య, సాంస్కృతిక విషయాల మీద పిహెచ్.డి.లు తయారయి, వాళ్ల పని ప్రపంచ వ్యాప్తం అయితే తప్ప తెలుగు ప్రపంచ భాషగా బయటికి రాదు. ఇంగ్లీషు ద్వారా, అలాంటి ఇతర ప్రపంచ భాషల ద్వారా తెలుగు గురించిన విజ్ఞానం ఇతర ప్రపంచ భాషల్లోకి వెళ్లడానికి చాలా కాలం పడుతుంది. అంత దీర్ఘకాల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తే తప్ప, వట్టి మాటల వల్ల తెలుగు ప్రపంచ భాష అయిపోదు. కంప్యూటర్లలో వాడడానికి తెలుగు ఫాంట్లు తయారు చేసి వాటిలో విడుదల చేసినంత మాత్రాన తెలుగు ప్రపంచభాష అయిపోదు.

ఇంతకన్న ముందుగా, ఆంధ్ర దేశంలో విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖల సంగతి చూడండి. అమెరికాలో తెలుగు ప్రొఫెసర్‌ స్థానాలు ఏర్పడ్డాయనే అనుకుందాం. ఆ స్థానాల్లో పని చెయ్యడానికి కావలసిన అర్హతలున్న వాళ్ళని తెలుగు శాఖలు తయారు చేస్తున్నాయా? అక్కడ తెలుగులో పిహెచ్.డి. పొందిన వాళ్ళు ఒక్కరైనా ప్రపంచంలో ఇతర దేశాల్లో తెలుగు ప్రొఫెసర్లు అవడానికి తగిన వాళ్లేనా? అమెరికాతో మొదలు పెట్టి ఏ ఇతర పాశ్చాత్య దేశాల్లోను, అచ్చంగా అంధ్రదేశంలో లాగా, తెలుగు శాఖలు వుండవు. ఇక్కడి దేశాల్లో దక్షిణ ఆసియా దేశాలని గురించి పాఠాలు చెప్పే శాఖలు ప్రాంతీయ అధ్యయన విభాగాల ఆవరణలో వుంటాయి. ఆ దక్షిణ ఆసియా దేశాల శాఖలలో విద్యార్థులు, దక్షిణ ఆసియా లోని భాషల్లో ఏదో ఒకదానిని ప్రధాన భాషగా నేర్చుకుంటారు, దానితో పాటు మరొక దక్షిణ ఆసియా భాష అప్రధాన భాషగా నేర్చుకుంటారు. ఇంతవరకూ దక్షిణ ఆసియా భాషలన్నీ — అంటే, సంసృతం. హిందీ, తమిళం, ఈ చాలా విశ్వవిద్యాలయాలలో దక్షిణ ఆసియా శాఖల్లోనే ఉన్నాయి. ఈ శాఖలు ఎలా పనిచేస్తాయి, అందులో పని చేసేవాళ్ళకి ఎలాంటి విద్యార్హతలు కావాలి అనే విషయాలు తెలుగు దేశంలో ఏ విశ్వవిద్యాలయపు తెలుగు శాఖా తెలుసుకోడానికి ప్రయత్నించలేదు. తెలుగు దేశపు పరిమిత అవసరాల కోసం ఏర్పడ్డ ఈ శాఖలకి తమ విద్యార్థుల్ని ఇతర దేశాలకి పంపి అక్కడి విశ్వవిద్యాలయాలలో పని చెయ్యడానికి తగిన వాళ్ళుగా తీర్చి దిద్దవలసిన అవసరం ఇంతవరకూ కలగలేదు. మరి ఇప్పుడు తెలుగుని ప్రపంచ భాషగా చెయ్యాలన్న ఆలోచన నెరవేరాలంటే, తెలుగు దేశంలో వున్న విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు ప్రపంచ దృష్టి అలవరుచుకోవాలి.

పుస్తకాల ప్రచురణ దగ్గరికొస్తే  ఇంకా అన్యాయంగా వుంది మన పరిస్థితి. పుస్తకాలు బోలెడు అచ్చు వేస్తున్నాం. కొన్ని చాలా అందంగా కూడా అచ్చు వేస్తున్నాం. కొన్ని అందంగా అచ్చు అయినా, ఆ పుస్తకాలు అమ్ముడు పోయిన తరవాత మళ్ళా ఎక్కడ దొరుకుతాయో తెలీదు నాకు. పంతొమ్మిదివందల పదిలో, ఇరవైలో, పదిహేనులో, ముప్పైలో అచ్చైన పుస్తకాల కోసం నేను వేటాడుతున్నాను, దొరకవు ఆ పుస్తకాలు. ఏ అక్కిరాజు రమాపతి రావు వంటివాళ్ళో వెళ్ళి ఆ లైబ్రరీల్లో, ఆర్కైవుల్లో, వాళ్ల దగ్గిర, వీళ్ల దగ్గిర ప్రాధేయపడి సంపాదించుకోవాలి. ఎందుచేత ఒక్క లైబ్రరీలో ఆ పుస్తకాలు అన్నీ లేవు? ఎందుచేత ఆ పుస్తకాలు నాకు దొరకవు? అచ్చైన పుస్తకాలు ఈవాళ తాళపత్ర  ప్రతులకన్నా కష్టం సంపాదించడం. ఎంచేత? ఎవరూ దాచిపెట్టరా పుస్తకాలు. ఏ లైబ్రరీలోనూ లేవు. అంటే మనం అలాంటి సంస్థల్ని నిర్మించలేదు.

ఎవరి పుస్తకాలని వాళ్ళు వేసుకుని, అమ్ముకోవడమో, అమ్ముకోలేకపోతే ఊరికినే పంచుకోవడమో చేస్తున్నారు మన రచయితలూ, కవూలూను. ఎవరి పుస్తకాలు వాళ్ళమ్ముకునే దశలో ఎందుకున్నాం మనం? మనకు చెప్పుకోతగ్గ ప్రచురణ సంస్థలు ఎందుకు లేవు? ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురణ సంస్థ ఒక పుస్తకం వేస్తే, కొన్ని వందల సంవత్సరాల తరవాత కూడా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఉంటుందా పుస్తకం. తిరిగి తిరిగి మళ్ళా అచ్చు వెయ్యకపోయినా కనీసం వాళ్ళ దగ్గిర ఆ పుస్తకం దొరుకుతుంది. అల్లాంటి ప్రచురణ సంస్థలు నిర్మించలేక పోవడం తెలుగు వారికి తెలుగు మీద ఆసక్తి లేదు అని చెప్పడానికి ఒక గుర్తు.

తెలుగులో వున్న విజ్ఞానంలో ఏది ప్రపంచం నేర్చుకోవాలి? ఏది నేర్చుకోకపోతే ప్రపంచ విజ్ఞానానికి నష్టం? మనం ప్రపంచానికి అందించిన విజ్ఞానం వుందా? వుంది, అని చెప్పే సామాజిక స్థైర్యం తెలుగుదేశం ఎప్పుడో కోల్పోయింది. తెలుగులో ఒకప్పుడు ఉండే సాంస్కృతిక నాయకులు, కొమర్రాజు లక్ష్మణ రావులూ, గిడుగు రామ్మూర్తులూ, గురజాడ అప్పారావులూ ఇప్పుడు లేరు. ఇప్పుడు మనకున్న వాళ్ళంతా రాజకీయ నాయకులే. రాజకీయంగా ఉద్యోగాలు పోయినవాళ్లు  సంస్కృతి గురించీ, భాష గురించీ మాట్లాడతారు. ఎందుకు? మళ్ళా రాజకీయాల్లో ఉద్యోగం సంపాదించుకోడానికి. ఇంకొందరికి తెలుగు అంటే ఒక అమాయకమైన ప్రేమ. తెలుగు మీద వాళ్లకి వున్న ఆ అమాయకమైన ప్రేమ ప్రకటించుకోడానికి ఈ ఉద్యాగాలు పోయిన రాజకీయ నాయకులు అవకాశం ఇస్తారు. ఫలితం: ఖరీదయిన  ప్రపంచ తెలుగు మహాసభలూ, అంతులేని ఉపన్యాసాలూ, పత్రికల్లో ఫొటోలూను. ఆశ్చర్యమేమిటంటే ఈ జట్టులో అమెరికాలో వున్న తెలుగు సంస్థలలో ప్రముఖులు కూడా చేరడం. అమెరికాలో తెలుగు మూడు పువ్వులూ ఆరు కాయలుగా అభివృద్ధి చెందిపోతోందని తెలుగు దేశంలో ఉపన్యాసాలివ్వడం.

ఈ సభలు ప్రపంచంలో తెలుగు ప్రపంచభాషగా నిలబడడానికి ఏమీ చెయ్యవు. ఈ ఉపన్యాసాల మంత్రాల వల్ల ప్రపంచ వైజ్ఞానిక లోకంలో తెలుగు చింతకాయలు రాలవు.

ఒక భాషని రెండో భాషగా నేర్పడానికి ప్రత్యేకమైన శిక్షణ కావాలి. ఆ రకమైన శిక్షణ పొందడానికి ఉత్సాహవంతులైన తెలుగు వాళ్ళు ప్రయత్నం చేయాలి. వాళ్ళు స్కూళ్ళలో, కాలేజీలలో విశ్వవిద్యాలయాల్లో తెలుగు నేర్పే రోజు వొస్తే అమెరికాలో తెలుగు నిలబడుతుంది. ఆపైన ఇంకా విశ్వవిద్యాలయాలతో మనం కలిసి పనిచేస్తే, తెలుగుకి ప్రొఫెసరు స్థాయిలో యూనివర్సిటీలలో ఉద్యోగాలు నెలకొల్పగలిగితే, అప్పుడు వాళ్ళ కృషి ఫలితంగా తెలుగు ప్రపంచ భాష అవుతుంది.

ప్రపంచ స్థాయిలో తెలుగు గురించి తెలుసుకునే వాళ్ళు, తెలుగు లో వున్న సాహిత్యాన్నీ, ఇతర వైజ్ఞానిక సమాచారాన్నీ అంది పుచ్చుకునే వాళ్లు  ప్రపంచవ్యాప్తంగా వుంటారు. మన పిల్లలు ఏ స్కూల్లో చేరినా, ఏ విశ్వవిద్యాలయంలో చేరినా తెలుగు చదువుకునే వసతులు ఏర్పడతాయి. మన పిల్లలే కాదు ఇతర పిల్లలు కూడ తెలుగు నేర్చుకుంటారు.

మన భాష ఏదో మన ఇళ్ల్లల్లో పెద్దవాళ్ళు మాట్లడుకునే ఒకరకమైన పిచ్చి భాష అనే అభిప్రాయం పోయి, ఇది ప్రపంచంలో గొప్ప నాగరిక భాషల్లో ఒకటి అనే నిబ్బరం మన పిల్లల్లో ఏర్పడుతుంది.

నమస్కారం.
----------------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: