Thursday, October 18, 2018

త్రిపదలు


త్రిపదలు

సాహితీమిత్రులారా!


పరిచయము
భారతీయ సాహిత్యములో పద్యములన్నియు సామాన్యముగా చతుష్పదలు; ద్విపదలను కూడ కొన్ని సమయములలో నుపయోగిస్తారు. కాని త్రిపదలు చాల అరుదుగా మన కళ్లకు కనబడుతాయి. ఇటీవలి కాలములో జపాను సాహిత్యమునందలి హైకూల ప్రభావమువలన త్రిపదలను హైకూల రూపములో మనము అప్పుడప్పుడు చదువుతుంటాము. కాని ఈ హైకూలను కూడ అలా జపాను సంప్రదాయరీత్యా కాని లేకపోతే మరేవైనా నియమములతో గాని అందఱు వ్రాయడము లేదు, ఎవరికి తోచినట్లు వారు వ్రాస్తున్నారు. వాటిలో భావసాంద్రత ఉన్నా, శిల్పములో లోపములు ఉన్నవేమోనని అనిపిస్తుంది. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము ఛందశ్శాస్త్రములోని త్రిపదలనుగుఱించి సంక్షిప్తముగా చర్చించుటయే.

వేదములలో త్రిపదలు
ఋగ్వేదమును ప్రపంచములో అతి ప్రాచీనమైనదో లేక అతి ప్రాచీనమైన గ్రంథములలో నొకటిగానో పరిగణిస్తారు. ఋగ్వేదములో మొట్టమొదటి పద్యము గాయత్రీఛందములోని త్రిపదయే. అది –

అగ్నిమీళే పురోహితం
యజ్ఞస్త్వ దేవ మృత్విజం
హోతారం రత్నధాతమం – ఋగ్వేదము 1.001.01

(అగ్ని నుచ్ఛుఁ బురోహితున్
యజ్ఞదేవుని ఋత్విజున్
ప్రార్థింతు సర్వభాగ్యదున్)

అదే విధముగా సంధ్యావందనము చేసేటప్పుడు ఉచ్చరించే గాయత్రీమంత్రము కూడ ఒక త్రిపదయే-

ఓం భూర్భువః స్వః
తత్సవితుర్వరేణ్యం (వరేణియం)
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్

(సవితృని మహత్వమున్
భువిపై మనమందగన్
కవించ బ్రస్తుతింతమా)

వేదములలో గాయత్రీఛందము (పాదమునకు ఆఱు అక్షరములు ఉండే వృత్తముల ఛందము కూడ గాయత్రియే, కాని అవి త్రిపద గాయత్రికి చేరినవి కావు) ప్రసిద్ధి కెక్కినది. ఈ త్రిపదగాయత్రిలో పాదమునకు ఎనిమిది అక్షరములు ఉంటాయి (గాయత్ర్యా వసవః), సామాన్యముగా చివరి నాలుగు అక్షరాలు IUIU రూపములో నుంటాయి (I – లఘువు, U – గురువు).

గాయత్రీఛందము మాత్రమే కాదు, ఇంకను ఇతర విధములైన త్రిపదలు కూడ వైదిక ఛందస్సులో నున్నాయి [1]. అవి ఉష్ణి, కకుప్(భ్), పురాఉష్ణి.

ఉష్ణికి సూత్రము – ఉష్ణిగ్గాయత్రౌ జాగతశ్చ – (పింగళ ఛందస్సు 3.18). ఈ త్రిపదలో మొదటి రెండు పాదములకు గాయత్రివలె ఎనిమిది అక్షరాలు, మూడవ పాదమునకు జగతివలె పండ్రెండు అక్షరాలు, అనగా పాదములలోని అక్షరముల అమరిక 8-8-12. ఉదాహరణకు ఋగ్వేదములోని క్రింది పద్యము –
తా వాం విశ్వస్య గోపా
దేవా దేవేషు యజ్ఞీయా
ఋతావానా యజసే పూతదక్షసా – ఋగ్వేదము, 8.025.01

(అన్నిటిని కాపాడే మిమ్ములను నేను పూజిస్తున్నాను. మీరు దేవతలు, దేవతలలో నుత్తములు, ధర్మమును నియతితో పాటిస్తారు, మీ యీ శక్తి పవిత్రమైనది)

మధ్య పాదములో 12 అక్షరముల జగతి, మొదటి మూడవ పాదములలో 8 అక్షరముల గాయత్రి అమరికతో (8-12-8) నున్న దానిని కకుప్ లేక కకుభ్ అంటారు. దీని సూత్రము కకుమ్మధ్యే చేదంత్యాః – (పింగళ ఛందస్సు 3.19). ఋగ్వేదమునుండి దీనికి ఉదాహరణ –
ఆ గంతా మా ఋషణ్యత
ప్రస్థావానో మాప స్థాతా సమన్యవః
స్థిరా చిన్ నమయిష్ణవః – ఋగ్వేదము 8.020.01

(వేగముగా పయనించే మిమ్ములను ఎవ్వరు ఆపలేరు. స్ఫూర్తిమంతులైన మీరు ఇక్కడికి రండి, దూరముగా నుండకండి, ఎంత కఠినమైన వస్తువునైనను మీరు వంచగలరు)

12-8-8 అక్షరముల అమరికతో నుండే పద్యమును పురాఉష్ణి అంటారు. (పురాఉష్ణిక్పురః – పింగళ ఛందస్సు 3.20). దీనికి ఉదాహరణ –
యాథా వాసంతి దేవాస్ తథేద్ అసత్
తాదేశాం నకిర్ ఆ మినత్
అరావా చన మర్తియః – ఋగ్వేదము 8.028.04

(దేవతలు ఏమి కోరుకొంటారో, అదే విధముగా జరుగుతుంది. అసురులు గాని, మనుజులు గాని ఈ దైవశక్తిని తగ్గించలేరు)

కకుభ్ ఛందపు అమరికలో ఒక తెలుగు పద్యమును క్రింద ఇస్తున్నాను. పాదాలను మార్చితే ఇదే పద్యమును ఉష్ణిగా, పురాఉష్ణిగా కూడ మార్చవచ్చును. –

హరీ నా హృదయమ్ములో
చిరమ్ముగా స్థిరమ్ముగా మనంగ రా
స్మరింతు ననయమ్ము నిన్

ఉష్ణి, కకుభ్, పురాఉష్ణిలవలె నున్న అక్షరాల అమరికతో మాత్రాగణములతో ఎలా పద్యములను సృష్టించవచ్చునో అనే విషయమును తఱువాత వివరిస్తాను.

తమిళములో త్రిపదలు
వెణ్బా అనే తమిళ ఛందోప్రక్రియను రెండు పాదములనుండి 1000 పాదములవఱకు వ్రాయవచ్చును. ఈ వెణ్బాకు ప్రతి పాదములో నాలుగు శీరులు (గణములు) ఉంటాయి, చివరి పాదములో మాత్రము మూడే ఉంటాయి. రెండు పాదముల వెణ్బాను కురల్ వెణ్బా అంటారు. అలాగే మూడు పాదముల వెణ్బా కూడ ఉన్నది. వీటిని చిందియల్ వెణ్బా అంటారు [2]. కొన్ని వెణ్బాలలో మొదటి రెండు పాదములకు మాత్రమే ప్రాస ఉంటుంది. ఇవిగాక వెణ్‌తాళిశై అని కూడ త్రిపదలు ఉన్నాయి. పాదములలో నాలుగు గణములకన్న ఎక్కువగా ఉండే వెణ్బాలు కూడ ఉన్నాయి. క్రింద ఒక రెండు ఉదాహరణలు –

ఇళమళై యాడు మిళమళై యాడు
మిళమళై వైగలు మాడుమెన్ మున్‌గై
వళై నెగిళ వారాదోన్ కున్ఱు – కలిత్తొగై 25

(నా ముంజేతులనుండి గాజులు జారేటట్లు చేసినవాడు పెద్ద కొండైనా కూడ వానజల్లులా మాత్రమే ఉంటాడు; అది కొంతసేపు కురిసే జల్లుకాదు, రోజంతా కురిసే వానజల్లు)

ఆర్వుట్రార్ నెంజమళియ విడువానో
వోర్వుట్రెరుదిఱ మొల్గాద నోగో
లఱంబురి నెంజత్తవన్ – కలిత్తొగై 42

(ఏ ఒకవైపు మొగ్గకుండా ఉండే త్రాసుముల్లులా ధర్మమును అనుసరించేవాడు తన్ను ప్రేమించినదాని మన్సును నాశనము చేస్తాడేమో? [చేయడనుకొంటాను])

వళైందదు విల్లు – విళైందదు పూశల్
ఉళైందన ముప్పురం ఉందీపఱ
ఒరుంగుడన్ వెందవా రుందీపఱ – తిరువాశగం, శివపురాణం, 14.1

(విల్లు వంగింది, యుద్ధము ఆరంభమైనది. త్రిపురములు నశించి బూడిదగా మారింది. ఆ మంచి వార్తను తలచుకొంటే అత్యద్భుతమైనదిగా తోచుతుంది. ఇదొక ఆనంద ఘడియ.)

చివరి ఉదాహరణను కొందఱు 4-6 శీరులతోడి ద్విపదగా భావిస్తారు.
కన్నడములో త్రిపదలు
ఎనిమిదవ శతాబ్దపు ప్రారంభములో బాదామిలో ఒక శిలాశాసనముపైన కప్పె ఆరభట్ట అనే ఒక వీరుడిని పొగడుతూ ఐదు పద్యములు ఉన్నాయి. అందులో మూడు త్రిపదులు. మనకు ఇప్పుడు దొరికిన కన్నడ త్రిపదులలో ఇవియే పురాతనమైనవి.

సాధుగె సాధు మాధుర్యంగె మాధుర్యం
బాధిప్ప కలిగె కలియుగ విపరీతన్
మాధవ నీతన్ పెఱనల్ల

(సాధువునకు సాధు – స్వాదువునకు స్వాదు
బాధించు వాని – వధియించు యముఁడగు
మాధవుఁ డితఁడు – మఱొకండె)

ఒళ్ళిత్త కెయ్వొరార్ పొల్లదు మదఱంతె
బల్లిత్తు కలిగె విపరీతా పురాకృత
మిల్లి సంధిక్కు మదు బందు

(అతఁడు మంచికి మంచి – అతఁడు చెడుకు చెడు
అతఁడు బలుండు, – పూర్వజన్మల పుణ్య
మతని సంధించెఁ గలిలోన)

కట్టద సింఘమన్ కెట్టొడే నెమగెందు
బిట్టవొల్ కలిగె విపరీతం గహితర్కళ్
కెట్టర్ మేణ్ సత్త రవిచారం

(కట్టుటయు, వదలి-బెట్టుటయు సరికాదు
దిట్టపు సింహ-మును, కలియుగమందు
మెట్టె నరులను ద్రుటిలోన)

పై పద్యములలో మొదటి దానికి తప్ప మిగిలిన వాటికి సరియైన త్రిపది లక్షణములు లేవు. ఏది ఏమైనా క్రీస్తుశకము ఏడు, ఎనిమిది శతాబ్దాలకే కన్నడ కవులు త్రిపదులను వాడినారు. కన్నడములో మనకు నేడు లభ్యమైన పుస్తకాలలో మొదటిదైన కవిరాజమార్గము అనే లక్షణగ్రంథములో కూడ త్రిపది గుఱించిన ప్రస్తావన ఉన్నను త్రిపదిఛందస్సులో పద్యము మాత్రము లేదు. కాని పంపాది కవులు త్రిపదిలో వ్రాశారు. అంశ లేక ఉపగణములతో నిర్మించబడిన త్రిపది తాళయుక్తము కాదని శార్ఙదేవుడు అభిప్రాయపడినప్పటికీ చక్కగా వ్రాస్తే త్రిపదులను కూడ తాళయుక్తముగా పాడుకొనవచ్చును.

నాగవర్మ ఛందోంబుధిలో [3] త్రిపది లక్షణములు ఈ విధముగా చెప్పబడినవి –

బిసరుహోద్భవగణం – రసదశ స్థానదొళ్
బిసరుహనేత్ర గణమె బర్కుళిదువు
బిసరుహనేత్రే త్రిపదిగె – 5.299

(బిసరుహోద్భవమగు – రస దశ స్థానముల్
బిసరుహనేత్ర-గణము లితరములు
బిసరుహనేత్ర త్రిపదికి

ఓ పద్మాక్షీ, ఆఱవ (రస), పదవ (దశ) గణములు బ్రహ్మగణములుగా నుండాలి, మిగిలినవి విష్ణుగణములు త్రిపదికి)

తుది గణము విష్ణుగణముగా నుండినయెడల దానిని చిత్ర అనియు, రుద్ర గణముగా నున్న దానిని చిత్రలత అనియు పిలిచెదరు. చిత్రలతకు బదులు విచిత్రము అని ఉండవలయునని ప్రసిద్ధ లాక్షణికులు భావిస్తారు. త్రిపదిగుఱించి దీర్ఘముగా కర్కి, వెంకటాచల శాస్త్రి చర్చించారు [4, 5].

జయకీర్తి తన ఛందోనుశాసనములో [6] త్రిపది లక్షణములను క్రింది విధముగా వివరించాడు –

కరకరాబ్ధిత్ర్యంశ – చరణా దిగ్రసరతిః
స్మరమయీ లాది గిరిహరాంశా
విరమణాచ్చిత్రా త్రిపదికా – 7.09

(పదకొండు (కర, కర, అబ్ధి) గణములు, మూడు పాదములు, పదవ (దిక్), ఆఱవ (రస) గణములు రతి (బ్రహ్మ) గణములు, మిగిలినవి మదన (విష్ణు) గణములు, ఏడవ (గిరి), పదునొకండవ (హరాంశ అనగా ఏకాదశ రుద్రులు) గణములు లఘ్వాదిగా నుండవలెను చిత్ర అనే త్రిపదికి)

తరువాతి కాలములో (సుమారు 12వ శతాబ్దము) కన్నడములో త్రిపద మాత్రాగణస్వరూపమును దాల్చినది. విష్ణు గణములకు పదులు పంచమాత్రలను, బ్రహ్మ గణములకు బదులు త్రిమాత్రలను ఉపయోగించారు.

సర్వజ్ఞుని త్రిపదులు
కన్నడములో ప్రజాకవి, సంఘ సంస్కర్త సర్వజ్ఞ అనే మకుటముతో సుమారు 16వ శతాబ్దములో ఎన్నియో త్రిపదులను వ్రాసినాడు. అవి ఈ నాటికి కన్నడ దేశములో బహుళ జనాదరణతో పాడబడుచున్నవి. మచ్చుకు నేను అనువదించిన కొన్ని సర్వజ్ఞుని త్రిపదులను ఇక్కడ చదువవచ్చును –

ఒబ్బనల్లదె జగకె ఇబ్బరుంటే మత్తె
ఒబ్బ సర్వజ్ఞ కర్తనీ జగకెల్ల
ఒబ్బనే దైవ సర్వజ్ఞ – దైవ 19

ఒకడెగా జగమునకు – నకట నిర్వురు గలరె
నొకడు సర్వజ్ఞు – డొడయడీ జగమునకు
నొకడె దైవమ్ము సర్వజ్ఞ

గురువింద బంధుగళు – గురువింద దైవగళు
గురువింద లిహుదు – పుణ్యవదు జగకెల్ల
గురువింద ముక్తి సర్వజ్ఞ – గురుమహిమె 15

గురువుచే బంధువులు – గురువుచే దైవములు
గురువుచే గల్గు – గొప్ప పున్నెము లిలను
గురువుచే ముక్తి సర్వజ్ఞ

జ్ఞానదిం మేలిల్ల – శ్వాననిం కీళిల్ల
భానువిందధిక – బెళకిల్ల జగదొళగె
జ్ఞానవే మిగిలు సర్వజ్ఞ – జ్ఞాన 43

జ్ఞానమున కధికమ్ము – శ్వానమున కధమమ్ము
భానువున కంటె – భాసమ్ము లేదు ధర
జ్ఞానమే మిన్న సర్వజ్ఞ

ఆగబా ఈగబా – హోగిబా ఎన్నదలె
ఆగలే కరెదు – కొడువవర ధరమ హొ-
న్నాగదే బిడదు సర్వజ్ఞ – దాన 62

మాపురా మఱలిరా – రేపురా యనకు, నీ-
వాపకుం డీయు – మప్పుడే యది హేమ-
మైపోవు నిజము సర్వజ్ఞ

కులవిల్ల యోగిగె – చలవిల్ల జ్ఞానిగె
తొలెగంబవిల్ల – గగనక్కె, స్వర్గదలి
హొలెగేరి యిల్ల సర్వజ్ఞ – కుల 79

కులమేది యోగులకు – చల మేది జ్ఞానులకు
అల నింగి కేది – అంటు దూలము, దివిని
వెలివాడ లేదు సర్వజ్ఞ

హాలుబోనవు లేసు – మాలె కొరళిగె లేసు
సాలవిల్లదన – మనె లేసు బాలరా
లీలె లేసెంద సర్వజ్ఞ – బడతన 126

పాలన్నమది బాగు – మాల మెడలో బాగు
బాలకుని యాట – బాగు, ఋణహీనతయు
మేలు గృహమందు సర్వజ్ఞ (పేదఱికము 126)

స్త్రీల పాటగా త్రిపది – కన్నడములో జానపద గేయాలలో, స్త్రీల పాటలలో త్రిపదులు ఉన్నాయి. మచ్చుకు ఒక ఉదాహరణ –

తౌరూరు హాదీలి గిడవెల్ల మల్లిగె
హూవరళి పరిమళ ఘమ్మెందు నా కొయ్దు
గిడకొందు హూవ ముడివేను

పుట్టింటి దారిలో – చెట్టంత మల్లెలే
దట్టమౌ తావి – ప్రతి చెట్టు విరి గోసి
పెట్టుకొంటాను జడలోన

కొన్ని కర్ణాటక త్రిపదులు – కన్నడములో త్రిపదను పాడుకొనడానికి అనుకూలముగా మఱొక విధముగా కూడ వ్రాస్తారు. జగన్నాథ విట్ఠలుడు వ్రాసిన ఒక ఉదాహరణ –

జ్ఞాన సుజ్ఞాన ప్ర-జ్ఞాన విజ్ఞానమయ
మాణవకరూప వసుదేవ తనయ సు-
జ్ఞానవను కొట్టు కరుణిసో

(జ్ఞాన సుజ్ఞాన ప్ర-జ్ఞాన విజ్ఞానమయ
మాణవకరూప వసుదేవ తనయ సు-
జ్ఞానము నొసంగి కరుణించు
మాణవక = శిశువు)

ఈ త్రిపదను పాడేటప్పుడు రెండవ పాదములో వసుదేవ పదమును క్రింది విధముగా మళ్లీ ఉపయోగిస్తారు –

జ్ఞాన సుజ్ఞాన ప్ర-జ్ఞాన విజ్ఞానమయ
మాణవకరూప వసుదేవ, వసుదేవ తనయ సు-
జ్ఞానవను కొట్టు కరుణిసో

ఇలాటి ప్రయోగముతో తెలుగులో రెండు ఉదాహరణములను క్రింద ఇచ్చాను –

త్రిభువనాల్, త్రిపదములు, నభముపై, భూమిపై
ప్రభువు బలి పైన పదమెత్తె, పదమెత్తె మోహనుం-
డభయ హస్తాలతో మహిని

ఒక పదము కన వాంఛ, యొకటి కను యనుభూతి,
యొక పదము కనగ తన్మయత, తన్మయత త్రిపదలో
ప్రకటించె నగుచు రాధమ్మ

పంచమాత్రలు, త్రిమాత్రలతో నేను వ్రాసిన కొన్ని కర్ణాటక త్రిపదలు –

శిశిరకాల వర్ణన-
పత్రములు రాలినవి – ధాత్రీజములనుండి
చిత్రమగు వర్ణ – శృంగారముల నిండి
ధాత్రి కంబళము – కన రండి

ప్రేయసీప్రియుల తలంపు-
నిన్ను జూడగ గోరె – చిన్న మన సీ ఘడియ
నిన్ను స్పర్శించ – నే నేంతు ప్రతి ఘడియ
కన్నెత్తి చూడు – మీ ఘడియ

రైతుల ఆత్మహత్య-
ఒక వైపు దారిద్ర్య – మొక వైపు ఋణ బాధ
ఒక వైపు యేడ్పు – ఒక వైపు క్షుద్బాధ
ఇక నాకు శరణు – ఉరి త్రాడు

పత్రికలలో వచ్చిన గుడియాపై-
రణభూమి జనె పతియు – తను మఱలి రాలేదు
మనసు శిల జేసి – మఱల పెండ్లాడితిని
కనవచ్చె నేడు – నను, విధీ

తెలుగులో త్రిపదలు
మలయాళ భాషలో చాల అరుదుగా త్రిపదలు అగుపిస్తాయి. హిందీలో ఇది ఉన్నట్లు లేదు. తెలుగులో మొదటి ఛందోగ్రంథమైన కవిజనాశ్రయములో [7] కన్నడ త్రిపది లక్షణములే చెప్పబడినవి –

త్రిదశేంద్రు లాఱగు – పదియగు నెడనకున్
గదియ రెంటను మూఁట
నదుకుడుఁ ద్రిపదకు నమరు

త్రిదశేంద్రు లాఱగు – పదియగు నెడనకున్
గదియఁగ రెండిటను మూఁట సూర్యుల
నదుకుడుఁ ద్రిపదకు నమరు

(కవిజనాశ్రయము, జాత్యధికారము 31, పరిష్కృత పాఠము [8] నుంచి.)

దీని ప్రకారము, త్రిపదకు మొదటి రెండు పాదాలలో నాలుగు గణములు, మూడవ పాదములో మూడు గణములు ఉంటాయి. అందులో ఆఱవ, పదవ గణములు సూర్యగణములు, మిగిలినవి ఇంద్రగణములు. మొదటి పాదములో ప్రాసయతి గలదు. నా అభిప్రాయములో త్రిపద యొక్క ఒక గొప్ప ప్రత్యేకత ఏమనగా దీనికి అక్షరసామ్య యతి లేదు. తెలుగు ఛందస్సులో జాతులలో యతి లేని రెండు పద్యములు – త్రిపద, షట్పద. వీటికి ప్రాసయతులే. బహుశా ఈ కారణము వలన నేమో ప్రాచీన కవులు ఈ యతి లేని ఛందస్సులను ఏ కావ్యములో కూడ వాడలేదు. తఱువాతి కాలములో త్రిపద లక్షణములు మారినను, ఈ యతిరాహిత్య నియమము మాత్రము మారలేదు.

కవిజనాశ్రయకర్త త్రిపద విషయములో సంపూర్ణముగా కన్నడ ఛందస్సును అనుసరించాడు.కాని విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణిలో [9] త్రిపద లక్షణాలను క్రింది విధముగా వివరించినాడు –

త్రిపదికి నొక యంఘ్రి – నింద్రులు నలువురు
ద్యూప్తు లిద్దఱు సూర్యు లిర్వు రౌల
ద్యుపతిద్వయార్కులు నౌల – కా. చూ. అష్టమోల్లాసము 60

దీని ప్రకారము త్రిపద మొదటి రెండు పాదములు సీసపాదముతో సరిపోతాయి. మూడవ పాదములో రెండు ఇంద్రగణములు, ఒక సూర్యగణము. కన్నడ త్రిపదిలోని సూర్యగణము చివర చేరినది ఇందులో. అంతే కాదు, మొదటి పాదములో ప్రాసయతి లేదు.

తఱువాత అనంతుని ఛందములో [10] నేటి త్రిపద లక్షణములు ఉన్నాయి –

సరవిఁ బ్రాసము నొంది – సురపతుల్ నలువురు
హరియు గై కార్కులు కలియ
జరగు నిప్పగిదియై త్రిపద – ఛందోదర్పణము, తృతీయాశ్వాసము 47

మొదటి పాదములో ప్రాసయతితో నాలుగు ఇంద్రగణములు, రెండవ, మూడవ పాదములలో రెండు ఇంద్ర గణములు, ఒక సూర్య గణము. అక్షరసామ్య యతి లేదు.

తెలుగు త్రిపదలోని యతి రాహిత్యమును అప్పకవి [11] స్పష్టముగా తెలిపినాడు –

తొలుతను నల్వు రిం-ద్రులు రెంట మూఁటను
బలభిద్ద్వయంబును రవియు
వళిలేక నలరారుఁ ద్రిపద – అప్పకవీయము, చతుర్థాశ్వాసము 283

కాని లక్షణ పద్యములో సామాన్య యతిని (తొ-ద్రు) కూడ వాడియుండుట కాకతాళీయమా? పొత్తపి వేంకటరమణకవి [12] కూడ మూడు త్రిపదలలో త్రిపద లక్షణములను ఇలా వివరించినాడు –

సరవి మొదల పురం-దర గణములు నాల్గు
పరఁగ రెండవ మూడు పదము
ల రచియింపఁదగు నింద్రులిరు
వురు రవి యొక్కరుం – డిరవుగా నొక్కొక
చరణంబునకును బ్రాసములు
జరుగు వడులు లేక కృతులు
మొదలి పదమునకుఁ – గుదురుపవలె రెండు
ముదమునఁ బ్రాసము లీల
గదియింపఁ ద్రిపద శ్రీకృష్ణ – లక్షణశిరోమణి, వృత్తాధికారము 338

ఇందులో అక్షరసామ్య యతి యే త్రిపద మొదటి పాదములో కూడ లేదు.
తెలుగు కావ్యములలో త్రిపద
ముందే చెప్పినట్లు త్రిపదను తెలుగులో ఇరవైయవ శతాబ్దము వఱకు ఏ కవి వాడలేదు. మొట్ట మొదట విశ్వనాథ సత్యనారాయణ శ్రీరామాయణకల్పవృక్షములో ఈ ఛందస్సును ఉపయోగించారు. ఆ పద్యములు –

మౌనీంద్ర యోగసం-పన్ని రూపిత మూర్తి
నానాత్రయీ శిఖావర్తి
దానితాశ్రిత జనతార్తి

ఉపనిషదుదిత ది-వ్యోపసానాసాధ్య
జపహోమ శమదమారాధ్య
కృపణాభియోగ నేపథ్య

కాని కవిసామ్రాట్టు కూడ ప్రాసయతిని ఉపయోగించలేదు, ఎందులకో?

ద్విపదయా, త్రిపదయా లేక చతుష్పదయా – కన్నడ తెలుగు త్రిపదల గణముల అమరిక పట్టికలో వివరించబడినది.


త్రిపద గణముల పట్టిక
విన్నకోట పెద్దన ప్రకారము త్రిపద మొదటి రెండు పాదములు ఒక సీస పాదము, మూడవ పాదము మధ్యాక్కర అర్ధపాదము. ఈ లక్షణాలతో క్రింద ఉదాహరణలు. వీటిలో నేను పెద్దనలా వడితో, ప్రాసయతిని కూడ ఉంచినాను.

చలిలోన నిను జూడ – జ్వలియించె మనసిందు
నిలువెల్ల కనులాయె – నిజము నిజము
పలుకరా పలుక రా – పాపి

చిత్తమ్ము నిను దల్వ – జిత్తరమ్మయె మేను
పొత్తమ్ము మూసేను – పొంగి పొంగి
మెత్తగా రమ్ము నా – మిత్ర

ఇప్పటి తెలుగు త్రిపద లక్షణములను పరిశీలిద్దాము. మూడు పాదములలో గణముల అమరిక – ఇం ఇం – ఇం ఇం / ఇం ఇం సూ / ఇం ఇం సూ. ఇందులో మొదటి పాదము ప్రాసయతితో సీసపాదములోని పూర్వార్ధము, రెండవ మూడవ పాదములు మధ్యాక్కరలోని అర్ధ పాదములు. రెండవ మూడవ పాదములు రెంటిని చేరిస్తే మనకు ప్రాసయతితోడి మధ్యాక్కర పాదము లభిస్తుంది. అనంతుడు క్రొత్తగా త్రిపద లక్షణములను వివరించినప్పుడు బహుశా మధ్యాక్కరచే ప్రభావితు డయ్యాడేమో? తెలుగు త్రిపదను (కన్నడ త్రిపదిని కూడ) ఇం ఇం / ఇం ఇం / ఇం ఇం సూ / ఇం ఇం సూ అని వ్రాస్తే అది యెట్టి యతి లేని ఒక చతుష్పది అవుతుంది. ఇం ఇం – ఇం ఇం / ఇం ఇం సూ – ఇం ఇం సూ అని వ్రాస్తే అది ప్రాసయతితోడి ద్విపద అవుతుంది. ఈ విషయాలను ఎందుకు చెబుతున్నానంటే ఈ ఛందస్సు ద్విపదయా, త్రిపదయా, లేక చతుష్పదయా అన్నది మన దృక్కోణముపైన ఆధారపడిన విషయము. తెలుగు త్రిపదకు కొన్ని ఉదాహరణములు –

ఒక పద మ్మా నింగి – యొక పద మ్మీ నేల
యిక నీదు త్రిపదమ్ము రయము
యకలంక యుంచు నా శిరము

ఈ ఱాలపై పాఱు – నీరాల గానమ్ము
లే రాగముల సుస్వరమ్ము
లీ రమ్య శ్రుతుల మోదమ్ము

నను జూడు సుకుమారి – ప్రణయాల కావేరి
మనసార నే నిన్ను గోరి
వని నుంటి రమ్ము యీ దారి

మనసున మనసయి – తనరెడు వలపయి
కనులకు నూతన కళగ
నను గను నగవుల సెలగ

కలలోన వింటి నే – కలహంస రావమ్ము
కల మాసె కను దెఱ్వ, గాని
కలహంస మనసులో నెగిరె

ముదముల విరియయి – పదముల ఝరియయి
వదనపు వలపుల శశిగ
సదమల రా మృదు నిసిగ

చివరి త్రిపద మొదటి పాదాన్ని విడదీసి వ్రాసినయెడల త్రిపద ఒక విధముగా చతుష్పదయే!

ముదముల విరియయి
పదముల ఝరియయి
వదనపు వలపుల శశిగ
సదమల రా మృదు నిసిగ

మూడవ, నాలుగవ పాదములను కలిపి వ్రాయగా లభించిన ద్విపద –

ముదముల విరియయి -పదముల ఝరియయి
వదనపు వలపుల శశిగ – సదమల రా మృదు నిసిగ

మాత్రాగణములతో త్రిపద
అంశ లేక ఉపగణములకు బదులు మాత్రాగణములతో త్రిపదలను రచించినయెడల అవి కర్ణసుభగముగా నుంటుందనే విషయములో ఏ సందేహము లేదు. ఈ విధానములో సూర్యేంద్ర గణములకు బదులు త్రిమాత్ర-చతుర్మాత్రలు లేక చతుర్మాత్ర-పంచమాత్రలు లేక పంచమాత్ర-షణ్మాత్రలను ఉపయోగించవచ్చును. అలా వ్రాసిన త్రిపదలకు కొన్ని ఉదాహరణలను క్రింద ఇస్తున్నాను –

మొదటి పాదము – (చ, చ) (చ, చ) ప్రాసయతి
రెండవ పాదము – చ, చ, త్రి
మూడవ పాదము – చ, చ, త్రి
అన్ని పాదాలకు ప్రాస

మనసున తేనెలు – తనువున వీణలు
ప్రణయపు టామని పొంగు
కనుగవ కింపగు రంగు

మాయని మమతల – తీయని పాటల
నా యెద నింపుమ నెపుడు
గాయము మాయగ నిపుడు

మొదటి పాదము – (పం, పం) (పం, పం) ప్రాసయతి
రెండవ పాదము – పం, పం, చ
మూడవ పాదము – పం, పం, చ
అన్ని పాదాలకు ప్రాస

ఆనంద శిఖరాన – నేనుందు నీకొఱకు
కానంగ రావేల నాకై
నే నిప్డు వేచేను నీకై

వెలుగు నీవన్నాను – తెలుగు నీవన్నాను
వెలిగించు దీపాల నెన్నో
పలికించు గీతాల నెన్నో

మొదటి పాదము – (ష, ష) (ష, ష) ప్రాసయతి
రెండవ పాదము – ష, ష, పం
మూడవ పాదము – ష, ష, పం
అన్ని పాదాలకు ప్రాస

లంబోదర యంబాప్రియ – సాంబసుతా గజవదనా
జంబూఫల నైవేద్యము జేతు నేన్
సంబరముగ శుక్లాంబర గొలుతు నిన్

ఆమనిలో విరిసిన యా – కోమల నవ కుసుమములా
యామినిలో విరిసిన విరి మాలలా
కోమలి నీ వా వెన్నెల డోలలా

రాగమైన మల్హారుగ – మేఘమాల కన్నీరుగ
వేగవేగ మీ ధరపై కురిసిపో
నా గుండెను చల్లార్చగ మెఱిసిపో


8-8-12 అక్షరములతో త్రిపద – వైదిక ఛందస్సులోని త్రిపదలనుగుఱించి చర్చించినప్పుడు రెండు పాదములలో గాయత్రివలె ఎనిమిది అక్షరములు, ఒక పాదములో జగతివలె 12 అక్షరములు ఉండే ఉష్ణి, పురాఉష్ణి, కకుప్ ఛందములను సోదాహరణముగా మీకు తెలిపినాను. ఎనిమిది అక్షరములను, 12 అక్షరములను త్రి, చతుర్, పంచ మాత్రలతో నిర్మిస్తే మనకు గానయోగ్యమైన త్రిపదులు లభిస్తాయి. నిడుద పాదమునకు మాత్రము అక్షరసామ్య యతి నుంచినాను. అట్టి నా ప్రయత్నమును క్రింది ఉదాహరణములలో చదువ వీలగును.

త్రిమాత్రలతో ఉష్ణివలె 8-8-12 అక్షరములతో –
మనసు నిన్ను దలచె
తనువు నిన్ను బిలిచె
కనులు కలిసె – క్షణము నిలిచె

చతుర్మాత్రలతో ఉష్ణివలె 8-8-12 అక్షరములతో –
తాళము తప్పైనప్పుడు
కాల మ్మొనర్చు చప్పుడు
ప్రేలిన విశ్వపు – ప్రేమకు దెప్పుడు

పంచమాత్రలతో ఉష్ణివలె 8-8-12 అక్షరములతో –
ఒక పువ్వు బూచినది
ఒక పువ్వు నవ్వినది
ఒక పువ్వు రాలినది – ఓడినది

త్రిమాత్రలతో కకుభ్ వలె 8-12-8 అక్షరములతో –
నీవు చెప్పినావు నాడు –
“నీవు లేక లేను – నేను, నీవె తోడు”
నీవు గోడమీద, నేడు

చతుర్మాత్రలతో కకుభ్ వలె 8-12-8 అక్షరములతో –
తారక లాకాశములో
కోరిక లెప్పుడు – గుండెల దడలో
లేరెవరీ పానుపులో

పంచమాత్రలతో కకుభ్ వలె 8-12-8 అక్షరములతో –
ఒకవంక చిఱుజల్లు
ఒకవంక తడితడిగ – హొంబూలు
ఒకవంక హరివిల్లు

త్రిమాత్రలతో పురాఉష్ణి వలె 12-8-8 అక్షరములతో –
ఎక్క డేగె నేడు – హృద్యమైన సొంపు
ఎక్క డాకు లిచ్చు యింపు
ఇక్క డిందు లేమి చంపు

చతుర్మాత్రలతో పురాఉష్ణి వలె 12-8-8 అక్షరములతో –
అందము జిందిన – యామని యెరవా
ఇందీ భూమికి కరువా
సౌందర్య మ్మది మరువా

పంచమాత్రలతో పురాఉష్ణి వలె 12-8-8 అక్షరములతో –

సకలమ్ము నెదురించు – సాహసము
ఒకనాటి యౌవనము
ఇక రాని దాదినము

హైకూ
త్రిపదల వెనుక ఇంత గొప్ప చరిత్ర దాగి ఉన్నదన్న సంగతి చాల మందికి తెలియక పోయినను, అందఱికి హైకూలను గుఱించి తెలిసి ఉంటుంది. ఈ హైకూ ప్రక్రియ మొదట జపాన్ దేశములో ఉద్భవించినది. హైకూ ఒక త్రిపద – మొదటి మూడవ పంక్తులలో ఐదు అక్షరములు, రెండవ పంక్తిలో ఏడు అక్షరాలు ఉంటాయి యిందులో. హైకూ ఒక చిత్రసందర్శనానుభూతిని కలిగిస్తుంది. పదములకన్న ఆ పదములు సృష్టించిన చిత్రములు హైకూ ప్రత్యేకాకర్షణ. ఒక చిత్రము మాత్రమే కాదు, రెండు భిన్నమైన చిత్రములు హైకూలో సామాన్యముగా మనకు కనిపిస్తాయి. మత్సుఒ బాషో, ఉయెజిమా ఒనిత్సూరా గొప్ప జాపనీయ హైకూ కవులు.

17 అక్షరములతో వ్యావహారిక భాషలో ద్వితీయాక్షర ప్రాసయుక్తమై వ్రాసిన కొన్ని హైకూలను క్రింద చదువవచ్చును –

గోవిందా హరీ
దేవుని రథోత్సవం
గోవిందా బిచ్చం

చంచల పుష్పం
చంచల హృదయం – అ
చంచలాకాశం

పాలభిషేకం
పాలులేని పాలిండ్లు
పాలకై యేడ్పు

దూరంగా శశి
దూరంగా కొండ – ఇంకా
దూరంగా నువ్వు

తార లెన్నెన్నో
ఈ రాత్రిలో – జీవన
తార నాదేది

తలపై గంగ
గళము దాకి గంగ
ప్రళయ గంగ

మరో ఆకాశం
మరో అందాల తార
మరి యీ తార
త్రిపద ఛందస్సులో హైకూలు
తెలుగులో ఎందరో కవులు హైకూలను వ్రాస్తున్నారు. కాని ఈ హైకూలను వ్రాసినప్పుడు 5-7-5 అక్షరములతో అందఱు వ్రాయడము లేదు. హైకూల భావాలను నేను పైన వివరించిన ఛందోబద్ధమయిన త్రిపదలలో వెలిబుచ్చవచ్చును. అప్పుడు హైకూలలో చిత్రములను మాత్రమేగాక భాషా సౌందర్యమును కూడ అనుభవించవచ్చును.

కొన్ని హైకూలకు త్రిపదలలో నా అనువాదములను క్రింద పఠించవచ్చును –

Wake, butterfly –
It’s late, we’ve miles
To go together. – Basho

తుమ్మెదా వేళాయె – లెమ్ము సత్వరముగా
రమ్మిద్దరమ్ము దూరమ్ము
రమ్ము వెళ్లాలి వేగమ్ము

Come out to view
the truth of flowers blooming
in poverty – Basho

చూడ రా వేగమే – చూడవా వేగమే
చూడు మీ పుష్పాల సొంపు
చూడు మీ ముఱికిలో కంపు

Polished and polished
clean, in the holy mirror
snow flowers bloom – Basho

తుడువగా తుడువగా – గడు నిద్ద మద్దమ్ము
విడిగినవి యందు పుష్పాలు
బెడగిడుచు హిమమౌక్తికాలు

I’m a wanderer
so let that be my name –
the first winter rain – Basho

నేను ప్రవాసిని – నా నామమ్మది
వానలు తొలిగా కురిసె
నీ నవ శిశిరము విరిసె

The old pond;
A frog jumps in —
The sound of the water – Basho

ఏనాటి సరసియో – ఈ నాడు పాతబడె
ఆ నీట కప్ప మునిగింది
ధ్వానముల సుడియు రేగింది

Fallen sick on a journey,
In dreams I run wildly
Over a withered moor – Basho

బలహీనమయె తనువు – చలి జ్వరము పాలైతి
పలవరింపులలోన నేను
అల కొండనే యెక్కినాను

A cooling breeze—
and the whole sky is filled
with pine-tree voices. – Onitsura

సరసపు తెమ్మెర – పరువగ చల్లగ
విరివిగ నిండెను నింగి
తరువుల సడుల జెలంగి

Watching, I wonder
which poet could put down his quill …
a perfect moon! – Onitsura

చిమ్మగ శశి ద్యో-తమ్ముల నీ నిసి
కమ్మగ పున్నమి లాఁగు
యిమ్ముగ నే కవి యాగు

Don’t weep, insects –
Lovers, stars themselves,
Must part – Kobayashi Issa

జడియకుడు క్రిములార – అడలు టది యెందులకు
కడకు తారకలు ప్రేమికులు
మడియకను నుందురే పుడమి

meteor shower
a gentle wave
wets our sandals – Michael Dylan Welch

అక్కడ నాకాశములో – చుక్కలు బలు రాలుచుండె
ఇక్కడ నొక సంద్రపు టల తడిపినది
మక్కువతో మా పదముల తుడిచినది

ముగింపు
పది యక్షరములకు తక్కువగా ఉండే వృత్తములకు, ప్రాసయతి మాత్రము కలిగి ఉండే లయగ్రాహివంటి ఉద్ధురమాలావృత్తములకు తప్ప మిగిలిన వృత్తములకు, జాతి పద్యములకు అక్షరసామ్యయతి లేక వడి తెలుగులో తప్పక ఉంటుంది. దీనికి మినహాయింపు త్రిపద, షట్పదలు మాత్రమే. త్రిపదలను కన్నడ కావ్యములలో అక్కడక్కడ ఉపయోగించారు, షట్పదులతో కావ్యములనే వ్రాసారు కన్నడ కవులు. కాని ఈ రెండు ప్రక్రియలకు తెలుగు కవులు ససేమిరా అన్నారు. పద్యములను వ్రాయుటకు పూనుకొనే విద్యార్థులు ప్రారంభదశలో యత్యక్షారలకోసం ప్రాకులాడడము సహజమే. కాని ప్రారంభదశలో వారు త్రిపదలాటి పద్యములను అల్లినచో పద్యరచనా విధానమును చక్కగా అవగాహనము చేసికొనుటకు వీలవుతుంది. మాయామాళవగౌళరాగమును సంగీతము నేర్చే విద్యార్థులు ఎలా అభ్యసిస్తారో అదే విధముగా త్రిపదను పద్యరచనా విద్యార్థులు అభ్యాసము చేసికొనవచ్చును, తఱువాత తెలుగు షట్పది, దాని పిదప ఆటవెలది తేటగీతులు, తఱువాత కందము, ఆ తఱువాత చంపకోత్పలమాలలు, అలా అభ్యాసము చేసికొని పద్యరచనా ప్రావీణ్యమును గడించవచ్చును. అదే విధముగా హైకూవంటి పదచిత్రాలకు కూడ త్రిపద సహాయకారియే అని నా ఉద్దేశము.
-----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: