Thursday, August 22, 2019

తబలా “మాంత్రికుడు” అహ్మద్‌జాన్‌ థిరక్వా


తబలా “మాంత్రికుడు” అహ్మద్‌జాన్‌ థిరక్వా




సాహితీమిత్రులారా!

1974లోనో, 75లోనో సరిగ్గా గుర్తులేదు కాని బొంబాయిలో తేజ్‌పాల్‌ ఆడిటోరియంలో బడేగులాం అలీఖాన్‌ వర్ధంతి సభలో హిందూస్తానీ సంగీత కచేరీలు జరిగాయి. అందులో ఉస్తాద్‌ అహ్మద్‌జాన్‌ థిరక్వా తబలా సోలో కచేరీ జరిగింది. అప్పుడాయన వయస్సు 97 సంవత్సరాలు. సన్నగా, పొడుగ్గా, పొడుగాటి అచ్‌కన్‌ కోటు తొడుక్కుని, పైజమా, తలమీద టోపీతో ఇద్దరు నడిపించుకు రాగా వయోవృద్ధుడైన ఉస్తాద్‌గారు నెమ్మదిగా స్టేజిమీద కూర్చున్నాడు. మొదట్లో తన రెండు చేతులూ అతి కష్టం మీద తబలా, డగ్గాల మీదికి చేర్చినట్టు అనిపించినా, ఆ తరవాత విలంబిత్‌ తీన్‌తాల్‌లో తబలా విన్యాసం సునాయాసంగా మొదలయింది.పాత సంప్రదాయాన్ని అనుసరించి వాయిస్తున్నప్పుడు మధ్యలో కొనుగోలు పద్ధతిలో ఆయన బోల్‌లు నోటితో పలికి వినిపించాడు.

ఎందరో తబలా విద్వాంసులు తమ తమ బాణీల్లో అద్భుతంగా వాయిస్తారు కాని థిరక్వా శైలిలో ఒక ప్రత్యేకమైన పరిపూర్ణత, గాంభీర్యం, నిండుతనం ఉండేవి. దశాబ్దాలుగా, ఆరేడు తరాల సంగీతజ్ఞులతో తలపండిన అనుభవం, మారుతున్న అభిరుచులతో రాజీలేని శాస్త్రీయ ధోరణి, శాశ్వతమైన విలువలని ప్రతిబింబించే సంగీత వైఖరి ఇలాంటి లక్షణాలన్నీ ఆ నాటి కచేరీలో కనిపించాయి. దశాబ్దాల క్రితమే కాలంచేసిన మహోన్నత గాయకు లెందరికో పక్క వాయిద్యం వాయించిన థిరక్వాను కళ్ళారా చూసి, ఆయన తబలా వినగలిగినందుకు ఈ రచయితతో బాటు ప్రేక్షకులందరూ థ్రిల్‌ అయారు. కచేరీ తరవాత ఆటోగ్రాఫ్‌ చేస్తున్నప్పుడు ఆయన చెయ్యి చాలా వణికిందిగాని తబలా వాయిస్తున్నప్పుడు మాత్రం ముసలితనం అడ్డురాలేదు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో ఒక సంగీతకారుల కుటుంబంలో జన్మించిన థిరక్వా మొదట్లో ఉస్తాద్‌ మిఠ్ఠూఖాన్‌ అనే అతనివద్ద గాత్రసంగీతం నేర్చుకున్నాడు. సంగీతజ్ఞుడైన తన తండ్రి హుసేన్‌బక్ష్‌ వద్ద కొంత సారంగీ కూడా అభ్యసించాడు. మేరఠ్‌కు చెందిన ఉస్తాద్‌ మునీర్‌ఖాన్‌ తబలా వాయించడం విన్నాక అతనికి తబలామీద ఆసక్తి కలిగింది. మొదట తన బంధువులైన షేర్‌ఖాన్‌, ఫయ్యాజ్‌ఖాన్‌, బష్వాఖాన్‌ తదితరుల వద్ద అతను తబలా నేర్చుకున్నాక, తన పన్నెండో ఏట మునీర్‌ఖాన్‌ శిష్యుడుగా చేరాడు. మధ్య మధ్యలో అరగంట విశ్రాంతి తీసుకుంటూ, ప్రతిరోజూ సుమారు 16 గంటలపాటు తబలా సాధన చేశాడు. తన సోదరుడు మియాఁజాన్‌ సంరక్షణలో పెరిగిన అహ్మద్‌జాన్‌ రోజుకు గట్టిగా ఆరుగంటలు కూడా నిద్రపోకుండా, పాలు తాగుతూ, పుష్టికరమైన ఆహారం తింటూ, సంగీతానికై ఎంతగా శ్రమిస్తున్నా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. సంగీతం తప్ప మరే చింతలూ లేకుండా ఆయన తన యవ్వనమంతా గడిపాడు. ఆరోగ్యంపట్ల ఉన్న క్రమశిక్షణే ఆయనకు తొంభై ఏళ్ళు దాటినా అద్భుతమైన సంగీతం వినిపించడానికి తోడ్పడింది. అలా జాగ్రత్త పడని బడేగులాం వంటి మహాగాయకులు 60 దాటగానే పక్షవాతం వగైరా రుగ్మతలకు లోనై, త్వరలోనే కాలం చేశారనేది తెలిసినదే.

యువకళాకారుడు అహ్మద్‌జాన్‌ థిరక్వా

చిన్నవయసులోనే అహ్మద్‌జాన్‌ శ్రద్ధగా సాధన చేసే వైఖరీ, నైపుణ్యమూ కారణంగా అతను మునీర్‌ఖాన్‌కు ప్రియశిష్యుడైపోయాడు. అతని వాయింపును గమనిస్తున్న మునీర్‌ఖాన్‌ తండ్రి కాలేఖాన్‌కు అతని వేళ్ళు తబలా మీద కథక్‌నాట్యం చేస్తున్నట్టుగా అనిపించాయి. ఆ విధంగా అతనికి థిరక్వా అనే పేరు వచ్చింది. థిరక్వాది ఫరూఖాబాద్‌ సంప్రదాయానికి చెందిన లాలియానా బాణీ. ఈ శైలిలో వాయించే ఇతర తబలా కళాకారుల్లో అమీర్‌హుసేన్‌, (బడే గులాం అలీ ఖాన్‌, విలాయత్‌ఖాన్‌ తదితరులకు పక్క వాయిద్యం వాయించిన) నిజాముద్దీన్‌, గులాం హుసేన్‌, షమ్సుద్దీన్‌, నిఖిల్‌ఘోష్‌, గులాం రసూల్‌, నాగేశ్కర్‌ మొదలైనవారున్నారు.

తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ అహ్మద్‌జాన్‌ థిరక్వా

పదహారో ఏట అహ్మద్‌జాన్‌ థిరక్వా బొంబాయిలో తొలిసారి కచేరీ చేసి పేరు సంపాదించుకున్నాడు. సుప్రసిద్ధ మరాఠీ నట గాయకుడు బాలగంధర్వ కంపెనీలో కూడా అతను తబలా వాయించి అందరి మెప్పునూ పొందాడు. త్వరలోనే అతని ఖ్యాతి ఉత్తరభారతం అంతటా పెరిగింది. అతను ఎంతసేపు వాయించినా వినేవారు ముగ్ధులై వింటూ ఉండిపోయేవారు. 1936లో అతన్ని రామ్‌పూర్‌ సంస్థానం దర్బారులో చేర్చుకున్నారు. రామ్‌పూర్‌ నవాబు రజా అలీఖాన్‌ మీద గౌరవం కొద్దీ నవాబుగారు చిడతలూ, గజ్జెలూ వాయించినప్పుడల్లా అతని వెంట థిరక్వా తబలా వాయించేవాడట! అక్కడ 30 ఏళ్ళపాటు అతను ఎందరో ప్రసిద్ధులకు తబలా సహకారం అందించాడు. ఆ తరవాత సంస్థానాలన్నీ రద్దయాక థిరక్వా లక్నోలోని భాత్‌ఖండే సంగీత కళాశాలలో తబలా విభాగానికి అధిపతిగా పనిచేసి, రిటైర్‌ అయిన తరవాత కూడా ఆ సంస్థకు సహకరిస్తూ వచ్చాడు.

దీర్ఘాయుష్షుతో అనేక దశాబ్దాలు సంగీతం వినిపించిన థిరక్వా రెండు యుగాలకు వారధిగా నిలిచాడు. మొదట సంగీత పోషకులుగా ఉండిన రాజాలు,నవాబుల ఆదరాన్ని చవిచూసిన ఈ విద్వాంసుడు దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్యయుగంలో ప్రభుత్వం ద్వారా రేడియోలోనూ, పెద్ద సిటీల్లో మధ్యతరగతి సంగీతప్రియులు టికెట్లు కొని హాజరయే పబ్లిక్‌ సంగీత కచేరీల్లో లభించే విశేష ప్రజాదరణను కూడా పొందగలిగాడు. ఈ మార్పు ఆయనకు ఏమాత్రమూ ఇబ్బంది కలిగించకపోగా దానివల్ల ఆయన సంగీతానికి మరింత విస్తృతమైన ఖ్యాతి లభించింది. గొప్ప సంగీతజ్ఞానమూ,చెక్కుచెదరని గాంభీర్యమూ ఆయనకు సంగీతవృత్తిలో పేరుతెచ్చాయి.

ఆయన ప్రధానంగా సోలో కచేరీలే చేసినప్పటికీ, పాతతరం విద్వాంసులు అనేకమందికి తబలా సహకారం అందించాడు. వారిలో అల్లాబందే ఖాన్‌,రజబ్‌అలీఖాన్‌, అల్లాదియాఖాన్‌, వహీద్‌ఖాన్‌, అల్లాఉద్దీన్‌ఖాన్‌, భాస్కరబువా బఖలే, ఫయ్యాజ్‌ఖాన్‌, ముష్టాక్‌హుసేన్‌, హాఫిజ్‌అలీ ఖాన్‌(నేటి సరోద్‌ విద్వాంసుడు అమ్జద్‌ అలీఖాన్‌ తండ్రి), అలీఅక్బర్‌ఖాన్‌, రవిశంకర్‌, బిస్మిల్లాఖాన్‌, బేగంఅఖ్తర్‌, డాగర్‌ తదితరులున్నారు. చెదరని ఆత్మవిశ్వాసంతో తనకన్నా జూనియర్‌ కళాకారులకు తబలా వాయించడానికి కూడా ఆయన వెనకాడలేదు. పైగా “నాకులేని సంకోచం మీకెందుకు?” అని ఆర్గనైజర్లతో అనేవాడట. ఆయన కచేరీ విన్నాక ప్రసిద్ధ మృదంగ విద్వాంసుడు పాల్ఘాట్‌ మణి అయ్యర్‌ ఆయనను సరస్వతీ అవతారమని పొగిడాడు.

థిరక్వా చాలా సంవత్సరాలపాటు లక్నో రేడియోలో తబలా వినిపించాడు. అనేక కచేరీల్లోనూ, సమావేశాల్లోనూ, సంగీతసభల్లోనూ ఆయనకు అపారమైన ఆదరణా,గౌరవమూ, పద్మభూషణ్‌ వంటి సన్మానాలూ లభించాయి. 1974లో చివరిసారి ఆయన రేడియో సంగీత సమ్మేళనంలో కచేరీ చేశాడు. వృద్ధాప్యంలో మాట్లాడేటప్పుడు ఆయన గొంతు వణికినా తబలా బోల్‌లు వినిపించేటప్పుడు మాత్రం ఆయన తొట్రుపడేవాడుకాడు. ఆయన శిష్యుల్లో లాల్జీ గోఖలే, ప్రేమ్‌వల్లభ్‌, గులాం అహ్మద్‌, ఛోటా గోఖలే, నిఖిల్‌ఘోష్‌, అహ్మద్‌ అలీఖాన్‌, రామ్‌కుమార్‌శర్మ మొదలైన పేరుపొందిన తబలా విద్వాంసులున్నారు. సరైన పద్ధతిలో ఎడతెగని సాధనతో, వ్యాయామమూ, పౌష్టిక ఆహారంతో శిష్యులకు శిక్షణ నిచ్చాడాయన.

1940ల చివరిలో తీసిన ఈ దుర్లభమైన ఫోటోలో ఉన్నవారు (ఎడమ నుంచి వరసగా) తబలా విద్వాంసుడు కంఠే మహారాజ్‌, తబలా విద్వాంసుడు కిషన్‌ మహారాజ్‌, అల్లాఉద్దీన్‌ఖాన్‌, రవి శంకర్‌, తబలా విద్వాంసుడు అహ్మద్‌జాన్‌ థిరక్వా

థిరక్వా గతకాలపు అనుభవాలను యువతరానికి వినిపిస్తూ ఉండేవాడట. అందరిలోకీ ఆగ్రా శైలి గాయకుడైన ఉస్తాద్‌ ఫయ్యాజ్‌ఖాన్‌కు వాయించడం తనకు తృప్తి నిచ్చిందని ఆయన చెప్పాడు. తాళంమీద గట్టి పట్టు ఉన్న “ఆఫ్తాబే మూసికీ” (సంగీత భాస్కరుడు) ఫయ్యాజ్‌ఖాన్‌కు కూడా థిరక్వా అంటే చాలా అభిమానం. కచేరీ మధ్యలో ఆయన “న హువా థిరక్వా”(థిరక్వాకు సాటిలేదు) అనేవాడట. రజబ్‌అలీఖాన్‌ తన గానకచేరీల్లో పాడే వేగాన్ని పెంచేసి, తాను మాత్రం అలిసిపోకుండా తబలా వాయించేవారికి అలసట కలిగించి ఏడిపించేవాడట. ఇది గమనించిన థిరక్వా అందుకు అనుగుణంగా తన తబలా “లెక్క”ను మార్చేసి ఎంతసేపైనా వాయించడానికి సిద్ధపడేవాడట. దీనికి రజబ్‌అలీ కోపగించక మెచ్చుకున్నాడట. విమానం ఎక్కడానికి భయపడినందువల్లే విదేశాలకు ఎన్ని ఆహ్వానాలొచ్చినా వెళ్ళలేదనిచెప్పి థిరక్వా అందర్నీ నవ్వించేవాడు. (ఈ కారణంగానే ప్రఖ్యాత వైణికుడు ఈమని శంకరశాస్త్రిగారు కూడా చాలాకాలం విదేశాలకు వెళ్ళలేదట).

98 ఏళ్ళు జీవించిన ఈ తబలా “మాంత్రికుడు” జనవరి 1976లో తాను నివసిస్తున్న బొంబాయినుంచి తన స్వస్థలమైన లక్నోకు వెళ్ళాడట. “నేనెప్పటికీ లక్నోలోనే ఉంటాను” అని మిత్రులకు మాట ఇచ్చినందువల్లనో ఏమో, మొహరం వెళ్ళిన కొద్ది రోజులకే లక్నోనుంచి బొంబాయికి రైలెక్కడానికి వెళుతూ రిక్షాలోనే ఆయన ప్రాణాలు వదిలాడు. రాచరికపు దర్బారుల గౌరవాన్నీ, అసంఖ్యాకులైన సామాన్యప్రజల ఆదరాభిమానాలనీ కూడా చవిచూసిన ఆ మహావిద్వాంసుడి మరణంతో ఒక గొప్ప శకం ముగిసినట్టయింది.
--------------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో

No comments: