Saturday, March 25, 2023

అప్రస్తుత ప్రసంగి ప్రశ్నలు - కొంటె సమాధానాలు

 అప్రస్తుత ప్రసంగి  ప్రశ్నలు - 

కొంటె సమాధానాలు





సాహితీమిత్రులారా!

అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకి  అవధాని అంత కంటే కొంటెగా  సమాధానం చెప్తే మంచి హాస్యం పుడుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఎవరో నాకు పంపిస్తే మీతో పంచుకుంటున్నాను . 

ప్రశ్న :- అవధానం చేసేవారికి చప్పట్లంటే చాలా ఇష్టమంట కదా! మరి మీకో ?

జవాబు :- నాకు చప్పట్లు ఇష్టం వుండవు. నాకు చప్ప అట్లుకంటే కారం అట్లంటేనే ఇష్టం .

ప్రశ్న :- భార్య తన భర్తకు వడ్డిస్తోంది. భర్త 'పశువ' అన్నాడు. భార్య నవ్వుతూ 'కోతి' అంది ఏమిటిది? 

జవాబు :- పశువ అంటే పళ్లెంనిండా శుభ్రంగా వడ్డించమని. కోతి అంటే కోరినంత తిను అని అర్థం .

ప్రశ్న :- పద్యానికి, శ్లోకానికి తేడా ఏమిటి ? 

జవాబు :-పద్యం వేగంగా వస్తుంది. శ్లోకం నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే స్లో... కమ్ కదా .

ప్రశ్న:- అమెరికాలో భర్తల సమాధులను భార్యలు విసనకర్రలతో విసురుతారట. చిత్రంగా లేదూ ?

జవాబు:- భర్త చనిపోతూ ‘నా సమాధి ఆరేవరకైనా నువ్వు మరోపెళ్లి చేసుకోవద్దు...' అంటూ ప్రమాణం చేయించుకుంటాడు. భర్త సమాధి తొందరగా ఆరాలని భార్యలు అలా విసురుతూ వుంటారు. 

ప్రశ్న : పెళ్లి కాకముందు వధువు, పెళ్లి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది. 

జవాబు : – పెళ్లి కాకముందు 'అయస్కాంతంలా', 'పెళ్లి అయ్యాక సూర్యకాంతంలా...’ 

ప్రశ్న :- ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకు రమ్మన్నారు 

జవాబు :-ఇంతకీ ఏ కవి 'తలను' తీసికెళ్తున్నారు 

ప్రశ్న :- పెళ్లికి వెళ్లుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్లటమంటే ఏమిటి ?  

జవాబు :- అవధానానికి వెళ్లుతూ అప్రస్తుత ప్రసంగిని వెంట పెట్టుకొని వెళ్లటం .

ప్రశ్న :- అవధానాలను నిషేధించే పని మీకు అప్పజెప్పితే ఏం చేస్తారు? 

జవాబు :- దశల వారిగా చేస్తాను. ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను .

ప్రశ్న :- అవధానికి ఆశువులు ఎప్పుడొస్తాయి, ఆశ్రువులు ఎప్పుడొస్తాయి ? 

జవాబు :- ప్రశ్న వేస్తే ఆశువులు వస్తాయి. అవధానం జరిగి సత్కారం ఎగరగొడితే ఆశ్రువులు వస్తాయి .

ప్రశ్న :- బోడిగుండుకు, మోకాలికి ముడిపెడతారెందుకు 

జవాబు :- రెండింటి మీద అంతగా వెంట్రుకలు వుండవు కాబట్టి .

ప్రశ్న :- మీకు రంభనిస్తే ఏం చేస్తారు? 

జవాబు :- ఆనందంగా ఇంటికి తీసికెళ్లి ఆకలి తీర్చుకుంటాను. రంభ అంటే అరటిపండు అని అర్థం .

ప్రశ్న :-నాకీ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతోంది. ఆయనలాగే ప్రవర్తించమంటారా ?

జవాబు :- మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి. 

ప్రశ్న :- మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు 

జవాబు :- వెంటనే ఆ మైకు అప్రస్తుత ప్రసంగీకుడికి ఇచ్చి మాట్లాడమమటాను. 

ప్రశ్న :- మీరెప్పుడైనా బూతు పనులు చేశారా జవాబు : -ప్రభుత్వ ఉద్యోగిని కదా ఎన్నికల్లో పోలింగ్ బూతు పనులు' తప్పవు .

ప్రశ్న :- అవధాని గారు మీది వర్ణాంతర వివాహమట నిజమా? 

జవాబు :- నిజమే నేను నల్లగా వుంటాను, మా ఆవిడ తెల్లగా వుంటుంది .

ప్రశ్న :-పావురం అంటే మీకు ఇష్టమా ?

జవాబు :-పావు ‘రమ్’ ఎవరికి ఇష్టం వుండదు .

ప్రశ్న :-మీరు సారా త్రాగుతారా ?

జవాబు :- అవును అవధాన కవితామృతాన్ని మన 'సారా’ త్రాగుతాను .

ప్రశ్న :- సన్యాసికి, సన్నాసికి తేడా ఏమిటి? 

జవాబు :- అందర్ని వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్నాసి .

ప్రశ్న :- మీకు వాణిశ్రీ అంటే ఇష్టమా ?

జవాబు :- చాలా ఇష్టం. వాణి అంటే సరస్వతి -జ్ఞానం, శ్రీ అంటే సంపద. 

ప్రశ్న: – రైలు పట్టాలకు, కాలి పట్టీలకు అనుబంధం ఏమిటి? 

జవాబు:- రైలు, పట్టాల మీద వుంటుంది. పట్టీలు, కాలి మీద వుంటాయి .

ప్రశ్న:- సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారు ?

జవాబు:- పాలిచ్చేవైతే యింటికి తోలుకెళ్తా .

ప్రశ్న:- పురుషులందు పుణ్యపురుషులు వేరయా! అన్నాడు వేమన. మరి మీరేమంటారు? 

జవాబు:- పురుషులందు పుణ్యపురుషులు 'ఏరయా!’ 

ప్రశ్న:- అవధానిగారు ఇక్కడికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వస్తే మీరేం చేస్తారు? 

జవాబు:- మరో నలుగుర్ని పిలిచి 'అష్టావధానం' చేస్తాను. 

ప్రశ్న:- పెళ్లయిన మగవారిని ఏమీ అనరు. కానీ పెళ్లయిన ఆడవాళ్లను 'శ్రీమతి' అంటారెందుకు?

జవాబు:- పెళ్లయిన తరువాత 'స్త్రీ మతి' స్థితిమతి.

మీదే పురుషులు ఆధారపడుతారు గనుక .

ప్రశ్న:- ప్రేమికుడికి, భర్తకు ఏమిటి తేడా గురువు గారు

జవాబు:- గొడవపడితే మాట్లడదేమోనని

భయపడేవాడు ప్రేమికుడ ... మాట్లాడితే గొడవ పడుతుందేమోనని భయపడేవాడు భర్త 

ప్రశ్న:- అవధానిగారు కీర్తిశేషుల పెండ్లిపత్రిక వచ్చింది. పెళ్లికి వెళ్లమంటారా?

జవాబు:- తప్పకుండా వెళ్లు. కీర్తిశేషులంటే ' కీర్తి' అమ్మాయి పేరు, 'శేషు' అబ్బాయి పేరు .

ప్రశ్న:- గురువుగారు మా మొదటి అమ్మాయి పేరు దీపిక, రెండవ అమ్మాయి పేరి గోపిక. మరి మూడో అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి? 

జవాబు: - ‘ఆపిక’ వెంటనే అవధాని సమాధానం


సంస్థానాలు సాహిత్యం ముఖపుస్తకం నుండి-


No comments: