Thursday, October 3, 2019

థాయ్‌లాండ్ యాత్రాగాథ – 3


థాయ్‌లాండ్ యాత్రాగాథ – 3





సాహితీమిత్రులారా!


పురాతన రాజధాని
చూస్తూ చూస్తూనే థాయ్‌లాండ్‌లో రెండు రోజులు గడచిపోయాయి.


కానీ ఆ రెండు రోజుల్లోనే దేశాన్ని ఎప్పట్నించో చూస్తోన్న భావన. ఆ నేలకూ నాకూ మెల్లమెల్లగా అనుబంధం ఏర్పడుతోందన్న స్ఫురణ… రెండు రోజులు ఏ ప్రదేశంలోనయినా గడిపితే ఆ ప్రదేశంతో ప్రేమలో పడటం, మానసిక అనుబంధం ఏర్పరచుకోవడం నాకు బాగా అనుభవమే!

మూడోరోజు–మే అయిదో తారీఖున, సత్యజిత్‌తో కలసి పురాతన రాజధాని అయుత్తయ్య వెళ్లిరావడం ముఖ్య కార్యక్రమం.

“మనకు ఉత్తరాన ఎనభై తొంభై కిలోమీటర్ల దూరం. అంతా కలిసి ఏడెనిమిది గంటలు. మధ్యాహ్నం రెండింటికల్లా తిరిగిరావచ్చు. ఇపుడు ఆరింటికి మనింటికే వాహనం వస్తుంది.” వివరించారు సత్యజిత్.


ఏడెనిమిదిమంది సులభంగా పట్టే పెద్దపాటి తెల్లని ఎస్‌యూ‌వీ వచ్చి మా ఇంటి ముందు ఆగింది. ఆ వ్యానులోంచి దిగిన ఓ చురుకైన యువతి ఆరోజు మా గైడ్ అట.

‘మనమే మొదటి పికప్‌లా ఉందే… ఇంకా వెళ్లి మిగతావాళ్లను కూడా ఎక్కించుకోవాలి గాబోలు…’ మనసులోని మాటను ప్రకాశంగా అనేశాను.

“లేదు లేదు. ఇంకెవరూ లేరు. ఈ రోజుకు మనిద్దరమే వీళ్ల గెస్టులం.” వివరించారు సత్యజిత్. ఇద్దరి పుణ్యానికి అంత పెద్దపాటి వాహనం ఎందుకో అనిపించింది. మళ్లా వాళ్ల లెక్కలు వాళ్లకుంటాయిలే అని సమాధానపడ్డాను. ఏది ఏమయినా ఇదో ఘనమైన యాత్ర అవబోతోంది అన్నమాట నిజం.

మా గైడు చాలా కలుపుగోలు మనిషి. చూడగానే స్నేహభావం కలిగింది.


“వినే ఉంటారు… మనం వెళ్లే అయుత్తయ్య అప్పటి అయుత్తయ్య సామ్రాజ్యపు రాజధాని. ఈ నగరాన్ని కేంద్రంగా చేసుకొని అయుత్తయ్య వంశానికి చెందిన ముప్ఫైమూడుమంది రాజులు పద్నాలుగో శతాబ్దం నుంచి పద్దెనిమిదో శతాబ్దం దాకా నాలుగు వందల ఏళ్లపాటు దేశాన్ని పాలించారు. ఆ తర్వాత 1782 నుంచి ఇపుడు పాలిస్తోన్న చక్రి వంశాధిపత్యం మొదలయింది.” గైడు తన వివరణ మొదలుపెట్టింది.

“ఆ సంగతులు తర్వాత, ముందు ఈ సంగతి చెప్పు! నువ్వింకా విద్యార్థివేనా? ఇది నీ పార్ట్ టైమ్ ఉద్యోగమా? ఈ పనిలోకి ఎలా వచ్చావూ?” ఆత్రగాడికి తొందరెక్కువ.

నా ఆత్రం గ్రహించి నవ్విందావిడ. “పోయినేడాదే చరిత్ర ముఖ్యవిషయంగా డిగ్రీ ముగించాను. నాకు తెలిసిన విషయాలు పదిమందికీ చెప్పాలన్న తహతహ పుణ్యమా అని ఈ ఉద్యోగంలో చేరాను. అలా అని నేను రెగ్యులర్ ఉద్యోగినిని కాదు. ఫ్రీలాన్సర్‌ని. ఇష్టమున్నంతకాలం ఈ పని చేస్తాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలని ఉంది. బహుశా వచ్చే ఏడాది అందులోకి ప్రవేశిస్తాను.” క్లుప్తంగానే అయినా తన స్వభావాన్నీ, అభిరుచులనూ ఆవిష్కరించిందావిడ.

“మీది బ్యాంకాకేనా?” కుతూహలానికి ఎల్లలు ఉండవు!

“కాదు. ఇక్కడికి నూటిరవై కిలోమీటర్లు ఉత్తరాన ఉన్న చిన్న పట్టణం. హైస్కూలుదాకా అక్కడే చదివాను. డిగ్రీ కోసం ఇక్కడికొచ్చాను.”

“మీ అమ్మానాన్నా?”

“మా ఊర్లోనే ఉంటారు. ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకొన్నా. ఇపుడు వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో…”

మా వాహనం నగరపు పొలిమేరలు దాటింది.

“మన పక్కనే ఏదో నది ఉన్నట్టుందే…”


“ఏదో నది కాదు. ఛోఫ్రయా నది. బ్యాంకాక్‌లో చూసే ఉంటావు. మా దేశంలో అతి పెద్ద నది ఇది. అంతా కలసి నాలుగువందల కిలోమీటర్లుండొచ్చు. ఉత్తరాన కొండల్లో పుట్టి బ్యాంకాక్ దాటాక సముద్రంలో కలుస్తుంది. వ్యవసాయానికి ఇదే మా ముఖ్యమైన ఆధారం. ఒకప్పుడు ఇది ఈ దేశపు ముఖ్యమైన జలమార్గం కూడానూ. మళ్లా మనకీ నది అయుత్తయ్యలో కనిపిస్తుంది.”

అటూ ఇటూ కనిపిస్తోన్న ప్రదేశాలనూ ఊళ్లనూ పరిశీలించాను.

నిన్నటి ప్రయాణంలో బ్యాంకాక్ వదిలీ వదలగానే గ్రామసీమల్లోకి వెళ్లిపోయిన భావన కలిగింది. ఇవాళ మాత్రం నగరాన్ని దాటి గంట గడిచినా ఆ నగరపు వాసనలు పోలేదు. వంద కిలోమీటర్లు ముందుకు సాగినా తన ప్రభావం వదలని బొంబాయి గుర్తొచ్చింది.

గంటన్నరా రెండుగంటల్లో అయుత్తయ్య చేరుకొన్నాం.

మే నెల అవడంతో అంత ఉదయాన కూడా ఎండ తన చిరాకును మామీద ప్రదర్శించడం మొదలెట్టింది. ఒక్క ఎండే అయితే పర్లేదు, ఉక్కపోత కూడానూ! ఎండా ఉక్కల సంగతి ఎలా ఉన్నా, ఆదివారం అవడం వల్ల కాబోలు టూరిస్టుల హడావుడికేం తక్కువలేదు. మాలాంటి ఎర్లీ పక్షులతో నగరంలో కళకళలు…


“ఒకప్పుడీ నగరం పది లక్షల జనాభాతో వ్యాపార, వ్యవసాయ కేంద్రంగా గొప్ప వెలుగు వెలిగింది. రాజకీయంగా రాజధాని అవడం సరేసరి. జపాన్, ఇండియా, పర్షియా, యూరప్‌ల నుంచి వ్యాపారం కోసం వచ్చేవాళ్లు. అప్పట్లో ఇది గొప్ప ఓడరేవు కూడానూ. సంపద చేరగానే కళలూ వికసించాయి. గుళ్లూ గోపురాలూ రాజప్రాసాదాలూ సరేసరి. ఇపుడవన్నీ శిథిలాలుగా మిగిలినా ఇంకా దేశవిదేశాల యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. యునెస్కోవాళ్లు హెరిటేజ్ సైట్‌గా గుర్తించిన ప్రదేశమిది.” యాంత్రికత లేని బాణీలో వివరించింది మా గైడమ్మాయి.

ఒక్కసారిగా టైమ్ మెషీన్ ఎక్కి మూడునాలుగు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్టు అనిపించింది. ఆ వీధులూ ఆ రాజసాలూ–మైసూరు నగరం అప్రయత్నంగా గుర్తొచ్చింది.

“అన్నట్టు అయుత్తయ్య అంటే అర్థమేమిటో తెలుసా?” అడిగింది గైడు. తెలియనట్టు చిన్న నవ్వు నవ్వాను.

“ఓ… సారీ! మీకు తెలుసనుకొన్నాను. మీ అయోధ్య అన్నమాటకు మా స్థానిక రూపం అయుత్తయ్య. ఇప్పటి రాజవంశంలానే ఆనాటి రాజవంశం కూడా స్థూలంగా హిందూ మతస్థులు. అందుకే ఆ పేరు ఈ నగరానికీ, వాళ్ల వంశానికీ.”

“ఈ వంశంవాళ్లు వచ్చేవరకూ ఇక్కడ ఊరే లేదా?”

“ఉంది. పదమూడో శతాబ్దంలోనే ఇక్కడ జనావాసాలు ఉన్న దాఖలాలు ఉన్నాయి. మా ఊళ్లోని మ్యూజియంకు వెళితే అప్పటి శిల్పాలు కనిపిస్తాయి. కానీ అప్పట్లో అదో చిన్న ఊరు. ఆ రాజవంశంవారికి ఈ ప్రదేశం నచ్చింది. మూడు నదుల మధ్య కళకళలాడుతోన్న ఊరును చూసి ముచ్చటపడి రాజధాని నిర్మించారు.”

‘రాజధాని నిర్మించారు’ అన్నమాట వినగానే నాకు అమరావతీ నగర నిర్మాణం గుర్తొచ్చింది. మరి మన నగరం నాలుగు కాలాలపాటు మనుగడ సాగిస్తుందా, లేకపోతే మూన్నాళ్ల ముచ్చట అవుతుందా…

మా అయుత్తయ్య నగర విహారం మూడు గుళ్లూ ఒక మ్యూజియంగా సాగింది. ముఖ్యమైన ప్రదేశాలన్నీ మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలోని అప్పటి నగరపు సరిహద్దుల్లో ఉన్నాయి.


ముందుగా వెళ్లింది వాట్ మోంగ్‌ఖోన్ బాఫిట్ అన్న మందిరానికి.

విశాలమైన ప్రాంగణం. ప్రవేశద్వారానికి దాదాపు వందమీటర్ల దూరాన నిడుపాటి కట్టడం. సరికొత్త నిర్మాణంలా మిలమిలా మెరుస్తోంది.

“ఈ మందిరం పదహారో శతాబ్దం నాటిది. శత్రువులూ, అగ్నిప్రమాదాలూ, పిడుగుపాట్లూ పదేపదే చవిచూసింది. దెబ్బతిన్న ప్రతిసారీ పునర్నిర్మాణం జరిగింది. ఇప్పటి మెరపులకు కారణం 1920లలోనూ, 1956లోనూ చేసిన పునరుద్ధరణ.” గైడు వివరణ.


మందిరపు ప్రధాన ఆకర్షణ బంగారపు తాపడంతో మెరిసే పద్నాలుగు మీటర్ల పద్మాసనపు బుద్ధ విగ్రహం! ఆ విగ్రహం కూడా ఒకటికి రెండుసార్లు విరిగిపడిందనీ, దాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో 1956లో విగ్రహపు ఎడమ భుజంలో నిక్షిప్తమై ఉన్న అనేక చిన్న చిన్న బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయనీ, అందులో కొన్ని ఊళ్లోని మ్యూజియంలో కనిపిస్తాయనీ వివరించింది గైడు.

గుడి బయటకు రాగానే మండే ఎండ స్వాగతం పలికింది. ఆ వేడికి విరుగుడు అన్నట్టుగా నాలుగు హిందీ మాటలు… రెండు కుటుంబాలకు చెందిన ఆరేడుమంది భారతీయుల బృందం. ఢిల్లీ నుంచి వచ్చారట. గబగబా కబుర్లు… నేనే చొరవ తీసుకొని వాళ్లకో గ్రూప్ ఫోటో తీసిపెట్టాను. భలే బాగా వచ్చింది అని వాళ్ల టీనేజ్ పిల్లలు మురిసిపోతోంటే వాళ్లకో హింటిచ్చాను: నిజమే, ఫోటో బాగా వచ్చింది. చూసినవాళ్లు మిమ్మల్ని ‘తీసిందెవరూ?’ అని అడుగుతారు. అమరేంద్ర అని చెప్పండి. మళ్లీ పేరు గుర్తుండదేమో, అమరేంద్ర బాహుబలి అని చెప్పండి.

క్షణకాలం వాళ్లకు బోధపడలేదు. అర్థమయ్యాక నవ్వులు విరిశాయి.

నా బడాయి కబుర్లు చిరునవ్వుతో వింటూ ఉండిపోయారు సత్యజిత్.

“మీ దేశాన్ని నిన్నమొన్నటిదాకా సయాం అని పిలిచేవారు కదా. మా చిన్నప్పుడు మీ దేశపు సయామీస్ కవలల కథలు గొప్ప ఆసక్తితో వినేవాళ్లం. మరి థాయ్‌లాండ్‌గా ఎపుడు మారిందీ? ఎందుకు మారిందీ?” పక్కనే ఉన్న రెండో మందిరపు ప్రాంగణంలోకి నడుస్తూ అడిగాను గైడును.

“నిజమే. పేరు మార్పు 1939లో అనుకొంటాను జరిగింది. అసలీ సయాం అన్న పాత పేరు కూడా మరీ పాతదేమీ కాదు. 1840లలో అప్పటి రాజు ఆ పేరు వాడటం మొదలెట్టాడు. శ్యామ అన్న మాటలోంచి సయాం అన్న శబ్దం వచ్చిందంటారు. అహఁ! అలా కాదు. సువర్ణభూమి అన్న పదానికి సంక్షిప్త రూపం సయాం అన్నది మరో వివరణ. నిజమేమిటో నాకూ తెలియదు.


“1932లో మా రాజ్యవ్యవస్థ రూపురేఖలు మారాయి. అప్పటిదాకా రాజ్యాంగమూ పాడూ లేని, అడ్డూ ఆపూ లేని రాచరికం నడుస్తూ ఉండేది. ఆ తర్వాత కాస్త సంస్కరణలు జరిగి, దేశం రాజ్యాంగసహిత రాచరికంగా మారింది. స్థూలంగా బ్రిటిషువాళ్ల నమూనా అనవచ్చు. అదుగో అప్పుడు ప్రజల్లో కాస్త భావతీవ్రత కలిగింది. థాయ్ అంటే మా భాషలో స్వేచ్ఛ అని అర్థం. అలాగే మా ఆదిమ తెగల్లో ‘తాయ్’ అన్నది ఒక ముఖ్యమైన తెగ. తెగ పేరో, స్వేచ్ఛాభావనో తెలియదుగానీ మొత్తానికి 1939లో దేశం పేరు థాయ్‌లాండ్ అయింది. అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం… జపానుతో చెలిమి… అది నచ్చని మిత్రరాజ్యాలవారు థాయ్‌లాండ్ లేదు, స్వేచ్ఛాభూమి కాదు, పాత పేరే పెట్టుకోండి అన్నారు. దాంతో 1945లో దేశం పేరు మళ్లీ సయాం అయింది. యుద్ధం గందరగోళం చల్లబడ్డాక, మిత్ర రాజ్యాల దాష్టీకం తగ్గాక, మా అధినేత 1949లో మళ్లా థాయ్‌లాండ్ అన్న పేరే ఖాయపరిచారు. గత డెబ్భై ఏళ్లుగా అదే పేరు.” వివరంగా చెప్పింది మా హిస్టరీ చదువుకొన్న గైడు.

“మరీ ఎక్కువెక్కువ అడిగి విసిగిస్తున్నానా?”

“అదేం లేదు. ఇలా ఆసక్తితో అడిగేవాళ్లే తక్కువ. ఇలాంటి ప్రశ్నలకు జవాబివ్వడంద్వారా నాకూ నేర్చుకొనే అవకాశం కలుగుతుంది. రోజంతా ఉత్సాహంగానూ గడుస్తుంది. ఏ సంకోచమూ లేకుండా అడుగుతూ ఉండండి.” ప్రోత్సహించింది.


బంగారు బుద్ధుని గుడి పక్కనే వాట్‌ ఫరాసి సంఫెట్ ప్రాంగణం…

విశాలమైన ప్రాంగణమది. అన్నివేపులా శిథిలావస్థల్లో ఉన్న వివిధ శిలానిర్మాణాలే తప్ప మందిరమంటూ కనిపించలేదు. రెండు మూడు పూర్ణ స్థూపాలు, మరో రెండుమూడు సగం పడిపోయిన స్థూపాలు, మరింకొన్ని స్థూపాల ఆనవాళ్లున్న పీఠాలు. ఇంతకీ మందిరమెక్కడా?

ప్రశ్నార్థకాన్ని మొహంలో నిలుపుకొని గైడుకేసి చూశాను.

“నిజమే. ఇక్కడ ప్రధానమందిరం అంటూ లేదు. 1351లో రాజధాని నిర్మాణం జరిగినపుడు ఆ రాజప్రాసాదాలూ, ప్రధాన భవనాలూ ఉన్న ప్రదేశమిది. మెల్లగా మరికాస్త పక్కన ఉన్న సువిశాల ప్రాంగణంలో మరింత పెద్ద ప్రాసాదం కట్టుకొని రాజులు అక్కడికి చేరారు. నువ్వు చూస్తోన్న స్థూపాలు ఆయా రాజుల అస్థికల మీద వారి గౌరవార్థం, జ్ఞాపకార్థం నిర్మించిన కట్టడాలు. 1767లో బర్మావాళ్లతో జరిగిన యుద్ధంలో ఈ ప్రాంగణం ధ్వంసం అయిపోయి కొద్దిపాటి స్థూపాలే మిగిలాయి. శిథిలమైనా వాటి గాంభీర్యం తగ్గలేదు గదూ!”


ఆవిడన్న మాట నిజమే. అణువణువునా విషాదగాంభీర్యం. శిథిల సౌందర్యం. గభాలున నలందా శిథిలాలూ, వాటి ఘనగాంభీర్యం గుర్తుకొచ్చింది. అన్ని దేశాల చరిత్రల్లోనూ ఒకటే రాగం, ఒకటే బాణీ, ఒకటే విషాదమోహనం…

శిథిలాలతోపాటు చెట్లూ పచ్చదనమూ పుష్కలంగా ఉన్న ప్రదేశమది. వదలాలనిపించలేదు. ఎక్కడో చిక్కబడుతోన్న బంధం… గతకాలపు చరిత్ర కళ్లముందు కదలాడుతోన్న భావన.

ఈ ప్రాంగణాన్ని ఆనుకొనే అప్పటి రాజులు కట్టుకొన్న విశాల రాజప్రాసాదపు విశాల భూభాగం. ఆ సౌధమూ, తదితర భవనాలూ ఒక మహా అగ్ని ప్రమాదంలో సమసిపోయాయట. చూద్దామంటే ఆనవాళ్లు కూడా మిగలలేదు. సామాన్య ప్రజానీకాన్ని రాజుగారు కలిసే సభామందిరపు పునాదులు మాత్రం కనిపించాయి.

“ఇప్పుడెక్కడికి?”


“మహాథట్ మందిరానికి. రెండు కిలోమీటర్లు.”

అయుత్తయ్య పర్యాటక ప్రదేశాల కలికితురాయి ఈ వాట్‌ మహాథట్.

పద్నాలుగో శతాబ్దంలో కట్టినది. బుద్ధునిదో మరింకో విశిష్ట వ్యక్తిదో అస్థిక మీద నిర్మించిన మందిరమది. శత్రుధ్వంసాలు, పునర్నిర్మాణాలు మామూలే… ప్రస్తుతం కనిపించే ఆలయరూపం 1911లో జరిగిన జీర్ణోద్ధారణ ఫలితం.


ఈ ప్రదేశాన్ని వర్ణించడం కష్టం. ప్రయత్నించినా విఫలమవడం ఖాయం. ఆ క్షణాన అక్కడ ఉండటమన్నది గొప్ప అదృష్టమన్న భావన… బహిరంగ స్థలాల్లో బుద్ధ విగ్రహాలు. రావిచెట్టు కాండమూ వేళ్ల నడుమ బుద్ధుని శిరస్సు. ప్రతి అణువూ ఏదో చెప్పాలని చేస్తోన్న ప్రయత్నాలు… వినే అవగాహన శక్తి లేనందుకు నా మీద నాకే చిరాకు… ఎండా వేడీ ఉక్కలను లెక్కచేసే అవకాశమే లేని క్షణాలు…

“ఒకమాట చెప్పగలవా? పద్నాలుగో శతాబ్దం నుంచీ ఇప్పటిదాకా నలభైముగ్గురు రాజులూ హిందూ మతాభిమానులు. రాజధాని పేరు అయోధ్య అని పెట్టుకొన్న వంశం ఒకటి. తమ పేరులోనే ‘రామ’ అన్న గౌరవ నామం జోడించుకొన్న రాజవంశం మరొకటి. కానీ అప్పటికీ ఇప్పటికీ దేశమంతా బౌద్ధులు, బౌద్ధ మందిరాలు. ఇప్పటి జనాభాలో తొంభైయైదు శాతం బౌద్ధులనీ, హిందువులు నామమాత్రమనీ విన్నాను. మరీ ఈ రెండు మతాల సమ్మేళనం ఎలా జరిగిందీ? ప్రపంచ చరిత్రలో రాజుల మతమే ప్రజల మతమూ అయిపోయిన అనేకానేక దాఖలాలు ఉండగా ఈ దేశంలో అందుకు విరుద్ధంగా ఎలా జరిగిందీ?”

ఆలోచనలో పడిపోయిందావిడ.

“నాకూ తెలియదు. ఈ విషయం నేనెప్పుడూ ఆలోచించలేదు. నిజమే! ఇది అరుదైన విషయమే… తెలుసుకొనే ప్రయత్నం చేస్తాను.” నిస్సంకోచపు ఒప్పుదల! ‘మీ హిస్టరీ పాఠాల్లో ఈ ప్రస్తావన రాలేదా?’ అని అడుగుదామనిపించినా అధిక ప్రసంగమనిపించి మానేశాను.


మహాథట్ మందిరం పక్కనే రట్చబురన అన్న మరో విలక్షణ మందిరం. పదిహేనో శతాబ్దం నాటిది. సింహాసనం కోసం పోటీపడి ద్వంద్వయుద్ధం చేసి మరణించిన తన అన్నల జ్ఞాపకార్థం అప్పటి ప్రభువు వారి అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో నిర్మించిన మందిరమట. గుడి ఇంకా పటిష్టంగానే ఉంది. పక్కనే రెండుమూడు చిరు చెలమలు. గుడి వెనుక అప్పటి బౌద్ధవిహారం గాబోలు–విశాలమైన ఆవరణ పునాదులు, గోడలు.

అప్పటికే పన్నెండు దాటేసింది. లంచ్ ముగించాం. గైడూ, సత్యజిత్ కలసి నాకు అసలుసిసలు థాయ్ వంటకాల రుచి చూపించారు. అన్నట్టు ఇది ఘనమైన టూరు కాబట్టి మంచినీళ్ల నుంచి మంచి భోజనం వరకూ గైడమ్మే ఖర్చు పెట్టింది!

“అన్నీ చూసేసినట్టేనా?” గైడమ్మను అడిగాను. కాదు, అలసట అడిగించింది!


“ముఖ్యమైనవి చూశాం. కానీ ఈ అయుత్తయ్య అలా ఒక పూటా రెండు పూటలు తిరిగేసి వెళ్లే ఊరు కాదు. కనీసం నాలుగయిదు రోజులయినా ఉండి అన్ని ప్రదేశాలనూ ఒకటికి రెండుసార్లు అనుభవిస్తే తప్ప ఈ హిస్టారిక్ సిటీ మనసుకెక్కదు.”

చక్కని మాట… నా మనసులోని మాట. ఇంత చిన్న వయసులో ఈమెకు ఇంత ఆలోచనా స్పష్టత ఎలా వచ్చిందో!

“మనది ఎలానూ ఒంటిపూట ప్రయాణమే కాబట్టి చిట్టచివరి అంశంగా ఊళ్లోని మ్యూజియం చూసివెళదాం.” ఆమె ప్రతిపాదన.

“ఇంకొక్క ప్రదేశం. మ్యూజియం కాక…” నా వేడుకోలు.


ఆరుబయట పవళిస్తోన్న బుద్ధుని విగ్రహం దగ్గరికి దారి తీసిందామె.

నూటయాభై అడుగుల పొడవూ పాతికడుగుల ఎత్తూ ఉన్న బృహత్తర విగ్రహమది. ఒకప్పుడు ఈ విగ్రహం పైన గుడి ఉండేదట. మామూలే… దండయాత్రలు, విధ్వంసాలు, పునర్నిర్మాణాలు. ఈ రోజుకు ఇలా ఏ నీడా లేకుండా మిగిలిందా విగ్రహం. మహాపరినిర్యాణ భంగిమ అది. ఈ విగ్రహమూ, అది ఉండిన గుడీ పద్నాలుగో శతాబ్దం నాటివనీ, 1767లో అవి బర్మీయుల దాడికి గురయ్యాయనీ చరిత్ర చెపుతోంది. ఏది ఏమైనా అంతటి విగ్రహం ముందు మనసు వినమ్రం అవడం సహజం. నాకు అదే జరిగిందా మధ్యాహ్నం.

అయుత్తయ్యలో మా చిట్టచివరి మజిలీ ఛోసమ్‌ఫ్రయా నేషనల్ మ్యూజియం. పదిహేనో శతాబ్దపు ఒక రాజుగారి పేరు పెట్టారీ సంగ్రహాలయానికి. తన అన్నలిద్దరూ ద్వంద్వయుద్ధంలో చనిపోతే వాళ్ల జ్ఞాపకార్థం రట్చబురాన గుడి కట్టించిన రాజు ఇతనే!

“ఈమధ్యే కట్టినట్టుందే…”

“అవును. 1961లో రట్చబురాన గుడిలో భారీ ఎత్తున దొంగతనం జరిగింది. ఎన్నెన్నో విలువైన వస్తువులు రాత్రికిరాత్రి మాయమయ్యాయి. దాని వెనక ఆ గుడి యాజమాన్యం హస్తం ఉందని తేలింది. కానీ జరగవలసిన నష్టం జరిగిపోయింది. అప్పటికి అర్థమయింది ప్రభువులకు గుడులలోని సంపదలను మనుషులే కాపాడుకోవాలని. ఆ అవగాహన లోంచి ఈ మ్యూజియం ఆలోచన.”


నిజంగానే మేం అప్పటికే చూసిన గుడులలోని అనేకానేక విలువైన కళాత్మకమైన శిల్పాలూ వస్తువులూ పవిత్ర ప్రతిమలూ ఆ మ్యూజియంలో కొలువుదీరి ఉన్నాయి. ఎంతో పొందికగా అమర్చబడి ఉన్నాయి. కానీ రోజంతా తిరిగి తిరిగి ఉండటం వల్ల ఇహ ఏమి చూసినా బుర్రకెక్కని స్థితికి చేరిపోయి ఉన్నాం. యాంత్రికంగా తిరగేసి, అంతకన్నా యాంత్రికంగా ఆ మ్యూజియంలో ఉన్న గైడు చెప్పిన వివరాలు విని గబగబా బయటపడ్డాం. అందివచ్చిన అవకాశాన్ని అందుకోలేని అసహాయత మాది.

“అయుత్తయ్య రాజవంశ పాలన సమయంలో ఇపుడీ మ్యూజియం ఉన్న ప్రదేశం ఆనాటి బ్రాహ్మణ కుటుంబాల నివాస స్థలం. ఆ ఆనవాళ్లు పెద్దగా మిగలలేదు కానీ అటు దక్షిణం వేపున రెండు శిథిలాలయాలు ఉన్నాయి. చూస్తారా?” మ్యూజియం గైడు ఊరించాడు.

ఊరే శక్తి లేక వద్దు అన్నాం.

తిరిగి ఇంటికి చేరేసరికి నాలుగున్నర అయింది!

రెండ్రోజులు గడిచేసరికి మధురతో పరిచయం పెరిగింది. చనువు ఏర్పడింది. మాటలు సరళంగా సాగాయి.

అడిగీ అడగగానే త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామిల సంగీత కృషి వివరించింది. వాళ్ల వాళ్ల కీర్తనలు పాడి వినిపించింది. వాటితోపాటు ‘బ్రోచేవారెవరురా…’ కూడా వినిపించి, ‘అందరూ ఇది త్యాగరాజ కృతి అనుకొంటారు కానీ దీని సృష్టికర్త మైసూరు వాసుదేవాచారి!’ అని వివరించింది. ఔరా! అవునా?! అని ఆశ్చర్యపడటం నా వంతు.


“అన్నమయ్య పదాలు, త్యాగరాజ కృతులు, రామదాసు కీర్తనలు, వీటన్నిటి మధ్య క్షేత్రయ్యలాంటి వాళ్ల జావళీలు… అసలు ఈ ప్రక్రియల మధ్య తేడాలు ఏమిటీ? ఏది పదం, ఏది కృతి, ఏది కీర్తన? వీళ్లందరినీ ఒకే గాటన వాగ్గేయకారులు అనేయడం సమంజసమేనా?” ఎప్పట్నించో మనసులో మెదులుతోన్న సందేహాన్ని సరైన వ్యక్తి దొరకగానే బయటపెట్టాను. అడిగానే కాని, వచ్చే సమాధానాన్ని ఆకళింపు చేసుకోగలనా అన్న సందేహం నాలో ఉండనే ఉంది.

క్షణకాలం ఆలోచించి మెల్లగా వివరించింది.

“స్థూల దృష్టికి ఈ నాలుగూ ఒకే కోవకు చెందినవి. వీటి సృష్టికర్తలు అందరినీ వాగ్గేయకారులు అని పిలవవచ్చు. సూక్ష్మ వివరాలలోకి వెళితే పదాలు భావప్రధానమైనవి. సాహిత్యప్రధానమైనవి. కృతుల దగ్గరకు వస్తే వీటిల్లో సంగీతానికీ సాహిత్యానికీ సమాన ప్రాధాన్యం ఉంటుంది. సంగీతానికే ఓ పిసరు ఎక్కువ ప్రాధాన్యం అనవచ్చు. కీర్తనలు పదిమందీ కలసి పాడుకోడానికి అనువుగా ఉంటాయి. ఒక పల్లవి తర్వాత అనేక చరణాలు, సరళమైన సంగీతం, సంగతులూ కళలూ తక్కువగా–సామాన్యులు కూడా కలిసి పాడటానికి అనువుగా… ఇహ జావళి అంటే స్థూలంగా అవి కూడా పదాల కోవకు చెందినవే. కానీ వీటిల్లో శృంగారానికి ప్రాధాన్యం ఎక్కువ. అన్నమయ్యలో భక్తీ శృంగారమూ కనిపిస్తే క్షేత్రయ్యలో శృంగారమే కనిపిస్తుంది.”

చాలావరకూ అర్థమయినట్టే అనిపించింది.

“ఇంకో విషయం… కర్ణాటక సంగీతంలో వయొలిన్‌లాంటి యూరోపియన్ వాద్యపరికరాలు ఎలా వచ్చి చేరాయీ?”


“దానికో నేపథ్యం ఉంది. ముత్తుస్వామి దీక్షితార్ వాళ్ల అన్న బాలస్వామి ఈస్టిండియా కంపెనీవాళ్ల ఆర్కెస్ట్రాలో పనిచేశారు. ఆ బాణీ సంగీతమూ, ముఖ్యంగా వయొలిన్ వాద్యమూ అతడ్ని ఆకట్టుకొన్నాయి. అతని ద్వారా ముత్తుస్వామి మీదా, ముత్తుస్వామి నుంచి కర్ణాటక సంగీతం మీదా వయొలిన్ తన ప్రభావం చూపించడం మొదలెట్టింది. క్రమక్రమంగా కర్ణాటక సంగీతంలో విడదీయలేని భాగమయిపోయింది.”

“అంతా బావుంది గానీ మరి నీకు శాస్త్రీయ సంగీతంతో పాటు సినిమా సంగీతం కూడా ఎలా ఒంటబట్టిందీ? చూస్తున్నాగదా… ఓపీ నయ్యర్ నుంచి ఆబా మీదుగా ఎ. ఆర్. రెహమాన్ దాకానూ, తలత్ మహమూద్ నుంచి అర్జిత్ సింగ్ దాకానూ అందరూ నీకు ఆప్తుల్లా కనిపిస్తున్నారు… అదెలా సాధ్యమయిందీ? వీళ్లల్లో కొంతమంది నీకన్నా రెండుమూడు తరాలు ముందువాళ్లు గదా…”

ఒక చిన్న నవ్వు నవ్వి, “ఇదుగో వీళ్లున్నారు గదా! వీళ్ల వల్ల ఆ వ్యామోహం…” అంటూ కల్యాణీ సత్యజిత్‌ల వేపు చూపించింది.

నిజమే, వాళ్లిద్దరికీ సంగీతమంటే అభిమానం అన్న సంగతి గత రెండు రోజుల్లో బాగా తెలిసింది. కల్యాణిగారికి అభిమానంతోపాటు రాగ జ్ఞానం కూడా ఉందనీ, రాగయుక్తంగా పాడగలరనీ అర్థమయింది. చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నారనుకొంటాను. కానీ సత్యజిత్ కూడా సంగీత ప్రియుడన్న సంగతి నాకు కొత్త విషయం. సంతోషం కలిగించిన విషయం.


మధుర కళాక్షేత్రలో సంగీతం చదువుతోంది కదా, ఆ రాగాలూ గేయాలతో పాటు లలితగీతాలూ, సినిమా పాటలూ ఇష్టపడటం సహజమే అనుకోవచ్చు. కానీ కల్యాణీ సత్యజిత్‌లు కూడా ఈ బాణీ పాటల్ని–ముఖ్యంగా ఏభైలు అరవైల నాటి అతిమధుర సినీగీతాలను ఇష్టపడతారనీ, ఇష్టపడటమే కాకుండా చక్కగా పాడగలరనీ, ఆ సాయంత్రపు కబుర్లలోనే తెలిసింది. ఇహ నా సంగతి సరేసరి. తెలుగు, హిందీ సినీ సంగీతాలూ, గులామ్ అలీ జగజిత్‌సింగ్‌లూ, ఆబా బోనీ-ఎమ్ లాంటి ఆంగ్ల పాప్ మ్యూజిక్ బృందాలూ, నా అభిమాన విషయాలు.

నలుగురి అభిరుచులూ కలిసేసరికి ఆ సాయంత్రం అసంకల్పితంగా పాట కచేరీ మొదలయింది. తలా ఒక పాట పాడటం, బాగా ఇష్టమయిన పాటల్ని నెట్‌లో సంపాదించి అంతా కలిసి వినడం, మిగిలినవాళ్లకు పరిచయం లేని పాటల్ని వెతికి వినిపించడం… అదో ఆనంద హేల. మిగిలిన నాలుగయిదు రోజులూ పాట మా నలుగురి నోటా మెదలుతూనే ఉంది!
-------------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

No comments: