Saturday, December 19, 2020

వచనంలో పద్యాలు

 వచనంలో పద్యాలుసాహితీమిత్రులారా!

ఈ గల్పిక. చదవండి. 

నవ్యతా రాగం 

జ్వాలారావుకు అన్నితీర్ల పనులూ చాలా మహత్తున్న యజ్ఞాలే. వేసట లేని సాధకుడనీ, చాలా నిఖార్సైన చాలూ, లోకజ్ఞత వున్న ధీరుడు అనీ లోలోపలే గొప్పగా పోలుస్తారు అతణ్ని. కాని ఇది చెప్తూ దీవెనిచ్చేది కొందరు అయితే సదా ఎదురు దాడులు చేసి ఛిఛీ అనేది కొందరు. అతడో నిషేధిత వితండుడనీ, అహమున్నవాడనీ నిరసన చూపుతారు. పనినే సిరిగా తలచే మహా ధురంధరుడయినా ఇలా బహువిధాల అపప్రథలే లభించినాయతనికి. కారణం అతని ఆధునికత్వపు కాంక్ష. ఎప్పుడూ అతనికి కొత్తకొత్త విషయాలు, విచేష్టలు నచ్చుతై. అసంగతపు ప్రవర్తనే అతనికా అగచాటును తెచ్చినట్టు వ్యాహృతి చెబుతారు కొందరు. మహీస్థలి పైన ఇలాంటి కొందరుండాలండీ. ఒక పాతరీతిని తెగట్టం కూడ ఓ ధైర్యమే.

జ్వాలారావుకు కావ్యలేఖనములో సామర్థ్యముందండి. కానీ లోలోపల పాతకాలపు విధాన్నెంతో అసహ్యించుకుంటూ లోతైన అపేక్షతో పదును పెడ్తూ రాసినాడండి. ఓ సారైతే మన పాత వ్యాకరణ అంశాల్నే త్యజిస్తూ తనే ప్రారంభించిన నవ్య వ్యాకరణ స్వారస్యాన్ని దట్టించి బాగా రాశాడు. పురాణ పండితులు ఏకంగా విరోధించి తిట్టారండీ. అయినా మరింత కసితో టాటోటు లేకుండ ఇంకా రాశాడు. ఇలాంటి వాళ్లకు సరిగ్గా ప్రాభవం రాదు. జాల్వారే కొత్తదనాలు ఆయనకు చాలా ఇష్టదైవాలు.

జ్వాలారావంతటితో అలా నిలిచిపోలా. గాన మేధావి లాగా రాగాలను పాడినాడు శ్రుతితో. కానీ యధారీతిలో చెలరేగాడని ఇక్కడా గొడవలే చేశారు సంగీత శాస్త్రులు. శాస్త్రం ఒకసారి సూత్రనియమాల్తో రూఢి అయ్యాక అర్మిలితో గైకొని ఇంపుతో, నిరతితో మెచ్చాలి, నచ్చాలి. జాబిలిలా దాన్నొక గొప్ప ఆస్తి వలె భావిస్తూ వరించాలి జ్వాలారావూ! అని గోల చేసి అటతాళంలో నిలేశారు. జ్వాలారావస్సలు వాళ్ల మాటలను విన్లా. సూటిగా ధాటిగా ఊరూరా తన నవ్యరాగ రవళీ హోమాన్ని వేల్చాడు. ఈ రారాజేం పస లేని బేల మనిషా? రవ్వంత కూడా బెదర్లా. పాపం అతడెన్ని సార్లు నవతారాగాన్ని మ్రోగించినా శాపాల్నే, పరితాపకారక నిరాశా నిస్పృహల్నే ఫలంగా పెట్టింది ప్రశస్తమైన మన లోకం. ఎందుకీ లోకమిట్లా పాడైందని బాధతో, కలతతో ఠారెత్తిపోయాడు.

ఈ జ్వాలారావొకసారి స్కూల్ తరఫు మ్యాగ్ జైన్ వారి సంపాదకత్వం లైట్ గా నెరిపాడు. అప్పుడతడుత్సాహాన్ని తెచ్చేసుకుంటూ లోకౌచితి అప్రధానమని దాంట్లో నూతనత్వాన్ని ధారాళంగా కలిపేసినాడు. ఎడిటోర్యల్ పేజి ఆఖర్న వచ్చేలా స్థిరపర్చినాడు. అది చూసేశారు సాహిత్యపీఠంలో మన్నిక గన్న పండితులు. కంఠాలన్ని చిట్లేవిధంగా లౌడ్ గా అరిచేసి చాల చెలరేగారండి. ఏం చేసినా జ్వాలారావు తనెంచుకున్న నవతత్త్వాన్నస్సలే వీడలా. 

ఈ రకమైన ప్రేరణ మరీ అధికం అయినట్టి కొందరుంటారు. మరట్టివారి నిబిడార్తికి, తృష్ణకు, కౌశలానికీ వారి అమేయ చాతురికి వందన చేసి మనేది ఎందరంటారు? మితం కదా. కటకటా. మరి దీనికి ఏం ఉపాయమో! 

ఇందులోని మొదటి వాక్యాన్ని ముందుగా పరిశీలిద్దాం. ఆ వాక్యంలోని ఒక్కొక్క అక్షరానికి మాత్రలు వేసుకుంటూ పోతే అది ఇలా ఉంటుంది.

జ్వాలారా (UUU) = మ గణం

వుకుఅ (IIU) = స గణం

న్నితీర్ల (IUI) = జ గణం

పనులూ (IIU) = స గణం 

చాలామ (UUI) = త గణం

హత్తున్న (UUI) = త గణం

య (U) = గ గణం (ఏకాక్షర గణం). 

వీటన్నిటినీ వరుసగా పెట్టి చూస్తే, మ స జ స త త గ వస్తుంది. మొదటి అక్షరమైన ‘జ్వా’ కూ 13 వ అక్షరమైన ‘చా’ కూ యతి మైత్రి కుదిరింది. కాబట్టి ఇది శార్దూల పద్య పాదం. ఇట్లా గల్పిక చివరిదాకా మాత్రలు వేసుకుంటూ పోతే, ఒకటి తర్వాత ఒకటి ఛందోబద్ధమైన పద్యాలు వస్తాయి. వాటిలో గణాలు, యతి, ప్రాస అన్నీ సరిపోతాయి. ఈ గల్పికలో వరుసగా శార్దూలము, చంపకమాల, చంపకమాల, శార్దూలము, శార్దూలము, శార్దూలము, మత్తేభము, శార్దూలము, శార్దూలము, శార్దూలము, శార్దూలము, ఉత్పలమాల పద్యాలు వస్తాయి.

--------------------------------------------------------

ఎలనాగ గారి ముఖపుస్తకం నుండి

No comments: