Sunday, October 27, 2019

ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన


ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన
సాహితీమిత్రులారా!

స్త్రీల రచనలు అనగానే మనకి మొల్ల రామాయణం ముందు కనిపిస్తుంది. కాని, తెలుగు కవయిత్రులు నోటిపాటలుగా తమ దృష్టిలో రామాయణం ఎలావుందో చెప్తూ చాలా పాటలు అల్లారు. అందులోది ఊర్మిళాదేవి నిద్ర. ఈ పాటలు రచించినవాళ్ళ పేర్లు మనకు తెలియవు. వాళ్ళ కవితా శక్తికి ఫెమినిస్టు భావజాలం తెలుగులో వ్యాపించిన తరువాత కూడా ప్రత్యేకంగా గుర్తింపు రాలేదు. జానపద వాఙ్మయం అనే ముద్దుపేరుతో ఇలాటి పాటల్ని చూసిన వాళ్లు కూడా ఇది కవిత్వం అని అనలేదు.

ఊర్మిళాదేవి నిద్ర తెలుగులోనే ప్రచారంలో ఉన్న కథలా కనిపిస్తోంది. ఆ మాట నిజమైతే, ఇది తెలుగు స్త్రీల సృష్టి. ఈ మాట నిజం కాక, ఈ కథ ఇతర భాషల్లో కూడా వున్నా, ఈ పాట నిస్సంశయంగా తెలుగు కవయిత్రి సృష్టి. ఈ పాట గుజిలీ ప్రతుల్లో అచ్చు వేసి తేదీల్లేకుండా, సి.వి.కృష్ణా బుక్‌ డిపో, ఎన్‌.వి. గోపాల్‌ అండ్ కో, ఇత్యాది ప్రచురణకర్తలు* ప్రచురించారు. దాదాపు 50 ఏళ్ళ క్రితం దేవేంద్ర సత్యార్థి అనే పంజాబీ ఆయన తెలుగు దేశంలో కొన్నాళ్ళుండి, ఏలూరులో ప్రఖ్యాత సాహితీపరులూ, చిత్రకారులూ ఆయనని అతిథిగా తీసుకొని ఆదరించగా, ఈ పాటని విని రాసుకుని, దీన్ని గురించి ఇంగ్లీషులో ఒక వ్యాసంగా ప్రస్తావించాడు (ది మోడర్న్ రివ్యూ, ఏప్రిల్ 1940). దాని మూలకంగా ఈ కథ భారతదేశంలో అప్పట్లో జానపద వాఙ్మయంలో పనిచేసే వాళ్ళ దృష్టిలో పడింది. దరిమిలా హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు 1955లో స్త్రీల రామాయణపు పాటలులో ప్రచురించారు. ఈ పుస్తకానికి కృష్ణశ్రీ అనే మారుపేరుతో రాసిన ఆలోచనాత్మకమైన ఉపోద్ఘాతంలో శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ఈ పాటల కవితాగుణాన్ని మొదటిసారిగా గుర్తించారు. కోలవెన్ను మలయవాసిని 1986లో ఆంధ్ర జానపద సాహిత్యము, రామాయణము అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ పాటని గురించి వివరంగా చర్చించారు. ఆ తరవాత మలయవాసిని ఈ పాటని తమ ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఎలా పాడేవారో విని, వాళ్ళ దగ్గరనుంచి నేర్చుకుని పాడుతుండేవారు. ఈ పాట జ్ఞాపకం దాదాపుగా అంతరించిపోతున్న రోజులలో ఈ పాటని ప్రపంచానికి అచ్చులో తెలియపరచిన పూర్వ ప్రచురణ కర్తలకీ, విద్వాంసులకీ, పాటను తన పుస్తకంలో చర్చించి, పాడి వినిపించిన మలయవాసినిగారికీ ముందుగా నమస్కారాలు చెప్పాలి.

ఊర్మిళ గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలో ఒక్కచోట మాత్రమే కనిపిస్తుంది. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారు అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ తరువాత ఊర్మిళ గురించి వాల్మీకం మనకేమీ చెప్పదు. వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది. కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు. అలా ఒంటరిగా వదిలివేయబడ్డ ఊర్మిళా, అడివికి వెళ్ళిపోతున్న లక్ష్మణుడూ ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం లక్ష్మణుడు తన నిద్రని ఊర్మిళకిస్తాడు. ఊర్మిళ తన మెలకువని లక్ష్మణుడికిస్తుంది. తన భర్త అడివిలో ఉన్న పధ్నాలుగేళ్ళూ ఊర్మిళ నిద్రపోతుంది. లక్ష్మణుడు ఆ పధ్నాలుగేళ్ళూ పూర్తిగా మెలకువగానే ఉంటాడు. ఊర్మిళ భర్తృవిరహాన్ని అనుభవించనక్కర్లేకుండా, లక్ష్మణుడు తన భార్య జ్ఞాపకాన్ని మరిచిపోనక్కర్లేకుండా ఈ చమత్కారమైన ఊహ చేశారు తెలుగు ఆడవాళ్ళు.

స్త్రీల రామాయణపు పాటల నిర్మాణంలో ఓ ప్రత్యేకత ఉంది. అవి మన ఊళ్ళల్లో పెద్ద కుటుంబాల ఇళ్ళ నమూనాలో నిర్మించబడ్డాయి. ఆ ఇళ్ళల్లో మొదటి భాగంలో మగవాళ్ళే ఉంటారు. ఆడవాళ్ళు కనిపించరు. ఇంటి యజమాని గానీ, సేవకులు గానీ, అక్కడుండే వాళ్ళందరూ మగవాళ్ళే. ఇంటి మధ్యభాగంలో ఆడవాళ్ళూ, మగవాళ్ళూ సందర్భాన్ని బట్టి కలిసి కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఇంటి వెనక భాగంలోనూ, పెరట్లోనూ కేవలం ఆడవాళ్ళే ఉంటారు. అక్కడికి మగవాళ్ళెప్పుడూ వెళ్ళరు. చాలా అవసరమైనప్పుడు వాళ్ళు అక్కడికి వస్తున్నామని తెలియపరచి మగవాళ్ళు అక్కడికి వెళ్ళే సందర్భాలుండవచ్చు. కానీ ఇంటి వెనక భాగమూ, పెరడూ పూర్తిగా ఆడవాళ్ళ సామ్రాజ్యం. అక్కడ ఆడవాళ్ళు చుట్టుపక్కల అమ్మలక్కలను పిలిచి, విశ్రాంతిగా కబుర్లు చెప్పుకోవచ్చు. పాటలు పాడుకోవచ్చు, వామనగుంటలూ, వైకుంఠపాళీలూ ఆడుకోవచ్చు. ఇంటి మగవాళ్ళతో వొచ్చే కష్టాలు ఒకరికొకరు చెప్పుకోవచ్చు, వాళ్లని నిరభ్యంతరగా తిట్టిపొయ్యొచ్చు. ఊర్మిళాదేవి నిద్ర సరిగ్గా ఈ రకంగా నిర్మించబడింది. పాట ప్రారంభంలో శ్రీరాముడి పొగడ్తతో మొదలౌతుంది.

శ్రీరామభూపాలుడూ పట్టాభిషిక్తుడై కొలువుండగా
భరత శతృఘ్నులపుడూ సౌమిత్రి వరుస సేవలు సేయగా
మారుతాత్మజులప్పుడూ రాఘవుల జేరి పాదములొత్తగా
సుగ్రీవుడాకొలువులో కూర్మితో నమ్రుడై కొలువుండగా
… …
సకలదేవతలు గొలువా ఉదయాన పుష్పవర్షము గురిసెను

రామరాజ్యం అంతా సక్రమంగా ఉంది. అందరూ ఆనందిస్తున్నారు. ఆ సమయంలొ సీతాదేవి వచ్చి రాముడివైపు తిరిగి “రామమచంద్రా, మనం అడివికి వెళ్తున్నపుడు, లక్ష్మణుడితోపాటు ఊర్మిళ కూడా వొస్తానంది, అందుకు లక్ష్మణుడు ఒప్పుకోలేదు, అప్పటినించి ఆవిడ నిద్ర పోతోంది. లక్ష్మణుడిని వెళ్ళి ఆమెను లేపమనండి.” అని సవినయంగా మనవి చేస్తుంది. తాము అడివికి వెళ్ళిన రోజు మొదలుకొని ఊర్మిళ నిరంతరాయంగా నిద్రపోతోందని రాముడికి అప్పుడే తెలుస్తుంది. వెంటనే తమ్ముణ్ణి వాళ్ళావిడ దగ్గరికి పంపిస్తాడు, ముందు ఊర్మిళని నిద్రలేపి ఆవిడని సంతోషపరచమని. రామాజ్ఞ శిరసావహించి లక్ష్మణుడు అప్పుడు భార్య దగ్గరికి వెళతాడు. నిద్రపోతున్న ఊర్మిళ చీర సవరించి, ఆవిడ పక్కనే కూర్చుంటాడు. ప్రేమగా ఆవిడతో మాట్లాడడం మొదలు పెడతాడు.

కొమ్మ నీ ముద్దుమొగమూ సేవింప కోరినాడే చంద్రుడూ ….
అమృతధారలు కురియగా పలుకవే ఆత్మ చల్లన చేయవే

అ నిద్రలో తన గదిలోకి ఎవరో పరపురుషుడు ప్రవేశించాడనుకుంటుంది ఊర్మిళ.

తన్ను తా మరచియున్న ఆకొమ్మ తమకమున వణకదొడగే

ఆవిడ శరీరం భయంతో వణకడం మొదలవుతుంది.

ఇక్కడతో కథ ఒక్కసారిగా మారుతుంది. అంతవరకూ ప్రశాంతంగా వున్న వాతావరణం చెల్లాచెదురైపోతుంది. రామరాజ్య ధర్మం పటాపంచలై పోతుంది. ఊర్మిళ ఆ సందర్భంలో అనే మాటలు వింటే పరపురుషుడి చేత బలాత్కరించబడిన స్త్రీ ఎంత అసహాయ పరిస్థితిలో ఉంటుందో. తాను హింసకు గురై ఎలా చివరికి అపరాధిలా అందరిముందూ నిలబడాల్సి వస్తుందో గుండె చెదిరే లాగా బోధపడుతుంది.

ఊర్మిళ మొదట్లో ఆ ఆగంతక వ్యక్తిని గౌరవంగా ‘అయ్యా మీరెవ్వరయ్యా’ అంటూ ప్రశ్నిస్తుంది. తరవాత తనకున్న మగతోడు చాలా బలమైనదని నిబ్బరంగా చెప్పి అతన్ని భయపెట్టచూస్తుంది. ఊర్మిళ తన మగతోడుగా చెప్పుకున్న పేర్ల వరస చూడండి.

మాతండ్రి జనకరాజూ వింటె మిము ఆజ్ఞసేయక మానడూ
మా యక్క బావ విన్నా మీకిపుడు ప్రాణముల హాని వచ్చూ
మాయక్కమరది విన్నా మిమ్మిపుడు బ్రతుకనివ్వరు జగతిలో

మొదట తన తండ్రి జనక మహారాజు పేరు చెపుతుంది. ఆ తరవాత శ్రీరాముడి పేరు చెబుతుంది. ఆ తరవాతే తన భర్త పేరు చెబుతుంది. రాముడి పేరూ, తన భర్త పేరు తిన్నగా చెబుతుందా అంటే, చెప్పదు. మా అక్క మరిది అనీ, మా అక్క బావ అనీ అని గోప్యంగా చెబుతుంది. ఎందుకు? తెలుగు ఆడవాళ్ళు బావగారి పేరూ, భర్త పేరూ చెప్పకూడదు. ఒక పక్క తాను హింసపడే ప్రమాదం ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా తెలుగు కుటుంబాల ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా మసలవలసిన నిర్బంధంలో ఉన్నారో ఈ పాట సున్నితమైన మాటల్లో, కొరడాతో కొట్టినంత చురుక్కుమనిపించేలాగా చెబుతుంది. ఆ మాటల వల్ల తనని హింసించబోయే ఆ దుర్మార్గుడు తగ్గే అవకాశం లేదని బోధపడ్డాక ఊర్మిళలో దైన్యం మొదలౌతుంది. ఇక ఆ మాటలు కూడా పనిచేయకపోతే ఊర్మిళ తన నిస్సహాయత్వాన్నీ, అశక్తతనీ తలుచుకుని బాధ పడుతుంది.

హెచ్చయిన వంశానికీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ
కీర్తి గల ఇంట బుట్టీ అపకీర్తి వచ్చె నేనేమిసేతూ

అంటే ఆ బాధ తన శరీరానికీ మనసుకీ కలగబోయే దారుణమైన హింసగురించి కాదు – తాను మెట్టిన ఇంటికీ, పుట్టిన ఇంటికీ రాబొయే అపకీర్తి గురించి. స్త్రీ ఇలాంటి హింసకి గురి అయితే, లోకం ఆవిణ్ణే నిందిస్తుంది. అప్పటికి, ఇప్పటికీ కూడా తెలుగు లోకపు స్థితి ఇదే. ఇక తనకున్న ఒకే ఒక అవకాశం ఆ దుర్మార్గుడికి మంచి బుద్ధి కలిగేలా చెయ్యటం.
ఒకడాలి కోరిగాదా ఇంద్రునికి ఒడలెల్ల హీనమాయే
పరసతిని కోరి గాదా రావణుడు మూలముతొ హతమాయెనూ

ఇంద్రుడికి అహల్యాజారత్వంలో వచ్చిన శాపం ఊర్మిళకి తెలుసునంటే మనకి అర్థమౌతుంది. కాని రావణాసురుడు సీతని ఎత్తుకుపోవడం వల్ల రాముడి చేతిలో మరణించడం ఆవిడకి ఎలా తెలిసిందా అని మనం తప్పు పట్టక్కర్లేదు. ఈ కథ పాట పాడే ఆడవాళ్ళకి తెలుసు. ఇక్కడ కావలిసినదల్లా తన గదిలోకి వచ్చిన ఆ ఆగంతకుడికి తెలివి తెచ్చుకోమని చెప్పడానికి అవసరమైన మాటలు. పూర్వాపరాల్నీ, కాలక్రమాన్నీ అతిక్రమించిన నిర్మాణదక్షత కవయిత్రిది. ఆ వరసలోనే

ఆడతోడా బుట్టరా మావంటి తల్లి లేదా మీకును

అని, నీ తల్లీ, నీ చెల్లెలూ కూడా నీలాంటివాళ్ళ చేతిలో హింసకి గురయ్యే ప్రమాదం ఉంది సుమా! అని ఆ అగంతకుడికి జ్ఞాపకం చేస్తుంది.

ఊర్మిళ ఇంకా నిద్రపోతోంది కదా, ఈ మాటలు ఎలా అనగలుగుతోందని ప్రశ్నించకండి. తాను స్త్రీగా పుట్టడం మూలంగా వచ్చిన ఆధిభౌతికబలహీనతని నిద్రలో కూడా మరిచిపోవడానికి వీలులేని కుటుంబంలో ఉంది ఆమె. మేలుకొని ఉండగా మళ్ళా మళ్ళా మననం చేసుకున్న ఈ మాటలు ఆవిడ అంతరాంతరాలలో గాఢంగా గూడు కట్టుకుని ఉన్నాయి. నిద్రలో కూడా ఆమాటలే పైకి వస్తాయి. అందుకనే నిద్రపోతున్న ఊర్మిళ చేత కూడా కవయిత్రి ఈ మాటలు కంఠతా పట్టిన మాటల్లా చెప్పిస్తుంది.

లక్ష్మణుడు తాను ఆమె భర్తనని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆమాట తిన్నగా చెప్పలేడు. తాను పెరిగిన కుటుంబ మర్యాదలు ఆమాట భార్యకి తిన్నగా చెప్పనియ్యవు. అందుచేత డొంకతిరుగుడుగా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. తను రాముడికి తమ్ముణ్ణనీ, సీతకి మరిదిననీ, జనకుడికి అల్లుణ్ణనీ, వగైరా, వగైరా. ఇప్పుడు ఇక పాటలో ఊర్మిళ అంతశ్చేతనలోని మరొక పొర వ్యక్తమౌతుంది. లక్ష్మణుడు అనే మాటలకి ప్రతిగా ఆమె అనే మాటలు వింటే మనకి ఒక్కసారిగా బుర్ర తిరిగిపోతుంది.

శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో నొకరు గలరా?
జనకునల్లుని గానటే? భూమిలో జనకులనగా నెవ్వరు?
శతపత్రమున బుట్టినా చేడెరో సీతకూ మరిదిగానా?
సీత యనగా నెవ్వరూ [చెప్పుడీ] సృష్టిలో నేను యెరుగ

లక్ష్మణుడి మాటలూ, వాటికి ప్రతిగా ఊర్మిళ చెప్పిన ఎదురు మాటలూ, ఒకదాని తరవాత ఒకటి – మధ్యలో కవయిత్రి చెప్పే ‘అని అనెను, అని చెప్పెను’ లాటి ఆఖ్యాన పదాలు లేకుండా ఒకదానిని ఒకటి తరుముకుని వొస్తాయి, మనని ఉక్కిరిబిక్కిరి చేస్తూ, కథ పతాకస్థాయికి చేరుకుందని సూచిస్తూ.

ఎంతో మర్యాద గల కుటుంబంలో చాలా కట్టుబాట్ల మధ్య పుట్టిన శీలవతి యైన స్త్రీ ఇలా బరితెగించి మాట్లాడుతుందా! అందులోనూ జనకుడంటే ఎవడు, రాముడంటే ఎవడు, సీతంటే ఎవతె అని తృణీకారంగా మాట్లాడుతుందా!

ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఊర్మిళ కష్టాలకి కారణమైనవాళ్ళు వీళ్ళే. తన కూతుర్ని జాగ్రత్తగా రక్షించగలడో లేదో అనే ఆలోచనైనా లేకుండా ఈ చేతగాని లక్ష్మణుడి చేతిలో పెట్టాడు తనని తన తండ్రి. అధికార స్థానంలో ఉన్న తన బావగారు రాముడు, తన భార్యని తనతో తీసికెళ్తున్న పెద్ద మనిషి, తమ్ముడు బానిసలా తనతో పాటు అడివికి వచ్చేస్తుంటే, అయ్యో నీ భార్య ఏమయి పోతుంది, ఆమెను కూడా నీతో బాటు తీసుకొనిరా – అని అనలేకపోయాడు. సొంత అక్కగారు సీత కూడా తన చెల్లెలేమై పోతుందో అనే ఊహ లేకుండా సగర్వంగా మొగుడితో అడివికి పరిగెత్తింది. ఊర్మిళని ఒక్కత్తెనూ వదిలిపెట్టవద్దని లక్ష్మణుడికీ, రాముడికీ చెప్పగల స్థానంలో ఉన్నది ఆవిడే. ఈ విధంగా కుటుంబంలో తనని కాపాడగల వాళ్ళందరూ తన మానానికి తనని వదిలేశారు. దీన్ని బట్టి చూస్తే ఆ కుటుంబంలో ఊర్మిళ లోపల్లోపల ఎంత కుమిలిపోయి ఉంటుందో మనం ఊహించుకోచచ్చు. ఈ సమిష్టి కుటుంబ రాజకీయాలు ఊర్మిళలో నరనరానా జీర్ణించుకుపోయాయి. వాళ్ళ మీద ఆవిడకి పట్టరాని కోపం, చెప్పరాని కక్షా ఉండడంలో ఆశ్చర్యం లేదు. కాని ఆ కోపమూ, ఆ కక్షా గాఢమైన నిద్రలో కలవరింతగానే పైకొస్తాయి. వొళ్లు తెలియని నిద్రలో కలవరింత రూపంలోనో, మరేదో దెయ్యంపట్టిన కారణం పేరుతోనో, ఏదో ఒక ముసుగులో తప్ప వాళ్ళ నిజ వ్యక్తిత్వం బయటకి రావడానికి వీల్లేని సమాజంలో వాళ్ళున్నారు. హిస్టీరియా పేరుతో – దాని మాటునే – సమిష్టికుటుంబపు స్త్రీలు తమమీద అధికారం చెలాయించే వారందరినీ నోటికొచ్చినట్టు తిట్టడం మనకి తెలుసు. స్త్రీలలో వుండే అలాంటి కక్షని, అలాంటి కోపాన్ని, ఊర్మిళాదేవి పాత్ర ద్వారా, ఆవిడ నిద్ర ముసుగులో, ఈ పాట రాసిన కవయిత్రి పరమ ప్రతిభావంతంగా చిత్రించింది. తెలుగులో ఇంత సమర్థంగా పరమ క్లిష్టమైన స్త్రీ మానసిక స్థితిని కూర్చి చెప్పిన చోటు మరొకటి లేదు.

లక్ష్మణుడు చేసేదేమీ లేక హఠాత్తుగా ఆవిడకి మెలకువ వచ్చే మాటలు చెప్పడం మొదలు పెడతాడు. నిన్ను ఊర్మిళ అంటారు, కనీసం ఆ మాట కాదనకు అని ప్రాధేయపడతాడు. అడివిలో సీతాదేవిని రావణాసురు డెత్తుకుపోయాడనీ, రాముడూ తనూ యుద్ధంచేసి సీతను రక్షించామనీ చెబుతాడు. ఇలాంటి విపత్కరమైన సంఘటన గురించి హఠాత్తుగా చెప్తే ఆవిడ నిద్ర లేచి మామూలుగా మాట్లాడుతుందని లక్ష్మణుడి అలోచన. కాని ఈ మాటలేవీ ఊర్మిళ మీద పనిచెయ్యవు. అప్పుడు లక్ష్మణుడు దీనంగా, ‘నువ్వు నన్ను వదిలేస్తే నాకు లోకంలో అపకీర్తి వస్తుంది,’ అంటాడు. ఇది ఆ సమాజంలో ఆడవాళ్ళు అనే మాట. మొగుడు వదిలేస్తే పెళ్ళానికి అపకీర్తి వస్తుంది. మగవాడు హాయిగా ఇంకో పెళ్ళి చేసుకుంటాడు. ఈ పాటలో ఆ పరిస్థితికి పూర్తిగా వ్యతిరేకమైన మరో సమాజాన్ని ఈ కవయిత్రి నిర్మిస్తోంది. స్త్రీ వదిలేస్తే పురుషుడికి అపకీర్తి వచ్చే సమాజాన్ని ఇంత స్పష్టంగా కోరుకోగలిగిన స్వేచ్ఛ స్త్రీలకి ఈ పాటలో ఉంది.

లక్ష్మణుడు ఊర్మిళను ఇంకా ప్రాధేయపడతాడు. తాను ఆమె భర్తనని ఇంకా ఆ డొంకతిరుగుడు మాటల్లోనే మళ్ళా మళ్ళా చెబుతాడు. నిద్రలో ఊర్మిళ కోపంగా మాట్లాడిన మాటలు తన కర్థమయ్యాయని, కోపాన్ని తగ్గించుకోమని తాను ప్రార్థిస్తున్నానని చెప్పడానికి ఈ పాటలో ఈ పునరుక్తులు సూక్ష్మ సూచికలు. ఊర్మిళ లేకపోతే తాను బ్రతకలేననీ ఈ పధ్నాలుగేళ్ళూ తనకి నిద్రాహారాలు లేవనీ మొరపెట్టుంటాడు.

నిన్ను బాసినది మొదలూ ప్రాణసఖి నిద్ర హారములెరుగనే
నీవు లేవకయున్ననూ ఓ సఖీ ప్రాణములు నిలుపలేనే

స్త్రీలు తమ భర్తల నించి వినాలని తపించే ప్రియమైన మాటలు ఇవి.

అప్పటికీ ఊర్మిళ కరుణించకపోతే లక్ష్మణుడు చివరికి ఏడుస్తూ తనని తాను చంపుకోడానికి కత్తి తీస్తాడు. ఆ చప్పుడుకి ఊర్మిళ హఠాత్తుగా నిద్ర లేస్తుంది. లేచి భర్త కాళ్ళ మీద పడుతుంది. ఆత్మహత్య వీరపురుష లక్షణం కాదు. కాని, ఈ కథలో లక్ష్మణుడు వీరపురుషుడు కాడు.

పాటలో నిద్ర మత్తులో ఉన్న ఊర్మిళ వేరు, నిద్ర మేల్కొన్న ఊర్మిళ వేరు. నిద్ర మేల్కొన్న ఊర్మిళ భార్య లాగ ప్రవర్తించాలి. అయినా ఆ ఊర్మిళ కూడా ఒక పక్క తను భర్త మీద చూపించవలసిన గౌరవాన్ని చూపిస్తూనే తన కోపాన్ని వ్యక్తపరుస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల మూడోవారు ఎవ్వరూ లేరని, తన పడకగదిలో భర్తతో మాట్లాడుతోందని ఒక్కసారి గమనించండి. ఈ సందర్భంలో సమిష్టికుటుంబం లోని స్త్రీలకు కూడా తమ భర్తలతో మాట్లాడటంలో కొంత స్వేచ్ఛ ఉందని మనకు తెలుసు.

మా తండ్రి జనకరాజూ మిమునమ్మి మరచి కళ్యాణమిచ్చే
మానవంతల్లుడనుచూ తెలియకా మదిని ఉప్పొంగుచుండే
చిత్తమొకదిక్కునుంచీ సమయమున చిన్నబుత్తురు యింతులా

“మా తండ్రి జనకుడు తెలియక, మీరు చాలా పౌరుషం గలవారని నమ్మి మీకు నన్నిచ్చి పెళ్లిచేశాడు. మీరేమో ఇంకొకళ్ళ మీద మనస్సు పెట్టి, నన్ను నలుగురిలో చిన్నబుచ్చారు,” అని ఇప్పుడు ఊర్మిళ స్పష్టంగా తన భావాన్ని చెప్తుంది. ఈ ఆరోపణలన్నీ లక్ష్మణుడు తలవంచుకుని వింటాడు. లోపల బాధపడతాడు. మళ్ళా తనకి ఊర్మిళంటే ఎంత ప్రేమో ఆమె నిద్రపోతున్నప్పుడన్న మాటలే మరోసారి అంటాడు. మొత్తం అంతటినీ కర్మ పేర తోసేస్తూ తాము ఎప్పుడో పూర్వజన్మలో చేసిన పనికి ఇప్పుడు ఫలితం అనుభవించామంటాడు.

కథ ఇప్పుడు పెరటి వాకిలి లోంచి మధ్యగదుల్లోకి వస్తుంది. పొరపొచ్చాల్లేకుండా ఒకరితో ఒకరు పరిహాసోక్తులు చెప్పుకుంటూ ఉండే సమిష్టి కుటుంబం ఇక తరువాతి కథ లోది. మొట్ట మొదటి సారిగా ఊర్మిళ ఆ కుటుంబానికి కేంద్రమౌతుంది. కౌసల్య ఊర్మిళకీ, లక్ష్మణుడికీ తలంటి, జలకాలాడించి, కొత్త బట్టలు కట్టి షడ్రుచులతో రాజయోగ్యమైన భోజనం వడ్డిస్తుంది. ఒకళ్ళ మీద ఒకరు చెణుకులు విసురుకుంటారు. ఈ మాట్లాటలో సీతా, శృతకీర్తీ, మాండవీ (శృతకీర్తి, మాండవుల పేర్లు ఈ పాటలో లేవు. కానీ ఉన్నాయని మనం ఊహించుకోవచ్చు) ఒక పక్షమైతే శాంత ఇంకొక పక్షమౌతుంది.

రామాయణంలో శాంత చాలా అప్రధానమైన స్త్రీ పాత్రలలో ఒకటి. అయినా తెలుగు స్త్రీల పాటల్లో ఆవిడకి చాలా ప్రాధాన్యత ఉంది. రాముడికి అక్కగారుగా, సీతకీ ఊర్మిళకీ (మాండవికీ, శృతకీర్తికీ) ఆడపడుచుగా చాలా పెద్దరికం ఉంది ఆవిడకి. అవసరమైతే ఆవిడ రాముణ్ణి కూడా శాసించగలదు. ఈ పాటలో విషయం కాదు గానీ, స్త్రీల రామాయణపు పాటల్లోదే ఇంకొక సంగతి ఇక్కడ క్లుప్తంగా చెప్పాలి. గర్భవతి యైన సీతాదేవిని అడవులకి పంపించేసిన తరవాత, రాజగౌరవం కోసం అశ్వమేధయాగం తలపెట్టిన రాముడికి తనతో పాటు పీటల మీద కూర్చోడానికి భార్య కావలిసి వస్తుంది. మరొక భార్యని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోని రాముడు బంగారపు సీతను తయారు చేయించి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆ బంగారపు సీతకి శాస్త్రోక్తంగా తన అక్క గారైన శాంతాదేవి తలంటు పొయ్యాలి. ఆ సీతకి తలంటు పోయమని రాముడు శాంత నడగ్గా, శాంత రాముడికి ‘నన్నడిగి నీ పెళ్లాన్ని అడవులకి పంపించావా? ఈ బంగారు బొమ్మకి నేనెందుకు తలంటు పొయ్యాలి? పొయ్య’నని తీక్షణంగా జవాబు చెబుతుంది. తమకి పురుష శాస్త్రాలే ఇచ్చిన గౌరవాన్ని స్త్రీ మర్యాదని కాపాడడానికి, కుటుంబాలలో మొగాళ్ల మాటున బతికే అబలలైన స్త్రీలు అవసరం వొచ్చినప్పుడు బలంగా ఉపయోగించుకోగలరని ఈ పాటల కవయిత్రులు ఊహించడం వాళ్ల భావనా దక్షతకి నిదర్శనం.

తెలుగు సమిష్టికుటుంబాలలో ఆడబడుచుకి చాలా అధికారం ఉంది, ముఖ్యంగా కొత్తకోడలి మీద. కొత్తగా కాపరానికొచ్చిన కోడలికి భర్తతో ఏర్పడుతూ ఉన్న చనువుని పెంచడమో తుంచడమో చేయగల శక్తి ఉంది ఆడబడుచుకి. అంచేత కొత్తకోడలెప్పుడూ ఆడబడుచు పట్ల భయంగా, విధేయంగా, జాగ్రత్తగా ఉండాలి. తన మొగుడితో సమాన వయస్కురాలు కాబట్టి, తనకన్నా మరీ ఏమంత పెద్దది కూడా కాదు కాబట్టి, అత్తగారికన్నా ఆడబడుచు కొత్తకోడల్ని వేయి కళ్ళతో కనిపెడుతూ ఉంటుంది. ఎప్పుడు పోయి ఏ పుల్లవిరుపు మాట తన మొగుడితో అన్నా తన కాపురంలో చిక్కులొచ్చాయన్న మాటే. ఆడబడుచు అర్థ మొగుడని తెలుగులో సామెత ఉంది. కాని, ఈ పాటలో చూడండి, శాంతని ఎంత సున్నితమైనదానిగా, ఎంత ప్రేమ గలదానిగా చూపించిందో కవయిత్రి. ఆడవాళ్ళకి అలాంటి ఆడబడుచులు కావాలి. ఆ కోరిక ఈ పాటలో సున్నితంగా వ్యక్తమౌతుంది. మాటవరసకి, ఇంటి కోడళ్ళూ, ఆడబడుచులూ రెండు పక్షాలుగా విడిపోయినా, ఎంత పరాచికాలాడుకున్నా, చివరికి శాంత సీతని మెచ్చుకోవడంతోటే ఈ పరాచికాలు ముగుస్తాయి.

ఒకరి మీద ఒకరు విసురులు విసురుకునే ఈ కబుర్ల మాటున ఇంకో సంప్రదాయ రహస్యం ఇమిడి ఉంది. కుటుంబంలో ఎప్పుడూ ఆడవాళ్ళు తాము అందంగా ఉన్నామని చెప్పుకోరు. వాళ్ల అందాన్ని చూపించి మొగుణ్ణి వాళ్లు వశపర్చుకోలేదు. వాళ్లు ధర్మ పత్నులు. వెలయాళ్లు కారు. మొన్న మొన్నటి వరకూ, ఆడవాళ్ళు రాత్రిపూట అద్దం చూసుకుంటే అది తప్పుగా భావించేవారు. అలా చేస్తే వచ్చే జన్మలో వాళ్ళు వేశ్యలై పుడతారని ఇంట్లో పెద్దవాళ్ళు దెప్పిపొడిచేవాళ్ళు కూడా.

శాంత ఈ పరాచికాలని మొట్టమొదట తనే ప్రారంభిస్తుంది. అంటే ఆ రకమైన సంభాషణ కోడళ్ళెవరూ మొదలు పెట్టకూడదు. ఊర్మిళని పొగుడుతున్నట్టు కనిపిస్తూ శాంత, ఆమె అందానికి దిష్టి తగులుతుందనీ, దిష్టి తియ్యాలనీ అంటుంది. కోడళ్ళలో పెద్దదిగా సీత వెంటనే కల్పించుకొని మీ తమ్ములే లోకాన్నంతటినీ మోహింపజేసే సౌందర్యవంతులు, అంచేత వాళ్ళకే దిష్టి తీయమంటుంది. శాంత ఊరుకుంటుందా, ఆ మాటకి ఎదురు మాట చెప్పి, మీ అక్కచెల్లెళ్ళు నలుగురూ మా తమ్ముళ్ళని నలుగురినీ మీ అందాలతో కట్టి పడేసుకోలేదా అంటుంది. సీత టపీమని తిరుగు జవాబుగా, నీవేమైనా తక్కువ తిన్నావా శాంతమ్మా, అడివిలో ఏమీ ఎరుగని మా అన్నగారు ఋష్యశృంగుడికి అన్నీ నేర్పిన జాణవు నువ్వు అంటుంది. చివరికి శాంత గౌరవభావంతో, పద్మంలో ఉండే మహాలక్ష్మి మానవరూపంలో సీతగా అవతరించి తమ యింటికి కోడలవడం అదృష్టమని సీతని పొగుడుతుంది. ఆడబడుచు దెప్పడం పోయి, ఇలా గొప్పగా పొగడడం ఆడవాళ్ల ఊహల్లో ఉండే మాట. ఈ పాటలో పరాచికాలు చివరికి కుటుంబ సామరస్యాన్ని, పరస్పర ప్రేమల్ని పెంచేవిగా మిగులుతాయి. సమిష్టికుటుంబంలో ఆడవాళ్ళు సరిగ్గా కోరుకునేది అదే. హాస్యాలకీ, వ్యంగ్యానికీ జాగా ఉండాలి, అయినా ఎవరి మనసులూ ఏ మాటవల్లా నొవ్వకూడదు.

చివరికి కథ పడగ్గదిలోకి వస్తుంది. ఈ పాటలో ఈ భాగం ఎంతో ముచ్చటగా పాడుకుంటారు ఆడవాళ్ళు. తలుపులు మూసేస్తారు. ఎట్టకేలకు ఆలుమగలకి ఏకాంతం దొరుకుతుంది. అయినా అది నిజమైన ఏకాంతం కాదు. కిటికీలకు అవతల ఎత్తయిన కుర్చీలు వేసుకుని అత్తలూ ఆడబడుచూ చెవులు రిక్కించి వింటూ వుంటారు, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో అని. ఆ తరువాత వస్తుంది, ఆడవాళ్లు కోరుకునే అతి సుందరమైన దృశ్యం. లక్ష్మణుడు ఊర్మిళకి ముడి విప్పి, తల దువ్వి, సుతారంగా జడ వేస్తాడు. వేసి అందంగా జడలో మల్లెలూ, జాజులూ తురుముతాడు. లక్ష్మణుడికి అది బాగా చాతనయిన కళ. ఎంతోమంది భార్యలు తమ భర్తలనించి కోరుకొనే కానుక ఇది. ఆ తరువాత విశ్రాంతిగా తాంబూలాలు నములుతూ కూర్చుని ఉండగా ఊర్మిళ అడుగుతుంది. ఆ అడగడంలో కూడా ఒక చురుకుదనం ఉంది.

సింహవిక్రములు మీరూ ఉండగా సీతెట్లు చెరబోయెనూ?

ఇది విశేషమైన ప్రశ్న. లక్ష్మణుడి పరాక్రమం మీద ఊర్మిళకి అపారమైన విశ్వాసం ఉందని ఇప్పుడు చెప్పించడంలో కవయిత్రి ఉద్దేశించిన సూక్ష్మం ఒకటి వుంది. ఇంతవరకూ ఊర్మిళ అన్న మాటలవల్ల దెబ్బ తిని, కుంగిపోయిన అతని ఆత్మ విశ్వాసాన్ని, మళ్లా ఆవిడే పునరుద్ధరించగలదు. మొగవాళ్ల బలమూ బలహీనతా కూడా ఆడవాళ్ల చేతుల్లోనే వున్నాయని కవయిత్రికి తెలుసు.

ఆ తర్వాత వచ్చే భాగం మనకందరికీ తెలిసిన రామాయణానికి పునరుక్తి మాత్రమే అనిపిస్తుంది. కాని జాగ్రత్తగా వింటే అది పునరుక్తి కాదు అని తెలుస్తుంది. స్త్రీ రామాయణం చెప్తే ఎలా వుంటుందో తెలియడం కోసం ఈ భాగం మళ్ళా వినాలి. లక్ష్మణుడి హృదయాన్ని అర్థం చేసుకుని, దానితో స్త్రీ దృక్పథాన్ని సున్నితంగా జోడించి కవయిత్రి చేస్తున్న వ్యాఖ్యానం ఇది. రామాయణకథని లక్ష్మణుడి చేత చెప్పించేటప్పుడు కవయిత్రి ఏ భాగాలు వదిలేసింది, ఏ భాగాలకి ప్రాముఖ్యం ఇచ్చింది అన్న విషయం ద్వారా స్త్రీ హృదయం మనకి అర్థమవుతుంది. మారీచుడు ‘హా లక్ష్మణా! హా సీతా!’ అని అరిచాడట. మనకు తెలిసిన రామాయణంలో మారీచుడు హా లక్ష్మణా అని మాత్రమే అంటాడు. రాముడికోసం తాను వెళ్ళనంటే సీత లక్ష్మణుడిని నానా చెడ్డ మాటలూ అన్న సంగతిని లక్ష్మణుడు ఎంతో మృదువుగా చెబుతాడు. సీత మీద మరీ నేరం మోపడం ఈ పాట రాసిన కవయిత్రికకి ఇష్టం లేదు. వింటున్న ఆడవాళ్ళకీ ఇష్టం లేదు. సీత చుట్టూ లక్ష్మణుడు గీతలు గీసి ఆ గీతలు దాటొద్దని చెప్పి వెళతాడని మనకి తెలిసిన మొగ రామాయణాలు విశేషంగా చెప్తాయి. ఈ పాటలో ఆ ప్రసక్తి ఒక్క అర పాదంలో ముగిస్తుంది కవయిత్రి. రావణాసురుడు వచ్చి సీతని ఆమె నుంచున్న భూమిని పెళ్ళగించి ఎత్తుకుపోతాడు. మీకందరికీ తెలిసే ఉంటుంది, ఈ కథనం వాల్మీకంలో లేదనీ, దక్షిణాది రామాయణాల్లో ఉందనీ. అది ఆడవాళ్ళకి చాలా నచ్చే విశేషం. అందుకే అది ఈ పాటలో ఉంటుంది. లక్ష్మణుడు, సీతాదేవి నగలలో గుర్తు పట్టేది ఆమె కాలి అందెలు మాత్రమే అని రామాయణ కథకులు ఎంతో మర్యాదగా చెప్పారు మనకి. కాని ఈ పాటలో ఒక కొత్త విషయాన్ని చేరుస్తుంది కవయిత్రి. సుగ్రీవుడు రాముడికి బహుమానంగా ఇచ్చాడు ఈ నగలని. ఎందుకంటే ఆయన కౌసల్యాపుత్రుడు కాబట్టిట. ఒక తల్లికి కొడుకుగా రాముణ్ణి గౌరవించడం ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మాట. ఆతరవాత కధని కవయిత్రి చాలా వేగంగా చెప్తుంది. సీతాన్వేషణ నాలుగు పంక్తుల్లో చెప్పేసినా, లంకలో సీత స్థితి హనుమంతుడు వర్ణించడంలో కవయిత్రి ఏ రామాయణకర్తా వాడని మాటలు వాడుతుంది..

తలలెల్ల జడలు గట్టె ఉదరమున వెదురు మొలచీయుండెను
తల్లి యుండేటి విధమూ తలచితే తాళ శక్యము గాదయా

ఉదరమున వెదురు మొలవడం అంటే ఏమిటో నాకు బోధపడలేదు. అదీకాక, వాల్మీకంలో సీత తల జడలు కట్టి ఉందనీ లేదు. ఇది అలా ఉంచి, రావణుడితో రాముడి యుద్ధం ఒక్క పంక్తిలో తెమిల్చేసింది కవయిత్రి. యుద్ధాల మీద ఆడవాళ్లకి ఆసక్తి లేదు. కాని సీత అగ్నిప్రవేశం మాత్రం బలంగా నడుస్తుంది. సీతని అలంకరించి తీసుకురమ్మని అడిగి, తీరా ఆవిడ అక్కడికి వొచ్చేక, “పదినెలలు చెర యున్నదీ భామతో భాషించ” నని అంటాడు రాముడు. అప్పుడు సీత “ఒట్టి సత్యములేటికీ ఓ రామ చిచ్చు గావించు” మంటుంది. లక్ష్మణుడి మాటల్లో ‘ఆకాశమంత పొడవు మంటలో మా వదిన మాటలాడింది. జగము నిండిన యట్టుల, ఆ మంట తటాకంలా అయింది.’ ఈ కథ చెప్పినవాడు లక్ష్మణుడు. పెద్ద రామాయణాల్లో లక్ష్మణుడు చెప్పుకోలేని సున్నితమైన విశేషాలు ఈ రామాయణంలొ వుంటాయి. రామాయణంలో స్త్రీ పాత్రలతో పాటు, లక్ష్మణుడు కూడా ఒక బలహీన పాత్రే అని కవయిత్రి ఉద్దేశం.

కథ పూర్తయ్యేటప్పటికి మనం కూడా పడగ్గది లోంచి ఆడవాళ్ళ గుంపు లోకి వస్తాం. అంటే ఇంటి పెరట్లోకి వస్తాం. అక్కడ అమ్మలక్కలు మగవాళ్ళ మీద ఎన్ని విసుర్లైనా విసురుకోవచ్చు. అందుకే కవయిత్రి రాసిన ఆఖరి మాట:

అక్కరో వింటిరటరే నేడు మన చక్రధరునీ బుద్ధులూ

ఇది ఊర్మిళాదేవి నిద్ర కథ. కాని నిజానికి ఈ పాట సమిష్టికుటుంబాలలో ఆడవాళ్ళు ఎలాంటి ఊహలు చేశారో, రామాయణం ఎలా జరిగితే బాగుణ్ణనుకున్నారో మనకు చెప్పే పాట. ఆడవాళ్ల మర్యాదల్నీ సమిష్టి కుటుంబ గౌరవాలనీ ఏమీ కాదనకుండా, చాల సాంప్రదాయికంగా, మొగ ప్రపంచాన్ని చితక్కొట్టేసే పాట ఇది. ఆడవాళ్ళ వ్యక్తిత్వాలని నిబ్బరంగా నిలబెట్టిన రచన ఇది. కవయిత్రికి కధ చెప్పడంలోనూ, అవసరమైనప్పుడు అవసరమైన మాట వాడడం లోనూ, కొన్ని సంగతులు చెప్పకుండా మానెయ్యడంలోనూ, అసాధారణమైన సంయమనం వుంది. మర్యాదల్ని పాటిస్తూన్నట్టు కనిపిస్తూనే మర్యాదల్ని తిరస్కరించే శక్తి ఉంది. ఇందులో పాత్రలకి వ్యక్తమైన మనస్సే కాకుండా సుప్తచేతన, అవ్యక్తభావాలు అనేకం ఉంటాయి. ఇలాంటివి ఫ్రాయిడ్‌ వొచ్చిన తరవాతే మన సాహిత్యంలో కనిపిస్తాయని విమర్శకులు అంటారు. అలా అనుకోవడం తప్పు అని ఈ పాట మనకి గుర్తు చేస్తుంది. సాహిత్యంలో ఆధునికత ఇంగ్లీషుతో సంపర్కం ఏర్పడిన తరువాత పందొమ్మిదో శతాబ్దిలోనే మొదలవలేదనీ – కావాలంటే ఈ ఆధునికతని వలసవాద ఆధునికత అనండి కాని – తెలుగులో ఇంతకు పూర్వమే ఇంకొక ఆధునికత దాదాపు పదహారో శతాబ్ది నాటికే ఏర్పడి ఉందని కొంతకాలంగా నా మిత్రులు డేవిడ్‌ షూల్మన్‌, సంజయ్‌ సుబ్రహ్మణ్యంలతో కలిసి వాదిస్తున్నాను. అందుకు మేము ఇంతవరకు చూపించిన అనేక ఆధారాలతో పాటు ఈ పాటని కూడా చేర్చుకోవాలి..

పాదసూచికలు
* ఏలూరులోని మంజువాణి ప్రెస్‌ నించి నందిరాజు చలపతిరావుగారు 1899లో స్త్రీల పాటలు అనే పుస్తకం ప్రచురించారు. తరవాత 1905లో మంగు జగన్నాథ రావుగారు నూరు హిందూ స్త్రీల పాటలు అనే పేరుతో 1905లో మరో పుస్తకం ప్రచురించారు. ఎన్నాళ్ళుగానో పెద్దకులాల వారి ఆడవాళ్ళు పాడుకునే పాటలకి ఈ ప్రచురణలతో అచ్చులో గుర్తింపు వొచ్చింది. ఈ పుస్తకాలు నేను చూడలేదు, అందులో ఈ పాట వుందో లేదో నాకు తెలియదు. అయితే నేను చూసినంత వరకు, ఈ పాట ఎన్నిసార్లు అచ్చయినా తప్పుల్తోనే అచ్చయింది. ముఖ్యంగా ఈ సంచికలోనే అందించిన ఎన్. వి. గోపాల్ అండ్ కో. ప్రచురణలో ఊర్మిళాదేవి నిద్రలేచి భ్రమజెందుట అని ఒక ఉపశీర్షిక కనిపిస్తుంది. అది అక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఆ తర్వాతి ఉపశీర్షిక (పతి పాదములకు ఊర్మిళాదేవి మ్రొక్కుట) ముందు పాదంలో ‘అనుచు వాదము చేయగా | ఊర్మిళా గద్దిల్ల పడి లేచెనూ’ అని ఉంటుంది. అంటే, అప్పటిదాకా ఊర్మిళ నిద్రనుంచి లేవలేదనే మనం అర్థం చేసుకోవాలి. ఇలా సరిగ్గా పాట స్వరూపం తెలుసుకుని దీన్ని పరిష్కరించిన వాళ్లు లేకపోయారు. ఇప్పటికైనా ఈ పాట పాడుతూండగా విని, ఆ పాడే రీతికి తగిన అక్షరరీతిలో ఈ పాటని రాసి ప్రచురించాల్సిన అవసరం ఉంది. నేను ఈ వ్యాసంలో ఉదహరించిన చరణాలను ఆ విధంగా పరిష్కరించి చూపించాను. అంచేత అవి అచ్చుప్రతిలో ఉన్నట్టుగా ఉండవు.
-------------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు, 
ఈమాట సౌజన్యంతో

1 comment:

Rajeswari said...

చాలా బావుంది, మంచి పరిచయం.