అందీ అందని కావేరీ సంగమం…
సాహితీమిత్రులారా!
కావేరి ఎక్కడ? ఎక్కడ కావేరీ ముఖద్వారం? ఎక్కడా? ఎక్కడా?
చిదంబరం వదిలిపెట్టాక మనసు నిండా ఇవే ప్రశ్నలు…
నదీమూలాలు, సాగరసంగమ ముఖద్వారాలూ చూడాలన్నది నా కోరిక.
కృష్ణ, గోదావరి, నర్మద, తపతి, గంగ లాంటి నదుల విషయంలో ఈ కోరిక తీరింది.
కావేరీనది పుట్టిన చోటు చూశాను. నదిని అనేకకానేక చోట్ల అనేకానేక దశల్లో చూశాను. కూర్గు కొండలు దాటి కుశాలనగర్ దగ్గర మైదానాల్లోకి ప్రవేశించడం చూశాను. మైసూరు దగ్గర కృష్ణరాజసాగరమవడం చూశాను. శ్రీరంగపట్టణం చేరువలోని రంగనతిట్టు దగ్గర పక్షుల స్వర్గధామానికి ఆయువుపట్టు అవడం చూశాను. మళ్లా మేకదాటు దగ్గర మేకలు కూడా దాటగల అతి సన్నని ప్రవాహం అవడం గమనించాను. మరికాస్త దూరంలో హొగెనకల్ దగ్గర రాళ్లలో పొగలు సృష్టించడం చూశాను.
శివసముద్రం దగ్గర శ్రీశ్రీకి కూడా ఉత్సాహం కలిగించడం చూశాను. తిరుచ్చి శ్రీరంగం దగ్గర విప్రనారాయణ రంగనాథుని గుడికి ద్వీపాన్ని ఇవ్వడం చూశాను. ఆ దిగువన కరికాల చోళుని ఆనకట్టకూ త్యాగరాజు కీర్తనలకూ మూలాధారమవడం చూశాను. అన్ని దశలలో చూసిన కావేరిని సాగరసంగమ దశలోనూ చూడాలని నా ప్రగాఢ వాంఛ.
చిదంబరం దాటాక ఓ అరగంటలో పెద్ద నది కనిపించింది.
ఇదేనా కావేరీ?!
బ్రిడ్జి దగ్గర శిలాఫలకం మీద కొళ్ళిడం బ్రిడ్జి అని రాసి ఉంది.
బ్రిడ్జి దాటీదాటగానే ఎడమపక్కగా పోతోన్న నదిని హత్తుకొని సాగుతున్న సన్నని దారి కనిపించింది. ఆ మొగలో ఓ టీకొట్టు.
లోపలికి వెళ్లిపోయాను. ఓ టీ తీసుకొని ఆ చనువుతో నా కావేరీ నది వాకబు మొదలెట్టాను. వాళ్లంతా తమిళంలో కొళ్ళిడం కొళ్ళిడం అంటున్నారు. అదో తికమక. ఆపద్బాంధవుడిలా ఓ పెద్దాయన- తెలుగు తెలిసిన బాబు- మాట కలిపాడు.
“ఇదే నువు అనుకొంటోన్న సాగరసంగమ బిందువు. ఇహ కాస్త పైకి వెళితే సముద్రమే. నువు కావేరీ కావేరీ అంటున్నావు. మేవు ఇక్కడ కొళ్ళిడం అంటాం. అదీ ఇదీ ఒకటోగాదో చెప్పలేనుగానీ ఈ ప్రాంతాల్లో అటు వంద మైళ్లూ ఇటు వంద మైళ్లూ దీన్ని మించిన నది లేదని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను…”
మరి ఇక అనుమానమెందుకూ? ఇదే కావేరి!
“సాగరసంగమం ప్రాంతం దగ్గరేనంటున్నారు. నేను అక్కడిదాకా వెళ్లాలి. దారి చెప్పండి,” దాదాపు వేడుకుంటున్న ధోరణిలో అడిగాను.
వింతగా చూశాడు. జాలిపడ్డాడు. కరుణించాడు.
“ఇదిగో ఈ రోడ్డు పట్టుకొని తిన్నగా వెళిపోతే సుమారు పది కిలోమీటర్ల దూరాన ఆలక్కుడి అన్న గ్రామం వస్తుంది. బహుశా నీకు కావలసింది ఆ గ్రామమే…”
కోటి కోటి వందనాలు చెప్పుకొని ముందుకు సాగాను.
నదిని ఆనుకొనే సాగింది ఆ బాట. సన్నని బాటే అయినా వాహనాలు లేకపోవడంతో ఏ రకమైన చిరాకూ లేకుండా స్వచ్ఛమైన ఆహ్లాదంతో సాగింది ఏక్టివా పరుగు.
ఆకాశంలో తెల్లని మేఘాలు. నదిలో నీళ్లూ ఇసుకతిన్నెలూ సమపాళ్లు. కనిపించీ కనిపించని ఆవలి ఒడ్డున చెట్లున్న పచ్చదనం. హఠాత్తుగా ఊడలమర్రి చెట్ల నీడలో ఓ మండపం (శవదహన వేదికా?). ఓచోట ఎత్తైన గట్టుమీంచి దిగువున నదిదాకా దిగిన పాతిక ముప్ఫై మెట్లు, ఓ పడవ. పైన రోడ్డు మీద నా ఏక్టివా, దాని పక్కనుంచి నడచిపోతోన్న ఐదారుగురు స్థానికులు, వెనక తెల్లకొండలా ఓ పెనుమేఘం… ఏదో ఆర్ట్ సినిమా దృశ్యమా!
ఇరవై పాతిక నిమిషాలు గడిచాక ఆలక్కుడి గ్రామం చేరుకొన్నాను.
రోడ్డు అక్కడితో అంతమయింది!
ఏదీ సాగరసంగమం?!
“ఇంకా ఓ మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సముద్రం. రోడ్డు లేదుగానీ కాలిబాటల వెంట వెడితే రెండు కిలోమీటర్లలో మహేంద్రపల్లి అన్న ఊరు వస్తుంది. అక్కడ అడుగు.”
అక్షర భాష, హావభావాల భాష కలగలిపి సంభాషించగా నాకు అందిన సమాచారం.
ఒక రకంగా విస్తుపోయాననాలి.
కావేరీలాంటి అతి ముఖ్యమైన నది సముద్రంలో కలిసే చోటు గురించి స్థానికులకు కూడా ఇంత సమాచార రాహిత్యం ఏమిటీ? ఎలా సాధ్యం? పిఛావరం లాంటి ప్రదేశాన్నే అత్యాధునిక టూరిస్టు కేంద్రంగా మలచిన ప్రభుత్వం వారికి ఈ సాగర సంగమం గురించి పట్టకపోవడమేమిటీ? అసలు నేను సరైన నదీ ముఖద్వారాన్నే వెదుకుతున్నానా?
మహేంద్రపల్లి చేరాను.
సముద్రం కనిపించలేదు గానీ ఉప్పగాలి తగిలింది. ఉప్పుమళ్లు కనిపించాయి. చేపల చెరువులు కనిపించాయి. ఆ చెరువుల గట్లమీంచి స్కూటర్లు వెళ్లే మార్గాలు కనిపించాయి. దూరాన విశాల కావేరి కనిపిస్తోంది. సముద్రం మాత్రం ఆచూకీ లేదు.
భర్తృహరిగారి మధ్యముడిలా ఆచెరువుల గట్ల వెంబడే ముందుకు సాగాను.
ఊరు దాటి ఓ అరకిలోమీటరు వెళ్లాక ఆ గట్ల దారీ మూతబడిపోయింది.
దగ్గరలో ఓ చేపల చెరువుకు సంబంధించిన ఓ పూరిపాక… జన సంచారం!
ఆ జనవరి మధ్యాహ్నాన ఊరూ పేరూ లేని చోట దారీ తెన్నూ లేని ప్రాంతంలో నేను, నాకు కనిపించిన ఓ ముగ్గురు తమిళ చేపల పనివాళ్లు!! ఏదో అబ్సర్డ్ నాటకం దృశ్యంలా అనిపించి నాకే నవ్వొచ్చింది.
మా మాటల శబ్దానికి నాలుగో మనిషి పాక బయటకు వచ్చాడు. ఈ ముగ్గురి మీద సూపర్‌వైజరులా ఉన్నాడు… మహానుభావుడు ఇంగ్లీషు మాట్లాడాడు.
“నిజమే! సాగరసంగమ స్థలం మైలులోపే ఉన్న మాట నిజమే కానీ మీరు అక్కడికి చేరలేరు. నడవాలన్నా కష్టం. దారితప్పి తీరతారు. అక్కడికి రావడానికి ఓ చుట్టుదారి ఉంది. తిరిగి ఆలక్కుడి వెళ్లండి. అక్కడ ఎడమకు మళ్లి కోదండపురం చేరుకోండి. ఆ తర్వాత నల్లూరనే ఊరు వస్తుంది. ఆ తర్వాత పళయపాళ్యం. అది దాటి వెళితే సాగరసంగమ స్థలం వస్తుంది. దాని పేరు పళైయాఱు.” వివరమందించాడు.
“ఈ చుట్టుమార్గం ఎంత దూరమూ?”
“ఇరవై పాతిక కిలోమీటర్లుంటుంది.”
హతాశుడినయ్యాను. ఇప్పటికే పదిహేను. మరో పాతిక. పక్కనున్న కావేరీ ముఖద్వారానికి ఇంతింత దూరాలా! బుద్ధిగా ఆ కొళ్ళిడం బ్రిడ్జి దగ్గరకు వెళ్లిపోయి హైవే 45 పట్టేసుకోనా?
ప్రాణం ఒప్పుకోలేదు. కోదండపురానికే ఓటు వేసింది.
మహేంద్రపల్లి… ఆలక్కుడి… కోదండపురం…
చేపల చెరువులు, ఉప్పుమళ్లు, ఇసుకదారులు వదిలి మామూలు దారుల్లో పడేసరికి హమ్మయ్య అనిపించింది. నదికి దక్షిణంగా దూరంగా వెళిపోతున్నట్టు తెలుస్తోంది. అయినా ఆ చిరుగ్రామాలు… గ్రామాల్లో కొలనులు… గట్ల మీద చెట్లు… ఈ లోపల ఆకలి!
ఓ టీకొట్టులోకి వెళ్లాను.
భోజనమంటూ లేదు. బన్నులు, బిస్కెట్లు, టీ- అంతే!
నా దగ్గరా కొన్ని బిస్కెట్లు కలవు!
టీ తాగుతోంటే- ఓ విప్పార్చిన కళ్లూ, మాసిన తెల్లగడ్డమూ, ఆ గడ్డం వెనకాల అంత వయసు లేని మొహమూ, ఎర్రాపచ్చా అడ్డచారల టీ షర్టూ, మెడలో ముదురు పసుపు కండువా- ఓ పెద్దమనిషి… మాటలు కలిపాడు.
‘కావేరి ముఖద్వారం…’ అని గొణగగా తిన్నగా శిలప్పదిగారంలోకి తీసుకువెళ్లి పోయాడాయన! బాగా పుస్తకాలు చదివిన మనిషి. సంగం సాహిత్యం, తిరువళ్లువర్ పదాలు, ఇళంగో శిలప్పదిగారం- కణ్ణగి, కోవలన్, మాధవి, పాండ్య రాజు… గలగలా కబుర్లు.
“మా కావ్యాల ప్రకారం కావేరి సముద్రంలో కలిసేది పూంపుహార్ దగ్గర. మరి కావ్యకాలంలో ఎలా ఉండేదోగానీ ఇపుడది ఓ పెద్ద సైజు కాలువలా ఉంటుంది. అంతే! నువు ఆశిస్తున్న నదీ ముఖద్వార దృశ్యం కావాలంటే ఈ కొళ్ళిడం నదే సరైనది.” ఆయన భోగట్టా.
ముందుకు సాగాను. పళయపాళ్యం గ్రామం చేరాను. ఓ బస్సుస్టాపు అందంగా కనిపించింది. స్కూటరాపి నా బిస్కెట్లూ బన్నులూ మంచినీళ్లతో లంచ్ మొదలెట్టాను. టైము రెండు దాటింది.
కాస్తంత దూరాన ఓ చిన్నపాటి బిల్డింగులో ఇద్దరు ముగ్గురు పోలీసులు ఉండటం గమనించాను. వాళ్లనడిగితే సరయిన సమాధానం దొరకవచ్చని అటు వెళ్లాను. వాళ్లు కూడా నన్నూ నా లంచ్‌నూ గమనిస్తున్నట్టున్నారు.
భాష సమస్య వల్ల కొంచెం ఇబ్బంది ఎదురయినా, మొత్తానికి సమాచారం దొరికింది. దొరికిందా? చెప్పడం కష్టం…
“మేం వెళ్లలేదుగానీ పళయాఱు అన్న ఊరు సముద్రం ఒడ్డున ఉందని విన్నాం. బహుశా పన్నెండు పదమూడు కిలోమీటర్లు ఉంటుంది…”
“అది నదీ ముఖద్వారమేనా?”
“ఖచ్చితంగా చెప్పలేం. అయి వుండొచ్చు…”
మళ్లా ఓసారి పదోసారి హతాశుడినయ్యాను. అప్పటికే రెండున్నర అవవస్తోంది. కనీసం మరో అయిదుగంటల ప్రయాణం ఉంది వేదారణ్యానికి. మళ్లా చీకట్లో బండి నడపడం తప్పదా?
వద్దనిపించింది. కావేరీ వేటను అక్కడితో కట్టిపెట్టాలనిపించింది!!
ఓసారి మ్యాపులు తీసి చూసుకొన్నాను.
పడమట దిక్కుగా వెళితే శీర్కాళి అన్న చిరుపట్నం… హైవే 45ఎ… ఓ అరగంట దూరంలో ఫూంపుహార్… మరో గంట సాగితే ట్రాంక్వోబార్… అదే బాటలో కారైక్కాల్… ముందుకు సాగితే వేలాంగణ్ణి… ఇంకా ముందుకు వెళితే వేదారణ్యం- అంతా కలిసి నూటపది కిలోమీటర్లు- ఎక్కడా ఆగకుండా వెళితే నాలుగు గంటల లోపు… చీకటి పడేలోగా చేరుకోవచ్చు!
ప్రయాణం మొదలెట్టాను. సులభంగానే శీర్కాళి దొరికింది. మరికాసేపట్లో తూర్పువేపుకు వెళ్లమంటూ పూంపుహార్ బోర్డు కనిపించింది. అయిదు కిలోమీటర్లు- తూర్పువైపుకు.
ఎపుడూ వెళ్లి ఉండకపోయినా పూంపుహార్ నాకు బాగా తెలిసిన ఊరు!
దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం చోళ రాజుల రాజధాని. శిలప్పదిగారపు కణ్ణగి కోవలన్‌ల కుటుంబాలు నివసించిన ఊరు. వారి దాంపత్యం పండిన ఊరు. నర్తకి మాధవి ప్రభావంతో కోవలన్ భార్యకు దూరమయిన ఊరు. ఇద్దరూ తమ తమ సంపదలు కోల్పోయి కొత్త జీవితాన్ని వెదుక్కుంటూ మదురై వెళ్లిపోయిన ఊరు. శిలప్పదిగారంలో ప్రకృతినీ సూర్యచంద్రులనూ వర్ణించడంతో పాటు కావేరీనది ప్రశంస కూడా ఉంది.
ఊరు చేరేసరికి మూడు దాటేసింది.
అప్పటి మహానగరం కానరాలేదు. కనిపిస్తుందని నేను ఆశించనూ లేదు.
ఊరు ఆరంభంలో ఓ వస్తుప్రదర్శనశాల. ముందుకు వెళితే కోలాహలం నిండిన సముద్ర తీరం. ఓ గుడి. పక్కనే లైట్‌హౌసు…
అప్పటి రాజధాని వరదలకూ, కావేరీనది ముంపుకూ, ముందుకు చొచ్చుకు వచ్చేసిన సముద్ర జలాల తాకిడికీ గురి అయి క్రమక్రమంగా కనుమరుగయిందంటారు. ఒకప్పుడు అది సుప్రసిద్ధ రేవుపట్నంగానూ వాణిజ్యకేంద్రంగానూ మెరిసిపోయిందట! ఆ మెరుపులతో నాకు పనిలేదుగానీ కణ్ణగి తిరుగాడిన సముద్రతీరమంతా నడిచి రావాలని కోరిక…
“అంకుల్! టాఫీలివ్వవా?” ఓ పల్లెకారుల చిన్నపాప.
“లేవుగదా నా దగ్గర!” ఆశ్చర్యంగా నేను.
“అదిగో ఉన్నాయ్! చూడు…” అంటూ బ్యాక్‌పాక్ పక్కన ఉండే చిక్కపు ‘జేబు’ అడుగున, వాటర్ బాటిల్ కింద ఉన్న టాఫీలను చూపించింది. ఎపుడో ఆ పాకెట్లో అవి వేశానని గుర్తు కూడా లేదు. ఆ పాప కళ్లు టాఫీ పసిగట్టేశాయి!
ముచ్చటనిపించింది. ఉన్నవన్నీ తీసి తన చేతిలో పోశాను. ఆరేడేళ్లు ఉంటాయేమో… దూరాన ఉన్న వాళ్ల అన్నయ్యను సంబరంగా పిలిచి టాఫీలు పంచింది. పిల్లలిద్దరితోనూ కాసేపు కబుర్లు.
మళ్లా పూంపుహార్ కావేరి ఎక్కడా అన్న వెదుకులాట మొదలయింది.
ఓ కిలోమీటరు దక్షిణాన ఉన్న గట్టుకేసి చూపించారు స్థానికులు.
అలా అలా నడిచి వెళ్లాను. నిజమే, అది కావేరీ సంగమస్థానమే! అలా అని అక్కడి బోర్డు నిర్ధారించింది.
నది కటూ ఇటూ కరకట్టలు- పదిహేను ఇరవై అడుగుల ఎత్తున. మధ్యలో ఓ రెండు మూడువందల అడుగుల వెడల్పున నదీగర్భం. వెనక్కి వస్తోన్న సముద్రపు చిరుకెరటాల నీళ్లే తప్ప నదిలో చుక్క నీరు లేదు. అయ్యో! యాంటీ క్లైమాక్సు… అయినా మమత చావక నది ఇంకాస్త సుందరంగా కనబడుతుందేమోనని పైకి ఓ అర కిలోమీటరు నడిచాను. నిలిచిపోయిన నీళ్లు కనిపించాయే తప్ప ‘అందం’ ఎండమావే అయింది!
తిరిగి వస్తోంటే కరకట్ట మీద కబుర్లు చెప్పుకుంటున్న నలుగురు స్థానిక యువకులు. ఆ మనుషుల్లోనూ, వాళ్లు కూర్చున్న పద్ధతిలోనూ, మాట్లాడుకుంటున్న ధోరణిలోనూ గొప్ప నేటివిటీ కనబడి వాళ్ల అనుమతి తీసుకొనే ఓ ఫోటో…
“ఎవరివయ్యా నువ్వు, ఆ ఫోటోను ఏం చేస్తావూ?” కవ్వింపుగా ఒకతని ప్రశ్న.
“నేనా? పోలీసువాళ్ల మనిషిని! నలుగురు మనుషుల కోసం వాళ్లు వెదుకుతున్నారట- మీకోసమే అయి ఉంటుంది… వాళ్లకీ ఫోటో అందిస్తాను,’’ నా సరిజోడీ ప్రతిస్పందన…
అందరం హాయిగా కడుపారా నవ్వులు… పక్కనే ఉన్న లైట్‌హౌస్ ఎక్కడం… గొప్ప దృశ్యాలు… ఫోటోలు…
తిరిగి స్కూటరు దగ్గరకు వెళుతుంటే అక్కడి ప్రదర్శనశాల రా రమ్మని పిలిచింది. సమయం తక్కువాయె- అయినా వెళ్లి అక్కడి కాపలా మనిషిని అడిగాను…
“ఏమున్నాయి? ఎంత సమయం పడుతుందీ?” అని. “శిలప్పదిగారపు చిత్రాలూ శిల్పాలూ రాతప్రతులూ ఉన్నాయి. ఓ గంట పడుతుంది.” అన్నాడు.
ప్రాణం ఉసూరుమనిపించింది. అంత దూరం వెళ్లి ఆ ప్రదర్శన చూడకుండా రావడం తప్పుగాదూ? అవును తప్పే! అయినా తప్పలేదు…
--------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర,
ఈమాట సౌజన్యంతో
1 comment:
Kaveri river water is utilised almost 100%. So it is futile to look for its sea merger point.
Post a Comment