Monday, January 23, 2023

శృంగార భాగవతం - రుక్మిణీకల్యాణము

 శృంగార భాగవతం - రుక్మిణీకల్యాణము

     




సాహితీమిత్రులారా!


 రుక్మిణీ మనోగత వితర్కం రమణీయం. ఒక ముగ్ధ నాయిక సందిగ్ధావస్థ  కామెప్రతీక.

సందేహాలెన్నో(10.1723)   ఆమె మనసును తుమ్మెదల గుంపులాముసురుకున్నాయి.

ఆమెకు దైవచింతనకూడా మొదలయింది(10.1724).ఆ తర్వాత

 పద్యపంచకం(10.1726నుండి1729,1731)లో వితర్క విషాదౌత్సుక్య దైన్య త్రాసాది భావాలు 

అయోగ విప్రలంబ శృంగార రస పుష్టికి దోహదించాయి.ఆమె మనస్సా గరం

 అల్లకల్లోలమయింది.ఆ విషాదంలో జాగరం అరతి అన్నీ

శ్రీకృష్ణ నిరీక్షణానికే  లక్షింపబడినాయి.కందర్ప పరీకల్పితో

ద్వేగ జన్యమైన చింతా విశ్వాస దైన్య స్తంభాది భావాలతో

రుక్మిణి విరహతప్త(10.1727)అయింది.ఈ మనః కంపం

వల్లనే ఆమెకు అశ్రుపాతం కృశతాదులు కలిగాయి.

అందు వల్లనే పరితప్త హృదయంతో ఆమె సర్వశృంగార కళల్నీ

పరిత్యజించింది. ఎడబాటును సహించలేక ఆమె చలించి

పోయింది.సుకుమారంగా ,మెల్లగా వీస్తున్న చల్లగాలికి ఆమె

దూరంగా తొలగిపోయింది.మత్తెక్కిన తుమ్మెదలు ఝంకా

రాలతో తిరుగుతూ  ఉంటే,పక్కకు వెళ్లిపోయింది.కోయిల

కూతకు కోపగించుకుంటుంది.రామచిలుకలనుంచి ముద్దు

మాటలు పుట్టుకొస్తూంటే మదనవేదనతో ఉలికి పడింది. వెన్నెల వేడికి

 అలసిపోతుంది.చిరుమామిడికొమ్మల లేత నీడలకు దూరంగా పోతుంది.  

       ఇలా సర్వజన సంతోష సంధాయకాలైన ప్రకృతి ప్రణయగీతాలూ ప్రకృతిగత రసరమ్య దృశ్యాలూ అన్నీ

రసానంద దాయకాలయినాయి.అయోగ శృంగార పుష్టికి

పోతన చేసిన రసవత్కల్పనం రుక్మిణీ విరహవర్ణనం.

      రుక్మిణీ ప్రథమ వీక్షణంలోని శ్రీకృష్ణ సౌందర్య వర్ణనంవల్ల

అయోగశృంగారం సంభోగశృంగారంగా ధ్వన్యమాన మయింది

మూలంలో  *దదృశేచ్యుతం* (10.53-55)అనే వాక్య లేశం పోతన అనువాదంలో పూర్తిగా  

ఈ కింది రసరమ్య పద్యంగా వృద్ధిచెంది విభావముఖంగా శృంగార రస సూచితం

కావటం పరమౌచిత్యం-

కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ కంఠీరవేంద్రావ ల

గ్ను నవాంభోజ దళాక్షు జారుతర వక్షున్ మేఘ సంకాశ దే

హు నగారాతి గజేంద్రహస్త నిభ బాహున్ జక్రి బీతాంబరున్

ఘన భూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్

       రుక్మణీ సౌందర్యం విభావంకాగా వీరులైన రాజులు ఏక

పక్షంగా వేగంగా విభ్రాంతులుకావడం అనుభావం.

అది రసాభాసం.వారి విభ్రాంతి మూలంగా 

వారు దర్శించిన రుక్మీణీ స్వరూపం స్మరణీయం.

ఆమె వీరమోహిని.వారు విభ్రాంతాత్ములు. 

రస నిర్వహణలోని రహస్యాలు ఇలాంటివి

పోతనలో ప్రత్యేకించించి గుర్తించవలసి ఉంటుంది.

    ఇలా శృంగార రసోజ్జీవంలో తాండవమాడుతూ  రుక్మిణీ

కల్యాణ కథ పోతన్న శృంగార రసనిర్వహణ చాతురికి నికషో

పలమై నిలిచింది.

    కల్యాణ హృద్యపద్యం-

ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతో హారిణిన్ మాన వై

భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం

ధవ సత్కారిణి బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్

సువిభూషాంబర ధారిణిన్ గుణవతీచూడామణిన్ రుక్మిణిన్

                                                                                  -భాగవ 10.1784

           

        కమ్మని పద్యాలందించిన బమ్మెరవారి పాదారవిందాలకు వందనాలతో

సమర్పణ-వైద్యంవేంకటేశ్వరాచార్యులు 

No comments: