Thursday, September 7, 2017

శివశివ రాతి రాతి శ్రితజీవన


శివశివ రాతి రాతి శ్రితజీవన




సాహితీమిత్రులారా!


ఈ గూఢచిత్ర పద్యం చూడండి-

శివశివ రాతి రాతి శ్రితజీవన జీవన యాత్మ యాత్మ బాం
ధవధవ రాజిరాజిత పదావర దావర ధీరధీర దీ
నవనవ సంతసంతత సునందన నందన భాను భాను గౌ
రవరవ కాండకాండద నిరంజన రంజన కాయకాయజా
                                                                              (సారంగధరీయము - 4-123)

శివ - శుభమైన, శివరాతి - శంకర ఆప్తుడగు కుబేరుని వంటి,
రాతి - ఈవినిగలవాడా, శ్రితజీవన - ఆశ్రితులకు జీవనమైనవాడా,
జీవ - బృహస్పతివంటి, నయ - నీతియుక్తమైన, ఆత్మ -
బుద్ధిగలవాడా, ఆత్మబాంధవ - ప్రాణస్నేహితులైన,
ధవరాజి - రాజసముదాయముచేత, రాజిత - ప్రకాశింపబడిన,
పదా - స్థానముగలవాడా, వరదా - కోర్కెల నిచ్చువాడా,
వర - శ్రేష్ఠమైన, ధీర - పర్వతమువంటి, ధీర - ధైర్యముగలవాడా,
దీనవన - దీనజనులనే అరణ్యమునకు, వసంత - వసంతునివంటివాడా,
సంతత - నిరంతరమును, సునందన -
మంచి సంతానముయొక్క, నందన - సంతోషముగలవాడా,
భాను - సూర్యుని వంటి, భాను - కాంతులుగలవాడా,
గౌరవ - గురుత్వమైన, రవ - ధ్వనులయొక్క, కాండ -
సముదాయమునందున, కాండద - మేఘమువంటివాడా,
నిరంజన - దోషరహితమైన, రంజన - రంజించునట్టి,
కాయ - శరీరము నందున, కాయజా - మన్మథునివంటివాడా

ఇది అర్థకాఠిన్యం కారణంగా గూఢచిత్రంగా చెప్పబడుతున్నది.

Tuesday, September 5, 2017

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు


ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు



సాహితీమిత్రులకు,
శ్రేయోభిలాషులకు,
ఉపాధ్యాయమిత్రులకు
భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి,
ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు


Monday, September 4, 2017

సిప్రాలి - శ్రీ.శ్రీ.


సిప్రాలి - శ్రీ.శ్రీ.




సాహితీమిత్రులారా!


సిప్రాలి అనే శ్రీ.శ్రీ. కావ్యము
పేరును ఎలాసూచించారో చూడండి-

ఇందులో మూడు రకాల కవితలున్నాయి.

1. సిరిసిరిమువ్వలు

2. ప్రాసక్రీడలు

3. లిమఋక్కులు





Sunday, September 3, 2017

కైవల్య స్థానమండల బంధము


కైవల్య స్థానమండల బంధము




సాహితీమిత్రులారా!

తిరుమల బుక్కపట్టణం అణ్ణయదేశిక విరచిత
చిత్రబంధ మాలికాలోనిది ఈ
కైవల్య స్థానమండల బంధం

శ్లోకం-
విధీశవినుతం విశ్వభావితం శ్రావితం భువి
లక్ష్మీ విభ్రమ విఖ్యాతం శ్రీశం స్వామినమాశ్రయే

దీనిలో మూడవ పాదం వరకు ప్రతి మూడవ అక్షరం
వి - వచ్చింది గమనించండి
శ్లోకం చూస్తూ బంధంలో చదవండి-
ప్రతి అక్షరాని ఒక సంఖ్యలు వేయబడ్డాయి
వాటిద్వారా శ్లోకాన్ని చదువుతూ వెళ్ళండి-


Saturday, September 2, 2017

"కవిసింహ" శ్రీ పోకూరి కాశీపత్యవధానులు


"కవిసింహ" శ్రీ పోకూరి కాశీపత్యవధానులు



సాహితీమిత్రులారా!


గుంటూరుజిల్లా, పల్నాటి తాలూకా,
బోదిలపాడు గ్రామంలో లక్ష్మాంబా
సుబ్బరాయాచార్యులకు
1892సంవత్సరంలో
పోకూరికాశీపత్యవధానులు
జన్మించారు.

కాశీపతిగారు అరవైయేళ్ళుకూడా నిండకముందే
చతుర్విధ కవితా ప్రావీణ్యం సంపాదించారు.
అచిరకాలంలోనే గద్వాల సంస్థానంలో ఆస్థానకవిగా
నియమితులైనారు. దాదాపు 60 దాకా వివిధ గ్రంథాలను
కూర్చారు. వీరు కూర్చిన గ్రంథాలలో చిత్రకవిత్వంలో
ముఖ్యమైనవి-

1. నిరోష్ఠ్య నిర్వచన శుద్ధాంధ్ర హరిశ్చంద్రోపాఖ్యానం-
   దీనిలో వచనం ఉండదు, ప,ఫ,బ,భ,మ అనే
   ఓష్ఠ్యక్షరాలు ఉండవు అలాగే అచ్చతెలుగుతో కూడిన
   హరిశ్చంద్రోపాఖ్యానము కథ కూర్చబడినవి.

2. త్రింశదర్థపద్యం-
   ఇది ఒక ఆటవెలది పద్యం దీని 30 అర్థాలున్నది
   ఆ పద్యం-
   భూరి జఠర గురుడు నీరజాంబిక భూతి
   మహితకరుడ హీనమణికలాపు
   డలఘు సద్గణేశు డగ్రగోపుడు మహా
   మర్త్య సింహుడేలు మనల నెపుడు
   దీనిలోని 30 అర్థాలు-
   1. గణపతి, 2. శివ, 3.బ్రహ్మ, 4. విష్ణు, 5. ఇంద్ర,
   6. అగ్ని, 7. యమ, 8. నిరృతి, 9. వరుణ, 10. వాయు
   11. కుబేర, 12. అష్టదిక్పాలక, 13. నవగ్రహ, 14. సూర్య,
   15. చంద్ర, 16. సముద్ర, 17. మేఘ, 18. హిమన్నగేశ్వర,
   19. ఆదిశేష, 20. గరుడ, 21. గజేంద్ర, 22. ఆంజనేయ,
   23. నందీశ్వర, 24. వీరభద్ర, 25. కుమారస్వామి,
   26. మన్మథ, 27. నారద, 28, దత్తాత్రేయ,
   29. విశ్వకర్మ, 30. వీరబ్రహ్మ- లను గూర్చిన వర్ణణన
   ఈ పద్యం కూర్చారు.

3. సిద్ధయోగి చరిత్ర-
   ఇందులో కూడ చిత్రకవిత్వం కూర్చడం జరిగింది.

4. నిష్కేవలస్వర నిర్బిందు నిష్పంచవర్గ నిర్గద్య దశాక్షరీ
   శ్రీ శౌరిశైశవలీల-
   ఇందులో అచ్చుతో మొదలయ్యే పదాలు లేకుండా,
   సున్నలు లేకుండా, క- నుండి మ - వరకు గల
   హల్లులు లేకుండా, కేవలం య,ర,ల,వ,శ,ష,స,హ,ఱ
   అనే 10 అక్షరాలను మాత్రమే ఉపయోగించి కూర్చారు.
   దీన్ని ముక్కుమూసుకొని కూడ చదువవచ్చు అందువల్ల
   దీన్ని నిరనునాశిక కావ్యంగా చెబుతారు.

5. సారంగధరీయము(త్య్రర్థికావ్యం)-
   ఇందులో ఒకే కథలో ముగ్గురి కథలు కూర్చారు.
   శివ, చంద్ర, సారంగధరుల కథలు ఇందులో
   ఉన్నాయి

ఇలా అనేక చిత్రకావ్యాలను కూర్చారు.
వీరికి గద్వాల సంస్థానాధీశులు కవిసింహ
అనే బిరుదును ఇచ్చారు. కనకాభిషేక,
గజారోహణ, గండపెండేర సత్కారాలు
పలుచోట్ల జరిగాయి. డా. సర్వేపల్లి
రాధాకృష్ణగారు ఈయనను రాష్ట్రపతి
భవన్లో సత్కారం పొందారు.

ఈయన 1974వ సంవత్సరంలో శరీరం వదిలారు.

Friday, September 1, 2017

జొన్నవిత్తులవారి చిత్రకవిత్వం వారి స్వరంలో


జొన్నవిత్తులవారి చిత్రకవిత్వం వారి స్వరంలో





సాహితీమిత్రులారా!

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి
చిత్రకవిత్వ పద్యాలను
వాద్యాలపై వినిపించిన ఈ వీడియో
వీక్షించి ఆనందజలధిలో
ఓలలాడుదురుగాక!

కువలయంబు నేలు గొప్ప రాజ


కువలయంబు నేలు గొప్ప రాజ




సాహితీమిత్రులారా!


పోకూరి కాశీపత్యవధానిగారి
సారంగధరీయము(త్య్రర్థికావ్యము) నుండి
ఈ పద్యం చూడండి-

కువలయంబు నేలు గొప్పరాజడఁగ లో
కంబు దెల్లవాఱు కరణి నాఁడు
కువలయంబు నేలు గొప్పరాజడఁగ లో
కంబు దెల్లవాఱెఁగా తలంప
                                              (సారంగధరీయము-3-67)

ఇందులో 1,3 పాదాలు ఒకలాగే ఉన్నాయి
అలాగే 2,4 పాదాలు దాదాపు ఒకలాగే ఉన్నాయి.
దాన్నే ద్విపాది అంటారు.

ఇక అర్థంలో కెళితే-
తలంపన్ - ఊహించగా,
కువలయంబు నేలు - భూమిని పాలించే,
గొప్పరాజడఁగన్ - అధికుడైన రాజు నశించగా,
లోకంబు తెల్లవాఱుకరణిన్ - ప్రజలు తెల్లబాఱు విధంగా,
నాఁడు - అప్పుడు,
కువలయంబు నేలు - కలువలను పోషించునట్టి,
గొప్పరాజడఁగన్ - అధికుడైన చంద్రుడు గ్రుంకగా,
లోకంబు - భువనము(ప్రపంచము)
తెల్లవాఱెఁగా - సూర్యోదయ సమయమాయెను కదా