షడర చక్రబంధం
సాహితీమిత్రులారా!
గణపవరపు వేంకటకవి కృత
శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము
లోని షడర చక్రబంధం ఇది -
శార్దూలవిక్రీడితవృత్తం
సత్యాకల్పక ప్రస్ఫుటా శరభిదాచారా విశంక క్రమా
మత్యావిష్కృత బంధురాదరణ భూమాజన్తు కూటాశ్రితా
దిత్యావేంధన ధర్మసారతరమూర్తీముత్కరాద్రిక్షమా
మాత్యుల్లాసపదా మహావిదితధామా సాధుతారక్షమా-861
అర్థం:-
సత్యాకల్పక=సత్యభామపాలిటి కల్పవృక్షమా!(సత్యకు పారిజాతకల్పవృక్షాన్ని తెచ్చిఇచ్చిన కల్పవృక్షం), శరభిదాచార=బాణాలతో భేదిల్లజేయడం అనే విద్యలో, విశంకక్రమా=నిశ్శంకం,నిరాటంకంఅయిన పరాక్రమం/విజృంభణం కలిగినవాడా!,మతి+ఆవిష్కృత=అంతరంగం(మది)లోఆవిష్కృతం అయినవాడా!, బంధురాదరణభూమా=అపారంగా ఆదరించేబుద్ధి కలవాడా!, జంతుకూట+ఆశ్రిత=ప్రాణి(పశు)సమూహంచేత ఆశ్రయించబడినవాడా!, దిత్యావేంధన=దితి కుమారులయిన రాక్షసదుర్మార్గులను అగ్నిలా దహించేవాడా!, ధర్మ సార రత మూర్తీ=వేదధర్మంపట్లగాఢాభినివేశంకలవాడా (ధర్మస్వరూపా!), ముత్+కర=ఆనందదాయకమూ,అద్రి=పర్వతంలా నిశ్చలమూఐన,క్షమా=తాలిమికలవాడా!,మా=లక్ష్మీదేవికి, అత్యుల్లాస=బాగా ఉల్లాసం కలిగించేవాడా, మహావిదిత=బాగ గొప్పగా ప్రసిద్ధికెక్కినవాడా!, ధామా=నివాసం/కాంతికలవాడా!(శ్రీహరిధామంగాతిరుమల సుప్రసిద్ధం), సాధుతారక్షమా=సజ్జనులను తరింపచేయడంలో సమర్థుడా!
భావం:-
సత్యభామపాలిటికల్పవృక్షమా!బాణవిద్యలో ఆరితేరినవాడా! తలచేవారి మదిలో మెదిలేవాడా!అపారదయామయా!ప్రాణులచేత ఆశ్రయించబడినవాడా!దుష్టంలయిన రాక్షసులను దహించేవాడా!ధర్మస్వరూపా!ఆనంద దాయకా! కొండన్నా! సిరికి ఉల్లాసం కలిగించేవాడా!సంప్రసిద్ధమైన తిరుమలవాసా! సజ్జన సంరక్షకా!
*విశేషాలు:-* నరశార్దూలస్మరణశార్దూలవృత్తంలోచేయడం సముచితం.చక్రధారిస్తుతి షడరచక్రబంధంలోచేయడం బాగు.
ఈ బంధచిత్రంలో వెలుపలనుంచి మూడవవలయంలో- *కవి వేంకటాద్రి అనీ, ఆరవవలయంలో ప్రబంధరాజము*
అనీ కవిపేరూ కావ్యంపేరూ ఉంది.
ఈ పద్యానికి ఇదివరలో అర్థతాత్పర్యాలు లేవు. వేదంవారి సంపాదకత్వ1977ప్రతిలో పద్యం మొదటిపాదంలో ప్రస్ఫుట బదులు 'పస్పుట' అని అచ్చుతప్పు.బంధచిత్రంలో
ఆరవ వలయంలో కావ్యంపేరులోని మొదటి అక్షరం *ప* అని ముద్రితం కావడం సంపాదకుల నిర్లక్ష్యానికి పతాక. మిగతా చోట్ల అచ్చుతప్పులు కొల్లలు.కనీసం కావ్యంపేరైనా
సరిగా పరిశీలించని సంపాదకత్వం. పద్యంలోని మూడవపాదం ప్రారంభంలో *దిత్యావేంధన*
అనే పాఠాన్ని *దిత్యౌఘేంధక* వ్యాకరణ పండితులు సవ రించినారు. అలా సవరించడంవల్ల బంధచిత్రం మూడవ వలయంలో *కవిఘేంకటాద్రి* అని ఏర్పడి కవిపేరుకు
భంగం వాటిల్లుతుంది. అది పరిశీలించక వ్యాకరణపండితులు రసజ్ఞతను వదలి వస్త్రమూల్య విచారణ చేసినారని తెలుపడా నికి బాధగా ఉంది. పద్యంలోని మూడవపాదంలో *జంతు* అనే పదం ఉంది.ఆ పదంలోని *జ* అక్షరంబంధ చిత్రంలో కావ్య నామాన్నిసూచించే ఆరవవలయంలోని *ప్రబంధరాజము* లో *జ* . కనుక జంతు పదాన్ని జన్తు అని రాయడం జరిగింది.
వేంకటాద్రీశా!గోవిందా!గోవింద!
వైద్యంవేంకటేశ్వరాచార్యులు వారి సౌజన్యంత
No comments:
Post a Comment