మౌనశంఖం నారాయణబాబు అమోఘకావ్యం:
రెండవ భాగం
సాహితీమిత్రులారా!
లోకంలో జరిగే సంఘటనలకు కార్యకారణసంబంధాలు ఎంతగా ఉంటాయో కాకతాళీయాలు సైతం అంతగానూ వుంటాయి. అదే ప్రతిపాదించదలిచి నా. బా “అంత రోడ్డు ఆవలిస్తే ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు! తుమ్మితే మూడు ఎలక్‌ట్రిక్ దీపాలు వెలిగాయి” అంటాడు. తాను కాళీ రోడ్డునంతా పరిశీలిస్తూ నిర్వ్యాపారంగా నిలుచున్నాడు. శూన్యంగా వుంది ఆవలిస్తున్నట్లు. ఇంతలో ముగ్గురు అమ్మాయిలు రావడం కనిపించింది. అప్పుడే తనకు తుమ్ము వచ్చింది. ఆ క్షణం లోనే మూడు ఎలక్‌ట్రిక్ దీపాలు వెలిగాయి.
తోచక ఒకడు నొసటిపై పెన్సిల్ తాటించుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో వీధి తలుపు దబదబ బాదుతున్నట్లు శబ్దం వినవచ్చింది. అనాలోచితంగా నుదురుపై పెన్సిల్ ఇంత శబ్దం చేసిందా అని హడలిపోతాడు. ఒక్క క్షణం ఆశ్చర్యపోతాడు.
సీరియస్ విషయాలు పైన చర్చించి మూడ్ మార్చడానికి లైటర్ వేన్‌లో ఈ చిత్రణ!
ఆశ్చర్యంతో గట్టిగా గాలి పీల్చాడు. లోపలికి దీర్ఘనిశ్వాసం తీస్తే అన్ని మాయమయ్యాయి. ఇదీ కాకతాళీయమే! క్రమపరిణామానికి ఎంత ప్రభావం ఉంటుందో యాదృచ్ఛికతకూ అంతే ప్రాధాన్యత వుంటుంది.
వెనువెంటనే భయోద్విగ్నత కలిగి గుండెల్లో గగుర్పాటు కలిగేలా ఒక విషాదాంత చిత్రణకు జారిపోతాడు. “కాశ్మీర సరస్సులో పడవల్లాగ కాలప్రవాహంలో కలరా శవాలు కొన్ని!” అంటూ. అంటువ్యాధులు సోకిన దారుణకాలంలో కలరా శవాలకు ఉత్తరక్రియలు జరిపే నాథుడు లేక కాలవల్లో, నదుల్లో పారేసే బాధ్యతారాహిత్యాన్ని చూసి సమాజానికి చపేటమందిస్తాడు.
మనం బ్రతుకుతున్న ప్రపంచంలో ఏ క్షణంలోనైనా ఏ విప్తౖతెనా విరుచుకుపడవచ్చు. మనకాలమే ఒక సందిగ్ధం. దారుణమారణాయుధాలు పిచ్చివాళ్ళ చేతుల్లో పోగయివున్నాయి. ధనాశోన్మత్తులు, అధికారదాహతప్తులు, నేడు పాలకవ్యవస్థను దురాక్రమించి వున్నారు. అందుకే సమయోచిత హెచ్చరికగా
“వీధులు ప్రమాదం, పరిగెడదాం పద! ఆరు బయలు లోకి అన్నాడు”
అన్నవారెవరో కవి చెప్పలేదు. కాని ఈ కావ్యానికి తానూ శ్రీశ్రీయే ప్రధానపాత్రలు. జలసూత్రం వచ్చి సూత్రధారుని పాత్ర నిర్వహించి వెళ్ళిపోయాడు. కావ్యప్రశంస కూడా అతని పాత్రకు సముచితమే! కనుక ఈ హెచ్చరిక చేసింది శ్రీశ్రీ అని అతనే సమయోచిత హెచ్చరికగా ఒక క్లేరియన్ కాల్ ఇచ్చాడని మనం గ్రహించాలి.
“పరిగెట్టాం ఇద్దరం అక్కడ గాలిలేదు వెలుతురు లేదు శూన్యం లేదు. సప్తసముద్రాలు జట్టుకట్టుకుని జలతరంగిణి వాయిస్తున్నాయి!”
జలతరంగిణి అంటే సాగరజలాల తరంగిత నాదం అనీ, పింగాణీగిన్నెలో నీళ్ళు పోసి కర్రతో వాయించే సంగీతవాద్యం అనీ ఇక్కడ కవి నిర్దేశం. సప్తసముద్రాలు అనే సంప్రదాయపు వ్యక్తీకరణ వలన సముద్రాలేనని మనం అర్థం చేసుకోవాలి.
“ఆకాశం చిరిగిపోయిన అరటిదొప్పలా ఒక మూలపడి వుంది. భూగోళపటం మీద ఉల్లిపొర కాగితంలా మృతించిన శేషుడు భూమిని చుట్టుకుని ఉన్నాడు వెలసిన రంగుగుడ్డల మంచీ చెడ్డా జెండాలై ఎగురుతున్నాయి”
సర్వదేశాల ప్రతినిధులుగా జెండాలెగురుతున్న మాట నిజమే గాని, వాటిలోని అసలు రంగులు వెలిసిపోయి, స్వభావాలు వ్యత్యస్థమై పోయాయి. మరణం లేదని విశ్వసించే ఆదిశేషుడు చచ్చి చప్పగా ఎండి ఉల్లిపొర కాగితంలా భూమిని చుట్టబెట్టుకుని వున్నాడు. మన చిరకాల విశ్వాసాలన్నీ విపర్యయమై పోయాయి.
“కులపర్వతాలు గాలిలో విమానాల్లా ఎగురుతున్నాయి” అనే మూడు పాదాలలో ఒక చక్కటి శ్లేష. కులపర్వతాలు అంటే సంప్రదాయార్థంలో పర్వతశ్రేష్టాలని. కాని కుల పదాన్ని విడదీయడం ద్వారా కులాలనే పర్వతాలు విమానాల్లా ఎగిరిపోతున్న స్థితి ఏర్పడిందని కవి తెలుపుతున్నాడు. ఈ కావ్య రచనాకాలం నాటికి గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్య్రపోరాటం సాగుతోంది. ఆ దశలో కులాల ప్రాభవం విస్మరణీయమై పోయింది. ఇది చారిత్రక సత్యం!
దేవేంద్రుడంతటి వాడికి పతనావస్థ సంభవించింది. “కుష్టురోగంతో కాళ్ళూ చేతులూ పడిపోతే కిందపడి దొర్లుతూ ఏడుస్తున్నాడు” అంటూ ఒక జుగుప్సావహ వాస్తవిక చిత్రాన్ని అందిస్తాడు. ఇంకిపోయిన అమృతభాండంలో తడైనా తగులుతుందేమోనని వేళ్ళతో స్పృశిస్తున్న శచీదేవి అన్నప్పుడు మన పురాణగాధల మూఢవిశ్వాసాలను తూర్పారబడతాడు. తలా తోకా లేని వెర్రికథల కల్పనల్ని ఒక తాపు తన్నాడు. నా. బా దేవేంద్రుని దుస్సహరోగస్థితిలో శచీదేవి తిండికి నకనకలాడుతూ దరిద్రం అనుభవిస్తోంది.
“దేవేంద్రుని సింహాసనం మీద కూర్చుని వజ్రాయుధం తానొకప్పుడు కొండలను ఖండించిన రెక్కలన్నిటినీ పోగుచేసి మరల పర్వతభుజాలకు అంటిస్తున్నాది పేస్టుతో”
అన్నప్పుడు జరిగిన దుష్టసంహారమో, దుర్జనదమనమో, దుశ్శక్తిదళనమో సమయం చూసుకుని పునర్విజృంభించాయి అనే భావం వరకు పేచీ లేదు. కాని సింహాసనంపై ప్రభువుకు ప్రతినిధిగా కూర్చున్న వజ్రాయుధమే ఈ అతుకుడు కార్యమెలా నిర్వర్తిస్తోందో అవగతం కాదు. కాని కవిత్వం రెండూ రెళ్ళూ నాలుగు వంటి “ఫేక్ట్” కాదు! కొంత ఫేన్సీ, కొంత కల్పనా, వాస్తవంతో రంగరించినపుడే అది కవిత్వమవుతుంది.
గండభేరుండపక్షులు కలరవాలు చేస్తుంటే శ్రీశ్రీ పాడుదామన్నాడు. ఒకవైపు ఈ దృశ్యం జరుగుతుండగా అటు ప్రక్క నుంచి మరో విషాదదృశ్యం ప్రత్యక్షమయింది “అటుప్రక్క నుంచి మాసిన బట్టల మాటల మూటలు రేవులో తగలబెట్టుకుని ఏడుస్తూ ఎదురుగుండా తోచిన చాకలి సరస్వతిని చూసి, కోపంతో శ్రీశ్రీ తన్నేందుకు కాలెత్తి మూగయై నిలుచున్నాడు”
మాసిన మాటల మూటలు మోసుకుపోయి, రేవులో ఉతికి, శుభ్రం చేదామని తెచ్చుకుంది చాకలి సరస్వతి. కాని ఆ మూటలోని గుడ్డల రోత చూసి భరించలేక మంటలపాల్జేసింది. కాని ఆ గుడ్డలన్నీ ఎంతో గొప్పవారివి! ఎంతో మోతుబరులవి. ఎంతెంత పొగరుమోతులవో ఆ బట్టలన్న సంగతి జ్ఞాపకం వచ్చిందామెకు! ఎంత ప్రమాదం వాటిల్లుతుందోనన్న భయంతో ఏడుస్తూ ఎదురయిందా చాకలి సరస్వతి. ఆ ఏడుపు మొగం చూడలేక శ్రీశ్రీ కాలెత్తి తన్నుదామనుకున్నాడు. ఇంతలోనే ఆమె చేసిన పని తప్పు కాదని తాను చేదామనుకుంటున్న పని తప్పేమోనని తోచిందో కాని శ్రీశ్రీ మూగయై నిలుచున్నాడు. కింకర్తవ్యతా విముగ్ధుడై నిశ్చేతనుడయ్యాడని కవి ఉద్దేశ్యం.
“అయితేనేం పోతేనే” అన్నాడు తాను. ఎంతో సరదా పడి పరీ బజారులో కొన్న పాఁతుఁ. ఎంతో సరదాపడి మోజుపడి వెలిబజారుకుపోయి ఆ అమూల్యవస్తువు కొనుక్కున్నాడు. పాఁతుఁ అంటే ఒక అమూల్యనిధి. పూర్వులు ఎప్పుడో పాతిపెట్టిన అమూల్యసంపదలు గల లంకెబిందెలు వంటి వాటిని పాతు అనడం జాతీయమైన నుడికారం.
జర్మన్ సాహిత్య కోమటి.
“జర్మన్ సాహిత్య కోమటిని ప్రాధేయపడి తెచ్చిన వాల్‌ఖలేడ్, గురజాడ ప్రసాదించిన ముత్యాలసరం హాప్‌కిన్స్‌ను అర్థించి తెచ్చిన స్ప్రింగ్‌రిదిమ్ అన్నీ పోయాయన్నాడు నత్తిగా”
పైన ఉల్లేఖించిన ఐదు పాదాలలో చివరిపాదం నుంచి ప్రారంభించి వ్యాఖ్యానించడంలో ఒక సులువుంది!
Gerard Manly Hopkins అనే ఆంగ్లకవి సంప్రదాయకవులలో చివరివాడు. ఆధునిక కవులకు అగ్రేసరుడు కనక, ఆధునికాంగ్ల కవిత్వానికి అతను ఎలాంటివాడో తెలుగుకి గురజాడ అలాంటి వాడని నా. బా తన ఉపన్యాసాలలో తరచు వివరించేవాడు. హాప్‌కిన్స్ తెచ్చిన ఛందోవిశేషం స్ప్రింగ్ రిదిమ్.
గురజాడ మహాకవి అందించిన ముత్యాలసరాల గురించి తెలియని వారు ఎవరూ వుండరు. అయితే ఆయన ప్రయోగం చేసిన ఛందస్సుకు ముత్యాలసరం అని ఆయన పేరు పెట్టలేదు. ఆయన రాయబోయే కొత్తరకం కవితలను ముత్యాలసరాలని అన్నాడు. అదిన్నీ గుత్తునా ముత్యాల సరములు కూర్చి తేటయిన మాటలు అని తన పద్ధతి వివరించాడు. ఆయన తర్వాత ఉదాహరణ మాత్రంగా రచించిన ఆయన కొద్దికవితలకు ముత్యాలసరాలని అనుయాయులైన కవులు పేర్కొననారంభించారు.
ఇక వాల్‌ఖిలేండ్ అనేది మధ్యప్రాచ్యంలో అరబిక్ భాషలో ప్రాణవిశేషం గల ఒక కావ్యం! ఈ ఛందోరూపం Volk’s lied (వోక్స్‌లెడ్ అని పలుకుతారు) అనే జానపదఫణితికి సమీపమయినదే. దీని గురించి ఇంతకన్న భోగట్టా మనకి అనవసరం.
అసలైన గుప్తవిషయం జర్మన్ సాహిత్యకోమటి! ఆయన్ని అడిగి వాల్‌ఖిలాడ్ తెచ్చుకున్నారు శ్రీశ్రీ, నా. బా. డా. వి. ఎన్. శర్మ అనేవారు జర్మన్ భాషలో పి. హెచ్.డి. పట్టా తెచ్చుకున్నారు. జర్మన్ స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆమెతో ఇండియాకు వచ్చి మద్రాసులో (మైలాపూర్) కిండర్‌గార్టెన్ స్కూల్ పెట్టారు. ఈ సంస్థ చాలా ప్రాముఖ్యత పొందింది! విశాలమైన ఆవరణలో పెద్ద భవనం నిర్మించుకుంది. ఆయన సన్నగా , బక్కపలచగా, చామనచాయగా ఉండేవారు. కోలముఖం, వెంట్రుకలు లేని తల. పంచె, లాల్చీ ధరించేవారు. జర్మన్ భాషలో మంచిపండితుడని మనవాళ్ళనుకునేవారు. కాని తెలుగుభాషలో ఆయనకు రచన అందుబాటు కాలేదు. తెలుగులో గ్రంధాలు రాయాలని పెద్ద యావ వుండేది. తెలుగు రచయితలందరితోనూ సన్నిహితంగా వుంటూ గోష్ఠి జరిపేవారు. తరచు ఆహ్వానించి గంటల తరబడిగా వారిని మాటాడిస్తూ వినేవాడు. మధ్యాహ్నభోజన సమయం వరకు వారిని మాడ్చి తను హాయిగా భోజనానికి వెళ్ళేవారు. మన ఆధునిక కవులు పూట భత్యం గాళ్ళు కదా! ఆ విషయం ఆయనకు తెలుసు! అయినా ఆర్థిక సహాయం అందించేవాడు కాడు. అందుకే ఆయన్ని లోపాయకారీగా శ్రీశ్రీ, నా. బా, జరుక్ వంటి వారు “జర్మనీ సాహిత్య కోమటి” అని వ్యవహరించుకునే వారు. మద్రాసులోని సాహిత్యమిత్రులంతా ఆయన్ని జర్మనీ శర్మ అనేవారు. ఆయన పూర్తిపెరు వఠ్యం నారాయణశర్మ! (ఇంటిపేరు గురించి ఇప్పుడు కొంచెం సంశయం వస్తోంది.) ఎన్. ఆర్. చందూర్, మాలతీ చందూర్ ఆయనకు బాగా సన్నిహితులు.
మాలతి గారితో కలిసి ఆయన ఒకసారి పిఠాపురం వచ్చారు. మాలతి గారి కజిన్ బ్రదర్ పిఠాపురం షుగర్ ఫేక్టరీలో ఛీఫ్ ఎకౌంటెంట్. వారితో నాకు మంచి కాలక్షేపం జరిగింది. పందిరి మల్లికార్జునరావు గారూ, శంభూప్రసాద్ గారూ వంటి మద్రాసు ఆంధ్రప్రముఖులు ఆయనకు మిత్రులు. ఆయన తెలుగులో కొన్ని పుస్తకాలు ప్రచురించారు. జర్మన్ కథలు అనే గ్రంధంలో తెలుగు భాష మరీ ఘోరంగా వుంది. కేంద్రసాహిత్య అకాడెమీ వారు బెర్టోల్డ్ బ్రెహ్టు మహత్తర ప్రతీకారాత్మక నాటకం మదర్ కరేజ్‌ని ఆయనచేత తెలుగులోకి అనువదింపజేసి గ్రంధంగా ప్రచురించారు. భారతి వారు ఆ గ్రంధంపై విపులంగా సమీక్ష రాసి పంపమని నన్ను కోరారు. అప్పటివరకూ నేను మదర్ కరేజ్ ఆంగ్లానువాదం చదవలేదు. సంపాదించి, చదివి సుదీర్ఘమూ సమగ్రమూ అయిన సమీక్ష రాసి, భారతికి పంపించాను. వెంటనే ప్రచురితమయింది. శ్రీ శర్మగారు నా సమీక్ష చదివి బాగా బాధపడినట్లు ఉత్తరం రాశారు. దానికి జవాబు రాస్తూ మీ రాతప్రతి నాకు పంపించి వుంటే అందలి తెలుగుభాషను చక్కగా సవరించి వుండేవాడ్ని కదా! అని రాశాను … ఆయనకి డబ్బు పిసినారితనం తప్ప మిగిలిన లక్షణాలన్నీ మంచివే! అందుకే మనవాళ్ళు “కోమటి” అని వ్యవహరించారు. శర్మ సహృదయుడు, సాహిత్యాభిమాని. బాగా సంపాదించుకున్నాడు. జర్మన్ భార్య తెలుగు నేర్చుకుంది. జర్మన్ యాసలో తెలుగు మాట్లాడేదనేవారు. ఆమెను నేను చూళ్ళేదు. శ్రీశ్రీ, నా. బా ఈ దంపతుల గురించి కాలక్షేపానికి చాలా చెబుతూండేవారు!
మద్రాసులో మహదేవన్ అనే గొప్ప ఆధునిక ఆంగ్లసాహిత్య ప్రియుడుండేవాడు. గ్రంధపఠనం మీద అభిమానం కొద్దీ ఆయన పుస్తకాల షాపు పెట్టి ఋథదపష ఇలలభష, ఖపలఫసబల ఇలలభష విరివిగా తెప్పించేవాడు. మనవాళ్ళు కొనుక్కోవడం గానీ, అక్కడే కూర్చుని చదువుకోవడం గానీ చేసేవారు. పుస్తకాలు మాసిపోతాయని ఆయన దెబ్బలాడేవాడు. ఆయన్ని మనవాళ్ళు లోపాయికారీగా సాహిత్యమార్జాలం అని వ్యవహరించేవారు. ఎందువల్లనో ఈ కావ్యంలో ఆయన ప్రసక్తి రాలేదు.
ఈ కావ్యంలో ఐకాంతిక ప్రతీకలు, గాధాస్ఫురణలూ వాడడం వల్ల కావ్యానికి కొంత అయోమయత కలిగిన మాట నిజమే! కాని వాటిని తెలుసుకుని చదివితే ఎంత ఆనందం కలుగుతుందో సహృదయులు గ్రహించగలరు! జేమ్స్ జాయిస్ సాహిత్యప్రభావంపై రిచ్ఛర్డ్ ఆల్‌డింగ్టన్ వ్యాసం రాస్తూ ఇలా అంటాడు. “he is obscure and justifies his obscurity; but how many others will write mere confusion and think it sublime? How many mere absurdities will be brough forth …?” అన్న మాట నా. బా కవిత్వానికి స్పష్టంగా సరిపోతుంది.
కొత్తసాధనాలు వెదుక్కుంటూ.
కష్టపడి సంపాదించుకున్న సాధనాలూ పరికరాలూ పోయాయి. అందుకే ఖంగారు పడుతూ శ్రీశ్రీ నత్తిగా చెప్పాడు. మరి పాట ఎలాగ? పక్కనే పడివున్న శేషుడి కోర పెరకాలి. వాడు చచ్చి భూమినంటుకుపోయాడు. గండభేరుండపక్షుల జంట తమ ఇద్దరినీ ఎత్తుకుపోదామని చూస్తోంది. ఆడ గండభేరుండపక్షి రెక్క మీద శేషుడి కోరతో డాలీ, శ్రీశ్రీ కలిసి ఒక పెద్ద చిత్రాన్ని రచించారు (సాల్వడార్ డాలీ స్పానిష్ చిత్రకారుడు) దానికి మాన్రే, నారాయణబాబు కలసి ఒక ఛాయాచిత్రం తీశారు. అదే ఇప్పుడు ఆధారమయింది.
ఆ పటం లోని చిత్రం రెండు అస్థిపంజరాలది. అస్థిపంజరాలకి లింగభేదంతో నిమిత్తం లేదు. అందమూ అవసరం లేదు. అయినా మన వ్యవహారానికి వాటిలో ఒకటి స్త్రీ అస్థిపంజరమనీ రెండవది పురుష అస్థిపంజరమనీ కేటాయించుకోవాలి. స్త్రీ అస్థిపంజరం చేతిలో తన గతించిన శృంగారజీవితానికి చిహ్నంగా గులాబీ అత్తరు బుడ్డీ వుంది. మెడలో మెరిసిపోతున్న కోహినూరు వజ్రమూ వుంది. పక్కన దీనంగా నిలబడిన మొగ అస్థిపంజరం ఏడుస్తోంది. దాని ఎముకలు నల్లబడ్డాయి, వేడెక్కిపోయాయి.
కాని, చేతిలో వజ్రవైఢూర్యాలు పొదిగిన బంగారు గునపం వుంది! అది సెక్సు ప్రతీక. దానితో తాజ్‌మహల్ తవ్వేస్తోంది. సంప్రదాయక సౌందర్యాలన్నిటినీ ధ్వంసం చేయాలన్నది డాడాయిస్టుల సిద్ధాంతం. ఈ పాద ప్రభావంతోనే కవి బైరాగి తన “చీకటి నీడలు” కవితాసంపుటిలో “తాజ్‌మహల్‌ను పడగొట్టండోయ్” అంటూ పొలికేకలతో కవిత రాశాడు. ఇంతలో ఆడ గండభేరుండపక్షి దగ్గరగా వచ్చి శ్రీశ్రీని ముక్కుతో అంకించుకుని విమానంలా లేచిపోనారంభించింది. “ఎక్కడికన్నా” అని గావుకేకపెట్టాడు నా. బా. ఈ గండంతో మాటలు పెగలని శ్రీశ్రీ మూగగా హస్తవిన్యాసం పట్టాడు. గరుడలోకానికంటూ అభినయముద్ర ప్రదర్శించి వ్యక్తం చేశాడు శ్రీశ్రీ. అలా అదృశ్యమయ్యేసరికి నా. బా కి కూడా మాటలు పెగల్లేదు. అపస్మారం కమ్మింది. మౌనం గానే మాటలు మననం చేసుకున్నాడు.
ఈ భూమిపై మానవుడు అవతరించిన తొలినాటి నిశనుంచి నేటివరకూ కలలు కంటూనే వున్నాడు. మానవజాతి కన్న కలలన్నీ సిమ్మెంటుగా మార్చి మధురోహల గోడలు కడుతూనే వున్నారు. కాలప్రవాహం ఆ గోడలను తాకుతూనే వుంది. ఘూర్ణిస్తూనే వుంది. ఎప్పుడో ఒకప్పుడు కాలాంతం కాక తప్పదు. ఆ విపత్తు నూహిస్తూ తాను కాళ్ళు చాపుక్కూర్చున్నాడు.
సరిహద్దులు వెలిసిపోతున్నాయి. దిక్‌భిత్తికల పెళ్లలు రాలిపోతున్నాయి. ఆ పరిస్థితిని చూసి కొందరు సనాతనులు ఇదేదో ప్రళయకాలం సమీపించిందని భావిస్తున్నారు. దేశాల నడుమ ఎల్లలు తొలగిపోతున్నాయి. మర్యాదలన్నీ అదృశ్యమైపోతున్నాయి. ఒక నూతనప్రపంచం ఆవిర్భవిస్తోంది.
