Saturday, May 19, 2018

సెల్ ఫోను దండకము


సెల్ ఫోను దండకము



సాహితీమిత్రులారా!


మనం అనేక దండకాలను విన్నాము. కాఫీ దండకము,
తిట్లదండకము ఇలాగా ఇప్పుడు పూసపాటి కృష్ణ సూర్య కుమార్
గారు రచించిన సెల్ ఫోన్ దండకం చూడండి-

శ్రీమన్మహాదేవి! సెల్ఫోయను దేవీ!  విశాలంబుగా విశ్వవిఖ్యాతి గైకొన్న యంత్రమ్ముగా నీవె యెచ్చోట కేవేళనైనన్ సువార్తల్ కడున్ వేగ శ్రావ్యమ్ముగా చేర్తువే యంతదూరాన మేమున్న నేతావు లోనున్న నేతీరమందున్న నేకొండపై నున్న నేబండ క్రిందున్న నేచెట్టు పైనున్న నేగట్టు పైనున్న నేపుట్టలో నున్న నేహాలులో నున్న నేచాలులో నున్న నేదిక్కు  లోనున్న నేపక్క మీదున్న నే తల్లితో నున్న నే పిల్ల తోనున్న నే గల్లిలో నున్న నే రోడ్డు మీదున్న నే దేవి తోనున్న నేభామ తోనున్న  నేబైకు మీదున్న నే కారులోనున్న నే బస్సులోనున్న నే మిస్సు తోనున్న నే రైలులో నున్న నే రైతు తోనున్న నే యాటలోనున్న నే పాట తోనున్న, నిచ్చోట నచ్చోట నెచ్చోటలోనైనన్ విభేదాలు లేకుండ స్విచ్చేసి నొక్కంగ వేగాన వేంచేసి   మాతోటి  ముచ్చట్లు గుప్పించి మాయొక్క సందేశ సంక్షిప్త  రూపాలు  పంపించి  కోపాలు తెప్పించి తాపాలు తప్పించి  వేదాలు గుప్పించి స్తోత్రాలు మాచేత  చెప్పించి  పాపాలు వీక్షించి లోపాలు చూపించి సంగీత సాహిత్య నాట్యాలు    కోరంగ  నెట్లోనన  శోధించి సాధించి యందించి  సాయమ్ము నీయంగ  నానాడు మార్టిన్ను కూపర్ ప్రపంచాన సంతోష మొప్పంగ మేధస్సు పుష్పించ  మోట్రోల రీసెర్చి భాగాన  సృష్టించి నీకెంతయో ఖ్యాతి కల్పించ విశ్వాన విఖ్యాతితో నీవు నాట్యంబు లాడంగ నేపుణ్య కాలాన నిచ్చోట చేరంగ భూమండలమ్మందు మైమర్చి మేమెల్ల సంప్రీతితో మోజు కల్గంగ హస్తాలలో భూషణంబయ్యి  మాచెంత చేరంగ నీసేవ  లెన్నింటినో  మేము పొందంగ  నేరీతిలో నిన్ను నే స్తోత్రపాఠాలతో గొల్తు మిచ్చోట నీధాత్రి  యూజర్ల కెల్లప్డు సిగ్నల్సు వీకైన  నిత్యమ్ము నాటంకము ల్లేక నందించి నెట్వర్కు  రక్షించి  క్రొంగ్రొత్త   ప్యాకేజి లిప్పించి టచ్ ఫోనుతో త్రీజి  వేగాన మాచెంత  నేతెంచి దేశాన  గోతాలతో పాత నోట్లన్ని రూపాలు లేకుండగా మోడి చేయంగ  రూపాయ లేకుండ రూపేల ఖాతాలు చూపించి వ్యాపార ప్రాంతాన దూకంగ నీపైన  నిత్యమ్ముగోకంగ తాకంగ పంపించి వంటంటి సామాగ్రి కుద్దండ పిండానివే నిన్ను నేమంచు కీర్తింతు నీగొప్ప, యన్నంబు లేకున్న మేమంత  యీడ్వంగ నేర్చాము, ప్రాణాల నాపంగ లేమంట లేకున్న నీవింట, ప్రొద్దున్నె మేల్కొల్పు మోదాన నీ రింగు టోన్లన్ని, పూజింతు  మెల్లప్డు దేవుళ్ళ స్తోత్రాలు వల్లించగా నీవు, వంటింటిలో నీవు సూచించు మార్గాన  కాఫీల నుప్మాల నిడ్లీల  పెళ్ళాలు చేయంగ విందారగించంగ సంతోష మొప్పంగ నాకీర్తి  నీదే గదా దేవి, చాటింగు లెన్నెన్నియో  నీవు సాగించి లవ్వర్సుగా చేసి మ్యారేజి  బ్యూరోవుగా నీవు పేరొంది నావంట, పెళ్ళాలకు న్నట్టి దృశ్యాలు చూపించి డైవర్సు లిప్పించి న్యాయమ్ము చేసేటి నీ బోటిమేధావులం మేము కాలేము,  మా యోట్లు  కోరంగ పార్టీల కేజెంటు వైనీవు ఎన్నెన్ని సందేశముల్ బంపి ప్రార్ధించి మెప్పించి  గుప్పించి రప్పించి గెల్పించి సాయమ్ము చేసేటి  నీప్రజ్ఞకే  రోజుతూగంగ లేమమ్మ, లైన్లందు నిల్చోక  సిన్మాల టిక్కట్లు, ఆర్టీసి టిక్కెట్లు, రైళ్ళందు టిక్కెట్లు,దేవాలయాలందు  టిక్కెట్లు ఫ్లైట్లందు టిక్కెట్లు, క్లబ్లోన టిక్కెట్లు పబ్లోన టిక్కెట్లు ఇప్పించు నీసేవ గుర్తించి దేశమ్ము పద్మా ఆవార్డిచ్చి నిన్నెప్డు కీర్తించు భాగ్యంబు కల్పించి యానంద పుయ్యాలలో నీవ యూగంగ నీగొప్ప నేరీతి కీర్తింతు, లంచాల బాబుల్ని పట్టించి  జైళ్ళందు  తోయించి దేశాన్ని సౌఖ్యాన నుంచేటి నీగొప్ప తెల్పంగ లేమమ్మ, నీకీర్తిపై మచ్చలే వచ్చు ముచ్చట్ల నిచ్చోట చూపించి దూషింతు, మార్గంబుపై బండ్లు తోలేటి డ్రైవర్ల వెన్నంటి నీవుండ  స్వర్గాన చేర్చేటి నీతప్పు చూపంగ శక్యంబు కాదమ్మ, నీపొందు విద్యార్ధులుం జేర నీలోన కాపీల నుంచంగ  వ్రాయించి ఉత్తీర్ణులయ్యేట్టు మార్గంబు ప్రాప్తించు నీబుద్ధి నేరీతి  ఖండింతు, దేశాన్ని దోచేటి య యుగ్రవాదంపు మార్గాలలో చేరి దేశాన్ని క్లేశంబులో త్రోయు  నీదుష్ట సాoగత్య మేరీతి గర్హింతు, కోరంగ వేగాన  నగ్నంపు దృశ్యాలు  శోధించి గుప్పించి చూపించి  ప్రాయంబు నిర్వీర్యమౌనట్లు చేసేటి నీ చేష్టలేనాడు గర్హిoచ లేమమ్మ, లోపాల నెంచంగ స్వల్పంబు, నీ కీర్తి యాకాశమున్ దాక  నిత్యంబు నిన్గోరి మా గుండెలో దాచి  పూజింతు మెల్లప్డు చల్లంగ నీదృష్టి మాపైన చూపించి యాహ్లాద మొప్పంగ శ్రేయస్సు నందించి మేలైన ప్రోగ్రాములం జూపి సర్వత్ర మాబోటి వారందరిన్ నీవు రక్షించి బ్రోవంగ రావమ్మ సెల్ ఫోను దేవీ నమస్తే నమస్తే నమస్తే నమః.

(శంకరాభరణం బ్లాగు సౌజన్యంతో)

No comments: