స్వరాక్షరి
సాహితీమిత్రులారా!
స్వరాలు 7 కదా!
ఆ స్వరాక్షరాలు - స, రి, గ, మ, ప, ద, ని
వీటితో పద్యం లేదా శ్లోకం కూర్చడాన్ని స్వరాక్షరి
అంటారు. ఇక్కడ డా. చిలుకూరి నారాయణరావుకృత
శ్రీకురుమూర్తినాథ శతకం నుండి
ఒక ఉదాహరణ చూద్దాం
దీనిలో "కురుమూర్తినాథ సురవంద్యా పాహిపాపహిప్రభో"-
అన్నది మకుటంగా పద్యాలను కూర్చారు.
సరిగా నీపని సాగనీ గరిప, దా, సాగారి సద్ధామ మా
గరిమన్ సామ నిధానిగా, సమపథంగా సాని నీసారి! మా
దరిగానీ మఱి దారి, సన్నిగమపా! దా సాగ! మాపా! సదా
దర మొప్పం గురుమూర్తినాథ! సురవంద్యా! పాహిపాహి ప్రభో!
(శ్రీకుమూర్తినాథ శతకం - 50)
అర్థం-
గరిప - గరుత్మంతుని ప్రభువా
సన్నిగమపా - శ్రేష్ఠములైన వేదములను పాలించువాడా,
దాసాగ - దాసుల పాలిటికొండా
మాపా - లక్ష్మీనాథా,
దాస - ఆగారి - దాసులకు ఉనికి పట్టగు,
సద్దామ - శ్రేష్ఠమైన వైకుంఠమందుండువాడా,
సామనిధానిగా - సామగాన లోలుడవై లేదా
సౌమ్యమైన మార్గమునందు,
మా గరిమన్ - లక్ష్మ అతిశయిల్లునట్లు,
నీపని - నీవుచేసేపని,
సరిగా - సక్రమంగా,
సాగనీ - సాగించు,
ఈసారి - ఈ పర్యాయం,
నీసాని - నీ భార్య అయిన లక్ష్మి,
సమపథంగా - చంచలమార్గాన్ని వదలి తిన్నని మార్గాన్ని అనుసరించినట్లు,
మఱి - ఇంక,
దారి- నిన్ను చేరుమార్గం,
సదా - ఆదరమొప్పన్ - ఎల్లప్పుడును దయకలిగినవాడవై,
మాదరి గానీ - మాకు చేరునట్లు చేయుము
(శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారి సహకారంతో)
No comments:
Post a Comment