కవి లేచాడు. ఎదురుగా రజతాచలం కనబడింది. ఎక్కాడు. ఆ పర్వతం పోగా పోగా ఒక అందాలలోయ. హరితశాద్వల సానువు. ఆ లోయలో పూలతోట. కొండలూ లోయలూ అన్నీ అన్యాపదేశంగా వేరే అర్థాలకు దోహదం చేసేవే! లోయలో చెట్లు లేవు. అన్నీ పువ్వులే! ఆ పూలచుట్టూ ఉపనిషత్తులే తుమ్మెదలై ఝంకారం చేస్తున్నాయి. ఆ తోటలో పార్వతి నగ్నంగా నిలబడి పూలు కోస్తున్నాది. ఒక మూల ఈశ్వరుడు నిద్రపోతున్నాడు. వాడు లింగాకారుడని మరువకూడదు.
“పార్వతీదర్శన మయ్యేసరికి నా బట్ట అంటుకున్నాది నే కాలిపోతున్నాను మూగనై నిలుచున్నాను”
అనే నాలుగు పంక్తులలో కవి తెలుగుభాషకు గల నైసర్గికశక్తిని చక్కగా కొల్లగొట్టాడు. “అంటుకున్నది” అనే క్రియలో మంటకి కాలడం, వంటికి అతుక్కుపోవడం, స్పర్శా వగైరా చాలా అర్థాలు స్ఫురిస్తాయి. ఇక్కడ పార్వతీ నగ్నదర్శనం కవికి ఇజాక్యులేషన్ కలిగించింది. దానితో అతని బట్ట వంటికి అంటుకుపోయింది. మళ్ళీ కవి ఈ అంటుకున్న శబ్దం నుంచి కాలిపోవడాన్ని ప్రదర్శిస్తాడు. నగ్నపార్వతి కామప్రేరకమై అతని వంటిని దహించింది. చేతలుడిగాయి. మాటలుడిగాయి. మూగగా నిల్చున్నాడు.
తెలుగు ఆధునిక కవిత్వంలో ఇంత గొప్ప అధివాస్తవికత ధ్వని ప్రధాన అభివ్యక్తి వేరొకటి కానరాదు.
“దగ్గరగా ఒక మౌనశంఖం తోచింది మౌనశంఖం స్పృశించా నా గుండె అంతా హంసయై సోహం అని అరిచింది”
అనే పాదాలలోని మౌనశంఖం పురుషాంగ ప్రతీక! అది అద్వైతాన్ని ఉపదేశిస్తోంది. ప్రస్తుతం నిర్వీర్యమై, సుప్తమై, మౌనం వహించింది. తాను స్పృశించాడు. అయినా జడమే. ఈ నిష్కృతిలో తన గుండె సంపూర్ణమైన హంసగా మారిపోయింది. అహంకార మమకారాలకు అతీతమైన స్థితి హంస! కనుకనే సోహం అని అరిచింది. అది వేదాంత పరిభాష. బంధవిముక్తి తర్వాత వచ్చే శివైక్యస్థితి.
“నా చైతన్యమంతా సప్తసముద్రాల సహస్ర కోటి బాహువుల మెరిసే నురగయి ఛుయ్యిమంది”
చైతన్యం కర్మణ్యత్వానికి ప్రతీక. అది విరాడ్రూపం ధరించింది. సప్తసముద్రాల తరంగాలను సహస్రకోటి బాహువులుగా అమర్చుకుంది. కాని ఏం లాభం? ఆ తరంగాలు ఒడ్డుకు తగిలి నురగగా మారిపోయాయి. నురగబుడగలు ఛుయ్యిమంటూ పేలిపోయాయి. నిస్తేజమై, నిర్వ్యాపారమై, నిశ్చేతనత్వం దురాక్రమించింది.
కాని, “నా ఎముకల మూలుగులో చంద్రోదయమైంది నా శరీరం కాశ్యప భస్మరాశియై తరలించింది”
ఎముకల లోపలి మూలుగు (మారో) శక్తినిచ్చే ధాతువు. ఆ మూలుగులో చంద్రోదయమైంది. అంతరాంతరాలలో జ్ఞానకాంతి వెలిసింది. అప్పుడు తన శరీరం హుతమై పోయిన కాశ్యపబ్రహ్మ భస్మరాశిగా మారిపోనారంభించింది! (బహుశ శ్రీరంగం వారు కాశ్యప గోత్రీకులేమో!)
“నా ప్రాణం భగీరథుడయింది నా వెన్నెముక మీద ఆకాశగంగా జలపాతం వర్షించింది” అనడం ద్వారా ఆకాశగంగను భూమిపైకి దింపిన భగీరథుని విజయాన్ని పురాణప్రతీకగా మన స్పృహలోకి తేవడమే కాదు, తన వెన్నెముక మీద ఆకాశగంగా జలపాతం వర్షించడం ద్వారా తన సాధారణ మానవీయ శరీరానికి దైవత్వం సిద్ధించినట్లు కూడ భావ ఉన్మీలనం కలిగిస్తాడు.
“నా పొత్తికడుపు హిమాచలతనయ తన చల్లని మంచుహస్తాలతో నిమిరింది”
నగ్నంగా పూలు కోస్తున్న పార్వతి కవిని విడిచిపెట్టలేదు. కాలిపోతూ మూగయై నిలిచిన తన దగ్గరకు ఆమె వచ్చింది. ఆమె హిమాచలతనయ! చల్లని మంచు వలె ఉన్న హస్తంతో తన పొత్తికడుపు మీద నిమిరిందామె. ఆ స్పర్శ అతనిలో పునరుజ్జీవనం కలిగించింది.
“రవం నీరవానికి ఉబరసలబసబహప ” అనే పాదంతో ఈ కావ్యం పరిసమాప్తమయింది. మొత్తం కావ్యమంతా ఒకే ప్రమాణం లోకి ఇమిడి మన ఆలోచనలకు పూర్ణత్వమిస్తుంది.
Dimunitive అంటే Describing small specimen of the thing denoted by corresponding private word!” ఇంత అర్థం ఉన్న ఈ పదాన్ని ప్రజ్ఞావంతంగా ప్రయోగించి ఈ కావ్యానికి ఒక సంపూర్ణత్వం సాధించాడు నారాయణబాబు.
రవంలో నీరవం వుంది. నీరవంలో రవం వుంది…. అణువు బ్రహ్మాండంలో భాగం. బ్రహ్మాండం పరమాణువులతో పరిపూర్ణమైంది. ప్రతి పరమాణువు బ్రహ్మాండానికి ప్రతినిధి. పరామర్శిస్తూనే వుంటుంది. దాని ఆదిమ స్వరూపం సంపూర్ణత్వంతో గల సంబంధాన్ని వ్యక్తం చేస్తూనే వుంటుంది. అదే మౌనశంఖం.
పార్వతి శీతలహస్తాలు, శ్రీశ్రీ, గండభేరుండపక్షులు అన్నీ ఆ బ్రహ్మాండంలోని పరమాణువులే! కనుకనే హృదయం హంసయై, నిరంజనమై సోహం అని అరిచింది. బ్రహ్మైక్యం పొందింది.
ఈ వ్యాసాన్ని ముగిస్తూ ఒక విషయం చెప్పవలసి వుంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ కవులెవ్వరూ సర్రియలిజం వంటి ప్రయోగవాదాలను నిష్ప్రయోజకంగా ప్రయుక్తం చేయకోరలేదు. వారిలో నాయకమణిగా భాసిల్లిన ఆంద్రే బ్రిటాయే స్వయంగా ఇలా ఉద్ఘాటించాడు
“Let it be clearly understood that for us, surrealists, the interest of the thought cannot cease to go hand in hand with the interest of the working class, and armed attack on it cannot fail to be considered by us as attacks on thought likewise”
అలా అంటూనే కవులకొక కితాబు కూడా ఇస్తున్నాడు. అదేమంటే A poet can be effective modern prophet అని.
----------------------------------------------------------
రచన: సోమసుందర్ ఆవంత్స,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment