Thursday, May 17, 2018

ఏకాక్షర శ్లోకం


ఏకాక్షర శ్లోకం


సాహితీమిత్రులారా!


12వ శతాబ్దంలో భగవద్రామానుజుల వారి శిష్యుడు
శ్రీవత్సాంకులవారు (కూరత్తాళ్వార్) రచించిన
శ్రీకృష్ణస్తుతిపరకమైన ఒక ఏకాక్షరశ్లోకం ఇది.
అరవైనాలుగు లఘువుల అచలధృతి శ్లోకమంతా,
ద అన్న ఒక్క అక్షరంతోనే కూర్చబడింది

తనను చేరదీసి, ఆదరాభిమానాలను కురిపించి,
అంతులేని ఐశ్వర్యాన్ని అనుగ్రహించిన
శ్రీకృష్ణ పరమాత్మను నోరారా సన్నుతిస్తున్న
బాల్యమిత్రుడు సుదాముని మనోగతం ఇది.

దదదదదదదదదదదదదద దదదదదద దదద దదదదదదదదద
దదద దదదద దదద దదద దదద దదదద దదదద దదదద దదదద.
                                                                     (యమక రత్నాకరం - 12 ఆశ్వాసం.)


దదదదదదదదదదదదదద – దదత్ + అదదత్ + అద + దదత్ + అదదత్ + అద అని పదచ్ఛేదం. దదత్ = దాతలయందు, అదదత్ = దానస్వభావము లేనివారియందు, అద = భక్షకులైనవారియందు,

దదత్ = ఆత్మసమర్పణము చేసికొను భక్తులయందు, అదదత్ = భవబంధముల పట్ల ఉదాసీనులగువారియందు, అద = ఆత్మజ్ఞానకరుడవు (లేదా) అదదత్ = లోకభక్షకులైన పాపులయందు, అద = పీడాకరుడవు అయిన లోకేశ్వరా;

దదదదదద – దదత్ + అదత్ + అద అని పదచ్ఛేదం. దదత్ = ధర్మశీలురైనవారిని, అదత్ = బాధించునట్టి లోకకంటకులను, అద = సంహరించు జగద్రక్షకా; దదద – దద = త్యాగశీలురగు ధర్మమూర్తులను, ద = ప్రభవింపజేయువాడా;

దదదదదదదదద – దదత్ + అదదత్ + అదత్ + అద అని పదచ్ఛేదం. దదత్ = ధార్మికులయందు, అదదత్ = కర్మాకర్మములయందు వైరాగ్యము నూనినవారియందు, అదత్ = కర్మబంధములకు లోగినవారియందు, అద = సమచిత్తము గలిగి యుగాంతవేళ సర్వమును ఉపసంహరించు పరమపురుషా; దదద – దద = ధార్మికులను, ద = చిత్తమున ధరించి యుండువాడా;

దదదద – దదదత్ = ధర్మమూర్తులగు ఋషులను హింసించు రాక్షసులను, అద = నశింపజేయు శ్రీ వాసుదేవా;

దదద – దదత్ = యజ్ఞములచే దేవతలకు హవ్యరూపములైన ఆహుతులను సమర్పించెడి యాజ్ఞికులకు, అద = రక్షకుడవైన పరమేశ్వరా;

దదద – దదత్ = నీ భక్తులగు ఉత్తములను, అద = శోధించెడివాడా;

దదద – దదత్ = లోకరక్షార్థమై కారుణికులగువారిని, అద = రక్షించు దయార్ద్రమూర్తీ;

దదదద – దద = ధర్మరతులైనవారిని, ద = బాధించు దుష్టులను, ద = మట్టుపెట్టువాడా;

దదదద – దదత్ = ధారకులకు, అద = ధారకులు కానివారికి, ద = కర్మఫలములను ప్రసాదించు స్వామీ;

దదదద – దదత్ = లోకకంటకులకు, ద = అండగా నిలిచి కాపాడు నీచులను, ద = హరింపజేయు పరమాత్మా;

దదదద – దదత్ = సర్వప్రదాతవగు, అదదత్ = కర్మఫలముల అంతమొందింపజేసి సద్భావమునొసగు, అ = శ్రీ వాసుదేవా!


తాత్పర్యం -
శరణాగతులకు స్వాధీనుడవై, ఉదాసీనులైనవారియందు ఉదాసీనుడవై, పాపస్వభావులకు సంహారకర్తవై, రాక్షసాంతకుడవై, సజ్జనులను ప్రభవింపజేయువాడవై, ధర్మాధర్మానుసారకులకు ఆధారభూతుడవై, సత్స్వభావులను కాపాడి ముక్తినొసగువాడవై, సత్స్వభావులను బాధించువారికి బాధకుడవై, సజ్జనరక్షకులకు రక్షకుడవై, జగత్తుయొక్క బహిరంతరాలలో వసించు వాసుదేవుడవైన పరమపురుషా! శరణు! శరణు!

(శ్లోకార్థం డా. ఏల్చూరి మురళీధరరావుగారి సహకారంతో)

No comments: