Friday, October 18, 2019

దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో


దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో





సాహితీమిత్రులారా !

అనుకున్న సమయానికంటే ముందుగానే తలుపు తట్టినా, సాదరంగా ఆపేక్షతో లోనికి ఆహ్వానించారాయన. ఇంచుమించు నూరేళ్ళ జీవితం ఏమాత్రమూ తగ్గించలేని ముఖవర్చస్సు… అనేక దశాబ్దాలుగా ప్రోగుచేసుకున్న విజ్ఞానము, అనంతమైన వినయము, మానవత్వమూ మూర్తీభవించిన విగ్రహం… భారతీయ భాషల ప్రస్తావన రాగానే ఆయనలో ఉప్పొంగిన ఉత్సాహమూ ఆసక్తీ చూస్తే, ఆయన కేవలం 98 ఏండ్ల యువకుడనిపిస్తుంది.

ఎక్కడో కెనడాలో పుట్టి, ఇంగ్లాండూ అమెరికాలలో చదువుకుని, అమెరికాలో పనిచేస్తూ… భాషా పరిశోధన కోసం భారత దేశం వెళ్ళి, ఆ జన జీవన స్రవంతిలో కలిసిపోయి, దక్షిణ భారతీయి భాషలూ, శబ్దాలూ,శబ్ద వ్యుత్పత్తులపై (Linguistics, phonetics and Etymology) పరిశోధన చేసి, వాటిని వెలుగు లోకి తెచ్చిన భాషామహర్షి ఎమేనో గారిని పునఃపరిచయం చేయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

మర్రీ బీ. ఎమెనో (Murray Barnson Emeneau) 28 ఫిబ్రవరి 1904 లో, కెనడా దేశపు నోవాస్కోషియా ప్రాంతపు లునెన్బర్గ్‌ అనే ఒక రేవు పట్టణంలో జన్మించారు. ఆ పట్టణ జనాభా అంతా ఫ్రాన్సూ, జర్మనీ దేశాలనుంచి వలస వచ్చిన వారే. అందువల్ల వాళ్ళ వాడుక భాష అయన ఆంగ్లం, ఆపట్టణానికే చెందిన ఒక ప్రత్యేకమైన యాసతో ఉండేది. ఎమెనోకి బాల్యం నుంచీ భాషా వ్యత్యాసాలలో కుతూహలం రేకెత్తడానికి అది కారణమైంది. చిన్నప్పటి నుంచీ ఆయన చదువుల్లో ప్రతిభావంతుడుగా రాణించారు. పుస్తకపఠనమంటే విపరీతమైన ఆపేక్ష. ప్రథమశ్రేణిలో ఉన్నత పాఠశాల చదువు పూర్తి కాగానే, డల్హౌసీ విశ్వవిద్యాలయంలో లాటిన్‌ గ్రీక్‌ భాషలలో బి.ఏ పట్టా పుచ్చుకున్నారు. అప్పుడాయనకు బంగారు పతకమూ, రోడ్స్‌ స్కాలర్‌షిప్పూ లభించాయి. దాంతో ఇంగ్లాండ్‌ దేశపు ఆక్స్ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువు కొనసాగించారు. తరువాత అమెరికా దేశపు యేల్‌ విశ్వవిద్యాలయంలో లాటిన్‌ భాషోపాధ్యాయుడుగా చేరి, అదేసమయంలో సంస్కృతమూ, ఇండోయూరోపియన్‌ భాషల వ్యాకరణమూ నేర్చుకొన్నారు. తాళపత్ర గ్రంధాల ఆధారంగా సంస్కృత జానపద వాఙ్మయం ‘బేతాళ పంచ వింశతిక’ ను ఆంగ్లంలో ప్రచురించినందుకు ఆయనకు యేల్‌ విశ్వవిద్యాలయం 1931లో డాక్టరేట్‌ పట్టాను ప్రదానం చేసింది. ఆ తరువాత 193538 మధ్యకాలంలో భారతదేశంలో స్వయంగా నివసించి, లిపిలేని (కేవలం మౌఖికమైన)ద్రావిడ భాషలపై పరిశోధనలు చేశారు. అమెరికా లోని బర్కిలీ విశ్వవిద్యాలయంలో 1940 నుండీ అధ్యాపకులుగా ఉన్నకాలంలోనూ, పదవీ విరమణ తర్వాత ఈనాటికికూడా అకుంఠిత దీక్షతో భారతీయ భాషాశబ్దశాస్త్ర రహస్యాల్ని అయన విశ్లేషిస్తూనే ఉన్నారు.

ఎమెనో ప్రచురించిన అసంఖ్యాకమైన వ్యాసాలూ, పుస్తకాలూ, ఆయన విజ్ఞానానికీ, భాషల పుట్టు పూర్వోత్తరాలపై ఆయనకి గల ఆసక్తికీ నిదర్శనాలు. ఆయన ఆక్స్ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో పని చేసిన కీ.శే. బర్రో తో కలిసి ప్రచురించిన ‘ద్రావిడ భాషావ్యుత్పత్తి విశేష నిఘంటువు (Dravidian Etymological Dictionary,aka. DED)’ తరతరాలకూ నిలిచిపోయే ఉద్గ్రంథం. అనేక భాషలుండి, ఆ భాషలన్నీ స్వతంత్ర ప్రతిపత్తిని కలిగివున్న ప్రదేశాన్ని ‘భాషా ప్రదేశం (Linguistic Area)’ అని శాస్త్రజ్ఞులు పిలుస్తారు. భారతదేశం కూడా అలాంటి ఒక భాషా ప్రదేశం(ఆర్యావర్త, ద్రావిడ, మండా భాషల కుటుంబాల ద్వారా) అని ఆయన కనుక్కోవడం భారతీయ భాషలకు ఒక కొత్త వెలుగు ప్రసాదించింది. అంతేకాక, మనకు తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోతున్న అనేక భారతీయ భాషల్ని కాపాడుకోవాల్సిన తక్షణ కర్తవ్యాన్ని మనకి గుర్తు చేసింది. శ్రీ ఎమెనో ప్రియ శిష్యుడు, ఆంధ్రులు గర్వించదగ్గ భాషాశాస్త్రజ్ఞుడు, శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి మాటల్లో చెప్పాలంటే “ఎమెనో కేవలం ఒక విశిష్ట శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదు. ఒక మహామనీషి కూడానూ. ఆయన మంచితనం, ఏమాత్రమూ గర్వం లేని ప్రవర్తన, శాస్త్రీయ పరిశోధనలో ఆయన చూపించే ఏకాగ్రత, శ్రద్ధాసక్తులు ఆయన శిష్యులందర్నీ ఎంతగానో ప్రభావితంచేశాయి. ఆయన శిష్యులందరికీ ఆయన ఒక గొప్ప స్ఫూర్తీ, మార్గదర్శీ”.

సిలికానాంధ్ర వారు నిర్వహించిన సాంస్కృతికోత్సవం సందర్భంగా ఆయనను కలుసుకున్నప్పుడు భారతీయ సంస్కృతి, భాషలు, వాటికిగల పరస్పర సంబంధాలూ, ఆయన జీవిత విశేషాలూ.. ఎన్నెన్నో విషయాలపై, ఆయన మాట్లాడిన వివరాలు సంక్షిప్తంగా మీకందిస్తున్నాను.

మా. మీకు భాషాశాస్త్రంలో అభిరుచి ఎలా కలిగింది?

ఎమె. నేను పుట్టి పెరిగిన లునెన్బర్గ్‌ పట్టణపు యాస మిగతా ప్రాంతాలకంటే ప్రత్యేకంగా ఉండేది. ఒక విధంగా అదే మా పట్టణానికి గర్వకారణమైంది కూడా. అలా భాషోచ్చారణలూ, వాటిలోని ప్రత్యేకతలపై కుతూహలం ఏర్పడింది. నేను మొదటినించీ లాటిన్‌ గ్రీక్‌ భాషలు చదువుతున్నప్పుడు కూడా, ఆ భాషల్లో వ్రాసిన కావ్యాలు చదవడం కంటే, ఆ భాషల పరిణామక్రమం గురించే ఎక్కువ శ్రద్ధ ఉండేది.

మా. మీ బాల్యం ఎలా గడిచింది?

ఎమె. మా పూర్వీకులు ఫ్రాన్స్‌ నుంచి వలస వచ్చిన రైతు కుటుంబీకులు. మా తండ్రి ఒక ఓడకు తాలీముగా పనిచేసేవారు. ఆయన ఓ సముద్ర ప్రమాదంలో నా చిన్నప్పుడే మరణించారు. మా తల్లి కుట్టుపని చేస్తూ, చాలా కష్టాలు పడుతూ మమ్మల్ని పెంచింది. అప్పటికీ నా చదువుపై ఎంతో శ్రద్ధ చూపించింది. నాకు మొదట్లో ఆంగ్లభాష వ్రాయడం చాలా జటిలంగా ఉండేది. నేను దానిని అధిగమించడానికి మా తల్లి సహకారమే కారణం. నా చిన్నప్పటినుంచీ పుస్తకాలు చదవటమంటే విపరీతమైన మక్కువ ఉండేది. మాఇంట్లో పుస్తకాలు లేని కారణంగా ఇరుగు పొరుగు వారు నాకు పుస్తకాలు ఇస్తుండేవారు. ప్రతీ శనివారం, మా ఇంటి దగ్గరి ఒక వృద్ధురాలికి పొయ్యిగూడి చితుకులు కొట్టిస్తుండేవాణ్ణి. ఆమె నాకు ఓ పత్రిక బహుమతిగా ఇచ్చింది. దాంట్లో ఇండోయూరోపియన్‌ భాషలపై వ్రాసిన ఒక గొప్ప వ్యాసం చదివాను. బహుశా మాక్స్‌ మ్యూలర్‌ వ్రాసినది అనుకొంటాను. ఆ వ్యాసం నన్ను చాలా ప్రభావితం చేసింది.(మధ్యలో చిన్నగా నవ్వుతూ..) నాకు చిన్నప్పుడే జెర్మన్‌ మీసిల్స్‌ అన్న జబ్బు రావడంచేత కుడిచెవి వినికిడిశక్తి కోల్పోయింది. ఈమధ్య చూపుతో బాటు ఎడమచెవి కూడా సరిగ్గా పనిచేయడంలేదు. వయసు మీదపడ్డదిగదా..!

మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి నేను పైచదువులు చదవాలని చాలా కోరికగా ఉండేది. ఆయన సహకారంతోటే పైచదువులకి డల్హౌసీ కి వెళ్ళగలిగాను. గణితమూ, భౌతిక శాస్త్రాలూ బాగా వచ్చినప్పటికీ, భాషలపై ఉన్న మక్కువతో లాటిన్‌ గ్రీక్‌ భాషలలో బి.ఏ చేశాను.

మా. మీ చదువంతా లాటిన్‌ గ్రీక్‌ భాషలపై జరిగింది. మరి ఇండోయూరోపియన్‌ భాషలపై ఆసక్తి ఎలా కలిగింది?

ఎమె. సర్‌ విలియమ్‌ జోన్స్‌ వ్యాసాల వల్ల! ఈస్టిండియా కంపెనీ కలకత్తాలో న్యాయాధికారిగా నియమించినప్పుడు, ఆయనకి హిందూ ధర్మశాస్త్రం చదివే అవసరం ఏర్పడ్డది. అందువల్ల, ఆయన సంస్కృతం నేర్చుకొని, తరువాత సంస్కృతానికీ, గ్రీకూ లాటిన్‌ భాషలకీ గల సామీప్యత గురించి ‘ఏషియాటిక్‌ సొసైటీ ఆఫ్‌ బెంగాల్‌’ లో చర్చించాడు. 19వ శతాబ్దాంతానికి ఆ సామీప్యత రూఢి కావడమూ, ఇండోయూరోపియన్‌ భాషా కుటుంబం అన్న పేరు రావడమూ జరిగింది. ఆయన ఆ విషయంపై వ్రాసిన వ్యాసాలు నాలో చాలా ఉత్సుకతను కలిగించాయి. యేల్‌ లో ఉన్నప్పుడు సంస్కృతమూ, తులనాత్మక వ్యాకరణం (Comparitive Grammar) నేర్చుకోవడం నా జీవితంలో ఒక మలుపు. నా చదువు కాగానే సంస్కృత ఉపాధ్యాయుడుగా జీవితం గడుపుదామనుకొన్నాను. కానీ తర్వాత నా భారతదేశ పర్యటన నా పరిశోధనలను ఒక కొత్త మలుపు తిప్పింది.

మా. మీరు భారతదేశం వెళ్ళడం ఎలా జరిగింది?

ఎమె. నాకు డాక్టరేటు పట్టా వచ్చేటప్పటికి, అమెరికాలో ఆర్ధిక మహాసంక్షోభం మూలంగా ఉద్యోగావకాశాలు అడుగంటాయి. నేను యేల్‌ లోనే ఉంటూ, అక్కడి భాషాశాస్త్ర విభాగంలో మా గురువుల దగ్గిర సహాయకుడిగా పని చేస్తూండేవాణ్ణి. అప్పుడే, సంస్కృతంలోనూ, ఆశు పద్య రీతుల్లోనూ నాకు మంచి శిక్షణ లభించింది.ఆ సమయంలో యేల్‌ విశ్వవిద్యాలయానికి ఎడ్వర్డ్‌ శపీర్‌ రాక నాజీవితంలో మరొక మైలురాయి. ఆయన శబ్దశాస్త్రజ్ఞుడు (Phonetician) . ఆయన వద్దనుంచి శబ్దశాస్త్రమూ, వాక్యనిర్మాణ విశ్లేషణ, ధాతు పరివర్తనం ఇత్యాది విషయాల్లో బోధన లభించింది. అదే సమయంలో హిందూ సంస్కృతి, సమాజ వ్యవస్థ, దైనందిక జీవన విధానమూ, ఆచారాలూ కూడా చదివి ఆకళింపు చేసుకున్నాను. ఆర్ధిక మాంద్యత కొనసాగుతూ ఉన్న కారణంగా, 1935లో నా గురువులు నన్ను భారతదేశం పంపించడానికి నిశ్చయంచుకున్నారు. నా విద్యకు దోహదం చేయడమన్న కారణం కంటే, నన్ను భారతదేశంలో ఉంచితే పోషించడం బాగా చవక అనేది ముఖ్య కారణం అయ్యుండొచ్చు (..అంటూ నవ్వేరు). శపీర్‌ నన్ను ద్రావిడ భాషలనూ, ప్రత్యేకించి తోడా భాషనూ పరిశోధించమన్నారు. అలా 1935లో భారతదేశం చేరాను.

మా. ఆ సమయంలో స్వాతంత్య్రోద్యమం ముమ్మురంగా సాగుతోంది కదా! దాని ప్రభావం మీమీద ఉండిందా?

ఎమె. గాంధీజీ నాయకత్వంలో అప్పుడు దేశమంతా ఒకటై స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. భారతీయులకీ ఆంగ్లేయులకీ సరిపడేది కాదు. అలాగే, హిందువులకూ ముసల్మానులకూ మధ్య చాలా పొరపొచ్చాలు ఉండేవి. అంత కల్లోల పరిస్థితుల్లో కూడా దైనందిన జీవితం ప్రశాంతంగా ఉండేది. భారతదేశం చాలా పెద్ద దేశం. దాని అస్తిత్వానికి శాంతియుత జీవనం చాలా అవసరం. అయినా, నేనెక్కడో నీలగిరి కొండల్లో ఉంటుండేవాణ్ణి.అందువల్ల నాకు ఎక్కువ తెలియలేదేమో.

మా. భారతదేశంలో మీరు చేసిన పరిశోధనలగూర్చి వివరిస్తారా?

ఎమె. ఆ మూడేళ్ళూ నాకు వృత్తిపరంగా చాలా ముఖ్యమైన కాలం. నేను ప్రధానంగా మౌఖిక భాషలైన తోడా, కోటా, కొడగు, బడగాలపై పనిచేసి అపారమైన సమాచారాన్ని కూడపెట్టాను. మౌఖికం అంటే లిఖిత సాహిత్యం లేనిది అని. అలా మౌఖికమైన భాషల శబ్దాలను లిఖితపూర్వకంగా నమోదు చేసుకోడానికి నేను కనిపెట్టిన పద్ధతి ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. తోడా, కోటా భాషలు సుమారు 2000 సం.రాల క్రితం, ఆ తెగలు నీలగిరి అడవుల్లోకి వలస పోవడం ద్వారా, తమిళం నుంచి వేరు పడ్డాయి. అందువల్ల తమిళంలో జరిగిన మార్పులూ చేర్పుల ప్రభావం ఆ భాషలపై పడలేదు. ఆ భాషలు ఇంకా అప్పటి, అంటే 2000 సం.రాల నాటి పదాలతోనే నిండివుండేవి. తోడా తెగ పరిణామ క్రమం గురించి అప్పటికే తెలుసు కానీ వారి భాష, ఆశుకవిత్వ ధారణల గురించి ఎవరికీ తెలియదు.

మా. దయచేసి తోడాతెగ వారి గురించి మరికొంత విపులంగా చెప్పండి.

ఎమె. తోడా తెగవారు ప్రధానంగా పశువుల కాపరులు. నీలగిరి కొండల్లో వలస తిరిగేవారు. గొప్ప ఆశుకవులు. ప్రతీ సందర్భానికీ పాటలు కట్టేవారు. ఆ పాటలన్నీ వారి జీవితం గురించీ, ఆ కొండలూ, పచ్చికబయళ్ళ గురించీ ఉండేవి. నా ‘తోడా పాటలు’ అన్న పుస్తకంలో 250కి పైగా పాటల్ని నమోదు చేశాను. మీకో చిన్న కథ చెబుతాను వినండి.

పచ్చికబయళ్ళు బీడువారడం చేత ఒక తోడా కాపరి కుటుంబాన్నీ, పశువుల్నీ తీసుకొని వలస పట్టాడు. అతనికి 8, 9 ఏళ్ళ వయసున్న ఇద్దరు ఆడపిల్లలున్నారు. మార్గమధ్యంలో వారికి, వదలివచ్చిన ఇంటిపై దిగులు పుట్టింది. వెంటనే ఏం చేశారో తెలుసా? ఆశువుగా వారి దిగులును వర్ణిస్తూ పాడటం మొదలు పెట్టారు. అది తర్వాత కొన్ని మార్పులూ చేర్పులతో వారు తరచూ పాడుకునే పాటల జాబితాలోకి చేరిపోయింది.

అలాగే,ఒకసారి నేనొక పాటను సరిగ్గా నమోదు చేసుకోలేక పోయాను. అది వివాహసందర్భంలో పాడే పాట. చాలా జటిలమైన పదాలున్న పాట. దానికి మగవారందరూ గుమిగూడి చేసే నృత్యం కూడా కష్టమైనదే. ఆ సంగతి తెలిసి కొంతమంది తోడావారు మరుసటిరోజు పొద్దున్నే నా వద్దకు వచ్చి, ఆ పాట నేను ఏ తప్పులూ లేకుండా వ్రాసుకొనేవరకూ తిరిగివెళ్ళలేదు. ఒకటా, రెండా! ఆ పాటకు 85చరణాలు!(అని చెబుతూ నవ్వేరు)

మా. ఇది నిజంగా ఒక అద్భుతమైన కళ. ఇది ఎలా సాధ్యపడింది?

ఎమె. సాధారణంగా ఈ ప్రక్రియ సూత్రబద్ధమై నడుస్తుంది. అంటే కొన్ని ప్రత్యేక పదాల కూర్పును ఒక సూత్రంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా పద్య శతకాల్లో కనిపించే మకుటం వంటిది. అనేక వేల సూత్రాల ఆధారంగా చెప్పిన పదాల్ని తిరిగి చెపుతూ పాట కడతారు. లిఖిత సాహిత్యం కల భాషల్లో కూడా ఈ ప్రక్రియ మీకు కనిపిస్తుంది. కవి హోమర్‌ వ్రాసిన మహా కావ్యాలనుండి, హిందూ వేదాలనుండి, ఇప్పటి వరకూ చాలా పద్యసాహిత్యం సూత్రబద్ధమైనదే. కానీ తోడా వారు ఈ కళను ఒక అనితరసాధ్యమైన స్థాయికి చేర్చారు.

అదేరకంగా యుగొస్లావియా, అల్బేనియా తదితర దేశాల్లో ఇలా మౌఖికంగా, పాటల రూపంలో భాషను తరతరాలుగా కాపాడుకొనే జాతులున్నాయి. ఆఫ్రికాలో ఇప్పటికీ అనేక తెగలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి.

మా. ఈ సంస్కృతులన్నీ అర్వాచీన నాగరికతా ప్రభావానికి బలికావడంలేదా?

ఎమె. అవునూ, కాదూ! ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సాంఘిక సంక్షేమ పథకాలూ, ఉచిత వైద్య వసతుల వల్ల ఈ తెగలు అంతరించి పోకుండా ఉన్నాయి. కానీ ఈ తెగలవారి పిల్లలు అందరిలానే నూతన విద్యావిధానాలలో ప్రవేశించడంతో, వారి సొంత భాషల్ని క్రమేణా కోల్పోతున్నారు. ఎవరూ వాటి రక్షణ గురించి శ్రద్ధ చూపలేదు. ఈ మధ్యనే శ్రీ పేరి భాస్కరరావు చాలా శ్రమతో ఈ భాషల్ని కంప్యూటరైజ్‌ చేస్తున్నారని విన్నాను.

ఆంత్రొపాలజిస్టులలో ఒక వాడుక ఉంది “Nothing ever gets lost in India” అని. చూడండి! ఎవరూ మాట్లాడక పోయినా సంస్కృతం మూడువేల ఏండ్లగా బ్రతికేవుంది. కానీ ఈ మౌఖిక భాషలు అలా ఉండలేవు అని నా భయం.

మా. కానీ ఈ మార్పు పరిణామక్రమబద్ధం కాదా? వీటిని కాపాడుకోవాలంటే ఏంచేయాలి?

ఎమె. భాష ఒక జీవ సంఘటన. It’s a biological event! మానవుడి పరిణామ క్రమంలో భాష ఒక ప్రధానమైన మైలు రాయి. జంతుజాలపు పరిణామక్రమాన్ని అర్ధం చేసుకోవడం జీవశాస్త్ర రీత్యా ఎంత ముఖ్యమో, భాషలలో వచ్చే మార్పు కూడా మనకు అంతే ముఖ్యం. భాషకు మార్పు సహజం. సాంఘిక జీవనం వల్ల భాషలు మార్పు చెందుతాయి. ద్రవిడ భాషలపై సంస్కృతపు ప్రాబల్యం ఇలాంటిదే. కానీ మనం ఆ మార్పులన్నింటినీ పరిశోధించి పొందుపర్చుకోవాలి. భారత దేశంలో ప్రతీ భాషపై ఇతర భాషల ప్రభావం ఉంది. అనేక భాషలున్న దేశంకదా! ఉదాహరణకి తోడా తెగ వారు సంత కెళ్ళి నప్పుడు తమిళం, బడగా ఇత్యాది భాషలు మాట్లాడవలసి వచ్చేది. ఇందువల్లే అనుకుంటాను. “an Indian who atleast not a bilingual is dysfunctional!” అని ఆంత్రొపాలజిస్టులలో ఒక వాడుక ఉంది (..పెద్దగా నవ్వేరు) ఇది ఒక రకంగా నిజమే కదా! చాలామంది భారతీయులు రెండుకంటే ఎక్కువ భాషలు మాట్లాడగలరు. కొంతమంది 10, 12 భాషల దాకా!

ఇక వీటి సంరక్షణ అంటారా! ఈ భాషల్ని విశ్లేషించి, కాలానుగుణ్యంగా జరిగిన మార్పులన్నీ ఇవి అంతరించక ముందే ఒక నిర్దిష్ట క్రమానుసారంగా గ్రంథస్తం చేయాలి. అభివృద్ధి చెందిన సంస్కృతులు తొందరగా అంతరించవు. కానీ బడుగు ప్రజల సంస్కృతి ఆర్ధిక, సాంఘిక కారణాలవల్ల చాలా త్వరగా ఉనికి కోల్పోతుంది. సంస్కృతం ఇంకా బ్రతికి ఉండటానికి కారణం జన బాహుళ్యానికి అది ఇంకా కావలసి రావడమే. వాటికన్‌ ఎప్పుడైతే దైవ ప్రార్ధన వాడుక భాషలో చేయవచ్చని చెప్పిందో యూరోపులో లాటిన్‌ అప్పుడే అంతరించింది. హిందువులు ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోలేదు. “The culture of India is not the culture of west. What gets lost is different in these two worlds” గత శతాబ్దంలో ఈ భాషల రక్షణకై చాలా కృషి జరిగింది. కానీ ఇంకా చాలా జరగాల్సి ఉంది. ముఖ్యంగా మధ్య భారతం, నర్మదా, గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో ఇంకా అనేక భాషలు ఈనాటికీ పరిశోధింప బడలేదు.

మ. ఈనాటి యువతరానికి భాషాశాస్త్రం గురించీ దాని ముఖ్యత గురించీ ఎలా నచ్చచెప్పాలి? నచ్చచెప్పాలని ఎందుకన్నానంటే విజ్ఞానాన్ని కూడా ఆర్ధిక దృష్టితోనే బేరీజు వేయడం నేటి ఆనవాయతీ అయ్యింది కదా!

ఎమె. ధనార్జనే ముఖ్యం అనుకుంటే ఇవేవీ ముఖ్యం కాదు. కానీ, మనిషి అతని మేధ పనిచేసే తీరును అర్ధం చేసుకుంటే గానీ సంపూర్ణమైన ప్రగతి రాదు. అది జ్ఞాన సముపార్జన వల్లే సాధ్యం. మానవుడు కేవలం ఆహారం కోసమే తన శ్రమనంతా వినియోగించి, దానితోనే సంతృప్తి చెందడం అన్న దశను దాటి అనేక సహస్రాబ్దాలయ్యంది. సంస్కృతీ నాగరికతల పుట్టుకా, పెరుగుదలా ఎప్పుడైనా దైహిక అవసరాల స్థాయికి పై మెట్టులోనే సాధ్యమౌతాయి. మానవజాతిలో ఇలా జరగడం చాలా ముఖ్యమైన సంఘటన. హిందూ నాగరికత ఇలానే ఆలోచించివుండాలి. ఎందుకంటే, వారి వర్ణ వ్యవస్థలో, హిందూ బ్రాహ్మణుల కర్తవ్యం అదే కదా! విజ్ఞానాన్ని సముపార్జించడమూ, ముందు తరాలకి అందజేస్తూ సంస్కృతిని పరిరక్షించడమూనూ!

మా. భారత దేశం ఒక బహుళభాషా ప్రాంతం కదా. ఇది ఈ దేశపు ఏకత్వంపై ఎటువంటి ప్రభావాన్ని కలిగివుంది? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి?

ఎమె. (నవ్వి) నేను మొదట్లో అలానే అనుకున్నాను. కానీ చాలా కొద్ది కాలంలోనే నా అభిప్రాయం మార్చుకున్నాను. భారత దేశం అంతటా అంతర్లీనంగా ఒక ఏకత్వం ఉంది. ఈ ఏకత్వం భాషల హద్దుల్ని దాటి ఉంది. అందుకనే భారత దేశం అఖండంగా ఉండగల్గింది. ఇక్కడ భారతదేశం అంటే ప్రధానంగా హిందూ సాంస్కృతిక వ్యవస్థాపక ప్రాంతం, నైసర్గిక సరిహద్దుల మధ్యనున్న దేశమని కాదు. ఉదాహరణకి “ప్రతిధ్వన్య ధాతువు (Echo-Word Motif)” అనేక భారతీయ భాషల్లో కనిపిస్తుంది. దీనివల్ల ఏం తెలుస్తోంది? భాషలు వేరైనా భారతీయత ఒక్కటే అని. ఇది ఎలా అంటే, ఒకే మనిషి వేరు వేరు దుస్తుల్లో ప్రత్యక్షం అయినట్లన్నమాట. ఈ ధాతువుకి ఉదాహరణలుగా తెలుగులో పులీ గిలీ, గుర్రం గిర్రం, కన్నడంలో కుదురే గిదురే, తమిళంలో తన్నీర్‌ కన్నీర్‌ , మొదలైనవి చెప్పచ్చు. ఇలాంటి శబ్ద ప్రయోగాలు కేవలం వాడుక భాషలోనే అని గమనించాలి. వీటికి నిఘంటువుల్లో, వ్యాకరణ గ్రంధాల్లో చోటు లేదు.

ఈ కథ వినండి! ఒక నరమాంసం రుచిమరిగిన పులి ఒక గ్రామ సరిహద్దులోకి వచ్చింది. ఒక గ్రామస్తుడు పొదల్లో చప్పుడు విని పులి అని గ్రహించి తోటి వాడితో “చీకటి పడింతర్వాత జాగ్రత్త. పొదల్లో పులీ గిలీ ఉంటే ప్రమాదం” అన్నాడు. ఆ రెండవవాడు తెలివైన వాడు. విషయం గ్రహించి..” ఆ! పులి ఏముంది లెద్దూ! గిలి అంటేనే నాకు భయం” అన్నాడు. అది విన్న పులి, వాడిని నిలేసి గిలి ఎక్కడుంటుందో చూపించమంది, గిలిని చంపేసి తన పరాక్రమం చూపించుకోడానికి కాబోలు. అప్పుడా గ్రామస్తుడు ఆ పులిని, గిలిని వెతుక్కుంటూ పొమ్మని గ్రామానికి దూరంగా కొండకోనల్లోకి పంపించి దాని బారి నుంచి గ్రామాన్ని రక్షించాడు.

ఇలాంటి కథలు చిన్న చిన్న మార్పులూ చేర్పులతో అన్ని దక్షిణ భారతీయ భాషలవారూ చెప్పుకొనే జానపదాలు. అయితే, చాలా కథలూ ఇలాగే పద చమత్కారం మీద ఆధారపడ్డవి.

మా. మీ అమూల్య గ్రంథం ‘ద్రావిడ భాషావ్యుత్పత్తి విశేష నిఘంటువు (D.E.D)’ గురించి చెప్పండి.

ఎమె. 1938లో నేను అమెరికా తిరిగి వచ్చేటప్పటికి నా దగ్గర మూడేళ్ళ కృషి ఫలితంగా అపారమైన సమాచారం ప్రోగయ్యింది. అప్పటికే కీ. శే. బర్రో ఆక్స్ఫర్డ్‌ నుంచి భారతీయ భాషలపై కొన్ని వ్యాసాలు ప్రచురించి ఉన్నారు. ఆ కాలంలో పరిశోధకులు అందరూ ఎవరికివారే వారికి కావలిసిన శబ్దవ్యుత్పత్తులు సమకూర్చుకునేవారు. ఇందుకోసం చాలా సమయం వెచ్చించాల్సొచ్చేది. అందువల్ల నేనూ, బర్రో పరస్పర సహకారాలతో అప్పటిదాకా లభ్యమైన అన్ని వ్యుత్పత్తులనూ క్రోడీకరించి ఒక గ్రంధంగా వెలుపర్చాము. మొదటి ప్రచురణ అలా 1961లో వెలుగు చూసింది.

ఆ తరువాత బర్రో, కీ.శే. సుధీభూషన్‌ భట్టాచార్యతో కలిసి చాలా కృషి చేశారు. వారు అడవుల్లోకి వెళ్ళి వారాల తరబడి కాలి నడకన తిరుగుతూ అనేక భాషల శబ్దాల్నీ, వాటి వ్యుత్పత్తుల్నీ సేకరించి రెండవ ప్రచురణలో పొందుపరచారు. ఈ ప్రచురణలు ఇప్పుడు దొరకటం లేదనుకుంటాను.

మా. మీ ప్రియ శిష్యుడు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి మీ అడుగుజాడల్లోనే ‘మాండలిక వృత్తి పదకోశం’ అనే గ్రంథాన్ని, ఎంతో ప్రయోజనకరంగా రూపొందించారు. వారికి మీతో ఎలా పరిచయం?

ఎమె. కృష్ణమూర్తి తెలుగు భాషపై పరిశోధన చేయడానికై పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ అక్కడ ద్రవిడ భాషలు తెలిసినవారు ఎవరూ లేకపోవడంచేత అతని సిద్ధాంత వ్యాసానికి పర్యవేక్షకుడిగా ఉండమని నన్ను కోరారు. నాకు భాషాశాస్త్రం తెలిసినా తెలుగు అంతగా రాదు, మరి అతనేమో తెలుగులో ఉద్దండుడు. అలా మా జంట సరిగ్గా కలిసింది. చాల మంచి పరిశోధనలు చేశాం మేమిద్దరమూ కలిసి. అతను, చాలా మంచి మనిషి. గొప్ప శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదు, గొప్ప అధ్యాపకుడూ, పరిపాలనాదక్షుడు కూడా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర విభాగాన్ని ఎంత వృద్ధిలోకి తెచ్చాడో! అతను హైదరాబాదు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడుగా ఉన్నప్పుడు, నాకొక గౌరవ డాక్టరేటు ఇచ్చారు. నాకు చేయబడిన అన్ని సన్మానాల్లోనూ ఇదంటే నాకు చాలా గర్వమూ, మక్కువానూ. నా ప్రియ శిష్యుడిచ్చింది కదా! (గర్వంగా అ పట్టాని చూపించారు. అది, వారు ఎక్కువ సమయం గడిపే ముందుగదిలో కొట్టవచ్చినట్లుగా కనబడేటట్టు అలంకరించారు)

ఇది గొప్ప కాకతాళీయమేమో! ఆక్స్ఫర్డ్‌ లో నా స్నేహితుడు కే.వీ. గోపాలస్వామి ఆంధ్రా విశ్వవిద్యాలయం రిజి్స్ట్రారు గా ఉన్నప్పుడూ కృష్ణమూర్తి అతని శిష్యుడూ ఆపై మితృడునూ. ఆ తరువాత కృష్ణమూర్తి నా శిష్యుడూ స్నేహితుడూ అయినాడు.

మా. యువశాస్త్రజ్ఞులకి మీరిచ్చే సందేశం ఏమిటి?

ఎమె. శ్రమ యేవం జయతే! కష్టించి పని చేయమని చెబుతాను. ఏదీ సులభంగా రాదు. ఏ శాస్త్ర పరిశోధన అయినా చాల కష్టంతో కూడిన పని. గొప్ప ఫలితాలు రావాలీ అంటే చిత్తశుద్ధీ, అకుంఠిత దీక్షా, శ్రమా అవసరం. ఇంతకు మించి ఏం చెప్పగలను!?

మా. ఆఖరుగా, భారతదేశం గురించి మీ అభిప్రాయం ఏమిటి?

ఎమె. “Ex Oriente Lux”! కాంతి తూరుపు నుండి వస్తుంది. భాషాశాస్త్రంలో వెలుగు భారతదేశంనుంచి వచ్చింది. పాశ్చాత్య ప్రపంచ నాగరికతలన్నీ చీకటిలో ఉన్నప్పుడే భారతీయులు భాషకు శబ్దప్రమాణాల్ని నిర్ణయించి ఎంతో ముందంజ వేశారు. భాషాశాస్త్రానికి ఎనలేని మేలు చేశారు. పాణిని వ్యాకరణం చదివారా? ఒక వాక్యాన్ని ఎలా వ్రాయాలీ అనేకాక ఎలా ఉచ్చరించాలీ అనేది కూడ బోధిస్తుంది. అందువల్లనే ఇన్ని శతసహస్రాబ్దాల తరువాత కూడా సంస్కృత ఉచ్చారణలో మార్పు లేదు. గ్రీక్‌ లాటిన్లు ఈ విషయంలో చాలా వెనుకబడినవి. మిగతా భాషల గురించి ఇక చెప్పనవసరమే లేదు. 1955లో అమెరికన్‌ ఓరియెంటల్‌ సొసైటీ కి ఇచ్చిన ఉపన్యాసంలో ఈ విషయాలన్నీ విపులంగా చర్చించాను.

వ్యక్తిగతంగా నా భారతదేశానుభవం ఒక మరపురాని సంఘటన. అది ఒక అద్భుతమైన వరం. నేను అక్కడ ఉన్నప్పుడు, తమిళనాడూ ఒరిస్సాలలోని దేవాలయాలూ, తాజ్‌ మహల్‌ దర్శించాను. కలకత్తా, కాశీ, బొంబాయి నగరాలు తిరిగాను. బడగా తెగ వారు మంటలతో చేసే వీధి గారడీలనుంచి మొదలుకొని అనేక వింతలూ చూశాను. వంగ దేశీయుల చేపల కూరలూ , దాక్షిణాత్యుల పిండివంటకాలు, చాలా కారమైన కూరలూ, పచ్చళ్ళూ తిన్నాను. ప్రతి అనుభవం ఒక మరపురాని అనుభూతి. ఒక్క మాటలో చెప్పాలంటే, భారతీయ సంస్కృతీ జీవనది లో మునకలేసి తడిసిపోయాను. ఒక అలౌకికమైన ఆనందం నాకు ఆ అనుభవస్రవంతిలో లభించింది. ఈ అనుభవాలన్నీ భారతీయ సంస్కృతి అన్న వర్ణ చిత్రంలో మిళితమైన రంగుల్లాంటివి.

గత శతాబ్దంలో భారతీయ భాషాశాస్త్రం చాలా వృద్ధి చెందింది. అందుకు నా చిన్నపాటి కృషి కొంత దోహదం చేసినట్టు అనిపిస్తే, అది నాకు చాలా గర్వ కారణం.

అంతతో ఆయన దగ్గిర శెలవు తీసుకున్నాను. సాదరంగా వీధివాకిలి దాకా వచ్చి వీడ్కోలు పలికారు. నేను కనుమరుగయ్యేదాకా చేయి ఊపుతూ అలాగే నిలబడ్డారాయన. భారతదేశ భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసి, కాలగర్భంలో కలిసిపోతున్న మన భాషాసంస్కృతిని రక్షించుకోవాల్సిన అత్యవసరాన్ని గుర్తుచేసి, మన సంస్కృతీ పురోగమనానికి ఎంతో మేలు చేసిన ఆ మహామనీషికి శతకోటి నీరాజనాలర్పిస్తూ వెనుదిరిగాను.
--------------------------------------------------
రచన: మాధవ్ మాౘవరం, 
ఈమాట సౌజన్యంతో

No comments: