Saturday, March 13, 2021

హరి నీవనాకారి యాలి పరాచారి

హరి నీవనాకారి యాలి పరాచారి





సాహితీమిత్రులారా!



మదనగోపాల శతకంలోని ఈ పద్యం చూడండి-

హరి నీవనాకారి యాలి పరాచారి

                 కూతురు వ్యభిచారి కొడుకు జారి

యమ్మ నిర్దయకారి యబ్బ సంకిలికారి

                 యత్త పరాచారి యక్కమారి

మరదలు శుభాచారి మనుమఁడు జడదారి

                  మరిది క్షీణాకారి మామ క్షారి

వదినె నిర్దయకారి వాజి పక్ష్యాకారి

                  భటుఁడు మర్కటకారి పడకహారి

చూడు నీమర్మ మెల్లనే నాఁడుదాన

నేఁడు నన్నేలి, సిగ్గుఁగా పాడుకొనుము

సరససదరహాస ద్వారకా పురనివాస

మదనగోపాల రాధికా హృదయలోల


కవి ఏ విధంగా మదనగోపాలుని బెదిరిస్తున్నాడో చూడండి-

నీవు అనాకారివి, నీ భార్య లక్ష్మిదేవి పరాచారి,

కూతురు(గంగ) వ్యభిచారి, కొడుకు(మన్మధుడు) జారి,

తల్లి(దేవకీదేవి) నిర్దయకారి, తండ్రి(వసుదేవుడు) సంకిలికారి,

అత్త(భూదేవు) పరాచారి, అక్క(యోగమాయ)మారి,

మరదలు(ఊర్మిళాదేవి)శుభాచారి, మనుమడు(నారదుడు) జడదారి,

మరిది(చంద్రుడు) క్షీణకారి, మామ(సముద్రుడు) క్షారి,

వదినె(జ్యేష్టాదేవి) నిర్దయకారి, వాజి(గరుత్మంతుడు) పక్ష్యాకారి,

భటుడు(హనుమంతుడు) మర్కటాకారి, పడక(ఆదిశేషుడు)హారి,

నన్ను కాపాడకున్నచో నేను ఆడుదానిని యిలాంటి 

మర్మమెల్ల బట్టబయలు చేస్తాను. ఓ ద్వారకాపురవాసా, 

మదనగోపాలా జాగ్రత్తసుమా

 

No comments: