Friday, May 11, 2018

వర్ణవిన్యాసవక్రత


వర్ణవిన్యాసవక్రత
సాహితీమిత్రులారా!"వక్రోక్తి జీవితము" అనే రచించిన కుంతకుని ప్రకారం
వక్రోక్తి ఆరు విధములు వానిలో మొదటిది వర్ణవిన్యావక్రత

వర్ణవిన్యావక్రతలో వర్ణ శబ్దానికి వ్యంజనము అని అర్థం.

ఏకో ద్వౌ బహువోవర్ణా బధ్యమానాః పునఃపునః
స్వల్పాంత రాస్త్రిధాసోక్తా వర్ణవిన్యాసవక్రతా

అంటే ఒక వ్యంజనముగాని, రెండు వ్యంజనాలుగాని
కొంచెం కొంచెం వ్యవధానంతో కూడి పునః పునరుప
నిబద్ధములైనచో అది వర్ణవిన్యాస వక్రత.
ఇది మూడువిధాలు -
1. ఏకవర్ణ పునః పునరావృత్తి
2. ద్వివర్ణ పునః పునరావృత్తి
3. బహువర్ణ పునరావృత్తి

ఏకవర్ణ పునః పునరావృత్తి -
ఒకే వర్ణము మళ్ళీమళ్ళీ రావడం దీన్నే ఇతర అలంకారికులు
"వృత్త్యనుప్రాసం" అని అంటారు.

నిరుపమవితరణజిత జల
ధరసురతరుసురభి తరణితనయ ఖచరశం
కరసఖసుధాఘృణికి వి
స్ఫురణనభోమణికి మంత్రిచూడామణికిన్
                                             (చిత్రభారతం - 1-77)
దీనిలో రేఫము సర్వత్రా పునరావృత్తమైంది.

ద్వివర్ణ పునః పునరావృత్తి -
రెండు వర్ణములు అంటే రెండు వ్యంజనములు
పునావృత్తి అయిన ద్వివర్ణ పునః పునరావృత్తి అంటున్నాము.

చెలఁగుచు మర్మపుఁ బలుకులఁ
గలఁగుచుఁ గరతాళగతుల కనురూపముగా
మలఁగుచు రాయంచలగతి
మెలఁగుచు నంతంత వేల్పుమెలఁతలు వరుసన్
                                          (చిత్రభారతం - 2- 122)

దీనిలో ల - అనే వర్ణం, గ - అనే వర్ణం రెండునూ
సర్వత్రా పునరావృత్తములైనవి.

బహువర్ణ పునరావృత్తి -

అనేక వర్ణాలు పునావృత్తమవడం బహువర్ణ పునరావృత్తి అనబడును.

మరువము మేనులతాంగీ
మరువము దగమమ్ము హరుని మాఱుకొనిన య
మ్మరువమ్ము మానుటకునై
మరువమ్మిది బ్రహ్మచేసె మానసమలరన్
                                           (చిత్రభారతం - 2 - 124)

ఇందులోప్రతి పాదం మొదటిలో మరువము అని
బహు వర్ణాలు ఆవృత్తములైనవి. అయితే
ఇక్కడ మరువము అనే పదం పునరుక్తి కావడం వల్ల
దీన్ని యమకము అని అని అనవచ్చు.

No comments: